
ఏపీ వారికి కీలక స్థానాలివ్వొద్దు
కమలనాథన్ కమిటీకి టీసీటీ జీవోఏ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగానే వాణిజ్య పన్నుల శాఖలో అధికారుల విభజన జరపాలని, ఆప్షన్ల పేరుతో ఏపీ అధికారులకు తెలంగాణలో అవకాశం కల్పించవద్దని తెలంగాణ వాణిజ్యపన్నుల గెజిటెడ్ అధికారుల సంఘం (టీసీటీ జీవోఏ) కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు నేతృత్వంలో ప్రతినిధి బృందం మంగళవారం కమిటీ చైర్మన్ కమలనాథన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖలోని ఉన్నతస్థాయి పోస్టుల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఏపీ అధికారులు విభజన తరువాత కూడా ఆప్షన్ల పేరుతో తిష్టవేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఉన్నతస్థాయి పోస్టుల ఖాళీల్లో భర్తీ చేసేందుకు తెలంగాణ వారు లేనందున ఆ స్థానంలో తమను భర్తీ చేయాలని ఆప్షన్లు ఇస్తున్నారని... అయితే నియమించేందుకు అధికారులు లేకపోతే ఆ పోస్టులను ఖాళీగా వదిలేయాల్సిందే తప్ప ఏపీకి చెందిన వారికి అవకాశం కల్పించవద్దని కోరినట్లు చెప్పారు. అలాగే జీవిత భాగస్వామి, వైద్య అవసరాలు, ఎస్సీ, ఎస్టీ అధికారులకు సంబంధించి ఆప్షన్లను సరైనవో కావో ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని కోరామన్నారు. తెలంగాణలో ఉన్న ఒక్క ఖాళీ పోస్టును కూడా ఏపీ అధికారులతో భర్తీ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణకు కేటాయించిన ఒక అదనపు కమిషనర్ పోస్టుకు ఏపీకి చెందిన అధికారే ఉన్నారని, ముగ్గురు జేసీలు వారేనని, 17 మంది డీసీల్లో ఇద్దరు మాత్రమే తెలంగాణ వారని చెప్పారు. అలాగే 33 ఏసీ పోస్టుల్లో కేవలం18 పోస్టులు, 82 మంది సీటీవోల్లో 47 పోస్టులు మాత్రమే తెలంగాణకు చెందిన అధికారులతో ఉంటే మిగతా వాటిలో ఏపీ వారే ఉన్నారని పేర్కొన్నారు.