సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించండి
టీఆర్‌ఎస్ వార్‌రూం, టీఎన్జీవో గ్రీవెన్స్‌సెల్‌కు సమాచారం ఇవ్వండి: దేవీప్రసాద్
సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలి
స్థానికత ఆధారంగా విభజన జరిగే వరకు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
కరీంనగర్ : తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి టీఆర్‌ఎస్ వార్‌రూంకు, టీఎన్జీవో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌కు వెంటనే సమాచారం అందించాలని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన కరీంనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సచివాలయంలో ఈ ప్రాంత ఉద్యోగులు మాత్రమే పనిచేయాలన్నారు. తెలంగాణ ఉద్యోగులం సీమాంధ్రలో పనిచేయమని, అదేవిధంగా సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడ పనిచేయొద్దని అన్నారు. ఇప్పటికే సీమాంధ్రలో ఉన్న మూడు వేల మంది తెలంగాణ ఉద్యోగులు జన్మభూమిపై మమకారంతో ఇక్కడే పనిచేసేందుకు వాంటరీ రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నారని తెలిపారు. ఏపీఎన్జీవో నాయకులు సీమాంధ్ర ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంపొందించవద్దని కోరారు. ఆంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవని కేసీఆర్ చెప్పిన మాటను తప్పుపట్టవద్దన్నారు.
అది ఒక్క కేసీఆర్ మాటే కాదని, నాలుగున్నర లక్షల తెలంగాణ ఉద్యోగుల మాటతో పాటు నాలుగున్నర కోట్ల ప్రజల డిమాండ్ అని పేర్కొన్నారు. ఆయా హెడ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జాబితా ఇంతవరకు ప్రచురణకు నోచుకోలేదని చెప్పారు. జాబితాను బహిరంగంగా వెల్లడిస్తే తప్పుడు సమాచారమిచ్చిన ఉద్యోగుల వివరాలు బయటపడి అపాయింటెడ్ డే, కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలోపు పరిశీలించే అవకాశం ఉండేదన్నారు. స్థానికత ఆధారంగా విభజన జరిగేంత వరకు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని దేవీప్రసాద్ సూచించారు. ఇప్పటివరకు 23 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన సచివాలయంలో తెలంగాణ జిల్లాల వారిని పట్టించుకోలేదన్నారు. అందుకే సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలన్నారు. 58ః42 ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియలో మంజూరీ పోస్టులను కాకుండా వర్కింగ్ పోస్టులను విభజించడం సరికాదన్నారు. రెవెన్యూ శాఖలో రద్దు చేసిన తెలంగాణలోని నాలుగు వందల పోస్టులను వెంటనే పునరుద్ధరించాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.