ఉద్యోగులకు ఆప్షన్లు తొలగించాలి
టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్
సంగారెడ్డి: ఉద్యోగులకు ఆప్షన్లు తొలగించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆదివారం జరిగిన జిల్లా టీఎన్జీవో సంఘం కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలోని ఖాళీల్లోకి ఆంధ్రా ఉద్యోగుల్ని పంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో ఉన్న 18ఎఫ్ క్లాస్‌ను వెంటనే తొలగించాలని, స్థానికత ఆధారంగా విభజన జరగాలని డిమాండ్ చేశారు.
తద్వారా ఏర్పడే ఖాళీలను తెలంగాణ ఉద్యోగుల పదోన్నతులతో నింపాలన్నారు. జిల్లాల్లో పనిచేస్తున్న ఆంధ్రా అధికారులందరినీ పంపించాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసే సీబీసీఐడీ విచారణ కేవలం ఉద్యోగుల పట్లనే కాకుండా బాధ్యులైన ప్రజా ప్రతినిధులను కూడా విచారించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.