Options to employees
-
ఉద్యోగులకు ఆప్షన్లు తొలగించాలి
టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ సంగారెడ్డి: ఉద్యోగులకు ఆప్షన్లు తొలగించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆదివారం జరిగిన జిల్లా టీఎన్జీవో సంఘం కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలోని ఖాళీల్లోకి ఆంధ్రా ఉద్యోగుల్ని పంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో ఉన్న 18ఎఫ్ క్లాస్‌ను వెంటనే తొలగించాలని, స్థానికత ఆధారంగా విభజన జరగాలని డిమాండ్ చేశారు. తద్వారా ఏర్పడే ఖాళీలను తెలంగాణ ఉద్యోగుల పదోన్నతులతో నింపాలన్నారు. జిల్లాల్లో పనిచేస్తున్న ఆంధ్రా అధికారులందరినీ పంపించాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసే సీబీసీఐడీ విచారణ కేవలం ఉద్యోగుల పట్లనే కాకుండా బాధ్యులైన ప్రజా ప్రతినిధులను కూడా విచారించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. -
విభజనకు కౌంట్‌డౌన్..
భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన పనులు చకాచకా జరిగిపోతున్నాయి. జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు కాబోతుండగా... ఎన్నికల నిర్వహణలో ఇప్పటి వరకూ బిజీగా ఉన్న అధికారులు ప్రస్తుతం విభ జన పనులపై దృష్టి సారించారు. ఈ నెలాఖరునాటికి రెండు రాష్ట్రాలకు సంబంధించి భౌగోళిక సరిహద్దుల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముంపు మండలాల ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లేకపోవటంతో కొత్తగా ఏర్పడే కేంద్రప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముంపు పరిధిలోకి వచ్చే కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం, అదే విధంగా పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లో 136 రెవెన్యూ గ్రామలు (205 హేబిటేషన్లు) జూన్ 2 తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలవనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాగానికి దీనిపై స్పష్టమైన సంకేతాలు రావటంతో విభజన లెక్కలు వేస్తున్నారు. స్థానిక ఎన్నికలు, మరో పక్క సార్వత్రిక ఎన్నికలు పూర్తవటంతో ‘విభజన లెక్కలే టాప్ ప్రయారిటీ’ అంటూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సంకేతాలతో విభజన పనులను వేగవంతం చేశారు. ఈ పనుల కోసం ప్రత్యేకంగా నియమింపబడిన సిబ్బంది నివేదికల తయారీలో తలమునకలయ్యారు. సరిహద్దుల ఏర్పాటుకు కసరత్తు : జిల్లాలోని ప్రభుత్వ ఆస్తులు, సిబ్బంది, భవనాలు తదితర అంశాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లే 136 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న స్థిర, చరాస్తులకు సంబంధించి మరో నివేదిక తయారు చేస్తున్నారు. ఈ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విలీనం చేస్తూ తెలంగాణ బిల్లులో చే ర్చినందున, వీటిని జూన్ 2 తరువాత జిల్లా నుంచి వేరు చేయబడతాయని, అందుకనే వీటికి సంబంధించిన నివేదికలను వేరుగా తయారు చేస్తున్నట్లుగా ఓ డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అదే విధంగా రె ండు రాష్ట్రాల మధ్య సరిహ ద్దుల ఏర్పాటుకు సైతం అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కూనవరానికి వెళ్లే దారిలో భద్రాచలం మండలం గోగుబాక సెంటర్లో రెండు రాష్ట్రాల సరిహద్దు ఏర్పాటు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు. అదే విధంగా చింతూరు రహదారిలో చట్టి గ్రామానికి సమీపంలో గల సింగనగూడెం వద్ద సరిహద్దు చెక్‌పోస్టును ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది. భద్రాచలం డివిజన్లోని ముంపు గ్రామాలను జిల్లా నుంచి వేరు చేసి తూర్పుగోదావరి జిల్లాలోనూ, పాల్వంచ డివిజన్లోని గ్రామాలను కృష్ణాజిల్లాలోనూ కలిపేందుకు నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగులకు ఆప్షన్లు లేనట్లేనా : ముంపు ప్రాంతం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం అవుతుండగా, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటన్న దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగస్తులకు ఆప్షన్లు లేవని చెబుతుండటంతో ముంపు ప్రాంత ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముంపు గ్రామాల వారు పోలవరం బ్యాక్ వాటర్ వచ్చేంత వరకూ అక్కడ నుంచి కదిలే పరిస్థితి లేకున్నప్పటికీ, పదోన్నతి పొందే ఉద్యోగులు ఉన్నపళంగా గోదావరి జిల్లాల్లోని ఏ మూలన ఉన్న గ్రామానికైనా వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ముంపు ప్రాంతంలో పనిచేసే అన్ని కేడర్ల ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇదే విషయమై రాష్ట్రపతి, గవర్నర్లను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఆప్షన్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ముంపు ప్రాంతంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలు వచ్చిన తరువాత అన్ని సంఘాలు ఏకమై ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. -
న్యాయవ్యవస్థ ఉద్యోగులకు ఆప్షన్లు
హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి జ్యుడీషియల్ అకాడెమీ రెండు రాష్ట్రాలకు న్యాయ సేవాధికార సంస్థలు హైదరాబాద్: రాష్ట్రంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థకు సంబంధించి హైకోర్టు శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కింది కోర్టుల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న న్యాయాధికారులకు, ఇతర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున మే 7వ తేదీ తరువాతనే ఆప్షన్ల ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలపై గతవారం ప్రధాన న్యాయమూర్తి తన నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ అశుతోష్ మోహంతా, జస్టిస్ రాజా ఇలంగోలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ కమలనాథన్ శుక్రవారం ఈ కమిటీతో సమావేశమయ్యారు. జస్టిస్ మోహంతా, జస్టిస్ రాజా ఇలంగో నగరంలో లేకపోవడంతో భేటీలో పాల్గొనలేదు. సీఎస్ పి.కె.మహంతి, న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో పాటు రిజిస్ట్రార్ జనరల్ తదితరులు పాల్గొన్నారు. మిగిలిన శాఖల ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఆప్షన్లు ఇస్తున్నారో, హైకోర్టు పర్యవేక్షణలో పనిచేసే న్యాయవ్యవస్థ ఉద్యోగులకు సైతం అదేవిధంగా ఆప్షన్లు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలో ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న జ్యుడీషియల్ అకాడెమీనే ఉమ్మడిగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం అందులో పనిచేస్తున్న ఉద్యోగులు యథాతథంగా కొనసాగుతారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థను మాత్రం రెండుగా విభజించి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు న్యాయసేవాధికార సంస్థలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్రలో కొత్త హైకోర్టు ఏర్పాటయ్యేంత వరకు ఇవి రెండూ హైదరాబాద్‌లోనే ఉంటాయి. సీనియర్ సివిల్ జడ్జీల బదిలీలకు బ్రేక్ ఇదిలా ఉంటే సీనియర్ సివిల్ జడ్జీల బదిలీలకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో కూడిన మరో కమిటీ కూడా శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. అయితే త్వరలో రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్నందున ఇప్పుడు బదిలీలు చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం కావడంతో బదిలీల ప్రక్రియను కమిటీ తాత్కాలికంగా పక్కన పెట్టింది. హైకోర్టును రెండుగా విభజించండి రాష్ట్ర హైకోర్టును తక్షణమే రెండుగా విభజించి, హైకోర్టు ఉద్యోగులను వారి తల్లిదండ్రులు పుట్టిన ప్రాంతం ఆధారంగా వర్గీకరించాలని హైకోర్టు తెలంగాణ ఉద్యోగుల సంఘం కోరింది. ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పాటైన కమిటీకి నేతృత్వం వహిస్తున్న కమలనాథన్‌కు ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. ప్రధాన న్యాయమూర్తితో సమావేశం అయ్యేందుకు శుక్రవారం హైకోర్టుకు వచ్చిన కమలనాథన్‌ను సంఘం అధ్యక్షుడు ఎన్.పురుషోత్తంరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలుసుకుంది. న్యాయవ్యవస్థలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందంటూ వారీ సందర్భంగా గణాంకాలను వివరించారు.