న్యాయవ్యవస్థ ఉద్యోగులకు ఆప్షన్లు
హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం
రెండు రాష్ట్రాలకు ఉమ్మడి జ్యుడీషియల్ అకాడెమీ
రెండు రాష్ట్రాలకు న్యాయ సేవాధికార సంస్థలు
హైదరాబాద్: రాష్ట్రంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థకు సంబంధించి హైకోర్టు శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కింది కోర్టుల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న న్యాయాధికారులకు, ఇతర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున మే 7వ తేదీ తరువాతనే ఆప్షన్ల ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలపై గతవారం ప్రధాన న్యాయమూర్తి తన నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ అశుతోష్ మోహంతా, జస్టిస్ రాజా ఇలంగోలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ కమలనాథన్ శుక్రవారం ఈ కమిటీతో సమావేశమయ్యారు. జస్టిస్ మోహంతా, జస్టిస్ రాజా ఇలంగో నగరంలో లేకపోవడంతో భేటీలో పాల్గొనలేదు. సీఎస్ పి.కె.మహంతి, న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో పాటు రిజిస్ట్రార్ జనరల్ తదితరులు పాల్గొన్నారు. మిగిలిన శాఖల ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఆప్షన్లు ఇస్తున్నారో, హైకోర్టు పర్యవేక్షణలో పనిచేసే న్యాయవ్యవస్థ ఉద్యోగులకు సైతం అదేవిధంగా ఆప్షన్లు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలో ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న జ్యుడీషియల్ అకాడెమీనే ఉమ్మడిగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం అందులో పనిచేస్తున్న ఉద్యోగులు యథాతథంగా కొనసాగుతారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థను మాత్రం రెండుగా విభజించి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు న్యాయసేవాధికార సంస్థలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్రలో కొత్త హైకోర్టు ఏర్పాటయ్యేంత వరకు ఇవి రెండూ హైదరాబాద్‌లోనే ఉంటాయి.
సీనియర్ సివిల్ జడ్జీల బదిలీలకు బ్రేక్
ఇదిలా ఉంటే సీనియర్ సివిల్ జడ్జీల బదిలీలకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో కూడిన మరో కమిటీ కూడా శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. అయితే త్వరలో రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్నందున ఇప్పుడు బదిలీలు చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం కావడంతో బదిలీల ప్రక్రియను కమిటీ తాత్కాలికంగా పక్కన పెట్టింది.
హైకోర్టును రెండుగా విభజించండి
రాష్ట్ర హైకోర్టును తక్షణమే రెండుగా విభజించి, హైకోర్టు ఉద్యోగులను వారి తల్లిదండ్రులు పుట్టిన ప్రాంతం ఆధారంగా వర్గీకరించాలని హైకోర్టు తెలంగాణ ఉద్యోగుల సంఘం కోరింది. ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పాటైన కమిటీకి నేతృత్వం వహిస్తున్న కమలనాథన్‌కు ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. ప్రధాన న్యాయమూర్తితో సమావేశం అయ్యేందుకు శుక్రవారం హైకోర్టుకు వచ్చిన కమలనాథన్‌ను సంఘం అధ్యక్షుడు ఎన్.పురుషోత్తంరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలుసుకుంది. న్యాయవ్యవస్థలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందంటూ వారీ సందర్భంగా గణాంకాలను వివరించారు.