విభజనకు కౌంట్‌డౌన్.. | count down time starts for state division | Sakshi
Sakshi News home page

విభజనకు కౌంట్‌డౌన్..

Published Mon, May 5 2014 10:20 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

విభజనకు  కౌంట్‌డౌన్.. - Sakshi

విభజనకు కౌంట్‌డౌన్..

 భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన పనులు చకాచకా జరిగిపోతున్నాయి. జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు కాబోతుండగా... ఎన్నికల నిర్వహణలో ఇప్పటి వరకూ బిజీగా ఉన్న అధికారులు ప్రస్తుతం విభ జన పనులపై దృష్టి సారించారు.  ఈ నెలాఖరునాటికి రెండు రాష్ట్రాలకు సంబంధించి భౌగోళిక సరిహద్దుల ఏర్పాటుకు  సర్వం సిద్ధం చేస్తున్నారు.  ముంపు మండలాల ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లేకపోవటంతో కొత్తగా ఏర్పడే కేంద్రప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  ముంపు పరిధిలోకి వచ్చే కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం, అదే విధంగా పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లో 136 రెవెన్యూ గ్రామలు (205 హేబిటేషన్‌లు) జూన్ 2 తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలవనున్నాయి.
 
 ఇప్పటికే జిల్లా అధికార యంత్రాగానికి దీనిపై స్పష్టమైన సంకేతాలు రావటంతో విభజన లెక్కలు వేస్తున్నారు.  స్థానిక ఎన్నికలు, మరో పక్క సార్వత్రిక ఎన్నికలు పూర్తవటంతో ‘విభజన లెక్కలే టాప్ ప్రయారిటీ’  అంటూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సంకేతాలతో  విభజన పనులను వేగవంతం చేశారు. ఈ పనుల కోసం ప్రత్యేకంగా నియమింపబడిన సిబ్బంది నివేదికల తయారీలో తలమునకలయ్యారు.
 
 సరిహద్దుల ఏర్పాటుకు కసరత్తు :
 జిల్లాలోని ప్రభుత్వ ఆస్తులు, సిబ్బంది, భవనాలు తదితర అంశాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లే 136 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న స్థిర, చరాస్తులకు సంబంధించి మరో నివేదిక తయారు చేస్తున్నారు. ఈ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విలీనం చేస్తూ తెలంగాణ బిల్లులో చే ర్చినందున, వీటిని జూన్ 2 తరువాత జిల్లా నుంచి వేరు చేయబడతాయని, అందుకనే వీటికి సంబంధించిన నివేదికలను వేరుగా తయారు చేస్తున్నట్లుగా ఓ డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
 
అదే విధంగా రె ండు రాష్ట్రాల మధ్య సరిహ ద్దుల ఏర్పాటుకు సైతం అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.  కూనవరానికి వెళ్లే దారిలో భద్రాచలం మండలం గోగుబాక సెంటర్‌లో రెండు రాష్ట్రాల సరిహద్దు ఏర్పాటు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు.  అదే విధంగా చింతూరు రహదారిలో చట్టి గ్రామానికి సమీపంలో గల సింగనగూడెం వద్ద సరిహద్దు చెక్‌పోస్టును ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది. భద్రాచలం డివిజన్‌లోని ముంపు గ్రామాలను జిల్లా నుంచి వేరు చేసి తూర్పుగోదావరి జిల్లాలోనూ, పాల్వంచ డివిజన్‌లోని గ్రామాలను కృష్ణాజిల్లాలోనూ కలిపేందుకు నివేదికలు సిద్ధమవుతున్నాయి.
 
 ఉద్యోగులకు ఆప్షన్‌లు లేనట్లేనా :
 ముంపు ప్రాంతం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం అవుతుండగా, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటన్న దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగస్తులకు ఆప్షన్‌లు లేవని చెబుతుండటంతో ముంపు ప్రాంత ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముంపు గ్రామాల వారు పోలవరం బ్యాక్ వాటర్ వచ్చేంత వరకూ అక్కడ నుంచి కదిలే పరిస్థితి లేకున్నప్పటికీ, పదోన్నతి పొందే ఉద్యోగులు ఉన్నపళంగా  గోదావరి జిల్లాల్లోని ఏ మూలన ఉన్న గ్రామానికైనా వెళ్లిపోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే  ముంపు ప్రాంతంలో పనిచేసే అన్ని కేడర్‌ల ఉద్యోగులకు ఆప్షన్‌లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇదే విషయమై  రాష్ట్రపతి, గవర్నర్‌లను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఆప్షన్‌లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ముంపు ప్రాంతంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలు వచ్చిన తరువాత అన్ని సంఘాలు ఏకమై ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement