చిక్కడపల్లి (హైదరాబాద్): గద్దర్ ఏ ఒక్క వర్గానికి, భావజాలానికి మాత్రమే పరిమితం కాలేదని, ఆయన పాట, మాట, ఆటతో జనహృదయాలను గెలిచారని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ కొనియాడారు. చెప్పదలచుకున్న విషయాన్ని జన హృదయాలను తాకేటట్టు నేర్పుగా చెప్పగల గొప్ప వాగ్గేయకారుడు గద్దర్ అని ప్రశంసించారు. బుధవారం రాత్రి చిక్కడపల్లి త్యాగరాయ గానసభ నిర్వహణలో లలిత కళావేదికపై ప్రజా యుద్ధనౌక, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ సంతాప సభ జరిగింది.
ఇనాక్ తనకు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ సాహిత్యం సిలబస్‌గా పెట్టే ప్రయత్నంలో ఎదుర్కొంటున్న అనుభవాలు, గద్దర్‌లో విప్లవభావాలు, తెలంగాణ భావన, దళిత వర్గాల అభ్యుదయం పట్ల ఆలోచనలను పంచుకున్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ జానపద గాయకుని స్థాయికి ఎదిగిన గద్దర్.. పాట ఉన్నంతకాలం నిలిచి ఉంటారని అన్నారు.
గద్దర్‌లో భిన్న కోణాలు ఉన్నాయని బేవరేజెస్ పూర్వ చైర్మన్ దేవీప్రసాద్ పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా’అన్న గద్దర్ పాటను లయబద్ధంగా పాడి తనకు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. అధ్యక్షత వహించిన గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి మాట్లాడుతూ, గద్దర్ గొప్ప కళాకారుడు అయినప్పటికీ అందరినీ ఆప్యాయంగా పలుకరించే మానవతామూర్తి అని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment