
చేనేత ఇతివృత్తంగా మల్లేశం సినిమా
తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన రజాకార్
సాక్షి, యాదాద్రి : ప్రజా గాయకుడు గద్దర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సినీ అవార్డుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా నేపథ్యం కలిగిన రెండు సినిమాలకు అవార్డులు దక్కాయి. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యలో తీసిన రజాకార్ సినిమా ఉత్తమ చారిత్రాత్మక చిత్రంగా, చేనేత ఇతివృత్తంగా తీసిన మల్లేషం సినిమాకు జ్యూరీ కమిటీ అవార్డులు ప్రకటించింది. జిల్లాకు చెందిన వ్యక్తుల నేపథ్యం కలిగిన రెండు సినిమాలకు అవార్డులు రావడం పట్ల సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చారిత్రక చిత్రంగా రజాకార్
తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేపథ్యంలో రజాకార్ సినిమా తీశారు. బీబీనగర్ మండలం గూడూరుకు చెందిన బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి ఈ చిత్ర నిర్మాత. నల్లగొండకు చెందిన యాట సత్యనారాయణ డైరెక్టర్‌గా వ్యవహరించారు. బీబీనగర్ మండలం మహదేవ్‌పూర్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా తీశారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, అదిలాబాద్ పలు జిల్లాల్లో 1947 నుంచి 1948 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాట సంఘటల ఆధారంగా సినిమా చిత్రీకరించారు.
ఆసుయంత్రం తయారీ ఇతివృత్తంగా..
ఆసు యంత్రాన్ని తయారు చేయడానికి మల్లేశం పడిన శ్రమను ఇతి వృత్తంగా తీసుకుని మల్లేశం సినిమా తీశారు. ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన చింతకింది మల్లేశం చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆసుయంత్రం సృష్టికర్తగా మల్లేశం పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి అబ్దుల్ కలాం అవార్డు అందుకున్నారు.
మల్లేశం సినిమాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది
మల్లేశం సినిమా తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాత, కథ స్క్రీన్ ప్లే వహించిన రాజు రాచకొండకు, నటీ, నటీమణులకు, సినిమా నిర్మాణంలో పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు. గద్దర్ అవార్డులు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– చింతకింది మల్లేశం
తెలంగాణ సాయుధ పోరాటానికి దక్కిన గౌరవం
చారిత్రాత్మక చిత్రం కేటగిరిలో రజాకార్ సినిమాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి దక్కిన గౌరవం. చరిత్రను పరిచయం చేసిన చిత్రంగా ఈ సినిమా నిలిచిపోతుంది.
– గూడూరు నారాయణరెడ్డి, రజాకార్ చిత్ర నిర్మాత