Telangana armed struggle
-
ఆ రోజు నేను తప్పించుకున్నా..
పరకాల: తెలంగాణ సాయుధ పోరాటంలో 1947 సెప్టెంబర్ 2న పరకాలలో జరిగిన పోరాటం చిరస్మరణీయంగా నిలిచింది. ఎంతో మంది ఉద్యమకారుల వీరమరణంతో పరకాల నేల రక్తసిక్తమై నేటికి 76 ఏళ్లు. మరో జలియన్‌వాలా బాగ్గా పిలిచే నాటి పోరాటంలో పాల్గొన్న వ్యక్తి పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన 98 ఏళ్ల పోలీస్‌పటేల్ రేగూరి చంద్రారెడ్డి. పోలీస్‌గా పనిచేసిన ఆయన తెలంగాణ సాయుధ పోరాటానికి ఆకర్శితులై నిజాం సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. పరకాలలో ఆ రోజు ఏం జరిగింది? అంత మారణహోమం జరగడానికి దారి తీసిన పరిస్థితులపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తెలంగాణలో రజకార్ల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయేది. గ్రామాల ప్రజలు రాత్రింబవళ్లు నిద్రహారాలు మానేవారు. ఎప్పుడు ఏ గ్రామంపైనా.. ఎవరిని ఏం చేస్తారో తెలియని భయానక వాతావరణం ఉండేది. నేను నిజాం సర్కార్‌లోనే పోలీస్ పటేల్‌గా పనిచేసేవాడిని. అప్పటి పరిస్థితులను చూసి ఉద్యోగాన్ని వదిలిపెట్టి మారుపేరు రంజిత్‌తో తిరుగుబాటుదారులైన ఎస్.మనోహర్‌రావు, కేవీనర్సింగరావుకు సన్నిహితమయ్యా. వారి పోరాట కార్యాచరణలో భాగస్వాముడినయ్యా. సాయుధ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలను షెల్టర్‌గా మార్చుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా, రజాకార్ల ఆగడాలపై సాయుధపోరుకు శ్రీకారం చుట్టాం. మూడు కిలోమీటర్ల పొడవుతో ఊరేగింపు ఆ రోజు 1947 సెప్టెంబర్ 2. అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు నిజాం నిరంకుశ పాలనను, రజకారులను ఎదిరిస్తూ త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి అనేక గ్రామాలనుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. యూనియన్ పతాకాలు, వడిసెలు, చేతి కర్రలు పట్టుకుని పతాక వందనానికి కదం తొక్కారు. తొలుత చాపలబండ నుంచి దగ్గు వీరగోపాల్‌రావు నాయకత్వాన ఊరేగింపు నిర్వహించాం. మూడు కిలోమీటర్ల పొడవుతో సాగిన మా ఊరేగింపులో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని, వందేమాతరం అంటూ నినాదాలు చేశాం. గర్జించిన నిజాం పోలీసుల తుపాకులు మా ఊరేగింపు సమాచారం తెలియగానే అప్పటికే ఇక్కడ నిజాం మిలిటరీ పోలీసులు మకాం వేశారు. రజాకారులు కత్తులు, బరిసెలతో సిద్ధమై ఉన్నారు. తహసీల్దార్ విష్ణువేశ్వర్‌రావు ఊరేగింపు వద్దకు వచ్చి వెనక్కి తిరిగి రావాల్సిందిగా మా అందరికి (ఉద్యమకారులకు) హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. తహసీల్దార్ అనుమతి మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ చేతిలోని పిస్తోల్ ధన్మని పేలడంతో నిజాం పోలీసుల తుపాకులు గర్జించాయి. మా కంటే ముందు వరుసలో ఉన్న శ్రీశైలంతోపాటు అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాపలబండ ప్రాంతం రక్తంతో తడిసిముద్దయింది. అక్కడినుంచి నేను తప్పించుకున్న. వారం రోజులకు నన్ను దొరకబట్టి చిత్రహింసలకు గురిచేశారు. చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. కానీ కొన ఊపిరితో బయటపడ్డాను. నాటి ఉద్యమ ఫలితంగా తెలంగాణకు విముక్తి లభించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. -
Kandimalla Pratap Reddy: ‘కొరియర్’గా.. వారియర్‌గా!
హిమాయత్‌నగర్: పసి వయసు నుంచి కసిగా నిజాం వ్యతిరేక, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగస్వామి అయిన వ్యక్తి ఆయన. అప్పుడాయన వయసు 13 ఏళ్లే. ఆయనే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి. స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం. ‘సెప్టెంబర్ 17’నేపథ్యంలో అప్పటి పోరాటంలో పాల్గొన్న ప్రతాప్‌రెడ్డి అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘స్వాతంత్య్రం వచ్చేనాటికి నాటికి నాకు సుమారుగా 13 ఏళ్లు. మా తండ్రి రంగారెడ్డి నన్ను నల్లగొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానానికి రాలేదంటూ చెలరేగిన ఉద్యమానికి బడులన్నీ మూతపడ్డాయి. అనంతరం నేను ఓ వేపచెట్టు కింద విద్యార్థి నాయకులు, దళాలు చేపట్టిన సాయుధ పోరాట కార్యక్రమంలో తొలిసారిగా పాల్గొన్నాను. ఆ వేపచెట్టుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. గ్రామాల్లోకి వచ్చిన దళాలను రహస్య ప్రాంతాల్లో దాచేవాడిని. నన్ను కమ్యూనిస్టు పార్టీ బాలసంఘం సెక్రెటరీగా నియమించారు. కొరియర్‌గా ఇటు ప్రజలకు, అటు దళాలు, విద్యార్థి నాయకులకు దగ్గరగా ఉండేవాడిని. వీరితో పాటు ప్రజలకు నేనే సమాచార వారధిగా ఉండేవాడిని. తుపాకీని ముట్టనిచ్చేవాళ్లు కాదు.. మా ఉద్యమాన్ని అణచివేసేందుకు రజాకార్లు గుర్రాలపై, జీపులపై గ్రామాల్లోకి చొరబడేవాళ్లు. రజాకార్లను ఎదుర్కొనేందుకు దళాలు కూడా ఊళ్లలోకి వచ్చేవి. తుపాకీని పట్టుకోవాలనే ఆశ నాకున్నప్పటికీ బాలుడిని కావడంతో దళసభ్యులు ముట్టనిచ్చేవాళ్లు కాదు. రజాకార్లను అడ్డుకునేందుకు తిప్పర్తి వంతెనను మూడు, నాలుగు గ్రామాలవాళ్లం కొంతవరకు కూల్చివేశాం. మేం కోదాడ, నల్లగొండ ప్రధాన రహదారులపై ఉన్న సమయంలో షోలాపూర్, కోదాడల మీదుగా పెద్దపెద్ద సైన్యాలు హైదరాబాద్ వైపు వెళ్లడాన్ని గమనించాం. ఈ సైన్యాలు వెళ్లిన మూడు రోజులకు, అంటే సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు నిజాం రాజు నుంచి వెలువడిన వార్త మా దాకా వచ్చింది. ఎంతో సంతోషంగా ఈ వార్తను ఒక కొరియర్లా తీసికెళ్లి పలు గ్రామాల్లో చెప్పాను. -
అణచివేతపై సాయుధ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలు ఓ వైపు.. జమీందార్ల దుర్మార్గాలు మరోవైపు.. దారుణమైన బతుకుల నుంచి బయటపడేందుకు పుట్టిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. 1946 సెప్టెంబర్ 11న మొదలై 1951 అక్టోబర్ 21 దాకా ఐదేళ్లకుపైగా సాయుధ ఉద్యమం కొనసాగింది. ప్రపంచ చరిత్రలోని గొప్ప పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. 1946లో చాకలి ఐలమ్మ సాగుభూమి మీద జమీందారు విసునూరు రాంచంద్రారెడ్డి కన్ను పడింది. ఆ భూమిని, పంటను స్వాధీనం చేసుకునేందుకు గూండాలను పంపాడు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్ల ప్రతాపరెడ్డి తదితరుల సహకారంతో ఐలమ్మ తిరగబడింది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి వంటి వారిని పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. అయితే ఐలమ్మ భూమిని, ధాన్యాన్ని భూస్వాములు స్వాధీనం చేసుకోలేక పోయారు. దీంతో ఆవేశం పట్టలేక కడివెండి గ్రామ నాయకులను హత్య చేయాలని పథకం వేశారు. 1946 జూలై 4న దేశ్‌ముఖ్ మనుషులు గ్రామ నాయకుల ఇళ్ల మీద రాళ్లు వేయడంతో.. ప్రజలు లాఠీలు, వడిసెలు చేత బట్టుకుని ప్రదర్శనగా బయలు దేరారు. ఈ ఊరేగింపు జమీందారు ఇంటి దగ్గరికి రాగానే.. జమీందారు మనుషులు కాల్పులు జరపడంతో గ్రామ నాయకుడు దొడ్డి కొమరయ్య బలయ్యాడు. ఈ విషయం దావానలంలా వ్యాపించి.. ఊరూరా జనం తిరుగుబాటు మొదలు పెట్టారు. ఆ ప్రతిఘటనను అణచి వేసేందుకు జమీందార్ల మనుషులు, రజాకార్లు, నిజాం పోలీసులు దాడులకు దిగారు. అయినా ప్రజలు తిరుగుబాటు ఆపలేదు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ 1946 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. పేదలకు 10 లక్షల ఎకరాలు పంపిణీ.. అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా మొదలైన సాయుధ ఉద్యమం భూపోరాటంగా మారి దున్నేవాడికే భూమి దక్కాలని నినదించింది. నిజాం రాచరికం, జమీందార్ల అరాచక పాలన మీద తిరుగుబాటుగా మారింది. భూమి కోసం, భుక్తి కోసమేగాక సామాజిక వివక్షపైనా పోరాటం జరిగింది. మూడు వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. భూస్వాములు, జమీందార్ల నుంచి పది లక్షల ఎకరాలకుపైగా భూమిని రైతులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తాకట్టులో ఉన్న భూములను విడి పించుకున్నారు. రుణపత్రాలను రద్దు చేసి.. పశువులను పంపిణీ చేశారు. ఈ పోరాటాల్లో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళలూ ముందు నిలిచారు. 4 వేల మంది వీర మరణంతో.. రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుండగానే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎన్నో సంస్థానాలు ఇండి యన్ యూనియన్‌లో విలీనమైనా.. నిజాం సంస్థానం మాత్రం ఒప్పుకోలేదు. దీనికి నాటి భారత ప్రభుత్వం అంగీకరించింది. నిజాం రాజుతో 1947 నవంబర్ 29న యథాతథ ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ తెలంగాణ ప్రజలు నిజాం పాలన అంతం కావాలని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని పోరాటాలు చేశారు. అందులో భాగంగా సాయు ధ పోరాటం ఉధృతంగా కొనసాగింది. రజాకార్లు, నిజాం సైన్యాల దాడుల నుంచి రక్షణకోసం.. పదివేల మంది గ్రామదళ సభ్యులు, దాదాపు రెండు వేల గెరిల్లా దళ సభ్యులతో శక్తివంతమైన సాయుధ బలగాన్ని నిర్మించుకోగలిగారు. కానీ నిజాం పాలకులు, జమీందార్లు కలిసి.. నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, రైతులను హతమార్చారు. మరెన్నో వేల మందిని నిర్బంధ శిబిరాల్లో, జైళ్లలో బందీలను చేశారు. అయినా సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. ఈ పోరాటం తమ గెరిల్లా పోరాటం కంటే గొప్పదని క్యూబా ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం గమనార్హం. విమోచన కాదు.. అది విలీన ఒప్పందం: మొయిన్ గోల్కొండ: అప్పటి హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా యూనియన్ ప్రభుత్వానికి, నిజాం చివరి పాలకుడికి మధ్య విలీన ఒప్పందం జరిగిందని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎంకే మొయిన్ అన్నారు. దీనిని కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించి విమోచన దినంగా చెబుతూ సంబరాలు జరుపుకోవడం సరికాదన్నారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లకు హిందూ జమీందారులైన దేశ్‌ముఖ్‌లు అండగా ఉండి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. అయితే ఈ సత్యాన్ని ఇప్పుడు కొందరు వక్రీకరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో నిజాం సంస్థానం విలీనంపై అప్పటి ప్రధాని జవహర్లాల్ న్రెహూ ముద్ర స్పష్టంగా ఉందని, అయితే కొంతకాలంగా విలీన హీరోగా వల్లభాయ్ పటేల్‌ను చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిగా 1944 సంవత్సరంలో దారుల్ షిఫా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే తాను కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడినయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ విలీన సమయంలోనూ అజ్ఞాతంలోనే ఉన్నానని చెప్పారు. అటువంటి తనను సన్మానిస్తామని విమోచనోత్సవం నిర్వహిస్తున్న బీజేపీ పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు) -
నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’
సాక్షి, హైదరాబాద్: ‘మా భూమి’ ఒక సినిమా మాత్రమే కాదు. ఒక చారిత్రక దృశ్యకావ్యం. తెలుగు సినీచరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రయోగం. నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అకృత్యాలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సమున్నతంగా ఎత్తిపట్టిన సామాజిక చిత్రం. నలభై రెండేళ్ల క్రితం విడుదలైన ‘మా భూమి’సినిమా ఇప్పటికీ ప్రేక్షాకాదరణను పొందుతూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ఒక చర్చనీయాంశం. సాయుధపోరాటాన్ని, తెలంగాణలో పోలీస్ యాక్షన్ కాలాన్ని ‘మాభూమి’లో చిత్రీకరించారు. రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలను, హింసను చూసిన హైదరాబాద్ రాజ్యం పోలీసు యాక్షన్‌తో భారత యూనియన్‌లో భాగమైంది.ఆ నాటికి ఒక కీలకమైన దశాబ్ద కాలాన్ని అద్భుతమైన మా భూమి సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు చిత్ర నిర్మాత, సంగీత దర్శకులు బి. నర్సింగ్‌రావు. అప్పటి అనుభవాలు ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... నిర్మాత నర్సింగరావుతో నటుడు సాయిచంద్ అదొక ప్రయోగం.. ‘మా భూమి’ సినిమా ఒక ప్రయోగం.అప్పటి వరకు సినిమా తీసిన అనుభవం లేదు. నటీనటులు కూడా అంతే. స్టేజీ ఆర్టిస్టులు. సాయిచంద్ బహుశా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. క్రికెట్ ఆడుతుండగా తీసుకెళ్లాం, ఆయనకు అదే మొదటి సినిమా. కాకరాల, భూపాల్‌రెడ్డి, రాంగోపాల్, తదితరులంతా రంగస్థల నటులు. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడు గౌతమ్‌ఘోష్ అందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఈ సినిమా కోసం పని చేశాం. ►1978 నుంచి 1980 వరకు సినిమా నిర్మాణం కొనసాగింది. చిత్రం షూటింగ్ ప్రారంభోత్సం నుంచి లెక్కిస్తే ఇప్పటికి 44 ఏళ్లు. విడుదలైనప్పటి నుంచి అయితే 42 సంవత్సరాలు. సినిమా విడుదలైన రోజుల్లో సినిమా టాకీస్ల వద్దకు జనం పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవారు. సినిమా టాకీసులన్నీ జాతర వాతావరణాన్ని తలపించేవి. హైదరాబాద్‌లో ఈ సినిమాకు అపూర్వమైన ఆదరణ లభించింది. దర్శకుడు గౌతమ్‌ఘోష్ మా భూమిని అత్యంత ప్రతిభావంతంగా, సృజనాత్మకంగా, ఒక దృశ్యకావ్యంలా చిత్రీకరించారు. ‘మా భూమి’ సినిమాలోని సన్నివేశాలు హైదరాబాద్‌లో చిత్రీకరణ... మా భూమి సినిమాను చాలా వరకు మొదక్ జిల్లా మంగళ్పర్తి, దొంతి గ్రామాల్లో , శివంపేట గడీలో చిత్రీకరించాము. విద్యుత్ సదుపాయం కూడా లేని ఆ రోజుల్లో పగటిపూటనే చీకటి వాతావరణాన్ని చిత్రీకరించి సినిమా షూటింగ్ చేశాం.రజాకార్ల దాడి , కమ్యూనిస్టుల పోరాటాలు వంటి కీలకమైన ఘట్టాలను చిత్రీకరించే సమయంలో కళాకారులకు దెబ్బలు కూడా తగిలేవి. గాయాలకు కట్టుకట్టేందుకు రోజుకు ఒక అయోడిన్ బాటిల్ చొప్పున వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో చాలా చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్ నగర సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా ఆఫ్జల్‌గంజ్‌లోని ఇరానీ హాటల్లో ఒక సన్నివేశాన్ని తీశాం. అలాగే కార్వాన్, జాహనుమా, జూబ్లీహాల్, వనస్థలిపురం, నయాఖిల్లా, సాలార్జంగ్ మ్యూజియం, కాలాగూడ, తదితర ప్రాంతాల్లో మా భూమి సినిమా తీశాం. కథానాయిక చంద్రి నివాసం, గుడిసెలు అంతా హైదరాబాద్‌లోనే సెట్టింగ్ వేశాం.ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభవం. అందరికీ ఒకే కిచెన్ ఉండేది. అందరం కలిసి ఒకే చోట భోజనాలు చేసేవాళ్లం. లారీల్లో ప్రయాణం చేసేవాళ్లం, ప్రజలు కళాకారులే... ఆ రోజుల్లో కేవలం రూ.5.40 లక్షలతో ఈ సినిమా పూర్తయింది. ఆర్టిస్టులకు రూ.300, రూ.500, రూ.1000 చొప్పున ఇచ్చాం.చాలా మంది స్వచ్చందంగా నటించారు. సగం మంది ఆర్టిస్టులు ఉంటే మిగతా సగం మంది ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలే. షూటింగ్ సందర్శన కోసం వచ్చిన వాళ్లే ఆర్టిస్టులయ్యారు. ఒకసారి 80 మంది గ్రామస్తులకు ఆ రోజు కూలి డబ్బులు మాత్రమే చెల్లించి సినిమా షూటింగ్లో భాగస్వాములను చేశాం.అప్పటి తెలంగాణ సమాజాన్ని, రజాకార్ల హింసను, పోలీసు చర్య పరిణామాలను ఈ సినిమా ఉన్నదున్నట్లుగా చూపించింది. ‘ అని వివరించారు. బండెనుక బండి కట్టి... ఈ సినిమాలో ప్రజాగాయకుడు గద్దర్ పాడిన పాట అప్పటి నిజాం రాక్షస పాలన, జమీందార్ల దౌర్జన్యాలపైన ప్రజల తిరుగుబాటును కళ్లకు కట్టింది. ‘బండెనుక బండి కట్టి. పదహారు బండ్లు కట్టి.. నువు ఏ బండ్లె పోతవురో నైజాము సర్కరోడా....’ అంటూ గద్దర్ ఎలుగెత్తి పాడిన ఆ పాటు ప్రజలను పెద్ద ఎత్తున కదిలించింది. నిజాం నిరంకుశ పాలనపైన, దొరలు, జమీందార్ల పెత్తనంపైన ప్రజాగ్రహం పెల్లుబికేవిధంగా ఈ పాట స్ఫూర్తిని రగిలించింది. -
ఆజాద్ హైదరాబాద్: సాయుధ పోరులో చేయి కలిపిన సింగరేణి
దేశమంతా స్వాతంత్య్ర సంబురాలు జరుపుకొంటున్న వేళ... తెలంగాణ మాత్రం నిజాం రాజు ఏలుబడిలోనే కొనసాగింది. ఎందరో వీరుల పోరాట ఫలితంగా బ్రిటీష్ వాళ్లు దేశాన్ని వదిలి వెళ్లాక కూడా హైదరాబాద్ సంస్థానాదీశుడైన నిజాం ఆధ్వర్యాన రజాకారులు హైదరాబాద్ సంస్థానం పరిధిలో అరాచకాలు సాగించారు. కొంతకాలం పంటి బిగువున భరించిన ప్రజలు... దుర్మార్గాలు పెచ్చరిల్లడంతో తిరుగుబాటుకు దిగారు. యువత ఏకమై సాయుధపోరాటాలు సాగించి నిజాం సైన్యాలను తిప్పికొట్టింది. ఈ పోరాటంలో పలువురు అమరులైనా మిగతా వారు వెనక్కి తగ్గకుండా చేసిన పోరాటంతో తెలంగాణకు సైతం స్వాతంత్య్రం లభించింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట గాధలను స్థానికులు గుర్తు చేసుకుంటుంటారు. ఆనాటి అమరులకు గుర్తుగా నిర్మించిన స్థూపాలు సాక్షిగా నిలుస్తున్నాయి. ఈమేరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పలు గ్రామాలపై కథనాలు.. ఈటెలతో తిరగబడిన మీనవోలు ఎర్రుపాలెం : తెలంగాణ సంస్థానాన్ని ఏలుతున్న నైజాం పాలనను వ్యతిరేకిస్తూ చేపట్టిన సాయుధ పోరాటంలో ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయ్యారు. పోరాటాల పురిటిగడ్డగా మీనవోలు గ్రామం చరిత్ర పుటలకెక్కింది. ఎర్రుపాలెం మండల కేంద్రంలో నైజాంలు అప్పట్లో పోలీస్ క్యాంపు నిర్వహించేవారు. అందులో బ్రిటీష్ ప్రభుత్వ అధికారి లెఫ్టినెంట్ సార్జంట్ తరచూ మీనవోలు గ్రామంపై దాడులు చేసి ప్రజల సొమ్మును అపహరించేవాడు. సార్జంట్ తీరుకు తోడు రజాకారులు కూడా ప్రజలను చిత్రహింసలు పెడుతుండగా... 1948 సంవత్సరం జనవరి 15న గ్రామస్తులంతా మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఈక్రమంలో సార్జంట్ తన బలగాలే కాకుండా రజాకార్లతో కలిసి మీనవోలుకు వస్తున్నాడన్న సమాచారంతో గ్రామస్తులు ఈటెలతో దండెత్తారు. ప్రజల తిరుగుబాటును ఊహించని సార్జంట్ అప్పటికప్పుడు విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరపగా రాంపల్లి రామయ్య, సుఖబోగి ముత్తయ్య, తోట బాలయ్య, పిల్లి కాటయ్య, బండి వీరయ్య, మెట్టెల శ్రీరాములు, తోట వెంకయ్య ప్రాణాలు కోల్పోయారు. అయినా కోపం చల్లారని సార్జెంట్.. నైజాం నవాబు సాయంతో రజాకార్లను రైలులో రప్పించి పలువురి ఇళ్లను తగలబెట్టారు. అలా పరిస్థితి విషమించడంతో పలువురు గ్రామస్తులు మీనవోలు విడిచివెళ్లారు. అనంతర కాలంలో పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ గ్రామాలకు చేరుకున్నారు. కాగా, రజాకార్లను ఎదురొడ్డి పోరాడి అమరులైన వారికి గుర్తుగా గ్రామస్తులు 1958 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన స్థూపాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఈ స్థూపం శిథిలం కావడంతో మరమ్మత్తులు చేయించడంతో పాటు అదే రీతిలో ప్రధాన రహదారిపై మరో స్థూపాన్ని నిర్మించారు. గుర్రాలతో తొక్కించినా నోరువిప్పని పోరాటపటిమ కొణిజర్ల : నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో యువకులు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడగా... అందులో కొణిజర్ల మండలంలోని తనికెళ్లకూ స్థానముంది. తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, గడల రామకృష్ణయ్య, గడల సుబ్బయ్య, గడల నర్సయ్య తుళ్లూరి అప్పయ్య, కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య తాళ్లపల్లి రాములు ఆనాడు మల్లెల వెంకటేశ్వరరావు దళంలో పనిచేశారు. నాటి సాయుధ పోరాటంలో నల్లమల వెంకటేశ్వరరావు, షేక్ రజబ్అలీ నేతృత్వంలో తుపాకులు చేతబట్టి కదన రంగంలో కాలుమోపి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. దళంలో పనిచేసిన వీరికి ఇదే గ్రామానికి చెందిన గడల ముత్తయ్య, పేరసాని అప్పయ్య, యాసా వెంకటలాలయ్య, పిన్నం సత్యం, యాసా మాణిక్యమ్మ సాయం చేసేవారు. ఓ సమయాన రజాకార్లు గ్రామాలపై విచక్షణారహితంగా దాడి జరిపి మహిళలు, చిన్నారులను చిత్రహింసలకు గురిచేయడమే కాక పురుషులను పట్టుకుని జైలులో పెట్టారు. అందులో పలువురిని కాల్చి చంపడం ద్వారా గ్రామస్తులకు భయాందోళనకు గురిచేసేవారని చెబుతారు. ఆ సమయాన గడల సీతారామయ్య ఆచూకీ తెలపమని రజాకార్లు గుర్రాలతో తొక్కించినా గ్రామస్తులెవరూ నోరు విప్పలేదట! నాటి తెలంగాణ సాయుధ పోరాట ఆద్యుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పలువురు పోరాటంలో పాల్గొనగా, గ్రామానికి చెందిన యాసా మాణిక్యమ్మ అడవుల్లో తలదాచుకుంటున్న పోరాటవీరులకు భోజనం సమకూర్చేది. ఆమెను గుర్తించి రజాకార్లు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టినా ఎవరి వివరాలు తెలియనివ్వలేదు. మండలంలోని లాలాపురానికి చెందిన సంక్రాంతి రామనర్సయ్య గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలో ఆరికాయలపాడు దళం ఆర్గనైజర్‌గా పనిచేశారు. 1945 ప్రాంతంలో సింగరాయపాలెం జాగీర్దార్, నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటం నిర్వహించాడు. వివాహమైన ఏడాదికే దళంలో చేరిన రామనర్సయ్య చేసిన పోరాట పటిమను తట్టుకోలేని నిజాం ప్రభుత్వం 1947లో ఆయనతో పాటు మరికొందనిని గుబ్బగుర్తి అడవుల్లో పట్టుకుంది. ఆతర్వాత మున్నేరువాగు వద్దకు తీసుకెళ్లి ఎవరి గోతులు వారినే తవ్వుకోమని చెప్పి కాల్చి చంపి పూడ్చి పెట్టారు. ఆయన స్ఫూర్తితోనే రామనర్సయ్య సోదరుడు సంక్రాంతి మధుసూదన్‌రావు కమ్యూనిస్టు నాయకుడిగా కొనసాగుతున్నారు. పోరాటాల గడ్డ మేదేపల్లి ఏన్కూరు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏన్కూరు మండలం మేడేపల్లి గ్రామస్తులు ఎందరో రజాకార్లను ఎదురొడ్డి పోరాటం చేశారు. తద్వారా పోరాటాల గడ్డగా మేడేపల్లి చరిత్రకెక్కింది. మేడేపల్లి గ్రామంలో గిరిజనులు రజాకార్లను ఎదిరించి పోరాటాలు చేశారు. తాటి సీతమ్మ, తాటి సత్యం, ముక్తి ఎర్రయ్య, బండ్ల పెద్ద జోగయ్య, ముక్తి రాములు తుపాకులు పట్టి అడవుల్లో తలదాచుకుంటూ రజాకార్లను తుదముట్టించారు. నల్లమల గిరిప్రసాద్ నాయకత్వంలో వీరు పోరాటం చేసినట్లు చెబుతారు. తాటి సీతమ్మ, తాటి సత్యంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్మృతిచిహ్నాలుగా గ్రామంలో స్థూపాలను ఏర్పాటుచేశారు. పోలీస్ చర్య తర్వాతా యుద్ధమే.. సత్తుపల్లి : సత్తుపల్లి నుంచి పది కి.మీ. దూరంలో ఉన్న ఆంధ్రా ప్రాంతంలోని గురుభట్లగూడెం, కృష్ణారావుపాలెం తదితర ప్రాంతాలపై రజాకార్ల నిర్బంధం కొనసాగేది. ఆ సమయంలో దమ్మపేట మండలం జమేదారుబంజరు ప్రాంతం నుంచి సోయం గంగులు నాయకత్వంలో సాయుధ పోరాటం మొదలైంది. ఆయనకు మద్దతుగా గిరిజనులు, గిరిజనేతరులు రజాకారులపై గెరిల్లా దాడులు పాల్పడుతుండేవారు. అనంతర కాలంలో పోలీసు చర్యతో తెలంగాణకు విముక్తి లభించింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు – భారత మిలటరీకి 1948 నుంచి 1950 వరకు రెండేళ్ల పాటు హోరాహోరీ పోరు నడిచింది. గ్రామాల్లోకి భారత సైన్యం వస్తుంటే కమ్యూనిస్టులు సాయుధులై తిరుగుబాటు చేసేవారు. క్షేత్ర స్థాయిలో పరిపాలనను అందించేందుకు ఆ సమయానభారత మిలటరీకి మద్దతుగా గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటయ్యాయి. ఈ దళాల్లోని సభ్యులకు తుపాకీతో శిక్షణ ఇచ్చేవారు. వీరు ఉదయమంతా గ్రామాల్లో గస్తీ తిరగటం.. చీకటిపడే సమయానికి సత్తుపల్లి పాత సెంటర్లోని జెండా చింతచెట్టు వద్ద సమావేశ కావటం జరుగుతుండేది. భారత మిలటరీని మలబార్ రెజిమెంట్ ఆధ్వర్యంలో రక్షణ దళం ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులను హోంగార్డులుగా కూడా వ్యవహరించేవారు. ఇందులోభాగంగా 1948లో సత్తుపల్లి గ్రామ రక్షణ దళం ఏర్పాటు కాగా.. చల్లగుళ్ల సీతారామయ్య, నరుకుళ్ల వెంకయ్య, దిరిశాల సత్యం, మట్టా రామయ్య, చల్లగుండ్ల వీరయ్య, మట్టా వెంకయ్య, మొరిశెట్టి సత్యం, నరుకుళ్ల రామయ్య, పల్లబోతు నాగభూషణం, కొత్తూరు సుబ్బారావు, సీతారామయ్య, మహాదేవ రామలింగం, వల్లభనేని సకలయ్య తదితరులు సభ్యులుగా ఉండే వారని పెద్దలు చెబుతుంటారు. నాకు గర్వంగా ఉంటుంది.. 18 ఏళ్ల వయస్సులో మా నాన్న చల్లగుళ్ల వీరయ్య సత్తుపల్లి గ్రామ రక్షణ దళంలో పని చేశారు. కమ్యూనిస్టు సాయుధ పోరాటం విరమించే వరకు రక్షణ దళం భారత మిలటరీ మద్దతుతో పని చేసేదని మానాన్న చెప్పేవారు. సత్తుపల్లి చరిత్రలో మా కుటుంబం పేరు కూడా ఉండటం నాకు గర్వకారణంగా ఉంది. – చల్లగుళ్ల నర్సింహారావు, సత్తుపల్లి -
చరిత్రను కాటేయ జూస్తున్నారు!
తొలిసారి నేను 1999లో నల్లమలను చూశాను. చెంచుల తొలి పరిచయం అప్పుడే. అప్పాపూర్ పెంట పెద్ద మనిషి తోకల గురువయ్య నాకు తొలి చెంచు మిత్రుడు. అప్పటికే 60 ఏళ్లు దాటిన వృద్ధుడు. తెల్లటి ఛాయ, బుర్ర మీసాలు... చెంచు ఆహార్యమే గాని, ఇగురం తెలిసిన మనిషి. ఈడు మీదున్నప్పుడు ఇప్ప సారా గురిగి లేపితే సేరు సారా అవలీలగా పీకేటో డట. 83 ఏళ్ల వయసులో మూడేళ్ల కిందట చనిపోయాడు. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ మీద భీమిరెడ్డి ఫైరింగ్. బాలెంల, పాత సూర్యాపేట ఊదరబాంబు దెబ్బ. పాలకుర్తి పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తి. దొడ్డి కొమురయ్య, మల్లెపాక మైసయ్య, బందగీ అమరత్వంతో ఊరూరా ప్రజా యుద్ధం సాగింది. ఈ దశలోనే రైతాంగ సాయుధ పోరాటానికి బీజం పడ్డది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) తొలి తుపాకీని భుజం మీద పెట్టుకున్నడు. సాయుధ రైతాంగ దళాలు ఏర్పడి, పోరాటం చేసి మూడువేల గ్రామాలను విముక్త గ్రామాలుగా ప్రకటించాయి. భూములను పంచాయి. ఖాసీం రజ్వీ సేనల నరమేధానికి కమ్యూ నిస్టు గెరిల్లాలు వెనక్కి తగ్గలేదు. పంచిన భూములను జనం వదల్లేదు. పంట ఇంటికి చేరు తోంది. అప్పుడప్పుడే జనానికి కడుపు నిండా బువ్వ దొరుకు తోంది. అగో.. అప్పుడు దిగింది పటేల్ సైన్యం! నాలుగు రోజుల్లో యుద్ధం ముగిసింది. ఆశ్చర్యకర పరి ణామాల నేపథ్యంలో నిజాం మకుటం లేని మహారాజు అయిండు. నయా జమానా మొదలైంది. పటేల్ సైన్యం నిజాంకు రక్షణ కవచం అయింది. కమ్యూనిస్టుల వేట మొదలు పెట్టింది. అట్లాంటి సంక్లిష్ట సమయంలో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి పెద్దలు సాయుధ పోరాటం వద్దన్నరు. భీమిరెడ్డి ఎదురు తిరిగిండు. సర్దార్ పటేల్‌ది విద్రోహం అన్నడు. తుపాకి దించితే జరిగే అనర్థాన్నీ, భవిష్యత్తునూ కళ్లకు గట్టినట్టు వివరించాడు. మనలను నమ్మి దళాల్లోకి వచ్చిన దళిత బహుజన గెరిల్లాలను మనంతట మనమే శత్రువుకు అప్ప గించినట్టేనని వాదిస్తున్నాడు. కానీ మితవాద కమ్యూనిస్టుల చెవికి ఎక్కడం లేదు. బీఎన్ అనుమానమే కాలగమనంలో అప్పాపూర్ చెంచు పెద్ద తోకల గురువయ్య అనుభవంలోకి వచ్చింది. 1999లో నేను నల్లమల వెళ్ళినప్పుడు ఆయన్ను కదిలిస్తే... ‘కమ్యూనిస్టుల దెబ్బకు గడీలను వదిలి పట్నం పారి పోయిన భూస్వాములు తెల్ల బట్టలేసుకొని, మల్లా పల్లెలకు జొచ్చిండ్రు. వీళ్లకు పటేల్ సైన్యాలే కావలి. కమ్యూనిస్టు దళాలల్ల చేరి, దొరల భూముల్లో ఎర్రజెండాలు పాతిన వాళ్లను దొరక బట్టి, కోదండమేసి నెత్తుర్లు కారంగ కొట్టేటోళ్లు. బట్టలు విప్పించి, ఒంటి మీద బెల్లం నీళ్లు చల్లి, మామిడి చెట్ల మీది కొరివి చీమల గూళ్ళు తెచ్చి దులిపేవాళ్లు. కర్రలతో కొట్టి సంపేవాళ్లు. (క్లిక్ చేయండి: సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?) దొరతనం ముందు నిలువలేక సోర సోర పొరగాండ్లు మల్లా ఈ అడివికే వచ్చిండ్రు. ఎదురు బొంగులను జబ్బకు కట్టుకొని, దాని మీదంగ గొంగడి కప్పుకునేటోళ్లు. చూసే వాళ్లకు జబ్బకున్నది తుపాకి అనిపించేది. సైన్యం అంత సులువుగా వీళ్ల మీదికి రాకపోయేది. గానీ... ఆకలికి తాళలేక ఎక్కడి వాళ్లు అక్కడ పడి పాణం ఇడిసేటోళ్లు. చెంచులం అడివికి పొలం పోతే సచ్చి పురుగులు పట్టిన పీనిగెలు కనపడేయి. అట్లా సావటానికైనా సిద్ధపడ్డరు కానీ... ఇంటికి పోవటానికి మాత్రం సాహసం చేయక పోయేటోళ్లు. దొరలు పెట్టే చిత్ర హింసల సావు కంటే, ఇదే నయం అనుకునేటోళ్లు’... ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. బీఎన్ ఆనాడు మితవాద కమ్యూనిస్టు నేతలతో చివరి నిమిషం వరకు తుపాకి దించనని చెప్పింది ఇందుకే. ఇప్పుడు ఓ మత పార్టీ రాజకీయ క్రీడ ఆడబూనింది. కమలం పువ్వు మాటున చరిత్రను కాటేయాలనుకుంటోంది. సాయుధ పోరాట అపూర్వ ఘట్టాలకు గోరీ కట్టి ఖాకీ నిక్కరు తొడగాలని తాపత్రయపడుతోంది. తెలంగాణ పౌరుల్లారా... తస్మాత్ జాగ్రత్త! - వర్ధెల్లి వెంకటేశ్వర్లు సీనియర్ జర్నలిస్టు, పరిశోధక రచయిత -
సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?
‘తారీఖులూ దస్తావేజులూ ఇవి కావోయ్ చరిత్ర సారం’ అని శ్రీశ్రీ అన్నాడు గానీ అటు సమయం ఇటు సారాంశం కూడా మారిపోతుంటాయి. సెప్టెంబర్ 17 ఇందుకో ఉదాహరణ. ఆ తేదీ ప్రాధాన్యత ఏమిటి? ఏ కోణంలో ఏ పేరుతో జరపాలి అన్నది ఒక కొలిక్కి రావడానికి దాదాపు 75 ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా కేంద్రం దీన్ని విమోచన దినం అంటే, రాష్ట్రం సమైక్యతా దినోత్సవం అంటున్నది. తెలంగాణ సాయుధ పోరాట వార్షి కోత్సవాలు ఇంతకాలంగా జరుపుతూనే ఉన్న కమ్యూనిస్టులు తదితరులకు వేరే అభిప్రాయాలున్నా కూడా ఆ మహత్తర పోరాట వారసత్వం గుర్తుచేసుకోవడానికి ఏదో ఒక సందర్భం ఉందని సంతోషిస్తున్నారు. ముస్లిం రాజు నిజాం నుంచి విమోచన కనుక విమోచన దినోత్సవాన్ని గట్టిగా జరపాలని బీజేపీ వారంటుంటే, సంస్థానం దేశంలో విలీనమైంది గనక సమైక్యతా దినోత్సవమే సరైందని టీఆర్ఎస్ చెబుతున్నది. విమోచన ఎవరి నుంచి అనేది మరో ప్రశ్న. నిరంకుశ పాలకుల అండతో సాగిన వెట్టిచాకిరీ నుంచి, దోపిడీ పీడనల నుంచి విముక్తి అని కమ్యూనిస్టులంటారు. ‘బానిసోన్ని దొరా’ అనే వాడితో బందూకు పట్టించినంతగా మార్పు తెచ్చిన కమ్యూనిస్టుల దగ్గర ఏ ఇంద్రజాలమున్నదో అని సురవరం ప్రతాపరెడ్డి ఆశ్చర్యపోయారు. ‘విలేఖించనిండు నన్ను తెలంగాణ వీరగాథ’ అని గానం చేశారు హరీంద్రనాథ్ ఛటోపా ధ్యాయ. 1947 ఆగస్టు 15 నాటికి తెలంగాణ సాయుధ పోరాటం సాగుతూనే ఉంది. ఆ పోరాటం తాకిడికి హడలిపోయిన కేంద్ర కాంగ్రెస్ పాలకులు పోలీసు చర్య పేరుతో సైనిక చర్య జరి పారు. నిరంకుశ పాలకుడిని రాజ్‌ప్రముఖ్‌ను చేసి, హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకుని, పోరాడే ప్రజలపై తుపాకులు ఎక్కుపెట్టారు. విప్లవ పోరాటం ముందు నిజాం దాదాపు చేతులెత్తేసిన పరిస్థితిలో తిరిగి ఆయనకు ఊపిరి పోశారు. నిజాంకు బ్రిటిషర్లతో సైనిక ఒప్పందం గనక, సొంత సైనిక బలం లేదు గనక అనధికార సైన్యంగా రజాకార్లు ప్రజలపై దాడులు, హత్యాకాండ సాగించారు. వాళ్లను అణచి వేయడానికి వచ్చామంటూనే సైన్యం కమ్యూనిస్టులపై మారణకాండ సాగించింది. ‘మూడువేల మృతవీర సమాధుల పుణ్యక్షేత్రమీ నల్లగొండరా’ అనే పాట చాలు దాని తీవ్రత తెలియడానికి. సర్దార్ పటేల్ హోంమంత్రిగా దీనికి ఆధ్వర్యం వహించారు. మీరు రాజీకి రాకపోతే కమ్యూనిస్టుల రాజ్యం వచ్చేస్తుందని బెదిరించి దారికి తెచ్చుకున్నారు. ఆ విలీనం వాస్తవంగా జరిగిందే గనక వివాదం లేదు. పోరాటంపై దాడి చేశారు గనక విద్రోహం అని అన్నా ఇప్పటి సందర్భం వేరు. పోరాట విరమణే విద్రోహం అనే వారిది సైద్ధాంతిక చర్చ తప్ప ఉత్సవాలతో నిమిత్తం లేదు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా సంస్థానాధీశులపైనా పోరాడాలని కమ్యూనిస్టులు తీసుకున్న విధానాన్ని కాంగ్రెస్ ఆమోదించలేదు. నాటి ఉమ్మడి మద్రాసులోని కేరళ ప్రాంతం; బెంగాల్, పంజాబ్, త్రిపుర ఇలా గొప్ప పోరాటాలే నడిచాయి. నైజాంలలో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటానికి చాలా కాలం పట్టింది. ‘ఆంధ్ర మహాసభ’ మాత్రమే అప్పటికి చెప్పు కోదగిన సంస్థ. నాటి హేమాహేమీలందరూ ఉన్న సంస్థ. మహజర్లు ఇవ్వడం వరకే పరిమితమైన ఆ సంస్థను సమరశీల పథం పట్టించిన కమ్యూనిస్టులు ప్రజలకు నాయకత్వం వహించి నిరంకుశ పాలకుడిపై, గ్రామీణ పెత్తందార్లపై పోరాడారు. భాషా సాంస్కృతిక స్వేచ్ఛ ఈ పోరాటంలో అంతర్భాగం. 3,000 గ్రామాల విముక్తి, పదిలక్షల ఎకరాల పంపిణీ, వెట్టిచాకిరీ రద్దు, దున్నేవాడికి భూమి నినాదం, బానిసలుగా బతుకుతున్న ప్రజల ఆత్మగౌరవం, స్వతంత్ర జీవనం... ప్రధాన విజయాలు. ఇందుకు అర్పించిన ప్రాణాలు నాలుగు వేల పైన. అత్యాచారాలకు, అమానుషాలకు గురైన వారి సంఖ్యలు మరింత భయంకరంగా ఉంటాయి. ఆ పోరాటాన్ని గుర్తించడానికి కాంగ్రెస్ పాలకులకు దాదాపు పాతికేళ్లు పట్టింది. కేసీఆర్‌కు ఎనిమిదేళ్లుపట్టింది. ఇక బీజేపీ మతతత్వ కోణంలో ముస్లిం రాజుపై హిందువుల తిరుగు బాటుగా వక్రీకరించి 1998 నుంచి విమోచన దినం జరుపుతున్నది. అప్పుడు వారి అభినవ సర్దార్ పటేల్ అద్వానీ. ఇప్పుడు అమిత్‌షా. పటేల్ మాత్రమే తెలంగాణ విమోచన సాధించినట్టు చెబుతూ ఆయన సైన్యాలు తర్వాత సాగించిన దారుణకాండను దాటేయడం మరో రాజకీయం. తెలంగాణ ఏర్పడింది గనక ఇప్పటి రాజకీయాలు గతానికి పులమడం అనవసరం. (క్లిక్ చేయండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?) తెలంగాణ యోధులతో రెడ్డి హాస్టల్లో ఉండి పోరా టానికి తొలుత రంగం సిద్ధం చేసింది చండ్ర రాజేశ్వరరావు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి వంటివారు ముందు నిలవకపోతే పోరాటం సాధ్యమయ్యేది కాదని సుందరయ్య స్పష్టంగా రాశారు. ఈ పోరాటం తెలుగువారం దరిదీ. మహిళలు, అణగారిన వర్గాలది అతి కీలక పాత్ర. వారు ఎగరేసింది ఎర్రజండానే. ఇప్పుడు కమ్యూనిస్టులను ఎవరూ పట్టించుకోరని కంచ ఐలయ్య వంటివారు అనొచ్చు గానీ (సాక్షి, సెప్టెంబరు 12) దాచేస్తే దాగని సత్యం ఎర్రెర్రని సూర్యకాంతిలా పలకరిస్తూనే ఉంటుంది. నాటి రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ స్థాపించిన పార్టీ కూడా సమైక్య ఉత్సవాలు జరపాలని కోరడం ఇందుకో నిదర్శనం. స్వాతంత్య్ర వజ్రోత్సవాలతో పాటు సమైక్యతా ఉత్సవంగా జరపడం నేటి పరిస్థితులలో ఆహ్వానించదగింది. తెలంగాణ వారసత్వంలో భాగంగా ఈ పోరాట ఉత్స వాలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మొదటి ఎడిటర్స్ మీట్లోనే నేను అడిగాను. గ్లోరిఫై చేయాలి అని ఆయనన్నారు. అంతకు అయిదారేళ్ల ముందు ఒక టీవీ చర్చలో నిజాం పాత్ర గురించి కూడా మా మధ్య వివాదం జరిగింది. ఆ మాట ఆయన ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. గోదావరి ప్రజలు పూజించే కాటన్‌తో నిజాంను ఆయన పోల్చారు. ప్రజలు కాటన్‌ను తప్ప విక్టోరియా మహారాణిని పూజిం చడంలేదని నేను చెప్పాను. ఏదైనా అది చరిత్ర. నిజాం వ్యక్తిగత దూషణ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. వీర తెలంగాణ విప్లవ స్ఫూర్తిని విభజన రాజకీయాలకు వాడుకోవడం తగని పని. - తెలకపల్లి రవి సీనియర్ జర్నలిస్ట్ -
రజాకార్లకు ఎదురొడ్డిన గుండ్రాంపల్లి!
చిట్యాల: నిజాం కాలంలో రజాకార్ల అకృత్యాలకు సజీవ సాక్ష్యం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి యువకులెందరో రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు వదిలారు. నాటి పోరాటానికి జ్ఞాపకంగా గ్రామంలో అమరవీరుల స్తూపం సగౌరవంగా నిలబడి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం తమ గ్రామానికి తగిన గుర్తింపు లేదని స్థానికులు వాపోతున్నారు. రక్షక దళాలుగా ఏర్పడి.. రజాకార్ల దారుణాలు సాగుతున్న సమయంలో సూర్యాపేట తాలూకా వర్దమానకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్యక్తి.. తన సోదరి నివాసం ఉంటున్న గుండ్రాంపల్లికి వలస వచ్చాడు. మొదట బతుకుదెరువు కోసం ఇదే మండలం ఏపూరులో ఒక భూస్వామి వద్ద పనిలో చేరాడు. కానీ తర్వాత రజాకార్ల బృందంలో చేరాడు. గుండ్రాంపల్లి కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్నవారిపై రజాకార్లతో కలిసి అరాచకాలకు పాల్పడ్డాడు. అవి ఎంత దారుణంగా ఉండేవంటే.. గ్రామంలో తాను నిర్మించుకున్న ఇంటి పునాదిలో నిండు గర్భిణులను సజీవ సమాధి చేసి ఆపై నిర్మాణాన్ని చేపట్టాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ క్రమంలో మక్బూల్, ఇతర రజాకార్ల ఆగడాలను అడ్డుకోవడానికి గుండ్రాంపల్లి కేంద్రంగా ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు రక్షక దళాలుగా ఏర్పడ్డారు. రజాకార్ల దాడులను తిప్పికొట్టారు. 30 మందిని సజీవ దహనం చేసి.. గుండ్రాంపల్లి కేంద్రంగా జరుగుతున్న తిరుగుబాటుతో రగిలిపోయిన మక్బూల్.. పెద్ద సంఖ్యలో రజాకార్లను కూడగట్టి భారీ దాడికి దిగాడు. తమకు దొరికిన 30 మంది యువకులను గుండ్రాంపల్లిలో ఎడ్లబండ్లకు కట్టి చిత్రహింసలు పెట్టాడు. తర్వాత గుండ్రాంపల్లి నడిబొడ్డున మసీదు ఎదురుగా బావిలో వారందరినీ పడేసి సజీవ దహనం చేశాడు. ఇది తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారు. ప్రస్తుత మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి గురునాథరెడ్డి నాయకత్వంలో సాయుధ దళాలు మక్బూల్‌పై దాడికి ప్రయత్నించాయి. కానీ మక్బూల్ తప్పించుకున్నాడు. తర్వాత మరోసారి చేసిన దాడిలో మక్బూల్ చేయి విరిగినా, ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడు. మక్బూల్‌కు సహకరించిన వారి ఇళ్లపై కమ్యూనిస్టు సాయుధ దళాలు దాడి చేసి హతమార్చాయి. నిజాం పాలన నుంచి విముక్తి లభించాక గుండ్రాంపల్లి ఊపిరిపీల్చుకుంది. నాటి పోరాటంలో యువకులను సజీవ దహనం చేసినచోట 1993 జూన్ 4న సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. అమరులైన వారిలో గుర్తించిన 26 మంది పేర్లను ఆ స్తూపంపై రాశారు. ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణవాదులు ఈ స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో ఈ స్థూపాన్ని తొలగించగా.. మరోచోట అమరవీరుల స్తూపాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. గ్రామాన్ని సందర్శించిన అమిత్ షా 2017 మే నెలలో గుండ్రాంపల్లి గ్రామాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సందర్శించారు. నాటి సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారసులను ఆయన సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఈ ఏడాది జూలైలో గుండ్రాంపల్లిని సందర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గుండ్రాంపల్లి గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చుతామని.. గ్రామంలో స్మారక కేంద్రం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రజాకార్ల దుర్మార్గాలు చెప్పలేనివి నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు రజాకార్ల దాడులు జరిగాయి. గ్రామంలోని యువకులు దళాలుగా ఏర్పడి తిరుగుబాటు చేశారు. రజాకార్లు వారిని పట్టుకుని చంపేశారు. తర్వాత మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల వారంతా కలిసి మక్బూల్‌పై దాడి చేశారు. నాటి రజాకార్ల దుర్మార్గాలు చెప్పనలవికాదు. – గోపగోని రామలింగయ్య, గుండ్రాంపల్లి గుండ్రాంపల్లికి గుర్తింపు ఇవ్వాలి నిజాం నవాబుకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గుండ్రాంపల్లి గ్రామ చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి. పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి ముందు తరాలకు తెలియజేయాలి. ఏటా సెప్టెంబర్ 17న మా గ్రామంలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలి. – గరిశె అంజయ్య, గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,గుండ్రాంపల్లి -
చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?
భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దశాబ్దాలపాటు సమాంతరంగా సాగాయి. జాతీయోద్యమంలో చోటుచేసుకున్న ‘జలియన్‌వాలా బాగ్’ దురంతం వంటివాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనలకు లభించలేదు. గుండ్రాంపల్లి, బైరాన్‌పల్లి వంటి వందలాది గ్రామాలను నిరంకుశ నిజాం జలియన్‌వాలా బాగ్లుగా మార్చివేశాడు. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ ప్రభుత్వం చేపట్టిన ‘సైనిక చర్య’తో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసిపోయింది. ఈ క్రమంలో లక్షలాది ప్రజలు అసువులు బాశారు. చరిత్రాత్మకమైన సాయుధ పోరాటానికీ, భారత్‌లో హైదరాబాద్ కలిసిన ‘సెప్టెంబర్ 17’కూ స్వార్థపూరిత రాజకీయాల వల్ల తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరం. అది 1919 ఏప్రిల్ 13. బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని నిరసించిన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు పెద్దఎత్తున సాగాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన బ్రిటిష్ ప్రభుత్వం బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. ఈ తరుణంలోనే పంజాబీలకు ముఖ్యమైన పండుగ వైశాఖీ సందర్భంగా ఏడెకరాల విస్తీర్ణం గల ఓ తోటలో వేల మంది సమావేశమయ్యారు. బ్రిటిష్ సైన్యంతో అక్కడకు వచ్చిన ఓ అధికారి ప్రవేశ మార్గాలను మూసివేసి, నిరాయుధులైన జనంపై కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్ల కాల్పుల్లో గుళ్లవర్షం కురిపించారు. వెయ్యిమంది మరణించారు. మరో రెండువేలమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అమానవీయ నరమేధానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ తోట పేరు జలియన్‌వాలా బాగ్. నిరాయధులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించిన ఆ నరరూప రాక్షసుడే జనరల్ డయ్యర్. పంజాబ్‌కి చెందిన వ్యక్తిగా జలియన్ వాలా బాగ్ ఉదంతంపై నాకు పూర్తి అవగాహన ఉంది. కానీ భారత చరిత్రలో గుర్తింపునకు నోచుకోని ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నిజాం నిరంకుశ రాజ్యమైన నాటి హైదరాబాద్ సంస్థానంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఈ ప్రాంతంతో అనుబంధం ఏర్పర్చుకున్న నేను నిజాం అరాచకాలూ, రజాకార్ల అకృత్యాల గురించీ తెలుసుకున్న తర్వాత విస్మయం కలిగింది. ఒకింత ఆగ్రహం, ఆవేదనా కలిగాయి. నిజాం రాజ్యంలోని ‘జలియన్ వాలా బాగ్’ ఘటనల్లో గుండ్రాం పల్లి ఒకటి. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపుటేరులు పారించారు. ఖాసీం రజ్వీకి అత్యంత సన్నిహితుడైన మక్బూల్ ఈ గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు. గ్రామస్థులంతా ఏకమై తిరగబడ్డారు. పారిపోయిన మక్బూల్ రజాకార్ల మూకలతో తిరిగొచ్చి గ్రామం మీద పడ్డాడు. 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొని ఎత్తుకెళ్ళి పోయారు. అలాగే తెలంగాణ విమోచన పోరాటంలో బైరాన్‌పల్లి వీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజాకార్ల అరాచకాలను ఎదుర్కొ నేందుకు బైరాన్‌పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకుని, బురుజులు కట్టారు. బురుజులపై నుంచి నగారా మోగిస్తూ రజా కార్లతో పోరాడేందుకు గ్రామ రక్షక దళాలు సిద్ధమయ్యేవి. ఒకసారి బైరాన్‌పల్లి పక్క గ్రామం లింగాపూర్ పై రజాకార్లు దాడి చేసి, ధాన్యాన్ని ఎత్తుకెళ్తుండగా బైరాన్ పల్లి వాసులు అడ్డుకొని ఎదురు దాడి చేశారు. దీంతో బైరాన్ పల్లిపై కక్షగట్టిన రజాకార్లు మొదటిసారి 60 మందితో, మరో సారి 150 మందితో దాడికి యత్నించి తోకముడిచారు. ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయిన రజా కార్లు 400 మంది సైన్యంతో, మారణాయుధాలతో ఊరిపై పడ్డారు. మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. సంప్రదాయక ఆయుధాలతో ఎదురు తిరిగిన బైరాన్‌పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు మొత్తం 118 మంది వీరమరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు బైరాన్‌పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలిచి ఉంది. 1947 సెప్టెంబర్ 2న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ నినదించిన పరకాల గ్రామస్థులపై రజాకార్లు, నిజాం సైనికులు చేసిన దాడిలో 19 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జల్–జమీన్–జంగల్ కోసం పోరాడిన రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచ రులను నిర్మల్‌లోని మర్రిచెట్టుకు ఉరితీశారు. ఆ మర్రి ‘గోండ్ మర్రి’, ‘ఉరుల మర్రి’, ‘వెయ్యి ఉరుల మర్రి’గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ విమోచన కొరకు అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల మంది ఉద్యమకారులపై నిజాం పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి సమీపంలోని రేణికుంటపై 1948 మార్చి 4న నిజాం పోలీసులు, రజాకార్ మూకలు లూటీకి తెగబడ్డారు. సంప్రదాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకున్న గ్రామస్థులు ఆధునిక ఆయుధాలున్న రజాకార్లను ప్రతిఘటించారు, వారితో భీకరంగా పోరాడారు. ఈ పోరాటంలో 26 మంది రేణికుంట గ్రామస్థులు అమరులయ్యారు. నిర్హేతుక పన్నులపై గొంతెత్తి, పన్నులు కట్టమంటూ భీష్మించుకు కూర్చున్న పాతర్లపహాడ్ వాసులను నిజాం పోలీసులు ఊచకోత కోశారు. 17 మంది అమరులయ్యారు. జనగాం సమీపంలోని కాట్కొండలో రజాకార్ల బలవంతపు వసూళ్లను అడ్డుకున్న 13 మందిని కాల్చి చంపారు. కూటిగల్‌లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను కాల్చి చంపారు. 1935–47 మధ్యన, మరీ ముఖ్యంగా 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు ఇలాంటి హింసాత్మక ఘటనలు వంద లాదిగా జరిగాయి. జలియన్ వాలాబాగ్ ఘటన అనూహ్యంగా జరిగింది. కానీ నాటి హైదరాబాద్ సంస్థానంలో 13–14 ఏళ్ల పాటు వ్యవస్థీకృతంగా హిందువులపై రక్త పాతం జరిగింది. సర్దార్ పటేల్ చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’తో దేశానికి స్వాతంత్య్రం లభించిన 13 నెలల తర్వాత 1948 సెప్టెం బర్ 17న ఈ ప్రాంతం నిజాం పీడ నుంచీ, రజాకార్ల అకృత్యాల నుంచీ విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. తెలంగాణలో ఈ తరహా దుర్ఘటనలు గుర్తింపునకు నోచుకోకపోవడానికి కారణం సంతుష్టీకరణ రాజకీయాలే. నిజాంను దుష్టుడిగా చూపితే మైనార్టీ వర్గాల సెంటిమెంటు దెబ్బతింటుందన్న నెపంతో ఎందరో యోధుల త్యాగాలు, పరాక్రమాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారు. ఎంఐఎం ఒత్తిడికి లొంగి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17న ఎలాంటి వేడుకలు జరపకుండా, ప్రాముఖ్యం లేని రోజుగానే చూశాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ సెంటి మెంటుతో రాజకీయాలు చేసే టీఆర్ఎస్ కూడా ఎంఐఎంకు తలొగ్గి సెప్టెంబర్ 17ను అప్రధానంగా చూడడం దురదృష్టకరం. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో తెరమరుగైన యోధులకు గుర్తింపునిచ్చి స్మరించుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసి, వెలుగులోకి రాని యోధులను, ఘటనలను వెలుగులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చి 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వ హించేందుకు సిద్ధమైంది. 2023 సెప్టెంబర్ 17 వరకు సంవత్సరం పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ప్రాంత విమోచన కోసం ఎలాంటి పోరాటాలు జరిగాయో నేటి తరం తెలుసుకోవాలన్నదే ఈ వేడుకల ఉద్దేశ్యం. ఇదే మన కోసం తమ సర్వస్వాన్ని సమర్పించిన నాటి యోధులకు ఇచ్చే అసలైన నివాళి. తరుణ్ చుగ్ (వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్) -
విముక్తికి బాట వేసిన బైరాన్‌పల్లి..!
1947 ఆగస్టు 15.. తెల్లదొరలను తరిమిన భారతావనిలో ప్రజలు స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటున్నారు.. కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలో బిక్కుబిక్కుమంటూనే గడిపింది. ఆ రోజే కాదు.. మరో ఏడాదికిపైగా నిజాం నియంతృత్వాన్ని, రజాకార్ల దుర్మార్గాలను భరిస్తూ వచ్చింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలన్న ప్రజల ఆకాంక్షలు, ప్రతిఘటనలు, పోరాటాల రూపంలో తెరపైకి రావడం మొదలైంది. వీటన్నింటికీ పరాకాష్టగా బైరాన్‌పల్లి నరమేధం కలకలం రేపింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రస్థాయికి చేరింది. 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లి ఘటన జరిగితే ఆ తర్వాత 21 రోజుల్లో.. అంటే సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. –సాక్షి, సిద్దిపేట ఎన్నో పోరాటాలు జరిగినా.. బ్రిటీష్‌వాళ్లు దేశాన్ని వదిలిపెట్టి పోయినా.. నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిరాకరించారు. దీనికి తోడు నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం రజ్వీ వ్యక్తిగత సైన్యం రజాకార్ల అరాచకాలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలైంది. సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరాన్‌పల్లి కేంద్రంగా కూటిగల్, లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాల యువకులతో బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది. రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్‌పల్లి గ్రామస్తులంతా ఏకమయ్యారు. శత్రువుల దాడిని ఎదుర్కొని, ప్రతిదాడి చేయడానికి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కోట బురుజును పునర్నిర్మించారు. నాటు తుపాకులు, మందు గుండు సామగ్రి సమకూర్చుకున్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్న యువకులు నాటు తుపాకులతో గస్తీ నిర్వహించేవారు. ప్రతీకారేచ్ఛతో వరుస దాడులకు తెగబడి.. 1948లో లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలపై రజాకార్లు దాడి చేసి తగులబెట్టారు. తిరిగి వెళ్తుండగా బైరాన్‌పల్లి సమీపంలోకి రాగానే వారిపై దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలో రక్షణ గెరిల్లా దళాలు దాడిచేసి దోచుకున్న సంపదను స్వాధీనం చేసుకున్నాయి. దాన్ని తిరిగి ప్రజలకు పంచారు. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయిన రజాకార్లు బైరాన్పల్లిపై దాడి చేశారు. రక్షక దళం గట్టిగా ప్రతిఘటించింది. ఈ దాడిలో 20 మందికిపైగా రజాకార్లు చనిపోయారు. ఇలా రెండోసారి కూడా విఫలం కావడంతో రజాకార్లు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. నాటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హషీం ఆదేశాలతో హైదరాబాద్ నుంచి 500 మందికిపైగా సైనికులను రప్పించి మూడోసారి దాడి చేశారు. దారుణంగా కాల్చి చంపారు ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్లు 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా బైరాన్‌పల్లిని చుట్టుముట్టారు. అయితే ఆ సమయంలో బహిర్భూమికి వెళ్లిన గ్రామస్తుడు వడ్లె వెంకటనర్సయ్య గమనించి కేకలు వేయడంతో.. వెంటనే బురుజుపై ఉన్న కాపలాదారులు నగారా మోగించారు. అప్పటికే దూసుకొచ్చిన రజాకార్ల కాల్పుల్లో బురుజుపై ఉన్న గెరిల్లా దళ సభ్యులు మోగుటం రామయ్య, పోచయ్య, భూమయ్య మృతిచెందారు. రజాకార్లు ఫిరంగులతో దాడి చేయగా.. బురుజులోని మధ్య గదిలో ఉన్న మందు గుండు సామగ్రిపై నిప్పులు పడి పేలిపోయింది. తర్వాత రజాకార్లు మరింత విజృంభించారు. బురుజుపై తలదాచుకున్న 40 మందిని కిరాతకంగా కాల్చి చంపారు. మరో 56 మంది యువకులను బంధించి ఊరి బయటికి తీసుకొచ్చి కాల్చిచంపారు. మృతదేహాలను పాత బావిలో పడేశారు. ఈ ఘటనల్లో 118 మందికిపైగా మృతిచెందినట్లు చరిత్ర చెబుతోంది. యువకులను చంపడంతో ఊరుకోని రజాకార్లు మరిన్ని దారుణాలకు తెగబడ్డారు. మహిళలను నగ్నంగా ఆ శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు. వారిపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ దారుణాలను తట్టుకోలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్టు బైరాన్‌పల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నరమేధం నాటి భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు మొదలయ్యాయి. నాటి కేంద్ర హోంమంత్రి వల్లభ్ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ యాక్షన్‌తో కొద్దిరోజుల్లోనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో వీలినమైంది. బైరాన్‌పల్లి వాసులు నాటి ఘటనను గుర్తు చేసుకుని ఇప్పటికీ కన్నీటిపర్యంతం అవుతున్నారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోలేదు నాటి ఘటనతో బైరాన్‌పల్లి.. వీర బైరాన్‌పల్లి అయింది. ఇంతటి పోరాట పటిమ చూపిన తమ గ్రామాన్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయని స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నాటి పోరాటంలో పాల్గొన్నా 28 మందికి మాత్రమే పెన్షన్ మంజూరు చేశారని.. నాటి పోరాటంలో పాల్గొని పెన్షన్ రానివారు ఇంకా 30 మంది ఉన్నారని చెబుతున్నారు. కూటిగళ్లు గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఉందని.. నాడు అమరులైన వారి పేర్లతో గ్రామస్తులే ఓ స్తూపాన్ని నిర్మించుకున్నారని వివరిస్తున్నారు. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా స్తూపాన్ని ఆవిష్కరించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బైరాన్‌పల్లి పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి బైరాన్‌పల్లి పోరాటాన్ని విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలి. నాటి ఘనత నేటి తరానికి తెలిసేలా అమరధామం, ఎత్తయిన స్తూపం, భవనం నిర్మించాలి. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిపెట్టి అభివృద్ధి చేయాలి. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో బైరాన్‌పల్లి గురించి వివరించాం. వస్తానన్నారు. ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికైనా పట్టించుకోవాలి. –చల్లా చంద్రారెడ్డి నాటి పోరాటంలో కాలికి గాయమైంది నాడు రజాకార్లు చందాల పేరుతో పీడించేవారు. వారి దాడుల్లో నా కాలుకు గాయమైంది. అయినా రక్షణ దళంతో కలిసి రజకార్లపై పోరాడాను. నాటి పోరాటకారుల్లో కొందరికి ఇప్పటికీ పెన్షన్ మంజూరు చేయలేదు. వెంటనే మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. గ్రామంలో సర్వే చేసి ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. –ఇమ్మడి ఆగంరెడ్డి -
నిజాం రాజు.. తలవంచెన్ చూడు
‘‘1948 సెప్టెంబర్ 13.. తెల్లవారుజామున టెలిఫోన్ భీకరంగా మోగడంతో మేల్కొన్నాను. ఆర్మీ కమాండర్ ఇద్రూస్ అత్యవసర కాల్. రిసీవర్ ఎత్తకముందే అది భారత సైనికదళాల ఆగమనానికి సంబంధించినదై ఉంటుందని భావించా.. అది అదే. గడిచిన పావుగంటలో ఐదు విభిన్న సెక్టార్ల నుంచి భారత సైన్యం పెద్దసంఖ్యలో హైదరాబాద్ వైపు పురోగమిస్తున్నట్టు సమాచారం ఉందన్నాడు. అతను నాతో మాట్లాడుతుండగానే బీడ్, వరంగల్ ఔరంగాబాద్, విమానాశ్రయాలపై బాంబుదాడులు జరుగుతున్నాయి.. ఏం చేయాలని అడిగాడు. ఎలాగైనా అడ్డుకోవాలన్నాను. కానీ హైదరాబాద్ సైన్యాల నిస్సహాయ ప్రదర్శన, సాయం చేస్తుందనుకున్న పాకిస్తాన్ ప్రేక్షకపాత్ర, మా ఫిర్యాదుపై భద్రతా మండలి (యూన్ సెక్యూరిటీ కౌన్సిల్) జాప్యం..వెరసి హైదరాబాద్ కథ విషాదంగా ముగిసింది..’’ – హైదరాబాద్ స్టేట్ చివరి ప్రధాని లాయక్ అలీ ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ బుక్‌లో రాసుకున్న మనోగతమిది. (శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) ఆపరేషన్ పోలో.. కేవలం ఐదురోజుల్లోనే హైదరాబాద్ భవిష్యత్తును మార్చేసింది. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాలతో, త్రివర్ణజెండాలతో రెపరెపలాడితే.. హైదరాబాద్‌లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేయాలని నెహ్రూ, పటేల్ చేసిన విజ్ఞప్తులను నిజాం బుట్టదాఖలు చేయడంతో ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది. ఐదు రోజుల్లోనే అంతా పూర్తి నిజాం మెడలు వంచే లక్ష్యంతో 1948 సెప్టెంబర్ 13న భారత మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో మొదలైన ‘ఆపరేషన్ పోలో’ ఐదురోజుల్లోనే ముగిసింది. పశ్చిమాన షోలాపూర్–హైదరాబాద్, తూ ర్పున మచిలీపట్నం–హైదరాబాద్ రహదారి వెంట యుద్ధట్యాంకులు, తేలికపాటి స్టువర్ట్ టైప్ ట్యాంకులు, వాటి వెనక ఆయుధ వాహనాలు, పదాతిదళాలు దూసుకురాగా.. నిజాం సైన్యాలు, రజాకార్ల బృందాలు ఎక్కడా నిలువరించలేకపోయాయి. ముట్టడి ప్రారంభమైన తొలిరోజునే పశ్చిమం నుంచి వస్తున్న దళాలు నల్‌దుర్గ్‌ను స్వాధీనం చేసుకోగా.. తూర్పున మునగాల, సూర్యాపేట వరకు వశమ య్యాయి. సూర్యాపేట శివారులో మకాంవేసిన ని జాం సైన్యం.. 14వ తేదీన భారత సైన్యాలను అడ్డు కునేందుకు మూసీ వంతెనను పేల్చేసినా, తాత్కా లిక వంతెన నిర్మించుకున్న భారతసైన్యాలు మూసీ ని దాటాయి. భారత వాయుసేన పైనుంచి బాంబులువేస్తూ దారివేయగా.. పదాతిదళాలు నిజాం సైన్యాలను ఎదుర్కొంటూ ముందుకుసాగాయి. స్వేచ్ఛా వాయువులతో.. సెప్టెంబర్ 16 నాటికి నిజాంకు వాస్తవ పరిస్థితి అర్థమైంది. ఆరోజు సాయంత్రమే తొలుత ప్రధానమంత్రి మీర్‌లాయక్ అలీ రేడియో స్టేషన్‌కు వెళ్లి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మర్నాడు, అంటే.. సెప్టెంబర్ 17న సాయంత్రానికి భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ ఆదేశంతో.. మీర్ ఉస్మాన్‌అలీఖాన్ స్వయంగా దక్కన్ రేడియో ద్వారా హైదరాబాద్ సైన్యం తరఫున కాల్పుల విరమణ చేస్తున్నామని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించా రు. దీనితో హైదరాబాద్ స్టేట్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. జనమంతా భారత జాతీయజెండాలతో హైదరాబాద్ నగరాన్ని త్రివర్ణమయం చేశారు. రజాకార్ల అధ్యక్షుడు ఖాసీంరజ్వీని అరెస్ట్‌చేసి జైల్లో పెట్టగా.. ప్రధాని లాయక్ అలీని గృహ నిర్బంధం చేశారు. ఆయన రెండేళ్ల తర్వాత తప్పించుకుని పాకిస్తాన్ చేరాడు. ఖాసీం రజ్వీ 1958లో జైలు నుంచి విడుదలై పాకిస్తాన్లో స్థిరపడ్డాడు. నిజాం గుండెల్లో నిదురించిన గెరిల్లా.. ‘‘కట్ట బట్ట, తిన తిండి, పొట్టనక్షరం ముక్కలేనివాడు. వెట్టిచాకిరీకి అలవాటుపడ్డవాడు. ఎముకల గూడు తప్ప ఏమీ మిగలని వాడు.. దొరా నీ బాంచెన్ అన్న దీనుడు.. హీనుడు, దిక్కులేనివాడు.. తెలంగాణ మానవుడి సాహసోపేత సాయుధ పోరాటం ప్రపంచంలో ఓ కొత్త చరిత్ర’’.. నిజాం రాజ్యంలో సంస్థానాలు, జాగీ ర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, పటేల్, పట్వా రీ వ్యవస్థలు రైతుకూలీలను పీల్చి పిప్పిచేశాయి. నిజాంకు వ్యతిరేకంగా రైతుకూలీల సాయుధపోరు సొంత భూమి లేని సాదాసీదా జనం జీవితాంతం వెట్టిచేయాల్సిన పరిస్థితి. న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు పటేల్, పట్వారీల చేతుల్లో ఉండటంతో జనమంతా బాంచెన్ దొరా.. కాల్మొక్తా.. అంటూ బతికిన దుస్థితి. అయితే దేశ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, ఆంధ్ర మహాసభలు తెచ్చిన చైతన్యం సాయుధ రైతాంగ పోరాటానికి దారితీసింది. ఖాసీంరజ్వీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రజాకార్ల ఆగ డాలపై.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జనం తిరుగుబాటు మొదలైంది. భారత సైన్యాలను ఎదుర్కొనేందుకు రజాకార్లకు తర్ఫీదునిస్తున్న ఖాసీంరజ్వీ 1946 జూలై 4న అప్పటి నల్లగొండ జిల్లా కడవెండిలో విసునూరు దేశ్‌ముఖ్ ఇంటిమీదుగా వెళ్తున్న జులూస్పై దేశ్ ముఖ్ పేల్చిన తూటాలకు దొడ్డి కొమురయ్య హతమయ్యాడు. అది తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటానికి నాంది పలికింది. 4వేల మంది రక్తతర్పణతో 3వేల గ్రామాలు కమ్యూనిస్టుల ప్రజారక్షక దళాల అధీనంలోకి వెళ్లాయి. భారత ఉపప్రధాని వల్లభ్‌బాయ్‌పటేల్ ముందు లొంగిపోతున్న ఉస్మాన్‌అలీఖాన్ ఇదీ హైదరాబాద్ స్టేట్ ప్రస్తుత మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బని, ఉస్మానాబాద్, కర్ణాటకలోని రాయచూర్, బీదర్, గుల్బర్గా (కలబుర్గి), తెలంగాణతో కలిపి మొత్తం 83 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో.. దేశంలోనే అతిపెద్ద సంస్థానంగా ఉండేది. నిజాం.. ప్రపంచ కుబేరుడు మీర్ ఉస్మా న్ అలీఖాన్.. హై దరాబాద్ స్టేట్ విలీనం నాటికి ప్రపంచ ధనవంతుల్లో నంబర్‌వన్. 1937 ఫిబ్ర వరిలో టైమ్ మేగజైన్ అలీఖాన్ కవర్‌పేజీతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అప్పట్లోనే నిజాం సంపద విలువ రూ. 660 కోట్లుగా పే ర్కొంది. గోల్కొండ వజ్రాల గనులతో పాటు వివిధ సంస్థానాల నుంచి వచ్చే ఆదాయాలతో ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ కుబేరుడయ్యాడు. జాకబ్ వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా వాడేవాడు. ఉస్మాన్‌అలీఖాన్ ధరించిన.. విలువైన రాళ్లు పొదిగిన ఈ కత్తి విలువ అప్పట్లోనే 2 లక్షల డాలర్లు ఆయనకు హైదరాబాద్ చుట్టూరా 23 వేల ఎకరాల (సర్ఫెకాస్) భూములతోపాటు దేశంలోని వి«విధ ప్రాంతాల్లో 600కుపైగా విల్లాలు, విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే చౌమహల్లా, ఫలక్‌నుమా, చిరాన్‌పోర్ట్, నజ్రీబాగ్, పరేడ్ విల్లా ఫెర్న్‌విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్ ప్లజెంట్ విల్లాలు ఉస్మాన్‌అలీఖాన్ సొంతం. 173 రకాల బంగారు, వజ్రాభరణాలతో నిజాం ఖజానా ఉండేది. ఉస్మాన్ అలీఖాన్ కుటుంబం: లొంగుబాటుకు ముందు కుమారులు, కోడళ్లతో ఉస్మాన్ అలీఖాన్ ఎవరీ నిజాంలు? 1724లో స్వతంత్రుడిగా ప్రకటించుకున్న ఖమ్రుద్దీన్‌ఖాన్ దక్కన్లో అసఫ్‌జాహీ రాజ్యానికి నిజాం కాగా, 1948 సెస్టెంబర్ 17న భారత సైన్యాలకు లొంగిపోయిన ఉస్మాన్ అలీఖాన్ చివరివాడు. భారత్‌లో విలీనం అనంతరం ఉస్మాన్ అలీఖాన్ ఏటా రూ.50 లక్షల రాజభరణం పొందుతూ 1956 వరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఉస్మాన్ అలీఖాన్ మనవళ్లు ముఖర్రం జా, ముఫకం జా లండన్‌లో స్థిరపడి.. ఏటా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కుటుంబమిదీ.. భార్య: ఆజం ఉన్నీసాబేగం కుమారులు: ఆజం జా, మౌజం జా, కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం ఆజంజా కుటుంబం: భార్య దుర్రేషెవార్(టర్కీ), వారసులు ముఖర్రం జా, ముఫకం జా మౌజంజా కుటుంబం: భార్యలు నిలోఫర్ (టర్కీ), రజియాబేగం, అన్వరీబేగం. వారసులు ఫాతిమా, ఫాజియా అమీనా, ఓలియా, శ్యామత్ అలీఖాన్ -
September 17th: విమోచన కాదు, సమైక్యత!
ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 17కు ముందు మొదలయ్యే చర్చ ఈసారి మరింత తీవ్రమైంది. హైదరాబాద్ విమోచనా దినంగా ఏడాది పొడవునా సంబరాలు జరుపుతామని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఐక్యతా విగ్రహం’ పేరిట భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాన్ని విముక్తి విగ్రహం అని ఎందుకు అనలేదు? సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరితో ముస్లిం జనాభాను రెచ్చగొట్టవచ్చు. కానీ పాత గాయాలను మర్చిపోవడంలో, రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. అందుకే విలీనమా, విమోచనా అనే ప్రశ్నలను దాటి సమైక్యత అనే సమాధానం దగ్గర స్థిరపడటమే ఇప్పుడు మనకు కావలసింది! తెలంగాణలో సెప్టెంబర్ 17... ఆరెస్సెస్/ బీజేపీ చుట్టూ సమీకృతమవుతున్న హిందుత్వ శక్తులకూ, విస్తృతార్థంలో ఉదార ప్రజాస్వామ్య వాదులైన ఇతరులకూ మధ్య రాజకీయ వివాదం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజును హైదరాబాద్ విమోచనా దినంగా నిర్ణయించడంతో పాటు, 2023 సెప్టెంబర్ 17 వరకు ఏడాది పొడువునా సంబరాలు జరుపుతామనడంతో ఈసారి ఆరోజు మరింత స్పర్థాత్మకంగా మారింది. బహుశా ఆ పార్టీ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన దినంగా భావిస్తూం డవచ్చు. అదే సమయంలో ఆరెస్సెస్/బీజేపీ జాతీయ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి, జాతీయ సమైక్యతా దినాన్ని సెప్టెంబర్ 16 నుంచి ఏడాదిపాటు జరుపుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరెస్సెస్/బీజేపీ తొలినుంచీ నిజాం పాలనను రాచరిక పాలనగా కాకుండా హిందువులపై ముస్లింల పాలనగా చూస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ దూకుడుతో కూడిన ముస్లిం వ్యతిరేక వైఖరి నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజును జాతీయ సమైక్యతా దినంగా అధి కారికంగా జరపాలని నిర్ణయించింది. మోదీకి వ్యతిరేకంగా తనను తాను జాతీయ నేతగా కేసీఆర్ ప్రదర్శించుకుంటున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పిలుస్తున్న కమ్యూనిస్టులను పట్టించుకునే వారే లేరు. జునాగఢ్ సంస్థానాన్ని అక్కడి ముస్లిం పాలకుడు మూడవ ముహమ్మద్ మహబత్ ఖాన్జీ పాకిస్తాన్లో కలిపేస్తున్నట్లు ప్రకటించి, చివరకు పాకిస్తాన్‌కు పారిపోయాడు. దీంతో భారతదేశంలో విలీన మైన చిట్టచివరి రాష్ట్రంగా జునాగఢ్ నిలిచింది. కానీ ఆరెస్సెస్/బీజేపీ కూటమి దీని గురించి ఎంతమాత్రమూ మాట్లాడటం లేదు. నాడు దేశ ఉప ప్రధానిగానూ, హోంమంత్రిగానూ ఉన్న సర్దార్ పటేల్ నిర్ణయా త్మకమైన నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనం కావడంపై పూర్తి స్థాయి చర్చ జరగాల్సి ఉంది. కశ్మీర్ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన నేపథ్యంలో జాతీయ సమైక్యత అంశంపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవ సరం ఉంది. దేశం నడిబొడ్డున భంగకరమైన సంస్థానాన్ని వదిలేయ కుండా భారతదేశం ప్రస్తుత రూపంలోని రాజ్యాంగబద్ధమైన యూని యన్‌గా 1948 సెప్టెంబర్ 17 నుంచి ఉనికిలోకి వచ్చింది. భారత యూనియన్‌లో కశ్మీర్ 1947 అక్టోబర్ 27న చేరిందని అందరికీ తెలిసిన సత్యమే. వాస్తవానికి కశ్మీర్, హైదరాబాద్ సంస్థా నాలు స్వతంత్ర దేశాలుగా ఉండాలని అనుకోగా, జునాగఢ్ రాజు పాకిస్తాన్‌తో కలిసిపోవాలని నిశ్చయంగా కోరుకున్నాడు. సర్దార్ పటేల్, ఆనాడు హోంశాఖ కార్యదర్శిగా ఉన్న వీపీ మీనన్ నిర్వహిం చిన దౌత్య చర్చల ఫలితంగా మిగిలిన సంస్థానాలు భారత్‌లో విలీన మయ్యాయి. సంప్రదింపులు జరిపే సామర్థ్యంలో మీనన్ ప్రసిద్ధుడు. కశ్మీర్ అనేది హిందూ రాజు ఏలుబడిలోని ముస్లింలు మెజా రిటీగా ఉన్న రాజ్యం. అదే హైదరాబాద్‌లో హిందువులు మెజారిటీగా ఉండగా, ముస్లిం రాజు పాలనలో ఉండేది. దేశ విభజన సందర్భంగా భారత్ నుంచి పశ్చిమ పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత కశ్మీర్, హైదరాబాద్‌లను భారత యూనియన్‌లో కలుపుకోవడంపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండేది. దేశం లోపల గానీ, సరిహద్దుల మీద గానీ ఇతర దేశాలు లేకుండా భారత్ ఒక సార్వభౌ మాధికార, స్వతంత్ర దేశంగా ఇలాంటి సమైక్యత ద్వారానే ఉనికిలో ఉండగలుగుతుంది. కశ్మీర్ భారత సరిహద్దులోని సమస్యాత్మక ప్రాంతంగా కనిపించగా, హైదరాబాద్ సంస్థానం కేంద్రానికి మరింత పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్య పట్ల నెహ్రూ, పటేల్ చాలా తీవ్ర దృష్టితో ఉండేవారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కాకపోయి నట్లయితే, భారతదేశానికి అర్థమే మారిపోయి ఉండేది. ఆరెస్సెస్ కూడా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి అలాంటి విలీనమే జరగాలని కోరుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ సంస్థానాన్ని తన సాయుధ పోరాటానికి ప్రయోగాత్మక స్థావరంగా చేసుకుంది. హైదరాబాద్ ముస్లిం సంస్థానం కాబట్టి ఆరెస్సెస్ దాని మనుగడకే వ్యతిరేకంగా ఉండేది. కానీ ఆరోజుల్లో ఆరెస్సెస్ గుర్తించదగిన శక్తిగా ఉండేది కాదు. ప్రారంభం నుంచీ వారి జాతీయవాదం ముస్లిం వ్యతిరేక ఎజెండా చుట్టూనే తిరుగుతుండేది. భౌగోళికంగా ఐక్యమైన, పాలనకు అనువైన దేశాన్ని పాలక పార్టీగా కాంగ్రెస్ కోరుకుంది. పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యాకే అలాంటి దేశం ఏర్పడింది. కశ్మీర్, జునా గఢ్, హైదరాబాద్ సంస్థానాల్లో అనేక మరణాలు, హింసకు దారి తీసేటటువంటి బలప్రయోగం జరపడం కేంద్ర ప్రభుత్వానికి అవసర మైంది. అది పూర్తిగా మరొక గాథ! ప్రతి సంవత్సరం ఈ అంశంపై ఆరెస్సెస్/బీజేపీ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుండటంతో, చాలాకాలం ఊగిసలాట తర్వాత టీఆర్ఎస్ ఈసారి ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య పెరిగిన విభేదాలతో 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపును ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిపోయింది. సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరిని చేపడితే తెలంగాణలోని 15 శాతం ముస్లిం జనాభాను రెచ్చగొట్టి, వారిని లక్ష్యంగా చేసుకుని వేధించవచ్చు. అయినా 1948 సెప్టెంబర్ 17న ఏం జరిగిందని? భారత యూనియన్‌లోకి మరో సంస్థానం విలీన మైంది. అంతే కదా! ‘ఐక్యతా విగ్రహం’ పేరిట గుజరాత్లో భారీ సర్దార్ పటేల్ విగ్ర హాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రతిష్టించారు. జునాగఢ్, హైదరా బాద్, కశ్మీర్‌లను విశాల భారత్‌లో ఐక్యం చేయడానికి బాధ్యుడు పటేల్. మరి ఆయన విగ్రహానికి విముక్తి విగ్రహం అని ఎందుకు పేరు పెట్టలేదు? మరే హోంమంత్రి అయినా ఇతర సంస్థానాలను సుల భంగా విలీనం చేసేవారు. కానీ ఈ మూడు సమస్యాత్మక సంస్థానా లను విలీనం చేయడంలోనే పటేల్ గొప్పతనం ఉంది. ఈ ఒక్క కారణం వల్లే కాంగ్రెస్ శిబిరం నుంచి సర్దార్ పటేల్‌ను లాగి, ఆయనను ఆరెస్సెస్/బీజేపీ తమ ఘన చిహ్నంగా రూపొందించు కున్నాయి. నెహ్రూ లాగా వంశపారంపర్య సమస్యలు ఏమీ లేని అతి పెద్ద శూద్ర వ్యవసాయ నేపథ్యం కలిగిన వాడు కాబట్టే పటేల్ చుట్టూ రాజకీయ, ఆర్థిక పెట్టుబడిని ఆరెస్సెస్/బీజేపీ ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు, ఇతర పార్టీలు ఒక సామూహిక సంక ల్పంతో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపు కోవడమే సరైనది. అప్పుడు మాత్రమే ఈ సమస్య చుట్టూ ఉన్న మత పరమైన ఎజెండాను సామూహికంగా పాతరేయవచ్చు. హైదరాబాద్ చేరిక ఒప్పందంపై ఇరువురూ సంతకాలు చేశాక సర్దార్ పటేల్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న చక్కటి ఫొటోగ్రాఫ్ కనబడుతుంది. పైగా జునాగఢ్ పాలకుడిలా కాకుండా, ఉస్మాన్ అలీఖాన్ భారత్‌లోనే చివరివరకూ ఉండిపోయారు. ఆయన గానీ, ఆయన కుటుంబం గానీ పాకిస్తాన్ పట్ల ఎన్నడూ విశ్వాసంతో లేరు. ఆయన కుటుంబ ఆస్తిలో చాలా భాగాన్ని భారత యానియన్‌కే ఇచ్చేశారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైన హైదరాబాద్ హౌజ్ కూడా భారత ప్రభుత్వానికి నిజాం ఇచ్చిందే. అమృతోత్సవాలుగా పిలుస్తున్న ఈ కాలంలోనూ నిజాంనూ, ముస్లిం సమాజాన్నీ దూషించడం ఎందుకు? పాత గాయాలను మర్చిపోవడంలో రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. జాతీయవాదం అంటే స్వాతంత్య్ర పూర్వ కాలపు గాయాలను మళ్లీ కెలికి, వాటిపై కారం పూయడం కాదు. జాతీయవాదం అంటే ప్రజలు నిత్యం కొట్టుకునేలా చేయడం కాదు. ఈ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపుకొందాం. సర్దార్ పటేల్‌కూ, ఆనాటి సమరంలో అన్ని వైపులా మరణించిన అమరులకు నివాళులు అర్పిద్దాం. - ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త) -
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మేడ్చల్ జిల్లా: స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు బూర్గుల నర్సింగరావు (89) సోమవారం తెల్లవారుజామున కేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుం డె సంబంధిత సమస్యలతో పాటు కరోనాకు చికిత్సకోసం వారం క్రితం ఆయనను హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచా రు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. బూర్గుల నర్సింగరావు విద్యార్థి దశలో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. సీపీఐ హైదరాబాద్ జిల్లాకమిటీ సభ్యుడిగా కీలకపాత్ర పోషించారు. ముంబైలోని సీపీఐ కార్యాలయంలో కూడా ఆయన పని చేశారు. అలాగే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షుడిగా పని చేశారు. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు బి.వెంకటేశ్వరరావు కుమారుడే నర్సింగరావు. 1932 మార్చి14న ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో ఆయన జన్మించారు. రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో ముందుండి పోరాడారు. 1955లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) మొదటి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 1959 వరకు బాధ్యతలు నిర్వహించారు. సొంతూరు బూర్గులలో రైల్వేస్టేషన్ ఏర్పాటులో కీలకపాత్ర పోషిం చారు. ఊర్లో స్కూల్ స్థాపనకు భూమిని విరాళంగా ఇచ్చారు. ఆయనకు భార్య డాక్టర్ మంజూత, కుమార్తె మాళవిక, కుమారులు అజయ్, విజయ్‌లున్నారు. సీఎం సంతాపం తెలంగాణ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో పాటు, తొలి.. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో నర్సింగరావు పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. బూర్గుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రులు, ప్రముఖుల సంతాపం బూర్గుల మృతి పట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం ప్రకటించారు. అలాగే సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల ట్రస్టు కార్యదర్శి కందిమల్ల ప్రతాపరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సంతాపం తెలిపారు. ఈ నెల 21న మఖ్దూంభవన్‌లో సంతాప సభ నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర సమితి ప్రకటించింది. బూర్గుల భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ నేత నారాయణ, (ఇన్సెట్) -
అదే నిజమైన నివాళి
ఏడవ నిజాం నవాబు హయాంలో జమీందారు, జాగీ ర్దార్, దేశ్‌ముఖ్, పటేల్, పట్వారి, భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది. ఖాసీంరజ్వీ నాయకత్వాన నిజాం నవాబ్ రాజ్యాన్ని నిలబెట్టేందుకు మతపరమైన విషప్రచారం చేసేం దుకు రజాకార్లు ప్రయత్నం చేశారు. గ్రామాల మీద భూస్వాములతో కలిసి ప్రజ లను లూటీలు, హత్యలు చేశారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్ రాజధానిగా ఉన్నందున నిజాం నవాబు అధికార భాష ఉర్దూగా ఉండేది. అప్పుడు తెలుగులో విద్యాభ్యాసం, పాఠశాలలు ఉండాలనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితులలో మెదక్ జిల్లా జోగిపేటలో 1931లో తొలి ఆంధ్ర మహాసభ ఆవిర్భవించింది. దాని ప్రధాన తీర్మానాలు తెలుగులో విద్యా బోధన, గ్రంథాలయాల ఏర్పాట్లు జరగాలి. ఆ తర్వాత అనేక మహాసభలు జరి గాయి. భువనగిరిలో జరిగిన 15వ ఆంధ్రమహాసభ నూతనత్వాన్ని సంతరించుకున్నది. దున్నేవాడికే భూమి కావాలని, వెట్టిచాకిరి రద్దు, తెలుగులో విద్యా బోధన అందుబాటులో రావాలని, గీసే వాడికే తాడిచెట్టు, దున్నేవాడిదే భూమి అనే విప్లవాత్మకమైన నినాదాలు ప్రజలను ఆకర్షించగలిగాయి. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు గెరిల్లా పోరాటానికి రూపకల్పన చేశాయి. ఉద్యమ నేపథ్యంలో 3,000 గ్రామాలు విముక్తి అయ్యాయి. 10 లక్షల ఎకరాల భూములు పేదల స్వాధీనంలోకి వచ్చాయి. అయితే బ్రిటిష్ వారితో సంప్రదింపులు చేస్తుండగానే 15 ఆగస్టు 1947న దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. నిజాం నవాబ్ హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుం దని ప్రకటించుకున్నాడు. కేంద్ర ప్రభుత్వంతో నవాబు రాయబారాలు సాగిస్తూనే, మరోవైపు ఉద్యమాన్ని అణచడానికి వినూత్న పద్ధతుల్లో ప్రయత్నించాడు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మాఖ్దూం మొహియుద్దీన్ సెప్టెంబర్ 11న రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపు ప్రభంజనం అయింది. ఎట్టకేలకు 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అనేక తర్జనభర్జనల పిదప 1951, అక్టోబర్ 21న సాయుధ పోరాటం విరమించారు. 1952లో హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జైళ్ళలో ఉన్నా కమ్యూనిస్టు యోధులకు బ్రహ్మరథం పట్టి భారీ మెజారిటీతో గెలి పించారు. జవహర్లాల్ నెహ్రూకంటే అత్యధిక మెజారిటీతో నల్లగొండ నుండి రావి నారాయణరెడ్డిని గెలి పించి తెలంగాణ ప్రజలు భారతదేశాన్నే ఆశ్చర్యపరిచారు. ఇంతటి త్యాగాలు, వేలాదిమంది ఆత్మార్పణం, రక్తపాతం పిదప కూడా బూర్జువా పాలకులు చరిత్రను కనుమరుగు చేయ ప్రయత్నిం చారు. త్యాగాలు కమ్యూనిస్టులవి, భోగాలు బూర్జువా పాలకులవిగా మారాయి. అరచెయ్యి అడ్డుపెట్టి సూర్యకాంతి ఎలాగైతే ఆపలేరో తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలు ఎవరు కనుమరుగు చేయజాలరు. అలనాటి సాయుధ పోరాట త్యాగాలను మెచ్చుకున్న కేసీఆర్ ఈనాడు ఈ ఊసే ఎత్తడం లేదు. సాయుధ పోరాట యోధుల త్యాగాలను శాశ్వతం చేయడానికి కనీసం ఆలోచించడం లేదు. ఆత్మగౌరవ పరిపాలన కనుచూపు మేరలో కనబడటం లేదు. కేంద్రంలో బీజేపీ మరింత మతోన్మాద చర్యలకు పాల్ప డుతున్నది. మరోవైపు కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణకు పెద్ద పీట వేస్తున్నది. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా అణగారిన ప్రజలు ఐక్యమై ప్రజారాజ్యాన్ని స్థాపించేందుకు సన్నద్ధం కావాలి. అదే ఉద్యమకారులకు ఇచ్చే నిజమైన నివాళి. వ్యాసకర్త :చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
ఇది ఓ తిరుగుబాటు ఆత్మకథ
తెలంగాణ సాయుధపోరాటం నుంచి తనను విడదీసి చూడలేనంతగా మమేకమైనవాడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి. భూమి భుక్తి విముక్తికోసం తెలంగాణ ఎర్రసెలకల్లో పుట్టిన మహత్తర పోరాటమది. ‘దున్నేవానికే భూమి’ అన్న నినాదంతో 4000 మంది వీరులు నెత్తురు ధారవోసిన మహాజ్వల సాయుధ పోరాట ఘట్టమది. వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం ఎగిసిపడి దొరగడీలను నేలకూల్చిన పోరు అది. భూస్వామ్య జాగీర్ధారీ వ్యవస్థలను అల్లకల్లోలంచేసిన చీమలదండులు సాగించిన మహత్తర తెలంగాణ సాయుధపోరాటమది. రైతాంగ తిరుగుబాటును ఒక మలుపు తిప్పి ఆయుధ పోరాటానికి శ్రీకారం చుట్టిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి వీర గాధకు ప్రాణంపోస్తూ 2007 సంవత్సరంలో ఒక డాక్యుమెంటరీ వెలువడింది. వీర తెలంగాణ సాయుధపోరాట యదార్థగాథను, ఈ నేలమీద సాగిన సాహసపోరాటగాథను భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఈ డాక్యుమెంటరీలో వ్యక్తంచేశారు. సుమారు 9 గంటలపాటు సాగిన ఆయన సంభాషణను 45 నిమిషాలకు ఎడిటింగ్చేసి శ్రోతల ముందుకు తెచ్చారు. సామాన్యులే చేసిన అసమాన్య పోరాటం ఎట్లా కొనసాగిందో యుద్ధవీరుడైన భీమిరెడ్డి నర్సింహారెడ్డి కళ్లకు కట్టినట్లు వివరించారు. పాత నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని కరివిరాల కొత్తగూడెం మట్టిలో పురుడు పోసుకున్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఆర్యసమాజ కార్యకర్తనుంచి కమ్యూనిస్టుగా మారిన తీరు సింహంలా తుపాకి పట్టుకుని పోరాడిన తీరు మొత్తంగా డాక్యుమెంటరీలో కనిపిస్తుంది. నంగినంగి వొంగివొంగి బాంచన్ దొరా నీకాల్మోక్తా అన్న మూగజీవాలు ఎట్లా ఎదురుతిరిగి పోరాడారో అందులో చూస్తాం. సూర్యాపేట నుంచి జనగామదాకా, జనగామ నుంచి జగిత్యాల దాకా ఈ విప్లవాగ్నులు ఎలా ప్రజ్వరిల్లాయో ఈ డాక్యుమెంటరీ ద్వారా చూడవచ్చును. చాకలి ఐలమ్మ బువ్వగింజలు పోరాటానికి శ్రీకారం చుడితే కడివెండి దొరగడీని, ఆ దొర అనుయాయులను తరిమికొట్టిన సాహసి భీమిరెడ్డి ఆనాటి అనుభవాలు ఇందులో చూడవచ్చు. వీర తెలంగాణ సాయుధపోరాటం 1944–1951 కాలంలోని సమగ్రపోరు రూపంకు ప్రాణంపోసిన తీరు ఈ డాక్యుమెంటరీలో ఉంది. ఈ భూపోరాటమే దేశంలో భూసంస్కరణలకు ప్రాణంపోసింది. ఈ డాక్యుమెంటరీ బీఎన్ జీవిత విశేషాలను కూడా కళ్లకుకట్టింది. ఆయన తెలంగాణ భూపోరాటానికి తొలికేక. గెరిల్లా సైన్యం దళపతి. ఆయనే కామ్రేడ్ బి.ఎన్.గా పిలువబడే భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఆయనను యాది చేసుకోవడమంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మననం చేసుకోవడమే. 1922లో నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం, కరివిరాల కొత్తగూడెం గ్రామంలో జన్మించారు బీఎన్. బాల్యం నుంచే గొంతెత్తి కమ్మగా పాడేవాడు. అప్పుడు 8వ తరగతిలో వున్నాడు. ఓ పక్క వందేమాతరం ఉద్యమం, మరోపక్క ప్రపంచ యుద్ధం ఆయనలోని విప్లవకారుడ్ని తట్టి లేపాయి. ఆంధ్రమహాసభతో అనుబంధం పెంచుకున్నాడు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా గళమెత్తాడు. లెవీ పేరుతో రైతుల తిండిగింజలు దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులకు నిరసనగా జరిగిన 70 కిలోమీటర్ల రైతుల పాదయాత్రలో పాల్గొన్నాడు. దేశ్‌ముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి దౌష్ట్యాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో తొలిసారిగా దెబ్బలు రుచి చూశాడు. 1946 జూలై 4వ తేదీన జనగాం తాలూకా కడవెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య ఆహుతయ్యాడు. దీంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనివార్యమైంది. చాకలి అయిలమ్మ తిరుగుబాటు, విసునూరి గడికి నిప్పంటుకునేలా చేసింది. 1947 ప్రారంభంలో కళాశాల విద్యార్థులు ‘క్విట్ కాలేజి’ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం మిలిటరీని రంగంలోకి దించింది. దీంతో గెరిల్లా పోరాటం అనివార్యమైంది. బీఎన్ గెరిల్లా దళపతి అయ్యాడు. పాత సూర్యాపేట, దేవరుప్పుల, ఆలేరు, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో మిలిటరీకి చెమటలు పట్టించాడు. రావులపెంట, కోటపాడు, దివ్వెల గ్రామాల్లో జరిపిన దాడుల ద్వారా సేకరించిన ఆయుధాలతో సాయుధ పోరాటం కొనసాగించాడు. 1945–46లో మొండ్రాయి ప్రాంతంలో కడారు రాంచందర్‌రావు జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, అలాగే 1946 దేవరుప్పల పోరాటం, బాలెం గ్రామంలో జరిగిన బాహాబాహీ పోరాటం బీఎన్ సమర్థ నాయకత్వానికి మెచ్చుతునకగా చెప్పొచ్చు. 1947 నవంబర్‌లో భారత్ ప్రభుత్వం నిజాం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని రైతాంగ పోరాట అణచివేతకు మిలిటరీ బలాన్ని అందించేది. దీంతో దున్నేవాడిదే భూమి పేరుతో రైతాంగ సాయుధ పోరాటం ముమ్మరమైంది. సెప్టెంబర్ 18న నిజాం లొంగిపోవడంతో పోరాటం కొనసాగించాలా, లేక ఆపాలా? అన్నదానిపై కమ్యూనిస్టు పార్టీలో భేదాలు తలెత్తాయి. బీఎన్ మాత్రం పోరాటం వైపుకే మొగ్గు చూపాడు. ‘బండెనక బండి గట్టి, పదహారు బండ్లుగట్టి, ఏ బండ్లే పోతివి కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి’ అంటూ పాట రాసిన యాదగిరి ఆయన దళం సభ్యులే. పాలకుర్తి అయిలమ్మ ఘటనకూ నాయకుడు బీఎన్. అయిలమ్మ పంటకు రక్షణగా నిలబడి, విసునూరు దేశ్‌ముఖ్ గూండాలతో తలపడి, ఆరెకరాల పంటను ఆమె ఇంటికి చేర్చిన యోధుడు ఆయన. తెలంగాణలో యూనియన్ సైన్యాలు ప్రవేశించిన నేపథ్యంలో పోరాటాన్ని ఎలా కొనసాగించాలో చర్చించేందుకు సూర్యాపేట తాలూకా పాతర్లపాడు సమీపంలోని చిట్టడవిలోని కొండలమధ్య ఏరియా కమిటీ సమావేశం జరుగుతోంది. సుందరయ్య మాట్లాడుతున్నారు. ఇంతలో సెంట్రీ నుంచి ‘పోలీస్’ అన్న కేక. దాని వెనుకే తుపాకీ శబ్దం. ఆ శబ్దాన్ని బట్టే గ్రహించాడు బీఎన్. వచ్చింది పోలీసులు కాదు, అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన యూనియన్ సైన్యాలనీ. వ్యూహాత్మకంగా కాల్పులకు దిగకుండా తన రక్షణ వ్యవస్థకు ఆదేశాలిస్తూనే ఒక్కుదుటున గుహలోకి దూకి, నిద్రలో ఉన్న తన పసిబిడ్డను తీసుకొని చాకచక్యంగా నాయకులతో సహా అందరినీ శత్రువలయం నుంచి సురక్షితంగా తప్పించాడు. తెలంగాణలో సాయుధపోరాటానికి మొట్టమొదట ఆయుధ మెత్తిందీ, చిట్టచివర ఆయుధం దించిందీ బిఎనే. సీపీఐ(ఎం) నల్ల గొండ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, అఖిల భారత ఉపాధ్యక్షునిగా సుదీర్ఘకాలం పని చేసిన బీఎన్ మొదట పీడీఎఫ్, ఆ పైన సీపీఐ(ఎం) తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. బీబీనగర్–నల్లగొండ రైల్వే లైన్, శ్రీరాంసాగర్ రెండవదశ కాల్వల నిర్మాణాలు ఆయన పోరాట ఫలితంగా వచ్చినవే. కమ్యూనిస్టు నేతగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా పేరొంది, 2008లో కన్ను మూసేనాటికి తనకంటూ ఒక్క పైసా కూడా మిగుల్చుకోని ఓ నిరుపేద, నిస్వార్థ నాయకుడు బీఎన్! నాగలిపట్టిన రైతుచేతికి రైఫిల్ ఎలా వచ్చిందో బీఎన్ డాక్యుమెంటరీ చూస్తే అర్థం అవుతుంది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఈ డాక్యుమెంటరీలో అనేక అనుభవాలను చెప్పారు. కడివెండి, ముండ్రాయి, కోటపాడు, పాతసూర్యాపేట బాలెంల అనుభవాలు, ఆనాటి మిగిలివున్న తన సహచరులను గుర్తుచేస్తున్న దృశ్యాలు ఇందులో చూడవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే భీమిరెడ్డి సైద్ధాంతికతను చెప్పే తాత్వికుడు కాదు. యుద్ధ భూమిమీద నిలిచిన యోధుడు. వ్యాసకర్త: ఎ. రజాహుస్సేన్, రచయిత, సాహిత్య విమర్శకుడు 90631 67117 -
మా భూమి @ 40
ఇండస్ట్రీ కొన్నిసార్లు మూస దారిలో ప్రయాణిస్తుంటుంది... అదే రహదారని భ్రమపడేంత. కొన్నిసార్లు ఆ దారిని ఏమాత్రం లెక్క చేయకుండా.. కొత్త దారుల్ని వెతుక్కుంటూ కొన్ని సినిమాలు వెళ్తాయి. ‘పాత్ బ్రేకింగ్’ సినిమాలంటాం వాటిని. 40 ఏళ్ల క్రితం చేసిన అలాంటి ప్రయత్నమే ‘మా భూమి’. ఫలితం – ప్రభంజనం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మా భూమి’. తెలుగు సినిమాల్లో సంచలనాలను ప్రస్తావించాల్సినప్పుడల్లా ‘మా భూమి’ని నెమరువేసుకుంటూనే ఉన్నాం. ఇవాళ మళ్లీ గుర్తు చేసుకుందాం. నేటితో ‘మా భూమి’ 40ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి వంద విశేషాలు ఉంటాయి. కానీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమైన 40 విశేషాలు మీకోసం. ► కిషన్ చందర్ రాసిన ‘జబ్ ఖేత్ జాగే’ అనే ఉర్దూ నవల ఈ సినిమాకు స్ఫూర్తి. ► ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ సలహా మేరకు గౌతమ్ – ఘోష్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ► దర్శకుడు గౌతమ్ ఘోష్‌కి ఇదే తొలి సినిమా. ► నవల ఆధారంగా గౌతమ్ ఘోష్ ఓ కథను రాసుకొచ్చారు. కానీ నిర్మాతలకు అంతగా నచ్చలేదు. మళ్లీ తెలంగాణాలో పలు ప్రాంతాలు సందర్శిస్తూ ఈ కథను రాసుకున్నారు. ► ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడు త్రిపురనేని సాయిచంద్ ఈ సినిమా ద్వారానే పరిచయమయ్యారు. ► ఈ సినిమాను నిర్మించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను అందించారు బి. నర్సింగరావు. ► ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో ఈ సినిమాకు నంది అవార్డులు వరించాయి. ► కార్వే వారీ ప్రపంచ చలన చిత్రోత్సవాల్లో మన దేశం తరఫున అధికారికంగా ఎంపికయిన చిత్రం ‘మా భూమి’. ► సీఎన్ఎన్– ఐబీఎన్ తయారు చేసిన ‘వంద అత్యుత్తమ భారతీయ చిత్రాల’ జాబితాలో ‘మా భూమి’ చోటు చేసుకుంది. ► ఈ సినిమా చిత్రీకరణ చాలా భాగాన్ని మెదక్ జిల్లాలోని మంగళ్పర్తిలో చేశారు. అది బి. నరసింగరావుగారి అత్తగారి ఊరే. ► లక్షన్నర బడ్జెట్ అనుకుని మొదలయిన ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఐదున్నర లక్షలయింది. ► ఈ సినిమాకు గౌతమ్ ఘోష్ భార్య నిలాంజనా ఘోష్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. ► ఈ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను దర్శకుడు గౌతమే స్వయంగా చూసుకున్నారు. ► పాపులర్ నటి తెలంగాణ శకుంతల ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ► కేవలం ఉదయం ఆటగానే ప్రదర్శించేట్టు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. విడుదల తర్వాత హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో ఏడాది పాటు నిర్విరామంగా ఆడింది. ► ప్రజాగాయకుడు గద్దర్ తొలిసారి స్క్రీన్ మీద కనిపించిన చిత్రం ఇదే. ► తెలంగాణ పల్లె జీవితం ఎలా ఉండాలో అర్థం చేసుకోవడానికి గౌతమ్, నర్సింగరావు తెల్లవారగానే పల్లెలోకి వెళ్లి ఊరిలోని ప్రజలు ఎలా జీవిస్తున్నారో గమనిస్తూ ఉండేవారట. ► సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఇల్లును కుదవపెట్టారట నర్సింగరావు. ► సినిమాలో ఒక సన్నివేశంలో శవం దగ్గర ఏడ్చే సన్నివేశం ఉంది. కానీ ఆ సీన్లో యాక్ట్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదట. సుమారు మూడు నాలుగు ఊర్లు గాలించి పోచమ్మ అనే ఆవిడను తీసుకువచ్చి నటింపజేశారట. ► ఈ సినిమాలోని ‘బండెనక బండి కట్టి... పదహారు బళ్లు కట్టి..’ పాట చాలా పాపులర్. మొదట ఈ పాటను నర్సింగరావు మీద తీశారు. రషెష్ చూసుకున్న తర్వాత నా కంటే గద్దర్ మీద చిత్రీకరిస్తే బావుంటుంది అని సూచించారు నర్సింగరావు. ► మా భూమి చిత్రాన్ని మార్చి 23నే విడుదల చేయాలని దర్శక–నిర్మాతల ఆలోచన. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను ఉరి తీసింది మార్చి 23వ తేదీనే. ఆ రోజు విడుదల చేస్తే ఆ ముగ్గురికీ నివాళిలా ఉంటుందని భావించారట. ► సినిమా పూర్తయి సెన్సార్‌కి నిర్మాతల జేబులు ఖాళీ అయిపోతే సహ నిర్మాత రవీంద్రనాథ్ పెళ్లి ఉంగరాలను తాకట్టుపెట్టి వచ్చిన రూ.700లతో సెన్సార్ జరిపించారు. ► సహజత్వానికి దగ్గరగా ఉండాలని సాయి చంద్ పాత్రకు ఊర్లోని వారి బట్టలను అడిగి తీసుకుని కాస్ట్యూమ్స్‌గా కొన్ని రోజులు వాడారు. ► ఈ సినిమా మొత్తాన్ని మూడు షెడ్యూల్స్‌లో 50 రోజుల్లో పూర్తి చేశారు. ► షూటింగ్స్, సెన్సార్ వంటి అవరోధాలన్నీ దాటినప్పటికీ ఈ సినిమాను కొనుగోలు చేయడానికి పంపిణీదారులెవ్వరూ ముందుకు రాలేదు. ఇదేదో రాజకీయ పాఠాలు చెబుతున్న సినిమాలా ఉందని కామెంట్ చేశారట. చివరికి లక్ష్మీ ఫిలింస్, శ్రీ తారకరామా ఫిలింస్ వారు ఈ సినిమాను విడుదల చేశారు. ► ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన రవీంద్రనాథ్, ఆయన భార్య సినిమా విడుదలైన మూడో రోజు సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లారు. కానీ వారికి కూడా టికెట్లు దొరకలేదట. ► ‘చిల్లర దేవుళ్లు’ తర్వాత సినిమా సంభాషణల్లో పూర్తి స్థాయి తెలంగాణ యాసను వాడిన సినిమా ఇదే. ► యూనిట్ దగ్గర ఉన్న కొత్త చీరలు, రుమాల్లు, పంచెలు గ్రామంలో వారికి ఇచ్చి వారి దగ్గర ఉన్న పాత బట్టలు తీసుకుని చిత్రీకరణ కోసం వినియోగించేవారట చిత్రబృందం. ► తొలుత ఈ సినిమాకు ‘జైత్రయాత్ర’ అనే టైటిల్‌ని పరిశీలించారట. భూమి కోసం పోరాటం జరుగుతుంది. ‘మన భూమి’ పెడితేనే బావుంటుందని నర్సింగరావు సూచించారట. ► సినిమాలో గడీను ముట్టడి చేసే సన్నివేశాల చిత్రీకరణకు ఆ గ్రామ ప్రజలు సహకరించలేదు. చివరికి వారి అనుమతి లేకుండానే చిత్రబృందం తయారు చేయించుకొని తెచ్చుకున్న తలుపును బద్దల కొట్టినట్టుగా షూట్ చేశారు. ► 1948లో హైదరాబాద్ రాష్ట్రంపై భారతప్రభుత్వం చేసిన సైనిక చర్యకు సంబంధించిన సన్నివేశాలనే సినిమాలో వినియోగించుకున్నారు. ∙పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నటీనటుల గాయాలకే రోజుకో ఐయోడిన్ సీసా ఖాళీ అయ్యేదట. ► చిత్రకారుడు తోట వైకుంఠం ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.. ఇదే తొలి సినిమా. ► దేవీప్రియ ఈ సినిమాకు పబ్లిసిటీ ఇన్చార్జ్గా పని చేశారు. ► ఈ సినిమాలోని ‘పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడా..’ పాటను సీనియర్ రచయిత సుద్దాల హనుమంతు రచించారు. ప్రస్తుతం ప్రముఖ గేయ రచయితగా కొనసాగుతున్న సుద్దాల అశోక్ తేజ ఆయన కుమారుడే. ► సినిమా చిత్రీకరిస్తున్న రోజుల్లో యూనిట్ మొత్తం మంగళ్ పర్తిలోనిæ బడిలో నివసించారు. ఆ పక్కనే ఉన్న బావి దగ్గర మగవాళ్లు స్నానాలు చేసేవారు. స్త్రీలేమో ఆ ఊర్లోని సంపన్న కుటుంబీకుల ఇంట్లోని స్నానాల గదులు వాడుకునేవారట. ► ఈ సినిమా నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. ► ఈ సినిమా నెగటివ్ పాడైపోవడంతో 2015 ప్రాంతంలో డిజిటలైజ్ చేసి డీవీడీ విడుదల చేశారు. ‘మాభూమి’ చిత్రంలో సాయిచంద్ సాయిచంద్, రమణి మాభూమి షూటింగ్ సందర్భంగా గద్దర్, దర్శకుడు గౌతమ్, బి.నరసింగరావు, నీలంబన ఘోష్ – గౌతమ్ మల్లాది -
మాట్లాడితే రూపాయి నోట్ల దండలు
‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా తుపాకి పట్టుకుని గెరిల్లాగా పాల్గొన్న యోధురాలు మల్లు స్వరాజ్యం. ఆ తరువాత మహిళా నాయకురాలిగా, ఎమ్మెల్యేగా’ పనిచేసిన 86 ఏళ్ల స్వరాజ్యం జీవిత కథను ‘నా మాటే తుపాకి తూటా’గా(కవర్ పేజీలో పొరపాటుంది) హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. దీన్ని విమల, కాత్యాయని కథనం చేశారు. అందులోని కొన్ని భాగాలు ఇక్కడ: ‘‘మా నాన్న వంటి భూస్వాములకు ఇంకా పెద్ద జాగీర్దార్లతో పోటీ ఉండేది. ఫలానా దొరల ఆడపిల్లలు గురుకులంలో చదువుతున్నారు, మనం కూడా వాళ్ల సాంప్రదాయంలో నడవాలె, వాళ్లంత పెద్దగా ఎదగాలె అనేటువంటిది ఉండేది. రేప్పొద్దున ఏమయినా జరిగితే– పురుషులు సమయానికి లేకపోవడమో, చనిపోవడమో జరిగితే, స్త్రీలు గూడా జమీందారీ నిర్వహించేట్టుగా తయారు కావాలనేది ఉండేది... అట్లా ఇంటి దగ్గరనే పంతుల్ని పిలిపించి ఆడపిల్లలకు చదువులు చెప్పించిన్రు... చదువు, ఈత, గుర్రపుస్వారీ వంటివి నేర్చుకున్నా.’’ ‘‘ఒక రోజున ఎల్లమ్మ అనేటామె వడ్లు దంచుతూ కళ్లు తిరిగి పడిపోయింది. నేనక్కడే కాపలాగా ఉన్నానప్పుడు. దబదబ నీళ్లు తీసుకపోయి తాపించినా. ఆకలైతున్నదని ఆమె చెప్పంగనే అన్నం తీస్కొచ్చి తిన్పించినా. దంచుతున్నవాళ్లు అందరూ మాక్కూడా ఆకలైతున్నది అన్నం పెట్టమని అడిగిన్రు. ఇంట్లో చూస్తే అంత అన్నం లేదు. బియ్యం తీసుకోని నానపెట్టుకుని తింటమన్నరు. మంచిది, తినమని చెప్పినా. ఆ తర్వాత ఈ సంగతి తెలిసి మా చిన్నాయనవాళ్లు తప్పు పట్టిన్రు. ‘‘అది చిన్నపిల్ల, ఏమనకండి’’ అని మా అమ్మ నాకు సపోర్టుగా నిలబడ్డది. అది నాకు చాలా స్ఫూర్తిని అందించింది. అప్పటికి మా అన్నయ్య (భీమిరెడ్డి నరసింహారెడ్డి) హైదరాబాదులో చదువుకుంటున్నడు. నాకప్పటికి ఆంధ్రమహాసభ ఉద్యమం గురించి ఏమీ తెల్వదు.’’ ‘‘ఆ రోజుల్లో బాగా చదువుకున్న ఆడవాళ్లు కూడా స్టేజిల మీదికెక్కి మాట్లాడ్డానికి వెనకాడుతుండిరి. నేను ఉపన్యాసాలిస్తుంటే, బాగా చదువుకున్న దాన్నేమోనని అనుకునేవాళ్లు. బి.ఏ. చదివిన్నని అనుకున్నరట. నిజానికి నా చదువు నాలుగో, ఐదో తరగతులు, అంతే. నా వయసు కూడా పద్నాలుగు, పదిహేనేళ్లకు ఎక్కువ లేదు. ‘ఆంధ్రదేశపు ముద్దుబిడ్డ’ అని పేరు పెట్టిన్రు నాకు. నేను ఉపన్యాసం ఇస్తుంటే పార్టీ నిధుల కోసమని నా మీదకు డబ్బులు ఎగజల్లేటోళ్లు. రూపాయి నోట్ల దండలేసేటోళ్లు.’’ ‘‘ఒకసారి మా దళం రాత్రిపూట ఒక అడవిలో పడుకున్నం. వెన్నెల రాత్రుల్లో పోలీసుల దాడులు ఎక్కువగా జరిగేవి. అందుకే వెలుతురు పడకుండా చీకటిగా ఉండే చోటు చూసుకొని రక్షణ తీసుకునేవాళ్లం. ఈ రోజు రాత్రి మేము పడుకున్న ప్రదేశంలో గుడ్డెలుగు ఉన్నట్టున్నది. అది దాని జాగా అయ్యుండొచ్చు, ఒక రకమైన వాసనొస్తున్నది... అది నా దగ్గరకు వచ్చి గుంజుతుంటె మెలకువయ్యింది. ఇదేదో ఉన్నట్లే ఉన్నదనుకొని కప్పుకున్న దుప్పటి తీసి దాని మీద ఇట్ల పడేసిన. మీద గుడ్డ పడేసినా, కొర్రాయి చూపించినా ఆగిపోతదని కొయ్యోళ్లు చెప్తుంటే వింటుండేదాన్ని. మొకాన గుడ్డ పడంగనే తిక్కలేసినట్లయి ఇసురుకుంటనే పైకి లేచేటందుకు ప్రయత్నం చేస్తున్నది. దాని కాళ్లను మెసలరాకుంట పట్టుకొని వెనక్కి తోసిపారేసిన. బోర్ల పడ్డది... నేను వెంటనే తప్పించుకున్న. ఇంకొకసారి అడవిలో పోతుంటె పులి ఎదురొచ్చింది. నేనిక ఒక గడ్డ మీదెక్కి నిలబడ్డ. ఎటు కదిలితే ఏమయితదోనని అట్లనే నిలబడ్డ. ఆడనే నిలబడి చూస్తున్నదది. కొంత సేపటికి అది ముందుకు అడుగు వేయబోంగనే నేను తుపాకి తీసుకొని పక్కకు పేల్చిన... దానితో భయపడి వెనక్కుమళ్లి ఉరికింది.’’ నా మాటే తూపాకి తూటా మల్లు స్వరాజ్యం ఆత్మకథ; కథనం: విమల, కాత్యాయని; పేజీలు: 136; వెల: 120; ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఫోన్: 040–23521849 -
మా కుటుంబం.. పోరాటాలకు పుట్టినిల్లు: గడ్డం రుద్రమ దేవి
సాక్షి, నల్లగొండ : మా కుటుంబం పోరాటాలకు పుట్టినిల్లు, మాతాతల నుంచే స్వాతంత్య్ర పోరాటంతోపాటు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. మాది ఆనాటినుంచే రాజకీయ కుటుంబం ఆ విధంగానే చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చాను. 20ఏళ్లకే నల్లగొండలో కౌన్సిలర్‌గా గెలిచాను. ఆ సందర్భంలో 1981లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి నల్లగొండకు వచ్చిన సందర్భంలో పార్టీలోకి ఆహ్వానించడంతో చేరాను. 1983లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అప్పుడు నావయస్సు 23 సంవత్సరాలు. ప్రత్యర్థి పార్టీలు వయసు తక్కువగా ఉంది అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అప్పుడు నామినేషన్ తొలగించే అవకాశం లేనందున పోటీలో కొనసాగా.. 2వేల ఓట్లతో ఓడిపోయాను. తిరిగి నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం అయిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు పోయారు. ఎన్టీఆర్‌ను నల్లగొండ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించాను. దాంతో ఆయన మూడు చోట్ల పోటీ చేసి విజయం సాధించారు. ఆ సందర్భంలో నల్లగొండ అసెంబ్లీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి నాకు అవకాశం కల్పించడంతో విజయం సాధించాను. అప్పట్లో ఎన్టీ రామారావుకు మహిళలంటే ఎంతో గౌరవం, నా అక్కలు నా చెళ్లెళ్లు అంటూ ఎంతో గౌరవించేవారు. ఆ శాసన సభలో 12మంది మహిళా శాసన సభ్యులం ఉన్నాం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశాను. ఇప్పటికీ నల్లగొండ పాత నియోజకవర్గంలో నేను కట్టించిన ఇండ్లే అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అప్పట్లో గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. స్కూల్ బిల్డింగ్లు, రోడ్లు, ఎస్ఎల్బీసీ ఫౌండేషన్ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోనే జరిగాయి. నేను ఏది అడిగినా కూడా ఎన్టీఆర్ కాదనేవారు కాదు. ఆనాడు ఎన్నికల ప్రచారం, వాల్ రైటింగ్, బ్యానర్లు, మైకులతో చేసేవారు. ప్రజలంతా మనస్ఫూర్తిగా పనిచేసేవారు. ఈనాడు ప్రచార సరళి అంతా మారిపోయింది. అంతా సోషల్ మీడియా...డీజేలు, పోస్టర్లు, డిజిటల్ పోస్టర్లు వంటివాటితో ప్రచారాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు గౌరవం లేదు. తెలుగుదేశం ఎన్టీఆర్ కాలంలో...ఆ తర్వాత వైఎస్ఆర్ కాలంలో మహిళలకు మంచి గుర్తింపు లభించింది. ఐదేండ్ల టీఆర్ఎస్ పాలనలో మంత్రి వర్గంలో మహిళల స్థానమే దక్కలేదు. సోనియా తెలంగాణ ఇస్తే కేసీఆర్ బంగారు తెలంగాణ అని కుటుంబ పాలన చేశాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తిరిగి మహిళలకు సరైన గౌరవం లభిస్తుంది. మరిన్ని వార్తాలు... -
వీరులారా వందనం
హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరుల జ్ఞాపకాలను నేటి ప్రజలు మరిచి పోవడం లేదు. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన వీరుల జ్ఞాపకార్థం గుట్ట కింద అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిల సమాధులు నిర్మించి ప్రతి ఏటా సెప్టెంబర్ 17న, మార్చి 14 కమ్యూనిస్టులు నిర్వహించే సభలకు ప్రజలు పార్టీలకు అతీతంగా హాజరై వీరులకు నివాళులర్పించి ఆనాటి జ్ఞాపకాలను నేమరువేసుకుంటారు. మహ్మదాపూర్ శివారులోని ఎతైన గుట్టలు, ప్రకృతి సోయగాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకొనే ప్రకృతి సౌందర్యం కోటగిరి గుట్టల సొంతం. ప్రతీ శ్రావణమాసంలో పర్యటకులు గుట్టల ప్రదేశానికి వనభోజనాలకు వచ్చి ఆనందంగా గడిపి ఆనాటి తెలంగాణ వీరు త్యాగాలను స్మరించుకుంటారు. ప్రతీ ఏటా సీపీఐ అధ్వర్యంలో హుస్నాబాద్ నుంచి మహ్మదాపూర్ వరకు భారీ ర్యాలీ తీసి అమరుల వర్ధంతి సభను ఘనంగా జరుపుకుంటారు. 2016 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పేరున భారీతీయ జనతా పార్టీ మహ్మదపూర్లోని అమరుల వీర భూమిని సందర్శించి పర్యటక కేంద్రంగా మార్చుతామని చెప్పినా నేటికి ఆచరణలో అమలుకు నోచుకోలేదు. 14 మంది వీరుల మరణానికి గుర్తుగా నిర్మించిన శిలా ఫలకం సాయుధ వీరులకు స్థావరం ఈ కోటలు.... తెలంగాణ పేద ప్రజల విముక్తి కోసం నిజాం ప్రభుత్వ అరాచక పాలనను ఎదిరించిన తెలంగాణ సాయుధ పోరాట వీరులకు, హుస్నాబాద్ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. సాయుధ పోరాటంలో పేదల విముక్తి కోసం పోరు చేసిన కమ్యూనిస్టులు పోలంపల్లికి చెందిన అనభేరి ప్రభాకర్‌రావు, íసిరిసిల్ల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన సింగిరెడ్డి భూపతిరెడ్డిల దళాలు రజాకార్ల పోరు చేస్తూ మహ్మదాపూర్‌కు చేరుకున్నాయి. 14 మార్చి 1948లో పేద ప్రజలకు చైతన్యం చేస్తున్నక్రమంలో మహ్మదాపూర్లో సమావేశం అయినప్పుడు రజాకార్లు సమాచారం తెలుసుకొని సాయుధ దళాలపై దాడులు చేశాయి. రజాకార్ల తో పోరు చేస్తూ గుట్టలకు వెల్లుతున్న సాయుధులను రజాకార్లు వెంటబడి వేటాడి కాల్పులు జరుపడంతో అక్కడే 12 మంది వీరులు వీరమరణం పొందారు. దీంతో హుస్నాబాద్ ప్రాంతానికి ప్రత్యేకత చోటు చేసుకుంది. వీరుల జ్ఞాపకార్థం ఆనాటి దళనాయకులైన అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి పేరుతో రెండు సమాధులు నిర్మించారు. ప్రతి ఏటా వర్ధతి రోజున సీపీఐ ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తూ వీరుల త్యాగలను గుర్తు చేసుకుంటారు. పర్యాటక కేంద్రం చేయాలి.. ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రం చేయాలని ఆనాటి ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ప్రతిపాదనలు పంపించారు. పర్యటక కేంద్రానికి వైఎస్ సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆ దిశగా ప్రయత్నం సాగుతున్న క్రమంలో ఆయన మరణంతో పర్యటక కేంద్రం అక్కడే ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి పర్యటక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
సాయుధ పోరుకు పురుడు పోసింది జనగామనే
జనగామ : నిజాం సర్కారుకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడు పోసిన జనగామను జిల్లా చేయాల్సిందేనని నాటి పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. జిల్లా సాధన కోసం జేఏసీ తలపెట్టిన రిలే దీక్షలను ఆదివారం ఆమె ప్రారంభించారు. అంతకు ముందు జేఏసీ చైర్మెన్ ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటు అయితే భవిష్యత్ తరాలకు బతుకుదెరువు కలుగుతుందన్నారు. జిల్లా కోసం డివిజన్లోని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు ఏడాది కాలంగా ఉద్యమం చేస్తుంటే, పాలకులు పట్టించు కోకపోవడం బాధాకరమని అన్నారు. ప్రజా ఉద్యమాన్ని చులకనగా చూస్తే అగ్నికణమవుతుందని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలను గ్రహించాలని కేసీఆర్‌కు సూచించారు. దళితులకు మూడెరకాల భూపంపిణీ అటకెక్కిందని విమర్శించారు. అనంతరం విస్నూరు దొరను జనగామ రైల్వేస్టేన్లో హత్య చేసిన ధర్మాపురం గ్రామానికి చెందిన 106 ఏళ్ల దర్గానాయక్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, బూడిద గోపి, ఉడుత రవి, గొళ్లపల్లి బాపురెడ్డి, మిట్యానాయక్, క్రిష్ణ, బొట్ల చిన శ్రీనివాస్, ఇర్రి అహల్య, మంగళ్లపల్లి రాజు, రెడ్డి రత్నాకర్‌రెడ్డి, మిద్దెపాక సుధాకర్, ధర్మపురి శ్రీనివాస్ ఉన్నారు. -
కమ్యునిస్టుల త్యాగాలు వెలకట్టలేనివి..
వారే తెలంగాణ సాయుధ పోరాటానికి మారుపేరు యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతుంది సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మానుకోటకు చేరిన సీపీఐ బస్సు యాత్ర మహబూబాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్టులు అని.. వారి త్యాగాలు వెలకట్టలేనివని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వీరతెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర ఖమ్మం మీదుగా సోమవారం రాత్రి మానుకోకు చేరింది. ఈ యాత్రకు స్థానిక నాయకులు స్వాగతం పలకగా పట్టణంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్థూపాల వద్ద నివాళులర్పించారు. అనంతరం స్థానిక వీరభవన్ ఎదుట పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బి.విజయసారథి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకట్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన కమ్యూనిస్టు యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని.. వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ పోరాట యోధుల పోరాట పటిమను, త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. ఈ మేరకు 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ కార్యక్రమాలు చేపట్టామని వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 17న హైదరా ఎగ్జిబిషన్ గౌండ్‌లో జరగనున్న సమావేశంలో నాటి పోరాట యోధులతో పాటు మలివిడత తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంను సన్మానించనున్నామని అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు పద్మ, బి.అజయ్, దాస్యం రామ్మూర్తి, ఫాతిమా, పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, మేక వీరన్న, చింతకుంట్ల వెంకన్న, యాకాంబ్రం, జటంగి శ్రీశైలం, మంద శంకర్, అనిల్ కుమార్, తోట విజయ్, వీరవెల్లి రవి, లింగ్యానాయక్, తోట బిక్షపతి, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం.. విప్లవ గుమ్మం
* ఖమ్మం కీర్తిని ప్రస్తావించిన వక్తలు * తెలంగాణ సాయుధ పోరాటం మహత్తరం * తరతరాల ఉత్తేజం ఈ ప్రాంతంలో ఉంది * ఇక్కడ కమ్యూనిస్టులు బలమైన శక్తులు * సీపీఐ రాష్ట్ర మహాసభల్లో పార్టీ * జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.సుధాకర్‌రెడ్డి సాక్షి, ఖమ్మం: ‘ఖమ్మం విప్లవ స్ఫూర్తిని కలిగిస్తుంది.. విప్లవాల, పోరాటాల ఘన చరిత్ర ఈ నేలకు ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతం మహత్తర పోరాటం చేసింది’ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శ్లాఘించారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా ఆదివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రారంభ సభలో ఆయన ప్రసంగించారు. ఖమ్మం విప్లవ చరిత్ర తరతరాలకు ఉత్తేజం నింపుతుందన్నారు. బలమైన శక్తులుగా కమ్యూనిస్టులు జిల్లాలో ఉన్నారని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ఈ మహాసభల స్ఫూర్తితో కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యలయంలో నిర్వహించిన ప్రారంభ సభ అరుణశోభితమైంది. సీపీఐ నేతలతో పాటు, సీపీఎం, పార్వర్డ్‌బ్లాక్, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ, ఎంసీపీఐ, ఎస్వీసీఐ నేతలు ప్రారంభ సభలో ప్రసంగించారు. వామ పక్షాల ఐక్యతను చాటారు. వామ పక్షాలు ఐక్య ఉద్యమంతో కదం తొక్కుతూ, ప్రజా వ్యతిరేక విధానాలపై గర్జించాలని అన్ని పార్టీల నేతలు పిలుపునిచ్చారు. విద్యావేత చుక్కా రామయ్య ప్రసంగిస్తూ చాలాకాలం తర్వాత వామపక్షాలు ఐక్యవేదిక దిశగా కృషి చేస్తూ ఉద్యమిస్తుండటం శుభపరిణామమన్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఐక్యత రావాలని ఆయన ఆకాంక్షించారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ప్రారంభ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో పాటు వామ పక్ష పార్టీల నేతలు ఐక్యతను చెబుతూ భవిష్యత్ ఉద్యమాలకు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ప్రారంభ సభలో ప్రజానాట్యమండలి కళాకారులు ..‘రెపరెపలాడే ఎర్రజెండా.. ఎర్రై జెండా’.. ‘లాల్‌సలాం.. లాల్‌సలాం.. అమరవీరులకు లాల్‌సలాం’ అంటూ పాటలు పాడి సభికుల్లో ఉత్తేజం నింపారు. అమరులను స్మరించుకుంటూ ప్రతినిధుల సభ.. సీపీఐ తెలంగాణ ప్రథమ రాష్ట్ర మహాసభల ప్రతినిధుల సభ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులు, ఆ పార్టీ అమరులను స్మరించుకుంటూ ప్రారంభమైంది. బైపాస్‌రోడ్‌లోని పువ్వాడ ఉదయ్‌కుమార్ (రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్) ప్రాంగణంలో 10 జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులతో సభ జరిగింది. ఈ సభ ప్రాంగణం అంతా అమరుల చిత్రమాలికతో ఏర్పాటు చేశారు. నాటి తెలంగాణ సాయుధ పోరు నుంచి నేటి త్యాగధనుల వరకు స్మరించుకుంటూ ఈ ప్రాంగణంలో వారి చిత్రాలను, వీరోచిత గాథలను ఆవిష్కరించారు. ప్రతినిధుల సభ ప్రారంభానికి ముందు సీపీఐ జెండాను పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపాన్ని పార్టీ మరో సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు , జ్యోతిని తెలంగాణ సాయుధ పోరాటయోధులు తోడేటి కొమరయ్య ప్రజ్వలన చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ప్రజా సమస్యలపై అలుపెరగాని ఉద్యమాలు చేస్తామన్నారు. అమర వీరులను స్మరించుకుంటూ.. ‘రెడ్ సెల్యూట్.. రెడ్ సెల్యూట్.. అమరవీరులకు జోహారు’్ల అంటూ ప్రతినిధుల ప్రాంగణంలో నినాదాలు మిన్నంటాయి. ప్రారంభ సభకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, నేతలు కె.నారాయణ, అజీజ్‌పాష, కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్వర్డ్‌బ్లాక్ నేత సురేందర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) నేత మూర్తి, ఆర్ఎస్పీ నుంచి జానకీరామ్, ఎంసీపీఐ నుంచి మద్దికాయల అశోక్, సీపీఐ నేతలు గుండా మల్లేష్, పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీందర్కుమార్నాయక్ ప్రసంగించారు. -
ఏటికి ఎదురీదిన విప్లవ స్వాప్నికుడు
ఆలూరి భుజంగరావుగారు ఈ లోకాన్ని విడిచి వెళ్లి సంవత్సరమైంది. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లినా, మా స్మృతిపథంలో నిలిచేవుంటారు. ఆయన జీవితం, ఆచరణ మాలాంటి వారికి మార్గదర్శకాలే. భుజంగరావుగారి జీవితం చిన్నతనం నుంచీ దుర్భర దారిద్య్రంతో, నిరంతర పోరాటంగానే సాగింది. ఆ వయసు నుంచే హోటల్ కార్మికునిగా పనిచేశారు. ‘శారద’ అనే నటరాజన్‌తో కలసి సాహి త్య సాధన చేశారు. తోటి కార్మికులతో కలసి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సంబంధాలలోకి వెళ్లారాయన. పార్టీ నుంచి అందుకున్న రాజకీయ చైతన్యం, శారద వంటి స్నేహితుల సాంగత్యం భుజంగరావుగారు తన రచనా వ్యాసంగాన్ని మెరుగుపరుచుకునేందుకు దోహదం చేశాయి. అయితే తనను ‘రచయితగా తీర్చి దిద్దింది దేశంలోని కోటానుకోట్ల దరిద్రజీవులే’నని సగర్వంగా ఆయన చెప్పేవారు. సమస్త జ్ఞానవిజ్ఞానాలూ, సుఖసంపద లూ అన్నీ శ్రమజీవుల చెమట చుక్కల నుంచి వచ్చాయని నమ్మారు. కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించిన తరువాత, ‘మీ బతుకులు మీరే బతకండి’ అని తన సాహిత్య సాంస్కృతిక కార్యకర్తలకు చెప్పడంతో చాలామంది ఎలాగ బతకడం అని ప్రశ్నించుకున్నారు. చాలామంది అందిన రంగాలలో కుదురుకున్నారు. క్రమక్రమంగా కమ్యూనిస్టు చైతన్యానికి దూరమయ్యారు. పార్టీ పార్లమెం టరీ రాజకీయాల ఊబిలో కూరుకుపోయింది. ఇందుకు భి న్నంగా భుజంగరావుగారు హిందీ పరీక్షలు రాశారు. ఆ భాష మీద పట్టు సాధించారు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినా కష్టాలు తప్పలేదు. మార్క్సిస్టు దృక్పథం నుంచి భూత భవి ష్యత్ వర్తమానాల చరిత్రను అవగాహనకు తేగల రాహుల్ సాంకృత్యాయన్ రచనలను విరివిగా అ నువదించారు. ఇల్లు చిన్నది. కుటుంబం పెద్దది. ఆ స్థితిలో రా హుల్జీ, యశ్పాల్, ప్రేమ్‌చంద్ రచనలను అనువదించ డం ఎంత కష్టమో ఊహించవచ్చు. ఇక్కడ నా గొడవ కొంచెం. చిన్నతనంలో నాకు రాహుల్జీ ‘ఓల్గా సే గంగ’ తెలుగు అనువాదం (అల్లూరి సత్యనారాయణరాజు) దొరికింది. తరువాత నేను పుట్టిన బ్రాహ్మణ ‘తత్వ’ భావజాలం మీద వ్యతిరేకత మొదలైంది. కమ్యూనిస్టుల మీద సానుభూతి కలిగింది. అప్పుడే ‘పుట్టిల్లు’ సినిమా పరాజయంతో రాజమండ్రి వచ్చిన డాక్టర్ రాజారావు గారి దగ్గర నాటకాల కోసం చేరాను. సినిమా తీయాలని మళ్లీ మద్రాసుకు వెళ్లినప్పుడు ఆయన వెనకే నా సహచరితో మద్రాసు చేరాను. అక్కడ ఆయన కల్పించిన నాటక వాతావరణం, కన్నెమెరా లైబ్రరీ నుంచి తెచ్చుకున్న రాహుల్జీ అనువాద నవలలు, నా ఆలోచనా విధానంలో మార్పును త్వరితం చేశాయి. ఈ మార్గాన్వేషణలో నాకు దోహదం చేసిన విజ్ఞుల్లో భుజంగరావు గారిని పరోక్ష మార్గదర్శకులుగా భావిస్తున్నాను నేను. భుజంగరావు గారు ‘అరణ్యకాండ’ లాంటి కథలను రాశారు. అది చదివితే వారి కథన నైపుణ్యం తెలుస్తుంది. ‘గమనాగమనం’ పేర జీవిత కథని రచించారు. ఆయన అనువాద సాహిత్యంలో ‘సింహావలోకనం’కి ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశాన్ని భవిష్యత్తు వైపు నడిపిస్తున్న ఒకే ఒక్క వేగుచుక్కలా ‘భగత్‌సింగ్’ని మన స్మృతి పథంలో అది నిలుపుతుంది. ‘దర్శన్ దిగ్దర్శన్’ ప్రపంచ తాత్విక జ్ఞానాన్ని పరిచ యం చేసింది. ఆచరణపరంగా కూడా భజంగరావుగారు నాకు మార్గదర్శకులుగా నిలిచారని నేను ‘విరసం’కి దగ్గరయ్యే వరకూ తెలియలేదు. భుజంగరావు గారు ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమాల కాలం నుంచి నక్సల్బరీ మీదుగా ‘విరసం’ సభ్యులు గా, విప్లవాభిమానిగా ముందుకు నడిచారు. స్వచ్ఛందంగా ముందుకు రాదల్చుకున్న పిల్లల్ని, సహచరిని విప్లవోద్యమంలోకీ, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలోకీ వచ్చేందుకు ప్రోత్సహించారు. ఆలూరి లలితా పరమేశ్వరిగారు కూడా నీడలా ఆయన్ని అనుసరించడంతో ఆగిపోకుండా, వారు కీర్తిశేషులయ్యాక ఆయన సభ్యత్వాన్ని ‘విరసం’లో కొనసాగిస్తూ నేను ఉన్నంత వరకూ మేం ఇద్దరం వస్తున్నట్లే భావించమని కోరారు. ఇది సభ్యులకు, సభ్యులు కాని సహచరులకు స్ఫూ ర్తినిచ్చే సంప్రదాయం. భుజంగరావు గారు భౌతికంగా మన మధ్య లేకున్నా విప్లవకారుల, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమ సహచరుల, విప్లవసానుభూతిపరుల స్మృతి పథంలో సదా నిలిచేవుంటారు. జీవితాంతం ఏటికెదురీదిన విప్లవ స్వాప్నికుడు భుజంగరావు. ఆ అమరునికి రెడ్ శాల్యూట్స్. - కాకరాల (వ్యాసకర్త రంగస్థల, సినీ నటుడు, వామపక్ష ఉద్యమశీలి) -
తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర మాదే..
కందుకూరు, న్యూస్‌లైన్: స్వాతంత్య్రానికి పూర్వం నుంచే తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలదేనని సీపీఎం సౌత్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఈఎస్‌ఎన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో సోమవారం తెలంగాణ అవతరణ సందర్భంగా తెలంగాణ సమగ్రాభివృద్ధి పునరంకిత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కొత్త రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్నివర్గాల ప్రజలు కోటి ఆశల పెట్టుకున్నారన్నారు. ప్రజల ఆశల మేరకు ప్రభుత్వ పనితీరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నివర్గాల వారికి సమన్యాయం జరిగే వరకు ప్రభుత్వానికి సీపీఎం మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు. నిత్యావసరాల ధరలు అందుబాటులోకి తేవాలని, రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరాతోపాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి డి.రాంచందర్, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు ఆర్.చందు, మండల కమిటీ సభ్యులు జి.పారిజాతం, సీహెచ్ నర్సింహ, శ్రీశైలం, డి.వెంకటరమణ, కె.భిక్షపతి, పి.శ్రీరాములు, నరహరి, ప్రభాకర్, శిమయ్య, మహేందర్, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి సీపీఎం సంపూర్ణ మద్దతు అనంతగిరి : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్ అన్నారు. వికారాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ సభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సమగ్ర అభివృద్ధి చేయాలన్నారు. పోలవరం డిజైన్ మార్పు చేయాలన్నారు. ఆర్డినెన్సును ఆపే విధంగా ఉద్యమించి కొత్త ముఖ్యమంత్రి చిత్తశుద్ది చూపించుకోవాలన్నారు. కేసీఆర్ ఇచ్చిన రైతుల రుణమాఫీ, సొంతిళ్లు, రూ.100 పెన్షన్ వంటి హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రజాపోరాటాలకు వెనుకాడబోమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధులను వారికే కేటాయించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సంలు, అమరేశ్వర్, అశోక్, వెంకటేశం, వెంకటయ్య, శ్రీనివాస్, మహేందర్, మల్లేశం పాల్గొన్నారు. -
నిరాడంబర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం
నర్రా రాఘవరెడ్డి- ఆదర్శం: నిస్వార్ధం, నిరాడంబరత, నిజాయితీ, సేవాతత్పరత మూర్తీభవించిన వామపక్ష యోధుడు. ప్రజా కళాకారుడిగా ఆరు సార్లు ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి అహరహం శ్రమించిన అవిశ్రాంత నేత నర్రా రాఘవరెడ్డి. దీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన నిష్కలంక నేతగా పేరుగాంచారు. నేటి తరం నేతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సీపీఎం సీనీయర్ నాయకుడు నర్రా రాఘవరెడ్డి నిస్వార్ధం, నిరాడంబరత, నిజాయి తీ, సేవాతత్ప రత నిండిన నేతగా ప్రజాభిమా నం పొందారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండ లం వట్టిమర్తిలో 1924లో నర్రా రాంరెడ్డి, కన కమ్మ దంపతులకు జన్మించిన ఆయన చిన్నతనం లోనే తల్లి మరణించడంతో మారుతల్లి పెట్టే కష్టాలు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయారు. కార్మికునిగా, కళాకారుడిగా.. కొన్నాళ్లు హైదరాబాద్‌లోని ఒక హోటల్లో వర్కర్ గా పనిచేశాక ముంబై వెళ్లి రూ.13 వేతనానికి గైక్వాడ్ జౌళి మిల్లులో చేరారు. జీఎం ఖాన్ సహకారంతో కార్మిక నాయకుడిగా ఎదిగారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారునిగా స్థానిక సమస్యలను పల్లె సుద్దులతో మిళితం చేసి జనరంజకంగా వివరించేవారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. 1949లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన ఆయన పార్టీలో వివిధ హోదాలలో పనిచేశారు. 1959 నుంచి ఏడేళ్ల పాటు వట్టిమర్తి గ్రామ సర్పంచ్‌గా , నార్కట్‌పల్లి సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1967లో మొదటిసారి నకిరేకల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో మోటార్ సైకిల్‌పై నియోజకవర్గమంతా తిరిగి ప్రచారం చేశారు. కార్యకర్తల ఇళ్లలోనే భోజనం చేస్తూ రూ. 300 ఖర్చుచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో ఓడిపోయినా 1978,1984, 1989, 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. ఏడేళ్ల పాటు శాసనసభ లో సీపీఎం పక్ష నాయకునిగా పనిచేశారు. ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాన్ని కూడా తీసుకోలేదు. తన హయాం లో 50కిపైగా గ్రామాలకు రహదారుల నిర్మాణం, విద్యుత్, మంచి నీటి సౌకర్యాలను కల్పించారు. శ్రీశైలం ఎడమ కాలువ, మూసీ కాల్వపై లిఫ్టులను సాధించారు. - 90 ఏళ్ల జీవితంలో 37 ఏళ్లు ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. - 1978 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్ఫూర్తిదాయకులు: పుచ్చలపల్లి సుందరయ్య, జీఎం ఖాన్ అభిమానించే సహచరులు: బీఎన్ రెడ్డి, సుద్దాల హనుమంతు, కొండవీటి గురునాధ్‌రెడ్డి, రాచమల్ల రామచంద్రం - ఇష్టమైనవి: ప్రజాకళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాడిగేదెల పెంపకం