తెలంగాణ సాయుధపోరాటం నుంచి తనను విడదీసి చూడలేనంతగా మమేకమైనవాడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి. భూమి భుక్తి విముక్తికోసం తెలంగాణ ఎర్రసెలకల్లో పుట్టిన మహత్తర పోరాటమది. ‘దున్నేవానికే భూమి’ అన్న నినాదంతో 4000 మంది వీరులు నెత్తురు ధారవోసిన మహాజ్వల సాయుధ పోరాట ఘట్టమది. వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం ఎగిసిపడి దొరగడీలను నేలకూల్చిన పోరు అది. భూస్వామ్య జాగీర్ధారీ వ్యవస్థలను అల్లకల్లోలంచేసిన చీమలదండులు సాగించిన మహత్తర తెలంగాణ సాయుధపోరాటమది. రైతాంగ తిరుగుబాటును ఒక మలుపు తిప్పి ఆయుధ పోరాటానికి శ్రీకారం చుట్టిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి వీర గాధకు ప్రాణంపోస్తూ 2007 సంవత్సరంలో ఒక డాక్యుమెంటరీ వెలువడింది. వీర తెలంగాణ సాయుధపోరాట యదార్థగాథను, ఈ నేలమీద సాగిన సాహసపోరాటగాథను భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఈ డాక్యుమెంటరీలో వ్యక్తంచేశారు. సుమారు 9 గంటలపాటు సాగిన ఆయన సంభాషణను 45 నిమిషాలకు ఎడిటింగ్‌చేసి శ్రోతల ముందుకు తెచ్చారు. సామాన్యులే చేసిన అసమాన్య పోరాటం ఎట్లా కొనసాగిందో యుద్ధవీరుడైన భీమిరెడ్డి నర్సింహారెడ్డి కళ్లకు కట్టినట్లు వివరించారు. పాత నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని కరివిరాల కొత్తగూడెం మట్టిలో పురుడు పోసుకున్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఆర్యసమాజ కార్యకర్తనుంచి కమ్యూనిస్టుగా మారిన తీరు సింహంలా తుపాకి పట్టుకుని పోరాడిన తీరు మొత్తంగా డాక్యుమెంటరీలో కనిపిస్తుంది. నంగినంగి వొంగివొంగి బాంచన్ దొరా నీకాల్మోక్తా అన్న మూగజీవాలు ఎట్లా ఎదురుతిరిగి పోరాడారో అందులో చూస్తాం. సూర్యాపేట నుంచి జనగామదాకా, జనగామ నుంచి జగిత్యాల దాకా ఈ విప్లవాగ్నులు ఎలా ప్రజ్వరిల్లాయో ఈ డాక్యుమెంటరీ ద్వారా చూడవచ్చును. చాకలి ఐలమ్మ బువ్వగింజలు పోరాటానికి శ్రీకారం చుడితే కడివెండి దొరగడీని, ఆ దొర అనుయాయులను తరిమికొట్టిన సాహసి భీమిరెడ్డి ఆనాటి అనుభవాలు ఇందులో చూడవచ్చు. వీర తెలంగాణ సాయుధపోరాటం 1944–1951 కాలంలోని సమగ్రపోరు రూపంకు ప్రాణంపోసిన తీరు ఈ డాక్యుమెంటరీలో ఉంది. ఈ భూపోరాటమే దేశంలో భూసంస్కరణలకు ప్రాణంపోసింది.
ఈ డాక్యుమెంటరీ బీఎన్ జీవిత విశేషాలను కూడా కళ్లకుకట్టింది. ఆయన తెలంగాణ భూపోరాటానికి తొలికేక. గెరిల్లా సైన్యం దళపతి. ఆయనే కామ్రేడ్ బి.ఎన్.గా పిలువబడే భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఆయనను యాది చేసుకోవడమంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మననం చేసుకోవడమే. 1922లో నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం, కరివిరాల కొత్తగూడెం గ్రామంలో జన్మించారు బీఎన్. బాల్యం నుంచే గొంతెత్తి కమ్మగా పాడేవాడు. అప్పుడు 8వ తరగతిలో వున్నాడు. ఓ పక్క వందేమాతరం ఉద్యమం, మరోపక్క ప్రపంచ యుద్ధం ఆయనలోని విప్లవకారుడ్ని తట్టి లేపాయి. ఆంధ్రమహాసభతో అనుబంధం పెంచుకున్నాడు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా గళమెత్తాడు. లెవీ పేరుతో రైతుల తిండిగింజలు దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులకు నిరసనగా జరిగిన 70 కిలోమీటర్ల రైతుల పాదయాత్రలో పాల్గొన్నాడు. దేశ్‌ముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి దౌష్ట్యాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో తొలిసారిగా దెబ్బలు రుచి చూశాడు.
1946 జూలై 4వ తేదీన జనగాం తాలూకా కడవెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య ఆహుతయ్యాడు. దీంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనివార్యమైంది. చాకలి అయిలమ్మ తిరుగుబాటు, విసునూరి గడికి నిప్పంటుకునేలా చేసింది. 1947 ప్రారంభంలో కళాశాల విద్యార్థులు ‘క్విట్ కాలేజి’ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం మిలిటరీని రంగంలోకి దించింది. దీంతో గెరిల్లా పోరాటం అనివార్యమైంది. బీఎన్ గెరిల్లా దళపతి అయ్యాడు. పాత సూర్యాపేట, దేవరుప్పుల, ఆలేరు, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో మిలిటరీకి చెమటలు పట్టించాడు. రావులపెంట, కోటపాడు, దివ్వెల గ్రామాల్లో జరిపిన దాడుల ద్వారా సేకరించిన ఆయుధాలతో సాయుధ పోరాటం కొనసాగించాడు. 1945–46లో మొండ్రాయి ప్రాంతంలో కడారు రాంచందర్‌రావు జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, అలాగే 1946 దేవరుప్పల పోరాటం, బాలెం గ్రామంలో జరిగిన బాహాబాహీ పోరాటం బీఎన్ సమర్థ నాయకత్వానికి మెచ్చుతునకగా చెప్పొచ్చు.
1947 నవంబర్‌లో భారత్ ప్రభుత్వం నిజాం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని రైతాంగ పోరాట అణచివేతకు మిలిటరీ బలాన్ని అందించేది. దీంతో దున్నేవాడిదే భూమి పేరుతో రైతాంగ సాయుధ పోరాటం ముమ్మరమైంది. సెప్టెంబర్ 18న నిజాం లొంగిపోవడంతో పోరాటం కొనసాగించాలా, లేక ఆపాలా? అన్నదానిపై కమ్యూనిస్టు పార్టీలో భేదాలు తలెత్తాయి. బీఎన్ మాత్రం పోరాటం వైపుకే మొగ్గు చూపాడు. ‘బండెనక బండి గట్టి, పదహారు బండ్లుగట్టి, ఏ బండ్లే పోతివి కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి’ అంటూ పాట రాసిన యాదగిరి ఆయన దళం సభ్యులే. పాలకుర్తి అయిలమ్మ ఘటనకూ నాయకుడు బీఎన్. అయిలమ్మ పంటకు రక్షణగా నిలబడి, విసునూరు దేశ్‌ముఖ్ గూండాలతో తలపడి, ఆరెకరాల పంటను ఆమె ఇంటికి చేర్చిన యోధుడు ఆయన. తెలంగాణలో యూనియన్ సైన్యాలు ప్రవేశించిన నేపథ్యంలో పోరాటాన్ని ఎలా కొనసాగించాలో చర్చించేందుకు సూర్యాపేట తాలూకా పాతర్లపాడు సమీపంలోని చిట్టడవిలోని కొండలమధ్య ఏరియా కమిటీ సమావేశం జరుగుతోంది. సుందరయ్య మాట్లాడుతున్నారు. ఇంతలో సెంట్రీ నుంచి ‘పోలీస్’ అన్న కేక. దాని వెనుకే తుపాకీ శబ్దం. ఆ శబ్దాన్ని బట్టే గ్రహించాడు బీఎన్. వచ్చింది పోలీసులు కాదు, అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన యూనియన్ సైన్యాలనీ. వ్యూహాత్మకంగా కాల్పులకు దిగకుండా తన రక్షణ వ్యవస్థకు ఆదేశాలిస్తూనే ఒక్కుదుటున గుహలోకి దూకి, నిద్రలో ఉన్న తన పసిబిడ్డను తీసుకొని చాకచక్యంగా నాయకులతో సహా అందరినీ శత్రువలయం నుంచి సురక్షితంగా తప్పించాడు.
తెలంగాణలో సాయుధపోరాటానికి మొట్టమొదట ఆయుధ మెత్తిందీ, చిట్టచివర ఆయుధం దించిందీ బిఎనే. సీపీఐ(ఎం) నల్ల గొండ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, అఖిల భారత ఉపాధ్యక్షునిగా సుదీర్ఘకాలం పని చేసిన బీఎన్ మొదట పీడీఎఫ్, ఆ పైన సీపీఐ(ఎం) తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. బీబీనగర్–నల్లగొండ రైల్వే లైన్, శ్రీరాంసాగర్ రెండవదశ కాల్వల నిర్మాణాలు ఆయన పోరాట ఫలితంగా వచ్చినవే. కమ్యూనిస్టు నేతగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా పేరొంది, 2008లో కన్ను మూసేనాటికి తనకంటూ ఒక్క పైసా కూడా మిగుల్చుకోని ఓ నిరుపేద, నిస్వార్థ నాయకుడు బీఎన్! నాగలిపట్టిన రైతుచేతికి రైఫిల్ ఎలా వచ్చిందో బీఎన్ డాక్యుమెంటరీ చూస్తే అర్థం అవుతుంది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఈ డాక్యుమెంటరీలో అనేక అనుభవాలను చెప్పారు. కడివెండి, ముండ్రాయి, కోటపాడు, పాతసూర్యాపేట బాలెంల అనుభవాలు, ఆనాటి మిగిలివున్న తన సహచరులను గుర్తుచేస్తున్న దృశ్యాలు ఇందులో చూడవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే భీమిరెడ్డి సైద్ధాంతికతను చెప్పే తాత్వికుడు కాదు. యుద్ధ భూమిమీద నిలిచిన యోధుడు.
వ్యాసకర్త: ఎ. రజాహుస్సేన్, రచయిత, సాహిత్య విమర్శకుడు
90631 67117
ఇది ఓ తిరుగుబాటు ఆత్మకథ
Published Thu, Sep 17 2020 1:55 AM | Last Updated on Thu, Sep 17 2020 1:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment