
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొన్ని రాజకీయ పక్షాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా చిత్రించుకుంటున్నాయి. కానీ అసలు చరిత్రలో జరిగింది వేరు. నైజాం నవాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎట్టి హక్కులు లేకుండా, వెట్టి చాకిరీ చేస్తూ, దారుణ దోపిడీకి గురౌ తున్న సమయంలో ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పడింది. క్రమంగా ‘ఆంధ్ర మహాసభ’ కమ్యూనిస్టుల నాయ కత్వంలోకి వచ్చింది.
వెట్టి చాకిరీ రద్దు, కౌలు తగ్గింపు, ‘దున్నే వానికే భూమిపై హక్కు’ వంటి డిమాండ్‌లను ముందుకు తెచ్చి నిజాం పాలనపై ఉద్యమించింది. సంఘంలోకి ప్రజలు పెద్ద ఎత్తున చేరారు. భూమి కోసం పోరు ప్రారంభమైంది. ‘ఆంధ్ర మహాసభ’ ప్రతి గ్రామానికీ విస్తరించింది. తన భూమి, పంటల రక్షణ కోసం చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ భూపోరాట ప్రాధాన్యాన్ని ముందుకు తెచ్చింది.
జనగామ తాలూకా కలవెండి గ్రామంలో దేశ్ ముఖ్ విసునూరి రామచంద్రారెడ్డి గూండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వంతో పోరాటం కొత్త మలుపు తీసుకున్నది. దేశ్‌ముఖ్‌ల, జమీందార్ల దాడులను సాయుధంగా ప్రతిఘటన చేయాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. రైతాంగ ఉద్యమంపై నిజాం నవాబ్ ప్రభుత్వం తీవ్ర నిర్భందం ప్రయోగించింది.
నిజాం రజాకార్లు ప్రజలపై పాశవిక దాడులు చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఈ దాడులను తిప్పికొట్టేందుకు గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి. పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూములు ప్రజలు స్వాధీనపర్చుకుని సాగు చేశారు. వేలాది గ్రామల్లో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాశక్తికి భయపడి జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు పట్టణాలకు పారి పోయారు.
నిజాం నిరంకుశ ప్రభుత్వం నిర్బంధం పెంచి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. ప్రజలను ఒకేచోట మందవేసి పాశవికంగా హింసించారు. అయినా పోరాటం ఆగలేదు. పోరా టాన్ని అడ్డుకునే శక్తి నిజాం ప్రభుత్వం కోల్పోయింది.
రైతాంగ సాయుధ పోరాటం నెహ్రూ ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టించింది. ఉద్యమం కొనసాగితే కమ్యూనిస్టుల ప్రాబ ల్యం పెరిగి ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు ప్రారంభమౌతా యని నెహ్రూ ప్రభుత్వం భయపడింది. అందుకే 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానానికి సైన్యాలను పంపింది. నిజాం సైన్యాలు బూటకపు ప్రతిఘటన నాటకమాడాయి.
రెండు రోజు ల్లోనే నైజాం రాజు లొంగిపోయినట్లు ప్రకటించి, నెహ్రూ సైన్యా లకు స్వాగతం పలికాడు. దీన్ని గమనిస్తే ముందుగానే సైనిక చర్య గురించి నెహ్రూ ప్రభుత్వానికి, నైజాం నవాబుకూ మధ్య ఒప్పందం జరిగిందనేది వెల్లడవుతుంది.
నిజాం నవాబును గద్దె దింప టానికే సైన్యం వస్తే, మరి నవాబును (రాజుని) అరెస్టు చేసి నిర్బంధించాలి కదా! కానీ అలా జరగలేదు. ‘రాజ్య ప్రముఖ్’గా నిజాం రాజుని ప్రకటించి 1950 జనవరి 26 వరకు నైజాం ప్రాంతాన్ని అతని పాలనలోనే ఉంచి, నెహ్రూ ప్రభుత్వం 1950లో సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనం చేసింది.
ఈ క్రమంలో గ్రామాలకు సైన్యాలను పంపి ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను జమీందార్లకు, భూస్వాములకు అప్ప గించింది. దీన్ని గమనిస్తే నైజాం నవాబును, జమీందార్లను, జాగీర్దారులను, భూస్వాములను రక్షించటానికే రైతాంగ సాయుధ పోరాటంపైకి మిలిటరీ దాడి అన్నది స్పష్టమవుతున్నది. అందుకు అనుగుణంగానే పెద్ద ఎత్తున నిజాం రాజ్యంలో సైన్యాన్ని దింపి రైతాంగ పోరాటంపై విరుచుకుపడింది.
కాన్సట్రేషన్ క్యాంపులు పెట్టి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. నాయకులను, కార్యకర్తలను పట్టుకుని కాల్చి చంపింది. నెహ్రూ ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా రైతాంగ సాయుధ పోరాటం కొన సాగింది. పార్టీలో చోటు చేసుకున్న మితవాద, అతివాద ధోరణులు 1951 అక్టోబర్ 31న మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విరమణకు కారణమయ్యాయి.
మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించింది కమ్యూనిస్టు పార్టీ. అందుకు అనేక త్యాగాలు చేసింది కమ్యూనిస్టు పార్టీనే! అందువలన ఆ పోరాట వారసులు కమ్యూ నిస్టులే. ఇతరులు దాన్ని ఉచ్చరించటానికి కూడా హక్కు లేదు. అలాగే సెప్టెంబర్ 17న జరిగినది విమోచన కాదు, ప్రజలకు విద్రోహమని ప్రజలు గొంతు విప్పాలి. తెలంగాణ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని నినదించాలి.
బొల్లిముంత సాంబశివరావు
వ్యాసకర్త ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526