నలువైపులా ముట్టడి.. హైదరాబాద్‌పై ఐదు రోజుల ‘ఆపరేషన్‌’ | Military Operation In The Name Of Operation Polo Against Hyderabad | Sakshi
Sakshi News home page

నలువైపులా ముట్టడి.. ‘ఆపరేషన్‌ పోలో’ పేరిట భారత ఆర్మీ సైనిక చర్య

Published Sat, Sep 17 2022 1:21 AM | Last Updated on Sat, Sep 17 2022 11:18 AM

Military Operation In The Name Of Operation Polo Against Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్ట్రైక్‌.. స్మాష్‌.. కిల్‌.. వీర్‌.. ఇవి కేవలం నాలుగు పదాలు కాదు.. భారత సైన్యాన్ని హైదరాబాద్‌ సంస్థానంపైకి నడిపించిన నాలుగు సైనిక దళాల పేర్లు అవి.. సంస్థానాన్ని నలువైపుల నుంచీ ముట్టడించి నిజాం సైన్యాలను తరిమికొట్టిన దళాలు అవి.. నాటి భారత సైన్యం దక్షిణ మండల ప్రధానాధికారి గొడాల్ట్‌ వ్యూహ రచన మేరకు ‘ఆపరేషన్‌ పోలో’పేరిట జరిగిన సైనిక చర్యలో.. హైదరాబాద్‌ సంస్థానంపై నలుదిక్కుల నుంచీ దాడులు జరిగాయి. నల్‌దుర్గ్‌ నుంచి నార్కట్‌పల్లి.. ఔరంగాబాద్‌ నుంచి హోమ్నాబాద్‌ వరకు జరిగిన ఈ దాడుల వివరాలన్నీ భారత సైన్యానికి చెందిన అధికార పత్రాల్లో ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఆపరేషన్‌ పోలో గురించి ఒక్కొక్కరు ఒక్కో కథనం వినిపిస్తుండగా.. కొందరు చరిత్రకారులు భారత సైన్యం అధికారిక పత్రాల్లో పేర్కొన్న అంశాలను వివరిస్తున్నారు. ఆ వివరాల ప్రకారం..


సెప్టెంబర్‌ 12న మొదలు..

మద్రాసు, ముంబై రాష్ట్రంలోని సేనలు హైదరాబాద్‌ సంస్థానం వైపు కదలాలని 1948 సెపె్టంబర్‌ 12న భారత సైన్యం అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నల్‌దుర్గ్‌ ప్రాంతంలో నిజాం సైన్యం ఏర్పాటు చేసుకున్న శిబిరం తమ వశమైందని సెపె్టంబర్‌ 13న ఉదయం భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. ఆ రోజునే సైనిక చర్య ప్రారంభమైందని కూడా ప్రకటించింది. తొలుత సైనిక చర్యకు ‘ఆపరేషన్‌ కాటర్‌ పిల్లర్‌’అనే పేరు పెట్టినా.. తర్వాత ‘ఆపరేషన్‌ పోలో’పేరుతో కొనసాగించారు.


నాలుగు వైపుల నుంచీ..

హైదరాబాద్‌ సంస్థానంపై భారత సైన్యం దాడి నలువైపులా ఒకేసారి ప్రారంభమైందని చరిత్రకారులు చెప్తున్నారు. షోలాపూర్‌–హైదరాబాద్‌ మార్గంలో పశ్చిమ దిశ నుంచి మేజర్‌ జనరల్‌ జయంత్‌నాథ్‌ చౌదరి నాయకత్వంలోని దళం.. విజయవాడ– హైదరాబాద్‌ మార్గంలో తూర్పు దిశ నుంచి మేజర్‌ జనరల్‌ ఏఏ రుద్ర నాయకత్వంలోని దళం ముందుకు నడిచాయి. ఈ దళాల దాడి సాగుతుండగానే రైల్వే మార్గాల రక్షణతోపాటు నిజాం సైన్యం, రజాకార్లు పారిపోకుండా ఉండేందుకు దక్షిణాన కర్నూలు వైపు నుంచి మరో దళం కదిలింది. ఉత్తర దిశలోని జాల్నా వైపు నుంచి ఇంకో దళం దాడి మొదలుపెట్టింది. ఈ నాలుగు దళాలకు స్ట్రైక్, స్మాష్, కిల్, వీర్‌ ఫోర్స్‌లుగా నామకరణం చేశారు. 9వ డొగ్రా బెటాలియన్, 1వ ఆర్మర్డ్‌ బ్రిగేడ్, 7వ, 9వ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌లు, భారత వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.


ఐదు రోజుల పాటు సాగి..

సైన్యం ప్రకటన మేరకు 1948 సెపె్టంబర్‌ 13న ఉదయం ప్రారంభమైన ‘ఆపరేషన్‌ పోలో’ఐదు రోజుల పాటు కొనసాగింది. ఈ ఐదు రోజుల పాటు ఏ రోజు ఏం జరిగిందో సైనిక పత్రాల్లో రాసి ఉంది. నల్‌దుర్గ్‌ కోట పతనం, బోరీ నది మీద వంతెన కూలగొట్టడం వంటి విధ్వంసాలనూ పత్రాల్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేటను జల్లెడ పట్టాం, సూర్యాపేట పతనమైంది, నార్కట్‌పల్లి పతనమైంది, చిట్యాల దగ్గర ఉన్నాం, కాప్చరింగ్‌ జాల్నా, ఔరాంగాబాద్, హోమ్నాబాద్‌ అంటూ.. యుద్ధంలో ప్రాంతాలను, స్థావరాలను స్వాధీనం చేసుకున్న తరహాలో భాషనే ఇందులో ఉపయోగించారు.

నాటి పత్రికల్లో కూడా..
అధికారిక సైన్య పత్రాలతోపాటు నాటి పత్రికలు కూడా అప్పట్లో జరిగిన ఉదంతాలను ఉటంకిస్తూ కథనాలు రాశాయి. మెర్జర్, అనెక్సేషన్, యాక్సెషన్, అటాక్, యాక్షన్, మిలిటరీ ఆపరేషన్, ఎండ్‌ ఆఫ్‌ అసఫ్‌జాహీ రూల్, హైదరాబాద్‌ పతనం, విలీనం, ఆక్రమణ అనే పదాలు తప్ప సమకాలీనంగా ఇతర మాటలు అప్పట్లో వాడలేదు. నాటి సమకాలీన పత్రికలన్నీ ఈ దాడిని ‘ఇండియా ఇన్‌వేడ్స్‌’ అని రాశాయి. స్వయంగా భారత ప్రభుత్వం దీనిని సైనిక చర్యగానే పేర్కొంది.


రూ.3.5 కోట్ల ఖర్చుతో..

‘ఆపరేషన్‌ పోలో’దాడికి రూ.3.5 కోట్లు ఖర్చయిందని సైనిక పత్రాల్లో పేర్కొన్నట్టు చరిత్రకారులు చెప్తున్నారు. మొత్తం 66 మంది ఇండియన్‌ యూనియన్‌ సైనికులు చనిపోగా, 97 మంది గాయపడ్డారని, 490 మంది నిజాం సైన్యం చనిపోగా, 122 మంది గాయపడ్డారని వివరిస్తున్నారు. సైనిక చర్యలో జరిగిన నష్టాలపైనా అప్పటి పత్రికలు కథనాలు రాశాయి. హైదరాబాద్‌పై విజయం సాధించడంపై నాటి సైనిక చర్యకు నాయకత్వం వహించిన మేజర్‌ జనరల్‌ రాజేంద్ర సింహ్‌జీకి బంగారు ఖడ్గంతోపాటు భగవద్గీత గ్రంథాన్ని బహూకరించాలని తూర్పు పంజాబ్‌ విశ్వవిద్యాలయ హిందూ రక్షణార్థి విద్యార్థులు తీర్మానించారు. వారు దక్షిణ భారత మిలటరీ శాఖను అభినందించారని నాటి పత్రికల్లో రాశారు.

ఇదీ చదవండి: Operation Polo: నిజాంను తెలివిగా తోకముడిచేలా చేసిన వల్లభాయ్‌ పటేల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement