ఒక అంచనా ప్రకారం నిజాం వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం నాటికి 30 వేల మంది సైనికులున్నారు. వీరితో పాటు మూడు ఆర్మర్ రెజిమెంట్లు, అశ్విక దళం, 11 ఇన్‌ఫాన్ట్రీ బెటాలియన్లు, ఒక ఆర్టిలరీకి తోడుగా ఇంకా పది వరకు సైనిక రెజిమెంట్లు ఉన్నాయి. వీరికి తోడుగా దాదాపు 2 లక్షల మంది రజాకార్లున్నారు. వీరిలో 50వేల మంది దగ్గర తుపాకులు, తల్వార్ల లాంటి ఆయుధాలున్నాయి. దీనికి తోడుగా విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అప్పటికే నిజాం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.
ఆపరేషన్ పోలోకు నెలరోజుల ముందు భారతసైన్యం తమపై దాడిచేస్తే ఎంతకాలం ప్రతిఘటించగలమని నిజాం తన సైన్యాధ్యక్షుడు ఇద్రూస్‌ను ప్రశ్నించాడు. ఒక్కరోజు కూడా కష్టమే అని ఇద్రూస్ సమాధానం చెప్పాడు. దీంతో సైన్యానికి తోడుగా రజాకార్ల సంఖ్యను పెంచాలని నిజాం ఆదేశాలు జారీచేశాడు. అయితే నిజాం సైన్యం భారత సైన్యం ముందు ఏమాత్రం నిలుస్తుందన్నదానిపై శతకోటి అనుమానాలు.
సెప్టెంబర్ 13 తెల్లవారుజామున భారత్ సైన్యం ఐదు వైపుల నుంచీ హైదరాబాద్ సంస్థానంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించింది. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో నిజాం సంస్థానంలోకి పెద్ద ఎత్తున ట్యాంకులతో భారత సైన్యం ప్రవేశించింది. మరో మార్గంలో అటు షోలాపూర్ నుంచి జెఎన్ చౌదరి ఆధ్వర్యంలో భారత బలగాలు హైదరాబాద్ వైపు దూసుకు వచ్చాయి. భారత సైన్యంలో స్ట్రైక్ ఫోర్స్, స్మాష్ ఫోర్స్, కిల్ ఫోర్స్, వీర్ ఫోర్స్ పేరుతో నాలుగు రకాల బలగాలున్నాయి. ముందుగా భారత్ యుద్ధ విమానాలు హైదరాబాద్ సంస్థానంలోని ఉస్మానాబాద్, వరంగల్‌తో పాటు ఇతర విమానాశ్రయాలపై బాంబులు కురిపించింది. దీంతో నిజాం విమానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ముందుగా యుద్ధ ట్యాంకులతో నిజాం సైనిక పోస్టులపై దాడులు చేసిన భారత బలగాలు ఆ తరువాత వేగంగా నిజాం సంస్థానంలోకి చొచ్చుకు వచ్చాయి.
చదవండి: (హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?)
ఇక భారత తొలి బుల్లెట్ ఉస్మానాబాద్ జైలు బయట ఉన్న నిజాం సెంట్రీకి తగిలింది దీంతో అతను అక్కడే కుప్ప కూలాడు. ఇదే సమయంలో భారత సైన్యం దాడి గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. నిజాం సైన్యం భారత సైన్యాన్ని ఎదుర్కోలేక తోక ముడిచింది. అయితే భారత సైన్యం ఒక్కో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నా.. నిజాం మాత్రం తప్పుడు వార్తలు ప్రసారం చేయించాడు. నిజాం సైన్యం గెలుస్తుందంటూ వదంతులు వ్యాపింపజేశాడు. చివరికి సెప్టెంబర్-17న జెఎన్ చౌదరి ఆధ్వర్యంలోని భారత బలగాలు హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరువు చేరుకున్నారు. దీంతో నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్ లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.
భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించిందనే వార్త తెలియగానే నిజాం తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇక నిజాం ఎవరిని నమ్మే స్థితిలో కనిపించలేదు. వెంటనే భారత రాయబారి మున్షిని పిలిపించి తాను లొంగిపోతున్నట్లు తెలిపాడు. దీంతో నిజాం లొంగుబాటు విషయాన్ని హోంమంత్రి పటేల్‌కు మున్షి తెలిపారు.
నిజాం లొంగుబాటు ప్రక్రియలో పటేల్ చాలా తెలివిగా వ్యవహరించారు. ముఖ్యంగా సెప్టెంబర్-18వ తేదీన ఐక్యరాజ్యసమితిలో నిజాం భారత్‌కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. ఈ విచారణ జరగడానికి ముందుగానే నిజాం లొంగిపోయాడనే విషయాన్ని అంతార్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలనేది పటేల్ ఆలోచన. అందుకే హైదరాబాద్‌లో భారత రాయబారి మున్షి సహాయంతో నిజాం ద్వారా దక్కన్ రేడియోలో లొంగుబాటు ప్రకటన చేయించారు పటేల్. ఈ ప్రకటనలో నిజాం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
చదవండి: (తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?)
నిజాం లొంగుబాటు ప్రకటనతో ఐక్యరాజ్యసమితిలో హైదరాబాద్ సంస్థానం వేసిన పిటిషన్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. నిజాం తన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నానని దక్కన్ రేడియోలో చేసిన ప్రకటన బీబీసీ రేడియోలోనూ ప్రసారం అయింది. ఆ తరువాత ఈ పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెట్టారు. 1979వరకు ఈ పిటిషన్ ఐక్యరాజ్యసమితి వద్ద పెండింగ్‌లోనే ఉంది. ఆ తరువాత ఈ పిటిషన్‌ను కొట్టివేశారు. ఇక లొంగిపోయిన నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్‌ను భారత సైన్యాలు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించాయి. ఇక ఖాసీం రజ్వీని అరెస్టు చేసి జైలుకు పంపారు. తరువాతి కాలంలో రిజ్వీ పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. ఇక భారత సైన్యాలకు లొంగిపోయిన నిజాం తనకు రజాకార్లకు సంబంధం లేదని ప్రకటించాడు. లొంగిపోయిన నిజాంను ఏంచేయాలనే విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా చర్చించింది. ప్రస్తుతానికి నిజాం రాజు పేరు పైనే పరిపాలన సాగించాలని.. పౌరప్రభుత్వాన్ని భారత సైన్యం ఏర్పాటు చేస్తుందని పటేల్ నిర్ణయించారు. జనరల్ జెఎన్ చౌదరిని సైనిక గవర్నర్‌గా నియమించి పాలనను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.
ఆపరేషన్ పోలో పూర్తయిన సెప్టెంబర్-17 నుంచి హైదరాబాద్ సంస్థానంలో భారత చట్టాలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా త్రివర్ణ పతాకం సగర్వంగా తెలంగాణా గడ్డపై రెపరెపలాండింది. తరువాతి కాలంలో భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్‌ప్రముఖ్‌గా నిజాంను నియమించింది. ఆయన చనిపోయే వరకు ఆ పదవిలో కొనసాగాడు.
Comments
Please login to add a commentAdd a comment