September 17
-
సెప్టెంబర్ 17.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
హైదరాబాద్, సాక్షి: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 17రోజున తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొంది. జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేసే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది. చదవండి: అణచివేతపై సాయుధ పోరాటం!చదవండి: నలువైపులా ముట్టడి.. ‘ఆపరేషన్ పోలో’ పేరిట భారత ఆర్మీ సైనిక చర్యచదవండి: అవును... చరిత్ర వక్రీకరణ మహానేరం! -
అమిత్ షాతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ భేటీ
Updates.. ► తెలంగాణలో పార్టీ కార్యవర్గంపై అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీలో కోఆర్డినేషన్‌పై పలు అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో అమిత్ షా చర్చించినట్లు సమాచారం. అందరినీ కలుపుకుని పోవాలని నాయకులకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. ► కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు బండి సంజయ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణ నియోజకవర్గాల్లో పర్యటించి సమర్పించిన నివేదికలపై ప్రస్తుతం జరిగిన భేటీలో చర్చించారు. తెలంగాణ నియోజకవర్గాల్లో పార్టీ బలబలాలపై వివిధ రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు గతంలో సంచరించి ఓ నివేదికను రాష్ట్ర అధిష్ఠానానికి సమర్పించిన విషయం తెలిసిందే. ► అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు వందనాలు. ఉస్మానియాలో వందేమాతం పేరుతో ఆందోళనలు జరిగాయి. పటేల్ లేకుంటే తెలంగాణకు విమోచనం కలిగేది కాదు. తెలంగాణ ప్రజలపై జనరల్ డయ్యర్ బుల్లెట్ల వర్షం కురిపించారు. రజాకార్ల అరాచకాలకు పరకాల సజీవసాక్ష్యంగా నిలుస్తుంది. పరకాలలో అనేక మంది అమరులయ్యారు. తెలంగాణ చరిత్రను 75ఏళ్ల పాటు వక్రీకరించారు. ► చంద్రయాన్-3 విజయంతో భారత్‌కు అంతర్జాతీయ కీర్తి. డిజిటల్ రంగంలో భారత్ దూసుకుపోతోంది. స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా కాంగ్రెస్ వక్రీకరించింది. మోదీ ప్రధాని అయ్యాక ఆ పొరపాటును సవరించాం. ఈరోజు మోదీ పుట్టినరోజు సేవాదివస్గా జరుపుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసమే విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. విమోచనంపై రాజకీయం చేసేవారిని ప్రజలు క్షమించరు. సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం జరిపించడానికి కారణాలున్నాయి. భవిష్యత్ తరాలకు నాటి పోరాటయోధులను గుర్తుచేయడం, పోరాట యోధులను సన్మానించడమే అని అన్నారు. ► పారామిలటరీ బలగాల గౌరవవందనం స్వీకరించిన అమిత్ షా. ► సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించిన అమిత్ షా. ► జాతీయ జెండా ఎగురవేసిన అమిత్ షా. ► వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన అమిత్ షా. ► తెలంగాణ సాయుధ పోరాట వీరులకు అమిత్ షా నివాళులు అర్పించారు. అనంతరం, గౌరవ వందనం స్వీకరించారు. ► కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. ► పరేడ్ గ్రౌండ్ చుట్టూ సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. ► తెలంగాణ బీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి.. ఆదివారం ఉదయం పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేశారు. ► ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ.. ప్రతీ ఏడాది పార్టీ ఆఫీసుల్లో వేడుకలను నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నిజాం సైన్యం అనేక మందిని ఊచకోత కోసింది. తెలంగాణకు 13 నెలలు స్వాతంత్ర్యం ఆలస్యంగా వచ్చింది. ఎంతో మంది బలిదానంతో తెలంగాణకు స్వేచ్చ లభించింది. ► తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ► ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు విభాగం గతానికి భిన్నంగా పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ► ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటు పరేడ్ గ్రౌండ్, ఇటు పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌ను శనివారం నాటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ► ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. మొత్తమ్మీద దాదాపు 2500 మంది సిబ్బందిని రెండు చోట్ల మోహరిస్తున్నారు. -
Sep 17: అటు సోనియా.. ఇటు అమిత్ షా?
సాక్షి, హైదరాబాద్: ఈసారి సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణ రాజకీయాలు జాతీయస్థాయిలో చర్చకు కేంద్ర బిందువు కానుంది. కాంగ్రెస్-బీజేపీలు పోటాపోటీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ తుక్కుగూడలో.. బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున జనంతో సభలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాయి. తుక్కుగూడ సభకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరవుతారని పార్టీ ప్రకటించగా.. పరేడ్‌గ్రౌండ్‌లో విమోచన దినోత్సవ వేడుకలకు కిందటి ఏడాదిలాగే అమిత్ షా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పది లక్షల మంది ఈ సభకు హాజరు అవుతారని కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ప్రకటించింది. తుక్కుగూడను అందుకు వేదికగా ఎంచుకుంది. ఆ తేదీ, అంతకు ముందు రోజు నగరంలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగబోతున్నాయి. సోనియా గాంధీ సైతం తుక్కుగూడ సభకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది తెలంగాణ పీసీసీ. అయితే.. కాంగ్రెస్ తుక్కుగూడ సభకు పోటీగా బీజేపీ సైతం నగరంలో సభను ప్లాన్ చేసింది. పరేడ్ గ్రౌండ్‌లోనే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను కిందటి ఏడాది తరహాలోనే కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించాలని.. ఈ క్రమంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. వీలైనంత ఎక్కువ జనసమీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేరోజు.. అదీ తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ దినం రాగానే హైదరాబాద్ నగరంలో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాలకు పోటీ పడుతుండడం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇరు పార్టీలు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుంటాయనేది ఊహించిందే అయినప్పటికీ.. పరస్పర విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ఇదీ చదవండి: ఎటూ తేలలేదు.. 100 సీట్లలో ఒక్కో పేరే! -
మునుగోడు కోసమే ‘విమోచన’
తెలంగాణలో సెప్టెంబర్ 17 అన్నది విలీనమా, విమోచనా, విద్రోహమా లేక విద్వేషమా అనే వాదనను పక్కన పెడితే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కనీస చారిత్రక అంశాలు కొన్ని ఉన్నాయి. అసఫ్ జాహీ వంశస్థులు మొఘల్ పాలన నుంచి విడిపోయి, నిజాం పాలకులుగా (1724–1948) పేరొందారు. నిజాంలు మత ప్రాతిపదికన ఏలినవారు కాదు, స్వతంత్రులూ కారు. ‘ట్రియటీ ఆఫ్ సబ్సిడియరీ అలయెన్స్’ పేరిట, 1800లో బ్రిటిష్ వారికి అధీనులుగా ఒప్పందం చేసుకొన్న అనేక మంది హిందూ రాజుల వంటివారే. తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కూడా హిందూ ఫ్యూడల్స్ నిజాం మంత్రులుగా పనిచేశారు. వారిలో అత్యధికులు కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత కూడా పోలీసు చర్య జరిగే వరకూ కాంగ్రెస్ టోపీలు పెట్టు కోలేదు! విలీన చర్చల్లోనూ హిందూ సలహాదారులు నిజాం పక్షానే ఉన్నారు. ఆ చర్చల్లో కేంద్రం పక్షాన, నిజాం తరఫున ఇరు వైపులా బ్రిటిషువారే ఉన్నారు. పటేలుకు 1948 మార్చిలో గుండెపోటు రావడం వల్ల ఎక్కువగా మౌంటుబాటెనే కీలక సమావేశాల్లో పాల్గొ న్నారని విలీన వ్యవహారాల కార్యదర్శి, పటేలు కుడిభుజం అయిన వీపీ మీనన్ తన పుస్తకంలో రాశారు. నిజాం పాలన కానీ, విలీన వ్యతిరేకత కానీ, ఆ మాట కొస్తే నిజాం వ్యతిరేక ప్రతిఘటన కానీ ఏవీ మతం ఆధారంగా లేవు. రజాకార్లు కూడా నిజాం పాలన మొదటి నుంచీ లేరు. తర్వాతి దశలో 1938లో ఏర్పడిన ‘వాలంటీర్ల’ సంస్థకు చెందినవారు. ఆ సంస్థ 1947 తర్వాతే కిరాయి ప్రైవేటు సైన్యంలా దౌర్జన్యకర పాత్ర నిర్వహిం చింది. 1915లోనే ఏర్పడిన హిందూ మహాసభ గానీ, 1925లో ఆవిర్భవించిన ఆరెస్సెస్ గానీ నిర్వహించిన నిజాం వ్యతిరేక పాత్ర అక్షరాలా సున్నా. నిజాం నిరంకు శత్వం నుండి తెలంగాణను పటేల్ విముక్తి చేశారనీ, నెహ్రూ ముస్లిం పాలకుడి పట్ల మెతకగా ఉన్నారనీ అసత్య ప్రచారాలు మాత్రం జరిగాయి. నిజాంని 1947 ఆగస్టు తర్వాత కూడా ఏడాదిపాటు కొనసాగించటానికి యథా తథ స్థితి ఒప్పందం చేసుకొన్నది నెహ్రూ, పటేల్‌లతో కూడిన నాయకత్వమే. ఆ విషయంలో వారి మధ్య విభేదాల్లేవు. పటేలు మరణించిన 1950 చివర్లో, ఆ తర్వాత 1951 చివరి దాకా మిలిటరీ తెలంగాణలో స్వైర విహారం చేసింది. దానివల్ల నాలుగు వేల మంది రైతాంగ కార్యకర్తలు హతులయ్యారు. లక్షమంది జైళ్ల పాలయ్యారు. అలా చూస్తే ఇది రైతాంగ విప్లవం నుంచి ఫ్యూడల్ రాజు నిజాంకు లభించిన విమోచన తప్ప వేరేమీ కాదు. (క్లిక్ చేయండి: బీఆర్ఎస్ అంటే ఏంది?) ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేడు... 75 ఏళ్ల చారిత్రక ఘట్టమే. మరి ఉత్సవాలను నిర్వహించాలని ముందే నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? మొన్నటి జూలైలో బీజేపీ అఖిలభారత సమావేశం హైదరాబాదులో జరిగినప్పుడు, ఆ తర్వాత ఆగస్టు 15న కానీ తీసుకోలేదు. సెప్టెంబరు 3న హడావుడిగా తీసుకున్నారు. ఆనాడు లేనిదీ, నేడున్నదీ మునుగోడు ఎన్నిక! ఇదంతా బీజేపీ దేశభక్తి కాదు, 2023 తెలంగాణ ఎన్నికల్లో ముక్తి కోసమే. దానికి మునుగోడు అసెంబ్లీ ఎన్నిక రిహార్సల్. ప్రజలు గమనించకుండా ఉంటారా! – సీహెచ్.ఎస్.ఎన్. మూర్తి ఎఫ్ఐటీయూ ప్రధాన కార్యదర్శి -
అవును... చరిత్ర వక్రీకరణ మహానేరం!
‘చరిత్ర వక్రీకరణ మహానేరం’ పేరిట సెప్టెంబర్ 22 నాటి మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసాన్ని చదివిన తరువాత వక్రీకరణ వాస్తవంగా ఎక్కడ, ఎలా మొదలౌతుందో అర్థమైంది. దేశ విభజనానంతరం సంస్థానాల విలీనం విషయంలో ఒక అబద్ధం ప్రచారమౌతోంది. సంస్థానాధీశులకు భారత్‌లో కలిసేందుకు, లేదా పాకిస్తాన్లో కలిసేందుకు, లేదా స్వతం త్రంగా ఉండేందుకు బ్రిటిషర్లు అధికారాన్ని కల్పించారనేది అబద్ధం. బ్రిటిష్ ప్రభుత్వం వారికి భారత్ లేదా పాకిస్తాన్లో విలీనమయ్యే అవకాశాన్ని మాత్రమే కల్పించింది. స్వతంత్రంగా ఉండేలా మూడో ఆప్షన్ లేదు. అలా ఉన్నట్టయితే దయతో తదనుగుణమైన బ్రిటిష్ ప్రభుత్వ డాక్యుమెంట్లను చూపించాలి (ఏ ఆధారమూ చూపని కొన్ని ఇంగ్లీషు పుస్తకాలను కోట్ చేస్తే సరిపోదని సవినయ మనవి). బ్రిటిషర్లు విలీనానికి మతంతో కూడా ముడిపెట్టలేదు. ప్రిన్సిపుల్ ఆఫ్ కంటిగ్యుటీ (సామీప్యతా సూత్రం) అంటే భారత్ సమీపంగా ఉంటే భారత్‌లో, పాకిస్తాన్ సమీపంలో ఉంటే పాకిస్తాన్లో ఉండేలా నిర్ణయం తీసుకోవచ్చు. దీని ప్రకారం హిందూ జనాభా అధికంగా ఉండి, హిందూ రాజు ఉన్న రాజస్థాన్‌లోని అమర్ కోట్ సంస్థానం పాకిస్తాన్లో చేరింది. కశ్మీర్ తప్ప మిగతా సంస్థానాధీశులు వారు కోరుకున్నా పాకిస్తాన్లో విలీనం కాలేరు. కాబట్టి భారతదేశం లోపల ఉండే హైదరాబాద్ స్వతంత్రంగా ఉండే ఆప్షన్ లేనే లేదన్నది స్పష్టం. మౌంట్ బాటన్ స్వయంగా ఈ విషయాన్ని నిజాంకి, ఆయన ప్రతినిధులైన వాల్టర్ మాంక్టన్, నవాబ్ ఆఫ్ ఛత్తారీలకు పలుసార్లు స్పష్టం చేశాడన్నది చారిత్రక వాస్తవం. నిజాం చేసుకున్న యథాతథస్థితి ఒప్పందం (స్టాండ్ స్టిల్ ఒప్పందం) కూడా స్వతంత్రంగా ఉండేందుకు కాదు. విలీనాన్ని ఒక సంవత్సరం జాప్యం చేసేందుకే. పాకిస్తాన్ అన్న ఆలోచనను బ్రిటిషర్ల సహకారంతో 1930వ దశకంలో సృష్టించిన చౌధురీ రహమత్ అలీ భారత్‌లో మూడు ముస్లిందేశాలు ఉండాలని ప్రతిపాదించాడన్నది మరిచిపోరాదు. మొదటిది పాకిస్తాన్. రెండవది నేటి బంగ్లాదేశ్. దానిని బంగిస్తాన్ అన్నాడు. మూడవది ఉస్మానిస్తాన్. అంటే హైదరాబాద్. ఉస్మానిస్తాన్ ఆలోచన వెనుక దాగున్న మతోన్మాద సూత్రాన్ని మరిచిపోరాదు. పాశ్చాత్య కూటమిలో చేరకూడదన్న భారత నేతల నిబద్ధతాపూర్వకమైన నిర్ణయం వల్లే బ్రిటిషర్లు భారత్‌ను దిగ్బంధనం చేసేందుకు పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున తూర్పు పాకిస్తాన్ (తరువాత బంగ్లాదేశ్), ఉత్తరాన ముస్లిం జనాధిక్య జమ్మూ కశ్మీర్ సంస్థానం, దక్షిణాన ఉస్మానిస్తాన్ ఏర్పాటయ్యేలా ప్రయత్నించారు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్న నిజాం కుట్రలకు ఫ్రాన్స్, అమె రికా, కొలంబియా, కెనడా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా వంటి పాశ్చాత్య కూటమి దేశాలు అందుకే సమర్థించాయి. రష్యా, చైనా, యుక్రేన్ వంటి కమ్యూనిస్టు దేశాలు భారత అలీన విధానాన్ని సమర్థించి, ఈ సామ్రాజ్యవాద యత్నానికి పురిట్లో సంధికొట్టాయి. లక్ష్మయ్య సర్వసాధారణ కమ్యూనిస్టులందరిలాగానే జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డిలను ప్రస్తావించారు. కానీ జటప్రోలు, రెంటచింతల, గద్వాల, కొల్లాపూర్, వనపర్తి, పాల్వంచ, సంస్థాన్ నారాయణపూర్ వంటి ఉప సంస్థానాల్లో విస్నూరు, మానుకోటల్లో లాగా ఎందుకు తిరుగుబాటు రాలేదో ప్రస్తావించలేదు. ఆదిలా బాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్ వంటి తెలంగాణ జిల్లాల్లో, ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న మరాఠ్వాడా ప్రాంతాలైన బీడ్, పర్భనీ, నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్‌లలో, కళ్యాణ కర్ణాటక లోని బీదర్, రాయచూర్, గుల్బర్గాలలో సంస్థానాధీశులు లేరా? కొంత నల్గొండ, కొంత వరంగల్, కాసింత రంగారెడ్డి జిల్లాకి మాత్రమే ప్రధానంగా పరిమితమైన కమ్యూనిస్టుల పోరాటం ఈ మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో ఎందుకు విస్తరించలేదు? మల్లె్లపల్లి లక్ష్మయ్య కన్వీనియంట్‌గా ప్రస్తావించని మరో విషయం ఉంది. ఘనత వహించిన నిజాం ప్రభువు 1943లో కమ్యూనిస్టులపై నిషేధాన్ని ఎందుకు ఎత్తివేశారు? దాశరథి రంగాచార్య తన ‘జీవన యానం’లో, వందేమాతరం రామచంద్రరావు తన ‘హైదరాబాద్‌పై పోలీసు చర్య’లో సెప్టెంబర్ 17 తరువాత రజాకార్ల ఆయుధాలన్నీ కమ్యూనిస్టుల చేతికి చేరాయని రాశారు. కమ్యూనిస్టులు దీనిని ఎందుకు ఖండించరు? సెప్టెంబర్ 17, 1948 తరువాత 1951 వరకూ కమ్యూనిస్టులు ఎవరిపై సాయుధ పోరాటం చేశారు? లేని నిజాంపైనా? ఉన్న భారత ప్రభుత్వం పైనా? భారత సేనలు అన్న పదానికి బదులు ‘యూనియన్ సేనలు’ అనే పదాన్ని ఉపయోగించి భారత వ్యతిరేక పోరాటానికి ఎందుకు రంగులద్దుతున్నారు? రావి నారాయణ రెడ్డి ఈ సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు. ప్రజలు భారత ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నా దానిపై పోరాటం చేయడం సరైనది కాదని చెప్పారు. సుందరయ్య–బసవపున్నయ్య–చండ్ర రాజేశ్వర త్రయం దానిని తోసిపుచ్చారు. ఈ మొత్తం ఉదంతాన్ని చాపకిందకి తోసి, సగం చరిత్ర చెప్పడానికి కారణమేమిటి? హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్నది కమ్యూనిస్టుల లక్ష్యం. 1948–1951 వరకూ భారత్‌పై కమ్యూనిస్టులు పోరాడి, భారత ప్రభుత్వం పంపిన రాయబారి ద్వారకానాథ్ కాచ్రూను కలవడానికి నిరాకరించి, ఆ తరువాత 1952లో ఎలాంటి గ్యారంటీలూ పొందకుండానే, ఏమీ సాధించకుండానే మూడేళ్ల రక్తసిక్త పోరాటం ఆపి, ఎన్నికల్లో పాల్గొని తగుదునమ్మా అంటూ ఎంపీలు అయ్యారు. మరో అవాస్తవం సుందర్ లాల్ కమిటీ గురించి. దానిని భారత ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, నిజాం ప్రభువు కానీ నియమించలేదు. అది నెహ్రూ వ్యక్తిగతంగా పంపిన సుహృద్భావ ప్రతినిధి బృందం. పండిత్ సుందర్ లాల్, కాజీ మహ్మద్ అబ్దుల్ గఫార్లతో కూడిన ఈ బృందం ముస్లింలను కలిసి, భారత ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టబోదని నమ్మకం కలిగించింది. (క్లిక్ చేయండి: పుస్తక ప్రచురణపైనా పెత్తనమేనా?) వాస్తవానికి హైదరాబాద్ సంస్థాన చరిత్రను మూడు వేర్వేరు ముక్కలుగా చదువుతున్నాం. కర్ణాటకలోని మూడు జిల్లాలు, మరాఠ్వాడాలోని జిల్లాల చరిత్రను తెలంగాణ చరిత్రతో కలిపి చదివితేనే సమగ్రత వస్తుంది. లేని పక్షంలో గుడ్డివాళ్లు ఏనుగుని వర్ణించినట్టు చదవడం జరుగుతుంది. అలా చేసినంత కాలమూ రెండు మూడు జిల్లాల చరిత్రనే మొత్తం 82 వేల చ.కి.మీ. వైశాల్యమున్న, కోటికి పైగా జనాభా ఉన్న, 17 జిల్లాలున్న సువిస్తృత సంస్థాన చరిత్రగా లక్ష్మయ్య గారు భ్రమించినట్టు భ్రమించడం జరుగుతుంది. (క్లిక్ చేయండి: చరిత్రను కాటేయ జూస్తున్నారు!) - కస్తూరి రాకా సుధాకర రావు సీనియర్ జర్నలిస్ట్ -
చల్నేదో బాల్ కిషన్
కతలు జెప్తున్నరు. చెవుల పూలు బెడ్తున్నరు. చెట్టు పేరు జెప్పి కాయలమ్ము కుంటున్నరు. కాయలను గాదు. ఏక్ దమ్ పండ్లనే అమ్ముకుంటున్నరు. ఎవలమ్ముకుంటున్నరు? ఎందు కమ్ముకుంటున్నరు? ఎవరంటె మన లీడర్లే. ఇంతకు గా చెట్టేంది? గది ఏందో గాదు. నిజాం చేత్లకెల్లి గుంజుకొన్న తెలంగాననే. బందూకులు బట్కోని రజాకార్ల తోని కొట్లాడినోల్ల గురించి మొన్నటిదాంక తప్పిజారి ఒక్క లీడర్ గుడ్క మాట్లాడలే. గియ్యాల గా లీడర్లే తీస్ మార్ కాన్ లెక్క ఫోజు గొడ్తున్నరు. గాల్లే నిజాం సర్కార్‌ను కూలగొట్టి తెలంగానకు సతంత్రం తెచ్చినట్లు మాట్లాడ్తున్నరు. గా దినం అయితారం. అంబటాల్లయింది. కడ్పులు ఎల్కలు చెంగడ బింగడ దుంకుతున్నయి. తలె ముంగట గూసున్న. కోడికూర తోని నా పెండ్లాం బువ్వ బెట్టింది. అంచుకు ఎల్లిగడ్డతొక్కు ఏసింది. సరింగ గప్పుడే మా తాత బోన్గిరి కెల్లి వొచ్చిండు. గాయిన పెండెం వాసుదేవ్, జైని మల్లయ్య గుప్త, గుండా కేశవులు, ముత్యం ప్రకాశ్, మాదాసు యాదగిరి అసువంటోల్లతోని గల్సి బందూకు బట్టి రజాకార్లతోని కొట్లాడినోడు. ‘‘తాతా! బువ్వ తిందురాయె’’ అన్న. గాయిన కాల్లు చేతులు గడుక్కోని నా పక్క పొంటి వొచ్చి గూసున్నడు. బువ్వ దినుకుంట ముచ్చట బెట్ట బట్టిండు. ‘‘ఇంతకుముందు టీఆర్ఎస్ మోటర్ బోయిన తొవ్వ మీదికెల్లే కడ్మ పార్టీలు బొయ్యేటియి. గని గిప్పుడు బీజేపీ ఏసిన తొవ్వ మీది కెల్లే టీఆర్ఎస్ మోటార్ బొయ్యే గతి బట్టింది’’ అని అన్నడు. ‘‘తాతా! నువ్వెప్పుడు రాజకీయాలే మాట్లాడ్తవేందే’’ ‘‘రాజకీయాలు గానిదేమన్న ఉన్నాదిర. బారతం రాజకీయమే. రామాయనం గూడ రాజకీయమే’’. ‘‘రామాయనం రాజకీయమెట్ల అయితదే?’’ ‘‘రాముని దిక్కు దుంకె బట్కె విబీషనుడు లంకకు రాజయిండు. నిజం జెప్పాలంటె పార్టీ ఫిరాయింపులు గాయినతోనే షురువైనయి’’ ‘‘బీజేపీ ఏసిన తొవ్వ మీదికెల్లే టీఆర్ఎస్ మోటర్ బోయిందంటివి. గదేందో జెర కుల్లకుల్ల జెప్పు తాతా’’ ‘‘మొన్న 17 తారీకు పరేడ్ మైదాన్ల సెంటర్ల ఉన్న బీజేపీ సర్కార్ తెలంగాన విమోచన దినం జేసింది. గా దాన్కి సెంటర్ హోం మంత్రి అమిత్ షా వొచ్చిండు. ‘మా సర్కారొస్తె సెప్టెంబర్ 17 తారీకు నాడు తెలంగాన విమోచన దినం జేస్తమన్నోల్లు గాల్ల సర్కారొచ్చినంక రజాకార్ల బయంతోని తెలంగాన విమోచన దినం జెయ్యలేదు. గియ్యాల మేము జేస్తుంటె అన్ని పార్టీలు జేస్తున్నయి’ అన్కుంట గాయిన స్పీచ్ గొట్టిండు’’. ‘‘ఇంతకుముందు కేసీఆర్ తెలంగాన విమోచన దినం ఎందుకు జెయ్యలేదు?’’ ‘‘విమోచన గాదు, మన్నుగాదు. గది జేస్తేంది, చెయ్యకుంటేంది. గదొక పెద్ద ఎజెండనా? గది జెయ్యకుంటె గీ దేసం ఏమన్న మున్గుతదా అని అసెంబ్లీల అన్న కేసీఆర్ ఇయ్యాల బీజేపీ సెట్ జేసిన ఎజెండలకే వొచ్చిండు. సమైక్యత వజ్రోత్సవం అన్కుంట కేసీఆర్ 17 తారీకు పబ్లిక్ గార్డెన్ల మూడు రంగుల జెండ ఎగిరేసిండు. ‘మత పిచ్చిగాల్లు దేసంను ఆగమాగం జేస్తున్నరు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తం. దలిత బందు తీర్గనే గిరిజన బందు బెట్టి ఒక్కో గిరిజన కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇస్తం’ అన్కుంట కేసీఆర్ స్పీచ్ గొట్టిండు’’ అని మా తాత జెప్పిండు. ‘‘హుజూరాబాద్ బై ఎలచ్చన్లు వొచ్చినప్పుడు దలిత బందు అన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లు రాంగనే గియ్యాల గిరిజన బందు అంటున్నడు తాతా!’’ ‘‘అవ్ ఎలచ్చన్లు వొస్తేనే ముక్యమంత్రికి జెనం యాది కొస్తరురా’’ (క్లిక్: గటు దిక్కు బోవద్దు గన్పతీ!) ‘‘అమిత్ షాను బీజేపోల్లు అబినవ సర్దార్ పటేల్ అంటె, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కెసీఆర్‌ను అబినవ అంబేడ్కర్ అని అంటున్నడే’’ ‘‘వారీ! ఎల్క తోలును ఒక్క తీర్గ యాడాది ఉత్కితె యాడనన్న తెల్లగైతదా? అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేలైతడా? కేసీఆర్ యాడనన్న అంబేడ్కర్ అయితడా?’’ అని మా తాత అడిగిండు. బువ్వ దిన్నంక గాయిన మంచం మీద ఒరిగిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) తోక: పొద్దు మీకింది. ఎప్పటి లెక్కనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బకాడ్కి బోయిన. గాడ పాన్లు దినుకుంట మా దోస్తులు ముచ్చట బెడ్తున్నరు. ‘‘నమీబియాకెల్లి గాలిమోటర్ల ఎన్మిది చిర్తపులులను మనదేసం దెచ్చిండ్రు. గవ్విట్ల మూడు చిర్తపులులను కన్జరేషన్ బాక్సులకెల్లి కునో జాతీయ పార్క్‌లకు ప్రతాని మోదీ ఇడ్సి పెట్టిండు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘నెలొద్దుల ముందుగాలనే గ్యాస్ బండ, పిట్రోలు అనేటి రెండు చిర్తపులులను ప్రతాని జెనం మీద్కి ఇడ్సిపెట్టిండు’’ అని మా సత్నారి అన్నడు. నివొద్దే గదా! - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
చరిత్ర వక్రీకరణ మహానేరం
చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే ఆయుధాల కన్నా ప్రమాదకరం. అది ప్రజలను తరతరాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. చరిత్ర ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భావి తరాలకు మార్గదర్శి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాలకు చరిత్రను ఒక సాధనంగా చూడటమనేది స్వార్థ చింతన. చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేయడమనేది ఒక రాజకీయ దృక్పథంగా మారిపోవడం విషాదం. ప్రస్తుతం తెలంగాణ సమాజం అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం, సమైక్యత అనే వాదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిష్పాక్షిక దృష్టితో చూడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరికీ ఉంది.తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తోన్న శక్తుల సంఖ్య గణ నీయంగా పెరిగిపోతున్నది. అందుకుగానూ అసత్యాలను, అర్ధ సత్యాలను తమ అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. సమత, మమత, కరుణ, ప్రేమలకు ప్రతీకగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్వేషపు విషంతో నింపాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషాప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి నడిచిన గంగా–జమునా తెహెజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించినది కాదు. రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలు హిందూ సామాజిక వర్గానికి చెందిన జమీం దారులు, జాగీర్దారుల కబంధ హస్తాల్లో ఉండేవి. నిజానికి పరోక్షంగా నిజాంలు సాగించిన దుర్మార్గాల కన్నా, ఎందరో జమీందారులు, జాగీర్దారులు సాగించిన అమానుషాలు ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడమే సహజంగా జరుగుతోంది. ‘మానుకోట’(ఇప్పటి మహబూబాబాద్) జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులు జరిపిన దారుణాలు మనం చరిత్రలో మరెక్కడా చూడం. వీటన్నింటికీ రజాకార్ల దాడులు, దౌర్జన్యాలు తోడయ్యాయి. హిందూ జమీందార్లు, ముస్లిం రజాకార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి దౌర్జన్యాలకు వేదికగా తయారైంది. రజాకార్ అంటే స్వయం సేవకులు అని అర్థం. రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉండేవారు. ప్రభుత్వానికి అండగా ఉండడానికి రజాకార్లను వినియోగించాలన్న కొందరు ముస్లిం జమీదారుల ఒత్తిడికి తలొగ్గి వారికి ప్రత్యేకమైన అధికారాలను ప్రకటించారు. దీనితో రజాకార్లు కమ్యూనిస్టులపైనా, ఇతర ఉద్యమకారులపైనా దాడులు కొనసాగించారు. 1947 జూలై 30 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు రజాకార్లు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన మాట నిజం. వాళ్ళను ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలి చింది కమ్యూనిస్టులే. జమీందారుల, భూస్వాముల దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలిచిన దొడ్డి కొమరయ్య హత్యతో అంటే 1946 జూలై 4న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసు కొన్నప్పకీ అన్ని విషయాల్లో స్వేచ్ఛగానే నిర్ణయాలు తీసుకునేది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్‌లో ఉంచింది. అదే మనం ఇప్పుడు చూస్తోన్న హైదరా బాద్‌లోని కంటోన్మెంట్. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్‌లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు. కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు తాము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాయి. అందుకుగానూ భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒక ఒడంబడికను కుదుర్చు కున్నాయి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధ నలను పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటివరకూ బ్రిటిష్ పాలనలో లేని సంస్థానం అటు పాకిస్తాన్‌లోగానీ, ఇటు భారతదేశంలో గానీ చేర వచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకి స్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. భారతదేశంతో మాత్రం స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో ఉనికిలోకి వచ్చిన రజాకార్ల దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది. ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. భారత ప్రభుత్వం పెంచుతోన్న ఒత్తిడిని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం కొన సాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలనీ, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలనీ నివేదించింది. అది 1948 ఆగస్టు 21న చర్చలకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న పది దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, కొలంబియా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా అభ్యర్థనను స్వీకరించ డానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నాయి. ఇది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానిని ఒక రెండు రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు తెరవెనుక కథ నడిపారు. అప్పటికే భారత సైన్యం హైదరాబాద్‌లో సైనిక చర్యలను ప్రారంభించింది. దాదాపు హైదరా బాద్ సంస్థానం పూర్తిగా ఆక్రమణకు గురైంది. తెల్లారితే సెప్టెంబర్ 17. ఆరోజు హైదరాబాద్‌ను హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నంకల్లా నిజాం చేత భారత ప్రతినిధి కె.ఎం.మున్షీ ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరఫున భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామనేది అందు లోని ప్రధానాంశం. సెప్టెంబర్ 12న మొదలుపెట్టిన సైనికదాడి మొదటి లక్ష్యం ఐక్యరాజ్య సమితి నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకునేటట్టు చేయడం. సైనిక చర్య జరిగిన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైన్యం చేతిలో గానీ, అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లోగానీ 25 వేల నుంచి 30 వేల మంది వరకు మరణించినట్టు నిజాం ప్రభుత్వం నియమించిన సుందర్‌లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఇది ఒక ఘట్టం. దీనినే మనం విమోచన అంటున్నాము. విమోచన అంటే శత్రువును పదవీ చ్యుతుడిని చేయాలి. కానీ అలా జరగలేదు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుమీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. 1948 సెప్టెంబర్ 17న నిజాంను లొంగదీసుకున్న తరువాత భారత సైన్యం కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలను దోచుకున్న దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దార్లు కమ్యూనిస్టుల పోరాటంతో ఊళ్ళొదిలి పెట్టారు. భారత సైన్యం రావడంతో, కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ పల్లెలకు వచ్చారు. భారత సైన్యం, భూస్వాములు, గూండాలు కలిసి ఊరూరునీ వల్లకాడుగా మార్చేశారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణ వరకూ దాదాపు 4 వేల మంది కమ్యూనిస్టులతో పాటు, వేలాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మరి 1948 సెప్టెంబర్ 17న విమోచన అయితే, 1951 వరకు భారత సైన్యం తెలంగాణ పల్లెలపై ప్రకటించిన యుద్ధం ఎవరి విమోచనం కోసం జరిగింది? కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది నిజాం బలవంతపు లొంగుబాటుగానే చరిత్ర మనకు చెబుతున్నది. ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలంగాణ పల్లెల్లో నెత్తురు ప్రవహించింది. అందువల్ల మనం సెప్టెంబర్ 17న జరపాల్సింది సంబురాలు కాదు. మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడమే. రజాకార్ల దౌర్జన్యా లనూ, అమానుషాలనూ ఎండగట్టాల్సిన సమయమిదే. కానీ భారత సైన్యం జరిపిన నరమేధాన్ని తక్కువ చేసి చూడటం ముమ్మాటికీ సరికాదు. తెలంగాణ ప్రజలు అటు నిజాం రాజు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోయారు. రజాకార్ల అమానుషాలను అనుభవించారు. అదేవిధంగా భారత సైన్యం చేసిన విధ్వంసాన్ని, వినాశనాన్ని కూడా చవిచూశారు. ఇదే వాస్తవం. ఇదే నగ్న సత్యం. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
భిన్నత్వంలో ఏకత్వమే మా లక్ష్యం
సాక్షి, సిరిసిల్ల: భిన్నత్వంలో ఏకత్వం తమ లక్ష్యమని, అరవైఏళ్ల స్వీయ అస్తిత్వ పోరాటం తర్వాత అవతరించిన తెలంగాణ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనకు పరివర్తన చెందిన రోజన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి రంగాల్లో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్నారు. నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హెల్త్ ప్రొఫైల్‌ను ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో చేపట్టామని వివరించారు.అంబేడ్కర్ పేరును రాష్ట్ర సెక్రటేరియట్‌కు పెట్టి మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కొందరు మత పిచ్చితో మంటలు రేపాలని చూస్తున్నారని, మన మధ్య ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా -
మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో, రాష్ట్రంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి. సంకుచిత ప్రయోజనాల కోసం మనుషుల మధ్య ముళ్లకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి.. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చు కునే నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. నాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని ఈ అవకాశవాదులు చిల్లర రాజకీ యాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీక రించి మలినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. శనివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. దుష్టశక్తుల యత్నాలను తిప్పికొట్టాలి ‘‘గత ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో ప్రగతిబాటలో పయనిస్తోంది. కానీ ఇప్పుడు మతతత్వ శక్తులు బయలుదేరి తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. మనుషుల మధ్య విభజన, మతం చిచ్చు సరికాదు. ఇవి ఈ విధంగా విజృంభిస్తే దేశం, రాష్ట్రాల జీవికనే కబళిస్తాయి. ఆ దుష్టశక్తుల యత్నాలను బుద్ధి కుశలతతో తిప్పికొట్టాలి. ఏ కొంచెం ఆదమరిచినా.. ఎంత బాధాకరమైన వస్తాయనేదానికి మన గత తెలంగాణే ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటుతో తెలంగాణ 58 ఏళ్లు శాపగ్రస్త జీవితం అనుభవించింది. అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. అటువంటి వేదన మళ్లీ రాకూడదు. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప.. అశాంతితో అట్టుడికిపోవద్దు. నాటి ప్రజలంతా భాగస్వాములే.. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నాం. తెలంగాణ సమాజం ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి నాడు అవలంబించిన వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరిపిన త్యాగాల్లో.. నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. చిరస్మరణీయులైన యోధులను తలుచుకోవడం మన కర్తవ్యం. కొమురంభీం, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి దంపతులు, సురవరం ప్రతాపరెడ్డి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్‌లకు శిరసు వంచి నమస్కరిస్తున్నా.. నాడు, నేడు తెలంగాణ అగ్రగామే! తెలంగాణ దేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రం హైదరాబాద్ స్టేట్‌గా వెలుగొందింది. మిగులు నిధులతో అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని అడుగులు వేసింది. తర్వాత పడిన తప్పటడుగుల నుంచి విముక్తి పొంది 2014 జూన్ 2న తెలంగాణ తిరిగి సాకారమైంది. అప్పుడూ, ఇప్పుడూ అన్నిరంగాల్లోనూ పురోగమిస్తూ దేశానికే దారిచూపే టార్చ్‌బేరర్‌గా నిలిచింది’’. ఇదీ చదవండి: కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తి క్షీణిస్తోంది -
అబుదాబిలో తెలంగాణ దినోత్సవ వేడుకలు
సాక్షి, రాయికల్: అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ విమోచన ప్రాముఖ్యత గురించి పలువురు వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాజ శ్రీనివాస్‌రావు, వంశీక్రిష్ణ, గంగారెడ్డి, గోపాల్, సన్ని, సంతోష్, బాబు, జగదీశ్, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, రంజిత్, చరణ్ పాల్గొన్నారు. -
ఓడినా పైచేయి నిజాందేనంటూ.. మజ్లిస్ పత్రిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు ‘మీజాన్’ పేరుతో ఓ పత్రిక ఉంది. నరరూప రాక్షసుడిగా ముద్రపడ్డ ఖాసింరజ్వీ నేతృత్వంలో ఉన్న సంస్థ కావటంతో దాని పత్రిక కూడా నిజాం సేనలకు అనుకూల వార్తలతో జనాన్ని తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. ఓవైపు భారత సేనలు హైదరాబాద్‌ను చుట్టుముట్టడంతో నిజాం సైన్యం తోకముడిచినా.. ఎంఐఎం పత్రిక మీజాన్ మాత్రం, నిజాం సైన్యానిదే పైచేయి అంటూ తప్పుడు కథనాలను జనంలోకి వదిలింది. మరోవైపు నిజాం నియంత్రణలో ఉన్న హైదరాబాద్ రేడియో కూడా నిజాం సేనలు వీరోచితంగా పోరాడుతూ భారత సైన్యాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నాయని వార్తలు వెలువరించింది. సెప్టెంబర్ 17 సాయంత్రం వరకు జరిగిన ఈ తంతు ఆ తర్వాత ఆగిపోయింది. తప్పుడు వార్తలే కాదు, తుదకు ఆ పత్రిక, రేడియో కూడా ఆ తర్వాత మూగబోయాయి. సైన్యానికి స్వాగతం పలికిన జనంపై రజాకార్ల దాడులు భారత సైన్యం రాకను అడ్డుకోలేకపోయిన నిజాం సేనలు, ఆ అక్కసును సాధారణ ప్రజలపై చూపించాయి. నగరానికి చేరుకున్న భారత సైనిక పటాలాలను చూసి సంబరపడ్డ జనం, హారతులిచ్చి స్వాగతం పలికాయి. బొల్లారం మిలటరీ కేంద్రం వద్ద పండగ వాతావరణం నెలకొంది. సెప్టెంబరు 17న రాత్రి అక్కడికి దొంగచాటుగా చేరుకున్న రజాకార్ల బృందం సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో అమాయకులు బలయ్యారు. విషయం తెలుసుకున్న భారత సైనికులు గాలించి మరీ ముష్కరులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. చదవండి: (బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని) -
జాతీయాలతో జాతి భాష సంపన్నం
సెప్టెంబర్ 17, 2005. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటోన్న వేళ ఉదయం 10 గంటలకు వేముల పెరుమాళ్లు లేరన్న విషయం తెలిసింది. తెలంగాణ భాష కోసం, తెలంగాణ జాతీయాల కోసం, తెలంగాణ జానపదుల కోసం, తెలంగాణ సామెతల కోసం, తెలంగాణ పల్లె పదాల కోసం జీవితాంతం కృషి చేసిన వేముల పెరుమాళ్లు.. సరిగ్గా తెలంగాణ విమోచనం రోజే లోకాన్ని వీడడం యాధృచ్చికమే కావొచ్చు కానీ మరిచిపోలేని జ్ఞాపకంగా తన మరణాన్ని మార్చుకోవడం మాత్రం గొప్ప విషయం. తెలుగు సంస్కృతి అంతా ఒక్కటే! అయినా తెలంగాణ సంస్కృతిలో కొంత భిన్నత్వం ఉంది. భాషలో యాసలో ప్రత్యేకత ఉంది. అందుకు కారణం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పరాయి పాలనలో తెలుగు చదవడం, రాయడం నిషేధింపబడ్డ రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు వారి భాషను, యాసను పదిల పరుచుకున్నారు. వారి సామెతల్ని, జాతీయాల్ని , మౌఖిక సాహిత్యాన్ని, లిఖిత సాహిత్యాన్ని భద్ర పరుచుకున్నారు. నిజాం పాలకులు సృష్టించిన ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఇక్కడి ప్రజలు వాటిని కాపాడుకోవడం ఒక సాహసవంతమైన చర్య. "సాలు పొంటి సాలు తీరు"గా వారి అవ్వ నుంచి మారుమూల గ్రామీణుల నుంచి వాళ్ల వాక్కును కల్తీ కాకుండా తన భాషగా చేసుకుని కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన (పోయింది పొల్లు ఉన్నది గట్టి) జాతీయాల్ని ఏర్చికూర్చి "తెలంగాణ జాతీయాలు"గా గ్రంథస్తం చేశారు. ఉడుం పట్టు, దీక్ష కార్య శూరత్వం గల వారు ఎలాంటి మహాకార్యాన్నయినా అలవోక గా చేయగలరని తెలంగాణ జాతీయాలు పుస్తకం చూస్తే తెలుస్తుంది. వేముల పెరుమాళ్లు స్వస్థలం నాటి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల తాలుకా రాయికల్ గ్రామం. రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో విద్యాభ్యాసం చేసిన పెరుమాళ్లు.. శ్రీకాళహస్తిలోని గ్రామసేవక్ శిక్షణా కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధిలో డిప్లమో చేశారు. 1963 నుంచి 18 ఏళ్ల పాటు గ్రామీణాభివృద్ధి అధికారిగా మల్యాల, జగిత్యాల పంచాయతీ సమితులలో ఉద్యోగం చేశారు. 1981లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్ష ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాయికల్ మొదటి మండలాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉద్యోగం, రాజకీయం.. ఏ రంగంలో ఉన్నా.. సాహిత్యాన్ని మాత్రం మరవలేదు పెరుమాళ్లు. దశాబ్దకాలంగా కష్టనష్టాలకు ఓర్చి, పేర్చి కూర్చిన ఈ గ్రంథం తెలంగాణ జాతీయాలకు, సామెతలకు నిఘంటవుగా నేటికి ప్రతిబింబిస్తుంది. నోసుక పుట్టినట్టు వీరి మరణానంతరం తెలంగాణ జాతీయాల్ని ఇంటర్ ప్రథమ సంవత్సరం పాఠ్యాంశంగా స్వీకరించి వీరి శ్రమకు, తెలంగాణ భాషకు, యాసకు సముచిత గౌరవాన్ని కల్పించడం వీరికే కాదు తెలంగాణ జాతీయాలకు అగ్రాసనం వేసినట్టయింది. పెరుమాళ్లు తాత కైరం భూమదాసు గొప్ప వైష్ణవ భక్తుడు, కవి, గాయకుడు. కైరం భూమదాసు వ్రాతప్రతులను పరిష్కరించిన పెరుమాళ్లు 2002లో "వరకవి కైరం భూమదాసు కృతులు" గ్రంథాన్ని ప్రచురించారు. 1958 నుంచి 1968 మధ్య కాలంలో జరిగిన ఎన్నో జాతీయ పరిణామాలను వీరు పద్యాలుగా మలిచారు. వీరు రచించిన శ్రీ రాజరాజేశ్వర, శ్రీ ధరమపురి నృకేసరి శతకాలు సంబంధిత దేవాలయాలు ప్రచురించాయి. బాల సాహిత్యంలో వీరు చేసిన కృషి ఫలితంగా కిట్టూ శతకం (బాలనీతి), నిమ్ము శతకం (పర్యావరణ) వెలువడ్డాయి. మహాత్ముని మహానీయ సూక్తులను "గాంధీమార్గం" త్రిశతిగా రచించారు. "లోగుట్టు" వీరు రచించిన రాజనీతి చతుశ్శతి. ఎంతో కాలం వీరు సేకరించిన జాతీయాలు, సామెతలతో వెలువడిన గ్రంథం "తెలంగాణ జాతీయాలు". పెరుమాళ్లు మరణానంతరం వెలువడిన గ్రంథం మానవతా పరిమళాలు. 1983 నుంచి 2001 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి చేసిన "జ్యోతిపథం" లఘు ప్రసంగాల సంకలనం. జానపద సాహిత్యం కూరాడుకుండ లాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యతని సాహితీప్రియులందరిపై వేశారు పెరుమాళ్లు. జానపదుడు రుషీసుంటోడు, ఆయన నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయిలాంటిది. ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్లలో నాని రగిడిల్లింది. తెలంగాణ జాతీయాలు తరతరాల మన సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యం. చిల్లి బొక్కతీరు లక్షల్లో వున్న తెలంగాణ జాతీయాల్ని వేలలో "పోయింది పొల్లు, ఉన్నది గట్టి తీరు"గా గ్రంథస్తం చేశారు పెరుమాళ్లు. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో సజీవంగా జానపదుని నాలుకపై తచ్చాడుతున్న జాతీయాల్ని.. ఔత్సాహికులు మరింత శ్రమించి కొత్త సంపదను జాతికి ఇవ్వాలన్న వారి కోరిక తీర్చాల్సిన తరుణం మళ్లీ వచ్చింది. అదే తెలంగాణ సాహిత్యానికి తిరిగి చెల్లించాల్సిన రుణం. వి.ప్రభాకర్, తెలంగాణ కవి, రిటైర్డ్ రిజిస్ట్రార్, సహకారశాఖ -
Telangana Liberation Day 2022: మందు పాతరలు.. చివరి అస్త్రం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన సైన్య విభాగం బొల్లారం చేరకుండా చివరి ప్రయత్నంగా నిజాం సైన్యం మందుపాతర్లను ప్రయోగించింది. షోలాపూర్–హైదరాబాద్ రహదారి మీదుగా వస్తున్న మేజర్ జనరల్ చౌదురీ నేతృత్వంలోని సైనిక బృందాన్ని హతమార్చేందుకు నిజాం సైన్యం సికింద్రాబాద్‌కు 20 మైళ్ల దూరంలో పెద్ద సంఖ్యలో మందుపాతర్లను అమర్చింది. అదే సమయంలో భారత సైన్యానికి పట్టుబడ్డ కొందరు నిజాం సైనికులు ఈ విషయాన్ని వెల్లడించారు. వాటిని తొలగించాల్సిందిగా భారత సైన్యం ఆదేశించింది. కానీ, వాటిని జాగ్రత్తగా వెలికితీసే విధానంపై అవగాహన లేకపోవడంతో ఆ సైనికులు చేతులెత్తేశారు. దీంతో భారత సైన్యంలోని నిపుణులు ఐదు గంటలు కష్టపడి వాటిని గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఈ మందుపాతర్ల వ్యవహారం వల్ల భారత సైన్యం ఐదు గంటలు ఆలస్యంగా బొల్లారం చేరుకుంది. సాయంత్రం నాలుగున్నరకు సికింద్రాబాద్ శివార్లలో నిజాం సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ ఎడ్రూస్ ఎదురేగి చౌదురీ బృందానికి స్వాగతం పలికాడు. నిజాం సేనల లొంగుబాటు పత్రాన్ని సమర్పించాడు. ఇండియన్ ఆర్మీని తోడ్కొని భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ భవనానికి తీసుకెళ్లాడు. 20 మంది భారత సైనికులు మృతి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన ఆపరేషన్‌లో భారత సైన్యం 20 మంది జవాన్లను కోల్పోయింది. అతి తక్కువ ప్రాణనష్టంతో గొప్ప విజయాన్ని సాధించినట్టయింది. 600 మంది నిజాం సైనికులు, 1,000 మందికిపైగా రజాకార్లు ఈ ఆపరేషన్ పోలోలో మరణించినట్లు అప్పట్లో లెక్కలు తేల్చారు. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) కృత్రిమ వరదలకు కుట్ర భారత సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో మూసీ నదిలో రజాకార్లు కృత్రిమ వరదలు సృష్టించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా చేసే హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ధ్వంసం చేసి మూసీలోకి భారీగా వరద వచ్చేలా చేశారు. నదిలో వరద నిండుగా ఉంటే భారత సైన్యం ముందుకు రాలేదన్నది వారి ఆలోచన. కానీ, ఈ ప్రతిబంధకాలను విజయవంతంగా అధిగమించి భారత సైన్యం నగరంలోకి చొచ్చుకొచ్చింది. రజాకార్ల దుశ్చర్యతో హైదరాబాద్‌ను కొంతకాలం పాటు తాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. (క్లిక్: జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్) -
సెప్టెంబర్ 17 వేడుకల్లో అపశృతి.. జాతీయ జెండాను అలాగేనా ఎగురవేసేది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17 సందర్బంగా అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భూపాలపల్లిలో జరిగిన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భూపాలపల్లి కలెక్టరేట్లో జాతీయ పతాక ఆవిష్కరణకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం, అనురాగ్ శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ క్రమంలో జాతీయ జెండాకు వందనం సమర్పించిన తర్వాత తప్పిదం గమనించారు. జెండాను తలకిందులుగా ఎగురవేసినట్టు గ్రహించారు. దీనికి కారణమైన ఆర్ఎస్ఐ సదానందంను జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనే డిచ్‌పల్లిలో సైతం చోటుచేసుకుంది. ఎంపీడీవో ఆఫీసులో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. దీంతో అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అధ్యక్షుడు భూమన్న డిమాండ్ చేశారు. చదవండి: (అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డొచ్చిన టీఆర్ఎస్ నేత కారు.. అద్దం పగులగొట్టి..) -
జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్
సాక్షి, హైదరాబాద్: ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 13 నెలలు గడుస్తోంది. దక్షిణ భారతంలో కీలకమైన హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. అంతేకాదు పాకిస్థాన్‌కు అనుకూలంగా మారుతోంది. విలీనం కోసం భారత్ ఒత్తిడి తెస్తే పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్ నుంచి రేడియో సందేశాలు వెళ్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ సంస్థానం రజాకార్లు, నిజాం సైన్యం అకృత్యాలతో అట్టుడుకుతోంది. ఇక కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందే’.. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ మదిలో ఇదే ఆలోచన. అదును దొరికితే చాలని వేచి ఉన్నారు. దేశ విభజనకు కారణమైన పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా 1948 సెప్టెంబరు 11న మృతి చెందారు. ఇంకేం అదును దొరికింది. ఆ సమయంలో కాశ్మీర్లో ఉన్న సర్దార్ పటేల్.. తుపాకీ చూపి నిజాంను దారికి తెచ్చేందుకు ఆ చల్లని వాతావరణంలో వేడివేడి వ్యూహాలను సిద్ధం చేశారు. సైనిక చర్యకు దిగితే ఎలా ఉంటుందో నిజాంకు తెలిసేలా కబురు పంపారు. లొంగిపోవాలా.. ఎదిరించాలా? భారత ప్రభుత్వం తరఫున మేజర్ జనరల్‌గా ఉన్న మున్షీ హైదరాబాద్‌కు వచ్చి నిజాంతో మాట్లాడి, పరిస్థితిని వివరించారు. భారత్ సైనిక చర్యకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టం చేశారు. దీంతో తాను భారత సైన్యాన్ని ఎదురించనని, విలీనానికి సహకరిస్తానని నిజాం సంకేతాలు ఇచ్చారు. ఈ విషయాన్ని రజాకార్లకు, నిజాం సైన్యానికి చెప్పలేదు. లొంగిపోయాక తనపై సైనిక విచారణ, శిక్ష లేకుండా చూసుకోవడం, రాజభరణం, ఇతర సదుపాయాలు అందుకోవడంపైనే దృష్టిపెట్టారు. హైదరాబాద్ సంస్థానం మంత్రి వర్గాన్ని అత్యవసరంగా సమావేశపర్చి.. అందరినీ రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అందరూ రాజీనామా చేసి, నిజాం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. నిజాం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలిపి, సైన్యాన్ని ఎదురించబోనని మాటిచ్చారు. ప్రతిగా విలీనం తర్వాత తనకు ప్రాధాన్యమున్న హోదా ఇవ్వాలని, 200 కోట్ల నగదు ఇవ్వాలని, తన బిరుదులను కొనసాగించాలని, తన ఆస్తులు తనకే దక్కాలని కోరారు.ఇవి తెలియని రజాకార్ల బృందాలు, నిజాం సైన్యం.. భారత సైన్యం దాడి మొదలుపెట్టినప్పుడు ప్రతిఘటించాయి. కీసర సరిహద్దులో భీకర దాడితో.. నిజాం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో.. భారత సైన్యాలను ఎదుర్కొనే విషయంగా నిజాం సైన్యం దీటుగా వ్యవహరించలేకపోయింది. కొద్దిపాటి ప్రతిఘటనతోనే లొంగిపోవడమో, పారిపోవడమో జరుగుతూ వచ్చింది. ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులో ఉన్న కీసర ప్రాంతంలో మాత్రం భీకర దాడి జరిగింది. కీసర వద్ద నిజాం ఔట్‌పోస్టు వద్దకు భారీగా రజాకార్ల దండు చేరుకుని.. భారత సైన్యంపై దాడికి దిగింది. చాలాసేపు పోరాడాక భారత సైన్యం యుద్ధ ట్యాంకుతో దాడి చేస్తే.. నిజాం ఔట్‌పోస్టు నామరూపాల్లేకుండా పోయింది. ఇలాగే ఖమ్మం వద్ద కూడా దాడి జరిగింది. వందల మంది చనిపోతుండటంతో నిజాం సైన్యం వెనకడుగు వేసింది. కాశీం రజ్వీ దీన్ని తట్టుకోలేక నిజాంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌పై దాడి చేసి తమకు సహకరించాలని పాకిస్తాన్‌ను కోరాడు. పాకిస్తాన్ స్పందించలేదు. నిజాం లొంగిపోగా హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) అక్రమంగా విమానం ద్వారా ఆయుధాలు ఆస్ట్రియా వ్యాపారి కాటన్ ద్వారా నిజాం రాజు అక్రమంగా ఆయుధా లు సమకూర్చుకున్నాడు. పాకిస్తాన్‌కు వెళ్తున్న విమానంగా చూపి, కారుణ్య సహాయం పేరుతో విమానాన్ని బీదర్ ఎయిర్‌పోర్టులో దింపేవారు. అక్కడి విమాన స్ట్రిప్‌లో ఆయుధాలను అన్లోడ్ చేసేవారు. ఇది బయటపడడంతో బీదర్ బదులు వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి మకాం మార్చారు. లంకాస్టర్ అనే 4 ఇంజిన్లుండే ఈ విమానం ద్వారా 1948 మే నుంచి జూన్ 20 వరకు నిరాటంకంగా ఈ అక్రమ వ్యవహారం సాగింది. భారత ప్రభుత్వం వినతితో బ్రిటిష్ వారి జోక్యంతో తర్వాత ఆగిపోయింది. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్‌గా!) -
Kandimalla Pratap Reddy: ‘కొరియర్’గా.. వారియర్‌గా!
హిమాయత్‌నగర్: పసి వయసు నుంచి కసిగా నిజాం వ్యతిరేక, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగస్వామి అయిన వ్యక్తి ఆయన. అప్పుడాయన వయసు 13 ఏళ్లే. ఆయనే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి. స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం. ‘సెప్టెంబర్ 17’నేపథ్యంలో అప్పటి పోరాటంలో పాల్గొన్న ప్రతాప్‌రెడ్డి అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘స్వాతంత్య్రం వచ్చేనాటికి నాటికి నాకు సుమారుగా 13 ఏళ్లు. మా తండ్రి రంగారెడ్డి నన్ను నల్లగొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానానికి రాలేదంటూ చెలరేగిన ఉద్యమానికి బడులన్నీ మూతపడ్డాయి. అనంతరం నేను ఓ వేపచెట్టు కింద విద్యార్థి నాయకులు, దళాలు చేపట్టిన సాయుధ పోరాట కార్యక్రమంలో తొలిసారిగా పాల్గొన్నాను. ఆ వేపచెట్టుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. గ్రామాల్లోకి వచ్చిన దళాలను రహస్య ప్రాంతాల్లో దాచేవాడిని. నన్ను కమ్యూనిస్టు పార్టీ బాలసంఘం సెక్రెటరీగా నియమించారు. కొరియర్‌గా ఇటు ప్రజలకు, అటు దళాలు, విద్యార్థి నాయకులకు దగ్గరగా ఉండేవాడిని. వీరితో పాటు ప్రజలకు నేనే సమాచార వారధిగా ఉండేవాడిని. తుపాకీని ముట్టనిచ్చేవాళ్లు కాదు.. మా ఉద్యమాన్ని అణచివేసేందుకు రజాకార్లు గుర్రాలపై, జీపులపై గ్రామాల్లోకి చొరబడేవాళ్లు. రజాకార్లను ఎదుర్కొనేందుకు దళాలు కూడా ఊళ్లలోకి వచ్చేవి. తుపాకీని పట్టుకోవాలనే ఆశ నాకున్నప్పటికీ బాలుడిని కావడంతో దళసభ్యులు ముట్టనిచ్చేవాళ్లు కాదు. రజాకార్లను అడ్డుకునేందుకు తిప్పర్తి వంతెనను మూడు, నాలుగు గ్రామాలవాళ్లం కొంతవరకు కూల్చివేశాం. మేం కోదాడ, నల్లగొండ ప్రధాన రహదారులపై ఉన్న సమయంలో షోలాపూర్, కోదాడల మీదుగా పెద్దపెద్ద సైన్యాలు హైదరాబాద్ వైపు వెళ్లడాన్ని గమనించాం. ఈ సైన్యాలు వెళ్లిన మూడు రోజులకు, అంటే సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు నిజాం రాజు నుంచి వెలువడిన వార్త మా దాకా వచ్చింది. ఎంతో సంతోషంగా ఈ వార్తను ఒక కొరియర్లా తీసికెళ్లి పలు గ్రామాల్లో చెప్పాను. -
అణచివేతపై సాయుధ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలు ఓ వైపు.. జమీందార్ల దుర్మార్గాలు మరోవైపు.. దారుణమైన బతుకుల నుంచి బయటపడేందుకు పుట్టిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. 1946 సెప్టెంబర్ 11న మొదలై 1951 అక్టోబర్ 21 దాకా ఐదేళ్లకుపైగా సాయుధ ఉద్యమం కొనసాగింది. ప్రపంచ చరిత్రలోని గొప్ప పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. 1946లో చాకలి ఐలమ్మ సాగుభూమి మీద జమీందారు విసునూరు రాంచంద్రారెడ్డి కన్ను పడింది. ఆ భూమిని, పంటను స్వాధీనం చేసుకునేందుకు గూండాలను పంపాడు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్ల ప్రతాపరెడ్డి తదితరుల సహకారంతో ఐలమ్మ తిరగబడింది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి వంటి వారిని పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. అయితే ఐలమ్మ భూమిని, ధాన్యాన్ని భూస్వాములు స్వాధీనం చేసుకోలేక పోయారు. దీంతో ఆవేశం పట్టలేక కడివెండి గ్రామ నాయకులను హత్య చేయాలని పథకం వేశారు. 1946 జూలై 4న దేశ్‌ముఖ్ మనుషులు గ్రామ నాయకుల ఇళ్ల మీద రాళ్లు వేయడంతో.. ప్రజలు లాఠీలు, వడిసెలు చేత బట్టుకుని ప్రదర్శనగా బయలు దేరారు. ఈ ఊరేగింపు జమీందారు ఇంటి దగ్గరికి రాగానే.. జమీందారు మనుషులు కాల్పులు జరపడంతో గ్రామ నాయకుడు దొడ్డి కొమరయ్య బలయ్యాడు. ఈ విషయం దావానలంలా వ్యాపించి.. ఊరూరా జనం తిరుగుబాటు మొదలు పెట్టారు. ఆ ప్రతిఘటనను అణచి వేసేందుకు జమీందార్ల మనుషులు, రజాకార్లు, నిజాం పోలీసులు దాడులకు దిగారు. అయినా ప్రజలు తిరుగుబాటు ఆపలేదు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ 1946 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. పేదలకు 10 లక్షల ఎకరాలు పంపిణీ.. అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా మొదలైన సాయుధ ఉద్యమం భూపోరాటంగా మారి దున్నేవాడికే భూమి దక్కాలని నినదించింది. నిజాం రాచరికం, జమీందార్ల అరాచక పాలన మీద తిరుగుబాటుగా మారింది. భూమి కోసం, భుక్తి కోసమేగాక సామాజిక వివక్షపైనా పోరాటం జరిగింది. మూడు వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. భూస్వాములు, జమీందార్ల నుంచి పది లక్షల ఎకరాలకుపైగా భూమిని రైతులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తాకట్టులో ఉన్న భూములను విడి పించుకున్నారు. రుణపత్రాలను రద్దు చేసి.. పశువులను పంపిణీ చేశారు. ఈ పోరాటాల్లో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళలూ ముందు నిలిచారు. 4 వేల మంది వీర మరణంతో.. రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుండగానే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎన్నో సంస్థానాలు ఇండి యన్ యూనియన్‌లో విలీనమైనా.. నిజాం సంస్థానం మాత్రం ఒప్పుకోలేదు. దీనికి నాటి భారత ప్రభుత్వం అంగీకరించింది. నిజాం రాజుతో 1947 నవంబర్ 29న యథాతథ ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ తెలంగాణ ప్రజలు నిజాం పాలన అంతం కావాలని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని పోరాటాలు చేశారు. అందులో భాగంగా సాయు ధ పోరాటం ఉధృతంగా కొనసాగింది. రజాకార్లు, నిజాం సైన్యాల దాడుల నుంచి రక్షణకోసం.. పదివేల మంది గ్రామదళ సభ్యులు, దాదాపు రెండు వేల గెరిల్లా దళ సభ్యులతో శక్తివంతమైన సాయుధ బలగాన్ని నిర్మించుకోగలిగారు. కానీ నిజాం పాలకులు, జమీందార్లు కలిసి.. నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, రైతులను హతమార్చారు. మరెన్నో వేల మందిని నిర్బంధ శిబిరాల్లో, జైళ్లలో బందీలను చేశారు. అయినా సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. ఈ పోరాటం తమ గెరిల్లా పోరాటం కంటే గొప్పదని క్యూబా ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం గమనార్హం. విమోచన కాదు.. అది విలీన ఒప్పందం: మొయిన్ గోల్కొండ: అప్పటి హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా యూనియన్ ప్రభుత్వానికి, నిజాం చివరి పాలకుడికి మధ్య విలీన ఒప్పందం జరిగిందని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎంకే మొయిన్ అన్నారు. దీనిని కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించి విమోచన దినంగా చెబుతూ సంబరాలు జరుపుకోవడం సరికాదన్నారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లకు హిందూ జమీందారులైన దేశ్‌ముఖ్‌లు అండగా ఉండి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. అయితే ఈ సత్యాన్ని ఇప్పుడు కొందరు వక్రీకరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో నిజాం సంస్థానం విలీనంపై అప్పటి ప్రధాని జవహర్లాల్ న్రెహూ ముద్ర స్పష్టంగా ఉందని, అయితే కొంతకాలంగా విలీన హీరోగా వల్లభాయ్ పటేల్‌ను చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిగా 1944 సంవత్సరంలో దారుల్ షిఫా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే తాను కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడినయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ విలీన సమయంలోనూ అజ్ఞాతంలోనే ఉన్నానని చెప్పారు. అటువంటి తనను సన్మానిస్తామని విమోచనోత్సవం నిర్వహిస్తున్న బీజేపీ పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు) -
హైదరాబాద్ సంస్థాన విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పరకాల అమరధామం. అక్కడి మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం.. నిరంకుశ నిజాం నుంచి స్వాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి సాక్ష్యం. అదే.. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన. సరిగ్గా 73 ఏళ్ల క్రితం.. 1947, సెప్టెంబర్ 2న జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే కాంక్షతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో హాజరైన ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణహోమం మరో జలియన్ వాలాబాగ్‌గా మారింది. రజాకార్లపై పోరాడి ఎందరో అసువులుబాసి అమరవీరులుగా నిలిచారు. అలాంటి ఉద్యమంలో హనుమకొండ జిల్లా పరకాలది ప్రత్యేక స్థానం. సెప్టెంబర్ 2, 1947న పరకాల సమీపంలో ఉన్న పైడిపల్లి తాళ్ల నుంచి విమోచనోద్యమకారులు భారత జాతీయ జెండా ఎగురవేయడానికి పరకాలకు వచ్చారు. రజాకార్లు ఈ విషయం పసిగట్టి ఉద్యమకారులు జాతీయజెండాను ఎగురవేయనీకుండా అడ్డుకోమని నిజాంతో ఆదేశం జారీ చేయించారు. ఖాసింరజ్వీ నేతృత్వంలో పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ జియాఉల్లా, మేజిస్ట్రేట్ విష్ణువేశ్వర్ రావులు మూడు లారీల బలగాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఉద్యమకారులపై తుపాకీగుళ్ల వర్షం కురింపిచారు. పరకాల చాపలబండ వద్ద గుమిగూడిన ఉద్యమకారులపై దాడిచేశారు. కత్తులు, బల్లాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురిని రంగాపూర్ గ్రామంలో చెట్టుకు కట్టేసి గొడ్డలి, బరిసెలు, తుపాకులతో కాల్చి చంపారు. ఈ మారణహోమంలో శ్రీశైలం, గజ్జి పర్వతాలు (కనిపర్తి), కుంట అయిలయ్య (నాగుర్లపల్లె), బత్తుల సమ్మయ్య, ఆముధాపురం వీరన్న, మేకల పోచయ్య,(రాయపల్లె), మంత్రి కేదారి, పోతుగంటి పెద్దులు (దమ్మన్నపేట), గుండారపు కొమరయ్య, దాతుపెల్లి రాజయ్య, కుమ్మరి రాములు (రేగొండ), గెల్లే కట్టమల్లు (దామరంచపల్లె), జాలిగపు ముసలయ్య, తొనగరు పూర్ణాసింగ్ (చల్లగరిగె), కలువాల అంకూస్ (గోవిందాపురం) తదితరులు అమరులయ్యారు. ఆకుతోట మల్లయ్య, రాజ్‌మహ్మద్, వర్దెల్లి వీరయ్యలను చెట్లకు కట్టేసి కాల్చి చంపారు. నిజాం పోలీసులు, రజాకార్లు వెంటాడి 200 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. సాయుధ పోరాటానికి కేరాఫ్... నిజాం రాక్షసకృత్యాలను వ్యతిరేకిస్తూ రహస్య జీవితం గడుపుతున్న ఉద్యమనేతలు ప్రతీకారం తీర్చుకోవడానికి మహరాష్ట్రలోని చాందా బోర్డర్ క్యాంప్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సారథ్యంలో తొలివిడత వంద మంది సాయుధ శిక్షణ పొందారు. పిస్తోల్, రైఫిల్స్, మందు గుండు సామగ్రి సేకరించి చంద్రగిరి గుట్టలను కేంద్రంగా చేసుకొని సాయుధ పోరాటం జరిపారు. సాయధ దళాలు జమీందార్లు, జాగీర్దారులు, పెత్తందార్లు, మక్తెదారులకు చరమగీతం పాడాయి. ఈ దాడులను తట్టుకోలేక నిజాం పోలీసులు గ్రామాల్లో ప్రజలను విచక్షరహితంగా హింసించారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవటంతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నారు. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్‌గా!) రాత్రి వేళల్లో సమావేశాలు: చంద్రారెడ్డి అలియాస్ రంజిత్ నిజాం పాలనకు తిరుగుబాటుదారులైన ఎస్.మనోహర్‌రావు, కె.వి.నర్సింగరావు ఆదేశాలతో రాత్రివేళల్లో గ్రామాల్లో యువకులతో సమావేశాలు నిర్వహించేవాళ్లు. చాలామంది యువకులను మహారాష్ట్ర చందా ప్రాంతానికి పంపించి అక్కడ ఆజాద్ హింద్‌ఫౌజ్ నుంచి విరమణ పొందిన సైనికులతో ప్రత్యేక గెరిల్లా శిక్షణ ఇప్పించారు. జనవరిలో చందాకు వెళ్లిన వారిలో నేనూ ఉన్నా. 1948 మార్చి వరకు గెరిల్లా శిక్షణ పొందాను. అనంతరం మారుపేర్లతోనే స్వగ్రామాలకు చేరుకున్నాం. అదే సమయంలో ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుండటంతో దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలను షెల్టర్‌గా మార్చుకొని సాయుధపోరుకు శ్రీకారం చుట్టాం. చాపలబండ వద్ద రజాకార్ల తూటాల నుంచి తప్పించుకున్న నన్ను వారం రోజులకు పట్టుకున్నారు. చిత్రహింసలకు గురిచేసి.. చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. కానీ కొన ఊపిరితో బయటపడ్డాను. (క్లిక్: మందు పాతరలు.. చివరి అస్త్రం) -
‘చరిత్ర నుంచి అనుభవాలు నేర్చుకోవాలి.. ఏమరపాటు ఏమాత్రం వద్దు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17 సందర్బంగా అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరుగుతున్న వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ క్రమంలోనే గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు. కాగా, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 15 రోజుల పాటు ఘనంగా వజ్రోత్సవాలు జరిపాము. వేడుకలకు కొనసాగింపుగా సమైక్యతా వజ్రోత్సవాలు జరుపుతున్నాము. రాచరికం నుండి ప్రజాస్వామ్యం దిశగా తెలంగాణ నడిచింది. ఎందరో అమరయోధులు ప్రాణత్యాగం చేశారు. రాజరిక వ్యవస్థ నుంచి పరివర్తన చెందడానికి తెలంగాణ సమాజం మొత్తం పోరాడింది. అమరవీరులను తలచుకోవడం మన కర్తవ్యం. ఆనాడు ఉజ్వల ఉద్యమం జరిగింది. కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య సాహసాలు మరువలేం. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తలచుకుందాం. నాటి పాలకుల కృషివల్లే భారతదేశం రూపుదిద్దుకుంది. దేశంలో తెలంగాణ అంతర్భాగమయ్యాక సొంత రాష్ట్రంగా మారింది. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని రగిలించారు. తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యింది. సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా తెలంగాణ పోరాడింది. తెలంగాణ లక్ష్యం సాధన కోసం 14 ఏళ్లు పోరాటం చేశాను. సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల్లో చిగురించింది. అద్భుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అన్ని రంగాల్లో అనేక అద్భుతాలను ఆవిష్కరించాము. రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశాము. ప్రతీ ఇంటికి రక్షిత మంచి నీటిని అందిస్తున్నాము. జాతీయ సగటు కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. పలు రంగాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. నాటి చరిత్ర నుండి అనుభవాలు నేర్చుకోవాలి. అటువంటి వేదన మళ్లీ తెలంగాణకు రాకూడదు. మతతత్వ శక్తులు తెలంగాణను విభజించే కుట్ర చేస్తున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తీవ్రంగా నష్టపోతాము. విభజన శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలి. విష వ్యాఖ్యలతో మంటలకు ఆజ్యం పోస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వారి త్యాగాలను మర్చిపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లే: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో అమిత్ షా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అనేకానేక ప్రణామాలు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. నిజాం రాజ్యంలో అరాచకాలు కొనసాగాయి. హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు. సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణ విమోచనం మరింత ఆలస్యమయ్యేది. సర్దార్ పోలీస్ యాక్షన్ ద్వారానే తెలంగాణ విమోచనం అయింది. 108 గంటలపాటు పోలీసు చర్యలో ఎంతో మంది అమరులయ్యారు. నిజాం రాజ్యంలో అరాచకాలను ఇప్పటికీ మరువలేము. ఇంకా కొంతమంది మనుషుల్లో రజాకార్ల భయం ఉంది. భయాన్ని వదిలేసి ధైర్యంగా బయటకు రావాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలనేది ప్రజల ఆకాంక్ష. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్ విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం జరుపలేదు. కొందరు ఇతర పేర్లతో ఉత్సవాలు జరుపుతున్నారు. తెలంగాణ విమోచన పేరుతోనే ఉత్సవాలు జరపాలి. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ప్రధాని నిర్ణయం తర్వాతే ఇప్పుడు అందరూ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్నారు. ఎవరి త్యాగాల వల్ల మీరు నేడు అధికారంలో ఉన్నారో.. వారికి శ్రద్ధాంజలి కూడా వహించకపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని.. సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. -
అమిత్ షా.. అభినవ సర్దార్ పటేల్: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అని పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బలైపోయారు. అప్పుడు.. హైదరాబాద్‌లో తొలిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జెండా ఎగరేశారు. మళ్లీ 74 ఏళ్ల తర్వా త మళ్లీ అమిత్ షా వచ్చి త్రివర్ణ పతాకం ఎగరేశారు. అమిత్ షా అభినవ సర్దార్ పటేల్ అని అభివర్ణించారు కిషన్ రెడ్డి. పాతికేళ్లుగా ఈ వేడుకలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు.. బీజేపీ పోరాటంతోనే విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం అని కిషన్‌రెడ్డి ప్రకటించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజన్న ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వం తూతూమంత్రంగా వేడుకలు జరుపుతోందని మండిపడ్డారు. అసలు ఇన్నిరోజులు ఎందుకు నిర్వహించలేదని కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించారాయన. సెప్టెంబర్ 17 సందర్భంగా.. కేంద్రం ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా విమోచన వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా.. జాతీయ జెండా ఎగరేసి, అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఇదీ చదవండి: విలీన విషయంలో వివాదాలు వద్దు-వెంకయ్యనాయుడు -
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. కాగా, పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ తలపెట్టిన తెలంగాణ విమోచన వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు. అలాగే, పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర పారామిలటరీ బలగాలు(12 బృందాలతో) పరేడ్ నిర్వహించాయి. ఈ సందర్బంగా అమిత్ షా కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించారు. విమోచన దినోత్సవ వేడుకలకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే హాజరయ్యారు. అలాగే, ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన 1500 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. Union Home Minister #AmitShah hoisted #NationalFlag at Parade ground in #Secunderabad during the celebrations of #BJP Central govt's #HyderabadLiberationDay Vs#TelanganaJateeyaSamaikyataVajrotsavalu#TelanganaNationalIntegrationDay of #TRS govt. #Hyderabad #TelanganaPolitics pic.twitter.com/AxFJ5Big0B — Surya Reddy (@jsuryareddy) September 17, 2022 -
September 17: ‘విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17పై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి విమోచన దినోత్సవ వేడుకల కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. శనివారం ఉదయం విమోచన దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్ వద్ద మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖండ దేశభక్తుడు. దేశ సమైక్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు. కులమతాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం ముందుకెళ్లాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది. దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్‌కు స్వాతంత్రం వచ్చింది అని అన్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బీజేపీ కార్యాలయంలో జాతీయజెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బస్సల్, తరుణ్‌చుగ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. -
టీఆర్ఎస్లో రచ్చరచ్చ.. పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్చల్
శాంతినగర్: జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అధికార పార్టీలో రగడకు దారితీశాయి. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్డీఓ రాములు అధ్యక్షతన శుక్రవారం వజ్రోత్సవాలు నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్బంగా కొందరు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటుండగా వేదికపై అలజడి రేగింది. ఒకరిపైఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్చల్ చేశారు. సభాప్రాంగణం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి సాయిచంద్, ఆయన అనుచరులు, గన్‌మెన్, పీఏలను ఒకవైపు.. ఎమ్మెల్యే అబ్రహం తన యుడు అజయ్, అతడి అనుచరులను మరోవైపు పంపించి గొడవ పెద్దది కాకుండా చూశారు. అనంతరం సాయిచంద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కుమారుడు అజయ్ అనుచరులు తనపై, పీఏ, గన్‌మెన్‌పై దాడికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయనకు నచ్చజెప్పి పోలీసు ఎస్కార్ట్‌తో అక్కడి నుంచి పంపించారు. దాడి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే, సాయిచంద్ ఎవరి ఆహా్వనం మేరకు వచ్చారని ఎమ్మెల్యే తనయుడు అజయ్ ప్రశ్నించారని, ఈ క్రమంలో మాటామాటా పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: జాతీయ సమైక్యత ర్యాలీలో అపశ్రుతి -
జాతీయ సమైక్యత ర్యాలీలో అపశ్రుతి
మంచిర్యాల టౌన్/మిర్యాలగూడ అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీలో పాల్గొన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎండలోనే ఉండటం, తాగునీరు సరిపడా లేక ఇబ్బందులు పడ్డారు. అనంతరం మండుటెండలో ర్యాలీని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు 3 కిలోమీటర్లు నిర్వహించారు. భోజనాలు కూడా ఎండలోనే మైదానంలో కింద కూర్చుని తిన్నారు. కనీసం తాగునీరు అందక, నీడ లేక 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 21 మందికి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించగా, మిగతా 9 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎల్ఈడీ స్క్రీన్ కూలి గాయాలు సమైక్యత వారోత్సవాల్లో భాగంగా మిర్యాలగూడలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎన్ఎస్పీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో కూర్చున్న స్థానిక కాకతీయ పాఠశాల విద్యార్థినులపై ఎల్ఈడీ స్క్రీన్ కూలిపోయింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన విద్యార్థినులకు చికిత్స అందించారు. ఇదీ చదవండి: ‘జయహో జగదీశన్న’.. ఆ జిల్లా ఎస్పీ నినాదం వివాదాస్పదం! -
బాహుబలి సినిమాలో మాదిరి ఈ స్టేజ్ కదలాలా..బీటలు వారాలా!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ నినాదం వివాదంగా మారింది. ‘జయహో జగదీశన్న’అంటూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని పొగిడి విద్యార్థులచే నినాదాలు చేయించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. అంతకుముందు పట్టణంలో భారీ ఎత్తున యువకులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘మంత్రి జగదీశ్‌రెడ్డికి జై జై.. ఈ గడ్డ మీద మనం పుట్టినందుకు ఈతరం మంత్రికి రుణపడి ఉండాలి. మీ అందరికీ ఆకలవుతుందా.. ఆకలేస్తే కేకలు వేయాలన్నారు శ్రీశ్రీ.. అది అందరికీ గుర్తుందా.. అయితే ఇలా నినాదాలు చేయండి.. జయహో జగదీశన్న’అంటూ నినాదాలు చేయించారు. ‘అందరూ బాహుబలి సినిమా చూశారా.. బాహుబలి వచ్చిననప్పుడు వేదిక కదిలిన విధంగా మీ నినాదాలతో ఈ స్టేజీ కదలాలా.. బీటలు వారాలా..’అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్పీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డిని పొగుడుతూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ విద్యార్థులతో నినాదాలు చేయించడం సిగ్గుచేటని, గౌరవప్రతిష్టలు కలిగిన యూనిఫాం సరీ్వసుకే అగౌరవమని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కలెక్టర్లు సీఎం కాళ్లు మొక్కడం, ఆ తర్వాత వారిని ఎమ్మెల్సీగా చేయడం చూశామని గుర్తుచేశారు. ఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: బాబాసాహెబ్ కలల సాకారంలో... -
వంతెనను పేల్చేయించాడు
1948 సెప్టెంబర్ 16 ఉదయం.. మూసీనది పరవళ్లు తొక్కుతోంది. వరద హోరు తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో పెద్ద శబ్దం. దాని తర్వాత వరస శబ్దాలు. చూస్తుండగానే.. సూర్యాపేట – టేకుమట్ల వంతెన నేలకొరిగింది. అద్భుత నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకున్న ఆ రాతి వంతెనను బాంబులు తునాతునకలు చేసేశాయి. సైనికాధ్యక్షుడు జనరల్ ఎడ్రూస్ ప్లాన్. నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాలు. భారత సైన్యాలు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టకుండా అడ్డుకునే ప్రణాళిక ఫలితంగా నిజాం ముచ్చటపడి నిర్మించిన టేకుమట్ల వంతెన కూలిపోయింది. – సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్–విజయవాడ రహదారిపై సూర్యాపేటకు పది కి.మీ. ముందున్న మూసీ నదిపై నిజాం ముచ్చటపడి నిర్మించిన వంతెన అది. మంచి ప్లాన్‌తో అద్భుతంగా నిర్మింపజేశాడా వంతెన. సంస్థానానికి సముద్ర రవాణా లేకపోవటంతో సముద్ర వాణిజ్యానికి మచిలీపట్నం పోర్టే ఆధారం. అందుకే అక్కడి నుంచి భాగ్యనగరానికి విశాలమైన రోడ్డు నిర్మించాడు. పన్నుల వసూళ్లకు వెళ్లేందుకు, పోర్టు వస్తువుల రవాణా, సైనిక పటాలాలు వచ్చి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ‘దండు బాట’గా పిలుచుకునే ఈ రోడ్డుపైనే మూసీ దాటేందుకు అద్భుతంగా వంతెన నిర్మించాడు. సైనికాధికారి ఎడ్రూస్ ప్లాన్.. అయితే 1948 సెప్టెంబర్‌లో భారత సైన్యం దాడికి ఉపక్రమించబోతోందని నిజాంకు సమాచారం వచ్చింది. అప్పటికే ఢిల్లీలోని కొందరు పెద్దలతో నిజాం మంతనాలు జరిపాడు. పెద్దగా ప్రతిఘటించొద్దన్న సంకేతాలొచ్చాయి. దానికి నిజాం కొన్ని షరతులు పెట్టాడు. తుది నిర్ణయంపైనే తర్జనభర్జన నడుస్తోంది(ఇది చరిత్ర పరిశోధకుల మాట). సైనిక చర్యపై నిజాం ఆంతరంగికులలో ముఖ్యుడైన సైనికదళా«దిపతి జనరల్ ఎడ్రూస్ వెంటనే కార్యరంగంలోకి దిగాడు. నిర్ణయం తీసుకునేందుకు నిజాంకు సమయం కావాలని గుర్తించిన ఎడ్రూస్, భారత సైన్యం వెంటనే హైదరాబాద్‌కు చేరకుండా అడ్డుకోవాలనుకున్నాడు. నగరానికొచ్చే ప్రధాన మార్గాలు, సైన్యం ఏయే ప్రాంతాల నుంచి వస్తుందో మ్యాప్ రూపొందించుకున్నాడు. సైన్యాన్ని నిలువరించాలంటే వంతెనలు పేల్చేయడమే మార్గమనే నిర్ణయానికొచ్చాడు. మహారాష్ట్ర నుంచి వచ్చే సైన్యాన్ని అడ్డుకునేందుకు ఉస్మానాబాద్ మార్గంలోని మూడు వంతెనలు గుర్తించాడు. ఒడిశా గుండా వస్తున్న సైన్యాలను, ఆంధ్రాప్రాంతం నుంచి ఖమ్మం మీదుగా వస్తున్న సైన్యాలను ఆపేందుకు టేకుమట్ల వంతెనను పేల్చాలని నిర్ణయించాడు. దీంతో 15 రోజులు సైన్యాన్ని నిలవరించగలమని చెప్పి.. నిజాం ఆమోదంతో వంతెనలు పేల్చేందుకు బృందాలను పంపాడు. అందులో భాగంగా సెప్టెంబరు 16న సూర్యాపేట వంతెనను పేల్చేశారు. ఇంతా చేస్తే ఈ వ్యూహం పారలేదు. కొన్ని దళాలు అనుకున్న సమయానికే హైదరాబాద్‌కు చేరుకోగలిగాయి. మళ్లీ నిర్మాణం.. సైనిక చర్య ముగిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయినప్పటికీ, నాటి కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగిన నిజాం.. సూర్యాపేట వంతెనను పునర్నిర్మింపజేశాడు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆధునిక వంతెనను నిర్మించేవరకు సేవలందించిన ఆ వంతెన.. నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటోందన్నట్టుగా విశ్రాంతి తీసుకుంటోంది. -
...ఇవి సమైక్యత వజ్రోత్సవాలు.. లేదు లేదు విమోచన దినోత్సవాలు!
అటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు.. ఇటు విమోచన దినోత్సవాలు.. అయోమయంలో తెలంగాణ -
ఏడాది పాటు విమోచన దినోత్సవాలు
రసూల్‌పుర : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూరైన సందర్భంగా ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అందులోభాగంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలను సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. శుక్రవారం పరేడ్ మైదానంలో విమోచన దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కిషన్‌రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...విమోచన దినోత్సవాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, హోంశాఖ ఆధ్వర్యంలో నేడు జరగనున్న కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మహరాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే హాజరవుతారని చెప్పారు. సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్‌ఏఎఫ్‌లతో పాటు మొత్తం 12 సైనికదళాలు (రెండు మహిళా బృందాలతో సహా) ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయని చెప్పారు. శనివారం ప్రధాని మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో అమిత్‌షా పాల్గొని దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్, చక్రాల కుర్చీలు, కృత్రిమ తయారీ పరికరాలు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, డా, ప్రకాశ్‌రెడ్డి, రాకేశ్, శ్రీవర్ధన్, రాముయాదవ్, చింతల రాం చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘విమోచనం’తో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు -
‘విమోచనం’తో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన అమృతోత్సవాల ద్వారా రాష్ట్రంలో రాజకీయంగా బలపడేందుకు బీజేపీ వ్యూహాలను రూపొందించింది. వచ్చే ఏడాది సెపె్టంబర్ 17 దాకా నిర్వహించే కార్యక్రమాలను పార్టీ విస్తరణకు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వాలపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకొచ్చింది. తమ ప్రయత్నాల వల్లే ఈ ఉత్సవాలకు ప్రాధాన్యం ఏర్పడిందన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట కార్యక్రమం నిర్వహించేందుకు టీఆర్ఎస్ సర్కార్‌ను దిగివచ్చేలా చేశామన్న సందేశాన్ని ప్రజల్లో చాటాలని నిర్ణయించింది. ఏకతాటిపైకి హిందువులు! రాజకీయంగా అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టడమే కాకుండా ఆ మూడు పార్టీలూ ఒక్కటేనన్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ పెద్దలు కార్యాచరణ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. హైదరాబాద్ విమోచన అంశంలో టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ల వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. జాతీయవాదంతోపాటు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు, జనంలో బీజేపీ పట్ల సానుకూలత పెంచేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్–ఎంఐఎం, గతంలో కాంగ్రెస్–ఎంఐఎం రాజకీయ దోస్తీని, అవకాశవాదాన్ని బట్టబయలు చేయాలని నిర్ణయానికొచ్చారు. విమోచనం విషయంలో ఆ మూడు పారీ్టల బాగోతాన్ని బయటపెట్టడంతోపాటు టీఆర్ఎస్కు బీజేపీయే అసలైన రాజకీయ ప్రత్యామ్నాయమన్న సందేశాన్ని ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. రాష్ట్రంలో మెజారిటీ వర్గంగా ఉన్న హిందువులను ఏకతాటిపైకి తీసుకురావడానికి విమోచన ఉత్సవాలు దోహదపడతాయని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తోంది. ఏడాది పాటు నిర్వహించే కార్యక్రమాలు బీజేపీకి రాజకీయంగా తప్పనిసరిగా ఉపకరిస్తాయన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలున్నారు. ఇదీ చదవండి: అభివృద్ధికి నిధులివ్వవు, కోర్టుకెళ్తేనే నీళ్లిస్తావా? -
నలువైపులా ముట్టడి.. హైదరాబాద్‌పై ఐదు రోజుల ‘ఆపరేషన్’
సాక్షి, హైదరాబాద్: స్ట్రైక్.. స్మాష్.. కిల్.. వీర్.. ఇవి కేవలం నాలుగు పదాలు కాదు.. భారత సైన్యాన్ని హైదరాబాద్ సంస్థానంపైకి నడిపించిన నాలుగు సైనిక దళాల పేర్లు అవి.. సంస్థానాన్ని నలువైపుల నుంచీ ముట్టడించి నిజాం సైన్యాలను తరిమికొట్టిన దళాలు అవి.. నాటి భారత సైన్యం దక్షిణ మండల ప్రధానాధికారి గొడాల్ట్ వ్యూహ రచన మేరకు ‘ఆపరేషన్ పోలో’పేరిట జరిగిన సైనిక చర్యలో.. హైదరాబాద్ సంస్థానంపై నలుదిక్కుల నుంచీ దాడులు జరిగాయి. నల్దుర్గ్ నుంచి నార్కట్‌పల్లి.. ఔరంగాబాద్ నుంచి హోమ్నాబాద్ వరకు జరిగిన ఈ దాడుల వివరాలన్నీ భారత సైన్యానికి చెందిన అధికార పత్రాల్లో ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఆపరేషన్ పోలో గురించి ఒక్కొక్కరు ఒక్కో కథనం వినిపిస్తుండగా.. కొందరు చరిత్రకారులు భారత సైన్యం అధికారిక పత్రాల్లో పేర్కొన్న అంశాలను వివరిస్తున్నారు. ఆ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12న మొదలు.. మద్రాసు, ముంబై రాష్ట్రంలోని సేనలు హైదరాబాద్ సంస్థానం వైపు కదలాలని 1948 సెపె్టంబర్ 12న భారత సైన్యం అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నల్దుర్గ్ ప్రాంతంలో నిజాం సైన్యం ఏర్పాటు చేసుకున్న శిబిరం తమ వశమైందని సెపె్టంబర్ 13న ఉదయం భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. ఆ రోజునే సైనిక చర్య ప్రారంభమైందని కూడా ప్రకటించింది. తొలుత సైనిక చర్యకు ‘ఆపరేషన్ కాటర్ పిల్లర్’అనే పేరు పెట్టినా.. తర్వాత ‘ఆపరేషన్ పోలో’పేరుతో కొనసాగించారు. నాలుగు వైపుల నుంచీ.. హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం దాడి నలువైపులా ఒకేసారి ప్రారంభమైందని చరిత్రకారులు చెప్తున్నారు. షోలాపూర్–హైదరాబాద్ మార్గంలో పశ్చిమ దిశ నుంచి మేజర్ జనరల్ జయంత్‌నాథ్ చౌదరి నాయకత్వంలోని దళం.. విజయవాడ– హైదరాబాద్ మార్గంలో తూర్పు దిశ నుంచి మేజర్ జనరల్ ఏఏ రుద్ర నాయకత్వంలోని దళం ముందుకు నడిచాయి. ఈ దళాల దాడి సాగుతుండగానే రైల్వే మార్గాల రక్షణతోపాటు నిజాం సైన్యం, రజాకార్లు పారిపోకుండా ఉండేందుకు దక్షిణాన కర్నూలు వైపు నుంచి మరో దళం కదిలింది. ఉత్తర దిశలోని జాల్నా వైపు నుంచి ఇంకో దళం దాడి మొదలుపెట్టింది. ఈ నాలుగు దళాలకు స్ట్రైక్, స్మాష్, కిల్, వీర్ ఫోర్స్లుగా నామకరణం చేశారు. 9వ డొగ్రా బెటాలియన్, 1వ ఆర్మర్డ్ బ్రిగేడ్, 7వ, 9వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్లు, భారత వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఐదు రోజుల పాటు సాగి.. సైన్యం ప్రకటన మేరకు 1948 సెపె్టంబర్ 13న ఉదయం ప్రారంభమైన ‘ఆపరేషన్ పోలో’ఐదు రోజుల పాటు కొనసాగింది. ఈ ఐదు రోజుల పాటు ఏ రోజు ఏం జరిగిందో సైనిక పత్రాల్లో రాసి ఉంది. నల్దుర్గ్ కోట పతనం, బోరీ నది మీద వంతెన కూలగొట్టడం వంటి విధ్వంసాలనూ పత్రాల్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేటను జల్లెడ పట్టాం, సూర్యాపేట పతనమైంది, నార్కట్‌పల్లి పతనమైంది, చిట్యాల దగ్గర ఉన్నాం, కాప్చరింగ్ జాల్నా, ఔరాంగాబాద్, హోమ్నాబాద్ అంటూ.. యుద్ధంలో ప్రాంతాలను, స్థావరాలను స్వాధీనం చేసుకున్న తరహాలో భాషనే ఇందులో ఉపయోగించారు. నాటి పత్రికల్లో కూడా.. అధికారిక సైన్య పత్రాలతోపాటు నాటి పత్రికలు కూడా అప్పట్లో జరిగిన ఉదంతాలను ఉటంకిస్తూ కథనాలు రాశాయి. మెర్జర్, అనెక్సేషన్, యాక్సెషన్, అటాక్, యాక్షన్, మిలిటరీ ఆపరేషన్, ఎండ్ ఆఫ్ అసఫ్‌జాహీ రూల్, హైదరాబాద్ పతనం, విలీనం, ఆక్రమణ అనే పదాలు తప్ప సమకాలీనంగా ఇతర మాటలు అప్పట్లో వాడలేదు. నాటి సమకాలీన పత్రికలన్నీ ఈ దాడిని ‘ఇండియా ఇన్వేడ్స్’ అని రాశాయి. స్వయంగా భారత ప్రభుత్వం దీనిని సైనిక చర్యగానే పేర్కొంది. రూ.3.5 కోట్ల ఖర్చుతో.. ‘ఆపరేషన్ పోలో’దాడికి రూ.3.5 కోట్లు ఖర్చయిందని సైనిక పత్రాల్లో పేర్కొన్నట్టు చరిత్రకారులు చెప్తున్నారు. మొత్తం 66 మంది ఇండియన్ యూనియన్ సైనికులు చనిపోగా, 97 మంది గాయపడ్డారని, 490 మంది నిజాం సైన్యం చనిపోగా, 122 మంది గాయపడ్డారని వివరిస్తున్నారు. సైనిక చర్యలో జరిగిన నష్టాలపైనా అప్పటి పత్రికలు కథనాలు రాశాయి. హైదరాబాద్‌పై విజయం సాధించడంపై నాటి సైనిక చర్యకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ రాజేంద్ర సింహ్జీకి బంగారు ఖడ్గంతోపాటు భగవద్గీత గ్రంథాన్ని బహూకరించాలని తూర్పు పంజాబ్ విశ్వవిద్యాలయ హిందూ రక్షణార్థి విద్యార్థులు తీర్మానించారు. వారు దక్షిణ భారత మిలటరీ శాఖను అభినందించారని నాటి పత్రికల్లో రాశారు. ఇదీ చదవండి: Operation Polo: నిజాంను తెలివిగా తోకముడిచేలా చేసిన వల్లభాయ్ పటేల్ -
విస్నూర్ దొరకు ఎదురొడ్డి పోరాడిన చాకలి ఐలమ్మ.. కొంగు నడుముకు చుట్టి..
చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న నైజాం ప్రాంతం భారతదేశంలో విలీనం అయింది. ఈ చరిత్రలో ఓభాగం జనగామ జిల్లా పాలకుర్తి మండంలోని విస్నూర్ గడి.శత్రు దుర్భేద్యమైన ఈ విస్నూర్ గడిలో నుంచే చుట్టూ 60 గ్రామాలకు విస్నూర్ దొరగా ప్రసిద్ధి చెందిన దేశ్‌ముఖ్ రాపాక వెంకటరాంచంద్రారెడ్డి పాలన సాగించాడు. ఆయన, ఆయన కుమారుడు బాబుదొర అనేక అరాచకాలు సృష్టించారు. వీరి పాలనపై కడివెండినుంచే తొలి తిరుగుబాటు మొదలైంది. తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఈ కడివెండి గ్రామానికి చెందినవారే. ఈయనతో పాటు పిట్టల నర్సయ్య, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్లా నర్సింహులు పల్లెపల్లెనా సంఘాలు ఏర్పాటు చేశాయి. దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసాని వీరిపై కసిపెంచుకుంది. దొరసాని ఆదేశంతో వారి అనుచరులు 1946 జులై 4న కాల్పులు జరపడంతో, దొడ్డి కొమురయ్య ప్రాణాలు కోల్పోయారు. ఆయన సోదరుడు మల్లయ్యకు బుల్లెట్ గాయమైంది. రజాకార్లకు, విస్నూర్ దొరకు ఎదురొడ్డి పోరాడారు పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ. కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేతబట్టి తెలంగాణ సాయుధపోరాటంలో వీరోచితంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన ఐలమ్మ ఓరకంగా ఉద్యమానికి ఊపిరులూదింది అని చెప్పవచ్చు. విస్నూర్ గడి దొర రాంచంద్రారెడ్డి కొడుకు బాపురెడ్డి హైద్రాబాద్ పారిపోతుండగా, జనగామ రైల్వేస్టేషన్లో కాల్చిచంపారు. ప్రజల ప్రతిఘటన 400గ్రామాలకు వ్యాపించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రదర్శనలు జరిగాయి. రజాకార్ల దాడులు, అరాచకాలు మరింతగా పెరిగాయి. తగ్గకుండా ప్రజా ప్రతిఘటన సాగింది. దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు పట్టణాలకు పారిపోయారు. చివరకు నైజాం సర్కార్ 1948 సెప్టెంబర్ 17న కేంద్రంలో విలీనమైంది -
నిజాంను తెలివిగా తోకముడిచేలా చేసిన వల్లభాయ్ పటేల్
ఒక అంచనా ప్రకారం నిజాం వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం నాటికి 30 వేల మంది సైనికులున్నారు. వీరితో పాటు మూడు ఆర్మర్ రెజిమెంట్లు, అశ్విక దళం, 11 ఇన్ఫాన్ట్రీ బెటాలియన్లు, ఒక ఆర్టిలరీకి తోడుగా ఇంకా పది వరకు సైనిక రెజిమెంట్లు ఉన్నాయి. వీరికి తోడుగా దాదాపు 2 లక్షల మంది రజాకార్లున్నారు. వీరిలో 50వేల మంది దగ్గర తుపాకులు, తల్వార్ల లాంటి ఆయుధాలున్నాయి. దీనికి తోడుగా విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అప్పటికే నిజాం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఆపరేషన్ పోలోకు నెలరోజుల ముందు భారతసైన్యం తమపై దాడిచేస్తే ఎంతకాలం ప్రతిఘటించగలమని నిజాం తన సైన్యాధ్యక్షుడు ఇద్రూస్‌ను ప్రశ్నించాడు. ఒక్కరోజు కూడా కష్టమే అని ఇద్రూస్ సమాధానం చెప్పాడు. దీంతో సైన్యానికి తోడుగా రజాకార్ల సంఖ్యను పెంచాలని నిజాం ఆదేశాలు జారీచేశాడు. అయితే నిజాం సైన్యం భారత సైన్యం ముందు ఏమాత్రం నిలుస్తుందన్నదానిపై శతకోటి అనుమానాలు. సెప్టెంబర్ 13 తెల్లవారుజామున భారత్ సైన్యం ఐదు వైపుల నుంచీ హైదరాబాద్ సంస్థానంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించింది. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో నిజాం సంస్థానంలోకి పెద్ద ఎత్తున ట్యాంకులతో భారత సైన్యం ప్రవేశించింది. మరో మార్గంలో అటు షోలాపూర్ నుంచి జెఎన్ చౌదరి ఆధ్వర్యంలో భారత బలగాలు హైదరాబాద్ వైపు దూసుకు వచ్చాయి. భారత సైన్యంలో స్ట్రైక్ ఫోర్స్, స్మాష్ ఫోర్స్, కిల్ ఫోర్స్, వీర్ ఫోర్స్ పేరుతో నాలుగు రకాల బలగాలున్నాయి. ముందుగా భారత్ యుద్ధ విమానాలు హైదరాబాద్ సంస్థానంలోని ఉస్మానాబాద్, వరంగల్‌తో పాటు ఇతర విమానాశ్రయాలపై బాంబులు కురిపించింది. దీంతో నిజాం విమానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ముందుగా యుద్ధ ట్యాంకులతో నిజాం సైనిక పోస్టులపై దాడులు చేసిన భారత బలగాలు ఆ తరువాత వేగంగా నిజాం సంస్థానంలోకి చొచ్చుకు వచ్చాయి. చదవండి: (హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?) ఇక భారత తొలి బుల్లెట్ ఉస్మానాబాద్ జైలు బయట ఉన్న నిజాం సెంట్రీకి తగిలింది దీంతో అతను అక్కడే కుప్ప కూలాడు. ఇదే సమయంలో భారత సైన్యం దాడి గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. నిజాం సైన్యం భారత సైన్యాన్ని ఎదుర్కోలేక తోక ముడిచింది. అయితే భారత సైన్యం ఒక్కో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నా.. నిజాం మాత్రం తప్పుడు వార్తలు ప్రసారం చేయించాడు. నిజాం సైన్యం గెలుస్తుందంటూ వదంతులు వ్యాపింపజేశాడు. చివరికి సెప్టెంబర్-17న జెఎన్ చౌదరి ఆధ్వర్యంలోని భారత బలగాలు హైదరాబాద్ శివారులోని పటాన్చెరువు చేరుకున్నారు. దీంతో నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్ లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించిందనే వార్త తెలియగానే నిజాం తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇక నిజాం ఎవరిని నమ్మే స్థితిలో కనిపించలేదు. వెంటనే భారత రాయబారి మున్షిని పిలిపించి తాను లొంగిపోతున్నట్లు తెలిపాడు. దీంతో నిజాం లొంగుబాటు విషయాన్ని హోంమంత్రి పటేల్‌కు మున్షి తెలిపారు. నిజాం లొంగుబాటు ప్రక్రియలో పటేల్ చాలా తెలివిగా వ్యవహరించారు. ముఖ్యంగా సెప్టెంబర్-18వ తేదీన ఐక్యరాజ్యసమితిలో నిజాం భారత్‌కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. ఈ విచారణ జరగడానికి ముందుగానే నిజాం లొంగిపోయాడనే విషయాన్ని అంతార్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలనేది పటేల్ ఆలోచన. అందుకే హైదరాబాద్‌లో భారత రాయబారి మున్షి సహాయంతో నిజాం ద్వారా దక్కన్ రేడియోలో లొంగుబాటు ప్రకటన చేయించారు పటేల్. ఈ ప్రకటనలో నిజాం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చదవండి: (తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?) నిజాం లొంగుబాటు ప్రకటనతో ఐక్యరాజ్యసమితిలో హైదరాబాద్ సంస్థానం వేసిన పిటిషన్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. నిజాం తన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నానని దక్కన్ రేడియోలో చేసిన ప్రకటన బీబీసీ రేడియోలోనూ ప్రసారం అయింది. ఆ తరువాత ఈ పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెట్టారు. 1979వరకు ఈ పిటిషన్ ఐక్యరాజ్యసమితి వద్ద పెండింగ్‌లోనే ఉంది. ఆ తరువాత ఈ పిటిషన్‌ను కొట్టివేశారు. ఇక లొంగిపోయిన నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్‌ను భారత సైన్యాలు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించాయి. ఇక ఖాసీం రజ్వీని అరెస్టు చేసి జైలుకు పంపారు. తరువాతి కాలంలో రిజ్వీ పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. ఇక భారత సైన్యాలకు లొంగిపోయిన నిజాం తనకు రజాకార్లకు సంబంధం లేదని ప్రకటించాడు. లొంగిపోయిన నిజాంను ఏంచేయాలనే విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా చర్చించింది. ప్రస్తుతానికి నిజాం రాజు పేరు పైనే పరిపాలన సాగించాలని.. పౌరప్రభుత్వాన్ని భారత సైన్యం ఏర్పాటు చేస్తుందని పటేల్ నిర్ణయించారు. జనరల్ జెఎన్ చౌదరిని సైనిక గవర్నర్‌గా నియమించి పాలనను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. ఆపరేషన్ పోలో పూర్తయిన సెప్టెంబర్-17 నుంచి హైదరాబాద్ సంస్థానంలో భారత చట్టాలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా త్రివర్ణ పతాకం సగర్వంగా తెలంగాణా గడ్డపై రెపరెపలాండింది. తరువాతి కాలంలో భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్‌ప్రముఖ్‌గా నిజాంను నియమించింది. ఆయన చనిపోయే వరకు ఆ పదవిలో కొనసాగాడు. -
హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?
హైదరాబాద్‌లో ఖాసీం రిజ్వీ అరాచాకాలు పెరుగుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉందని నిఘావర్గాలు భారత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. చాలా సున్నితమైన హైదరాబాద్ సంస్థానం విలీనం అంశంపై నెహ్రూ-పటేల్‌లు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో ఓ వైపు సైన్యం సిద్ధమవుతున్నా హైదరాబాద్‌పై సైనిక చర్య జరుగుతుందా లేదా అనే విషయంపై గందరగోళం నెలకొంది. చివరికి సెప్టెంబర్‌లో హైదరాబాద్ సంస్థానంలోకి భారతసైన్యం అడుగుపెట్టడానికి పటేల్ ఓకే అన్నారు. దీనికి ఆపరేషన్ పోలో అని నామకరణం చేశారు. హైదరాబాద్‌లోని పోలో గ్రౌండ్స్ వల్లే సైనికచర్యకు పోలో అనే పేరుపెట్టారని కొందరు చరిత్రకారులు అంటారు. ఇక హైదరాబాద్‌లో భారత సైన్యం ప్రవేశాన్ని సైనిక చర్య అని పిలవకుండా పోలీసు చర్యగా పిలవాలని నిర్ణయించారు. సైనిక చర్య అంటే మళ్లీ అంతర్జాతీయంగా వివాదం రేగే ప్రమాదం ఉంటుందని.. పోలీసుచర్య అంతర్గత వ్యవహారంగా ఉంటుందనేది పటేల్ భావన. అయితే తరువాతి కాలంలో ఆపరేషన్ పోలోను ఆపరేషన్ క్యాటర్ పిల్లర్‌గా మార్చారు. ఇక అటు భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతుందనే సమాచారం నిజాం చెవినపడింది. దీంతో ఎలాగైనా యుద్ధం చేయాలని నిజాం నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన మంత్రి లాయక్ అలీని లండన్‌కు పంపి అక్కడ భారీగా అయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. ఇక సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియాకు చెందిన పైలట్ ద్వారా యుద్ద విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. దీంతో ఆపరేషన్ పోలోను వేగవంతం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది. ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమయినా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదని పటేల్ నిశ్చయించుకున్నారు. ఒకవేళ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే నిజాం సంస్థానంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని పటేల్ ఆందోళన చెందారు. నిజాం రాజుకు దేశవ్యాప్తంగా ముస్లింలలో ఉన్న పలుకుబడి వల్ల ఈ కల్లోలాలు దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ఉక్కుమనిషి ముందే ఊహించారు. దీంతోపాటు యుద్ధం ఆలస్యం అయితే ఇదే అదనుగా పాకిస్తాన్ కాశ్మీర్లో ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే పటేల్ సైనిక చర్యను వేగంగా ముగించాలని పట్టుదల ప్రదర్శించారు. సెప్టెంబర్ 13న సైనికచర్యకు అన్ని రకాలుగా రంగం సిద్ధమయింది. సరిగ్గా రెండు రోజుల ముందు పాకిస్తాన్లో జిన్నా సెప్టెంబర్-11న చనిపోయాడు. భారత ఆర్మీకి జిన్నా మృతి రూపంలో అవకాశం కలిసి వచ్చింది. దీంతో 13వ తేదీన సైనికచర్య ప్రారంభిస్తే పాకిస్థాన్ అంత తొందరగా స్పందించే అవకాశం ఉండదని పటేల్ భావించారు. సెప్టెంబర్-13 తెల్లవారు జామున ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. అయితే ఆపరేషన్ పోలో ప్రారంభం విషయం ప్రధాని నెహ్రూకు తెలియదని పటేల్ నెహ్రూకు చెప్పకుండానే ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇటు హైదరాబాద్‌పై పోలీసు చర్య ప్రారంభం కాగానే అప్పటి పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ అత్యవసరంగా తన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో భారత్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానంపై దాడి చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఉన్న భారత సైన్యంపై పాకిస్తాన్ ఏమైనా చర్యకు దిగే అవకాశాలున్నాయా అని తన సైన్యాన్ని ప్రశ్నించారు. పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా ఉన్న ఎలవర్థీ.. హైదరాబాద్‌లో పాకిస్తాన్ ఎలాంటి సైనిక చర్యకు దిగే అవకాశం లేదని స్పష్టంచేశారు.. దీంతో ఢిల్లీ పైన పాకిస్థాన్ బాంబులు వేసే అవకాశం ఉందా? అని లియాఖత్ అలీఖాన్ మరో ప్రశ్నవేశారు. దీనికి సమాధానంగా ఎలవర్దీ పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం నాలుగు యుద్ధ విమానాలే ఉన్నాయని.. అందులో రెండు పనిచేయడం లేదన్నాడు. తమ వద్ద ఉన్న రెండు విమానాల్లో ఒకటి మాత్రమే ఢిల్లీ వరకు వెళ్లగలదని.. అయితే అది తిరిగివచ్చే గ్యారంటీ లేదని స్పష్టం చేశాడు. దీంతో హైదరాబాద్ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని పాకిస్థాన్ నిర్ణయించింది. -
తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా? నిజాం రాజు పాలన ఎలా అంతమయ్యింది? సాయుధ పోరాటం ఏమేరకు నిజాంను గద్దె దించగలిగింది? హైదరాబాద్‌పై పోలీస్ యాక్షన్ పేరుతో జరిగింది ఏంటి? నిజాంపై యుద్ధం చేయడంలో నెహ్రూ-పటేల్ పాత్ర ఏంటి? అసలు సెప్టెంబర్-17న ఏంజరిగింది? సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. శతాబ్దాల బానిస సంకెళ్లను తుంచేసిన ఉద్విగ్న సందర్భం. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణం. రాజరికం పరిసమాప్తమై ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన అద్భుత పరిణామం. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. నా దేశం భారతదేశం అని గర్వంగా ప్రతీ తెలంగాణా పౌరుడు నినదించిన తారీఖు సెప్టెంబర్-17. అందుకే తెలంగాణా చరిత్రలో ఈ తేదీ సువర్ణాక్షర లిఖితం. సెప్టెంబర్ -17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందా లేక తెలంగాణా ప్రజలకు నిజాం కబంధ హస్తాల నుంచి విమోచనం లభించిందా అనే అంశంపై భిన్న వాదనలున్నాయి. దీనిపై వాదించేవారు ఎవరైనా తమకు అనుకూలమైన వాదనలనే తెరమీదికి తీసుకువస్తారు. 1948 సెప్టెంబర్-17న పోలీసు చర్యతో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. దీంతో తెలంగాణా ప్రాంతం భారతదేశంలో విలీనమైనపోయినట్లేనని చాలా మంది వాదన. అందుకే సెప్టెంబర్-17ను విలీన దినోత్సవంగా జరపాలంటారు. అయితే సెప్టెంబర్-17న తెలంగాణా పూర్తిగా భారతదేశంలో విలీనం కాలేదనేది కూడా అంతే వాస్తవం. సాంకేతికంగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చేవరకు తెలంగాణా నిజాం పాలనలోనే ఉంది. అయితే పేరుకే నిజాం ప్రభువు అయినప్పటికీ ఇక్కడ పౌరప్రభుత్వం ఏర్పాటు నుంచి సైనిక శక్తి అంతా భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో నిజాం దుష్టపాలన నుంచి ఖాసీం రజ్వీలాంటి రజాకార్ నాయకుల నుంచి తెలంగాణా ప్రజలు విముక్తి పొందారు. అందుకే సెప్టెంబర్-17ను విమోచన దినంగా పరిగణించాలని మరికొందరివాదన. సెప్టెంబర్-17న తెలంగాణా విలీనం జరిగిందా లేక విమోచన జరిగిందా అనే చర్చ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే 1948 సెప్టెంబర్-13 నుంచి 17వ తేదీ వరకు జరిగిన పోలీసు చర్య వల్లే తెలంగాణా నిజాం పాలన నుంచి విముక్తి పొందిందనేది అందరూ అంగీకరించే వాస్తవం. హైదరాబాద్ సంస్థానంను చుట్టుముట్టిన భారత సైన్యం హైదరాబాద్ నగరానికి చేరుకుని నిజాంను లొంగదీసుకున్న ఆపరేషన్ పోలో తెలంగాణా చరిత్ర గతిని మార్చేసింది. తెలంగాణా ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసాదించింది. ఇంతటి కీలక పరిణామాలకు కేంద్రబిందువైన ఆపరేషన్ పోలోకు ముందు చాలా తతంగమే నడిచింది. అయితే ఆపరేషన్ పోలో 5 రోజుల్లో ముగిసిపోయినా సైనిక చర్య తప్పదనే సంకేతాలు 13 నెలల ముందే అంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే కనిపించాయి. -
నిజాం పునాదులు కదిలించిన ఓరుగల్లు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.. రజాకార్లు, దేశ్‌ముఖ్‌ల ఆగడాలకు వ్యతిరేకంగా ఊర్లకు ఊర్లు మర్లబడ్డయి. గ్రామస్తులు బరిసెలు, తుపాకులు చేతబట్టి సాయుధ పోరాటానికి దిగారు. వీరిని చంపేందుకు రజాకార్లు చేయని ప్రయత్నం లేదు. నిజాం సైన్యం ఊర్లపై పడి దొరికిన వారిని దొరికినట్లు చంపేశారు. గ్రామాల్లో మూకుమ్మడి హత్యలు చేశారు. అయినా వెరవలేదు. భయపడలేదు. ఎదురొడ్డి నిలిచి పోరాడారు. సింహంలా దూకిన మొగిలయ్య హన్మకొండ కల్చరల్/వరంగల్ అర్బన్: 1944లో వరంగల్‌లో సర్వోదయ సంఘం స్థాపించారు. ప్రతివారం వరంగల్ కోటలో, స్తంభంపల్లిలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజలింగం, హయగ్రీవాచారి, సంగరంబోయిన కనకయ్య, మల్లయ్య, దుగ్గిశెట్టి వెంకటయ్య, ఏ.సుదర్శన్, బి. రంగనాయకులు, వి.గోవిందరావు, భూపతి కృష్ణమూర్తి, బత్తిని రామస్వామి, బత్తిని మొగిలయ్యల ఆధ్వర్యంలో 1944 నుంచి జెండా వందనాలు జరుగుతూ వచ్చాయి. బత్తిని రామస్వామి ఇంటిముందున్న ఆవరణలో 1946, ఆగస్టు 11న జెండావందనం జరిగింది. మొగిలయ్య కూడా అందులో పాల్గొన్నాడు. విషయం తెలుసుకున్న రజాకార్ల గుంపు ఖాసీం షరీఫ్ ఆధ్వర్యంలో వారిపై దాడి జరిపారు. బత్తిని రామస్వామికి గాయాలయ్యాయి. వెంకటయ్య చేయి నరికివేశారు. కూచం మల్లేషం తుపాకీ గుండుతో గాయపడ్డాడు. మరికొందరు గాయపడ్డారు. అప్పటికే కల్లుగీసేందుకు వనానికి వెళ్లిన మొగిలయ్యకు తన సోదరుడు గాయపడిన సంగతి తెలిసింది. వెంటనే సింహంలా వచ్చి వారిపై కలబడ్డాడు. మొగిలయ్యను వదిలేస్తే తమను వదిలిపెట్టాడని భావించిన రజాకార్లు బరిసెతో పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఖాసీం షరీఫ్, తన అనుచరులు ఖిలా వరంగల్ నుంచి వరంగల్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి ప్రజలకు మొగిలయ్యను చంపిన బరిసెను చూపుతూ భయం కలిగించేలా ఊరేగింపు చేశారు. మొగిలయ్య స్మారక చిహ్నంగా ఎల్లమ్మ బజారులో ఒక భవనాన్ని నిర్మించారు. అది ఇప్పటికి మొగిలయ్య హాలుగా ప్రసిద్ధి చెందింది. సగర్వంగా జీవిస్తున్నా.. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ, కొంతమంది స్వాతంత్య్ర సమరయోధులైన మా నాన్న గురించి పదే పదే చెప్పేవారు. రజాకార్లకు ఎదుదొడ్డి నిలిచి వీరమరణం పొందాడని చెబుతుండడం గర్వంగా ఉంటుంది. నాకు, నా కుటుంబానికి ప్రభుత్వం నుంచి కానీ.. బత్తిని మొగిలయ్య గౌడ్ ట్రస్టునుంచి ఎలాంటి గుర్తింపు, ఆర్థికసాయం లేదు. – బత్తిని బాబు గౌడ్, మొగిలయ్య కుమారుడు ఒంటిచేత్తో... జాఫర్‌గఢ్ మండలం కూనూర్ గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఒంటిచేత్తో రజాకార్లపై తిరుగుబాటు చేశారు. తుపాకీ చేతపట్టి నిజాం సైన్యాన్ని గడగడలాడించిన వీరవనిత ఆమె. గాయపడ్డ సహచర ఉద్యమకారులకు వైద్యం అందిస్తూ తనలోని గొప్పదనాన్ని చాటుకున్నారు. నెల్లుట్ల మోహన్‌రావుకు సహాయకురాలిగా పనిచేస్తూ.. ఆయననే వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో మోహన్‌రావు కమ్యూనిస్టు పార్టీ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మోహన్‌రావు మృతిచెందగా.. వృద్ధాప్యంలో ఉన్న సుశీలాదేవి మాత్రం ప్రస్తుతం వరంగల్‌లోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈమెకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సమరయోధుల పింఛన్ రానప్పటికీ, భర్తకు వచ్చే పింఛన్‌తో బతుకు బండి లాగిస్తున్నారు. (క్లిక్ చేయండి: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్) గత చరిత్రకు సాక్ష్యం ‘జనగామ రైల్వేస్టేషన్’ జనగామ: నిజాం నిరంకుశ పాలనపై మొదలైన తిరుగుబాటు.. దొరల పాలనకు చరమగీతం పాడింది జనగామ రైల్వేస్టేషన్. విస్నూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి కొడుకు బాబుదొర అరాచకాలు ప్రజలను గోసపెట్టాయి. తనకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమకారులను హతమార్చాడు. 1947లో నలుగురు విప్లవకారులకాళ్లు, చేతులు కట్టేసి గూండాల సహాయంతో సవారు కచ్చరంలో లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చేరుకున్నాడు. తెల్లవారుజామున ఊరి శివారున ఉన్న ఈత చెట్ల వనం సమీపంలో నలుగురిని సజీవ దహనం చేస్తున్న క్రమంలో.. ఓ ఉద్యమకారుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. అదే మండలం కుందారం గ్రామానికి చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలియజెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆయా గ్రామాల ప్రజలు సుమారు పదివేల మందికిపైగా బాబుదొర జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. దీంతో అతను పోలీస్ శరణుకోరి తలదాచుకున్నాడు. తమ విముక్తి కోసం పోరాడుతున్న ముగ్గురు విప్లవకారులను చంపేశారనే ఆవేశంలో పోలీస్‌స్టేషన్‌ను సైతం బద్దలు కొట్టేందుకు యత్నించారు. దీంతో బాబుదొర గన్‌తో బెదిరిస్తూ.. రైల్వేస్టేషన్‌కు సమీపంలోని పాత ఆంధ్రాబ్యాంకు ఏరియాలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న విప్లవయోధుడు గబ్బెట తిరుమల్‌రెడ్డి నాయకత్వంలో జాటోతు దర్గ్యానాయక్ (ప్రస్తుతం బతికే ఉన్నారు). మరికొందరు విప్లవకారులు జనగామ రైల్వే వ్యాగన్ ఏరియాలో కాపుకాస్తూ.. దొర రాకకోసం ఎదురుచూశారు. పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలుకింద నుంచి దొర దాటుకుంటూ వ్యాగన్ పాయింగ్ రావిచెట్టు కిందకు రాగానే దర్గ్యానాయక్ ఆయన మెడపై మొదటి వేటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విప్లవకారులు దొరను చిత్రహింసలు పెట్టి చంపేశారు. దీంతో ప్రజల జయజయధ్వానాల మధ్య సంబురాలు చేసుకున్నారు. దొరకు చరమగీతం పలికిన రైల్వేస్టేషన్ నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. చరిత్రకెక్కని సంకీస పోరు; 21 మందిని సజీవ దహనం చేసిన రజాకార్లు డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రజాకార్ల ఆగడాలకు 21 మంది గ్రామస్తులు బలి కాగా.. ఇళ్లు, పంటలు ధ్వంసమయ్యాయి. కానీ.. ఆ పోరాటం చరిత్రకెక్కలేదు. మానుకోట, ఖమ్మం జిల్లాల పరిధిలోని గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతుండగా పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన తుమ్మ శేషయ్య, ఉయ్యాలవాడకు చెందిన ఏలూరి వీరయ్య, నున్నా పుల్లయ్య వేర్వేరుగా దళాలను ఏర్పాటు చేసి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడారు. సంకీసకు చెందిన తుమ్మ శేషయ్య దళాలకు ముందుండి నడిపిస్తుండడంతో ఆయన్ను మట్టుబెట్టాలని రజాకార్లు పలుమార్లు ప్రయత్నించారు. శేషయ్యను పట్టుకునేందుకు ప్రయత్నించి మూడుసార్లు గ్రామాన్ని తగులబెట్టారు. నాలుగోసారి 1948, సెప్టెంబర్ 1న రజాకార్లు గ్రామంపై దాడి జరిపి మారణహోమం సృష్టించారు. శేషయ్య ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులందరినీ బందెలదొడ్డి వద్దకు చేర్చారు. 15 ఏళ్లలోపు వారిని బయటకు పంపి.. మిగతా వారిని చిత్రహింసలకు గురిచేశారు. శేషయ్య జాడ చెప్పకపోవడంతో గ్రామస్తులపై మూకుమ్మడిగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో కొందరు చనిపోగా.. కొన ఊపిరితో మరికొందరు కొట్టుకుంటుండగా వరిగడ్డి వారిపై వేసి కాల్చారు. వరి గడ్డి కోసం గడ్డివాము వద్దకు వెళ్లిన రజాకార్లకు గడ్డివాములో దాక్కున్న అన్నాతమ్ములు తేరాల గురవయ్య, రామయ్య, లాలయ్య కనిపించారు. వారు ఎంత బతిమిలాడినా వినకుండా తుపాకులతో కాల్చి చంపి అందరినీ ఒకచోటకు చేర్చి గడ్డితో తగులబెట్టారు. కాల్పుల్లో 16 మంది చనిపోగా.. తరువాత గాయాలతో ఐదుగురు ప్రాణాలు వదిలారు. రజాకార్లు గ్రామం నుంచి వెళ్లిపోయిన తరువాత సగం కాలిన మృతదేహాలకు గ్రామస్తులు ఘటనా స్థలం వద్దే సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. నాటి ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారిలో కొద్దిమంది మాత్రమే గ్రామంలో ఉన్నారు. నెత్తురోడిన తమ్మడపల్లి(జి); ఒకేరోజు 12 మంది వీరమరణం జనగామ/జఫర్‌గఢ్/స్టేషన్‌ఘన్‌పూర్: తెలంగాణ సాయుధ పోరాటంలో జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి(జి) ఊరి త్యాగం చరిత్ర పుటల్లో ఎక్కడా కనిపించదు. గ్రామానికి చెందిన 12 మందిని నిజాం సైన్యం కాల్చి చంపేసింది. నిజాం ఏజెంటుగా వ్యవహరించే ఖాదరెల్లి జాఫర్‌గఢ్ కేంద్రంగా తన అరాచకాలను కొనసాగించాడు. భరించలేని రైతులు ప్రజా రక్షక దళాలుగా ఏర్పడి కర్రలు, వడిశాలలు, బరిసెలు, కత్తులు, కారంపొడితో రజాకార్లపై తిరుగుబాటు చేశారు. కమ్యూనిస్టు ప్రతినిధులు నల్ల నర్సింహులు, కృష్ణమూర్తి, యాదగిరిరావు, నెల్లుట్ల మోహన్‌రావు వీరికి అండగా నిలిచారు. 1947, సెప్టెంబర్ 11న జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానం స్ఫూర్తితో తమ్మడపల్లి(జి), సురారం, షాపల్లి, తిమ్మాపూర్‌తోపాటు అనేక గ్రామాల ప్రజలు ఖాదరెల్లి ఇంటిపై మూకుమ్మడి దాడి చేశారు. విషయం తెలుసుకున్న రజాకార్లు తమ బలగాలతో తమ్మడపల్లి (జి) గ్రామాన్ని చుట్టుముట్టి 20 మందిని బంధించి, గ్రామ శివారులో వరుసగా నిలబెట్టి వారిపై బుల్లెట్ల వర్షం కురించారు. ఈ ఘటనలో చాడ అనంతరెడ్డి, బత్తిని బక్క రాజయ్య, దొంతూరి చిన్న రాజయ్య, ఎరుకల ఇద్దయ్య, గుండెమల్ల పోశాలు, చెదలు నర్సయ్య, ఎండీ.ఖాసీం, గుజ్జరి రామయ్య, దిడ్డి పెరుమయ్య, కోమటి నర్సింహరామయ్య, కుంట పెద్దపురం, మంగలి వెంకటమల్లు, గుండెటి గుండారెడ్డి అసువులు బాయగా.. మరో 8 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. (క్లిక్ చేయండి: సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?) -
Telangana Vimochana Dinotsavam: గంగాపూర్ ఘటనతో స్పీడ్ పెంచిన సర్దార్
భారత్‌లో విలీనం కావడం ముందు నుంచి నిజాంకు ఇష్టం లేదు. భారత స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే తాను భారత్‌లో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండే అవకాశం ఉందా అని నిజాం తన సలహాదారు సర్ వాల్టర్ మాంగ్టన్‌ను అడిగాడు. అయితే వాల్టర్ మాంగ్టన్ భారత్ మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం లేదని పాకిస్థాన్‌లో విలీనం కావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. అయినా ఏదో విధంగా స్వతంత్రంగా ఉండాలనేదే నిజాం అభిలాష. మరోవైపు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడైన ఖాసీం రజ్వీ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ సంస్థానం విలీనం చేయకూడదంటూ నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. రజాకార్ల పేరుతో ఖాసీం రజ్వీ ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం అప్పటికే తెలంగాణాలో అరాచాకాలు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో సభ పెట్టి తాము ఎర్రకోటపై నిజాం జెండా ఎగరేస్తామని ఖాసీం రజ్వి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రారంభించాడు. హైదరాబాద్ సంస్థానంపై సైనికచర్యకు సంబంధించి నెహ్రూ-పటేల్ మధ్య వైరుధ్యం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోడానికి సైనికచర్య చివరి ప్రత్యామ్నాయం కావాలని నెహ్రూ భావించారు..పటేల్ మాత్రం తాత్సారం చేయకూడదనే ఆలోచనతో ఉన్నారు. దీనికోసం ఆపరేషన్ పోలో పేరుతో ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఈ ఆపరేషన్ అత్యంత వేగంగా పూర్తవ్వాలనేది పటేల్ వ్యూహం. గంగాపూర్ రైల్వేస్టేషన్లో రజాకార్లు చేసిన దాడి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీంతో అప్పటి వరకు సహనంతో ఉన్న పటేల్ వెంటనే హైదరాబాద్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. వెంటనే కాశ్మీర్లో ఉన్న సైన్యాధ్యక్షుడు కరియప్పను ఢిల్లీకి పిలిపించిన పటేల్.. హైదరాబాద్‌పై చర్యకు సిద్ధం కావాలని ఆదేశించారు. దీంతో సైనికాధికారులు అత్యంత వేగంగా సైనిక చర్య పూర్తి చేసే విధంగా వ్యూహాలు రూపొందించారు. ఒకవేళ హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం చర్యకు దిగితే పాకిస్థాన్ ఏదైనా ప్రతీకార దాడులు చేస్తుందా అనే కోణంలోనూ పటేల్ వ్యూహాలు సిద్ధం చేశారు. దీనికోసం నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పడు సమాచారం సేకరించి పాకిస్థాన్ ఎత్తుగడలపై సమీక్షలు జరిపారు. ఇక భారత్ సైనిక చర్యను నిజాం సైన్యం ఎంతకాలం ఎదుర్కోగలదనే విషయంపై ప్రాథమికంగా కొంత గందరగోళం ఉండింది. ముఖ్యంగా నిజాం యుద్ధవిమానాలు కొనుగోలు చేస్తున్నాడని కొంతమంది సైనిక జనరల్స్ సమాచారం ఇచ్చారు. దీంతో సైనిక చర్యకు దిగాలా.. వద్దా అనే మీమాంస ఎదురైంది. -
Shoyabullakhan: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత స్వాతంత్య్రం సిద్ధించింది. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కావడానికి ఎందరో దేశభక్తులు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. నిజాం నిరంకుశత్వానికి.. రజాకార్ల ఆరాచకాలను ప్రపంచానికి తెలిసేలా వార్తలు, సంపాదకీయాలు రాసిన షోయబ్–ఉల్లా–ఖాన్ గురించి మనం తెలుసుకోవాలి. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలని తన కలాన్ని గళంగా మార్చుకుని నిజాం వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతూ అసువులు బాసిన షోయబుల్లాఖాన్‌కు సలాం. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నేటి యువత, విద్యార్థులు ఆయన గురించి తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ కథనం. పోచారం: ప్రజాస్వామ్య విలువల కోసం అక్షర పోరాటం చేస్తూ.. నడి రోడ్డుపై ప్రాణ త్యాగం చేసిన షోయబుల్లాఖాన్ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం. 1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని షోయబ్ ఆకాంక్షించారు. ఆ తరుణంలోనే హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని నిజాం రాజుకు ఏడుగురు ముస్లిం పెద్దలు విజ్ఞాపన పత్రం సమర్పించారు. దీనిని షోయబ్ తన సొంత పత్రిక ఇమ్రోజ్‌లో ప్రచురించారు. పత్రికలో వచ్చిన కథనాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రస్తావిస్తుందేమోనని నిజాం భయపడి షోయబ్‌ను హత్య చేయించాడు. కుటుంబ నేపథ్యం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరి కుటుంబం నిజాం ప్రాంతానికి వలస వచ్చింది. ఖమ్మం జిల్లా సుబ్రవేడ్‌లో 1920 అక్టోబర్ 17న హబీబుల్లాఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు షోయబుల్లాఖాన్ జన్మించారు. తేజ్, రయ్యత్ పత్రికల్లో జర్నలిస్టుగా.. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తేజ్ అనే ఉర్దూ పత్రికలో చేరి రజాకార్ల అరాచకాలపై అక్షర నిప్పులు చెరిగేవారు. దీంతో తేజ్ పత్రికను సర్కార్ నిషేధించడంతో రయ్యత్ పత్రికలో చేరారు. చివరకు రయ్యత్ పత్రికను ప్రభుత్వం మూసివేయించింది. బూర్గుల సాయంతో ఇమ్రోజ్ పత్రిక స్థాపన నగలు నట్రా అమ్మి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో హైదరాబాద్‌లోని కాచిగూడలో ఇమ్రోజ్ అనే పత్రికను షోయబ్ స్థాపించారు. షోయబ్ రచనలకు రగిలిపోయిన ఖాసిం రజ్వీ 1947 నవంబర్ 17న తొలి సంచిక వెలువడింది. నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ పదునైన సంపాదకీయాలు రచించేవారు. వీరి రచనలకు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ రగిలిపోయాడు. (క్లిక్: చరిత్రను కాటేయ జూస్తున్నారు!) చప్పల్‌బజార్ రోడ్డులో చంపిన రజాకార్లు ► 1948 ఆసుస్టు 21న కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని ఇమ్రోజ్ ఆఫీస్ నుంచి అర్ధరాత్రి తన బావమరిది ఇస్మాయిల్‌ఖాన్‌తో కలిసి ఇంటికి వస్తుండగా చప్పల్‌బజార్ రోడ్డులో రజాకార్లు అతిక్రూరంగా చేతిని నరికి తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ► అడ్డుకోబోయిన తన బావమరిది చేతులు సైతం నరికేశారు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ 1948 ఆగస్టు 22వ తేదీన తెల్లవారు జామున షోయబ్ తుదిశ్వాస విడిచారు. ► ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో నివసిస్తున్నారు. మలక్‌పేట్‌లో షోయబ్ పేరుతో ఒక గదిలో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు ఏర్పాటు చేశారు. (క్లిక్: సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?) -
నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’
సాక్షి, హైదరాబాద్: ‘మా భూమి’ ఒక సినిమా మాత్రమే కాదు. ఒక చారిత్రక దృశ్యకావ్యం. తెలుగు సినీచరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రయోగం. నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అకృత్యాలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సమున్నతంగా ఎత్తిపట్టిన సామాజిక చిత్రం. నలభై రెండేళ్ల క్రితం విడుదలైన ‘మా భూమి’సినిమా ఇప్పటికీ ప్రేక్షాకాదరణను పొందుతూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ఒక చర్చనీయాంశం. సాయుధపోరాటాన్ని, తెలంగాణలో పోలీస్ యాక్షన్ కాలాన్ని ‘మాభూమి’లో చిత్రీకరించారు. రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలను, హింసను చూసిన హైదరాబాద్ రాజ్యం పోలీసు యాక్షన్‌తో భారత యూనియన్‌లో భాగమైంది.ఆ నాటికి ఒక కీలకమైన దశాబ్ద కాలాన్ని అద్భుతమైన మా భూమి సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు చిత్ర నిర్మాత, సంగీత దర్శకులు బి. నర్సింగ్‌రావు. అప్పటి అనుభవాలు ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... నిర్మాత నర్సింగరావుతో నటుడు సాయిచంద్ అదొక ప్రయోగం.. ‘మా భూమి’ సినిమా ఒక ప్రయోగం.అప్పటి వరకు సినిమా తీసిన అనుభవం లేదు. నటీనటులు కూడా అంతే. స్టేజీ ఆర్టిస్టులు. సాయిచంద్ బహుశా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. క్రికెట్ ఆడుతుండగా తీసుకెళ్లాం, ఆయనకు అదే మొదటి సినిమా. కాకరాల, భూపాల్‌రెడ్డి, రాంగోపాల్, తదితరులంతా రంగస్థల నటులు. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడు గౌతమ్‌ఘోష్ అందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఈ సినిమా కోసం పని చేశాం. ►1978 నుంచి 1980 వరకు సినిమా నిర్మాణం కొనసాగింది. చిత్రం షూటింగ్ ప్రారంభోత్సం నుంచి లెక్కిస్తే ఇప్పటికి 44 ఏళ్లు. విడుదలైనప్పటి నుంచి అయితే 42 సంవత్సరాలు. సినిమా విడుదలైన రోజుల్లో సినిమా టాకీస్ల వద్దకు జనం పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవారు. సినిమా టాకీసులన్నీ జాతర వాతావరణాన్ని తలపించేవి. హైదరాబాద్‌లో ఈ సినిమాకు అపూర్వమైన ఆదరణ లభించింది. దర్శకుడు గౌతమ్‌ఘోష్ మా భూమిని అత్యంత ప్రతిభావంతంగా, సృజనాత్మకంగా, ఒక దృశ్యకావ్యంలా చిత్రీకరించారు. ‘మా భూమి’ సినిమాలోని సన్నివేశాలు హైదరాబాద్‌లో చిత్రీకరణ... మా భూమి సినిమాను చాలా వరకు మొదక్ జిల్లా మంగళ్పర్తి, దొంతి గ్రామాల్లో , శివంపేట గడీలో చిత్రీకరించాము. విద్యుత్ సదుపాయం కూడా లేని ఆ రోజుల్లో పగటిపూటనే చీకటి వాతావరణాన్ని చిత్రీకరించి సినిమా షూటింగ్ చేశాం.రజాకార్ల దాడి , కమ్యూనిస్టుల పోరాటాలు వంటి కీలకమైన ఘట్టాలను చిత్రీకరించే సమయంలో కళాకారులకు దెబ్బలు కూడా తగిలేవి. గాయాలకు కట్టుకట్టేందుకు రోజుకు ఒక అయోడిన్ బాటిల్ చొప్పున వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో చాలా చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్ నగర సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా ఆఫ్జల్‌గంజ్‌లోని ఇరానీ హాటల్లో ఒక సన్నివేశాన్ని తీశాం. అలాగే కార్వాన్, జాహనుమా, జూబ్లీహాల్, వనస్థలిపురం, నయాఖిల్లా, సాలార్జంగ్ మ్యూజియం, కాలాగూడ, తదితర ప్రాంతాల్లో మా భూమి సినిమా తీశాం. కథానాయిక చంద్రి నివాసం, గుడిసెలు అంతా హైదరాబాద్‌లోనే సెట్టింగ్ వేశాం.ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభవం. అందరికీ ఒకే కిచెన్ ఉండేది. అందరం కలిసి ఒకే చోట భోజనాలు చేసేవాళ్లం. లారీల్లో ప్రయాణం చేసేవాళ్లం, ప్రజలు కళాకారులే... ఆ రోజుల్లో కేవలం రూ.5.40 లక్షలతో ఈ సినిమా పూర్తయింది. ఆర్టిస్టులకు రూ.300, రూ.500, రూ.1000 చొప్పున ఇచ్చాం.చాలా మంది స్వచ్చందంగా నటించారు. సగం మంది ఆర్టిస్టులు ఉంటే మిగతా సగం మంది ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలే. షూటింగ్ సందర్శన కోసం వచ్చిన వాళ్లే ఆర్టిస్టులయ్యారు. ఒకసారి 80 మంది గ్రామస్తులకు ఆ రోజు కూలి డబ్బులు మాత్రమే చెల్లించి సినిమా షూటింగ్లో భాగస్వాములను చేశాం.అప్పటి తెలంగాణ సమాజాన్ని, రజాకార్ల హింసను, పోలీసు చర్య పరిణామాలను ఈ సినిమా ఉన్నదున్నట్లుగా చూపించింది. ‘ అని వివరించారు. బండెనుక బండి కట్టి... ఈ సినిమాలో ప్రజాగాయకుడు గద్దర్ పాడిన పాట అప్పటి నిజాం రాక్షస పాలన, జమీందార్ల దౌర్జన్యాలపైన ప్రజల తిరుగుబాటును కళ్లకు కట్టింది. ‘బండెనుక బండి కట్టి. పదహారు బండ్లు కట్టి.. నువు ఏ బండ్లె పోతవురో నైజాము సర్కరోడా....’ అంటూ గద్దర్ ఎలుగెత్తి పాడిన ఆ పాటు ప్రజలను పెద్ద ఎత్తున కదిలించింది. నిజాం నిరంకుశ పాలనపైన, దొరలు, జమీందార్ల పెత్తనంపైన ప్రజాగ్రహం పెల్లుబికేవిధంగా ఈ పాట స్ఫూర్తిని రగిలించింది. -
ఆజాద్ హైదరాబాద్: సాయుధ పోరులో చేయి కలిపిన సింగరేణి
దేశమంతా స్వాతంత్య్ర సంబురాలు జరుపుకొంటున్న వేళ... తెలంగాణ మాత్రం నిజాం రాజు ఏలుబడిలోనే కొనసాగింది. ఎందరో వీరుల పోరాట ఫలితంగా బ్రిటీష్ వాళ్లు దేశాన్ని వదిలి వెళ్లాక కూడా హైదరాబాద్ సంస్థానాదీశుడైన నిజాం ఆధ్వర్యాన రజాకారులు హైదరాబాద్ సంస్థానం పరిధిలో అరాచకాలు సాగించారు. కొంతకాలం పంటి బిగువున భరించిన ప్రజలు... దుర్మార్గాలు పెచ్చరిల్లడంతో తిరుగుబాటుకు దిగారు. యువత ఏకమై సాయుధపోరాటాలు సాగించి నిజాం సైన్యాలను తిప్పికొట్టింది. ఈ పోరాటంలో పలువురు అమరులైనా మిగతా వారు వెనక్కి తగ్గకుండా చేసిన పోరాటంతో తెలంగాణకు సైతం స్వాతంత్య్రం లభించింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట గాధలను స్థానికులు గుర్తు చేసుకుంటుంటారు. ఆనాటి అమరులకు గుర్తుగా నిర్మించిన స్థూపాలు సాక్షిగా నిలుస్తున్నాయి. ఈమేరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పలు గ్రామాలపై కథనాలు.. ఈటెలతో తిరగబడిన మీనవోలు ఎర్రుపాలెం : తెలంగాణ సంస్థానాన్ని ఏలుతున్న నైజాం పాలనను వ్యతిరేకిస్తూ చేపట్టిన సాయుధ పోరాటంలో ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయ్యారు. పోరాటాల పురిటిగడ్డగా మీనవోలు గ్రామం చరిత్ర పుటలకెక్కింది. ఎర్రుపాలెం మండల కేంద్రంలో నైజాంలు అప్పట్లో పోలీస్ క్యాంపు నిర్వహించేవారు. అందులో బ్రిటీష్ ప్రభుత్వ అధికారి లెఫ్టినెంట్ సార్జంట్ తరచూ మీనవోలు గ్రామంపై దాడులు చేసి ప్రజల సొమ్మును అపహరించేవాడు. సార్జంట్ తీరుకు తోడు రజాకారులు కూడా ప్రజలను చిత్రహింసలు పెడుతుండగా... 1948 సంవత్సరం జనవరి 15న గ్రామస్తులంతా మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఈక్రమంలో సార్జంట్ తన బలగాలే కాకుండా రజాకార్లతో కలిసి మీనవోలుకు వస్తున్నాడన్న సమాచారంతో గ్రామస్తులు ఈటెలతో దండెత్తారు. ప్రజల తిరుగుబాటును ఊహించని సార్జంట్ అప్పటికప్పుడు విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరపగా రాంపల్లి రామయ్య, సుఖబోగి ముత్తయ్య, తోట బాలయ్య, పిల్లి కాటయ్య, బండి వీరయ్య, మెట్టెల శ్రీరాములు, తోట వెంకయ్య ప్రాణాలు కోల్పోయారు. అయినా కోపం చల్లారని సార్జెంట్.. నైజాం నవాబు సాయంతో రజాకార్లను రైలులో రప్పించి పలువురి ఇళ్లను తగలబెట్టారు. అలా పరిస్థితి విషమించడంతో పలువురు గ్రామస్తులు మీనవోలు విడిచివెళ్లారు. అనంతర కాలంలో పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ గ్రామాలకు చేరుకున్నారు. కాగా, రజాకార్లను ఎదురొడ్డి పోరాడి అమరులైన వారికి గుర్తుగా గ్రామస్తులు 1958 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన స్థూపాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఈ స్థూపం శిథిలం కావడంతో మరమ్మత్తులు చేయించడంతో పాటు అదే రీతిలో ప్రధాన రహదారిపై మరో స్థూపాన్ని నిర్మించారు. గుర్రాలతో తొక్కించినా నోరువిప్పని పోరాటపటిమ కొణిజర్ల : నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో యువకులు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడగా... అందులో కొణిజర్ల మండలంలోని తనికెళ్లకూ స్థానముంది. తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, గడల రామకృష్ణయ్య, గడల సుబ్బయ్య, గడల నర్సయ్య తుళ్లూరి అప్పయ్య, కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య తాళ్లపల్లి రాములు ఆనాడు మల్లెల వెంకటేశ్వరరావు దళంలో పనిచేశారు. నాటి సాయుధ పోరాటంలో నల్లమల వెంకటేశ్వరరావు, షేక్ రజబ్అలీ నేతృత్వంలో తుపాకులు చేతబట్టి కదన రంగంలో కాలుమోపి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. దళంలో పనిచేసిన వీరికి ఇదే గ్రామానికి చెందిన గడల ముత్తయ్య, పేరసాని అప్పయ్య, యాసా వెంకటలాలయ్య, పిన్నం సత్యం, యాసా మాణిక్యమ్మ సాయం చేసేవారు. ఓ సమయాన రజాకార్లు గ్రామాలపై విచక్షణారహితంగా దాడి జరిపి మహిళలు, చిన్నారులను చిత్రహింసలకు గురిచేయడమే కాక పురుషులను పట్టుకుని జైలులో పెట్టారు. అందులో పలువురిని కాల్చి చంపడం ద్వారా గ్రామస్తులకు భయాందోళనకు గురిచేసేవారని చెబుతారు. ఆ సమయాన గడల సీతారామయ్య ఆచూకీ తెలపమని రజాకార్లు గుర్రాలతో తొక్కించినా గ్రామస్తులెవరూ నోరు విప్పలేదట! నాటి తెలంగాణ సాయుధ పోరాట ఆద్యుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పలువురు పోరాటంలో పాల్గొనగా, గ్రామానికి చెందిన యాసా మాణిక్యమ్మ అడవుల్లో తలదాచుకుంటున్న పోరాటవీరులకు భోజనం సమకూర్చేది. ఆమెను గుర్తించి రజాకార్లు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టినా ఎవరి వివరాలు తెలియనివ్వలేదు. మండలంలోని లాలాపురానికి చెందిన సంక్రాంతి రామనర్సయ్య గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలో ఆరికాయలపాడు దళం ఆర్గనైజర్‌గా పనిచేశారు. 1945 ప్రాంతంలో సింగరాయపాలెం జాగీర్దార్, నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటం నిర్వహించాడు. వివాహమైన ఏడాదికే దళంలో చేరిన రామనర్సయ్య చేసిన పోరాట పటిమను తట్టుకోలేని నిజాం ప్రభుత్వం 1947లో ఆయనతో పాటు మరికొందనిని గుబ్బగుర్తి అడవుల్లో పట్టుకుంది. ఆతర్వాత మున్నేరువాగు వద్దకు తీసుకెళ్లి ఎవరి గోతులు వారినే తవ్వుకోమని చెప్పి కాల్చి చంపి పూడ్చి పెట్టారు. ఆయన స్ఫూర్తితోనే రామనర్సయ్య సోదరుడు సంక్రాంతి మధుసూదన్‌రావు కమ్యూనిస్టు నాయకుడిగా కొనసాగుతున్నారు. పోరాటాల గడ్డ మేదేపల్లి ఏన్కూరు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏన్కూరు మండలం మేడేపల్లి గ్రామస్తులు ఎందరో రజాకార్లను ఎదురొడ్డి పోరాటం చేశారు. తద్వారా పోరాటాల గడ్డగా మేడేపల్లి చరిత్రకెక్కింది. మేడేపల్లి గ్రామంలో గిరిజనులు రజాకార్లను ఎదిరించి పోరాటాలు చేశారు. తాటి సీతమ్మ, తాటి సత్యం, ముక్తి ఎర్రయ్య, బండ్ల పెద్ద జోగయ్య, ముక్తి రాములు తుపాకులు పట్టి అడవుల్లో తలదాచుకుంటూ రజాకార్లను తుదముట్టించారు. నల్లమల గిరిప్రసాద్ నాయకత్వంలో వీరు పోరాటం చేసినట్లు చెబుతారు. తాటి సీతమ్మ, తాటి సత్యంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్మృతిచిహ్నాలుగా గ్రామంలో స్థూపాలను ఏర్పాటుచేశారు. పోలీస్ చర్య తర్వాతా యుద్ధమే.. సత్తుపల్లి : సత్తుపల్లి నుంచి పది కి.మీ. దూరంలో ఉన్న ఆంధ్రా ప్రాంతంలోని గురుభట్లగూడెం, కృష్ణారావుపాలెం తదితర ప్రాంతాలపై రజాకార్ల నిర్బంధం కొనసాగేది. ఆ సమయంలో దమ్మపేట మండలం జమేదారుబంజరు ప్రాంతం నుంచి సోయం గంగులు నాయకత్వంలో సాయుధ పోరాటం మొదలైంది. ఆయనకు మద్దతుగా గిరిజనులు, గిరిజనేతరులు రజాకారులపై గెరిల్లా దాడులు పాల్పడుతుండేవారు. అనంతర కాలంలో పోలీసు చర్యతో తెలంగాణకు విముక్తి లభించింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు – భారత మిలటరీకి 1948 నుంచి 1950 వరకు రెండేళ్ల పాటు హోరాహోరీ పోరు నడిచింది. గ్రామాల్లోకి భారత సైన్యం వస్తుంటే కమ్యూనిస్టులు సాయుధులై తిరుగుబాటు చేసేవారు. క్షేత్ర స్థాయిలో పరిపాలనను అందించేందుకు ఆ సమయానభారత మిలటరీకి మద్దతుగా గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటయ్యాయి. ఈ దళాల్లోని సభ్యులకు తుపాకీతో శిక్షణ ఇచ్చేవారు. వీరు ఉదయమంతా గ్రామాల్లో గస్తీ తిరగటం.. చీకటిపడే సమయానికి సత్తుపల్లి పాత సెంటర్లోని జెండా చింతచెట్టు వద్ద సమావేశ కావటం జరుగుతుండేది. భారత మిలటరీని మలబార్ రెజిమెంట్ ఆధ్వర్యంలో రక్షణ దళం ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులను హోంగార్డులుగా కూడా వ్యవహరించేవారు. ఇందులోభాగంగా 1948లో సత్తుపల్లి గ్రామ రక్షణ దళం ఏర్పాటు కాగా.. చల్లగుళ్ల సీతారామయ్య, నరుకుళ్ల వెంకయ్య, దిరిశాల సత్యం, మట్టా రామయ్య, చల్లగుండ్ల వీరయ్య, మట్టా వెంకయ్య, మొరిశెట్టి సత్యం, నరుకుళ్ల రామయ్య, పల్లబోతు నాగభూషణం, కొత్తూరు సుబ్బారావు, సీతారామయ్య, మహాదేవ రామలింగం, వల్లభనేని సకలయ్య తదితరులు సభ్యులుగా ఉండే వారని పెద్దలు చెబుతుంటారు. నాకు గర్వంగా ఉంటుంది.. 18 ఏళ్ల వయస్సులో మా నాన్న చల్లగుళ్ల వీరయ్య సత్తుపల్లి గ్రామ రక్షణ దళంలో పని చేశారు. కమ్యూనిస్టు సాయుధ పోరాటం విరమించే వరకు రక్షణ దళం భారత మిలటరీ మద్దతుతో పని చేసేదని మానాన్న చెప్పేవారు. సత్తుపల్లి చరిత్రలో మా కుటుంబం పేరు కూడా ఉండటం నాకు గర్వకారణంగా ఉంది. – చల్లగుళ్ల నర్సింహారావు, సత్తుపల్లి -
చరిత్రను కాటేయ జూస్తున్నారు!
తొలిసారి నేను 1999లో నల్లమలను చూశాను. చెంచుల తొలి పరిచయం అప్పుడే. అప్పాపూర్ పెంట పెద్ద మనిషి తోకల గురువయ్య నాకు తొలి చెంచు మిత్రుడు. అప్పటికే 60 ఏళ్లు దాటిన వృద్ధుడు. తెల్లటి ఛాయ, బుర్ర మీసాలు... చెంచు ఆహార్యమే గాని, ఇగురం తెలిసిన మనిషి. ఈడు మీదున్నప్పుడు ఇప్ప సారా గురిగి లేపితే సేరు సారా అవలీలగా పీకేటో డట. 83 ఏళ్ల వయసులో మూడేళ్ల కిందట చనిపోయాడు. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ మీద భీమిరెడ్డి ఫైరింగ్. బాలెంల, పాత సూర్యాపేట ఊదరబాంబు దెబ్బ. పాలకుర్తి పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తి. దొడ్డి కొమురయ్య, మల్లెపాక మైసయ్య, బందగీ అమరత్వంతో ఊరూరా ప్రజా యుద్ధం సాగింది. ఈ దశలోనే రైతాంగ సాయుధ పోరాటానికి బీజం పడ్డది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) తొలి తుపాకీని భుజం మీద పెట్టుకున్నడు. సాయుధ రైతాంగ దళాలు ఏర్పడి, పోరాటం చేసి మూడువేల గ్రామాలను విముక్త గ్రామాలుగా ప్రకటించాయి. భూములను పంచాయి. ఖాసీం రజ్వీ సేనల నరమేధానికి కమ్యూ నిస్టు గెరిల్లాలు వెనక్కి తగ్గలేదు. పంచిన భూములను జనం వదల్లేదు. పంట ఇంటికి చేరు తోంది. అప్పుడప్పుడే జనానికి కడుపు నిండా బువ్వ దొరుకు తోంది. అగో.. అప్పుడు దిగింది పటేల్ సైన్యం! నాలుగు రోజుల్లో యుద్ధం ముగిసింది. ఆశ్చర్యకర పరి ణామాల నేపథ్యంలో నిజాం మకుటం లేని మహారాజు అయిండు. నయా జమానా మొదలైంది. పటేల్ సైన్యం నిజాంకు రక్షణ కవచం అయింది. కమ్యూనిస్టుల వేట మొదలు పెట్టింది. అట్లాంటి సంక్లిష్ట సమయంలో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి పెద్దలు సాయుధ పోరాటం వద్దన్నరు. భీమిరెడ్డి ఎదురు తిరిగిండు. సర్దార్ పటేల్‌ది విద్రోహం అన్నడు. తుపాకి దించితే జరిగే అనర్థాన్నీ, భవిష్యత్తునూ కళ్లకు గట్టినట్టు వివరించాడు. మనలను నమ్మి దళాల్లోకి వచ్చిన దళిత బహుజన గెరిల్లాలను మనంతట మనమే శత్రువుకు అప్ప గించినట్టేనని వాదిస్తున్నాడు. కానీ మితవాద కమ్యూనిస్టుల చెవికి ఎక్కడం లేదు. బీఎన్ అనుమానమే కాలగమనంలో అప్పాపూర్ చెంచు పెద్ద తోకల గురువయ్య అనుభవంలోకి వచ్చింది. 1999లో నేను నల్లమల వెళ్ళినప్పుడు ఆయన్ను కదిలిస్తే... ‘కమ్యూనిస్టుల దెబ్బకు గడీలను వదిలి పట్నం పారి పోయిన భూస్వాములు తెల్ల బట్టలేసుకొని, మల్లా పల్లెలకు జొచ్చిండ్రు. వీళ్లకు పటేల్ సైన్యాలే కావలి. కమ్యూనిస్టు దళాలల్ల చేరి, దొరల భూముల్లో ఎర్రజెండాలు పాతిన వాళ్లను దొరక బట్టి, కోదండమేసి నెత్తుర్లు కారంగ కొట్టేటోళ్లు. బట్టలు విప్పించి, ఒంటి మీద బెల్లం నీళ్లు చల్లి, మామిడి చెట్ల మీది కొరివి చీమల గూళ్ళు తెచ్చి దులిపేవాళ్లు. కర్రలతో కొట్టి సంపేవాళ్లు. (క్లిక్ చేయండి: సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?) దొరతనం ముందు నిలువలేక సోర సోర పొరగాండ్లు మల్లా ఈ అడివికే వచ్చిండ్రు. ఎదురు బొంగులను జబ్బకు కట్టుకొని, దాని మీదంగ గొంగడి కప్పుకునేటోళ్లు. చూసే వాళ్లకు జబ్బకున్నది తుపాకి అనిపించేది. సైన్యం అంత సులువుగా వీళ్ల మీదికి రాకపోయేది. గానీ... ఆకలికి తాళలేక ఎక్కడి వాళ్లు అక్కడ పడి పాణం ఇడిసేటోళ్లు. చెంచులం అడివికి పొలం పోతే సచ్చి పురుగులు పట్టిన పీనిగెలు కనపడేయి. అట్లా సావటానికైనా సిద్ధపడ్డరు కానీ... ఇంటికి పోవటానికి మాత్రం సాహసం చేయక పోయేటోళ్లు. దొరలు పెట్టే చిత్ర హింసల సావు కంటే, ఇదే నయం అనుకునేటోళ్లు’... ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. బీఎన్ ఆనాడు మితవాద కమ్యూనిస్టు నేతలతో చివరి నిమిషం వరకు తుపాకి దించనని చెప్పింది ఇందుకే. ఇప్పుడు ఓ మత పార్టీ రాజకీయ క్రీడ ఆడబూనింది. కమలం పువ్వు మాటున చరిత్రను కాటేయాలనుకుంటోంది. సాయుధ పోరాట అపూర్వ ఘట్టాలకు గోరీ కట్టి ఖాకీ నిక్కరు తొడగాలని తాపత్రయపడుతోంది. తెలంగాణ పౌరుల్లారా... తస్మాత్ జాగ్రత్త! - వర్ధెల్లి వెంకటేశ్వర్లు సీనియర్ జర్నలిస్టు, పరిశోధక రచయిత -
సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?
‘తారీఖులూ దస్తావేజులూ ఇవి కావోయ్ చరిత్ర సారం’ అని శ్రీశ్రీ అన్నాడు గానీ అటు సమయం ఇటు సారాంశం కూడా మారిపోతుంటాయి. సెప్టెంబర్ 17 ఇందుకో ఉదాహరణ. ఆ తేదీ ప్రాధాన్యత ఏమిటి? ఏ కోణంలో ఏ పేరుతో జరపాలి అన్నది ఒక కొలిక్కి రావడానికి దాదాపు 75 ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా కేంద్రం దీన్ని విమోచన దినం అంటే, రాష్ట్రం సమైక్యతా దినోత్సవం అంటున్నది. తెలంగాణ సాయుధ పోరాట వార్షి కోత్సవాలు ఇంతకాలంగా జరుపుతూనే ఉన్న కమ్యూనిస్టులు తదితరులకు వేరే అభిప్రాయాలున్నా కూడా ఆ మహత్తర పోరాట వారసత్వం గుర్తుచేసుకోవడానికి ఏదో ఒక సందర్భం ఉందని సంతోషిస్తున్నారు. ముస్లిం రాజు నిజాం నుంచి విమోచన కనుక విమోచన దినోత్సవాన్ని గట్టిగా జరపాలని బీజేపీ వారంటుంటే, సంస్థానం దేశంలో విలీనమైంది గనక సమైక్యతా దినోత్సవమే సరైందని టీఆర్ఎస్ చెబుతున్నది. విమోచన ఎవరి నుంచి అనేది మరో ప్రశ్న. నిరంకుశ పాలకుల అండతో సాగిన వెట్టిచాకిరీ నుంచి, దోపిడీ పీడనల నుంచి విముక్తి అని కమ్యూనిస్టులంటారు. ‘బానిసోన్ని దొరా’ అనే వాడితో బందూకు పట్టించినంతగా మార్పు తెచ్చిన కమ్యూనిస్టుల దగ్గర ఏ ఇంద్రజాలమున్నదో అని సురవరం ప్రతాపరెడ్డి ఆశ్చర్యపోయారు. ‘విలేఖించనిండు నన్ను తెలంగాణ వీరగాథ’ అని గానం చేశారు హరీంద్రనాథ్ ఛటోపా ధ్యాయ. 1947 ఆగస్టు 15 నాటికి తెలంగాణ సాయుధ పోరాటం సాగుతూనే ఉంది. ఆ పోరాటం తాకిడికి హడలిపోయిన కేంద్ర కాంగ్రెస్ పాలకులు పోలీసు చర్య పేరుతో సైనిక చర్య జరి పారు. నిరంకుశ పాలకుడిని రాజ్‌ప్రముఖ్‌ను చేసి, హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకుని, పోరాడే ప్రజలపై తుపాకులు ఎక్కుపెట్టారు. విప్లవ పోరాటం ముందు నిజాం దాదాపు చేతులెత్తేసిన పరిస్థితిలో తిరిగి ఆయనకు ఊపిరి పోశారు. నిజాంకు బ్రిటిషర్లతో సైనిక ఒప్పందం గనక, సొంత సైనిక బలం లేదు గనక అనధికార సైన్యంగా రజాకార్లు ప్రజలపై దాడులు, హత్యాకాండ సాగించారు. వాళ్లను అణచి వేయడానికి వచ్చామంటూనే సైన్యం కమ్యూనిస్టులపై మారణకాండ సాగించింది. ‘మూడువేల మృతవీర సమాధుల పుణ్యక్షేత్రమీ నల్లగొండరా’ అనే పాట చాలు దాని తీవ్రత తెలియడానికి. సర్దార్ పటేల్ హోంమంత్రిగా దీనికి ఆధ్వర్యం వహించారు. మీరు రాజీకి రాకపోతే కమ్యూనిస్టుల రాజ్యం వచ్చేస్తుందని బెదిరించి దారికి తెచ్చుకున్నారు. ఆ విలీనం వాస్తవంగా జరిగిందే గనక వివాదం లేదు. పోరాటంపై దాడి చేశారు గనక విద్రోహం అని అన్నా ఇప్పటి సందర్భం వేరు. పోరాట విరమణే విద్రోహం అనే వారిది సైద్ధాంతిక చర్చ తప్ప ఉత్సవాలతో నిమిత్తం లేదు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా సంస్థానాధీశులపైనా పోరాడాలని కమ్యూనిస్టులు తీసుకున్న విధానాన్ని కాంగ్రెస్ ఆమోదించలేదు. నాటి ఉమ్మడి మద్రాసులోని కేరళ ప్రాంతం; బెంగాల్, పంజాబ్, త్రిపుర ఇలా గొప్ప పోరాటాలే నడిచాయి. నైజాంలలో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటానికి చాలా కాలం పట్టింది. ‘ఆంధ్ర మహాసభ’ మాత్రమే అప్పటికి చెప్పు కోదగిన సంస్థ. నాటి హేమాహేమీలందరూ ఉన్న సంస్థ. మహజర్లు ఇవ్వడం వరకే పరిమితమైన ఆ సంస్థను సమరశీల పథం పట్టించిన కమ్యూనిస్టులు ప్రజలకు నాయకత్వం వహించి నిరంకుశ పాలకుడిపై, గ్రామీణ పెత్తందార్లపై పోరాడారు. భాషా సాంస్కృతిక స్వేచ్ఛ ఈ పోరాటంలో అంతర్భాగం. 3,000 గ్రామాల విముక్తి, పదిలక్షల ఎకరాల పంపిణీ, వెట్టిచాకిరీ రద్దు, దున్నేవాడికి భూమి నినాదం, బానిసలుగా బతుకుతున్న ప్రజల ఆత్మగౌరవం, స్వతంత్ర జీవనం... ప్రధాన విజయాలు. ఇందుకు అర్పించిన ప్రాణాలు నాలుగు వేల పైన. అత్యాచారాలకు, అమానుషాలకు గురైన వారి సంఖ్యలు మరింత భయంకరంగా ఉంటాయి. ఆ పోరాటాన్ని గుర్తించడానికి కాంగ్రెస్ పాలకులకు దాదాపు పాతికేళ్లు పట్టింది. కేసీఆర్‌కు ఎనిమిదేళ్లుపట్టింది. ఇక బీజేపీ మతతత్వ కోణంలో ముస్లిం రాజుపై హిందువుల తిరుగు బాటుగా వక్రీకరించి 1998 నుంచి విమోచన దినం జరుపుతున్నది. అప్పుడు వారి అభినవ సర్దార్ పటేల్ అద్వానీ. ఇప్పుడు అమిత్‌షా. పటేల్ మాత్రమే తెలంగాణ విమోచన సాధించినట్టు చెబుతూ ఆయన సైన్యాలు తర్వాత సాగించిన దారుణకాండను దాటేయడం మరో రాజకీయం. తెలంగాణ ఏర్పడింది గనక ఇప్పటి రాజకీయాలు గతానికి పులమడం అనవసరం. (క్లిక్ చేయండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?) తెలంగాణ యోధులతో రెడ్డి హాస్టల్లో ఉండి పోరా టానికి తొలుత రంగం సిద్ధం చేసింది చండ్ర రాజేశ్వరరావు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి వంటివారు ముందు నిలవకపోతే పోరాటం సాధ్యమయ్యేది కాదని సుందరయ్య స్పష్టంగా రాశారు. ఈ పోరాటం తెలుగువారం దరిదీ. మహిళలు, అణగారిన వర్గాలది అతి కీలక పాత్ర. వారు ఎగరేసింది ఎర్రజండానే. ఇప్పుడు కమ్యూనిస్టులను ఎవరూ పట్టించుకోరని కంచ ఐలయ్య వంటివారు అనొచ్చు గానీ (సాక్షి, సెప్టెంబరు 12) దాచేస్తే దాగని సత్యం ఎర్రెర్రని సూర్యకాంతిలా పలకరిస్తూనే ఉంటుంది. నాటి రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ స్థాపించిన పార్టీ కూడా సమైక్య ఉత్సవాలు జరపాలని కోరడం ఇందుకో నిదర్శనం. స్వాతంత్య్ర వజ్రోత్సవాలతో పాటు సమైక్యతా ఉత్సవంగా జరపడం నేటి పరిస్థితులలో ఆహ్వానించదగింది. తెలంగాణ వారసత్వంలో భాగంగా ఈ పోరాట ఉత్స వాలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మొదటి ఎడిటర్స్ మీట్లోనే నేను అడిగాను. గ్లోరిఫై చేయాలి అని ఆయనన్నారు. అంతకు అయిదారేళ్ల ముందు ఒక టీవీ చర్చలో నిజాం పాత్ర గురించి కూడా మా మధ్య వివాదం జరిగింది. ఆ మాట ఆయన ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. గోదావరి ప్రజలు పూజించే కాటన్‌తో నిజాంను ఆయన పోల్చారు. ప్రజలు కాటన్‌ను తప్ప విక్టోరియా మహారాణిని పూజిం చడంలేదని నేను చెప్పాను. ఏదైనా అది చరిత్ర. నిజాం వ్యక్తిగత దూషణ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. వీర తెలంగాణ విప్లవ స్ఫూర్తిని విభజన రాజకీయాలకు వాడుకోవడం తగని పని. - తెలకపల్లి రవి సీనియర్ జర్నలిస్ట్ -
రజాకార్లకు ఎదురొడ్డిన గుండ్రాంపల్లి!
చిట్యాల: నిజాం కాలంలో రజాకార్ల అకృత్యాలకు సజీవ సాక్ష్యం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి యువకులెందరో రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు వదిలారు. నాటి పోరాటానికి జ్ఞాపకంగా గ్రామంలో అమరవీరుల స్తూపం సగౌరవంగా నిలబడి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం తమ గ్రామానికి తగిన గుర్తింపు లేదని స్థానికులు వాపోతున్నారు. రక్షక దళాలుగా ఏర్పడి.. రజాకార్ల దారుణాలు సాగుతున్న సమయంలో సూర్యాపేట తాలూకా వర్దమానకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్యక్తి.. తన సోదరి నివాసం ఉంటున్న గుండ్రాంపల్లికి వలస వచ్చాడు. మొదట బతుకుదెరువు కోసం ఇదే మండలం ఏపూరులో ఒక భూస్వామి వద్ద పనిలో చేరాడు. కానీ తర్వాత రజాకార్ల బృందంలో చేరాడు. గుండ్రాంపల్లి కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్నవారిపై రజాకార్లతో కలిసి అరాచకాలకు పాల్పడ్డాడు. అవి ఎంత దారుణంగా ఉండేవంటే.. గ్రామంలో తాను నిర్మించుకున్న ఇంటి పునాదిలో నిండు గర్భిణులను సజీవ సమాధి చేసి ఆపై నిర్మాణాన్ని చేపట్టాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ క్రమంలో మక్బూల్, ఇతర రజాకార్ల ఆగడాలను అడ్డుకోవడానికి గుండ్రాంపల్లి కేంద్రంగా ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు రక్షక దళాలుగా ఏర్పడ్డారు. రజాకార్ల దాడులను తిప్పికొట్టారు. 30 మందిని సజీవ దహనం చేసి.. గుండ్రాంపల్లి కేంద్రంగా జరుగుతున్న తిరుగుబాటుతో రగిలిపోయిన మక్బూల్.. పెద్ద సంఖ్యలో రజాకార్లను కూడగట్టి భారీ దాడికి దిగాడు. తమకు దొరికిన 30 మంది యువకులను గుండ్రాంపల్లిలో ఎడ్లబండ్లకు కట్టి చిత్రహింసలు పెట్టాడు. తర్వాత గుండ్రాంపల్లి నడిబొడ్డున మసీదు ఎదురుగా బావిలో వారందరినీ పడేసి సజీవ దహనం చేశాడు. ఇది తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారు. ప్రస్తుత మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి గురునాథరెడ్డి నాయకత్వంలో సాయుధ దళాలు మక్బూల్‌పై దాడికి ప్రయత్నించాయి. కానీ మక్బూల్ తప్పించుకున్నాడు. తర్వాత మరోసారి చేసిన దాడిలో మక్బూల్ చేయి విరిగినా, ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడు. మక్బూల్‌కు సహకరించిన వారి ఇళ్లపై కమ్యూనిస్టు సాయుధ దళాలు దాడి చేసి హతమార్చాయి. నిజాం పాలన నుంచి విముక్తి లభించాక గుండ్రాంపల్లి ఊపిరిపీల్చుకుంది. నాటి పోరాటంలో యువకులను సజీవ దహనం చేసినచోట 1993 జూన్ 4న సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. అమరులైన వారిలో గుర్తించిన 26 మంది పేర్లను ఆ స్తూపంపై రాశారు. ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణవాదులు ఈ స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో ఈ స్థూపాన్ని తొలగించగా.. మరోచోట అమరవీరుల స్తూపాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. గ్రామాన్ని సందర్శించిన అమిత్ షా 2017 మే నెలలో గుండ్రాంపల్లి గ్రామాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సందర్శించారు. నాటి సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారసులను ఆయన సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఈ ఏడాది జూలైలో గుండ్రాంపల్లిని సందర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గుండ్రాంపల్లి గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చుతామని.. గ్రామంలో స్మారక కేంద్రం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రజాకార్ల దుర్మార్గాలు చెప్పలేనివి నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు రజాకార్ల దాడులు జరిగాయి. గ్రామంలోని యువకులు దళాలుగా ఏర్పడి తిరుగుబాటు చేశారు. రజాకార్లు వారిని పట్టుకుని చంపేశారు. తర్వాత మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల వారంతా కలిసి మక్బూల్‌పై దాడి చేశారు. నాటి రజాకార్ల దుర్మార్గాలు చెప్పనలవికాదు. – గోపగోని రామలింగయ్య, గుండ్రాంపల్లి గుండ్రాంపల్లికి గుర్తింపు ఇవ్వాలి నిజాం నవాబుకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గుండ్రాంపల్లి గ్రామ చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి. పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి ముందు తరాలకు తెలియజేయాలి. ఏటా సెప్టెంబర్ 17న మా గ్రామంలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలి. – గరిశె అంజయ్య, గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,గుండ్రాంపల్లి -
చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?
భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దశాబ్దాలపాటు సమాంతరంగా సాగాయి. జాతీయోద్యమంలో చోటుచేసుకున్న ‘జలియన్‌వాలా బాగ్’ దురంతం వంటివాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనలకు లభించలేదు. గుండ్రాంపల్లి, బైరాన్‌పల్లి వంటి వందలాది గ్రామాలను నిరంకుశ నిజాం జలియన్‌వాలా బాగ్లుగా మార్చివేశాడు. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ ప్రభుత్వం చేపట్టిన ‘సైనిక చర్య’తో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసిపోయింది. ఈ క్రమంలో లక్షలాది ప్రజలు అసువులు బాశారు. చరిత్రాత్మకమైన సాయుధ పోరాటానికీ, భారత్‌లో హైదరాబాద్ కలిసిన ‘సెప్టెంబర్ 17’కూ స్వార్థపూరిత రాజకీయాల వల్ల తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరం. అది 1919 ఏప్రిల్ 13. బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని నిరసించిన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు పెద్దఎత్తున సాగాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన బ్రిటిష్ ప్రభుత్వం బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. ఈ తరుణంలోనే పంజాబీలకు ముఖ్యమైన పండుగ వైశాఖీ సందర్భంగా ఏడెకరాల విస్తీర్ణం గల ఓ తోటలో వేల మంది సమావేశమయ్యారు. బ్రిటిష్ సైన్యంతో అక్కడకు వచ్చిన ఓ అధికారి ప్రవేశ మార్గాలను మూసివేసి, నిరాయుధులైన జనంపై కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్ల కాల్పుల్లో గుళ్లవర్షం కురిపించారు. వెయ్యిమంది మరణించారు. మరో రెండువేలమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అమానవీయ నరమేధానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ తోట పేరు జలియన్‌వాలా బాగ్. నిరాయధులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించిన ఆ నరరూప రాక్షసుడే జనరల్ డయ్యర్. పంజాబ్‌కి చెందిన వ్యక్తిగా జలియన్ వాలా బాగ్ ఉదంతంపై నాకు పూర్తి అవగాహన ఉంది. కానీ భారత చరిత్రలో గుర్తింపునకు నోచుకోని ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నిజాం నిరంకుశ రాజ్యమైన నాటి హైదరాబాద్ సంస్థానంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఈ ప్రాంతంతో అనుబంధం ఏర్పర్చుకున్న నేను నిజాం అరాచకాలూ, రజాకార్ల అకృత్యాల గురించీ తెలుసుకున్న తర్వాత విస్మయం కలిగింది. ఒకింత ఆగ్రహం, ఆవేదనా కలిగాయి. నిజాం రాజ్యంలోని ‘జలియన్ వాలా బాగ్’ ఘటనల్లో గుండ్రాం పల్లి ఒకటి. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపుటేరులు పారించారు. ఖాసీం రజ్వీకి అత్యంత సన్నిహితుడైన మక్బూల్ ఈ గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు. గ్రామస్థులంతా ఏకమై తిరగబడ్డారు. పారిపోయిన మక్బూల్ రజాకార్ల మూకలతో తిరిగొచ్చి గ్రామం మీద పడ్డాడు. 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొని ఎత్తుకెళ్ళి పోయారు. అలాగే తెలంగాణ విమోచన పోరాటంలో బైరాన్‌పల్లి వీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజాకార్ల అరాచకాలను ఎదుర్కొ నేందుకు బైరాన్‌పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకుని, బురుజులు కట్టారు. బురుజులపై నుంచి నగారా మోగిస్తూ రజా కార్లతో పోరాడేందుకు గ్రామ రక్షక దళాలు సిద్ధమయ్యేవి. ఒకసారి బైరాన్‌పల్లి పక్క గ్రామం లింగాపూర్ పై రజాకార్లు దాడి చేసి, ధాన్యాన్ని ఎత్తుకెళ్తుండగా బైరాన్ పల్లి వాసులు అడ్డుకొని ఎదురు దాడి చేశారు. దీంతో బైరాన్ పల్లిపై కక్షగట్టిన రజాకార్లు మొదటిసారి 60 మందితో, మరో సారి 150 మందితో దాడికి యత్నించి తోకముడిచారు. ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయిన రజా కార్లు 400 మంది సైన్యంతో, మారణాయుధాలతో ఊరిపై పడ్డారు. మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. సంప్రదాయక ఆయుధాలతో ఎదురు తిరిగిన బైరాన్‌పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు మొత్తం 118 మంది వీరమరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు బైరాన్‌పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలిచి ఉంది. 1947 సెప్టెంబర్ 2న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ నినదించిన పరకాల గ్రామస్థులపై రజాకార్లు, నిజాం సైనికులు చేసిన దాడిలో 19 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జల్–జమీన్–జంగల్ కోసం పోరాడిన రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచ రులను నిర్మల్‌లోని మర్రిచెట్టుకు ఉరితీశారు. ఆ మర్రి ‘గోండ్ మర్రి’, ‘ఉరుల మర్రి’, ‘వెయ్యి ఉరుల మర్రి’గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ విమోచన కొరకు అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల మంది ఉద్యమకారులపై నిజాం పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి సమీపంలోని రేణికుంటపై 1948 మార్చి 4న నిజాం పోలీసులు, రజాకార్ మూకలు లూటీకి తెగబడ్డారు. సంప్రదాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకున్న గ్రామస్థులు ఆధునిక ఆయుధాలున్న రజాకార్లను ప్రతిఘటించారు, వారితో భీకరంగా పోరాడారు. ఈ పోరాటంలో 26 మంది రేణికుంట గ్రామస్థులు అమరులయ్యారు. నిర్హేతుక పన్నులపై గొంతెత్తి, పన్నులు కట్టమంటూ భీష్మించుకు కూర్చున్న పాతర్లపహాడ్ వాసులను నిజాం పోలీసులు ఊచకోత కోశారు. 17 మంది అమరులయ్యారు. జనగాం సమీపంలోని కాట్కొండలో రజాకార్ల బలవంతపు వసూళ్లను అడ్డుకున్న 13 మందిని కాల్చి చంపారు. కూటిగల్‌లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను కాల్చి చంపారు. 1935–47 మధ్యన, మరీ ముఖ్యంగా 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు ఇలాంటి హింసాత్మక ఘటనలు వంద లాదిగా జరిగాయి. జలియన్ వాలాబాగ్ ఘటన అనూహ్యంగా జరిగింది. కానీ నాటి హైదరాబాద్ సంస్థానంలో 13–14 ఏళ్ల పాటు వ్యవస్థీకృతంగా హిందువులపై రక్త పాతం జరిగింది. సర్దార్ పటేల్ చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’తో దేశానికి స్వాతంత్య్రం లభించిన 13 నెలల తర్వాత 1948 సెప్టెం బర్ 17న ఈ ప్రాంతం నిజాం పీడ నుంచీ, రజాకార్ల అకృత్యాల నుంచీ విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. తెలంగాణలో ఈ తరహా దుర్ఘటనలు గుర్తింపునకు నోచుకోకపోవడానికి కారణం సంతుష్టీకరణ రాజకీయాలే. నిజాంను దుష్టుడిగా చూపితే మైనార్టీ వర్గాల సెంటిమెంటు దెబ్బతింటుందన్న నెపంతో ఎందరో యోధుల త్యాగాలు, పరాక్రమాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారు. ఎంఐఎం ఒత్తిడికి లొంగి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17న ఎలాంటి వేడుకలు జరపకుండా, ప్రాముఖ్యం లేని రోజుగానే చూశాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ సెంటి మెంటుతో రాజకీయాలు చేసే టీఆర్ఎస్ కూడా ఎంఐఎంకు తలొగ్గి సెప్టెంబర్ 17ను అప్రధానంగా చూడడం దురదృష్టకరం. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో తెరమరుగైన యోధులకు గుర్తింపునిచ్చి స్మరించుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసి, వెలుగులోకి రాని యోధులను, ఘటనలను వెలుగులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చి 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వ హించేందుకు సిద్ధమైంది. 2023 సెప్టెంబర్ 17 వరకు సంవత్సరం పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ప్రాంత విమోచన కోసం ఎలాంటి పోరాటాలు జరిగాయో నేటి తరం తెలుసుకోవాలన్నదే ఈ వేడుకల ఉద్దేశ్యం. ఇదే మన కోసం తమ సర్వస్వాన్ని సమర్పించిన నాటి యోధులకు ఇచ్చే అసలైన నివాళి. తరుణ్ చుగ్ (వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్) -
విముక్తికి బాట వేసిన బైరాన్‌పల్లి..!
1947 ఆగస్టు 15.. తెల్లదొరలను తరిమిన భారతావనిలో ప్రజలు స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటున్నారు.. కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలో బిక్కుబిక్కుమంటూనే గడిపింది. ఆ రోజే కాదు.. మరో ఏడాదికిపైగా నిజాం నియంతృత్వాన్ని, రజాకార్ల దుర్మార్గాలను భరిస్తూ వచ్చింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలన్న ప్రజల ఆకాంక్షలు, ప్రతిఘటనలు, పోరాటాల రూపంలో తెరపైకి రావడం మొదలైంది. వీటన్నింటికీ పరాకాష్టగా బైరాన్‌పల్లి నరమేధం కలకలం రేపింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రస్థాయికి చేరింది. 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లి ఘటన జరిగితే ఆ తర్వాత 21 రోజుల్లో.. అంటే సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. –సాక్షి, సిద్దిపేట ఎన్నో పోరాటాలు జరిగినా.. బ్రిటీష్‌వాళ్లు దేశాన్ని వదిలిపెట్టి పోయినా.. నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిరాకరించారు. దీనికి తోడు నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం రజ్వీ వ్యక్తిగత సైన్యం రజాకార్ల అరాచకాలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలైంది. సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరాన్‌పల్లి కేంద్రంగా కూటిగల్, లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాల యువకులతో బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది. రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్‌పల్లి గ్రామస్తులంతా ఏకమయ్యారు. శత్రువుల దాడిని ఎదుర్కొని, ప్రతిదాడి చేయడానికి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కోట బురుజును పునర్నిర్మించారు. నాటు తుపాకులు, మందు గుండు సామగ్రి సమకూర్చుకున్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్న యువకులు నాటు తుపాకులతో గస్తీ నిర్వహించేవారు. ప్రతీకారేచ్ఛతో వరుస దాడులకు తెగబడి.. 1948లో లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలపై రజాకార్లు దాడి చేసి తగులబెట్టారు. తిరిగి వెళ్తుండగా బైరాన్‌పల్లి సమీపంలోకి రాగానే వారిపై దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలో రక్షణ గెరిల్లా దళాలు దాడిచేసి దోచుకున్న సంపదను స్వాధీనం చేసుకున్నాయి. దాన్ని తిరిగి ప్రజలకు పంచారు. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయిన రజాకార్లు బైరాన్పల్లిపై దాడి చేశారు. రక్షక దళం గట్టిగా ప్రతిఘటించింది. ఈ దాడిలో 20 మందికిపైగా రజాకార్లు చనిపోయారు. ఇలా రెండోసారి కూడా విఫలం కావడంతో రజాకార్లు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. నాటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హషీం ఆదేశాలతో హైదరాబాద్ నుంచి 500 మందికిపైగా సైనికులను రప్పించి మూడోసారి దాడి చేశారు. దారుణంగా కాల్చి చంపారు ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్లు 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా బైరాన్‌పల్లిని చుట్టుముట్టారు. అయితే ఆ సమయంలో బహిర్భూమికి వెళ్లిన గ్రామస్తుడు వడ్లె వెంకటనర్సయ్య గమనించి కేకలు వేయడంతో.. వెంటనే బురుజుపై ఉన్న కాపలాదారులు నగారా మోగించారు. అప్పటికే దూసుకొచ్చిన రజాకార్ల కాల్పుల్లో బురుజుపై ఉన్న గెరిల్లా దళ సభ్యులు మోగుటం రామయ్య, పోచయ్య, భూమయ్య మృతిచెందారు. రజాకార్లు ఫిరంగులతో దాడి చేయగా.. బురుజులోని మధ్య గదిలో ఉన్న మందు గుండు సామగ్రిపై నిప్పులు పడి పేలిపోయింది. తర్వాత రజాకార్లు మరింత విజృంభించారు. బురుజుపై తలదాచుకున్న 40 మందిని కిరాతకంగా కాల్చి చంపారు. మరో 56 మంది యువకులను బంధించి ఊరి బయటికి తీసుకొచ్చి కాల్చిచంపారు. మృతదేహాలను పాత బావిలో పడేశారు. ఈ ఘటనల్లో 118 మందికిపైగా మృతిచెందినట్లు చరిత్ర చెబుతోంది. యువకులను చంపడంతో ఊరుకోని రజాకార్లు మరిన్ని దారుణాలకు తెగబడ్డారు. మహిళలను నగ్నంగా ఆ శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు. వారిపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ దారుణాలను తట్టుకోలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్టు బైరాన్‌పల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నరమేధం నాటి భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు మొదలయ్యాయి. నాటి కేంద్ర హోంమంత్రి వల్లభ్ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ యాక్షన్‌తో కొద్దిరోజుల్లోనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో వీలినమైంది. బైరాన్‌పల్లి వాసులు నాటి ఘటనను గుర్తు చేసుకుని ఇప్పటికీ కన్నీటిపర్యంతం అవుతున్నారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోలేదు నాటి ఘటనతో బైరాన్‌పల్లి.. వీర బైరాన్‌పల్లి అయింది. ఇంతటి పోరాట పటిమ చూపిన తమ గ్రామాన్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయని స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నాటి పోరాటంలో పాల్గొన్నా 28 మందికి మాత్రమే పెన్షన్ మంజూరు చేశారని.. నాటి పోరాటంలో పాల్గొని పెన్షన్ రానివారు ఇంకా 30 మంది ఉన్నారని చెబుతున్నారు. కూటిగళ్లు గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఉందని.. నాడు అమరులైన వారి పేర్లతో గ్రామస్తులే ఓ స్తూపాన్ని నిర్మించుకున్నారని వివరిస్తున్నారు. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా స్తూపాన్ని ఆవిష్కరించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బైరాన్‌పల్లి పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి బైరాన్‌పల్లి పోరాటాన్ని విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలి. నాటి ఘనత నేటి తరానికి తెలిసేలా అమరధామం, ఎత్తయిన స్తూపం, భవనం నిర్మించాలి. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిపెట్టి అభివృద్ధి చేయాలి. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో బైరాన్‌పల్లి గురించి వివరించాం. వస్తానన్నారు. ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికైనా పట్టించుకోవాలి. –చల్లా చంద్రారెడ్డి నాటి పోరాటంలో కాలికి గాయమైంది నాడు రజాకార్లు చందాల పేరుతో పీడించేవారు. వారి దాడుల్లో నా కాలుకు గాయమైంది. అయినా రక్షణ దళంతో కలిసి రజకార్లపై పోరాడాను. నాటి పోరాటకారుల్లో కొందరికి ఇప్పటికీ పెన్షన్ మంజూరు చేయలేదు. వెంటనే మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. గ్రామంలో సర్వే చేసి ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. –ఇమ్మడి ఆగంరెడ్డి -
చరిత్ర పైనా రాజకీయమేనా?
భారత దేశంలోనే కాక ప్రపంచ విప్లవోద్యమాల్లోనే పేరెన్నికగన్నది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. దేశంలో మిగతా చోట్ల బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా అహింసా యుత స్వాతంత్య్ర పోరాటం జరిగితే... తెలంగాణలో బ్రిటిష్‌వారి మిత్రుడైన నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది. ఇంగ్లిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రోద్యమం జరిగిన సమయంలో... ఇక్కడ తెలంగాణలో నిజాం పాలనకు చరమగీతం పాడుతూ విప్లవకారులు అనేక గ్రామాలను విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తూ ముందుకు పోతున్నారు. అటువంటి సమయంలో భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై ‘సైనిక చర్య’ చేపట్టింది. నిజాం భారత హోంమంత్రికి అధికారికంగా లొంగిపోయి, తన రాజ్యాన్ని భారత్‌లో కలిపివేశాడు. అయితే ఈ చారిత్రక ఘట్టాన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్వప్రయోజనాలకోసం వాడుకోజూడటమే విషాదం! ఇది దురాక్రమణ దినం తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17న జరిగింది ఏమిటో నేటికీ మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకార్ల, దేశ్‌ముఖ్‌ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు. మరి ఆ రోజు జరిగిందేమిటి? విలీనమా? విమోచనా? విద్రోహమా? దురాక్రమణా? వాస్తవంగా చెప్పాలంటే ఆనాటి ఇండియా పాలక వర్గం వల్లభాయి పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణను దురాక్రమణ చేసింది. చెరపలేని చరిత్రను, గత చారిత్రక సత్యాన్ని వివాదాస్పదం చేసి ప్రజల మన్నలను పొందాలని పాలక, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆనాటి పాలక పార్టీ కాంగ్రెస్ విలీనమనీ, మత కోణంలో లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ విమోచననీ, ప్రజల ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న కమ్యూనిస్టులు ముమ్మాటికీ విద్రోహమనీ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. నిజాం నిరంకుశ పాలనలో... దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాముల పెత్తనం, వెట్టి చాకిరీ లాంటి ఆగడాలపై ఎర్రజెండా అండతో ఎదురు తిరిగిన హైదారాబాద్ రాష్ట్ర ప్రజలు పోరాటాన్ని ఉధృతం చేసి నైజాం పాలనను అంతమొందించే స్థాయికి వచ్చారు. దొరలు గడీలు విడిచి హైదరాబాద్ పారిపోయేలా చేశారు. వేలాదిమంది మాన ప్రాణాలను దోచుకున్న ఊర్లలోని దొరలే కాదు నిజాంకూడా గద్దె దిగే పరిస్థితిని రైతాంగ పోరాటం కలిగించింది. నలువైపుల నుండి వస్తున్న పోరాట వార్తలు నిజాంను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీన్ని గమనించిన నిజాం ఆనాటి నెహ్రూ ప్రభు త్వంతో కుమ్ముక్కయి ‘ఆపరేషన్ పోలో‘ నిర్వ హించడానికి వచ్చిన భారత సైన్యానికి లొంగిపోయాడు. నిజాం లొంగిపోయినా వెనుదిరిగి వెళ్ళకుండా తెలంగా ణను దురాక్రమణ చేశాయి యూనియన్ సైన్యాలు. ప్రజల వైపున పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులను మట్టుపెట్టేందుకు నెహ్రూ సేనలు పూనుకున్నాయి. ప్రజల పోరాటాలకు జడిసి పట్టణాలకు పారిపోయిన దొరలు, భూస్వాములు పల్లెలకు వచ్చారు. 1948 వరకు పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటంలో 400 మంది మరణిస్తే... 1948 నుండి 1950 వరకు సైన్యం జరిపిన హత్యాకాండలో నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారనేది ఒక లెక్క. నిజానికి కర్ణాటక, మరాట్వాడ ప్రాంతాల్లో మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద ఎత్తున ఊచ కోతకు గురయ్యారు. ముస్లింల నెత్తురు కాల్వలు కట్టింది. మొత్తం సంస్థానంలో 40 వేల వరకు హతులైనట్లు సుందర్‌లాల్ కమిటీ నివేదిక పేర్కొనగా, ఈ మృతుల సంఖ్య రెండు లక్షలు ఉండవచ్చని ఉద్యమ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఏజెన్సీ గిరిజన గ్రామాలు భస్మీపటల మయ్యాయి. గిరిజన మృతుల సంఖ్య వెలుగులోకి రాలేదు. దురాక్రమణ చేసి ప్రజల మాన ప్రాణాలను హరించివేసిన సైనిక చర్యను కాంగ్రెస్ విలీనం అంటోంది. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా జరిగే ప్రక్రియను విలీనం అనాలి. దీన్నెలా అంటారు? ముస్లిం పాలన పోయి హిందూ పాలన వచ్చినందున ఇది విమోచన అంటుంది బీజేపీ. ఎవరినుండి ఎవరికి విమోచన వచ్చినట్లు? ప్రజల నుండి నిజాం పాలకులకు విమోచన కలిగింది. ప్రజల నుండి దొరలు, భూస్వాములకు విమోచన కలిగింది. దీన్ని ఎలా విమోచన అంటారో ఉత్సవాలు చేసుకునే బీజేపీ చెప్పాలి. కమ్యూనిస్టులు ఇది విద్రోహం అంటున్నారు. ద్రోహం చేయాలంటే ముందు విశ్వాసం కల్పించాలి. ఆ విశ్వాసానికి విరుద్ధంగా వ్యవహరిస్తే అది విద్రోహం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అలాంటి విశ్వాసం కల్పించలేదు. అది నేరుగా దురాక్రమణకే తెగబడింది. అందువల్ల కమ్యూని స్టులు చెపుతున్నట్లు ఇది విద్రోహ దినం కాదు. సెప్టెంబర్ 17 విషయంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటివరకూ కిమ్మనకుండా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఈసారి కొత్త రాగం అందుకుంది. సెప్టెంబర్ 17ను ’తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని అందుకోసం మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. దీని వెనుక ఆయన వ్యూహాలు ఆయనకున్నాయి. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయనేది సుస్పష్టం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా తెలంగాణ గోసను, చరిత్రను రాజకీయాలకు వాడుకోవడం ఆపి తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు వేయాలి. లేకపోతే మరోపోరాటం తలెత్తవచ్చు! సాయిని నరేందర్ (వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు) మొబైల్: 97019 16091 సాయుధ చరిత్రకు ప్రాధాన్యమివ్వాలి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి తెలంగాణ ప్రజలంతా కలిసి కూకటి వేళ్ళతో నిజాం రాచరికా నికి వ్యతిరేకంగా మహత్తర సాయుధ పోరాటం జరుపుతున్నారు. అనేక గ్రామాలు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో స్వయంపాలిత విముక్త గ్రామాలుగా ప్రకటితమయ్యాయి. అప్పటివరకూ తెలంగాణ ప్రజలు చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా దుర్భర బానిసత్వాన్ని అనుభవించారు. నిజాం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల్లోనే కాకుండా భాషాసంస్కృతుల్లో కూడా పరాయీకర ణకూ, అవమానాలకూ గురయ్యారు. దీనికి వ్యతి రేకంగా తెలంగాణ తొలితరం విద్యావంతులైన మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు వంటి వారు 1921లో ‘ఆంధ్ర జన సంఘం’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అది 1923లో ‘ఆంధ్ర జన కేంద్ర సంఘం’గా, 1930లో ‘నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ’గా మారుతూ తన కార్యకలా పాలను విస్తృతంగా నిర్వహించింది. 1942 నుండి కమ్యూనిస్టుల చేరికతో ఆంధ్రమహాసభ భాషా సంస్కృతుల పరిధి దాటి వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం, ‘దున్నేవానికి భూమి’ వంటి పోరాటా లను నిర్వహించింది. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ నాటికి రావి నారాయణ రెడ్డి నాయ కత్వంలో పూర్తి స్థాయిలో విప్లవ సంస్థగా మారి దొరల, రజకార్ల, నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పోరాటాలను ప్రారంభించింది. 1940–42ల మధ్య బందగి సాహెబ్ సాహస మరణం, 1944–1945 లో పాలకుర్తి అయిలమ్మ భూపోరాటం, 1946లో దొడ్డి కొమురయ్య వీర మరణం, తదనంతరం భీంరెడ్డి, దేవులపల్లి, షోయ బుల్లాఖాన్, ముఖ్ధూం మోహియుద్దీన్, సర్వదేవ భట్ల రామనాథం, ఆరుట్ల దంపతులు, మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, నల్లా నర్సింహులు, సుద్దాల హన్మంతు, రాజబహుదూర్ గౌర్ల వంటి నాయకులు సాయుధ పోరాటం సాగించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవోద్యమం ముందుకు పోవ టాన్ని చూసి యూనియ న్లో చేరమని బ్రిటిష్ వారు నిజాంకు సలహా ఇచ్చారు. పోరాటకారులు హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది గ్రామాలను విముక్త ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ నగరం కమ్యూనిస్టుల స్వాధీన మయ్యే అవకాశం ఉందని గ్రహించిన లార్డ్ మౌంట్‌బాటెన్ నిజాంను యూనియన్‌లో చేరమని ఒత్తిడి చేశాడు. స్వతంత్ర దేశంగా ఉంటానన్న నిజాంకు దేశీయంగా, అంతర్జాతీయంగా మద్దతు కరవయింది. నిజాంకు సమాంతరంగా ఎదుగు తున్న మతోన్మాద నాయకుడు ఖాసిం రజ్వీ యూని యన్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజ లపై తీవ్ర హింసాకాండకు దిగాడు. ఐక్యరాజ్య సమితిలో నిజాంకు మద్దతు తెలుపుతూ వస్తున్న పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మహ్మద్ అలీజిన్నా ఆకస్మికంగా మరణించారు. ఈ పరిస్థితులలో నిజాంసైన్యాలు, రజాకారులు స్థైర్యాన్ని కోల్పోయి గందరగోళంలో పడి బలహీన స్థితికి చేరుకున్నాయి. 1947 సెప్టెంబర్ 29న నిజాం, నెహ్రూ సర్కార్లు ‘యథాతథ ఒడం బడిక’ను చేసుకున్నాయి. సెప్టెంబర్ 13, 1948 వరకు అమలైన ఈ ఒడంబడిక కాలంలో వల్ల భాయ్ పటేల్, రాజగోపాలాచారి సంస్థానంలోని విప్లవ వెల్లువను అణచి వేయడానికి నిజాంకు ఆయుధాలను సరఫరా చేశారు. మద్రాస్, హైదరా బాద్ రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రజా గెరిల్లాలు నిజాం సైన్యాన్ని దెబ్బ మీద దెబ్బ తీసి పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారు. కమ్యూనిస్టులపై తీవ్ర విద్వేషంతో ఉన్న కేంద్ర హోంమంత్రి ఇదే సమయంలో హైదరాబాద్‌పై ‘సైనిక చర్య’కు ఆదేశించాడు. యూనియన్ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనమైంది. నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులనూ, వారి వెంట నడుస్తున్న లక్షలాది మంది ప్రజలనూ యూనియన్ సేనలు నిర్బంధించాయి. ఇప్పుడు ఆ చారిత్రిక ఇతిహాసాన్ని ‘సమైక్యతా ఉత్సవం’గా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం ముదావహం. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధంలేని మతోన్మాద సంస్థల వారసులు చరిత్రను ఇప్పుడు వక్రీకరించే ప్రయత్నం చేయడం బాధాకరం. సాయుధ పోరాటానికి వేదికలైన కడవెండి, బైరాన్‌పల్లి వంటి చోట్ల స్మారక చిహ్నాలను నిర్మించాలి. అమరుల త్యాగాలు ప్రజల హృదయాలలో ఉండేట్లు కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించాలి. అస్నాల శ్రీనివాస్ (వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు) -
మర్రిచెట్టంత త్యాగం మరవొద్దు
‘సెప్టెంబర్ 17.. విమోచనమా, విముక్తా, విలీనమా.. ఏ దినోత్సమైనా అనుకోండ్రి. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన ఆ రోజును అందరూ యాది చేసుకుంటుండ్రు. సంబురాలూ జేస్తున్నరు. అవ్‌గనీ.. అంతకుముందు మేం జేసిన పోరాటాలు యాదికున్నయా? అడవి బిడ్డలమైన మేం ఆఖరి శ్వాస దాకా ఎందుకు పోరాడినమో.. వెయ్యి మందిమి ఒకేపారి ఒకే మర్రిచెట్టు ఉరికొయ్యలకు ఎందుకు ఊగినమో మీకు ఎరుకేనా? కుమురం భీముడు ఏమిటికి తుపాకీ పట్టిండు..? ఎందుకు పానం ఇడిసిండు? ఏండ్ల సంది చరిత్ర పుస్తకాలల్ల మాకు ఒక్క అక్షరమంత జాగియ్యలేదు. జరంత మీరన్న.. ఇప్పటికన్న.. పట్టించుకోండ్రి’అంటూ నిర్మల్ గడ్డపై ఉన్న రాంజీ గోండు విగ్రహం ఘోషిస్తోంది. ఇంతకూ ఎవరీ రాంజీ..? ఆ వెయ్యి మంది ప్రాణాలు ఎందుకు వదిలారు.. ఇదంతా ఎక్కడ జరిగింది అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే చరిత్రకెక్కని ఈ గాథను చదవాల్సిందే. నిర్మల్: దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కొనసాగింపు అన్నట్లుగా అడవుల్లో ఉమ్మడి శత్రువులపై గోండులు, రోహిల్లాలు, మరాఠీలు, దక్కనీలు పోరు చేశారు. నిర్మల్ ప్రాంతం కేంద్రంగా 1858–60 వరకు ఈ పోరాటం సాగింది. దీనికి గోండు వీరుడు రాంజీ గోండు నేతృత్వం వహించాడు. మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో నివసించే అనేక మంది గిరిజన తెగల సమూహాల్లో గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలకులు రాక పూర్వమే ఏర్పడింది. గోండుల పాలన 1750 వరకు సుమారు ఐదు శతాబ్దాలపాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్‌కంఠ్ షా (క్రీ.శ 1735–49)ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్‌వాళ్లు చేజిక్కించుకున్నారు. గోండుల పాలన అంతమై ఆంగ్లేయ, నైజాం పాలన మొదలయ్యాక ఆదివాసులనూ నాటి పాలకులు పీడించారు. అడవుల్లోకి చొచ్చుకొస్తూ ఆదివాసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఆంగ్లేయ, నైజాం సేనలపై జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా చేసుకున్న మర్సుకోల రాంజీగోండు పోరాటం ప్రారంభించాడు. నిర్మల్ కేంద్రంగా ఉన్న ఆంగ్లేయ కలెక్టర్.. నిజాం సేనలతో కలసి అడవులను, ఆదివాసులను పీడిస్తున్నాడని తెలియడంతో రాంజీగోండు ఈ ప్రాంతం వైపు వచ్చాడు. రోహిల్లాల తోడుతో.. ప్రథమ సాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం పొందాక నానాసాహెబ్ పీష్వా, తాంతియాతోపే, రావుసాహెబ్‌లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లా సిపాయిలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు తరలివచ్చారు. వారు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్‌లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. నిర్మల్ ప్రాంతంలో రోహిల్లాల నాయకుడు సర్దార్ హాజీతో కలిసిన రాంజీ... ఉమ్మడి శత్రువులైన ఆంగ్లేయ, నిజాం సేనలపై విరుచుకుపడ్డాడు. సరైన ఆయుధ సంపత్తి లేకున్నా నిర్మల్ సమీపంలోని సహ్యాద్రి కొండలను, అడవులను కేంద్రంగా చేసుకొని ముప్పుతిప్పలు పెట్టాడు. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేసి దెబ్బతిన్నాయి. ఈ విషయం కలెక్టర్ ద్వారా హైదరాబాద్ రాజ్యంలో వారి రెసిడెంట్ అయిన డేవిడ్సన్, నాటి పాలకుడు అఫ్జల్ ఉద్దౌలా వరకు తెలిసింది. అణచివేత కోసం బళ్లారి దళం.. ప్రథమ సంగ్రామానికి కొనసాగింపుగా రాంజీ నేతృత్వంలో నిర్మల్ కేంద్రంగా ప్రారంభమైన పోరును పాలకులు తీవ్రంగా పరిగణించారు. అణచివేత కోసం బళ్లారిలోని 47వ నేషనల్ ఇన్ఫ్రాంట్రీని నిర్మల్ రప్పించారు. కల్నల్ రాబర్ట్ నేతృత్వంలోని ఈ దళం ఇక్కడి ప్రాంతంపై అంతగా పట్టులేకపోవడంతో రాంజీసేన చేతిలో దెబ్బతింది. ఈ కసితో రాంజీని దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నించి రాబర్ట్ సఫలమయ్యాడు. సోన్–కూచన్‌పల్లి ప్రాంతంలో గోదావరి ఒడ్డున రాంజీసేన పట్టుబడింది. ఒకే మర్రికి వెయ్యి మంది ఉరి.. దొంగదెబ్బతో బంధించిన రాంజీ సహా వెయ్యి మందిని శత్రుసేనలు చిత్రహింసలు పెట్టాయి. ఇలాంటి వాళ్లు మళ్లీ తమపై పోరాడేందుకు కూడా సాహించకూడదని నరకం చూపించాయి. వారందరినీ నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి దారిలో నేలలో ఊడలు దిగిన మర్రిచెట్టు వద్దకు ఈడ్చుకెళ్లి అందరూ చూస్తుండగా రాంజీ సహా వెయ్యి మందిని ఉరితీశారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలోనే మునుపెన్నడూ జరగని ఈ ఘటన 1860 ఏప్రిల్ 9న జరిగింది. ఆ తర్వాత కుమురం భీమ్ సహా ఎందరో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచింది. నేటికీ చరిత్రకెక్కని పోరాటం.. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యి మంది వీరుల త్యాగం ఇప్పటికీ చరిత్రకెక్కలేదు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చి నివాళులర్పించినా రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వగ్రామానికి సమీపంలోనే వెయ్యి ఉరుల మర్రి ఉన్నా.. పట్టించుకున్న నాథుడు లేడు. జిల్లా కేంద్రంలోని ఓ చిన్నపాటి విగ్రహం, 1995లో గాలివానకు నేలకొరిగిన వెయ్యి ఉరుల మర్రిచెట్టు ప్రాంతంలో అనాథలా అమరవీరుల స్థూపం మినహా ఎలాంటి జ్ఞాపకాలు లేవు. రాంజీ పేరిట మ్యూజియం పెడతామని కేంద్రం ప్రకటించినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. సెప్టెంబర్ 17 ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో తమ పూర్వీకులను గుర్తించి చరిత్రలో చోటుకల్పిస్తారేమోనన్న ఆశతో ఆ అమరవీరుల వారసులు ఎదురుచూస్తున్నారు. -
నిజాం రాజు.. తలవంచెన్ చూడు
‘‘1948 సెప్టెంబర్ 13.. తెల్లవారుజామున టెలిఫోన్ భీకరంగా మోగడంతో మేల్కొన్నాను. ఆర్మీ కమాండర్ ఇద్రూస్ అత్యవసర కాల్. రిసీవర్ ఎత్తకముందే అది భారత సైనికదళాల ఆగమనానికి సంబంధించినదై ఉంటుందని భావించా.. అది అదే. గడిచిన పావుగంటలో ఐదు విభిన్న సెక్టార్ల నుంచి భారత సైన్యం పెద్దసంఖ్యలో హైదరాబాద్ వైపు పురోగమిస్తున్నట్టు సమాచారం ఉందన్నాడు. అతను నాతో మాట్లాడుతుండగానే బీడ్, వరంగల్ ఔరంగాబాద్, విమానాశ్రయాలపై బాంబుదాడులు జరుగుతున్నాయి.. ఏం చేయాలని అడిగాడు. ఎలాగైనా అడ్డుకోవాలన్నాను. కానీ హైదరాబాద్ సైన్యాల నిస్సహాయ ప్రదర్శన, సాయం చేస్తుందనుకున్న పాకిస్తాన్ ప్రేక్షకపాత్ర, మా ఫిర్యాదుపై భద్రతా మండలి (యూన్ సెక్యూరిటీ కౌన్సిల్) జాప్యం..వెరసి హైదరాబాద్ కథ విషాదంగా ముగిసింది..’’ – హైదరాబాద్ స్టేట్ చివరి ప్రధాని లాయక్ అలీ ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ బుక్‌లో రాసుకున్న మనోగతమిది. (శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) ఆపరేషన్ పోలో.. కేవలం ఐదురోజుల్లోనే హైదరాబాద్ భవిష్యత్తును మార్చేసింది. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాలతో, త్రివర్ణజెండాలతో రెపరెపలాడితే.. హైదరాబాద్‌లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేయాలని నెహ్రూ, పటేల్ చేసిన విజ్ఞప్తులను నిజాం బుట్టదాఖలు చేయడంతో ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది. ఐదు రోజుల్లోనే అంతా పూర్తి నిజాం మెడలు వంచే లక్ష్యంతో 1948 సెప్టెంబర్ 13న భారత మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో మొదలైన ‘ఆపరేషన్ పోలో’ ఐదురోజుల్లోనే ముగిసింది. పశ్చిమాన షోలాపూర్–హైదరాబాద్, తూ ర్పున మచిలీపట్నం–హైదరాబాద్ రహదారి వెంట యుద్ధట్యాంకులు, తేలికపాటి స్టువర్ట్ టైప్ ట్యాంకులు, వాటి వెనక ఆయుధ వాహనాలు, పదాతిదళాలు దూసుకురాగా.. నిజాం సైన్యాలు, రజాకార్ల బృందాలు ఎక్కడా నిలువరించలేకపోయాయి. ముట్టడి ప్రారంభమైన తొలిరోజునే పశ్చిమం నుంచి వస్తున్న దళాలు నల్‌దుర్గ్‌ను స్వాధీనం చేసుకోగా.. తూర్పున మునగాల, సూర్యాపేట వరకు వశమ య్యాయి. సూర్యాపేట శివారులో మకాంవేసిన ని జాం సైన్యం.. 14వ తేదీన భారత సైన్యాలను అడ్డు కునేందుకు మూసీ వంతెనను పేల్చేసినా, తాత్కా లిక వంతెన నిర్మించుకున్న భారతసైన్యాలు మూసీ ని దాటాయి. భారత వాయుసేన పైనుంచి బాంబులువేస్తూ దారివేయగా.. పదాతిదళాలు నిజాం సైన్యాలను ఎదుర్కొంటూ ముందుకుసాగాయి. స్వేచ్ఛా వాయువులతో.. సెప్టెంబర్ 16 నాటికి నిజాంకు వాస్తవ పరిస్థితి అర్థమైంది. ఆరోజు సాయంత్రమే తొలుత ప్రధానమంత్రి మీర్‌లాయక్ అలీ రేడియో స్టేషన్‌కు వెళ్లి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మర్నాడు, అంటే.. సెప్టెంబర్ 17న సాయంత్రానికి భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ ఆదేశంతో.. మీర్ ఉస్మాన్‌అలీఖాన్ స్వయంగా దక్కన్ రేడియో ద్వారా హైదరాబాద్ సైన్యం తరఫున కాల్పుల విరమణ చేస్తున్నామని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించా రు. దీనితో హైదరాబాద్ స్టేట్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. జనమంతా భారత జాతీయజెండాలతో హైదరాబాద్ నగరాన్ని త్రివర్ణమయం చేశారు. రజాకార్ల అధ్యక్షుడు ఖాసీంరజ్వీని అరెస్ట్‌చేసి జైల్లో పెట్టగా.. ప్రధాని లాయక్ అలీని గృహ నిర్బంధం చేశారు. ఆయన రెండేళ్ల తర్వాత తప్పించుకుని పాకిస్తాన్ చేరాడు. ఖాసీం రజ్వీ 1958లో జైలు నుంచి విడుదలై పాకిస్తాన్లో స్థిరపడ్డాడు. నిజాం గుండెల్లో నిదురించిన గెరిల్లా.. ‘‘కట్ట బట్ట, తిన తిండి, పొట్టనక్షరం ముక్కలేనివాడు. వెట్టిచాకిరీకి అలవాటుపడ్డవాడు. ఎముకల గూడు తప్ప ఏమీ మిగలని వాడు.. దొరా నీ బాంచెన్ అన్న దీనుడు.. హీనుడు, దిక్కులేనివాడు.. తెలంగాణ మానవుడి సాహసోపేత సాయుధ పోరాటం ప్రపంచంలో ఓ కొత్త చరిత్ర’’.. నిజాం రాజ్యంలో సంస్థానాలు, జాగీ ర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, పటేల్, పట్వా రీ వ్యవస్థలు రైతుకూలీలను పీల్చి పిప్పిచేశాయి. నిజాంకు వ్యతిరేకంగా రైతుకూలీల సాయుధపోరు సొంత భూమి లేని సాదాసీదా జనం జీవితాంతం వెట్టిచేయాల్సిన పరిస్థితి. న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు పటేల్, పట్వారీల చేతుల్లో ఉండటంతో జనమంతా బాంచెన్ దొరా.. కాల్మొక్తా.. అంటూ బతికిన దుస్థితి. అయితే దేశ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, ఆంధ్ర మహాసభలు తెచ్చిన చైతన్యం సాయుధ రైతాంగ పోరాటానికి దారితీసింది. ఖాసీంరజ్వీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రజాకార్ల ఆగ డాలపై.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జనం తిరుగుబాటు మొదలైంది. భారత సైన్యాలను ఎదుర్కొనేందుకు రజాకార్లకు తర్ఫీదునిస్తున్న ఖాసీంరజ్వీ 1946 జూలై 4న అప్పటి నల్లగొండ జిల్లా కడవెండిలో విసునూరు దేశ్‌ముఖ్ ఇంటిమీదుగా వెళ్తున్న జులూస్పై దేశ్ ముఖ్ పేల్చిన తూటాలకు దొడ్డి కొమురయ్య హతమయ్యాడు. అది తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటానికి నాంది పలికింది. 4వేల మంది రక్తతర్పణతో 3వేల గ్రామాలు కమ్యూనిస్టుల ప్రజారక్షక దళాల అధీనంలోకి వెళ్లాయి. భారత ఉపప్రధాని వల్లభ్‌బాయ్‌పటేల్ ముందు లొంగిపోతున్న ఉస్మాన్‌అలీఖాన్ ఇదీ హైదరాబాద్ స్టేట్ ప్రస్తుత మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బని, ఉస్మానాబాద్, కర్ణాటకలోని రాయచూర్, బీదర్, గుల్బర్గా (కలబుర్గి), తెలంగాణతో కలిపి మొత్తం 83 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో.. దేశంలోనే అతిపెద్ద సంస్థానంగా ఉండేది. నిజాం.. ప్రపంచ కుబేరుడు మీర్ ఉస్మా న్ అలీఖాన్.. హై దరాబాద్ స్టేట్ విలీనం నాటికి ప్రపంచ ధనవంతుల్లో నంబర్‌వన్. 1937 ఫిబ్ర వరిలో టైమ్ మేగజైన్ అలీఖాన్ కవర్‌పేజీతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అప్పట్లోనే నిజాం సంపద విలువ రూ. 660 కోట్లుగా పే ర్కొంది. గోల్కొండ వజ్రాల గనులతో పాటు వివిధ సంస్థానాల నుంచి వచ్చే ఆదాయాలతో ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ కుబేరుడయ్యాడు. జాకబ్ వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా వాడేవాడు. ఉస్మాన్‌అలీఖాన్ ధరించిన.. విలువైన రాళ్లు పొదిగిన ఈ కత్తి విలువ అప్పట్లోనే 2 లక్షల డాలర్లు ఆయనకు హైదరాబాద్ చుట్టూరా 23 వేల ఎకరాల (సర్ఫెకాస్) భూములతోపాటు దేశంలోని వి«విధ ప్రాంతాల్లో 600కుపైగా విల్లాలు, విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే చౌమహల్లా, ఫలక్‌నుమా, చిరాన్‌పోర్ట్, నజ్రీబాగ్, పరేడ్ విల్లా ఫెర్న్‌విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్ ప్లజెంట్ విల్లాలు ఉస్మాన్‌అలీఖాన్ సొంతం. 173 రకాల బంగారు, వజ్రాభరణాలతో నిజాం ఖజానా ఉండేది. ఉస్మాన్ అలీఖాన్ కుటుంబం: లొంగుబాటుకు ముందు కుమారులు, కోడళ్లతో ఉస్మాన్ అలీఖాన్ ఎవరీ నిజాంలు? 1724లో స్వతంత్రుడిగా ప్రకటించుకున్న ఖమ్రుద్దీన్‌ఖాన్ దక్కన్లో అసఫ్‌జాహీ రాజ్యానికి నిజాం కాగా, 1948 సెస్టెంబర్ 17న భారత సైన్యాలకు లొంగిపోయిన ఉస్మాన్ అలీఖాన్ చివరివాడు. భారత్‌లో విలీనం అనంతరం ఉస్మాన్ అలీఖాన్ ఏటా రూ.50 లక్షల రాజభరణం పొందుతూ 1956 వరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఉస్మాన్ అలీఖాన్ మనవళ్లు ముఖర్రం జా, ముఫకం జా లండన్‌లో స్థిరపడి.. ఏటా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కుటుంబమిదీ.. భార్య: ఆజం ఉన్నీసాబేగం కుమారులు: ఆజం జా, మౌజం జా, కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం ఆజంజా కుటుంబం: భార్య దుర్రేషెవార్(టర్కీ), వారసులు ముఖర్రం జా, ముఫకం జా మౌజంజా కుటుంబం: భార్యలు నిలోఫర్ (టర్కీ), రజియాబేగం, అన్వరీబేగం. వారసులు ఫాతిమా, ఫాజియా అమీనా, ఓలియా, శ్యామత్ అలీఖాన్ -
September 17th: విమోచన కాదు, సమైక్యత!
ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 17కు ముందు మొదలయ్యే చర్చ ఈసారి మరింత తీవ్రమైంది. హైదరాబాద్ విమోచనా దినంగా ఏడాది పొడవునా సంబరాలు జరుపుతామని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఐక్యతా విగ్రహం’ పేరిట భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాన్ని విముక్తి విగ్రహం అని ఎందుకు అనలేదు? సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరితో ముస్లిం జనాభాను రెచ్చగొట్టవచ్చు. కానీ పాత గాయాలను మర్చిపోవడంలో, రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. అందుకే విలీనమా, విమోచనా అనే ప్రశ్నలను దాటి సమైక్యత అనే సమాధానం దగ్గర స్థిరపడటమే ఇప్పుడు మనకు కావలసింది! తెలంగాణలో సెప్టెంబర్ 17... ఆరెస్సెస్/ బీజేపీ చుట్టూ సమీకృతమవుతున్న హిందుత్వ శక్తులకూ, విస్తృతార్థంలో ఉదార ప్రజాస్వామ్య వాదులైన ఇతరులకూ మధ్య రాజకీయ వివాదం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజును హైదరాబాద్ విమోచనా దినంగా నిర్ణయించడంతో పాటు, 2023 సెప్టెంబర్ 17 వరకు ఏడాది పొడువునా సంబరాలు జరుపుతామనడంతో ఈసారి ఆరోజు మరింత స్పర్థాత్మకంగా మారింది. బహుశా ఆ పార్టీ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన దినంగా భావిస్తూం డవచ్చు. అదే సమయంలో ఆరెస్సెస్/బీజేపీ జాతీయ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి, జాతీయ సమైక్యతా దినాన్ని సెప్టెంబర్ 16 నుంచి ఏడాదిపాటు జరుపుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరెస్సెస్/బీజేపీ తొలినుంచీ నిజాం పాలనను రాచరిక పాలనగా కాకుండా హిందువులపై ముస్లింల పాలనగా చూస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ దూకుడుతో కూడిన ముస్లిం వ్యతిరేక వైఖరి నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజును జాతీయ సమైక్యతా దినంగా అధి కారికంగా జరపాలని నిర్ణయించింది. మోదీకి వ్యతిరేకంగా తనను తాను జాతీయ నేతగా కేసీఆర్ ప్రదర్శించుకుంటున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పిలుస్తున్న కమ్యూనిస్టులను పట్టించుకునే వారే లేరు. జునాగఢ్ సంస్థానాన్ని అక్కడి ముస్లిం పాలకుడు మూడవ ముహమ్మద్ మహబత్ ఖాన్జీ పాకిస్తాన్లో కలిపేస్తున్నట్లు ప్రకటించి, చివరకు పాకిస్తాన్‌కు పారిపోయాడు. దీంతో భారతదేశంలో విలీన మైన చిట్టచివరి రాష్ట్రంగా జునాగఢ్ నిలిచింది. కానీ ఆరెస్సెస్/బీజేపీ కూటమి దీని గురించి ఎంతమాత్రమూ మాట్లాడటం లేదు. నాడు దేశ ఉప ప్రధానిగానూ, హోంమంత్రిగానూ ఉన్న సర్దార్ పటేల్ నిర్ణయా త్మకమైన నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనం కావడంపై పూర్తి స్థాయి చర్చ జరగాల్సి ఉంది. కశ్మీర్ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన నేపథ్యంలో జాతీయ సమైక్యత అంశంపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవ సరం ఉంది. దేశం నడిబొడ్డున భంగకరమైన సంస్థానాన్ని వదిలేయ కుండా భారతదేశం ప్రస్తుత రూపంలోని రాజ్యాంగబద్ధమైన యూని యన్‌గా 1948 సెప్టెంబర్ 17 నుంచి ఉనికిలోకి వచ్చింది. భారత యూనియన్‌లో కశ్మీర్ 1947 అక్టోబర్ 27న చేరిందని అందరికీ తెలిసిన సత్యమే. వాస్తవానికి కశ్మీర్, హైదరాబాద్ సంస్థా నాలు స్వతంత్ర దేశాలుగా ఉండాలని అనుకోగా, జునాగఢ్ రాజు పాకిస్తాన్‌తో కలిసిపోవాలని నిశ్చయంగా కోరుకున్నాడు. సర్దార్ పటేల్, ఆనాడు హోంశాఖ కార్యదర్శిగా ఉన్న వీపీ మీనన్ నిర్వహిం చిన దౌత్య చర్చల ఫలితంగా మిగిలిన సంస్థానాలు భారత్‌లో విలీన మయ్యాయి. సంప్రదింపులు జరిపే సామర్థ్యంలో మీనన్ ప్రసిద్ధుడు. కశ్మీర్ అనేది హిందూ రాజు ఏలుబడిలోని ముస్లింలు మెజా రిటీగా ఉన్న రాజ్యం. అదే హైదరాబాద్‌లో హిందువులు మెజారిటీగా ఉండగా, ముస్లిం రాజు పాలనలో ఉండేది. దేశ విభజన సందర్భంగా భారత్ నుంచి పశ్చిమ పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత కశ్మీర్, హైదరాబాద్‌లను భారత యూనియన్‌లో కలుపుకోవడంపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండేది. దేశం లోపల గానీ, సరిహద్దుల మీద గానీ ఇతర దేశాలు లేకుండా భారత్ ఒక సార్వభౌ మాధికార, స్వతంత్ర దేశంగా ఇలాంటి సమైక్యత ద్వారానే ఉనికిలో ఉండగలుగుతుంది. కశ్మీర్ భారత సరిహద్దులోని సమస్యాత్మక ప్రాంతంగా కనిపించగా, హైదరాబాద్ సంస్థానం కేంద్రానికి మరింత పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్య పట్ల నెహ్రూ, పటేల్ చాలా తీవ్ర దృష్టితో ఉండేవారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కాకపోయి నట్లయితే, భారతదేశానికి అర్థమే మారిపోయి ఉండేది. ఆరెస్సెస్ కూడా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి అలాంటి విలీనమే జరగాలని కోరుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ సంస్థానాన్ని తన సాయుధ పోరాటానికి ప్రయోగాత్మక స్థావరంగా చేసుకుంది. హైదరాబాద్ ముస్లిం సంస్థానం కాబట్టి ఆరెస్సెస్ దాని మనుగడకే వ్యతిరేకంగా ఉండేది. కానీ ఆరోజుల్లో ఆరెస్సెస్ గుర్తించదగిన శక్తిగా ఉండేది కాదు. ప్రారంభం నుంచీ వారి జాతీయవాదం ముస్లిం వ్యతిరేక ఎజెండా చుట్టూనే తిరుగుతుండేది. భౌగోళికంగా ఐక్యమైన, పాలనకు అనువైన దేశాన్ని పాలక పార్టీగా కాంగ్రెస్ కోరుకుంది. పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యాకే అలాంటి దేశం ఏర్పడింది. కశ్మీర్, జునా గఢ్, హైదరాబాద్ సంస్థానాల్లో అనేక మరణాలు, హింసకు దారి తీసేటటువంటి బలప్రయోగం జరపడం కేంద్ర ప్రభుత్వానికి అవసర మైంది. అది పూర్తిగా మరొక గాథ! ప్రతి సంవత్సరం ఈ అంశంపై ఆరెస్సెస్/బీజేపీ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుండటంతో, చాలాకాలం ఊగిసలాట తర్వాత టీఆర్ఎస్ ఈసారి ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య పెరిగిన విభేదాలతో 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపును ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిపోయింది. సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరిని చేపడితే తెలంగాణలోని 15 శాతం ముస్లిం జనాభాను రెచ్చగొట్టి, వారిని లక్ష్యంగా చేసుకుని వేధించవచ్చు. అయినా 1948 సెప్టెంబర్ 17న ఏం జరిగిందని? భారత యూనియన్‌లోకి మరో సంస్థానం విలీన మైంది. అంతే కదా! ‘ఐక్యతా విగ్రహం’ పేరిట గుజరాత్లో భారీ సర్దార్ పటేల్ విగ్ర హాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రతిష్టించారు. జునాగఢ్, హైదరా బాద్, కశ్మీర్‌లను విశాల భారత్‌లో ఐక్యం చేయడానికి బాధ్యుడు పటేల్. మరి ఆయన విగ్రహానికి విముక్తి విగ్రహం అని ఎందుకు పేరు పెట్టలేదు? మరే హోంమంత్రి అయినా ఇతర సంస్థానాలను సుల భంగా విలీనం చేసేవారు. కానీ ఈ మూడు సమస్యాత్మక సంస్థానా లను విలీనం చేయడంలోనే పటేల్ గొప్పతనం ఉంది. ఈ ఒక్క కారణం వల్లే కాంగ్రెస్ శిబిరం నుంచి సర్దార్ పటేల్‌ను లాగి, ఆయనను ఆరెస్సెస్/బీజేపీ తమ ఘన చిహ్నంగా రూపొందించు కున్నాయి. నెహ్రూ లాగా వంశపారంపర్య సమస్యలు ఏమీ లేని అతి పెద్ద శూద్ర వ్యవసాయ నేపథ్యం కలిగిన వాడు కాబట్టే పటేల్ చుట్టూ రాజకీయ, ఆర్థిక పెట్టుబడిని ఆరెస్సెస్/బీజేపీ ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు, ఇతర పార్టీలు ఒక సామూహిక సంక ల్పంతో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపు కోవడమే సరైనది. అప్పుడు మాత్రమే ఈ సమస్య చుట్టూ ఉన్న మత పరమైన ఎజెండాను సామూహికంగా పాతరేయవచ్చు. హైదరాబాద్ చేరిక ఒప్పందంపై ఇరువురూ సంతకాలు చేశాక సర్దార్ పటేల్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న చక్కటి ఫొటోగ్రాఫ్ కనబడుతుంది. పైగా జునాగఢ్ పాలకుడిలా కాకుండా, ఉస్మాన్ అలీఖాన్ భారత్‌లోనే చివరివరకూ ఉండిపోయారు. ఆయన గానీ, ఆయన కుటుంబం గానీ పాకిస్తాన్ పట్ల ఎన్నడూ విశ్వాసంతో లేరు. ఆయన కుటుంబ ఆస్తిలో చాలా భాగాన్ని భారత యానియన్‌కే ఇచ్చేశారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైన హైదరాబాద్ హౌజ్ కూడా భారత ప్రభుత్వానికి నిజాం ఇచ్చిందే. అమృతోత్సవాలుగా పిలుస్తున్న ఈ కాలంలోనూ నిజాంనూ, ముస్లిం సమాజాన్నీ దూషించడం ఎందుకు? పాత గాయాలను మర్చిపోవడంలో రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. జాతీయవాదం అంటే స్వాతంత్య్ర పూర్వ కాలపు గాయాలను మళ్లీ కెలికి, వాటిపై కారం పూయడం కాదు. జాతీయవాదం అంటే ప్రజలు నిత్యం కొట్టుకునేలా చేయడం కాదు. ఈ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపుకొందాం. సర్దార్ పటేల్‌కూ, ఆనాటి సమరంలో అన్ని వైపులా మరణించిన అమరులకు నివాళులు అర్పిద్దాం. - ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త) -
కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మూడు రోజులు ఘనంగా వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సంస్థానం.. అధికారికంగా స్వతంత్ర భారత దేశంలో విలీనం అయ్యింది 1948 సెప్టెంబర్ 17వ తేదీన. ఈ తేదీపై రాజకీయంగానూ ఎన్నో ఏళ్ల నుంచి చర్చ నడుస్తోంది కూడా. తాజాగా.. శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అంతేకాదు.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగుపెట్టి.. ఈ ఏడాది సెప్టెంబర్17 నాటికి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇదీ చదవండి: సెప్టెంబర్ 17 గురించి అమిత్ షాకి ఒవైసీ లేఖ -
నైజామోన్ని తరిమిన గడ్డ..!
సొంతిల్లు.. సొంతూరు.. అయినా అనుక్షణం భయం.. భయం. అయినవాళ్ల మధ్యనే ఉన్నా.. ఉలికిపాటు.. గుర్రపు డెక్కల చప్పుడు వింటే గుండె దడ. రజకార్ల పొలికేక విన్పిస్తే మృత్యువు ముంచుకొచ్చినట్లే. జీవితమే రణరంగంలా మారిన తరుణంలో ఆంధ్ర మహాసభ – కమ్యూనిస్టు పార్టీ నేతృత్యంలో అయ్యా నీ భాంచన్ దొర కాల్మొక్తాన్న చేతులు బంధూకులు పట్టాయి. పలుగు, పార, కారం, రోకలి, వరిసెల, బరిసే అందిందల్లా ఆడ, మగ తేడా లేకుండా అందరికి ఆయుధాలుగా మారాయి. నైజాం రాజులను తరిమికొట్టడానికి ప్రత్యేక ఉద్యమ బలగాలు తయారయ్యాయి. నిజాం రాజులకు ఎదురుతిరిగి ముచ్చేమటలు పట్టించాయి. మహోన్నత చరిత్ర కలిగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాది విశిష్ట స్థానం. ఇక్కడ రాజుకున్న నిప్పు.. తెలంగాణ అంతా పాకింది. నాటి వీరుల వీరోచిత పోరాటానికి తలొగ్గిన నిజాం నవాబు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశాడు. సాయుధ పోరాటంలో.. వీర వనితలు తుపాకీ శిక్షణలో మొదటగా ఉన్న మహిళ మల్లు స్వరాజ్యం, చివరగా లలితాదేవి (ఫైల్) సూర్యాపేట : దేశచరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొని తుపాకీలు చేతపట్టి భూ మి, భూక్తి, విముక్తి కోసం పోరాడారు. అలాంటి వారిలో తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితురాలు, సూర్యాపేట ప్రాంతా నికి చెందిన మల్లు స్వరాజ్యం ఒకరు కాగా.. చకిలం లలి తాదేవి మరొకరు. ఇందులో మల్లు స్వరాజ్యం మనముందే ఉండగా చకిలం లలితాదేవి ఇటీవల కన్నుమూశారు. లలితాదేవి (ఫైల్), మల్లు స్వరాజ్యం భీంరెడ్డి అడుగుజాడల్లో.. తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మల కూతురు స్వరాజ్యం. సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు భీంరెడ్డి నర్సింహారెడ్డికి స్వయానా సోదరి. భీంరెడ్డి అడుగు జాడల్లోనే సాయుధ పోరాటంలో బందూకు చేతబట్టి ముందుకు సాగింది. ఆమె సోదరీమణులు శశిరేఖమ్మ, సరస్వతమ్మతో కలిసి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పోరాటంలో అనేక కష్టానష్టాలను ఎదుర్కొన్నారు. పోరాట విరమణ అనంతరం సాయుధ పోరాటంలో పాల్గొన్న మామిళ్లమడవ గ్రామానికి చెందిన మల్లు వెంకటనర్సింహారెడ్డిని వివాహమాడి కమ్యూనిస్టు పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు. 1978, 1983లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో ప్రజాసమస్యలపై తన వాణిని వినిపించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలిగా, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా అనేక ఏళ్ల పాటు పనిచేశారు. నేటికీ అలుపెరగకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏడాది నిండని బిడ్డతో పోరాటంలో పాల్గొన్న లలితాదేవి.. సూర్యాపేట తాలూకా కొత్తపల్లి గ్రామానికి చెందిన సీతారామారావు, వెంకటరామనర్సమ్మ కూతురు లలితాదేవి. లలితాదేవికి 14 ఏళ్ల వయస్సులో మోతె మండలం నామావరం గ్రామానికి చెందిన సాయుధ పోరాట యోధుడైన చకిలం తిర్మల్రావుతో వివాహం జరిగింది. 1946లో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా తుపాకీపట్టి సంవత్సరం కూడా నిండని కూతురుతో సహా ఉద్యమంలో పాల్గొంది. తుపాకులు పేల్చ డంలో శిక్షణ తీసుకుని మల్లు స్వరాజ్యం, ప్రియంవద, శశిరేఖలతో అడవులకు వెళ్లారు. లలితాదేవి, తిర్ముల్రావు ఆచూకీ తెలుకునేందుకు నామవరం గ్రామంలో వారి ఇంటిపై దాడులు చేసి అత్తమామలను చిత్రహింసలకు గురి చేశారు. తొలి ఆంధ్రమహాసభలో పాలుపంచుకున్నారు. అజ్ఞాతంలో ఉండగా ఖమ్మంలో అరెస్టు చేయబడ్డారు. వరంగల్‌కు, ఔరంగాబాద్, గుల్బర్గా జైళ్లలో 3 సంవత్సరాల కూతురుతో గడిపారు. జైలు జీవితం తర్వాత పెరోల్‌పై విడుదల చేశారు. బయటికి వచ్చే సరికి భూమి, ఇలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. వీరులెందరో.. నాగార్జునసాగర్ : నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రజకార్లతో పోరాడి అమరులైన వారు ఎందరో ఉన్నారు. అదేకోవకు చెందినవారు వడ్లపల్లి వీరారెడ్డి అలియాస్ వీరన్న వడ్లపల్లి రామచంద్రారెడ్డి అలియాస్ రామన్న. పోతునూరు శివారు ఏనెమీదిగూడెం (ఇప్పుడు పెద్దవూర మండలం) గ్రామానికి చెందిన నర్సమ్మ, మదార్రెడ్డి మూడో సంతానం వీరారెడ్డి 20–22సంవత్సరాల వయస్సులో ఎర్రజెండా నీడకు ఆకర్షితుడయ్యాడు. నంబాపురం అడవుల్లో గెరిళ్లా దళాలులకు భోజన అందిచేవాడు. ఈ విషయాన్ని మేడారం కరణం పసిగట్టాడు. ఈ ఘటనతో వడ్లపల్లి వీరారెడ్డి, వడ్లపల్లి రామచంద్రారెడ్డిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. ప్రతీకారంగా కొద్దిరోజులకే మేడారం కరణాన్ని దళాలు పట్టుకుని నరికి చంపాయి. ఈ ప్రాంతంలో వీరులు.. అల్వాల నరసింహారెడ్డి అల్వాల గ్రామస్తుడు ప్రస్తుతం తిరుమలగిరి(సాగర్) మండలంలో ఉంది. ఈయన జోనల్ కమాండర్ సాయుధ చర్య సందర్భంగా జనవరి 1949 తెప్పలమడుగులో మృతిచెందాడు. బీసం మట్టపల్లి వెంకటాద్రిపాలెం దళసభ్యుడు 1949లో చంపివేయబడ్డాడు. వెంకటయ్య నందికొండ. 1950 ఏప్రిల్‌లో నెల్లికల్లు (తిరుఏమలగిరి(సాగర్) మండలం)వద్ద కాల్చి చంపారు. సైదులు కుక్కడం దళసభ్యుడు 1950లో గ్రామంలో ఉండగానే కాల్చి చంపారు. నంబాపురం, కొత్తపల్లిలో మరో ఇద్దరి కాల్చి చంపారు. ఈవిధంగా ఎంతో ఆనాటి బలగాల చేతిలో అమరులయ్యారు. వడ్డెపల్లి వీరారెడ్డి ఉధృతమైన పోరాటం.. యాదగిరిగుట్ట (ఆలేరు) : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లాది ప్రముఖ స్థానం. 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభలో రావి నారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గ్రామగ్రామానికి ఆంధ్ర మహాసభ విస్తరించింది. అప్పటికే ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభలో కీలక పాత్రదారిగా మారింది. నిజాం తాబేదార్లుగా జాగీర్దార్లు, జమిందార్లు, దొరలు, దేశ్ముఖులు, భూస్వాములు విచ్చలవిడి దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నించే, ఎదురించే శక్తిలేని ప్రజలు కష్టాలను భరిస్తూ, వెట్టిచాకిరి చేస్తూ కన్నీళ్లు మింగుతున్న తరుణంలో ఆంధ్ర మహాసభ రూపంలో కమ్యూనిస్టుపార్టీ ప్రజలను సమాయత్తపర్చింది. గ్రామాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. కాచారంలో అమరవీరుల స్థూపాలు సంఘ సభ్యులపై నిజాంతొత్తులు దాడులకు గుండాలను ప్రయోగించాయి. అక్రమ కేసులు బనాయించి జైళ్ల కు పంపారు. ఇక దెబ్బకు దెబ్బ తప్పదని ఆంద్ర మహాసభ–కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయిం చాయి. ఈ నేపథ్యంలోనే 1947 సెప్టెంబర్ 11వ తేదీన ఆంధ్ర మహాసభ–కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్ధుం మోహినోద్దిన్ సాయుధ పోరుకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో తెలంగాణ ప్రజలు సమరశంఖం పూరించారు. రజాకార్లను, నిజాం బలగాలను ఎదుర్కొనడానికి సంసిద్దులైనారు. 10వేల మంది గేరిల్లా దళ సభ్యులుగా, లక్ష మందికి పైగా రక్షక దళ సభ్యులుగా చేరారు. తెలంగా ణాలోని దొరలు– భూస్వాములు, ప్రభుత్వ ఏజెంట్లు తప్ప, తెలంగాణా ప్రజలంతా ఒక్కటిగా కదిలారు. ప్రాణాలకు తెగించారు. లక్ష్యసాధనకు నడుంబిగించారు. ఊరూరా ఒక విప్లవ కేంద్రమయింది. ప్రతి వ్యక్తీ ఒక సైనికుడయ్యాడు. తెలంగాణ ఎరుపెక్కింది. ఆ సమయంలో పది లక్షల ఎకరాలు పేదలకు పంచిన కమ్యూనిస్టు పార్టీ వెయ్యి గ్రామాలకు పైగా పట్టుసాధించింది. భూస్వాములు, దొరలు గ్రామాలను వదిలి పట్టణాలకు పారిపోయారు. గుండాల మండలం సుద్దాలలో సుద్దాల హనుమంత్ స్థూపం ఎంతో మంది యోధులు... బాంచన్ దొరా.. నీ కాల్మొక్తా అన్న అమాయకులు బందూకులు చేతబట్టి నిజాం నవాబులను తరిమికొట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో జిల్లాలో ఆరుట్ల కమాలాదేవి, రాంచంద్రారెడ్డి, చింతలపురి రాంరెడ్డి, బీంరెడ్డి నర్సింహరెడ్డి, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పి.చెన్నారెడ్డి, జిట్ట రాంచంద్రారెడ్డి, కట్కూరి రాంచంద్రారెడ్డి, సుశీల దేవి, సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణరెడ్డి, కుర్రారం రాంరెడ్డి, గడ్డమీ రామ య్య, బద్దం నర్సింహారెడ్డిలతో పాటు మరెందరో వీరులు పోరాటానికి దన్నుగా నిలిచారు. చివరి దశలో సెప్టెంబర్ 11, 1948లో ఈ వీరుల పోరాటానికి తలొంచిన నైజాం నవాబులు 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి కలిగించారు. పాటే ప్రాణంగా పోరాటం.. భూమి, భుక్తి విముక్తి కోసం మట్టి మనుషుల పోరాటాన్ని ఎదుర్కోవడానికి ఆనాడు పాటే ఉపిరి పోసిందని పలువురు చెబుతున్నారు. అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడే పాట పుడుతుంది అన్న మాటలకు ఆనాటి సాయుధ పోరాట యోధులు నిదర్శనమయ్యారు. ప్రజలు పాటలను తమ బలంగా ఎంచుకుని ఉద్యమించారు. గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన సుద్దాల హనుమంత్ రాసిన ‘బండేనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతావు కొడకో.. నైజాం సర్కారోడా..’ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి నైజాం రాజులపై తిరుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించిందని అప్పటి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు చెబుతున్నారు. రజాకార్లకు ఎదురొడ్డిన గుండ్రాంపల్లి చిట్యాల (నకిరేకల్) : నిజాం నిరంకుశత్వ పాలన, రజాకార్ల కిరాతక చర్యలకు ఎదురొడ్డిన ఈ ప్రాంతం సాయుధ పోరాటానికి సాక్ష్యంగా నిలుస్తుంది చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం. గుండ్రాంపల్లి గ్రామం నుంచి నాటి పోరాటంలో ఎందరో యువకులు రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి అసువులు బాశారు. మరెందరో రజాకార్ల దమనకాండకు బలయ్యారు. ప్రాణాలకు తెగించి సాయుధ పోరాటంలో ఈ ప్రాంత ప్రజలు పాల్గొనడం ద్వారానే తమ లక్ష్యాన్ని సాధించారు. గుండ్రాంపల్లిలోని స్థూపం ఇత్తేహదుల్ ముసల్మాన్ సంస్థ ఏర్పాటుతో.. సాయుధ పోరాట సమయంలో సూర్యాపేట తాలుకాలోని వర్థమానకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్వక్తి తన అక్క నివాసముంటున్న గుండ్రాంపల్లి గ్రామానికి తన కుటుంబసభ్యులతో వలస వచ్చాడు. ఆనంతరం బతుకుదెరువుకు గాను ఏపూరు గ్రామంలోని ఒక భూస్వామి వద్ద పనిలో చేరాడు. ఆనంతరం ఆతను రజాకార్ల బృందంలో చేరాడు. ఇక ఆ తరువాత మక్బూల్ అరాచకాలకు ఈ ప్రాంతంలో అంతేలేకుండా పోయింది. మక్బూల్ అరాచాకాలకు వ్వతిరేకంగా.. గుండ్రాంపల్లి కేంద్రంగానే నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు తమ పోరాటాన్ని కొనసాగించేవారు. ఈ పోరాటాంలో ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు దళాలుగా ఏర్పాడ్డారు. వీరు రజాకార్లకు ఎదురొడ్డి దాడులు చేసేవారు. దీనిని సహించని మక్బూల్ తిరుగుబాటుదారులపై దాడులు చేశాడు. ఒకసారి ఆతని దాడిలో దొరికిన 30 మంది యువకులను గుండ్రాంపల్లిలో బంధించాడు. వీరందరిని ఎడ్ల బండికి కట్టిపడేసి గుండ్రాంపల్లి నడిబోడ్డున గల (నేడు ఏపూరు గ్రామానికి వెళ్లే దారిలోని కూడలి) బావిలో పడేసి సజీవ దహనం చేశాడు. ఈ సంఘటనతో సాయుధ పోరాటంలో పాల్గొంటున్న వారు తమ పోరాటాలను ఉధృతం చేశారు. పలివేలకు చెందిన కొండవీటి గురున్నాథరెడ్డి నాయకత్వంలో మక్బూల్‌పై ఒకేసారి దళాలు దాడి చేసేందుకు ప్రణాళికను రూపొందించాయి. దీనిని గ్రహించి ఈ దాడి నుంచి మక్బూల్ తప్పించుకున్నాడు. దీంతో దళాల్లో పాల్గొన్న యువకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోసారి వీరు జరిపిన దాడిలో మక్బూల్ చేయి విరిగినప్పుటికీ ప్రాణాలతో తప్పింకుని పారిపోయాడు. కానీ అతని భార్య, కూతురు ప్రాణాలను కోల్పోయారు. అనంతరం మక్బూల్‌కు సహకరించిన వారి ఇండ్లపై దాడి చేసి వారిని చంపివేశారు. అమరవీరుల స్థూపం ఏర్పాటు.. నాటి పోరాటంలో 30 మందిని బావిలో పడేసిన చోట 1992 జూన్ 4వ తేదీని సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించి ఆవిష్కరించారు. ఇటీవల హైవే విస్తరణలో స్తూపాన్ని తొలగించగా.. మరోచోట నిర్మించారు.ఈ స్థూపం వద్దనే ఏటా నివాళులర్పించడం ఆనవాయితీ. రావులపెంట కేంద్రంగా సాయుధ పోరాటం మిర్యాలగూడ : నిజాం నవాబులను ఎదిరించడానికి వేములపల్లి మండలంలోని రావులపెంట కేంద్రంగా సాయుధ రైతాంగ పోరాటం సాగింది. రావులపెంటతో పాటు సమీప గ్రామాల ప్రజలంతా సాయుధ పోరాటంలో భాగస్వాములయ్యారు. నాడు నిజాం నవాబు తోపుచర్ల పిర్కాలోని గ్రామాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతుండగా జనం తిరగబడటంతో రావులపెంటలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. వేములపల్లి మండలంలో ప్రధానంగా అమనగల్లు, పాములపాడు, రావులపెంటలో క్యాంపులు నిర్వహించడంతో పాటు రావులపెంటను కేంద్రంగా చేసుకొని నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. రావులపెంటలో భూస్వామ్య కుటుంబంలో పుట్టిన చల్లా సీతారాంరెడ్డి నిజాం నవాబులను ఎదిరించేందుకు ఎన్నో క్యాంపులు నిర్వహించి వారి స్థావరాలపై దాడులు చేశారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపుల్లో ఎంతో మంది తలదాచుకున్నారు. రావులపెంటలో ఆనాటి కోట బురుజు నిజాం పోలీసులు రావులపెంట, ఆగామోత్కూర్, తడకమళ్ల గ్రామాలలో చొరబడి ప్రజలపై దాడులు చేశారు. కానీ 1939లో ఉపాద్యాయుడిగా ఉద్యోగం పొందిన చల్లా సీతారాంరెడ్డి పాఠశాలల్లో ఉద్యమాలు బోధించడంతో పాటు 1946 కమ్యూనిస్టులతో ఉన్న సంబంధాల వల్ల ఉద్యోగాన్ని వదులుకొని సాయుధ పోరాటంలోకి వెళ్లారు. రావులపెంటల కేంద్రంగా చల్లా సీతారాంరెడ్డితో పాటు నారబోయిన నర్సయ్య, గట్టికొప్పుల రాంరెడ్డితో కలిసి మొదటి సారిగా రావులపెంటలో సభ నిర్వహించారు. అనంతరం ధరణికోట సుబ్బయ్య, గుంటి వెంకటనర్సయ్య, అవిరెండ్ల ఎల్లయ్య, జిన్నె పెద్ద సత్తిరెడ్డి, చిన్న సత్తిరెడ్డి, రామనర్సయ్య, దొంతిరెడ్డి వెంట్రామ్‌రెడ్డి, దొంతిరెడ్డి చెన్నారెడ్డి, పోలగోని గోపయ్య, అవిరెండ్ల రామచంద్రయ్యలతో కలిసి ఉద్యమ రూపకల్పన చేశారు. పాములపాడు, అమనగల్లు గ్రామాల్లో కూడా బహిరంగసభలు నిర్వహించారు. చల్లా సీతారాంరెడ్డిని పట్టకోవడానికి ఒకరోజు నిజాం పోలీసులు రావులపెంటలో మాటు వేశారు. కానీ ఆ గ్రామ ప్రజలంతా కలిసి నిజాంకు వ్యతిరేకంగా ఒక్కసారిగా వారి స్థావరంపై దాడి చేయడంతో పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు. దళాలకు కొరియర్‌గా పనిచేశా నల్లగొండ టౌన్ : నా 14ఏళ్ల వయస్సులో దళాలకు కొరియర్‌గా పనిచేశా. రాజాకార్లు, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న సాయుధ పోరాటంలో ఈదులూరు అంజయ్య, పాదూరి జానపరెడ్డి దళాలకు కొరియర్‌గా పనిచేశా. ఆ సమయంలో నేను చిన్నవాడిని కావడంతో పాటు మానాన్నగారు సీతారామయ్య పేరొందిన బ్రాహ్మణుడు కావడంతో నాపై ఎలాంటి అనుమానం వచ్చేది కాదు. సీతారామయ్య కొడుకుగా ఎలాంటి అనుమానం రాకుండా దళాలకు కొరియర్‌గా సమాచారాన్ని అందించే వాన్ని. 1947 స్వాతంత్య్రం వచ్చిన తరువాత సైన్యం గ్రామాలపై దాడులు చేస్తూ దళాలను ఏరివేసే పనిలో పడింది. కట్టంగూరు మండలం కల్మె ర గ్రామంలో సమీపంలోని తెల్లకుం ట వద్ద గుర్రాలపై వచ్చిన సైన్యం పాదూరి జానపరెడ్డి దళం పొలాల వద్ద పడుకున్న వారిపై దాడులు చేసి కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో పొలం నుంచి పరిగెడుతున్న పాదూరి జానపరెడ్డిపై సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. దీంతో ఆయన అక్కడే ప్రాణాలు వదిలారు. మా ఇల్లు ఊరి బయట ఉండడం వల్ల పిట్టగోడ పైనుంచి సైన్యం జరిపిన కాల్పులను స్వయంగా చూశాను. ఆ కాల్పుల్లో పాదూరి జానపరెడ్డి మరణాన్ని చూసిన నేను ఇప్పటికీ మరవలేకపోతున్నా. పెన్నా అనంతరామశర్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధులు విముక్తి కోసం పోరాటం.. హాలియా (నాగార్జునసాగర్) : రజాకార్ల కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజల కు విముక్తి కలిగించేందుకు త్యాగాలు చేశా రు.. లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లల్లో మగ్గా రు.. ఆలిబిడ్డలకు దూరంగా అడవుల్లో ఉంటూ తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచారు.. త్రిపురారం మండలంలోని కామారెడ్డిగూడెం, త్రిపురారం గ్రామాలకు చెందిన టంగుటూరి సత్యం, జొన్నలగడ్డ చల్మారెడ్డి, జొన్నలగడ్డ కోదండరామిరెడ్డి, కుందేటి సైదులు. నిజాం నవాబులు, దొరలు ప్రజలపై దారుణాలకు పాల్పడుతుంటే తట్టుకోలేక వారి ఆగడాలకు అడ్డువేశారు. నేడు వారు మన నుంచి శాశ్వతంగా దూరమైనా వారు చేసిన పోరాట ఫలితంతో ప్రజలకు విముక్తి లభించింది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడా.. నకిరేకల్ : నిజాం పాలనకు వ్యతిరేంగా పోరాడాను. నా 18వ ఏట సూర్యాపేట ప్రాంతంలో బాలెంలలో మా బంధువులు ఉంటే అక్కడికి వెళ్లాను. ఆనాడు బాలెంల ప్రజలు నిజాం ప్రభుత్వ లేవీ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రజలు పడుతున్న బాధలు చూసి చలించి పోయినాను. రైతులంతా ఏకమై వారిని తరమారు. ఆ సమంలో బాలెంలకు చెందిన ఇద్దరు రైతులు అసువులు బాశారు. అక్కడి ప్రజలు, రైతుల ఆవేదన చూసి నిజాం వ్యతిరేకం పోరాటంలోకి దిగాను. ఆ సయమంలో మూసీ నది కేంద్రంగా సాయుధ పోరాట యోధులకు గెరిల్లా శిక్షణ ఇచ్చారు. అక్కడ కర్రసాము, కత్తిసాము, తూపాకి పేల్చడం వంటి శిక్షణలు పొందాను. నా చిన్నతనం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నా. నేను మునగాల పరగణాకు చేరుకుని రేపాల గ్రామంలో కోదాటి నారాయణరావు దళం బార్డర్ క్యాంప్ ఏర్పాటు చేసి రజాకారుల ఆగడాలను అరికట్టాడానికి కృషి చేశారు. దానిలో భాగంగా రామసముద్రం గ్రామంలో ఎనిమిది నెలలు ఉండి ఈ క్యాంప్‌కు వెళ్లి శ్రీరెడ్డి పెదవెంకట్‌రెడ్డి దళంలో పనిచేశాను. ఆ సమయంలో ఇటుకులపహాడ్‌లో మా ఇంటిని రజాకారులు తగులబెట్టారు. పాలవరపు లక్ష్మీనర్సయ్య, సాయుధ పోరాట యోధుడు, నకిరేకల్ 16 నెలలు జైలు జీవితం గడిపిన దొడ్డా.. చిలుకూరు (కోదాడ) : తెలంగాణ సాయుధ పోరాటంలో పటేల్, పట్వారీల దోపిడీని అడ్డుకోవడంలో కీలక భూమిక పోషించారు చిలుకూరు గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డా నారాయణరావు. ఉద్యమంలో భాగంగా 16 నెలల జైలు జీవితం గడపడంతో పాటు, దాదాపుగా మూడేళ్ల పాటు అడవిలో రహస్య జీవితం గడిపి తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. చిలుకూరు గ్రామానికి చెందిన దొడ్డా అప్పయ్య, వెంకమ్మకు ఏడుగురు మగ సంతానం. వారిలో ఆరోవాడు దొడ్డా నారాయణరావు. ఈయన నాలుగో తరగతి వర కు చదువుకున్నాడు. నారాయణరావు అన్న హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య. దొడ్డా ఉద్యమంలోకి రావడానికే అన్నే స్ఫూర్తితో సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. దళాలకు కొరియర్‌గా పని చేశారు. 1948లో చిలుకూరులో ఐదుగురు సభ్యులతో కమ్యూనిస్టు పార్టీ సెల్ ఏర్పాటు చేసి నారాయణరావును కార్యదర్శిగా నియమించారు. అనంతరం 1959లో చిలుకూరు పథమ సర్పంచ్‌గా దొడ్డా నారాయణరావు ఎన్నికయ్యాడు. దొడ్డా నారాయణరావు బేతవోలు గడి కూల్చివేత.. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా అనాడు సూర్యాపేట తాలుకాలో ఉన్న బేతవోలు పరగణాలో బేతవోలు జమీందారు తడకమళ్ల సీతరామాచందర్రావు కోటను తన అన్న దొడ్డా నర్సయ్య నాయకత్వంలో ఆరు వేల మందితో గడ్డపారాలతో పొడిచి తగుల బెట్టారు. నాలుగు రోజుల్లో కోటను కూల్చివేశారు. దొరకు చెందిన 1100 ఎకరాల భూమిని దొరల భూమిని, ఆస్తులను రైతులు స్వాధీనం చేసుకున్నారు. -
ఇది విలీనదినమే!
త్రికాలమ్ ఈరోజు తెలంగాణ చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. సరిగ్గా 69 సంవత్సరాల కిందట హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజు. విలీ నానికి ఒప్పుకోనంటూ హఠం చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొని ఐక్యరాజ్య సమితి గడప ఎక్కిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మెడలు వంచి భారత్‌లో అంతర్భాగం కావడానికి ఒప్పించిన సందర్భం. దీనిని విమోచన దినంగా జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోరుతున్నది. కాదు, విద్రోహదినంగా పరిగణిస్తామని మజ్లీస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రకటించింది. విలీనదినంగా పాటిస్తే బాగుంటుందని సాధారణ ప్రజల అభిప్రాయం. ఇంతకీ నాడు జరిగింది విలీనమా, విద్రోహమా, విమోచనా? చరిత్రను అన్వయించేవారికి స్వప్రయోజనాలు ప్రధానం. వారి దృష్టికోణం నుంచే పరిణామాలను అర్థం చేసుకుంటారు. వారి లక్ష్యాలకు అనుగుణంగానే అన్వయిస్తారు. భాష్యం చెబుతారు. హైదరాబాద్ సంస్థానం విముక్తికి ప్రధాన కారకుడిగా నాటి ఉపప్రధాని, దేశీయాంగమంత్రి సర్దార్ పటేల్‌ను బీజేపీ కీర్తిస్తుంది. హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసే బాధ్యతను ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉపప్రధానికి అప్పగించారు. ఆ పని సర్దార్ సమర్థంగా చేశారు. విలీనానికి ససేమిరా అన్న మూడో సంస్థానం జమ్మూ–కశ్మీర్ వ్యవహారంలో నెహ్రూ జోక్యం చేసుకున్నాడు. తన పూర్వీకులు నివసించిన కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయం ఒకవైపూ, సిసలైన ప్రజాస్వామ్యవాదిగా తనకున్న అంతర్జాతీయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూసుకోవాలన్న అభిలాష మరోవైపూ లాగి నెహ్రూని ఇబ్బంది పెట్టినమాట వాస్తవం. నెహ్రూ డోలాయమాన వైఖరి కారణంగా జమ్మూ–కశ్మీర్ వివాదం తెగకుండా ముడిపడకుండా దశాబ్దాలు గడిచిపోవడం, పాకిస్తాన్‌తో యుద్ధాలు చేయవలసిరావడం కూడా నిజమే. నెహ్రూ, షేక్ అబ్దుల్లాల పట్టింపు లేకపోతే 1947–48 లోనే కశ్మీర్ పాకిస్తాన్లో విలీనమయ్యేది. ఈ నేపథ్యంలో కశ్మీర్ సంక్షోభానికి నెహ్రూను నిందించడం బీజేపీ విధానం. మొత్తం 560 సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేసింది నెహ్రూ, పటేల్ అనేది చరిత్ర. పీవీ నరసింహారావుకు కీర్తి దక్కడం ఇష్టంలేని సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ నాయకులు 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడు నాటి ఆర్థికమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అంటూ కీర్తించి తరిస్తున్నారు. మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా నియమించిందీ, ఆర్థిక సంస్కరణలు అమలు జరపాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదీ, ప్రతిపక్షాల విమర్శలకు తాళలేక రెండు విడతల రాజీనామా చేసిన మన్మోహన్‌ను అనునయించి నచ్చజెప్పిందీ, పరిశ్రమల శాఖను తన చెంతనే పెట్టుకొని విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానాన్ని ఒకేరోజు ఏకబిగిన సహాయ మంత్రి కురియన్ (ప్రస్తుత రాజ్యసభ ఉపాధ్యక్షుడు) చేత ప్రకటింపజేసిందీ పీవీ అనే విషయం కాంగ్రెస్ నాయకులు తెలిసినా చెప్పరు. మన్మోహన్ పీవీ నమ్మిన బంటుగా ఆర్థిక సంస్కరణలను మనస్ఫూర్తిగా అమలు చేసిన అమాత్యుడు అనడంలో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాంగ్రె స్కి పీవీపైన ఉన్న ద్వేషం కంటే నెహ్రూపైన నేటి తరం బీజేపీకి గల ద్వేషం అధికం. అందుకే హైదరాబాద్ విముక్తికి సర్దార్ పటేల్ మాత్రమే కారణమని బీజేపీ వాదిస్తుంది. నెహ్రూ సమ్మతించి, సహకరించకపోతే పటేల్ లక్ష్యం నెరవేరేది కాదనేది వేరే విషయం. పైగా ఎన్ని విభేదాలు ఉన్నా అంతిమ శ్వాస వరకూ పటేల్ నెహ్రూతో స్నేహంగా ఉండేవారు. పరస్పరం గౌరవించుకునేవారు. గాంధీజీకి ఇద్దరూ రెండు కళ్ళుగా ఉండేవారు. వెలుగు చూడని హైదరాబాద్ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పదమూడు నెలల వరకూ హైదరాబాద్‌లో నిజాం పాలనే కొనసాగింది. అంతకాలం నిజాం ధిక్కారం ప్రదర్శించాడు. ప్రైవేటు సైన్యంగా రజాకార్లను పెంచి పోషించాడు. దేశ్‌ముఖ్‌లనూ, భూస్వాములనూ కూడగట్టుకున్నాడు. భారతదేశంలో విలీనం కాబోనంటూ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. పాకిస్తాన్ అధినేత మహమ్మదలీ జిన్నాతో రాయబారం నెరపాడు. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు పెట్టాడు. ఇంత చేసిన నిజాంను లొంగిపోయిన తర్వాత బుట్టదాఖలు చేయకుండా ‘రాజ్‌ప్రముఖ్’ పదవి ఇచ్చి ఎందుకు గౌరవించారు? నిజాం కబంధ హస్తాలనుంచి హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించామని నెహ్రూ, పటేల్ భావించి ఉంటే విమోచన దినోత్సవాలు నిర్వహించేవారే. కానీ వారు ఆ విధంగా భావించలేదు. అన్ని సంస్థానాల పూర్వాధిపతులనూ సగౌరవంగా సాగనంపి వారి హోదాకు భంగం లేకుండా హంగులూ, నిధులూ ఏర్పాటు చేయడం నాటి ప్రభుత్వ విధానం. అదే విధంగా నిజాంకూ మర్యాదలు జరిగాయి. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని దేశం వదిలి వెళ్ళనిచ్చారు. ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా ప్రగతి యజ్ఞానికి శ్రీకారం చుట్టాలన్న సంకల్పం వారిది. అందుకే హైదరాబాద్ రాష్ట్రంలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం కానీ 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత సంజీవరెడ్డి, తదితర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్‌టి రామారావు, చంద్రబాబునాయుడు కానీ సెప్టెంబర్ 17న సంబరాలు జరుపుకోలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రత్యేక తెలంగాణ ఉద్యమనాయకుడిగా ప్రతి సంవత్సరం ఈ ప్రస్తావన చేసేవారు. సెప్టెంబర్ 17 నాడు కర్ణాటక, మహారాష్ట్రలలో విలీనమైన పాత హైదరాబాద్ సంస్థానం ప్రాంతాలలో జరుపుకున్నట్టు హైదరాబాద్‌లో కూడా సంబురాలు జరిపించాలని డిమాండ్ చేశారు, ఆ పని చేయనందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చాక ఆయన సైతం పాత ముఖ్యమంత్రుల బాటలోనే నడుస్తున్నారు. ఈ మౌనం వెనుక ముస్లింలను దూరం చేసుకోరాదనే విధానం కావచ్చు. పాత గాయాలను రేపడం ఎందుకన్న అభిప్రాయం కావచ్చు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చరిత్రాత్మకమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. సుమారు నాలుగు వేలమంది యోధులు నేలకొరిగారు. జాగీర్దారుల, దేశ్‌ముఖ్‌ల దురాగతాలను వ్యతిరేకిస్తూ వారి గూండాలపైనా, రజాకార్లపైనా జరిగిన పోరాటం నిజాం పాలనా వ్యవస్థను కుదిపేసింది. నిజాం దారికి వస్తాడేమోనని నెహ్రూ, పటేల్ పదమూడు మాసాలు వేచి చూశారు. చర్చలతో పరిష్కారం కాకపోతే బలప్రయోగం చేయవలసి ఉంటుం దని నిజాంను నెహ్రూ హెచ్చరించాడు. పటేల్ 36 వేల మంది సైనికులను జనరల్ జెఎన్ చౌధురి నాయకత్వంలో పంపించారు. రజాకార్లు ప్రతిఘటించలేక దాసోహమన్నారు. నిజాం లొంగుబాటు సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. ఐక్యరాజ్య సమితిలో పెట్టిన కేసు ఉపసంహరించుకున్నట్టు రేడియో ప్రసంగంలో నిజాం చెప్పాడు. అది ఒత్తిడిలో చేసిన ప్రకటన కనుక కేసు ఉపసంహరణను ఆమోదించేది లేదంటూ ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ఆ కేసు ఇటీవలి వరకూ సమితి పరిశీలనలో ఉంది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలో పది స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం మంజూరు చేయలేదు. ఇందుకు ఇందిరాగాంధీ చెన్నారెడ్డికి చూపించిన కారణం ఈ కేసు. అంతకుముందు హైదరాబాద్‌ను ఆంధ్రలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం వెనుక కూడా ఈ కేసు ఉన్నదని అంటారు. జనరల్ చౌధురి నిర్వహించిన సైనిక చర్యను పోలీసు చర్య అనీ, ఆపరేషన్ పోలో అనీ, ఆపరేషన్ క్యాటర్‌పిల్లర్ అనీ పిలిచారు. వాస్తవంగా జరిగింది సైనిక చర్య. కానీ దానిని పోలీసు చర్య (పోలీస్ యాక్షన్)గా అభివర్ణించడంలోని ఆంతర్యం ఐక్యరాజ్యసమితిని చిరాకు పరచకూడదనే. సైనిక చర్య అంటే అది స్వతంత్రం ప్రకటించుకున్న రాజ్యంలో మరో దేశం జోక్యం చేసుకోవడంగా పరిగణించే ప్రమాదం ఉన్నదని భావించి ఉంటారు. సైన్యం నలుమూలల నుంచి హైదరాబాద్‌ను చుట్టుముట్టిన క్రమంలో హింసాకాండ జరిగిందని వార్తలు వచ్చాయి. నిజనిర్ధారణ కోసం నెహ్రూ పండిట్ సుందర్‌లాల్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. కాజీ అబ్దుల్ గఫర్, మౌలానా మిస్రీ ఈ కమిటీలో తక్కిన సభ్యులు. ఈ కమిటీ 1948 డిసెంబర్లో మూడు వారాలు హైదరాబాద్ సంస్థానం ప్రాంతంలో పర్యటించి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక చూసి నిర్ఘాంతపోయిన నెహ్రూ, పటేల్ దానిని రహస్య పత్రంగా పరిగణించి ప్రజలకు అందుబాటులో లేకుండా దాచారు. 2013లో కేంబ్రిడ్జికి చెందిన చరిత్రకారుడు సునీల్ పురుషోత్తమ్, మరో చరిత్రకారుడు మహమ్మద్ సలీయుల్లా పూనిక ఫలితంగా ఈ నివేదిక వెలుగు చూసింది. నాందేడ్, షోలాపూర్ పట్టణాలతో సహా అనేక ప్రాంతాలలో స్థాని కులు పాత కక్షలు తీర్చుకునే క్రమంలో అనేక దాడులు చేశారనీ, కనీసం 27 వేలమంది ఈ దాడులలో మరణించి ఉంటారనీ, వారిలో అత్యధికులు ముస్లింలేననీ సుందర్‌లాల్ కమిటీ నివేదించింది. ‘మిమ్మల్ని హైదరాబాద్ ఎవరు వెళ్ళమన్నారు?’ అంటూ పటేల్ ఈ కమిటీ సభ్యులలో ఒకరైన గఫర్‌ను మందలించారట. ఈ విషయాలు బయటికి పొక్కితే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందనే భయంతో నివేదికను రహస్యపత్రంగా పరిగణించి ఉంటారు. బీజేపీ వ్యూహం బీజేపీకి మాత్రం ఈరోజు ఒక ముస్లిం రాజును గద్దె దింపిన రోజు. కనుక సంబరాలు జరుపుకోవలసిన సందర్భం. విమోచన సంబరాలు జరుపుకోవాలని నిరుడు వెంకయ్యనాయుడు కేసీఆర్‌ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించలేదు. నిజాం పాలనను మెచ్చుకునే కేసీఆర్ ఇలా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆఖరి శ్వాస వరకూ కాంగ్రెస్‌వాదిగానే కొనసాగిన సర్దార్ పటేల్‌ను తమ ఆదర్శపురుషుడుగా, అభిమాన నాయకుడిగా చిత్రించడం కోసం ఈ చారిత్రక పరిణామాన్ని వినియోగించుకోవాలన్నది బీజేపీ నాయకుల అభిమతం. రజాకార్ల వారసులే ఎంఐఎం నాయకులని వారి విమర్శ. విమోచన అంటే ముస్లింలు అభ్యంతరం చెబుతారు. అడ్డుకుంటారు. ఫలితంగా హిందువులు సంఘటితం అవుతారన్న ఆలోచన కావచ్చు. విమోచన అంటే ఎంఐఎం ఆగ్రహిస్తుందనీ, విద్రోహం అంటే బీజేపీ కోపగిస్తుందనీ భావించి ఈరోజుని ముఖ్యమైన సందర్భంగా పరిగణించకుండా వదిలేయడం చరిత్రను విస్మరించినట్టు అవుతుంది. తెలంగాణ ప్రజలకు ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ వారికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లభించింది నిజంగా ఈరోజే. కనుక విలీనదినం వేడుకగా జరుపుకోవడం సమంజసం. అధికారంలో ఉన్న పార్టీలు సంకోచిస్తూ మౌనంగా ఉంటే దీన్ని రాజకీయ ప్రయోజనాలకు విని యోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. పటేల్‌ను ప్రభుత్వాలు స్మరించకపోతే ఆయనను పూర్తిగా సొంతం చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సెప్టెంబర్ 17ని హైదరాబాద్ విలీనదినంగా జరుపుకోవడానికి సంకోచించనక్కరలేదు. ప్రభుత్వ పూనికతో జరిగే ఈ వేడుకలో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు పాల్గొనవచ్చు. బీజేపీ, ఎంఐఎం నాయకులూ, కార్యకర్తలూ కాలక్రమంలో రాజీపడి ఈ సంబరాలలో పాల్గొంటారు. చరిత్ర చేసిన గాయాన్ని మాన్పడానికీ, సర్దార్ పటేల్ వారసత్వాన్ని స్మరించుకోవడానికీ తెలంగాణ ప్రజలకు ఇది మంచి అవకాశం. కె. రామచంద్రమూర్తి -
సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి ఫైర్
- ప్రజల స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారన్న సాధ్వి నిరంజన్ జ్యోతి మేడ్చల్ : బీజేపీ జాతీయ నాయకురాలు, కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాడు వేల మంది ప్రాణత్యాగాలు చేయడం వల్లే హైదరాబాద్ రాష్ట్రం నిజాం పరిపాలన నుంచి విముక్తి పొందిందని, అయితే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. సీఎం కేసీఆర్ తన రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా గుర్తించకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. తెలంగాణ బీజేపీ శాఖ చేపట్టిన ‘విమోచన యాత్ర’లో భాగంగా బుధవారం మేడ్చల్‌లో నిర్వహించిన బహిరంగ సభకు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి హాజరై ప్రసంగించారు. ‘‘1947లోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణకు స్వాతంత్య్రం రాలేదు. ఇక్కడి ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాలను గుర్తించిన సర్దార్ వల్లభాయ్‌పటేల్.. 1948, సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టారు. త్యాగాలకు నిలయమైన తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం శోచనీయం. సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని జరపాలని బీజేపీ ఎన్ని పోరాటాలు చేస్తున్నా పాలకులు స్పందించకపోవడం బాధాకరం’’ అని సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. చరిత్రను వక్రీకరిస్తున్న కేసీఆర్ : లక్ష్మణ్ త్యాగాలతో సాధించిన తెలంగాణ చరిత్రను ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వార్థం కోసం వక్రీకరిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. విమోచన యాత్రలో భాగంగా ఉదయం విలేకరుల సమావేశం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. విమోచన దినంపై కేసీఆర్ ఉద్యమ సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ విమోచన యాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిమజ్జనం చేయడం ఖాయమన్నారు. యాత్ర సాగిందిలా.... మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట్ గ్రామానికి మంగళవారం రాత్రి విమోచన యాత్ర చేరుకోగా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కార్యకర్తలతో కలిసి పట్టణంలోనే బస చేశారు. బుధవారం ఉదయం కంట్రీ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి అనంతరం పట్టణంలోని ప్రధాన వీధులు, జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించి వివేకానంద విగ్రహం వద్దనున్న సభా స్థలికి చేరుకున్నారు. మహిళలు బోనాలు, బతుకమ్మలు, గిరిజన నృత్యాలు చేశారు. అక్కడ బహిరంగ సభ అనంతరం యాత్ర కీసర వైపు పయనమైంది. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆచారి, జిల్లా అధ్యక్షుడు కాంతారావు, యాత్ర కన్వీనర్లు శ్రీవర్ధన్‌రెడ్డి, సుభాష్‌చందర్, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బిక్కు నాయక్, ఎమ్మెల్సీ రామచందర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, సత్యనారాయణ, రాష్ట్ర నాయకుడు విక్రంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'మేం వస్తే సెప్టెంబర్ 17 నిర్వహిస్తాం'
సిద్దిపేట: తెలంగాణ అమరులకు నిజమైన నివాళి ఇవ్వాలనుకుంటే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బైరాన్‌పల్లిలో తెలంగాణ విమోచన యాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. అమరుల త్యాగాలను కేసీఆర్ మజ్లిస్‌కు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. గతంలో రోశయ్యను నిలదీసిన కేసీఆర్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. -
వచ్చే ఎన్నికల్లో ఇదే మా అజెండా: బీజేపీ
హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు దీనికోసం తమ పార్టీ కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ సమావేశమయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 17న బహిరంగ సభ జరుపుతామని వెల్లడించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో పల్లె నుంచి ఉద్యమాలను నిర్మిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారని, అప్పుడు పదవులకు రాజీనామా చేయాలని మంత్రులను డిమాండ్ చేశారని కానీ, ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక విమోచన దినోత్సవాలు జరుపుకుంటుండగా అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ఎందుకు మాట మార్చిందని నిలదీశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యం.. వచ్చే ఎన్నికల్లో ఇదే అజెండాగా ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ పాపాలను కడుగుతున్న అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ తప్పిదాలను ఎందుకు కొనసాగిస్తున్నారన్నారు. ఇదంతా మజ్లిస్ పార్టీ మెప్పు, మచ్చిక కోసం పడే తాపత్రయమేనని తెలిపారు. రజాకార్ల మెప్పు కోసం సెప్టెంబర్ 17ను పక్కన పెట్టడం శోచనీయమన్నారు. సీఎం సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను చూసి ఆయన అభద్రతాభావంతో ఉన్నారని ఎద్దేవాచేశారు. -
అమిత్ షా సభ అందుకే: సురవరం
హైదరాబాద్: తెలంగాణ సాయుధ విప్లవ లక్ష్యాలు ఇంకా పూర్తికావాల్సి ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారుల విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. హిందువులు, ముస్లింల పేరుతో సమాజాన్ని చీల్చాలని బీజేపీ చూస్తోందని సురవరం విమర్శించారు. రజాకారులు సృష్టించిన మజ్లీస్ పార్టీ మాటను నమ్ముతూ.. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లు విమాచన దినోత్సవాన్ని జరపకపోవడం అన్యాయమని సురవరం అన్నారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగానే కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించారని సురవరం గుర్తు చేశారు. అయితే.. ఈ పోరాటాన్ని ముస్లిం రాజుకు, హిందూ ప్రజలకు మధ్య జరిగినదిగా బీజేపీ చిత్రీకరిస్తుందని, తమ భావజాలాన్నే అందరూ అంగీకరించాలనే మూర్ఖత్వంతో ఆ పార్టీ వ్యవహరిస్తుందని, అందుకే వరంగల్‌లో అమిత్ షా సభ నిర్వహిస్తున్నారని సురవరం విమర్శించారు. హిందువులు, ముస్లింల పేరుతో సమాజాన్ని చీల్చడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సురవరం అన్నారు. తెలంగాణ విమోచన ఉద్యమాన్ని భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా చేయాలన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన శక్తులతో నాటి భారత ప్రభుత్వం చర్చలు జరిపి ఉండాల్సింది అని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన తరువాత కొన్నిచోట్ల ముస్లింలపై దాడులు జరిగాయని, అయితే దానిని సాకుగా చూపుతూ విలీన దినం జరపకూడదని మజ్లీస్ అభ్యతరం పెడుతుందని సురవరం అన్నారు. -
'సెప్టెంబర్ 17' విమోచనమా? విలీనమా?
-
‘సెప్టెంబర్ 17’ని అధికారికంగా నిర్వహించాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి గజ్వేల్ రూరల్: నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది, ప్రజాస్వామ్య హక్కులు సాధించుకున్న సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తియాత్ర శుక్రవారం నిజామాబాద్ నుంచి తూప్రాన్ మీదుగా గజ్వేల్‌కు చేరుకుంది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను పూర్వ తెలంగాణ అయిన మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని గుర్తించని బీజేపీ తిరంగయాత్ర పేరుతో కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నిర్వహించనప్పుడు.. ఇప్పుడు మాట్లాడే అర్హత లేదన్నారు. మహిళలు, బీడీ కార్మికులు, యువకులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రగతిశీల వామపక్షలతో ఉద్యమాలు నిర్వహించేందుకు సీపీఐ సన్నద్ధమవుతోందన్నారు. 17న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఇన్చార్జి పశ్య పద్మ మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ భూ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అంతకుముందు సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బట్టు దయానందరెడ్డి, మంద పవన్ ఆధ్వర్యంలో తూప్రాన్-చేగుంట రోడ్డు నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సీపీఐ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు ఎంకె.మోహినొద్దీన్, కె. సురేందర్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డికి పూలమాలలు వేసి సత్కరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు యాదవ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు, గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అంజయ్య యాదవ్, మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు జ్యోతి, కార్యదర్శి సృజన, ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పల్లె నర్సింహ, కార్యదర్శి లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌తో పాటు సీపీఐ నాయకులు, కార్మికులు, మహిళలు, అసంఘటితరంగ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
'ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనడం అవివేకం'
- టీఆర్ఎస్ తీరుపై దత్తాత్రేయ ఆగ్రహం సాక్షి, న్యూఢిల్లీ సెప్టెంబరు 17ను విమోదన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అడిగితే మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనడం అవివేకమని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ వర్కర్స్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిర్వహిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి అభ్యంతరం ఏమిటి? మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి, ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించడం లేదు. కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, షోయబుల్లాఖాన్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. వారందరినీ స్మరించుకోవాలి..’ అని పేర్కొన్నారు. మూడేళ్లలో కోటి మంది కార్మికులకు శిక్షణ ఇస్తామని, కార్మిక శాఖ పథకాలపై వారిలో చైతన్యం పెంచుతామని తెలిపారు. అసంఘటిత కార్మికులకు బోనస్ పెంచామని వివరించారు. -
‘విమోచన’పై దూకుడు పెంచిన బీజేపీ
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌కు పదును సాక్షి,హైదరాబాద్: సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరపాలన్న డిమాండ్‌పై రాష్ట్ర బీజేపీ దూకుడును మరింతగా పెంచుతోంది. హైదరాబాద్ స్టేట్ విమోచన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో కొంత కాలంగా బీజేపీ వివిధరూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు సమీపిస్తుండడంతో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల స్వరాన్ని, సవాళ్ల పర్వాన్ని ఒక్కసారిగా పెంచింది. తిరంగా యాత్ర పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. గతంలో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేసి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాట మరువడాన్ని ప్రజల్లో ఎత్తిచూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. రాజకీయంగా కూడా పార్టీ రాష్ట్రంలో బలపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందనే నమ్మకంతో బీజేపీ నాయకత్వం ఉంది. సెప్టెంబర్ 17న వరంగ ల్లో నిర్వహించనున్న బహిరంగసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొంటారు. ప్రభుత్వమే టార్గెట్‌గా కార్యక్రమాలు... హైదరాబాద్ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి, సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ర్టవ్యాప్తంగా, ము ఖ్యంగా నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగిన ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. 1948 సెప్టెంబర్ 17న జరిగింది విలీనమా, విమోచనమా, విద్రోహమా అన్న దానితో సంబంధం లేకుండా ఈ ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని బీజేపీ అంటోంది. నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రాంతాలు, చరిత్రలో స్థానం సంపాదించుకున్న ఘటనలు, వ్యక్తులను గుర్తుచేసుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల గురించి పార్టీపరంగా ప్రచారం చేసేందుకు మహిళా మోర్చా, మైనారిటీ మోర్చా, ఎస్సీ, ఎస్టీ, యువజన మోర్చాలను రంగంలోకి దింపింది. -
'సెప్టెంబర్ 17' విమోచనమా? విలీనమా?
హైదరాబాద్: 'నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ లో కలిసిపోవడం గొప్ప పరిణామమే. అయితే 17 తర్వాతి రోజుల్లో అమాయక ముస్లింలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఇప్పుడు మనం సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకొంటే కొందరిని బాధపెట్టినవాళ్లమవుతాం. అసలు జరుపుకోకుండా ఉంటే చరిత్రను మరిచిపోయినట్లే లెక్క. అందుకే సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటించాలని కోరుకుంటున్నాం' అని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరామ్ ఈ మేరకు జేఏసీ అభిప్రాయన్ని వ్యక్తపరిచారు. కాగా, బీజేపీకి చెందిన వక్తలు మాత్రం.. నిజాం పాలనకు ఫుల్ స్టాప్ పడిన సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచన దినమే అని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కేంద్ర మంత్రి దత్తాత్రేయ చొరవతీసుకోవాలని కోరారు. అయితే ఈ విషయంలో జేఏసీ ఉద్యమాన్ని చేపట్టబోదని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జస్టిస్ నర్సింహారెడ్డి, సినీకవి సుద్దాల అశోక్ తేజ, పలువురు సామాజికవేత్తలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
చరిత్రను దాచలేం..
సెప్టెంబర్ 17ను రాజకీయ కోణంలో చూడొద్దు నాటి వీరోచిత పోరాట గాథలు భావి తరాలకు తెలియాలి కేసీఆర్ కూడా ఉమ్మడి పాలకుల వైఖరినే అనుసరిస్తున్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హన్మకొండ: సెప్టెంబర్ 17ను రాజకీయ కోణంలో చూడొద్దని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చరిత్రను కాదనలేము.. దాచలేమని అన్నారు. నాటి వీరోచిత పోరాటాలు, గాథలు భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిజాం పాలనలో జరిగిన ఘోరాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా కుల, మత, భాష, సాంప్రదాయాలకు అతీతంగా ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. ఈ క్రమంలో కొమురం భీం, వందేమాతరం రాంచందర్‌రావు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షోయబుల్లాఖాన్ వంటి ఎందరో అశువులు బాశారని చెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారంతా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారని తెలిపారు. ఆ రోజున టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగుర వేస్తున్న నాయకులు.. అధికారికంగా చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల్లాగే ప్రస్తుత సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను, చరిత్రను గౌరవించాలని సూచించారు. నిజాంపై సైనిక చర్యను వ్యతిరేకించి కమ్యూనిస్టులు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని దత్తాత్రేయ ఆరోపించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా అధికారికంగా నిర్వహించాలని కోరితే కొందరు నాయకులు దీనికి మతం రంగు పులుముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ యాత్ర తెలంగాణలో ఈ నెల 17న ముగుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా హన్మకొండలో జరిగే ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అమిత్‌షా పర్యటన పై రూపొందించిన పాటల క్యాసెట్, పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. పాటల సీడీని రూపొందించిన నాగపురి రాజమౌళిని సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, నాయకులు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, రావు పద్మ, డాక్టర్ విజయలక్ష్మి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, ఒంటేరు జయపాల్, నాగపురి రాజమౌళి, వంగాల సమ్మిరెడ్డి, బన్న ప్రభాకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, శ్రీరాముల మురళీమనోహర్, లక్ష్మణ్‌నాయక్, గుజ్జ సత్యనారాయణ రావు, సురేష్, రఘునారెడ్డి పాల్గొన్నారు. బహిరంగ సభ ప్రచార రథాలు ప్రారంభం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొననున్న బహిరంగ సభ విజయవంతానికి ఆ పార్టీ అనేక రూపాల్లో ముందుకు పోతోంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్, పార్టీ శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రులు సాద్వి నిరంజన్, బండారు దత్తాత్రేయ డివిజన్ స్థాయిలో నిర్వహించిన తిరంగయాత్ర సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా పాల్గొననున్న బహిరంగ సభపై విస్తృత ప్రచారం చేయడానికి రూపొందించిన 14 ప్రచార రథాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దత్తాత్రేయ ప్రారంభించారు. అంతకు ముందు ఇదే స్టేడియంలో జరుగనున్న బహిరంగ సభ వేదికకూ భూమి పూజ చేసి చేశారు. -
లేదంటే టీఆర్ఎస్కు కాంగ్రెస్ గతే: డాక్టర్ లక్ష్మణ్
అధికారికంగా ‘సెప్టెంబర్ 17’ ఉత్సవాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిన సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించకుంటే టీఆర్ఎస్ సర్కార్‌కు, సీఎం కేసీఆర్‌కు అధికారంలో కొనసాగే నైతికహక్కు ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17 ఉత్సవాలను నిర్వహించకుంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే టీఆర్ఎస్కు కూడా పడుతుందన్నారు. తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులను కించపరిచే విధంగా మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత మాట్లాడుతున్నారని, దీనిపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. చీము నెత్తురు ఉంటే రాజీనామా చేసి బయటకు రావాలని సమైక్య రాష్ర్టంలో అప్పటి తెలంగాణ మంత్రులను డిమాండ్ చేసిన విషయం కేసీఆర్ మరిచిపోయారా అని ప్రశ్నించా రు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో కేసీఆర్ వీడియో ప్రసంగాల క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. శనివారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో నిర్వహించే చాకలి ఐలమ్మ వర్ధంతికి కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్‌జ్యోతి హాజరవుతారని లక్ష్మణ్ తెలిపారు. -
కేంద్రమే ఉత్తర్వులివ్వాలి
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంపై సుద్దాల అశోక్‌తేజ సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని సినీరచయిత సుద్దాల అశోక్‌తేజ సూచించారు. ఒక దసరా, ఒక సంక్రాంతి లాగా నరకాసుర వధ అనంతరం కొత్త దీపావళి మాదిరిగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ మీడియా సెల్ నిర్వహించిన ‘తెలంగాణ విమోచనదినం జ్ఞాపకాలు’ సదస్సులో ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నవారు, ఆయా కుటుంబాలకు చెందిన వారు తమ అనుభవాలు పంచుకున్నారు. ఇందులో అశోక్‌తేజ పాల్గొన్నారు. నిజాం పాలనలోనే చైన్ స్నాచింగ్‌లు జరిగాయని, విలీనం రోజు నిజాం నివాసం నుంచి లారీల నిండా మహిళల పుస్తెలు, మట్టెలు తరలి వెళ్లాయని కసిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఒకవైపు కొమురంభీమ్, మరోవైపు నిజాంలను కీర్తిం చడం టీఆర్ఎస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అ న్నారు. నాటి పోరాటంలో కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డికొమురయ్య వంటి వారిని స్మరించుకోవడం కూడా రాజకీయం చేస్తున్నవారికి తెలంగాణ సమాజమే సరైన సమాధానం చెబుతుందన్నారు. బీజేపీ కార్యక్రమాలు హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి కాదని సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డి చెప్పారు. నీతిలేని నిజాంకు మద్దతు తెలిపిన కేసీఆర్‌కు కూడా నీతి లేద ని సీనియర్‌నేత పేరాల చంద్రశేఖర్‌రావు అన్నారు. వెల్చాల కొండలరావు తదిత రులు పాల్గొన్నారు. -
'తెలంగాణ విమోచన దినం నిర్వహించాల్సిందే'
కేసీఆర్, ఎంఐఎం కుమ్మకైయ్యారు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు చింతల్: కేసీఆర్,ఎంఐఎం కుమ్మకై తెలంగాణ విమోచన దినోత్సవంపై మాట మార్చారని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు నందనం దివాకర్ ఆధ్వర్యంలో మంగళవారం కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన తిరంగా యాత్ర కార్యక్రమానికి మురళీధర్‌రావు ముఖ్య అతిధిగా హజరైయ్యారు. అనంతరం మురళీధర్‌రావు మాట్లాడుతూ... భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు నిండిన సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు మేరకు ఈ తిరంగాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన నెల రోజులకు తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని చెప్పిన ఆయన... రాష్ట్రం ఏర్పడిన తరువాత మాటమార్చారని విమర్శించారు. భారత్ మాతా కీ జై అనని వారితో జతకట్టి తెలంగాణ వారికే కాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా తిరంగా జెండా ర్యాలీ నిర్వహించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 17న కేసీఆర్ ప్రభుత్వం తరపున తిరంగాయాత్ర నిర్వహించి విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. తిరంగాయాత్ర ఒక్క బీజేపీది కాదని, ఇది ప్రతి ఒక్క భారతీయునిదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తిరంగాయాత్ర కార్యక్రమాన్ని గల్లీగల్లీకి వ్యాపింపజేసి భారత్ మాతా కీ జై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మురళీధరరావు వెల్లడించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ నందనం సత్యంను మురళీధరరావు సన్మానించారు. రంగారెడ్డినగర్ శివాజీ విగ్రహం నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌వైఎస్‌ఏ జాతీయ తేరాల చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మీసాల చంద్రయ్య, బిజేవైఎం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రంగా శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు భరతసింహరెడ్డి, శంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'సమాజాన్ని విడగొట్టడానికి మేం వ్యతిరేకం'
కరీంనగర్: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ఉత్సవాలు జరపాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోరడం సరికాదని ఎంపీ కవిత అన్నారు. సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటిస్తున్న విషయాన్ని వెంకయ్యనాయుడు మర్చిపోయినట్టున్నారని కవిత తెలిపారు. హిందూ, ముస్లింల సఖ్యత దెబ్బతీసేందుకే...బీజేపీ విమోచన దినం పాటించాలని కోరుతుందని మండిపడ్డారు. తెలంగాణ సమాజాన్ని విడగొట్టడానికి తాము వ్యతిరేకమన్నారు. గద్వాల జిల్లా కోసం డీకే అరుణ చేస్తున్న ఆందోళనను విరమించాలని కవిత సూచించారు. కొత్త జిల్లాల డిమాండ్‌ను కేసీఆర్ చూస్తున్నారని కవిత చెప్పారు. -
నెలాఖరు నుంచి అసెంబ్లీ
* లేదా సెప్టెంబర్ 17 నుంచి సమావేశాలు * గణేశ్ నవరాత్రుల దృష్ట్యా సర్కారు మల్లగుల్లాలు సాక్షి, హైదరాబాద్: గణేశ్ నవరాత్రుల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెల 30 నుంచి లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించేందుకు వీలైనంత త్వరగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు సన్నాహాలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఏపీ కంటే ముందే జీఎస్టీ బిల్లును ఆమోదించి పంపేందుకు వీలుగా ఈ నెలాఖరునే సమావేశాలు ప్రారంభించాలనే ప్రతిపాదన వచ్చింది. కేవలం మూడు రోజుల పాటు సమావేశాలు జరిపి, తొలి రోజునే జీఎస్టీ బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. మరోవైపు గణేశ్ నవరాత్రుల దృష్యా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ఇబ్బందులు తలెత్తకుండా... నిమజ్జనోత్సవం ముగిశాక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయాన్ని కూడా సర్కారు పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి పోలీసు విభాగం నుంచి అందిన సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ నెల 30వ తేదీ నుంచిగానీ లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచిగానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తీసుకునే తుది నిర్ణయం మేరకు తేదీ ఖరారవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సెప్టెంబర్ తొలివారంలో బిల్లును ఆమోదించి పంపిస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు సమాచారమిచ్చాయి. జీఎస్టీ బిల్లుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వీలైనంత తొందరగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ శాసనసభ సమావేశాల్లోనే దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లు, ఎస్టీ, మైనారిటీల స్థితిగతులపై సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ ఇచ్చిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
నెలాఖరు నుంచి అసెంబ్లీ
-
సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే
-
'టీఆర్ఎస్ వెన్నుపోటు పోడిచింది'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి, ఆత్మగౌరవానికి, నిజాం వ్యతిరేక పోరాటానికి టీఆరెఎస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు. .ప్రభుత్వ పరంగా సెప్టెంబర్ 17 వేడుకలు జరపాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజాం ప్రత్యేక దేశం కోరుకున్నాడని, సర్దార్ పటేల్ రూపంలో పాత హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ అన్నారు. రజాకారుల దురాగతాలు అంతమైన రోజును అవతరణ దినోత్సవంగా జరిపితే సబబుగా ఉంటుందని చెప్పారు. మరోపక్క మజ్లిస్ మెప్పుకోసం, రజాకారుల వారసుల కోసం సెప్టెంబర్ 17ను చేయకపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘విమోచనం’.. ఉద్రిక్తం
హన్మకొండ: తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెం బర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చే స్తూ బీజేపీ వరంగల్‌లో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి, జాతీయ జెండా ఎగురవేత ఉద్రిక్తంగా మారింది. తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సారథ్యంలో హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద సమావేశం జరిగింది. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరారు. పోలీసు వలయాన్ని చేధించుకొని బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్ వైపునకు పరుగులు తీశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. కిషన్‌రెడ్డి, ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యక్తలు అడ్డగించారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై నాయకులను వదిలేశారు. కాగా, నైజాం పాలన నుంచి విమోచనం పొందిన సెప్టెం బర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి తెలంగాణ జేఏసీ మరో ఉద్యమం చేయాల్సిన అవసరముందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. -
విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
రంగారెడ్డి : తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ నినాదాన్ని గతంలో వినిపించి ప్రభుత్వంపై ఉద్యమించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నోరు మెదపకపోవడాన్ని తప్పుబట్టింది. అమరుల త్యాగాల ఫలితంగా నిజాం నిరంకుశపాలన నుంచి తెలంగాణకు విమోచనం కలిగిందని, దీంతో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరింది. మైనార్టీ ఓట్ల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అమరుల త్యాగాలనే తాకట్టు పెడుతోందని విమర్శించింది. ఈమేరకు ఆదివారం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కొప్పు బాష ఒక ప్రకటన విడుదల చేశారు. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 26న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు చేపట్టాలని, ప్రజలకు విమోచన దిన ఆవశ్యకతను వివరించాలని ఆయన సూచించారు. -
అధికారికంగా ‘తెలంగాణ విమోచన’
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ సిద్దిపేట జోన్: తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అందుకోసం పట్టుబడుతామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం ఎంఐఎంతో కుమ్మక్కయి విమోచన దినోత్సవాన్ని నిర్లక్ష్యం చేస్తుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ గతంలో మాట్లాడిన సీడీలు, పేపర్ కట్టింగ్లతో రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేస్తామని, కలెక్టరేట్లను దిగ్బంధిస్తామన్నారు. మరోవైపు అన్ని గ్రామాల సర్పంచ్‌లకు లేఖలు రాయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న హెదరాబాద్లో రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుందని, 16న పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
'సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎందుకు జరపలేదు'
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినంగా నిర్వహించకపోవడం పట్ల కేసీఆర్ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో చాడ వెంకట్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... విమోచన దినం నిర్వహించక పోవడానికి గల కారణాలేంటో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, భూ పంపిణీలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మెట్రో రైటు ప్రాజెక్టు తర్వగా పూర్తి చేయాలని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. -
సెప్టెంబర్ 17 అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 17 అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విలీన దినోత్సవంగా ప్రకటించాలని సూచించారు. బీజేపీ, ఎంఐఎం దీనికి మతం రంగు పులుముతున్నాయని సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం లొంగకూడదని అన్నారు. -
సెప్టెంబర్ 17
-
మత కోణంలో చూడొద్దు: కోదండరాం
-
మత కోణంలో చూడొద్దు: కోదండరాం
హైదరాబాద్: సెప్టెంబర్ 17ను విలీనదినంగా జరుపుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం తమ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, ప్రభుత్వం ప్రకటన చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. రేపు విలీన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా జరపాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. విలీనదినాన్ని మత కోణంలో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విలీనదినాన్ని అధికారికంగా జరపాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాము రేపు గోల్కొండలో జాతీయ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఎంఐఎం ఒత్తిడితోనే విలీన దినోత్సవాన్ని నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకాడుతోందని ఆయన ఆరోపించారు. -
చరిత్రను కాలగర్భంలో కలిపే ప్రయత్నమిది!
-
''సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం''