సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి ఫైర్
- ప్రజల స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారన్న సాధ్వి నిరంజన్ జ్యోతి
మేడ్చల్ : బీజేపీ జాతీయ నాయకురాలు, కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాడు వేల మంది ప్రాణత్యాగాలు చేయడం వల్లే హైదరాబాద్ రాష్ట్రం నిజాం పరిపాలన నుంచి విముక్తి పొందిందని, అయితే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. సీఎం కేసీఆర్ తన రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా గుర్తించకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు.
తెలంగాణ బీజేపీ శాఖ చేపట్టిన ‘విమోచన యాత్ర’లో భాగంగా బుధవారం మేడ్చల్‌లో నిర్వహించిన బహిరంగ సభకు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి హాజరై ప్రసంగించారు. ‘‘1947లోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణకు స్వాతంత్య్రం రాలేదు. ఇక్కడి ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాలను గుర్తించిన సర్దార్ వల్లభాయ్‌పటేల్.. 1948, సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టారు. త్యాగాలకు నిలయమైన తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం శోచనీయం. సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని జరపాలని బీజేపీ ఎన్ని పోరాటాలు చేస్తున్నా పాలకులు స్పందించకపోవడం బాధాకరం’’ అని సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు.
చరిత్రను వక్రీకరిస్తున్న కేసీఆర్ : లక్ష్మణ్
త్యాగాలతో సాధించిన తెలంగాణ చరిత్రను ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వార్థం కోసం వక్రీకరిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. విమోచన యాత్రలో భాగంగా ఉదయం విలేకరుల సమావేశం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. విమోచన దినంపై కేసీఆర్ ఉద్యమ సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ విమోచన యాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిమజ్జనం చేయడం ఖాయమన్నారు.
యాత్ర సాగిందిలా....
మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట్ గ్రామానికి మంగళవారం రాత్రి విమోచన యాత్ర చేరుకోగా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కార్యకర్తలతో కలిసి పట్టణంలోనే బస చేశారు. బుధవారం ఉదయం కంట్రీ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి అనంతరం పట్టణంలోని ప్రధాన వీధులు, జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించి వివేకానంద విగ్రహం వద్దనున్న సభా స్థలికి చేరుకున్నారు. మహిళలు బోనాలు, బతుకమ్మలు, గిరిజన నృత్యాలు చేశారు. అక్కడ బహిరంగ సభ అనంతరం యాత్ర కీసర వైపు పయనమైంది. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆచారి, జిల్లా అధ్యక్షుడు కాంతారావు, యాత్ర కన్వీనర్‌లు శ్రీవర్ధన్‌రెడ్డి, సుభాష్‌చందర్, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బిక్కు నాయక్, ఎమ్మెల్సీ రామచందర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, సత్యనారాయణ, రాష్ట్ర నాయకుడు విక్రంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.