ఆజాద్‌ హైదరాబాద్‌: సాయుధ పోరులో చేయి కలిపిన సింగరేణి | Kothagudem: Singareni workers Key Role In Azad Hyderabad | Sakshi
Sakshi News home page

ఆజాద్‌ హైదరాబాద్‌: సాయుధ పోరులో ‘సింగరేణి’ ఊర్లు.. గుర్రాలతో తొక్కించినా నోరువిప్పలేదు

Published Fri, Sep 16 2022 1:19 PM | Last Updated on Fri, Sep 16 2022 4:30 PM

Kothagudem: Singareni workers Key Role In Azad Hyderabad - Sakshi

దేశమంతా స్వాతంత్య్ర సంబురాలు జరుపుకొంటున్న వేళ... తెలంగాణ మాత్రం నిజాం రాజు ఏలుబడిలోనే కొనసాగింది. ఎందరో వీరుల పోరాట ఫలితంగా బ్రిటీష్‌ వాళ్లు దేశాన్ని వదిలి వెళ్లాక కూడా హైదరాబాద్‌ సంస్థానాదీశుడైన నిజాం ఆధ్వర్యాన రజాకారులు హైదరాబాద్‌ సంస్థానం పరిధిలో అరాచకాలు సాగించారు. కొంతకాలం పంటి బిగువున భరించిన ప్రజలు... దుర్మార్గాలు పెచ్చరిల్లడంతో తిరుగుబాటుకు దిగారు. యువత ఏకమై సాయుధపోరాటాలు సాగించి నిజాం సైన్యాలను తిప్పికొట్టింది. ఈ పోరాటంలో పలువురు అమరులైనా మిగతా వారు వెనక్కి తగ్గకుండా చేసిన పోరాటంతో తెలంగాణకు సైతం స్వాతంత్య్రం లభించింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట గాధలను స్థానికులు గుర్తు చేసుకుంటుంటారు. ఆనాటి అమరులకు గుర్తుగా నిర్మించిన స్థూపాలు సాక్షిగా నిలుస్తున్నాయి. ఈమేరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పలు గ్రామాలపై కథనాలు.. 

ఈటెలతో తిరగబడిన మీనవోలు
ఎర్రుపాలెం :
తెలంగాణ సంస్థానాన్ని ఏలుతున్న నైజాం పాలనను వ్యతిరేకిస్తూ చేపట్టిన సాయుధ పోరాటంలో ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయ్యారు. పోరాటాల పురిటిగడ్డగా మీనవోలు గ్రామం చరిత్ర పుటలకెక్కింది. ఎర్రుపాలెం మండల కేంద్రంలో నైజాంలు అప్పట్లో పోలీస్‌ క్యాంపు నిర్వహించేవారు. అందులో బ్రిటీష్‌ ప్రభుత్వ అధికారి లెఫ్టినెంట్‌ సార్జంట్‌ తరచూ మీనవోలు గ్రామంపై దాడులు చేసి ప్రజల సొమ్మును అపహరించేవాడు. సార్జంట్‌ తీరుకు తోడు రజాకారులు కూడా ప్రజలను చిత్రహింసలు పెడుతుండగా... 1948 సంవత్సరం జనవరి 15న గ్రామస్తులంతా మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఈక్రమంలో సార్జంట్‌ తన బలగాలే కాకుండా రజాకార్లతో కలిసి మీనవోలుకు వస్తున్నాడన్న సమాచారంతో గ్రామస్తులు ఈటెలతో దండెత్తారు.

ప్రజల తిరుగుబాటును ఊహించని సార్జంట్‌ అప్పటికప్పుడు విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరపగా రాంపల్లి రామయ్య, సుఖబోగి ముత్తయ్య, తోట బాలయ్య, పిల్లి కాటయ్య, బండి వీరయ్య, మెట్టెల శ్రీరాములు, తోట వెంకయ్య ప్రాణాలు కోల్పోయారు. అయినా కోపం చల్లారని సార్జెంట్‌.. నైజాం నవాబు సాయంతో రజాకార్లను రైలులో రప్పించి పలువురి ఇళ్లను తగలబెట్టారు. అలా పరిస్థితి విషమించడంతో పలువురు గ్రామస్తులు మీనవోలు విడిచివెళ్లారు. అనంతర కాలంలో పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ గ్రామాలకు చేరుకున్నారు. కాగా, రజాకార్లను ఎదురొడ్డి పోరాడి అమరులైన వారికి గుర్తుగా గ్రామస్తులు 1958 సంవత్సరం సెప్టెంబర్‌ 15వ తేదీన స్థూపాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఈ స్థూపం శిథిలం కావడంతో మరమ్మత్తులు చేయించడంతో పాటు అదే రీతిలో ప్రధాన రహదారిపై మరో స్థూపాన్ని నిర్మించారు. 

గుర్రాలతో తొక్కించినా నోరువిప్పని పోరాటపటిమ 
కొణిజర్ల : నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో యువకులు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడగా... అందులో కొణిజర్ల మండలంలోని తనికెళ్లకూ స్థానముంది. తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, గడల రామకృష్ణయ్య, గడల సుబ్బయ్య, గడల నర్సయ్య తుళ్లూరి అప్పయ్య, కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య తాళ్లపల్లి రాములు ఆనాడు మల్లెల వెంకటేశ్వరరావు దళంలో పనిచేశారు. నాటి సాయుధ పోరాటంలో నల్లమల వెంకటేశ్వరరావు, షేక్‌ రజబ్‌అలీ నేతృత్వంలో తుపాకులు చేతబట్టి కదన రంగంలో కాలుమోపి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు.

దళంలో పనిచేసిన వీరికి ఇదే గ్రామానికి చెందిన గడల ముత్తయ్య, పేరసాని అప్పయ్య, యాసా వెంకటలాలయ్య, పిన్నం సత్యం, యాసా మాణిక్యమ్మ సాయం చేసేవారు. ఓ సమయాన రజాకార్లు గ్రామాలపై విచక్షణారహితంగా దాడి జరిపి మహిళలు, చిన్నారులను చిత్రహింసలకు గురిచేయడమే కాక పురుషులను పట్టుకుని జైలులో పెట్టారు. అందులో పలువురిని కాల్చి చంపడం ద్వారా గ్రామస్తులకు భయాందోళనకు గురిచేసేవారని చెబుతారు. ఆ సమయాన గడల సీతారామయ్య ఆచూకీ తెలపమని రజాకార్లు గుర్రాలతో తొక్కించినా గ్రామస్తులెవరూ నోరు విప్పలేదట! నాటి తెలంగాణ సాయుధ పోరాట ఆద్యుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పలువురు పోరాటంలో పాల్గొనగా, గ్రామానికి చెందిన యాసా మాణిక్యమ్మ అడవుల్లో తలదాచుకుంటున్న పోరాటవీరులకు భోజనం సమకూర్చేది. ఆమెను గుర్తించి రజాకార్లు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టినా ఎవరి వివరాలు తెలియనివ్వలేదు.

మండలంలోని లాలాపురానికి చెందిన సంక్రాంతి రామనర్సయ్య గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలో ఆరికాయలపాడు దళం ఆర్గనైజర్‌గా పనిచేశారు. 1945 ప్రాంతంలో సింగరాయపాలెం జాగీర్దార్, నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటం నిర్వహించాడు. వివాహమైన ఏడాదికే దళంలో చేరిన రామనర్సయ్య చేసిన పోరాట పటిమను తట్టుకోలేని నిజాం ప్రభుత్వం 1947లో ఆయనతో పాటు మరికొందనిని గుబ్బగుర్తి అడవుల్లో పట్టుకుంది. ఆతర్వాత మున్నేరువాగు వద్దకు తీసుకెళ్లి ఎవరి గోతులు వారినే తవ్వుకోమని చెప్పి కాల్చి చంపి పూడ్చి పెట్టారు. ఆయన స్ఫూర్తితోనే రామనర్సయ్య సోదరుడు సంక్రాంతి మధుసూదన్‌రావు కమ్యూనిస్టు నాయకుడిగా కొనసాగుతున్నారు.  

పోరాటాల గడ్డ మేదేపల్లి
ఏన్కూరు :
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏన్కూరు మండలం మేడేపల్లి గ్రామస్తులు ఎందరో రజాకార్లను ఎదురొడ్డి పోరాటం చేశారు. తద్వారా పోరాటాల గడ్డగా మేడేపల్లి చరిత్రకెక్కింది. మేడేపల్లి గ్రామంలో గిరిజనులు రజాకార్లను ఎదిరించి పోరాటాలు చేశారు. తాటి సీతమ్మ, తాటి సత్యం, ముక్తి ఎర్రయ్య, బండ్ల పెద్ద జోగయ్య, ముక్తి రాములు తుపాకులు పట్టి అడవుల్లో తలదాచుకుంటూ రజాకార్లను తుదముట్టించారు. నల్లమల గిరిప్రసాద్‌ నాయకత్వంలో వీరు పోరాటం చేసినట్లు చెబుతారు. తాటి సీతమ్మ, తాటి సత్యంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్మృతిచిహ్నాలుగా గ్రామంలో స్థూపాలను ఏర్పాటుచేశారు. 

పోలీస్‌ చర్య తర్వాతా యుద్ధమే.. 
సత్తుపల్లి :
సత్తుపల్లి నుంచి పది కి.మీ. దూరంలో ఉన్న ఆంధ్రా ప్రాంతంలోని గురుభట్లగూడెం, కృష్ణారావుపాలెం తదితర ప్రాంతాలపై రజాకార్ల నిర్బంధం కొనసాగేది. ఆ సమయంలో దమ్మపేట మండలం జమేదారుబంజరు ప్రాంతం నుంచి సోయం గంగులు నాయకత్వంలో సాయుధ పోరాటం మొదలైంది. ఆయనకు మద్దతుగా గిరిజనులు, గిరిజనేతరులు రజాకారులపై గెరిల్లా దాడులు పాల్పడుతుండేవారు. అనంతర కాలంలో పోలీసు చర్యతో తెలంగాణకు విముక్తి లభించింది. అయినప్పటికీ 
ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు – భారత మిలటరీకి 1948 నుంచి 1950 వరకు రెండేళ్ల పాటు హోరాహోరీ పోరు నడిచింది. గ్రామాల్లోకి భారత సైన్యం వస్తుంటే కమ్యూనిస్టులు సాయుధులై తిరుగుబాటు చేసేవారు. క్షేత్ర స్థాయిలో పరిపాలనను అందించేందుకు ఆ సమయానభారత మిలటరీకి మద్దతుగా గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటయ్యాయి.

ఈ దళాల్లోని సభ్యులకు తుపాకీతో శిక్షణ ఇచ్చేవారు. వీరు ఉదయమంతా గ్రామాల్లో గస్తీ తిరగటం.. చీకటిపడే సమయానికి సత్తుపల్లి పాత సెంటర్‌లోని జెండా చింతచెట్టు వద్ద సమావేశ కావటం జరుగుతుండేది. భారత మిలటరీని మలబార్‌ రెజిమెంట్‌ ఆధ్వర్యంలో రక్షణ దళం ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులను హోంగార్డులుగా కూడా వ్యవహరించేవారు. ఇందులోభాగంగా 1948లో సత్తుపల్లి గ్రామ రక్షణ దళం ఏర్పాటు కాగా.. చల్లగుళ్ల సీతారామయ్య, నరుకుళ్ల వెంకయ్య, దిరిశాల సత్యం, మట్టా రామయ్య, చల్లగుండ్ల వీరయ్య, మట్టా వెంకయ్య, మొరిశెట్టి సత్యం, నరుకుళ్ల రామయ్య, పల్లబోతు నాగభూషణం, కొత్తూరు సుబ్బారావు, సీతారామయ్య, మహాదేవ రామలింగం, వల్లభనేని సకలయ్య తదితరులు సభ్యులుగా ఉండే వారని పెద్దలు చెబుతుంటారు. 

నాకు గర్వంగా ఉంటుంది.. 
18 ఏళ్ల వయస్సులో మా నాన్న చల్లగుళ్ల వీరయ్య సత్తుపల్లి గ్రామ రక్షణ దళంలో పని చేశారు. కమ్యూనిస్టు సాయుధ పోరాటం విరమించే వరకు రక్షణ దళం భారత మిలటరీ మద్దతుతో పని చేసేదని మానాన్న చెప్పేవారు. సత్తుపల్లి చరిత్రలో మా కుటుంబం పేరు కూడా ఉండటం నాకు గర్వకారణంగా ఉంది.
– చల్లగుళ్ల నర్సింహారావు, సత్తుపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement