సాక్షి, హైదరాబాద్: నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలు ఓ వైపు.. జమీందార్ల దుర్మార్గాలు మరోవైపు.. దారుణమైన బతుకుల నుంచి బయటపడేందుకు పుట్టిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. 1946 సెప్టెంబర్ 11న మొదలై 1951 అక్టోబర్ 21 దాకా ఐదేళ్లకుపైగా సాయుధ ఉద్యమం కొనసాగింది. ప్రపంచ చరిత్రలోని గొప్ప పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. 1946లో చాకలి ఐలమ్మ సాగుభూమి మీద జమీందారు విసునూరు రాంచంద్రారెడ్డి కన్ను పడింది. ఆ భూమిని, పంటను స్వాధీనం చేసుకునేందుకు గూండాలను పంపాడు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్ల ప్రతాపరెడ్డి తదితరుల సహకారంతో ఐలమ్మ తిరగబడింది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి వంటి వారిని పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. అయితే ఐలమ్మ భూమిని, ధాన్యాన్ని భూస్వాములు స్వాధీనం చేసుకోలేక పోయారు. దీంతో ఆవేశం పట్టలేక కడివెండి గ్రామ నాయకులను హత్య చేయాలని పథకం వేశారు.
1946 జూలై 4న దేశ్‌ముఖ్ మనుషులు గ్రామ నాయకుల ఇళ్ల మీద రాళ్లు వేయడంతో.. ప్రజలు లాఠీలు, వడిసెలు చేత బట్టుకుని ప్రదర్శనగా బయలు దేరారు. ఈ ఊరేగింపు జమీందారు ఇంటి దగ్గరికి రాగానే.. జమీందారు మనుషులు కాల్పులు జరపడంతో గ్రామ నాయకుడు దొడ్డి కొమరయ్య బలయ్యాడు. ఈ విషయం దావానలంలా వ్యాపించి.. ఊరూరా జనం తిరుగుబాటు మొదలు పెట్టారు. ఆ ప్రతిఘటనను అణచి వేసేందుకు జమీందార్ల మనుషులు, రజాకార్లు, నిజాం పోలీసులు దాడులకు దిగారు. అయినా ప్రజలు తిరుగుబాటు ఆపలేదు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ 1946 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది.
పేదలకు 10 లక్షల ఎకరాలు పంపిణీ..
అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా మొదలైన సాయుధ ఉద్యమం భూపోరాటంగా మారి దున్నేవాడికే భూమి దక్కాలని నినదించింది. నిజాం రాచరికం, జమీందార్ల అరాచక పాలన మీద తిరుగుబాటుగా మారింది. భూమి కోసం, భుక్తి కోసమేగాక సామాజిక వివక్షపైనా పోరాటం జరిగింది. మూడు వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. భూస్వాములు, జమీందార్ల నుంచి పది లక్షల ఎకరాలకుపైగా భూమిని రైతులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తాకట్టులో ఉన్న భూములను విడి పించుకున్నారు. రుణపత్రాలను రద్దు చేసి.. పశువులను పంపిణీ చేశారు. ఈ పోరాటాల్లో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళలూ ముందు నిలిచారు.
4 వేల మంది వీర మరణంతో..
రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుండగానే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎన్నో సంస్థానాలు ఇండి యన్ యూనియన్‌లో విలీనమైనా.. నిజాం సంస్థానం మాత్రం ఒప్పుకోలేదు. దీనికి నాటి భారత ప్రభుత్వం అంగీకరించింది. నిజాం రాజుతో 1947 నవంబర్ 29న యథాతథ ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ తెలంగాణ ప్రజలు నిజాం పాలన అంతం కావాలని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని పోరాటాలు చేశారు. అందులో భాగంగా సాయు ధ పోరాటం ఉధృతంగా కొనసాగింది. రజాకార్లు, నిజాం సైన్యాల దాడుల నుంచి రక్షణకోసం.. పదివేల మంది గ్రామదళ సభ్యులు, దాదాపు రెండు వేల గెరిల్లా దళ సభ్యులతో శక్తివంతమైన సాయుధ బలగాన్ని నిర్మించుకోగలిగారు. కానీ నిజాం పాలకులు, జమీందార్లు కలిసి.. నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, రైతులను హతమార్చారు. మరెన్నో వేల మందిని నిర్బంధ శిబిరాల్లో, జైళ్లలో బందీలను చేశారు. అయినా సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. ఈ పోరాటం తమ గెరిల్లా పోరాటం కంటే గొప్పదని క్యూబా ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం గమనార్హం.
విమోచన కాదు.. అది విలీన ఒప్పందం: మొయిన్
గోల్కొండ: అప్పటి హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా యూనియన్ ప్రభుత్వానికి, నిజాం చివరి పాలకుడికి మధ్య విలీన ఒప్పందం జరిగిందని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎంకే మొయిన్ అన్నారు. దీనిని కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించి విమోచన దినంగా చెబుతూ సంబరాలు జరుపుకోవడం సరికాదన్నారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లకు హిందూ జమీందారులైన దేశ్‌ముఖ్‌లు అండగా ఉండి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. అయితే ఈ సత్యాన్ని ఇప్పుడు కొందరు వక్రీకరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
భారతదేశంలో నిజాం సంస్థానం విలీనంపై అప్పటి ప్రధాని జవహర్‌లాల్ న్రెహూ ముద్ర స్పష్టంగా ఉందని, అయితే కొంతకాలంగా విలీన హీరోగా వల్లభాయ్ పటేల్‌ను చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిగా 1944 సంవత్సరంలో దారుల్ షిఫా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే తాను కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడినయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ విలీన సమయంలోనూ అజ్ఞాతంలోనే ఉన్నానని చెప్పారు. అటువంటి తనను సన్మానిస్తామని విమోచనోత్సవం నిర్వహిస్తున్న బీజేపీ పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు)
Comments
Please login to add a commentAdd a comment