
హిమాయత్‌నగర్: పసి వయసు నుంచి కసిగా నిజాం వ్యతిరేక, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగస్వామి అయిన వ్యక్తి ఆయన. అప్పుడాయన వయసు 13 ఏళ్లే. ఆయనే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి. స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం.
‘సెప్టెంబర్ 17’నేపథ్యంలో అప్పటి పోరాటంలో పాల్గొన్న ప్రతాప్‌రెడ్డి అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘స్వాతంత్య్రం వచ్చేనాటికి నాటికి నాకు సుమారుగా 13 ఏళ్లు. మా తండ్రి రంగారెడ్డి నన్ను నల్లగొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానానికి రాలేదంటూ చెలరేగిన ఉద్యమానికి బడులన్నీ మూతపడ్డాయి.
అనంతరం నేను ఓ వేపచెట్టు కింద విద్యార్థి నాయకులు, దళాలు చేపట్టిన సాయుధ పోరాట కార్యక్రమంలో తొలిసారిగా పాల్గొన్నాను. ఆ వేపచెట్టుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. గ్రామాల్లోకి వచ్చిన దళాలను రహస్య ప్రాంతాల్లో దాచేవాడిని. నన్ను కమ్యూనిస్టు పార్టీ బాలసంఘం సెక్రెటరీగా నియమించారు. కొరియర్‌గా ఇటు ప్రజలకు, అటు దళాలు, విద్యార్థి నాయకులకు దగ్గరగా ఉండేవాడిని. వీరితో పాటు ప్రజలకు నేనే సమాచార వారధిగా ఉండేవాడిని.
తుపాకీని ముట్టనిచ్చేవాళ్లు కాదు..
మా ఉద్యమాన్ని అణచివేసేందుకు రజాకార్లు గుర్రాలపై, జీపులపై గ్రామాల్లోకి చొరబడేవాళ్లు. రజాకార్లను ఎదుర్కొనేందుకు దళాలు కూడా ఊళ్లలోకి వచ్చేవి. తుపాకీని పట్టుకోవాలనే ఆశ నాకున్నప్పటికీ బాలుడిని కావడంతో దళసభ్యులు ముట్టనిచ్చేవాళ్లు కాదు. రజాకార్లను అడ్డుకునేందుకు తిప్పర్తి వంతెనను మూడు, నాలుగు గ్రామాలవాళ్లం కొంతవరకు కూల్చివేశాం. మేం కోదాడ, నల్లగొండ ప్రధాన రహదారులపై ఉన్న సమయంలో షోలాపూర్, కోదాడల మీదుగా పెద్దపెద్ద సైన్యాలు హైదరాబాద్ వైపు వెళ్లడాన్ని గమనించాం. ఈ సైన్యాలు వెళ్లిన మూడు రోజులకు, అంటే సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు నిజాం రాజు నుంచి వెలువడిన వార్త మా దాకా వచ్చింది. ఎంతో సంతోషంగా ఈ వార్తను ఒక కొరియర్‌లా తీసికెళ్లి పలు గ్రామాల్లో చెప్పాను.
Comments
Please login to add a commentAdd a comment