Razakars
-
సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేయనున్న ప్రభాస్!
హీరో ప్రభాస్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమాకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రజాకారుల ఉద్యమం నేపథ్యంలో సుకుమార్ ఓ కథను రెడీ చేశారని, ఈ కథలో ప్రభాస్ హీరోగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘రాజా డీలక్స్ ’(ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల తర్వాత ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేస్తారు. కాగా ‘స్పిరిట్’ షూటింగ్లో పాల్గొంటూనే, సుకుమార్ దర్శకత్వంలోని సినిమానూ సెట్స్‌పైకి తీసుకుని వెళ్తారట ప్రభాస్. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
అణచివేతపై సాయుధ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలు ఓ వైపు.. జమీందార్ల దుర్మార్గాలు మరోవైపు.. దారుణమైన బతుకుల నుంచి బయటపడేందుకు పుట్టిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. 1946 సెప్టెంబర్ 11న మొదలై 1951 అక్టోబర్ 21 దాకా ఐదేళ్లకుపైగా సాయుధ ఉద్యమం కొనసాగింది. ప్రపంచ చరిత్రలోని గొప్ప పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. 1946లో చాకలి ఐలమ్మ సాగుభూమి మీద జమీందారు విసునూరు రాంచంద్రారెడ్డి కన్ను పడింది. ఆ భూమిని, పంటను స్వాధీనం చేసుకునేందుకు గూండాలను పంపాడు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్ల ప్రతాపరెడ్డి తదితరుల సహకారంతో ఐలమ్మ తిరగబడింది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి వంటి వారిని పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. అయితే ఐలమ్మ భూమిని, ధాన్యాన్ని భూస్వాములు స్వాధీనం చేసుకోలేక పోయారు. దీంతో ఆవేశం పట్టలేక కడివెండి గ్రామ నాయకులను హత్య చేయాలని పథకం వేశారు. 1946 జూలై 4న దేశ్‌ముఖ్ మనుషులు గ్రామ నాయకుల ఇళ్ల మీద రాళ్లు వేయడంతో.. ప్రజలు లాఠీలు, వడిసెలు చేత బట్టుకుని ప్రదర్శనగా బయలు దేరారు. ఈ ఊరేగింపు జమీందారు ఇంటి దగ్గరికి రాగానే.. జమీందారు మనుషులు కాల్పులు జరపడంతో గ్రామ నాయకుడు దొడ్డి కొమరయ్య బలయ్యాడు. ఈ విషయం దావానలంలా వ్యాపించి.. ఊరూరా జనం తిరుగుబాటు మొదలు పెట్టారు. ఆ ప్రతిఘటనను అణచి వేసేందుకు జమీందార్ల మనుషులు, రజాకార్లు, నిజాం పోలీసులు దాడులకు దిగారు. అయినా ప్రజలు తిరుగుబాటు ఆపలేదు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ 1946 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. పేదలకు 10 లక్షల ఎకరాలు పంపిణీ.. అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా మొదలైన సాయుధ ఉద్యమం భూపోరాటంగా మారి దున్నేవాడికే భూమి దక్కాలని నినదించింది. నిజాం రాచరికం, జమీందార్ల అరాచక పాలన మీద తిరుగుబాటుగా మారింది. భూమి కోసం, భుక్తి కోసమేగాక సామాజిక వివక్షపైనా పోరాటం జరిగింది. మూడు వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. భూస్వాములు, జమీందార్ల నుంచి పది లక్షల ఎకరాలకుపైగా భూమిని రైతులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తాకట్టులో ఉన్న భూములను విడి పించుకున్నారు. రుణపత్రాలను రద్దు చేసి.. పశువులను పంపిణీ చేశారు. ఈ పోరాటాల్లో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళలూ ముందు నిలిచారు. 4 వేల మంది వీర మరణంతో.. రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుండగానే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎన్నో సంస్థానాలు ఇండి యన్ యూనియన్‌లో విలీనమైనా.. నిజాం సంస్థానం మాత్రం ఒప్పుకోలేదు. దీనికి నాటి భారత ప్రభుత్వం అంగీకరించింది. నిజాం రాజుతో 1947 నవంబర్ 29న యథాతథ ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ తెలంగాణ ప్రజలు నిజాం పాలన అంతం కావాలని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని పోరాటాలు చేశారు. అందులో భాగంగా సాయు ధ పోరాటం ఉధృతంగా కొనసాగింది. రజాకార్లు, నిజాం సైన్యాల దాడుల నుంచి రక్షణకోసం.. పదివేల మంది గ్రామదళ సభ్యులు, దాదాపు రెండు వేల గెరిల్లా దళ సభ్యులతో శక్తివంతమైన సాయుధ బలగాన్ని నిర్మించుకోగలిగారు. కానీ నిజాం పాలకులు, జమీందార్లు కలిసి.. నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, రైతులను హతమార్చారు. మరెన్నో వేల మందిని నిర్బంధ శిబిరాల్లో, జైళ్లలో బందీలను చేశారు. అయినా సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. ఈ పోరాటం తమ గెరిల్లా పోరాటం కంటే గొప్పదని క్యూబా ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం గమనార్హం. విమోచన కాదు.. అది విలీన ఒప్పందం: మొయిన్ గోల్కొండ: అప్పటి హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా యూనియన్ ప్రభుత్వానికి, నిజాం చివరి పాలకుడికి మధ్య విలీన ఒప్పందం జరిగిందని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎంకే మొయిన్ అన్నారు. దీనిని కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించి విమోచన దినంగా చెబుతూ సంబరాలు జరుపుకోవడం సరికాదన్నారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లకు హిందూ జమీందారులైన దేశ్‌ముఖ్‌లు అండగా ఉండి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. అయితే ఈ సత్యాన్ని ఇప్పుడు కొందరు వక్రీకరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో నిజాం సంస్థానం విలీనంపై అప్పటి ప్రధాని జవహర్లాల్ న్రెహూ ముద్ర స్పష్టంగా ఉందని, అయితే కొంతకాలంగా విలీన హీరోగా వల్లభాయ్ పటేల్‌ను చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిగా 1944 సంవత్సరంలో దారుల్ షిఫా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే తాను కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడినయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ విలీన సమయంలోనూ అజ్ఞాతంలోనే ఉన్నానని చెప్పారు. అటువంటి తనను సన్మానిస్తామని విమోచనోత్సవం నిర్వహిస్తున్న బీజేపీ పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు) -
Telangana Vimochana Dinotsavam: గంగాపూర్ ఘటనతో స్పీడ్ పెంచిన సర్దార్
భారత్‌లో విలీనం కావడం ముందు నుంచి నిజాంకు ఇష్టం లేదు. భారత స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే తాను భారత్‌లో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండే అవకాశం ఉందా అని నిజాం తన సలహాదారు సర్ వాల్టర్ మాంగ్టన్‌ను అడిగాడు. అయితే వాల్టర్ మాంగ్టన్ భారత్ మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం లేదని పాకిస్థాన్‌లో విలీనం కావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. అయినా ఏదో విధంగా స్వతంత్రంగా ఉండాలనేదే నిజాం అభిలాష. మరోవైపు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడైన ఖాసీం రజ్వీ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ సంస్థానం విలీనం చేయకూడదంటూ నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. రజాకార్ల పేరుతో ఖాసీం రజ్వీ ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం అప్పటికే తెలంగాణాలో అరాచాకాలు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో సభ పెట్టి తాము ఎర్రకోటపై నిజాం జెండా ఎగరేస్తామని ఖాసీం రజ్వి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రారంభించాడు. హైదరాబాద్ సంస్థానంపై సైనికచర్యకు సంబంధించి నెహ్రూ-పటేల్ మధ్య వైరుధ్యం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోడానికి సైనికచర్య చివరి ప్రత్యామ్నాయం కావాలని నెహ్రూ భావించారు..పటేల్ మాత్రం తాత్సారం చేయకూడదనే ఆలోచనతో ఉన్నారు. దీనికోసం ఆపరేషన్ పోలో పేరుతో ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఈ ఆపరేషన్ అత్యంత వేగంగా పూర్తవ్వాలనేది పటేల్ వ్యూహం. గంగాపూర్ రైల్వేస్టేషన్లో రజాకార్లు చేసిన దాడి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీంతో అప్పటి వరకు సహనంతో ఉన్న పటేల్ వెంటనే హైదరాబాద్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. వెంటనే కాశ్మీర్లో ఉన్న సైన్యాధ్యక్షుడు కరియప్పను ఢిల్లీకి పిలిపించిన పటేల్.. హైదరాబాద్‌పై చర్యకు సిద్ధం కావాలని ఆదేశించారు. దీంతో సైనికాధికారులు అత్యంత వేగంగా సైనిక చర్య పూర్తి చేసే విధంగా వ్యూహాలు రూపొందించారు. ఒకవేళ హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం చర్యకు దిగితే పాకిస్థాన్ ఏదైనా ప్రతీకార దాడులు చేస్తుందా అనే కోణంలోనూ పటేల్ వ్యూహాలు సిద్ధం చేశారు. దీనికోసం నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పడు సమాచారం సేకరించి పాకిస్థాన్ ఎత్తుగడలపై సమీక్షలు జరిపారు. ఇక భారత్ సైనిక చర్యను నిజాం సైన్యం ఎంతకాలం ఎదుర్కోగలదనే విషయంపై ప్రాథమికంగా కొంత గందరగోళం ఉండింది. ముఖ్యంగా నిజాం యుద్ధవిమానాలు కొనుగోలు చేస్తున్నాడని కొంతమంది సైనిక జనరల్స్ సమాచారం ఇచ్చారు. దీంతో సైనిక చర్యకు దిగాలా.. వద్దా అనే మీమాంస ఎదురైంది. -
ఆజాద్ హైదరాబాద్: సాయుధ పోరులో చేయి కలిపిన సింగరేణి
దేశమంతా స్వాతంత్య్ర సంబురాలు జరుపుకొంటున్న వేళ... తెలంగాణ మాత్రం నిజాం రాజు ఏలుబడిలోనే కొనసాగింది. ఎందరో వీరుల పోరాట ఫలితంగా బ్రిటీష్ వాళ్లు దేశాన్ని వదిలి వెళ్లాక కూడా హైదరాబాద్ సంస్థానాదీశుడైన నిజాం ఆధ్వర్యాన రజాకారులు హైదరాబాద్ సంస్థానం పరిధిలో అరాచకాలు సాగించారు. కొంతకాలం పంటి బిగువున భరించిన ప్రజలు... దుర్మార్గాలు పెచ్చరిల్లడంతో తిరుగుబాటుకు దిగారు. యువత ఏకమై సాయుధపోరాటాలు సాగించి నిజాం సైన్యాలను తిప్పికొట్టింది. ఈ పోరాటంలో పలువురు అమరులైనా మిగతా వారు వెనక్కి తగ్గకుండా చేసిన పోరాటంతో తెలంగాణకు సైతం స్వాతంత్య్రం లభించింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట గాధలను స్థానికులు గుర్తు చేసుకుంటుంటారు. ఆనాటి అమరులకు గుర్తుగా నిర్మించిన స్థూపాలు సాక్షిగా నిలుస్తున్నాయి. ఈమేరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పలు గ్రామాలపై కథనాలు.. ఈటెలతో తిరగబడిన మీనవోలు ఎర్రుపాలెం : తెలంగాణ సంస్థానాన్ని ఏలుతున్న నైజాం పాలనను వ్యతిరేకిస్తూ చేపట్టిన సాయుధ పోరాటంలో ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయ్యారు. పోరాటాల పురిటిగడ్డగా మీనవోలు గ్రామం చరిత్ర పుటలకెక్కింది. ఎర్రుపాలెం మండల కేంద్రంలో నైజాంలు అప్పట్లో పోలీస్ క్యాంపు నిర్వహించేవారు. అందులో బ్రిటీష్ ప్రభుత్వ అధికారి లెఫ్టినెంట్ సార్జంట్ తరచూ మీనవోలు గ్రామంపై దాడులు చేసి ప్రజల సొమ్మును అపహరించేవాడు. సార్జంట్ తీరుకు తోడు రజాకారులు కూడా ప్రజలను చిత్రహింసలు పెడుతుండగా... 1948 సంవత్సరం జనవరి 15న గ్రామస్తులంతా మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఈక్రమంలో సార్జంట్ తన బలగాలే కాకుండా రజాకార్లతో కలిసి మీనవోలుకు వస్తున్నాడన్న సమాచారంతో గ్రామస్తులు ఈటెలతో దండెత్తారు. ప్రజల తిరుగుబాటును ఊహించని సార్జంట్ అప్పటికప్పుడు విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరపగా రాంపల్లి రామయ్య, సుఖబోగి ముత్తయ్య, తోట బాలయ్య, పిల్లి కాటయ్య, బండి వీరయ్య, మెట్టెల శ్రీరాములు, తోట వెంకయ్య ప్రాణాలు కోల్పోయారు. అయినా కోపం చల్లారని సార్జెంట్.. నైజాం నవాబు సాయంతో రజాకార్లను రైలులో రప్పించి పలువురి ఇళ్లను తగలబెట్టారు. అలా పరిస్థితి విషమించడంతో పలువురు గ్రామస్తులు మీనవోలు విడిచివెళ్లారు. అనంతర కాలంలో పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ గ్రామాలకు చేరుకున్నారు. కాగా, రజాకార్లను ఎదురొడ్డి పోరాడి అమరులైన వారికి గుర్తుగా గ్రామస్తులు 1958 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన స్థూపాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఈ స్థూపం శిథిలం కావడంతో మరమ్మత్తులు చేయించడంతో పాటు అదే రీతిలో ప్రధాన రహదారిపై మరో స్థూపాన్ని నిర్మించారు. గుర్రాలతో తొక్కించినా నోరువిప్పని పోరాటపటిమ కొణిజర్ల : నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో యువకులు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడగా... అందులో కొణిజర్ల మండలంలోని తనికెళ్లకూ స్థానముంది. తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, గడల రామకృష్ణయ్య, గడల సుబ్బయ్య, గడల నర్సయ్య తుళ్లూరి అప్పయ్య, కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య తాళ్లపల్లి రాములు ఆనాడు మల్లెల వెంకటేశ్వరరావు దళంలో పనిచేశారు. నాటి సాయుధ పోరాటంలో నల్లమల వెంకటేశ్వరరావు, షేక్ రజబ్అలీ నేతృత్వంలో తుపాకులు చేతబట్టి కదన రంగంలో కాలుమోపి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. దళంలో పనిచేసిన వీరికి ఇదే గ్రామానికి చెందిన గడల ముత్తయ్య, పేరసాని అప్పయ్య, యాసా వెంకటలాలయ్య, పిన్నం సత్యం, యాసా మాణిక్యమ్మ సాయం చేసేవారు. ఓ సమయాన రజాకార్లు గ్రామాలపై విచక్షణారహితంగా దాడి జరిపి మహిళలు, చిన్నారులను చిత్రహింసలకు గురిచేయడమే కాక పురుషులను పట్టుకుని జైలులో పెట్టారు. అందులో పలువురిని కాల్చి చంపడం ద్వారా గ్రామస్తులకు భయాందోళనకు గురిచేసేవారని చెబుతారు. ఆ సమయాన గడల సీతారామయ్య ఆచూకీ తెలపమని రజాకార్లు గుర్రాలతో తొక్కించినా గ్రామస్తులెవరూ నోరు విప్పలేదట! నాటి తెలంగాణ సాయుధ పోరాట ఆద్యుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పలువురు పోరాటంలో పాల్గొనగా, గ్రామానికి చెందిన యాసా మాణిక్యమ్మ అడవుల్లో తలదాచుకుంటున్న పోరాటవీరులకు భోజనం సమకూర్చేది. ఆమెను గుర్తించి రజాకార్లు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టినా ఎవరి వివరాలు తెలియనివ్వలేదు. మండలంలోని లాలాపురానికి చెందిన సంక్రాంతి రామనర్సయ్య గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలో ఆరికాయలపాడు దళం ఆర్గనైజర్‌గా పనిచేశారు. 1945 ప్రాంతంలో సింగరాయపాలెం జాగీర్దార్, నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటం నిర్వహించాడు. వివాహమైన ఏడాదికే దళంలో చేరిన రామనర్సయ్య చేసిన పోరాట పటిమను తట్టుకోలేని నిజాం ప్రభుత్వం 1947లో ఆయనతో పాటు మరికొందనిని గుబ్బగుర్తి అడవుల్లో పట్టుకుంది. ఆతర్వాత మున్నేరువాగు వద్దకు తీసుకెళ్లి ఎవరి గోతులు వారినే తవ్వుకోమని చెప్పి కాల్చి చంపి పూడ్చి పెట్టారు. ఆయన స్ఫూర్తితోనే రామనర్సయ్య సోదరుడు సంక్రాంతి మధుసూదన్‌రావు కమ్యూనిస్టు నాయకుడిగా కొనసాగుతున్నారు. పోరాటాల గడ్డ మేదేపల్లి ఏన్కూరు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏన్కూరు మండలం మేడేపల్లి గ్రామస్తులు ఎందరో రజాకార్లను ఎదురొడ్డి పోరాటం చేశారు. తద్వారా పోరాటాల గడ్డగా మేడేపల్లి చరిత్రకెక్కింది. మేడేపల్లి గ్రామంలో గిరిజనులు రజాకార్లను ఎదిరించి పోరాటాలు చేశారు. తాటి సీతమ్మ, తాటి సత్యం, ముక్తి ఎర్రయ్య, బండ్ల పెద్ద జోగయ్య, ముక్తి రాములు తుపాకులు పట్టి అడవుల్లో తలదాచుకుంటూ రజాకార్లను తుదముట్టించారు. నల్లమల గిరిప్రసాద్ నాయకత్వంలో వీరు పోరాటం చేసినట్లు చెబుతారు. తాటి సీతమ్మ, తాటి సత్యంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్మృతిచిహ్నాలుగా గ్రామంలో స్థూపాలను ఏర్పాటుచేశారు. పోలీస్ చర్య తర్వాతా యుద్ధమే.. సత్తుపల్లి : సత్తుపల్లి నుంచి పది కి.మీ. దూరంలో ఉన్న ఆంధ్రా ప్రాంతంలోని గురుభట్లగూడెం, కృష్ణారావుపాలెం తదితర ప్రాంతాలపై రజాకార్ల నిర్బంధం కొనసాగేది. ఆ సమయంలో దమ్మపేట మండలం జమేదారుబంజరు ప్రాంతం నుంచి సోయం గంగులు నాయకత్వంలో సాయుధ పోరాటం మొదలైంది. ఆయనకు మద్దతుగా గిరిజనులు, గిరిజనేతరులు రజాకారులపై గెరిల్లా దాడులు పాల్పడుతుండేవారు. అనంతర కాలంలో పోలీసు చర్యతో తెలంగాణకు విముక్తి లభించింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు – భారత మిలటరీకి 1948 నుంచి 1950 వరకు రెండేళ్ల పాటు హోరాహోరీ పోరు నడిచింది. గ్రామాల్లోకి భారత సైన్యం వస్తుంటే కమ్యూనిస్టులు సాయుధులై తిరుగుబాటు చేసేవారు. క్షేత్ర స్థాయిలో పరిపాలనను అందించేందుకు ఆ సమయానభారత మిలటరీకి మద్దతుగా గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటయ్యాయి. ఈ దళాల్లోని సభ్యులకు తుపాకీతో శిక్షణ ఇచ్చేవారు. వీరు ఉదయమంతా గ్రామాల్లో గస్తీ తిరగటం.. చీకటిపడే సమయానికి సత్తుపల్లి పాత సెంటర్లోని జెండా చింతచెట్టు వద్ద సమావేశ కావటం జరుగుతుండేది. భారత మిలటరీని మలబార్ రెజిమెంట్ ఆధ్వర్యంలో రక్షణ దళం ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులను హోంగార్డులుగా కూడా వ్యవహరించేవారు. ఇందులోభాగంగా 1948లో సత్తుపల్లి గ్రామ రక్షణ దళం ఏర్పాటు కాగా.. చల్లగుళ్ల సీతారామయ్య, నరుకుళ్ల వెంకయ్య, దిరిశాల సత్యం, మట్టా రామయ్య, చల్లగుండ్ల వీరయ్య, మట్టా వెంకయ్య, మొరిశెట్టి సత్యం, నరుకుళ్ల రామయ్య, పల్లబోతు నాగభూషణం, కొత్తూరు సుబ్బారావు, సీతారామయ్య, మహాదేవ రామలింగం, వల్లభనేని సకలయ్య తదితరులు సభ్యులుగా ఉండే వారని పెద్దలు చెబుతుంటారు. నాకు గర్వంగా ఉంటుంది.. 18 ఏళ్ల వయస్సులో మా నాన్న చల్లగుళ్ల వీరయ్య సత్తుపల్లి గ్రామ రక్షణ దళంలో పని చేశారు. కమ్యూనిస్టు సాయుధ పోరాటం విరమించే వరకు రక్షణ దళం భారత మిలటరీ మద్దతుతో పని చేసేదని మానాన్న చెప్పేవారు. సత్తుపల్లి చరిత్రలో మా కుటుంబం పేరు కూడా ఉండటం నాకు గర్వకారణంగా ఉంది. – చల్లగుళ్ల నర్సింహారావు, సత్తుపల్లి -
రజాకార్లకు ఎదురొడ్డిన గుండ్రాంపల్లి!
చిట్యాల: నిజాం కాలంలో రజాకార్ల అకృత్యాలకు సజీవ సాక్ష్యం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి యువకులెందరో రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు వదిలారు. నాటి పోరాటానికి జ్ఞాపకంగా గ్రామంలో అమరవీరుల స్తూపం సగౌరవంగా నిలబడి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం తమ గ్రామానికి తగిన గుర్తింపు లేదని స్థానికులు వాపోతున్నారు. రక్షక దళాలుగా ఏర్పడి.. రజాకార్ల దారుణాలు సాగుతున్న సమయంలో సూర్యాపేట తాలూకా వర్దమానకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్యక్తి.. తన సోదరి నివాసం ఉంటున్న గుండ్రాంపల్లికి వలస వచ్చాడు. మొదట బతుకుదెరువు కోసం ఇదే మండలం ఏపూరులో ఒక భూస్వామి వద్ద పనిలో చేరాడు. కానీ తర్వాత రజాకార్ల బృందంలో చేరాడు. గుండ్రాంపల్లి కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్నవారిపై రజాకార్లతో కలిసి అరాచకాలకు పాల్పడ్డాడు. అవి ఎంత దారుణంగా ఉండేవంటే.. గ్రామంలో తాను నిర్మించుకున్న ఇంటి పునాదిలో నిండు గర్భిణులను సజీవ సమాధి చేసి ఆపై నిర్మాణాన్ని చేపట్టాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ క్రమంలో మక్బూల్, ఇతర రజాకార్ల ఆగడాలను అడ్డుకోవడానికి గుండ్రాంపల్లి కేంద్రంగా ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు రక్షక దళాలుగా ఏర్పడ్డారు. రజాకార్ల దాడులను తిప్పికొట్టారు. 30 మందిని సజీవ దహనం చేసి.. గుండ్రాంపల్లి కేంద్రంగా జరుగుతున్న తిరుగుబాటుతో రగిలిపోయిన మక్బూల్.. పెద్ద సంఖ్యలో రజాకార్లను కూడగట్టి భారీ దాడికి దిగాడు. తమకు దొరికిన 30 మంది యువకులను గుండ్రాంపల్లిలో ఎడ్లబండ్లకు కట్టి చిత్రహింసలు పెట్టాడు. తర్వాత గుండ్రాంపల్లి నడిబొడ్డున మసీదు ఎదురుగా బావిలో వారందరినీ పడేసి సజీవ దహనం చేశాడు. ఇది తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారు. ప్రస్తుత మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి గురునాథరెడ్డి నాయకత్వంలో సాయుధ దళాలు మక్బూల్‌పై దాడికి ప్రయత్నించాయి. కానీ మక్బూల్ తప్పించుకున్నాడు. తర్వాత మరోసారి చేసిన దాడిలో మక్బూల్ చేయి విరిగినా, ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడు. మక్బూల్‌కు సహకరించిన వారి ఇళ్లపై కమ్యూనిస్టు సాయుధ దళాలు దాడి చేసి హతమార్చాయి. నిజాం పాలన నుంచి విముక్తి లభించాక గుండ్రాంపల్లి ఊపిరిపీల్చుకుంది. నాటి పోరాటంలో యువకులను సజీవ దహనం చేసినచోట 1993 జూన్ 4న సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. అమరులైన వారిలో గుర్తించిన 26 మంది పేర్లను ఆ స్తూపంపై రాశారు. ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణవాదులు ఈ స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో ఈ స్థూపాన్ని తొలగించగా.. మరోచోట అమరవీరుల స్తూపాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. గ్రామాన్ని సందర్శించిన అమిత్ షా 2017 మే నెలలో గుండ్రాంపల్లి గ్రామాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సందర్శించారు. నాటి సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారసులను ఆయన సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఈ ఏడాది జూలైలో గుండ్రాంపల్లిని సందర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గుండ్రాంపల్లి గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చుతామని.. గ్రామంలో స్మారక కేంద్రం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రజాకార్ల దుర్మార్గాలు చెప్పలేనివి నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు రజాకార్ల దాడులు జరిగాయి. గ్రామంలోని యువకులు దళాలుగా ఏర్పడి తిరుగుబాటు చేశారు. రజాకార్లు వారిని పట్టుకుని చంపేశారు. తర్వాత మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల వారంతా కలిసి మక్బూల్‌పై దాడి చేశారు. నాటి రజాకార్ల దుర్మార్గాలు చెప్పనలవికాదు. – గోపగోని రామలింగయ్య, గుండ్రాంపల్లి గుండ్రాంపల్లికి గుర్తింపు ఇవ్వాలి నిజాం నవాబుకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గుండ్రాంపల్లి గ్రామ చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి. పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి ముందు తరాలకు తెలియజేయాలి. ఏటా సెప్టెంబర్ 17న మా గ్రామంలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలి. – గరిశె అంజయ్య, గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,గుండ్రాంపల్లి -
విముక్తికి బాట వేసిన బైరాన్‌పల్లి..!
1947 ఆగస్టు 15.. తెల్లదొరలను తరిమిన భారతావనిలో ప్రజలు స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటున్నారు.. కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలో బిక్కుబిక్కుమంటూనే గడిపింది. ఆ రోజే కాదు.. మరో ఏడాదికిపైగా నిజాం నియంతృత్వాన్ని, రజాకార్ల దుర్మార్గాలను భరిస్తూ వచ్చింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలన్న ప్రజల ఆకాంక్షలు, ప్రతిఘటనలు, పోరాటాల రూపంలో తెరపైకి రావడం మొదలైంది. వీటన్నింటికీ పరాకాష్టగా బైరాన్‌పల్లి నరమేధం కలకలం రేపింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రస్థాయికి చేరింది. 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లి ఘటన జరిగితే ఆ తర్వాత 21 రోజుల్లో.. అంటే సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. –సాక్షి, సిద్దిపేట ఎన్నో పోరాటాలు జరిగినా.. బ్రిటీష్‌వాళ్లు దేశాన్ని వదిలిపెట్టి పోయినా.. నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిరాకరించారు. దీనికి తోడు నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం రజ్వీ వ్యక్తిగత సైన్యం రజాకార్ల అరాచకాలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలైంది. సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరాన్‌పల్లి కేంద్రంగా కూటిగల్, లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాల యువకులతో బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది. రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్‌పల్లి గ్రామస్తులంతా ఏకమయ్యారు. శత్రువుల దాడిని ఎదుర్కొని, ప్రతిదాడి చేయడానికి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కోట బురుజును పునర్నిర్మించారు. నాటు తుపాకులు, మందు గుండు సామగ్రి సమకూర్చుకున్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్న యువకులు నాటు తుపాకులతో గస్తీ నిర్వహించేవారు. ప్రతీకారేచ్ఛతో వరుస దాడులకు తెగబడి.. 1948లో లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలపై రజాకార్లు దాడి చేసి తగులబెట్టారు. తిరిగి వెళ్తుండగా బైరాన్‌పల్లి సమీపంలోకి రాగానే వారిపై దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలో రక్షణ గెరిల్లా దళాలు దాడిచేసి దోచుకున్న సంపదను స్వాధీనం చేసుకున్నాయి. దాన్ని తిరిగి ప్రజలకు పంచారు. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయిన రజాకార్లు బైరాన్పల్లిపై దాడి చేశారు. రక్షక దళం గట్టిగా ప్రతిఘటించింది. ఈ దాడిలో 20 మందికిపైగా రజాకార్లు చనిపోయారు. ఇలా రెండోసారి కూడా విఫలం కావడంతో రజాకార్లు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. నాటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హషీం ఆదేశాలతో హైదరాబాద్ నుంచి 500 మందికిపైగా సైనికులను రప్పించి మూడోసారి దాడి చేశారు. దారుణంగా కాల్చి చంపారు ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్లు 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా బైరాన్‌పల్లిని చుట్టుముట్టారు. అయితే ఆ సమయంలో బహిర్భూమికి వెళ్లిన గ్రామస్తుడు వడ్లె వెంకటనర్సయ్య గమనించి కేకలు వేయడంతో.. వెంటనే బురుజుపై ఉన్న కాపలాదారులు నగారా మోగించారు. అప్పటికే దూసుకొచ్చిన రజాకార్ల కాల్పుల్లో బురుజుపై ఉన్న గెరిల్లా దళ సభ్యులు మోగుటం రామయ్య, పోచయ్య, భూమయ్య మృతిచెందారు. రజాకార్లు ఫిరంగులతో దాడి చేయగా.. బురుజులోని మధ్య గదిలో ఉన్న మందు గుండు సామగ్రిపై నిప్పులు పడి పేలిపోయింది. తర్వాత రజాకార్లు మరింత విజృంభించారు. బురుజుపై తలదాచుకున్న 40 మందిని కిరాతకంగా కాల్చి చంపారు. మరో 56 మంది యువకులను బంధించి ఊరి బయటికి తీసుకొచ్చి కాల్చిచంపారు. మృతదేహాలను పాత బావిలో పడేశారు. ఈ ఘటనల్లో 118 మందికిపైగా మృతిచెందినట్లు చరిత్ర చెబుతోంది. యువకులను చంపడంతో ఊరుకోని రజాకార్లు మరిన్ని దారుణాలకు తెగబడ్డారు. మహిళలను నగ్నంగా ఆ శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు. వారిపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ దారుణాలను తట్టుకోలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్టు బైరాన్‌పల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నరమేధం నాటి భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు మొదలయ్యాయి. నాటి కేంద్ర హోంమంత్రి వల్లభ్ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ యాక్షన్‌తో కొద్దిరోజుల్లోనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో వీలినమైంది. బైరాన్‌పల్లి వాసులు నాటి ఘటనను గుర్తు చేసుకుని ఇప్పటికీ కన్నీటిపర్యంతం అవుతున్నారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోలేదు నాటి ఘటనతో బైరాన్‌పల్లి.. వీర బైరాన్‌పల్లి అయింది. ఇంతటి పోరాట పటిమ చూపిన తమ గ్రామాన్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయని స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నాటి పోరాటంలో పాల్గొన్నా 28 మందికి మాత్రమే పెన్షన్ మంజూరు చేశారని.. నాటి పోరాటంలో పాల్గొని పెన్షన్ రానివారు ఇంకా 30 మంది ఉన్నారని చెబుతున్నారు. కూటిగళ్లు గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఉందని.. నాడు అమరులైన వారి పేర్లతో గ్రామస్తులే ఓ స్తూపాన్ని నిర్మించుకున్నారని వివరిస్తున్నారు. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా స్తూపాన్ని ఆవిష్కరించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బైరాన్‌పల్లి పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి బైరాన్‌పల్లి పోరాటాన్ని విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలి. నాటి ఘనత నేటి తరానికి తెలిసేలా అమరధామం, ఎత్తయిన స్తూపం, భవనం నిర్మించాలి. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిపెట్టి అభివృద్ధి చేయాలి. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో బైరాన్‌పల్లి గురించి వివరించాం. వస్తానన్నారు. ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికైనా పట్టించుకోవాలి. –చల్లా చంద్రారెడ్డి నాటి పోరాటంలో కాలికి గాయమైంది నాడు రజాకార్లు చందాల పేరుతో పీడించేవారు. వారి దాడుల్లో నా కాలుకు గాయమైంది. అయినా రక్షణ దళంతో కలిసి రజకార్లపై పోరాడాను. నాటి పోరాటకారుల్లో కొందరికి ఇప్పటికీ పెన్షన్ మంజూరు చేయలేదు. వెంటనే మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. గ్రామంలో సర్వే చేసి ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. –ఇమ్మడి ఆగంరెడ్డి -
పోరాటల పురిటి గడ్డ.. వీర బైరాన్‌పల్లి
మద్దూరు(హుస్నాబాద్): నిజాం రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన గ్రామంగా మద్దూరు మండలం బైరాన్‌పల్లి కీర్తి గడించింది. రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అనేక మంది వీర మరణం పొందారు. మద్దూరు, లద్నూర్, సలాఖపూర్, రేబర్తి, మర్మాముల గ్రామాలను రజాకార్లు తమ స్థావరాలుగా చేసుకొని దాడులు చేస్తుండే వారు. ఈ క్రమంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని రజాకార్ల దాడులను తిప్పి కొట్టడంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వీరోచిత పోరాటాలు చేశారు. ఈ గ్రామ చరిత్రను ఒకసారి చూస్తే.. గ్రామ ర క్షక దళాలు: రజాకార్ల అరాచకాలను ఎదురించేందుకు గ్రామాల్లోని యువకులంత కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డారు. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాలలో ఏర్పడిన రక్షణ దళాలు బైరాన్‌పల్లిని కేంద్రంగా చేసుకొని నిరంతరం రజాకార్ల దాడులను తిప్పి కొట్టేవి. దీనితో రజాకార్లు 1948లో దూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలపై దాడులు చేసి దొరికిన వారిని దొరికినట్లు చంపడంతో పాటు ఆయా గ్రామాలను తగుల బెట్టారు. ఆపై తిరిగి వస్తున్న రజాకార్లపై బైరాన్‌పల్లి వద్ద రక్షణ దళాలల నాయకులు దువ్వురి రాంరెడి,్డ మురిళిధర్రావు, ముకుందర్ రెడి నాయకత్వంలో కాపు కాచి గేరిల్లా దాడులు చేశారు. లింగాపూర్ దూల్మిట్ట గ్రామాలలో దోచుకున్న సంపదను స్వాదీనం చేసుకున్నారు. బైరాన్‌పల్లి దిగ్బందం: బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలు దాడులు చేయడంపై రజాకార్లు అగ్రహించుకొని ఆ గ్రామంపై రజాకార్లు మూడు సార్లు దాడులు చేసి విఫలం అయ్యారు. ఈ క్రమంలో 1948 ఆగస్లు 27వ తేది అర్థరాత్రి ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు జనగామ నుండి 10 ట్రక్‌లతో బయలుదేరి రాత్రి 2 గంటల ప్రాంతలో తమకు అడ్డాగా ఉన్న లద్నూర్ గ్రామానికి రజాకార్లు చేరుకున్నారు. తెల్లవరుజాము 3 గంటల సమయంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని మందుగుండు సామాగ్రితో 12 వందల మంది సైనికులు దిగ్భందించారు. బహిర్బూమికి వెళ్ళిన ఉల్లెంగల(వడ్ల) నర్సయ్యను పట్టుకొని గ్రామంలో ఉన్న బురుజు వద్దకు దారి చూపించమని తీసుకు వెళ్ళారు. అదే సమయంలో నర్సయ్య వారిని నెట్టివేస్తు రజాకార్లు గ్రామంలోకి వచ్చారని కేకలు వేస్తు పరుగులు తీశాడు. దీనితో బురుజుపై ఉన్న కాపాల దారుడు నగార మోగించారు. దీనితో రజాకార్లు కాల్పులు ప్రారంబించడంతో బురుజుపై ఉన్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్యలు మృతి చెందారు. కాల్పులు జరుగుతుండగా బురుజుపై ఉన్న మందు గుండు సామాగ్రిపై నిప్పు రవ్వలు ఎగిసి పడటంతో ఒక్కసారిగా బురుజుపైభాగం పేలిపోయింది. దీనితో రజాకార్లు గ్రామంలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. ఈలా ఒకే రోజు బైరాన్‌పల్లి గ్రామంలో 96మందిని చంపి శవాల చుట్టు మహిళలతో బతుక్మ ఆటలాడించారు. కూటిగల్‌పై దాడి: బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలకు కూటిగల్ ప్రజలు సహయ సహకారులు అందిచడంతో మూడు సార్లు దాడిని బైరాన్‌పల్లి గ్రామస్తులు తిప్పి కొట్టారని కోపంతో 1948 ఆగస్టు27న బైరాన్‌పల్లి దాడి తర్వత కొంత మంది రజాకార్లు కూటిగల్ గ్రామంపై దాడి చేసి బురుజుపై ఉన్న వారిని కిందకు దింపి తూటల మర్రి వరకు తీసుక వచ్చి రెక్కలు కట్టి నిల్చొబెట్టి 22 మందిని కాల్చి చంపి రజాకార్లు పైచాచిక ఆనందం పొందారు. రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన బైరాన్‌పల్లి గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. -
ఇది ‘తెలంగాణ జలియన్‌వాలాబాగ్’
సాక్షి, హైదరాబాద్: మూడు కిలోమీటర్ల భారీ మానవహారం. సమీప ఊళ్ల నుంచి పోగైన నాలుగు వేలమంది ముందుకు కదులుతున్నారు. చేతుల్లో జాతీయ పతాకాలు రెపరెపలాడుతుండగా, వందేమాతరం, నిజాం వ్యతిరేక నినాదాలు మిన్నంటుతున్నాయి. వారు జాతీయ పతాకాన్ని ఎగరేయాల్సిన మైదానం సమీపంలోకి రాగానే నిజాం పోలీసులు, రజాకార్లు విరుచుకుపడ్డారు. ఓవైపు కాల్పులు, మరోవైపు పారిపోతున్నవారిపై కత్తులతో దాడి.. చూస్తుండగానే రణరంగమైందా ప్రాంతం. 15 మంది అక్కడికక్కడే చనిపోగా, పారిపోతూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మరో ఎనిమిది మంది అసువులుబాశారు. ఇది పాశవిక నిజాం సైన్యం సృష్టించిన నరమేధం. తెలంగాణ సాయుధపోరాట చరిత్రలో నిలిచిపోయిన రక్తపుమరక. బ్రిటిష్ సైన్యం దేశభక్తులపై విచక్షిణారహితంగా కాల్పులు జరిపి వందలమందిని పొట్టనపెట్టుకున్న జలియన్ వాలాబాగ్ నరమేధాన్ని పోలిన ‘తెలంగాణ జలియన్ వాలాబాగ్’ ఘటన. సొంత హవా కోసం తహతహలాడి బ్రిటిష్ పాలకులకు తొత్తుగా మారి జనానికి ప్రత్యక్ష నరకం చూపిన నిజాం పాలనకు ఇదో ఎర్రటి గుర్తు. అలనాటి భయంకరమైన రోజును ఇప్పటికీ మరిచిపోని ఆ ప్రాంతం పరకాల. ఘటన జరిగింది 1947 సెప్టెంబరు 2. సరిగ్గా నేటికి 74 ఏళ్లు పూర్తిచేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో కచ్చితంగా గుర్తుచేసుకోవాల్సిన ఘటన ఇది. స్మారకం ఏదీ? స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందే ఈ పరకాల ఘటనకు సంబంధించి కొన్నేళ్ల క్రితం వరకు పరకాలలో కనీసం స్మారకం కూడా లేదు. అప్పట్లో చిన్నస్తూపం, చనిపోయినవారి పేర్లతో ఫలకం మాత్రం ఏర్పాటుచేశారు. కేంద్ర సహాయమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ నేత విద్యాసాగరరావు తన తల్లి పేరిట ఉన్న ట్రస్టు ఆధ్వర్యంలో ఇక్కడ ఓ స్మారకాన్ని నిర్మించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ఆరోజు చేయిచేయి పట్టుకుని మానవహారంగా వచ్చిన అమరవీరులకు గుర్తుగా అక్కడ ర్యాలీగా వెళ్తున్నట్లుగా మనుషుల బొమ్మలు ఏర్పాటు చేయించారు. జలియన్ వాలాబాగ్‌తో పోల్చదగింది పంజాబ్‌లోని జలియన్ వాలాబాగ్‌లో దేశభక్తులపై కాల్పులు జరిపించి వందలమంది మృతికి కారణమైన జనరల్ డయ్యర్ రాక్షసత్వానికి, పరకాలలో ‘జాయిన్ ఇండియా’ ఉద్యమంలో రాక్షసంగా వ్యవహరించి పదుల సంఖ్యలో పోరాట యోధుల మృతికి కారణమైన నిజాం పోలీసు సీఐ జియాఉల్లా ఉన్మాదానికి పోలిక ఉంది. చరిత్రలో పరకాల మరో జలియన్ వాలాబాగ్‌గా నిలిచిపోయింది. కానీ చాలామందికి నాటి గాథ తెలియకపోవటం విచారకరం. ఇక్కడి స్మారకాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. – రాచర్ల గణపతి, చరిత్ర విశ్లేషకుడు -
రావిచెట్టుపై రాత్రికి రాత్రే జెండా ఎగిరింది.. పెద్ద హంగామా..
సాక్షి, భానుపురి (నల్లగొండ): దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నిజాం రాజు ఇంకా ప్రత్యేక దేశంగా ఉండేందుకే మొగ్గు చూపారు. ఈ సమయంలో కొందరు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంకా నిజాం పోలీసులు, రజాకార్లదే పెత్తనం. అప్పుడు నా వయస్సు 9 ఏళ్లు. 1947 ఆగస్టు 15న గుర్తుతెలియని వ్యక్తులు రావిచెట్టు బజారు (ప్రస్తుత బొడ్రాయిబజారు)లో ఓ పెద్ద రావిచెట్టుపై రాత్రికి రాత్రే జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల భయం ఎక్కువగా ఉన్న ఆ సమయంలో జెండా ఎవరూ కట్టారో తెలుసుకునేందుకు పెద్ద హంగామే జరిగింది. పోలీసులు సోదాలు చేయడం, అనుమానం ఉన్న వారిపై లాఠీలు ఝుళిపించారు. పెద్ద ఘర్షణ వాతావరణమే నెల కొంది. నిజాంరాజు లొంగిపోయిన తర్వాత కూడా జెండా పండుగకు ప్రజలు పోలీసుల భయంతో పెద్దగా వచ్చేవారు కాదు. ఆర్య సమాజ్‌కు చెందిన యామ రామచంద్రయ్య (కన్నయ్య), విశ్వమిత్ర పండిత్‌జీ లాంటి వారు ముందుండి నడిపేవారు. రామాలయం పక్కనే ఉన్న గ్రంథాలయంలో జెండా ఎగురవేసేది. రానురాను మొదటగా గాంధీపార్క్, పబ్లిక్ క్లబ్ ఇలా అన్నిచోట్ల జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. -
96 శవాల చుట్టు మహిళలతో బతుకమ్మ
దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం బానిస సంకెళ్లతో మగ్గిపోయారు. అప్పటి నిజాం హయాంలోని రజాకార్ల దాష్టికాలతో అనుక్షణం భయం భయంగా బతికారు. ఈ బానిస బతుకుల విముక్తి కోసం కొనసాగిన మహత్తర రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ విమోచనోద్యమానికి పురుడుపోసిన నేలగా ఉమ్మడి మెదక్ జిల్లా నిలిచింది. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట తదితర గ్రామాల్లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. నాటి వీరుల వీరోచిత పోరాటానికి తలొగ్గిన నిజాం నవాబు 1948 సెప్టెంబర్ 17న లొంగుబాటు ప్రకటన చేశాడు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... మద్దూరు(హుస్నాబాద్) : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా కూడా తెలంగాణ ప్రాంతంలో మాత్రం నిజాం రజాకార్ల ఆగడలకు ఎదురొడ్డి నిలిచిన గ్రామంగా బైరాన్‌పల్లి కీర్తి గడించిన ఘనత దక్కించుకుంది. అంతే కాదు రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అనేక మంది వీర మరణం పొందారు. ముస్లింలు అధికంగా ఉన్న మద్దూరు, లద్నూర్, సలాఖపూర్, రేబర్తి, మర్మాముల గ్రామాలను రజాకార్లు తమ స్థావరాలుగా చేసుకొని దాడులు చేస్తుండే వారు. ఈ క్రమంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని రజాకార్ల దాడులను తిప్పి కొట్టడంలో చుట్టు పక్కల గ్రామాలు కీలక పాత్ర పోషించాయి. (రంగు మారిన పవన్ రాజకీయం) గ్రామ రక్షక దళాలు రజాకార్ల అరచకాలను ఎదురించేందుకు గ్రామాల్లోని యువకులంత కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డాయి. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాల్లో ఏర్పడిన రక్షణ దళాలు బైరాన్‌పల్లిని కేంద్రంగా చేసుకొని నిరంతరం రజాకార్ల దాడులను తిప్పికొట్టేవి. దీంతో రజాకార్లు 1948లో దూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలపై దాడులు చేసిదొరికిన వారిని దొరికినట్లు చంపడంతో పాటు ఆయా గ్రామాలను తగులబెట్టారు. ఆపై తిరిగి వస్తున్న రజాకార్లపై బైరాన్‌పల్లి వద్ద రక్షణ దళాలల నాయకులు దువ్వురి రాంరెడ్డి, మురళీధర్‌రావు, ముకుందర్ రెడ్డి నాయకత్వంలో కాపు కాచి గేరిల్లా దాడులు చేశారు.అంతే కాకుండా లింగాపూర్ దూల్మిట్ట గ్రామాలలో దోచుకున్న సంపదను స్వాధీనం చేసుకున్నారు. (అనూహ్య ఘటన.. భట్టి ఇంటికి తలసాని) కూటిగల్‌పై దాడి బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలకు కూటిగల్ ప్రజలు సఆయ సహకారులు అందించడంతో మూడు సార్లు దాడిని బైరాన్‌పల్లి గ్రామస్తులు తిప్పి కొట్టారని కోపంతో 1948 ఆగస్టు27న బైరాన్‌పల్లి దాడి తర్వాత కొంత మంది రజాకార్లు కూటిగల్ గ్రామంపై దాడి చేసి బురుజుపై ఉన్న వారిని కిందకు దింపి తూటల మర్రి వరకు తీసుకొచ్చి రెక్కలు కట్టి నిల్చొబెట్టి 22 మందిని కాల్చి చంపి రజాకార్లు పైసాచిక ఆనందం పొందారు. ఊరంతా దిగ్బంధం బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలు దాడులు చేయడంపై రజాకార్లు ఆగ్రహించుకొని ఆ గ్రామంపై రజాకార్లు మూడుసార్లు దాడులు చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో 1948 ఆగస్టు 27వ తేదీ అర్ధరాత్రి ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు జనగామ నుంచి 10 ట్రక్‌లతో బయలుదేరి రాత్రి 2గంటల ప్రాంతంలో తమకు అడ్డాగా ఉన్న లద్నూర్ గ్రామానికి చేరుకున్నారు. తెల్లవారుజాము 3గంటల సమయంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని మందుగుండు సామగ్రితో 12వందల మంది సైనికులు దిగ్భందించారు. బహిర్బూమికి వెళ్ళిన ఉల్లెంగల(వడ్ల) నర్సయ్యను పట్టుకొని గ్రామంలో ఉన్న బురుజు వద్దకు దారి చూపించమని తీసుకెళ్లారు. అదే సమయంలో నర్సయ్య వారిని నెట్టివేస్తూ రజాకార్లు గ్రామంలోకి వచ్చారని కేకలు వేస్తూ పరుగులు తీశాడు. దీంతో బురుజుపై ఉన్న కాపలదారుడు నగార మోగించారు. దీంతో రజాకార్లు కాల్పులు ప్రారంభించడంతో బురుజుపై ఉన్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్యలు మృతి చెందారు. కాల్పులు జరుగుతుండగా బురుజుపై ఉన్న మందు గుండు సామగ్రిపై నిప్పు రవ్వలు ఎగిసి పడటంతో ఒక్కసారిగా బురుజుపైభాగం పేలిపోయింది. దీంతో రజాకార్లు గ్రామంలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. ఇలా ఒకే రోజు బైరాన్‌పల్లి గ్రామంలో 96 మందిని చంపి శవాల చుట్టు మహిళలతో బతుక్మ ఆటలాడించారు. శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు బురుజు వద్ద అనేక మందిని పట్టుకొని చంపుతుంటే భయంతో పరుగులు పెడుతున్న మహిళలను వివస్త్రలను చేసి శవాల చుట్టూ బతుకమ్మ ఆట ఆడించి పైశాచిక ఆనందం పొందారు. కొందరు మహిళలు పారి పోతుంటే పట్టుకొని అత్యాచారం చేశారు. మహిళలు ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. –ఓజమ్మ స్వాతంత్య్ర సమరయోధురాలు, బైరాన్‌పల్లి లెంకలు కట్టి చంపినారు బైరాన్‌పల్లిలో దాడి కొనసాగుతుండగానే కూటిగల్‌పై దాడి చేసి కొందరిని బంధీగా పట్టుకొని బురుజుపై ఉన్న వారికి కిందకు దింపి వాగు ఒడ్డుకు ఉన్న తూటల మర్ర వద్దకు తీసుకెళ్ళి లెంకలు కట్టి చంపారు. నా కాలుకు తూటా తగిలిని తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నాను. –వంగపల్లి బాలయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు, కూటిగల్ -
జలియన్ వాలాబాగ్‌ను మించిన నరమేధం
సాక్షి, మద్దూరు(హుస్నాబాద్): జలియన్ వాలాబాగ్ సంఘటనని తలపించిన వీరబైరాన్‌పల్లి నెత్తుటి చరిత్రకు నేటితో 72 ఏళ్లు నిండాయి. రజాకారుల పాశవిక దాడులను ఎదిరించి పోరాడిన బైరాన్‌పల్లి వీరుల ప్రాణత్యాగం మరువలేనిది. బైరాన్‌పల్లి మాతృభూమి విముక్తి కోసం 118 మంది యోధులు నేలకొరిగారు. 1947 ఆగస్టు15న దేశానికి స్వాతంత్య్రం వచ్చి ప్రజలు స్వేచ్ఛ వాయువులు పిలుస్తుండగా నిజాం రాజు గుప్పిట్లో ఉన్న తెలంగాణ ప్రాంతం మాత్రం రజాకారుల దురాగతాలకు బలై బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిసింది. నిజాం సైన్యాధిపతి ఖాసీం రజ్వీ సైనికులు (రజాకార్లు)గ్రామంలో తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు 1,200 మంది సైన్యంతో 1948 ఆగస్టు 27న తెల్లవారు జామున 4 గంటలకు గ్రామాన్ని చుట్టు ముట్టారు. వెంటనే దళా కమాండర్ ఇమ్మడి రాజిరెడ్డి ప్రజలంతా తగిన రక్షణలో ఉండాలని కోరుతూ నగర మోగించారు. గ్రామస్తులంతా బురుజు వద్ద గడీలోకి పరుగులు తీశారు. యువకులు గ్రామానికి నాలుగు వైపులా కాపు కాసి శత్రువులను గ్రామంలోనికి రాకుండా చూడాలని హెచ్చరికలు జారీ చేశారు.గ్రామాన్ని చుట్టుమూట్టిన రజాకార్లును తరిమి వేయడానికి బురుజు పై నుంచి కాల్పులు ప్రారంభించారు. గ్రామస్తులు ఏవైపు నుంచి కాల్పులు జరుపుతున్నారో చూసి రజాకార్లు కూడా కాల్పులు ప్రారంభించారు. రజాకార్లు గ్రామంలోకి చొరబడి దొరికిన వారిని దొరికిన్నట్లుగా చంపారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ బురుజు పైనున్న కొందరిని కిందకు దింపి వరుసగా నిల్చోబెట్టి దారుణంగా కాల్చి చంపి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. శవాల చుట్టూ బతుకమ్మ ఆట.. బురుజు నుంచి భయంతో పరుగులు పెతున్న మహిళలను వెంటాడి పట్టుకున్నారు. అనేక మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. గుట్టలుగా పడి ఉన్న శవాల చుట్టూ మహిళలను వివస్తలను చేసి బతుకమ్మ ఆటలు ఆడించి కసి తీర్చుకున్నారు. 118 మంది గ్రామస్తులు వీరమరణం పొందారు. నిజాం రజాకార్లు 25 మంది మృతి చెందారు. పోరాటానికి గుర్తింపు కరువు జలియన్‌వాలాబాగ్ ఘటనను మించిన బైరాన్‌పల్లి పోరాటాన్ని ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం శోఛనీయమని సర్పంచ్ బండి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.అమరుల కుటంబలను ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో నేటికీ ఆ కుటుంబలు దయనీయ పరిస్థితిలో కాలం వెల్లదీస్తున్నాయి. స్వరాష్ట్రం కోసం సాగిన తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన వీర బైరాన్‌పల్లి పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని పలువురు కోరుతున్నారు. కళ్లముందు కదలాడుతున్నాయి నాటి రజాకార్ల దురాగతాలు నేటికి కళ్ళ ముందు కదలాడుతున్నట్లు ఉంది. గ్రామస్తులను బురుజుపై నుంచి దించి వరుసగ నిలబెట్టి కాల్చిచంపి వారు పైశాచిక ఆనందం పొందారు. ఒక్క రోజు 118 మందిని కోల్పోయి గ్రామం శవాల దిబ్బగా తయారైన ఘటన నేటికి కళ్ళముందు మెరుస్తుంటుంది. – వంగపల్లి రాజమ్మ, స్వాతంత్య్ర∙సమరయోధురాలు, బైరాన్‌పల్లి సమరయోధుల కుటుంబాలను ఆదుకోవాలి ఖాసీం రజ్వీ వారసులకు ఎదురు నిల్చి గ్రామం కోసం ప్రాణలు వదిలిన సమరయోధుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. జలియన్ వాలాబాగ్ ఘటనను పోలిఉన్న ఉధంతానికి ఎదురోడి తమ ప్రాణలు లెక్క చేయకుండా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలతో పాటు ఆగస్టు 27 జరిగిన పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. – బండి శ్రీనివాస్, సర్పంచ్ బైరాన్‌పల్లి -
రజాకార్లను వణికించిన అనభేరి
1910 ఆగష్టు 15వ తేదిన కరీంనగర్ జిల్లా పోలంపల్లి వాస్తవ్యులైన దేశ్‌ముఖ్, జమిందార్ అనభేరి వెంకటేశ్వర్ రావు, రాధా దేవి దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. వీరు కరీంనగర్లో ప్రాథమిక విద్య తరువాత మచిలీపట్నంలో కొంతకాలం చదివి తరువాత, హైదరాబాద్ చాదర్‌ఘాట్ హైస్కూల్, బెనారస్ కాశీ విద్యాపీఠ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. స్వతహాగా ఆదర్శ భావాలు కలిగిన ఆయన విద్యార్థి దశ నుంచే నిజాం వ్యతిరేక ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. ఇంకా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నా వీరు వెళ్ళలేదు, అందరు దొరల కొడుకుల్లాగా దొరతనాన్ని ఎంచుకోలేదు. విలాసవంతమైన జీవితం వైపు దేశ్‌ముఖ్ మొగ్గు చూపలేదు, ఆడంబరమైన జమిందారీ అధికారాలకి ఆకర్షితులవ్వలేదు. అనభేరికి తన 27వ ఏట అప్పటి చెన్నూర్ తాహసీల్దార్ వెల్ముల నారాయణ రావు, లక్ష్మీనర్సుభాయి గార్ల చిన్న కుమార్తె సరళా దేవి గారితో పెళ్లి అయింది. సరళా దేవి గారు అనభేరి గురించి విని ఆయన ఆదర్శాలకు ఆకర్షితురాలై ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఆయనకు భార్య అవడమే కాకుండా ఆ కాలంలో 8వ తరగతి వరకు చదువుకొన్న ఆమె అనభేరికి అన్ని విధాల సహకరించేవారు. భర్తతో పాటు మీటింగుల్లోనూ, సభల్లోనూ, ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో, సమావేశాల్లో వీరిద్దరూ పాటల రూపంలో ప్రజలను ఉత్తేజపరచేవారు. తమ ఇంటికీ వచ్చే లెక్కలేనంత మంది పార్టీ కార్యకర్తలకి అన్నపూర్ణమ్మలా స్వయంగా పనివాళ్ళ సాయం లేకుండా భోజనాలు సమకూర్చేది. జనానికి స్ఫూర్తి ప్రభాకర్ రావు గారైతే ఆయన స్ఫూర్తికి మూలం సరళాదేవి గారయ్యారు. 1938లో ఆంధ్ర మహాసభకి జిల్లా సెక్రెటరీగా పని చేసిన అనభేరి హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్ర మహాసభ ప్లీనరీలో ప్రముఖ పాత్ర పోషించారు. తాను ధనిక, పెత్తందారీ వర్గానికి చెందిన వాడినని, పేద ప్రజలు తన వ్యతిరేక వర్గానికి చెందిన వాళ్లని ఆయన అందరు దొరల్లాగ ఆలోచించ లేదు. తాను తినే పంచభక్ష్య పరమాన్నాల్లో ఆయనకు పేదవాడి రక్తం మరియు ఆకలి కనిపించింది. పట్టు పరుపుల మీద పడుకునే ఆయనకు పేదవాడి అప్పుల సెగ తగిలింది. తన చుట్టూ ఉన్న దాసీలలో కనిపించని స్త్రీ జాతి సంకెళ్ళు ఆయనను కదిలించాయి. పాలేర్ల వెట్టి బ్రతుకుల్లోని భారం ఆయన వెన్ను తట్టింది. ఆదర్శమూర్తైన ప్రభాకర్ రావు గారు ఇంటి నుంచే తన ఆదర్శాలను అమలు చేశారు. పాలేర్ల పిల్లలకు చదువులు చెప్పించారు. తమ ఇంట్లోని దాసీలకు పెళ్లిళ్లు చేసి పంపించడమే కాకుండా వారికి ఇండ్లు కట్టించి ఇచ్చి, వాళ్ళ దాస్య శృంఖలాలను తెంచి వేసి, వాళ్ళ జీవితాల్లో స్వేచ్చా వెలుగులు నింపి, స్త్రీ జాతికి గౌరవాన్ని అందచేసి మహా పురుషుడయ్యారు అనభేరి. ఈయన ఆర్య సమాజ్ సిద్ధాంతాలను ఆచరించి ఇంట్లో అందరిని ఆచరింప చేశారు. మాంసంతో పాటు మద్యాన్ని కూడా నిషేధింప చేశారు. ప్రతి దసరాకి తమ జమిందారీకి 66 ఊర్ల నుండి వెట్టిగా/కానుకగా వచ్చే గొర్రె పిల్లలను మానిపించారు. ఆ రోజుల్లో రజాకార్ల అమానుషత్వానికి గురౌతున్న ప్రజల బ్రతుకులు అనభేరిని కదిలించాయి. ప్రజలకు చదువు నేర్పి వాళ్ళను చైతన్యవంతులను చేయడానికి ఆయన కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డలో వయోజనుల కోసం నైట్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఊర్లో ధాన్యం దొరకక ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ప్రభాకర్ రావు గారు గ్రెయిన్ బ్యాంకు నెలకొల్పి రైతులకు విత్తనాలను, ధాన్యాలను అందచేసేవారు. రైతులను చైతన్య పరచేందుకు రైతు మహాసభలు నిర్వహించేవారు అనభేరి. ఇలా ఎంతోమంది అన్నదాతలను ఆదుకొన్నారు. నూలు దొరకక, మగ్గం ఆడక బ్రతుకులు సతమతమవుతున్న నేతన్నలను ఆదుకోవడానికి ఊర్లలో సహకార సంఘాలు స్థాపించి హైదరాబాద్ కమిషనర్ నుండి పెట్టెల్లో నూలు తెచ్చి, చేనేత కార్మికులకు రేషన్ కార్డులు ఇప్పించి వాటి ద్వారా నూలు అందించేవారు. సిరిసిల్ల సెంటర్‌గా ఉండేది. ఇలా ప్రభాకర్ రావు గారు దాదాపు 40 వేల మందికి రేషన్ కార్డ్స్ ఇప్పించారు. అనభేరి 1942 నుండి 1946 వరకూ 5 సంవత్సరాలు రాష్ట్ర చేనేత సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి ఆయన ఎంతో మంది చేనేత కార్మికులను ఆకలి చావుల నుండి తప్పించి వారికి ఒక కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీకి జిల్లా నుండి మొదటి వ్యక్తిగా నాయకత్వం వహించారు. సాయుధ పోరాటంలో భాగంగా వందలాది మందితో ఏర్పడ్డ దళానికి అనభేరి నాయకత్వం వహించి ఆదిలాబాద్, విజయవాడ, సిర్వంచ, చాందా, కరీంనగర్ దళాలకు సహచరుడు సింగిరెడ్డి భూపతిరెడ్డితో కలసి శిక్షణ ఇచ్చారు. 40 గ్రామాల్లో పటేల్ పట్వారీల వ్యవస్థకి వ్యతిరేకంగా దాడి చేసి దాస్తావేజుల్ని కాల్చివేయడం ద్వారా రైతుల అప్పు పత్రాల్ని, దొంగ పట్టాలు, భూమి పత్రాల్ని ఇతర పన్ను పత్రాల్ని కాల్చివేసి పెత్తందార్ల అమానుషత్వానికి గురౌతున్న పేద రైతులను కాపాడి వాళ్లను శాప విముక్తుల్ని చేశారు అనభేరి. ఆయన నాయకత్వంలో సాయుధ పోరాటం ఒక కొత్త దిశగా మలుపు తిరిగింది. గ్రామాల్లో పడి ఇళ్ళను కాల్చి వేసి, స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడుతున్న రజాకార్లను తమ దళంతో తరిమికొట్టి ప్రజల ప్రాణాల్ని స్త్రీల గౌరవాన్నిఆయన కాపాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి చేనేత కార్మికులకు లేని రేషన్ ఇప్పిస్తున్నారని, అప్పటి తాలుక్దార్ బాకూర్ హుస్సేన్ అనభేరికి ఎన్నోసార్లు వారంట్లు జారీ చేసిన ఆయన బెదరలేదు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అనభేరి కార్యక్రమాల్ని అడ్డుకునేందుకు ఆయనకు తాలుక్దార్ పదవిని ప్రభుత్వం ఆశ చూపింది. కానీ తన ఆస్థిని, వతన్లను, హోదాను ప్రజల కోసం త్యాగం చేసిన అనభేరి ముందు నిజాం ప్రభుత్వం ఆయనకు ఎరగా చూపిన తలుక్దార్ పదవి గడ్డి పోచ అయింది. అనభేరి లొంగకపోవడంతో ప్రభుత్వం ఆయన సభలను నిషేధించింది. ప్రభాకర్ రావు గారిపై నజార్బంద్ జారీ చేయడంతో వారు అజ్ఞాతంలోకి పోవలసి వచ్చింది. అరచేయి అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఎలా ఆపలేరో అలాగే అనభేరి కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేక పోయింది. భగ భగ మండే ప్రభాకరుడే అయ్యారు అనభేరి. (పెత్తందార్లు తమ ఆటలు సాగక అనభేరిని అడ్డు తొలగించడానికి, నిజాం ప్రభువుకు బంగారు కుర్చీ నజరానాగా ఇచ్చారని ఒక వదంతి కూడా ఉంది). నిజాంకు సింహస్వప్నంలా మారిన అనభేరిని పట్టించిన వారికి 50 వేల రూపాయల బహుమానం ప్రకటించింది ప్రభుత్వం. కానీ, పేద ప్రజలు సైతం ఆ డబ్బులకు లొంగలేదు. ఆయన ఎలా ఉంటారో తెలియక పోవడంతో నైజాం పోలీసులు నేనే అనభేరి అంటూ ముందుకు వచ్చిన వారిని కాల్చివేయ సాగారు. తమ దేవుడిలా చూసుకొనే అనభేరిని రక్షించుకునేందుకు సామాన్య ప్రజలు డబ్బుల్ని, చివరికి తమ ప్రాణాల్ని సైతం అర్పించడానికి ముందుకు వచ్చారు. 1948 మార్చి14న నిజాం ప్రభుత్వంతో కుమ్ముక్కైన మహ్మదాపూర్ పోలిస్ పటేల్ కుట్రతో అనభేరి దళాన్నిభోజనానికి పిలిచి రజాకార్లకు సమాచారం అందించాడు. ఒక్కసారిగా రజాకార్లు దాడి చేయడంతో అనభేరి ఊర్లో వార్లకు ప్రాణాపాయం ఉండకూడదని, తమ దళంతో గుట్టల వైపు పరుగెత్తారు. అనభేరికి తప్పించుకొనే అవకాశం ఉండి కూడా ఇప్పటికే తన కోసం ఎంతోమంది ప్రజలు ప్రాణ త్యాగానికి సిద్దం అవుతున్నారని, భరించలేక రజాకార్లతో యుద్దానికే సిద్దం అయ్యారు ఆయన. తన స్టెన్ గన్‌తో ఫైరింగ్ చేస్తూ ఎంతో మంది రజాకార్లని మట్టి కరిపించిన ఆయన తన ఫ్రెండ్ భూపతి రెడ్డి గాయపడడంతో ఆయనకు ఒక చేత్తో బ్యాండేజ్ చేస్తూ మరో చేత్తో ఫైరింగ్ చేయసాగారు. గాయపడ్డ అనభేరిని రజాకార్లు నీళ్లు ఇచ్చి హాస్పిటల్‌కు తీసుకుపోతం అన్నా కూడా ఆయన వాళ్లిచ్చిన నీరు తాగడానికి కానీ, హాస్పిటల్‌కు పోయి ప్రాణాలు కాపాడుకోవడానికి కానీ ఇష్టపడలేదు. చనిపోయిన ఆయన కోటును కట్టెకు చుట్టి “షేర్ మర్ గయా “ అంటూ రజాకార్లు అక్కడి ఊర్లన్ని తిరుగుతూ నినాదాలు చేశారు. అనభేరి మరణంతో ఒక్కసారిగా తెలంగాణ అంతా భగ్గుమంది. ప్రతి ఊర్లోను యువకులు, స్త్రీలు దళాలుగా ఏర్పడి ఉద్యమించారు. ఫలితంగా ఆయన మరణించిన ఆరు నెలల్లోపే తెలంగాణ చెర వీడింది. తెలంగాణ ఉద్యమంలో తొలి సమిధగా మారి, తెలంగాణ విముక్తికి మూలం అయిన అనభేరికి, ప్రభుత్వం ఆయన త్యాగానికి సరైన గుర్తింపు నిస్తుందని, ఆయన స్ఫూర్తి దాయకమైన చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చుతుందని, తెలంగాణకే తలమానికం అయిన తెలంగాణ షేర్/భగత్ సింగ్ అయిన ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై నెలకొల్పుతుందని, ఎంతో మంది చేనేత కార్మికులు, కర్షకులకు జీవం పోసిన ఆయనకు సరైన స్థానం కల్పిస్తుందని, తెలంగాణ ప్రజల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆయన కోసం, తెలంగాణ ఆడపడచుల గౌరవాన్ని కాపాడిన అనభేరి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వ తరఫున నిర్వహించేలా కార్యక్రమాల్ని చేపడుతుందని ఆశిద్దాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి విన్నవిద్దాం. (నేడు తెలంగాణ షేర్ అనభేరి ప్రభాకర్ రావు గారి జయంతి సందర్భంగా.....) - ఉమా సల్వాజి (న్యూజిలాండ్, అనభేరి మనమరాలు) -
పేదరికం లేని తెలంగాణ ఏది?
► రజాకార్లపై సాగిన పోరాట లక్ష్యం సాధించారా: అమిత్ షా ► రాష్ట్రాన్ని బీజేపీకి కోటలా మారుస్తాం ► మా ప్రభుత్వం వచ్చేందుకు ప్రజలు సహకరించాలి ► గుండ్రాంపల్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ► అమరుల కుటుంబీకులకు సన్మానం నల్లగొండ జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘రజాకార్ల వ్యతిరేక పోరాటం, హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలన నుంచి విముక్తి చేసిన పోరాట లక్ష్యాలను సాధించగలిగారా? పేదరికం లేని తెలంగాణను సాధించగలి గారా..?’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో చివరిరోజు పర్యటనలో భాగంగా బుధవారం గుండ్రాంపల్లి పోలింగ్ బూత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలపడేలా, తెలంగాణను బీజేపీ కోటగా మార్చేలా ముందుకెళుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా గుండ్రాంపల్లిని బీజేపీకి పెట్టని కోటగా చేస్తామని, మోదీ నాయకత్వం లో బీజేపీని అధికారంలోకి తెస్తామని అక్కడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో అమిత్ షా ప్రతిజ్ఞ చేయించారు. రజాకార్ల దాష్టీకం, అకృత్యాల గురించి బీజేపీ ఇప్పుడెం దుకు లేవనెత్తుతోందంటూ నల్లగొండలో ఒక విలేకరి ప్రశ్నించారని, దీని వెనక కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉన్నాయని ఆయన విమర్శించారు. ‘‘రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినవారిని బీజేపీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. వారిని హృదయాంతరాల్లోంచి గౌరవప్రదంగా చూస్తాం. తెలంగాణ పోరాట అమరులకు గుర్తింపు, గౌరవం లభించే వరకు మా పార్టీ పోరాడుతుంది. వారు చిందించిన ప్రతి రక్తపు బొట్టును గుర్తుంచుకొని అందుకు వంద రెట్ల కాలం వరకు ఆ చరిత్రను తెలియజేసేలా చేస్తాం..’’ అని అన్నారు. గుండ్రాంపల్లికి ప్రాధాన్యం స్వాతంత్య్రం కోసం రజాకారు ముష్కర మూకలకు వ్యతిరేకంగా 160 మందికి పైగా పేద ప్రజలు ప్రాణాలొడ్డిన గుండ్రాంపల్లికి పుణ్యక్షేత్రం, తీర్థస్థానమంత ప్రాధాన్యం ఉందని అమిత్ షా అన్నారు. ‘‘ఇదొక చారిత్రక గ్రామం. తెలంగాణ స్వాతంత్య్ర సేన నాయకులు పుట్టిన గడ్డకు నమస్కారాలు... ఇక్కడి ప్రజల త్యాగనిరతి, ప్రాణత్యాగానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ప్రజలకు దేశం శిరసు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తోంది. యావత్ దేశానికి స్వాతంత్య్రం లభించి సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాలు బానిసత్వంలో మగ్గాయి..’’ అని అన్నారు. నిజాం ప్రభుత్వ నియంతృత్వాన్ని, రజాకార్ల అరాచకాలను ప్రశ్నించినందుకు గుండ్రాంపల్లిలోని ప్రజలను ఊచకోత కోసి ఒక బావిలో పడేయడం హృదయ విదారకరమన్నారు. ఈ సందర్భంగా ఒక బస్తా పుస్తెలను రజాకార్లు తీసుకెళ్లారన్నారు. అనంతరం గుండ్రాంపల్లి పోరాటాన్ని తెలిపే ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అమిత్ షా.. రజాకార్ల చేతుల్లో మరణించిన యోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఉత్తమ్ క్షమాపణలు చెప్పాలి: లక్ష్మణ్ యోధుల త్యాగాలను కించపరిచేలా వ్యాఖ్య లు చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్‌చేశారు. గుండ్రాంపల్లిలో అమరుల త్యాగాలకు నివాళి అర్పించేందుకు బీజేపీ నాయకులు వస్తే కాంగ్రెస్ నేతలు విడ్డూరంగా మాట్లాడు తున్నారన్నారు. .విద్వేషాలు రెచ్చ గొట్టేలా బీజేపీ పర్యటన ఉందంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ పుంజుకుంటుంటే భరించ లేక చౌకబారు ప్రకటనలు చేస్తూ అమరుల ఆత్మలు ఘోషించేలా ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. కృష్ణా–గో దావరి నదులను అనుసంధానం చేయడంతో పాటు, మూసీ ప్రక్షాళనకు చర్యలు తీసుకో వాల్సి ఉందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ప్రతిపాదనను కేంద్ర టూరిజం శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ శ్రేణులకు సూచించారు. 2019 ఎన్నికల్లో గెలవబోతున్నామని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి చెప్పాలని పేర్కొన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో అమిత్ షా పర్యటించారు. స్థానిక రహదారి బంగ్లాలో పార్టీ జిల్లా పదాధికారులతో ఇష్టాగోష్టి చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. పదవులే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం పని చేయాలని చెప్పారు. బూత్‌స్థాయిలో సభ్యుల సంఖ్య ప్రస్తుతం 5 నుంచి 10 వరకు ఉందని దాన్ని 25 వరకు పెంచాలన్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు నల్లగొండ జిల్లా నుంచి భువనగిరిలోని యశోధ జయలక్ష్మి గార్డెన్‌కు చేరుకున్న అమిత్ షాకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భువనగిరిలోని ఇందిరానగర్‌లో దళితులతో కలసి అమిత్ షా సహపంక్తి భోజనం చేశారు. మూడోరోజు.. వడివడిగా.. ► గుండ్రాంపల్లిలో ఆరు కుటుంబాలను కలిసిన అమిత్ షా ► రాష్ట్రంలో ముగిసిన పర్యటన సాక్షి, నల్లగొండ: తన పర్యటనలో చివరిరోజైన బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం నల్లగొండ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి నేరుగా గుండ్రాంపల్లి వెళ్లారు. గ్రామంలో ఆరు కుటుంబాలను కలిశారు. తర్వాత నాటి తెలంగాణ సాయుధ పోరాట దృశ్యాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం సాయుధ పోరాటంలో పాల్గొన్న సమర యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో... ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అమిత్ షాకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వినతిపత్రం అందజేశారు. అనంతరం అమిత్ షా భువనగిరి వెళ్లారు. బుధవారం రాత్రి వరకు హైదరాబాద్‌లో పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రంలో అమిత్ షా పర్యటన ముగిసింది.