పేదరికం లేని తెలంగాణ ఏది?
► రజాకార్లపై సాగిన పోరాట లక్ష్యం సాధించారా: అమిత్ షా
► రాష్ట్రాన్ని బీజేపీకి కోటలా మారుస్తాం
► మా ప్రభుత్వం వచ్చేందుకు ప్రజలు సహకరించాలి
► గుండ్రాంపల్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు
► అమరుల కుటుంబీకులకు సన్మానం
నల్లగొండ జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘రజాకార్ల వ్యతిరేక పోరాటం, హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలన నుంచి విముక్తి చేసిన పోరాట లక్ష్యాలను సాధించగలిగారా? పేదరికం లేని తెలంగాణను సాధించగలి గారా..?’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో చివరిరోజు పర్యటనలో భాగంగా బుధవారం గుండ్రాంపల్లి పోలింగ్ బూత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలపడేలా, తెలంగాణను బీజేపీ కోటగా మార్చేలా ముందుకెళుతున్నామని చెప్పారు.
ఇందులో భాగంగా గుండ్రాంపల్లిని బీజేపీకి పెట్టని కోటగా చేస్తామని, మోదీ నాయకత్వం లో బీజేపీని అధికారంలోకి తెస్తామని అక్కడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో అమిత్ షా ప్రతిజ్ఞ చేయించారు. రజాకార్ల దాష్టీకం, అకృత్యాల గురించి బీజేపీ ఇప్పుడెం దుకు లేవనెత్తుతోందంటూ నల్లగొండలో ఒక విలేకరి ప్రశ్నించారని, దీని వెనక కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఉన్నాయని ఆయన విమర్శించారు. ‘‘రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినవారిని బీజేపీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. వారిని హృదయాంతరాల్లోంచి గౌరవప్రదంగా చూస్తాం. తెలంగాణ పోరాట అమరులకు గుర్తింపు, గౌరవం లభించే వరకు మా పార్టీ పోరాడుతుంది. వారు చిందించిన ప్రతి రక్తపు బొట్టును గుర్తుంచుకొని అందుకు వంద రెట్ల కాలం వరకు ఆ చరిత్రను తెలియజేసేలా చేస్తాం..’’ అని అన్నారు.
గుండ్రాంపల్లికి ప్రాధాన్యం
స్వాతంత్య్రం కోసం రజాకారు ముష్కర మూకలకు వ్యతిరేకంగా 160 మందికి పైగా పేద ప్రజలు ప్రాణాలొడ్డిన గుండ్రాంపల్లికి పుణ్యక్షేత్రం, తీర్థస్థానమంత ప్రాధాన్యం ఉందని అమిత్ షా అన్నారు. ‘‘ఇదొక చారిత్రక గ్రామం. తెలంగాణ స్వాతంత్య్ర సేన నాయకులు పుట్టిన గడ్డకు నమస్కారాలు... ఇక్కడి ప్రజల త్యాగనిరతి, ప్రాణత్యాగానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ప్రజలకు దేశం శిరసు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తోంది.
యావత్ దేశానికి స్వాతంత్య్రం లభించి సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాలు బానిసత్వంలో మగ్గాయి..’’ అని అన్నారు. నిజాం ప్రభుత్వ నియంతృత్వాన్ని, రజాకార్ల అరాచకాలను ప్రశ్నించినందుకు గుండ్రాంపల్లిలోని ప్రజలను ఊచకోత కోసి ఒక బావిలో పడేయడం హృదయ విదారకరమన్నారు. ఈ సందర్భంగా ఒక బస్తా పుస్తెలను రజాకార్లు తీసుకెళ్లారన్నారు. అనంతరం గుండ్రాంపల్లి పోరాటాన్ని తెలిపే ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అమిత్ షా.. రజాకార్ల చేతుల్లో మరణించిన యోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు.
ఉత్తమ్ క్షమాపణలు చెప్పాలి: లక్ష్మణ్
యోధుల త్యాగాలను కించపరిచేలా వ్యాఖ్య లు చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్‌చేశారు. గుండ్రాంపల్లిలో అమరుల త్యాగాలకు నివాళి అర్పించేందుకు బీజేపీ నాయకులు వస్తే కాంగ్రెస్ నేతలు విడ్డూరంగా మాట్లాడు తున్నారన్నారు.
.విద్వేషాలు రెచ్చ గొట్టేలా బీజేపీ పర్యటన ఉందంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ పుంజుకుంటుంటే భరించ లేక చౌకబారు ప్రకటనలు చేస్తూ అమరుల ఆత్మలు ఘోషించేలా ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. కృష్ణా–గో దావరి నదులను అనుసంధానం చేయడంతో పాటు, మూసీ ప్రక్షాళనకు చర్యలు తీసుకో వాల్సి ఉందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ప్రతిపాదనను కేంద్ర టూరిజం శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ శ్రేణులకు సూచించారు. 2019 ఎన్నికల్లో గెలవబోతున్నామని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి చెప్పాలని పేర్కొన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో అమిత్ షా పర్యటించారు. స్థానిక రహదారి బంగ్లాలో పార్టీ జిల్లా పదాధికారులతో ఇష్టాగోష్టి చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. పదవులే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం పని చేయాలని చెప్పారు.
బూత్‌స్థాయిలో సభ్యుల సంఖ్య ప్రస్తుతం 5 నుంచి 10 వరకు ఉందని దాన్ని 25 వరకు పెంచాలన్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు నల్లగొండ జిల్లా నుంచి భువనగిరిలోని యశోధ జయలక్ష్మి గార్డెన్‌కు చేరుకున్న అమిత్ షాకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భువనగిరిలోని ఇందిరానగర్‌లో దళితులతో కలసి అమిత్ షా సహపంక్తి భోజనం చేశారు.
మూడోరోజు.. వడివడిగా..
► గుండ్రాంపల్లిలో ఆరు కుటుంబాలను కలిసిన అమిత్ షా
► రాష్ట్రంలో ముగిసిన పర్యటన
సాక్షి, నల్లగొండ: తన పర్యటనలో చివరిరోజైన బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం నల్లగొండ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి నేరుగా గుండ్రాంపల్లి వెళ్లారు. గ్రామంలో ఆరు కుటుంబాలను కలిశారు. తర్వాత నాటి తెలంగాణ సాయుధ పోరాట దృశ్యాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం సాయుధ పోరాటంలో పాల్గొన్న సమర యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేశారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో... ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అమిత్ షాకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వినతిపత్రం అందజేశారు. అనంతరం అమిత్ షా భువనగిరి వెళ్లారు. బుధవారం రాత్రి వరకు హైదరాబాద్‌లో పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రంలో అమిత్ షా పర్యటన ముగిసింది.