'తెలంగాణకు రూ.లక్ష కోట్లు ఇచ్చాం' | Amit shah speaks to media in nalgonda | Sakshi
Sakshi News home page

'తెలంగాణకు రూ.లక్ష కోట్లు ఇచ్చాం'

Published Tue, May 23 2017 5:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'తెలంగాణకు రూ.లక్ష కోట్లు ఇచ్చాం' - Sakshi

'తెలంగాణకు రూ.లక్ష కోట్లు ఇచ్చాం'

నల్గొండ: దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలోకి వచ్చిందని మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ రాక ముందు సరిహద్దులో రక్షణ ఉండేది కాదని, దేశం పరువు దిగజారిపోయిందని అన్నారు. యూపీఏ పాలనలో యువత కూనారిల్లిపోయారని విమర్శించారు. ఇంకా అమిత్‌ షా ఏమన్నారంటే..

- ఈ నెల 26తో బీజేపీ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తవుతాయి.
- ఈ మూడేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా మేం పనిచేశాం.
- పాలనలో పారదర్శకతకు నిజమైన అర్ధాన్ని తీసుకువచ్చాం.
- ప్రపంచంలోనే వేగవంతంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ పేరొందింది.
- 4.4 దగ్గర ఉన్న వృద్ధి రేటును మూడేళ్లలో 7.5 శాతం వరకు తీసుకొచ్చాం.
- జనధన యోజనతో కోట్లాది మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు.
- ఉజాలా పథకంతో పేదలకు సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం.
- ముద్రా బ్యాంకుతో ఇప్పటి వరకూ ఆరు కోట్ల మందికి రుణాలు ఇచ్చాం.
- సర్జికల్ స్ట్రైక్ చేసి దేశం పరువును నిలబెట్టాం.
- రాజకీయపార్టీలు రూ.20 వేల వరకు నగదు రూపంలో తీసుకునే విరాళాలను రూ.2 వేలకు తగ్గించాం.
- ప్యారిస్ సదస్సులో భారతదేశం వాతావరణ విషయంలో ముందడుగు వేసింది.
- నల్లబజారును అడ్డుకోడానికి పెద్దనోట్లు రద్దు చేశాం.
- వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకాన్ని మిగిలిన వాళ్లు ముట్టుకోవడానికి కూడా సాహసించలేదు. దాన్ని జవాన్ల కోసం తీసుకొచ్చాం.
- వేలాది గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించాం.
- శత్రు సంపత్తి బిల్లు తీసుకొచ్చి ఆ ఆస్తులు స్వాధీనం చేసుకోడానికి పెద్ద ముందడుగు వేశాం.
- ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో పాన్ నంబర్లు నమోదు కావడం ఇదే తొలిసారి.
- డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి.
- హార్ట్‌ సర్జరీలకు అవసరమయ్యే స్టంట్ ధరలను నియంత్రణలో పెట్టాం.
- రైతుల కోసం భూ ఆరోగ్య కార్డులు, ప్రధానమంత్రి ఇరిగేషన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాలను తెచ్చాం.
- ఒకేసారి 105 శాటిలైట్లు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి ప్రపంచ ఘనతను సాధించాం.
- ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో చాలా వాటిలో బీజేపీ విజయాలు సాధించింది.
- ఆపరేషన్ క్లీన్ మనీ పోర్టల్ ఇటీవలే మొదలైంది, జీఎస్టీ చట్టాన్ని కూడా తీసుకొచ్చాం.
- నాయకుల వాహనాల నుంచి ఎర్రలైట్లు తీసేసి, వీఐపీ సంస్కృతిని నిర్మూలించాం.

తెలంగాణ ప్రస్తావన..
తెలంగాణ రాష్ట్రానికి గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని మేలును బీజేపీ చేసిందని చెప్పారు. 13వ ఆర్థిక సంఘంలో కేంద్ర పన్ను వాటాలో తెలంగాణకు రూ.9799 కోట్లు ఉంటే.. 14వ ఆర్థిక సంఘంలో ఈ కేటాయింపులు పది రెట్లు పెరిగాయని వెల్లడించారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కూడా నాలుగున్నర రెట్లు పెరిగిందని అన్నారు.

స్ధానిక సంస్ధల గ్రాంటు రూ.2 వేల కోట్లు ఉంటే దాన్ని రూ.8 వేల కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఎయిమ్స్‌, ట్రైబల్‌ యూనివర్సిటీ, హార్టికల్చర్‌ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. రూ. 40 వేల కోట్లు విలువ కలిగిన ఇన్‌ ఫ్రా ప్రాజెక్టులను తెలంగాణకు ఇచ్చామని తెలిపారు. వీటన్నింటినీ కలిపితే తెలంగాణ రాష్ట్రానికి రూ. లక్ష కోట్లను బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.

తెలంగాణలో పార్టీలను ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. పార్టీలు ఫిరాయించిన వారిపై స్పీకర్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement