మా ప్రవేశ ద్వారం తెలంగాణే
► 2019లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది
►దక్షిణాదిలో బీజేపీకి ప్రవేశ ద్వారం తెలంగాణే
►రాష్ట్ర అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉంది
►ఏటా రూ. 20 వేల కోట్ల కన్నా ఎక్కువే ఇస్తున్నాం
►నల్లగొండ జిల్లా పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు
సాక్షి, నల్లగొండ: ‘‘మనస్ఫూర్తిగా చెబుతున్నా.. దక్షిణ భారతదేశంలో మా ప్రవేశ ద్వారం తెలంగాణే. దేశ అభివృద్ధిలో మేం కీలక పాత్ర పోషిస్తున్నాం. అదే విధంగా తెలంగాణ అభివృద్ధికి కూడా మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పడి తీరుతుంది..’’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉద్ఘాటించారు. తెలంగాణకు ఏటా రూ.20 వేల కోట్ల కన్నా ఎక్కువే ఇస్తున్నామని, ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక సంస్థలను మంజూరు చేశామని చెప్పారు.
భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ ప్రజలు తమను అక్కున చేర్చుకోవాలని కోరారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో జరిగిన పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోదీ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి యాత్ర పేదల అభ్యున్నతి కోసమేనని చెప్పారు. మూడేళ్లుగా దేశంలోని పేదలు, దళిత, ఆదివాసీలు, యువకులు, రైతులు, రైతుకూలీలు, మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాలను తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో విఫలమైందని విమర్శించారు.
పింఛన్లు ఇచ్చే దిక్కులేదు..
హైదరాబాద్‌కు నల్లగొండ జిల్లా ఎంతో దూరంలో లేదని, అయినా ఇక్కడ తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు తీరలేదని అమిత్ షా అన్నారు. ‘‘ఉపాధి లేదు.. మహిళలు, వితంతువులకు పింఛన్లు ఇచ్చే దిక్కు కూడా లేదు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఇక్కడి ప్రజలు బీజేపీని ఆదరించాలి. దేశ అభివృద్ధితో పాటు రక్షణపరమైన సవాళ్లు ఎప్పుడొచ్చినా మేం రాజీపడలేదు. రక్షణ సవాళ్లను అధిగమించి ఒక కొండలా నిలబడ్డాం. పాక్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ద్వారా జవాన్లలో ఆత్మస్థైర్యాన్ని నింపడంతోపాటు దేశ ప్రజలకు భరోసా ఇచ్చాం’’అని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే తాము 13 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అసోం నుంచి గుజరాత్ వరకు బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
మచ్చలేని నాయకుడు మోదీ..
మూడేళ్లుగా జవాబుదారీతనంతో, పారదర్శకంగా పాలిస్తూ మచ్చలేని నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. మత రిజర్వేషన్ల పేరుతో తెలంగాణ సమాజాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోందని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి కంకణాల శ్రీధర్‌రెడ్డితోపాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.