మోదీని ప్రపంచమంతా గుర్తిస్తోంది..అమిత్ షా
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ..బీజేపీ ప్రభుత్వ విజయాలను, పథకాలను ఉటంకిస్తూ , మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.
మోదీ నాయకత్వం మీద తమ పార్టీకి అపారమైన విశ్వాసం ఉందని అమిత్ షా తెలిపారు. తమది ముందు చూపున్న ప్రభుత్వమని, అందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వమని అన్నారు. గత ఏడాది కాలంలో ప్రధాని కార్యాలయం ప్రతిష్ట మరింత పెరిగిందని, ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. విధానమైన, సత్వర నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తున్నామన్నారు. ఎలాంటి బెరుకు లేకుండా, స్వేచ్ఛగా, పారదర్శకంగా అన్ని ప్రభుత్వ శాఖలూ పనిచేస్తున్నాయని అమిత్ షా చెప్పుకొచ్చారు. మోదీ క్రియాశీలతను ప్రపంచం గుర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం, నమ్మకాన్ని పొందడం తమ పార్టీ సాధించిన గొప్ప విజయమని, మిగతా అన్ని ప్రభుత్వాల కంటే బీజేపీ ప్రభుత్వం చాలా భిన్నమైందని అమిత్ షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిందని... గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన మాండేటరీతో కాంగ్రెస్కు గట్టి దెబ్బ తలిగిందన్నారు.
అనేక అవకతవకలతో కునారిల్లుతున్న ప్రభుత్వాన్ని తమ బీజేపీ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో అభివృద్ధి బాటలో నడిపిస్తోందన్నారు. గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ దేశానికి ఏం సాధించి పెట్టిందని ఆయన ప్రశ్నించారు. అవినీతిని, నల్లధనాన్ని అరికట్టడంలో విఫలమైందంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకుపడ్డారు.