దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం బానిస సంకెళ్లతో మగ్గిపోయారు. అప్పటి నిజాం హయాంలోని రజాకార్ల దాష్టికాలతో అనుక్షణం భయం భయంగా బతికారు. ఈ బానిస బతుకుల విముక్తి కోసం కొనసాగిన మహత్తర రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ విమోచనోద్యమానికి పురుడుపోసిన నేలగా ఉమ్మడి మెదక్ జిల్లా నిలిచింది. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట తదితర గ్రామాల్లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. నాటి వీరుల వీరోచిత పోరాటానికి తలొగ్గిన నిజాం నవాబు 1948 సెప్టెంబర్ 17న లొంగుబాటు ప్రకటన చేశాడు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం...
మద్దూరు(హుస్నాబాద్) : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా కూడా తెలంగాణ ప్రాంతంలో మాత్రం నిజాం రజాకార్ల ఆగడలకు ఎదురొడ్డి నిలిచిన గ్రామంగా బైరాన్‌పల్లి కీర్తి గడించిన ఘనత దక్కించుకుంది. అంతే కాదు రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అనేక మంది వీర మరణం పొందారు. ముస్లింలు అధికంగా ఉన్న మద్దూరు, లద్నూర్, సలాఖపూర్, రేబర్తి, మర్మాముల గ్రామాలను రజాకార్లు తమ స్థావరాలుగా చేసుకొని దాడులు చేస్తుండే వారు. ఈ క్రమంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని రజాకార్ల దాడులను తిప్పి కొట్టడంలో చుట్టు పక్కల గ్రామాలు కీలక పాత్ర పోషించాయి. (రంగు మారిన పవన్ రాజకీయం)
గ్రామ రక్షక దళాలు
రజాకార్ల అరచకాలను ఎదురించేందుకు గ్రామాల్లోని యువకులంత కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డాయి. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాల్లో ఏర్పడిన రక్షణ దళాలు బైరాన్‌పల్లిని కేంద్రంగా చేసుకొని నిరంతరం రజాకార్ల దాడులను తిప్పికొట్టేవి. దీంతో రజాకార్లు 1948లో దూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలపై దాడులు చేసిదొరికిన వారిని దొరికినట్లు చంపడంతో పాటు ఆయా గ్రామాలను తగులబెట్టారు. ఆపై తిరిగి వస్తున్న రజాకార్లపై బైరాన్‌పల్లి వద్ద రక్షణ దళాలల నాయకులు దువ్వురి రాంరెడ్డి, మురళీధర్‌రావు, ముకుందర్ రెడ్డి నాయకత్వంలో కాపు కాచి గేరిల్లా దాడులు చేశారు.అంతే కాకుండా లింగాపూర్ దూల్మిట్ట గ్రామాలలో దోచుకున్న సంపదను స్వాధీనం చేసుకున్నారు. (అనూహ్య ఘటన.. భట్టి ఇంటికి తలసాని)
కూటిగల్‌పై దాడి
బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలకు కూటిగల్ ప్రజలు సఆయ సహకారులు అందించడంతో మూడు సార్లు దాడిని బైరాన్‌పల్లి గ్రామస్తులు తిప్పి కొట్టారని కోపంతో 1948 ఆగస్టు27న బైరాన్‌పల్లి దాడి తర్వాత కొంత మంది రజాకార్లు కూటిగల్ గ్రామంపై దాడి చేసి బురుజుపై ఉన్న వారిని కిందకు దింపి తూటల మర్రి వరకు తీసుకొచ్చి రెక్కలు కట్టి నిల్చొబెట్టి 22 మందిని కాల్చి చంపి రజాకార్లు పైసాచిక ఆనందం పొందారు.
ఊరంతా దిగ్బంధం
బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలు దాడులు చేయడంపై రజాకార్లు ఆగ్రహించుకొని ఆ గ్రామంపై రజాకార్లు మూడుసార్లు దాడులు చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో 1948 ఆగస్టు 27వ తేదీ అర్ధరాత్రి ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు జనగామ నుంచి 10 ట్రక్‌లతో బయలుదేరి రాత్రి 2గంటల ప్రాంతంలో తమకు అడ్డాగా ఉన్న లద్నూర్ గ్రామానికి చేరుకున్నారు. తెల్లవారుజాము 3గంటల సమయంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని మందుగుండు సామగ్రితో 12వందల మంది సైనికులు దిగ్భందించారు. బహిర్బూమికి వెళ్ళిన ఉల్లెంగల(వడ్ల) నర్సయ్యను పట్టుకొని గ్రామంలో ఉన్న బురుజు వద్దకు దారి చూపించమని తీసుకెళ్లారు. అదే సమయంలో నర్సయ్య వారిని నెట్టివేస్తూ రజాకార్లు గ్రామంలోకి వచ్చారని కేకలు వేస్తూ పరుగులు తీశాడు. దీంతో బురుజుపై ఉన్న కాపలదారుడు నగార మోగించారు. దీంతో రజాకార్లు కాల్పులు ప్రారంభించడంతో బురుజుపై ఉన్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్యలు మృతి చెందారు. కాల్పులు జరుగుతుండగా బురుజుపై ఉన్న మందు గుండు సామగ్రిపై నిప్పు రవ్వలు ఎగిసి పడటంతో ఒక్కసారిగా బురుజుపైభాగం పేలిపోయింది. దీంతో రజాకార్లు గ్రామంలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. ఇలా ఒకే రోజు బైరాన్‌పల్లి గ్రామంలో 96 మందిని చంపి శవాల చుట్టు మహిళలతో బతుక్మ ఆటలాడించారు.
శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు
బురుజు వద్ద అనేక మందిని పట్టుకొని చంపుతుంటే భయంతో పరుగులు పెడుతున్న మహిళలను వివస్త్రలను చేసి శవాల చుట్టూ బతుకమ్మ ఆట ఆడించి పైశాచిక ఆనందం పొందారు. కొందరు మహిళలు పారి పోతుంటే పట్టుకొని అత్యాచారం చేశారు. మహిళలు ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. –ఓజమ్మ స్వాతంత్య్ర సమరయోధురాలు, బైరాన్‌పల్లి
లెంకలు కట్టి చంపినారు
బైరాన్‌పల్లిలో దాడి కొనసాగుతుండగానే కూటిగల్‌పై దాడి చేసి కొందరిని బంధీగా పట్టుకొని బురుజుపై ఉన్న వారికి కిందకు దింపి వాగు ఒడ్డుకు ఉన్న తూటల మర్ర వద్దకు తీసుకెళ్ళి లెంకలు కట్టి చంపారు. నా కాలుకు తూటా తగిలిని తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నాను. –వంగపల్లి బాలయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు, కూటిగల్
Comments
Please login to add a commentAdd a comment