జలియన్‌ వాలాబాగ్‌ను మించిన నరమేధం | Over 75 Years Of Byron‌palli Razakars Brutal Attacks On Villagers In Medak | Sakshi
Sakshi News home page

శవాల చుట్టూ నగ్నంగా బతుకమ్మ ఆట..

Published Thu, Aug 27 2020 10:14 AM | Last Updated on Thu, Aug 27 2020 12:24 PM

Over 75 Years Of Byron‌palli Razakars Brutal Attacks On Villagers In Medak - Sakshi

సాక్షి, మద్దూరు(హుస్నాబాద్‌): జలియన్‌ వాలాబాగ్‌ సంఘటనని తలపించిన వీరబైరాన్‌పల్లి నెత్తుటి చరిత్రకు నేటితో 72 ఏళ్లు నిండాయి. రజాకారుల పాశవిక దాడులను ఎదిరించి పోరాడిన బైరాన్‌పల్లి వీరుల ప్రాణత్యాగం మరువలేనిది. బైరాన్‌పల్లి మాతృభూమి విముక్తి కోసం 118 మంది యోధులు నేలకొరిగారు. 1947 ఆగస్టు15న దేశానికి స్వాతంత్య్రం వచ్చి ప్రజలు స్వేచ్ఛ వాయువులు పిలుస్తుండగా నిజాం రాజు గుప్పిట్లో ఉన్న తెలంగాణ ప్రాంతం మాత్రం రజాకారుల దురాగతాలకు బలై బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిసింది. నిజాం సైన్యాధిపతి ఖాసీం రజ్వీ సైనికులు (రజాకార్లు)గ్రామంలో తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు 1,200 మంది సైన్యంతో  1948 ఆగస్టు 27న తెల్లవారు జామున 4 గంటలకు గ్రామాన్ని చుట్టు ముట్టారు.  

వెంటనే దళా కమాండర్‌ ఇమ్మడి రాజిరెడ్డి ప్రజలంతా తగిన రక్షణలో ఉండాలని కోరుతూ నగర మోగించారు.  గ్రామస్తులంతా బురుజు వద్ద గడీలోకి పరుగులు తీశారు. యువకులు గ్రామానికి నాలుగు వైపులా కాపు కాసి శత్రువులను గ్రామంలోనికి రాకుండా చూడాలని హెచ్చరికలు జారీ చేశారు.గ్రామాన్ని చుట్టుమూట్టిన రజాకార్లును తరిమి వేయడానికి బురుజు పై నుంచి కాల్పులు ప్రారంభించారు. గ్రామస్తులు ఏవైపు నుంచి కాల్పులు జరుపుతున్నారో చూసి రజాకార్లు కూడా కాల్పులు ప్రారంభించారు. రజాకార్లు గ్రామంలోకి చొరబడి దొరికిన వారిని దొరికిన్నట్లుగా చంపారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ బురుజు పైనున్న కొందరిని కిందకు దింపి వరుసగా నిల్చోబెట్టి దారుణంగా కాల్చి చంపి రక్తదాహాన్ని తీర్చుకున్నారు.   

శవాల చుట్టూ బతుకమ్మ ఆట..
బురుజు నుంచి భయంతో పరుగులు పెతున్న మహిళలను వెంటాడి పట్టుకున్నారు. అనేక మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. గుట్టలుగా పడి ఉన్న శవాల చుట్టూ మహిళలను వివస్తలను చేసి బతుకమ్మ ఆటలు ఆడించి కసి తీర్చుకున్నారు. 118 మంది గ్రామస్తులు వీరమరణం పొందారు. నిజాం రజాకార్లు 25 మంది మృతి చెందారు.  

పోరాటానికి గుర్తింపు కరువు 
జలియన్‌వాలాబాగ్‌ ఘటనను మించిన బైరాన్‌పల్లి పోరాటాన్ని ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం శోఛనీయమని సర్పంచ్‌ బండి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.అమరుల కుటంబలను ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో నేటికీ ఆ కుటుంబలు దయనీయ పరిస్థితిలో కాలం వెల్లదీస్తున్నాయి. స్వరాష్ట్రం కోసం సాగిన తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన వీర బైరాన్‌పల్లి పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని పలువురు కోరుతున్నారు. 

కళ్లముందు కదలాడుతున్నాయి 
నాటి రజాకార్ల దురాగతాలు నేటికి కళ్ళ ముందు కదలాడుతున్నట్లు ఉంది. గ్రామస్తులను బురుజుపై నుంచి దించి వరుసగ నిలబెట్టి కాల్చిచంపి వారు పైశాచిక ఆనందం పొందారు. ఒక్క రోజు 118 మందిని కోల్పోయి గ్రామం శవాల దిబ్బగా తయారైన ఘటన నేటికి కళ్ళముందు మెరుస్తుంటుంది. 
– వంగపల్లి రాజమ్మ, స్వాతంత్య్ర∙సమరయోధురాలు, బైరాన్‌పల్లి 

సమరయోధుల కుటుంబాలను ఆదుకోవాలి 
ఖాసీం రజ్వీ వారసులకు ఎదురు నిల్చి గ్రామం కోసం ప్రాణలు వదిలిన సమరయోధుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. జలియన్‌ వాలాబాగ్‌ ఘటనను పోలిఉన్న ఉధంతానికి ఎదురోడి తమ ప్రాణలు లెక్క చేయకుండా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలతో పాటు ఆగస్టు 27 జరిగిన పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.  – బండి శ్రీనివాస్, సర్పంచ్‌  బైరాన్‌పల్లి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement