మద్దూరు(హుస్నాబాద్): నిజాం రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన గ్రామంగా మద్దూరు మండలం బైరాన్‌పల్లి కీర్తి గడించింది. రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అనేక మంది వీర మరణం పొందారు. మద్దూరు, లద్నూర్, సలాఖపూర్, రేబర్తి, మర్మాముల గ్రామాలను రజాకార్లు తమ స్థావరాలుగా చేసుకొని దాడులు చేస్తుండే వారు. ఈ క్రమంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని రజాకార్ల దాడులను తిప్పి కొట్టడంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వీరోచిత పోరాటాలు చేశారు. ఈ గ్రామ చరిత్రను ఒకసారి చూస్తే..
గ్రామ ర క్షక దళాలు:
రజాకార్ల అరాచకాలను ఎదురించేందుకు గ్రామాల్లోని యువకులంత కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డారు. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాలలో ఏర్పడిన రక్షణ దళాలు బైరాన్‌పల్లిని కేంద్రంగా చేసుకొని నిరంతరం రజాకార్ల దాడులను తిప్పి కొట్టేవి. దీనితో రజాకార్లు 1948లో దూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలపై దాడులు చేసి దొరికిన వారిని దొరికినట్లు చంపడంతో పాటు ఆయా గ్రామాలను తగుల బెట్టారు. ఆపై తిరిగి వస్తున్న రజాకార్లపై బైరాన్‌పల్లి వద్ద రక్షణ దళాలల నాయకులు దువ్వురి రాంరెడి,్డ మురిళిధర్‌రావు, ముకుందర్ రెడి నాయకత్వంలో కాపు కాచి గేరిల్లా దాడులు చేశారు. లింగాపూర్ దూల్మిట్ట గ్రామాలలో దోచుకున్న సంపదను స్వాదీనం చేసుకున్నారు.
బైరాన్‌పల్లి దిగ్బందం:
బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలు దాడులు చేయడంపై రజాకార్లు అగ్రహించుకొని ఆ గ్రామంపై రజాకార్లు మూడు సార్లు దాడులు చేసి విఫలం అయ్యారు. ఈ క్రమంలో 1948 ఆగస్లు 27వ తేది అర్థరాత్రి ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు జనగామ నుండి 10 ట్రక్‌లతో బయలుదేరి రాత్రి 2 గంటల ప్రాంతలో తమకు అడ్డాగా ఉన్న లద్నూర్ గ్రామానికి రజాకార్లు చేరుకున్నారు. తెల్లవరుజాము 3 గంటల సమయంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని మందుగుండు సామాగ్రితో 12 వందల మంది సైనికులు దిగ్భందించారు. బహిర్బూమికి వెళ్ళిన ఉల్లెంగల(వడ్ల) నర్సయ్యను పట్టుకొని గ్రామంలో ఉన్న బురుజు వద్దకు దారి చూపించమని తీసుకు వెళ్ళారు.
అదే సమయంలో నర్సయ్య వారిని నెట్టివేస్తు రజాకార్లు గ్రామంలోకి వచ్చారని కేకలు వేస్తు పరుగులు తీశాడు. దీనితో బురుజుపై ఉన్న కాపాల దారుడు నగార మోగించారు. దీనితో రజాకార్లు కాల్పులు ప్రారంబించడంతో బురుజుపై ఉన్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్యలు మృతి చెందారు. కాల్పులు జరుగుతుండగా బురుజుపై ఉన్న మందు గుండు సామాగ్రిపై నిప్పు రవ్వలు ఎగిసి పడటంతో ఒక్కసారిగా బురుజుపైభాగం పేలిపోయింది. దీనితో రజాకార్లు గ్రామంలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. ఈలా ఒకే రోజు బైరాన్‌పల్లి గ్రామంలో 96మందిని చంపి శవాల చుట్టు మహిళలతో బతుక్మ ఆటలాడించారు.
కూటిగల్‌పై దాడి:
బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలకు కూటిగల్ ప్రజలు సహయ సహకారులు అందిచడంతో మూడు సార్లు దాడిని బైరాన్‌పల్లి గ్రామస్తులు తిప్పి కొట్టారని కోపంతో 1948 ఆగస్టు27న బైరాన్‌పల్లి దాడి తర్వత కొంత మంది రజాకార్లు కూటిగల్ గ్రామంపై దాడి చేసి బురుజుపై ఉన్న వారిని కిందకు దింపి తూటల మర్రి వరకు తీసుక వచ్చి రెక్కలు కట్టి నిల్చొబెట్టి 22 మందిని కాల్చి చంపి రజాకార్లు పైచాచిక ఆనందం పొందారు. రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన బైరాన్‌పల్లి గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment