'తెలంగాణ విమోచన దినం నిర్వహించాల్సిందే'
కేసీఆర్, ఎంఐఎం కుమ్మకైయ్యారు
బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు
చింతల్: కేసీఆర్,ఎంఐఎం కుమ్మకై తెలంగాణ విమోచన దినోత్సవంపై మాట మార్చారని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు నందనం దివాకర్ ఆధ్వర్యంలో మంగళవారం కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన తిరంగా యాత్ర కార్యక్రమానికి మురళీధర్రావు ముఖ్య అతిధిగా హజరైయ్యారు. అనంతరం మురళీధర్రావు మాట్లాడుతూ... భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు నిండిన సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు మేరకు ఈ తిరంగాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన నెల రోజులకు తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.
కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని చెప్పిన ఆయన... రాష్ట్రం ఏర్పడిన తరువాత మాటమార్చారని విమర్శించారు. భారత్ మాతా కీ జై అనని వారితో జతకట్టి తెలంగాణ వారికే కాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా తిరంగా జెండా ర్యాలీ నిర్వహించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అదేవిధంగా సెప్టెంబర్ 17న కేసీఆర్ ప్రభుత్వం తరపున తిరంగాయాత్ర నిర్వహించి విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. తిరంగాయాత్ర ఒక్క బీజేపీది కాదని, ఇది ప్రతి ఒక్క భారతీయునిదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తిరంగాయాత్ర కార్యక్రమాన్ని గల్లీగల్లీకి వ్యాపింపజేసి భారత్ మాతా కీ జై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మురళీధరరావు వెల్లడించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ నందనం సత్యంను మురళీధరరావు సన్మానించారు.
రంగారెడ్డినగర్ శివాజీ విగ్రహం నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌వైఎస్‌ఏ జాతీయ తేరాల చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మీసాల చంద్రయ్య, బిజేవైఎం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రంగా శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు భరతసింహరెడ్డి, శంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.