భారత దేశంలోనే కాక ప్రపంచ విప్లవోద్యమాల్లోనే పేరెన్నికగన్నది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. దేశంలో మిగతా చోట్ల బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా అహింసా యుత స్వాతంత్య్ర పోరాటం జరిగితే... తెలంగాణలో బ్రిటిష్‌వారి మిత్రుడైన నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది. ఇంగ్లిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రోద్యమం జరిగిన సమయంలో... ఇక్కడ తెలంగాణలో నిజాం పాలనకు చరమగీతం పాడుతూ విప్లవకారులు అనేక గ్రామాలను విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తూ ముందుకు పోతున్నారు. అటువంటి సమయంలో భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై ‘సైనిక చర్య’ చేపట్టింది. నిజాం భారత హోంమంత్రికి అధికారికంగా లొంగిపోయి, తన రాజ్యాన్ని భారత్‌లో కలిపివేశాడు. అయితే ఈ చారిత్రక ఘట్టాన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్వప్రయోజనాలకోసం వాడుకోజూడటమే విషాదం!
ఇది దురాక్రమణ దినం
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17న జరిగింది ఏమిటో నేటికీ మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకార్ల, దేశ్‌ముఖ్‌ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు. మరి ఆ రోజు జరిగిందేమిటి? విలీనమా? విమోచనా? విద్రోహమా? దురాక్రమణా? వాస్తవంగా చెప్పాలంటే ఆనాటి ఇండియా పాలక వర్గం వల్లభాయి పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణను దురాక్రమణ చేసింది. చెరపలేని చరిత్రను, గత చారిత్రక సత్యాన్ని వివాదాస్పదం చేసి ప్రజల మన్నలను పొందాలని పాలక, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆనాటి పాలక పార్టీ కాంగ్రెస్ విలీనమనీ, మత కోణంలో లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ విమోచననీ, ప్రజల ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న కమ్యూనిస్టులు ముమ్మాటికీ విద్రోహమనీ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు.
నిజాం నిరంకుశ పాలనలో... దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాముల పెత్తనం, వెట్టి చాకిరీ లాంటి ఆగడాలపై ఎర్రజెండా అండతో ఎదురు తిరిగిన హైదారాబాద్ రాష్ట్ర ప్రజలు పోరాటాన్ని ఉధృతం చేసి నైజాం పాలనను అంతమొందించే స్థాయికి వచ్చారు. దొరలు గడీలు విడిచి హైదరాబాద్ పారిపోయేలా చేశారు. వేలాదిమంది మాన ప్రాణాలను దోచుకున్న ఊర్లలోని దొరలే కాదు నిజాంకూడా గద్దె దిగే పరిస్థితిని రైతాంగ పోరాటం కలిగించింది. నలువైపుల నుండి వస్తున్న పోరాట వార్తలు నిజాంను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీన్ని గమనించిన నిజాం ఆనాటి నెహ్రూ ప్రభు త్వంతో కుమ్ముక్కయి ‘ఆపరేషన్ పోలో‘ నిర్వ హించడానికి వచ్చిన భారత సైన్యానికి లొంగిపోయాడు. నిజాం లొంగిపోయినా వెనుదిరిగి వెళ్ళకుండా తెలంగా ణను దురాక్రమణ చేశాయి యూనియన్ సైన్యాలు.
ప్రజల వైపున పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులను మట్టుపెట్టేందుకు నెహ్రూ సేనలు పూనుకున్నాయి. ప్రజల పోరాటాలకు జడిసి పట్టణాలకు పారిపోయిన దొరలు, భూస్వాములు పల్లెలకు వచ్చారు. 1948 వరకు పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటంలో 400 మంది మరణిస్తే... 1948 నుండి 1950 వరకు సైన్యం జరిపిన హత్యాకాండలో నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారనేది ఒక లెక్క. నిజానికి కర్ణాటక, మరాట్వాడ ప్రాంతాల్లో మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద ఎత్తున ఊచ కోతకు గురయ్యారు. ముస్లింల నెత్తురు కాల్వలు కట్టింది. మొత్తం సంస్థానంలో 40 వేల వరకు హతులైనట్లు సుందర్‌లాల్ కమిటీ నివేదిక పేర్కొనగా, ఈ మృతుల సంఖ్య రెండు లక్షలు ఉండవచ్చని ఉద్యమ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఏజెన్సీ గిరిజన గ్రామాలు భస్మీపటల మయ్యాయి. గిరిజన మృతుల సంఖ్య వెలుగులోకి రాలేదు.
దురాక్రమణ చేసి ప్రజల మాన ప్రాణాలను హరించివేసిన సైనిక చర్యను కాంగ్రెస్ విలీనం అంటోంది. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా జరిగే ప్రక్రియను విలీనం అనాలి. దీన్నెలా అంటారు? ముస్లిం పాలన పోయి హిందూ పాలన వచ్చినందున ఇది విమోచన అంటుంది బీజేపీ. ఎవరినుండి ఎవరికి విమోచన వచ్చినట్లు? ప్రజల నుండి నిజాం పాలకులకు విమోచన కలిగింది. ప్రజల నుండి దొరలు, భూస్వాములకు విమోచన కలిగింది. దీన్ని ఎలా విమోచన అంటారో ఉత్సవాలు చేసుకునే బీజేపీ చెప్పాలి. కమ్యూనిస్టులు ఇది విద్రోహం అంటున్నారు. ద్రోహం చేయాలంటే ముందు విశ్వాసం కల్పించాలి. ఆ విశ్వాసానికి విరుద్ధంగా వ్యవహరిస్తే అది విద్రోహం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అలాంటి విశ్వాసం కల్పించలేదు. అది నేరుగా దురాక్రమణకే తెగబడింది. అందువల్ల కమ్యూని స్టులు చెపుతున్నట్లు ఇది విద్రోహ దినం కాదు. సెప్టెంబర్ 17 విషయంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటివరకూ కిమ్మనకుండా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఈసారి కొత్త రాగం అందుకుంది. సెప్టెంబర్ 17ను ’తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని అందుకోసం మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. దీని వెనుక ఆయన వ్యూహాలు ఆయనకున్నాయి. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయనేది సుస్పష్టం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా తెలంగాణ గోసను, చరిత్రను రాజకీయాలకు వాడుకోవడం ఆపి తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు వేయాలి. లేకపోతే మరోపోరాటం తలెత్తవచ్చు!
సాయిని నరేందర్ (వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు)
మొబైల్: 97019 16091
సాయుధ చరిత్రకు ప్రాధాన్యమివ్వాలి
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి తెలంగాణ ప్రజలంతా కలిసి కూకటి వేళ్ళతో నిజాం రాచరికా నికి వ్యతిరేకంగా మహత్తర సాయుధ పోరాటం జరుపుతున్నారు. అనేక గ్రామాలు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో స్వయంపాలిత విముక్త గ్రామాలుగా ప్రకటితమయ్యాయి. అప్పటివరకూ తెలంగాణ ప్రజలు చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా దుర్భర బానిసత్వాన్ని అనుభవించారు. నిజాం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల్లోనే కాకుండా భాషాసంస్కృతుల్లో కూడా పరాయీకర ణకూ, అవమానాలకూ గురయ్యారు. దీనికి వ్యతి రేకంగా తెలంగాణ తొలితరం విద్యావంతులైన మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు వంటి వారు 1921లో ‘ఆంధ్ర జన సంఘం’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అది 1923లో ‘ఆంధ్ర జన కేంద్ర సంఘం’గా, 1930లో ‘నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ’గా మారుతూ తన కార్యకలా పాలను విస్తృతంగా నిర్వహించింది. 1942 నుండి కమ్యూనిస్టుల చేరికతో ఆంధ్రమహాసభ భాషా సంస్కృతుల పరిధి దాటి వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం, ‘దున్నేవానికి భూమి’ వంటి పోరాటా లను నిర్వహించింది. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ నాటికి రావి నారాయణ రెడ్డి నాయ కత్వంలో పూర్తి స్థాయిలో విప్లవ సంస్థగా మారి దొరల, రజకార్ల, నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పోరాటాలను ప్రారంభించింది. 1940–42ల మధ్య బందగి సాహెబ్ సాహస మరణం, 1944–1945 లో పాలకుర్తి అయిలమ్మ భూపోరాటం, 1946లో దొడ్డి కొమురయ్య వీర మరణం, తదనంతరం భీంరెడ్డి, దేవులపల్లి, షోయ బుల్లాఖాన్, ముఖ్ధూం మోహియుద్దీన్, సర్వదేవ భట్ల రామనాథం, ఆరుట్ల దంపతులు, మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, నల్లా నర్సింహులు, సుద్దాల హన్మంతు, రాజబహుదూర్ గౌర్‌ల వంటి నాయకులు సాయుధ పోరాటం సాగించారు.
కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవోద్యమం ముందుకు పోవ టాన్ని చూసి యూనియ న్‌లో చేరమని బ్రిటిష్ వారు నిజాంకు సలహా ఇచ్చారు. పోరాటకారులు హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది గ్రామాలను విముక్త ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ నగరం కమ్యూనిస్టుల స్వాధీన మయ్యే అవకాశం ఉందని గ్రహించిన లార్డ్ మౌంట్‌బాటెన్ నిజాంను యూనియన్‌లో చేరమని ఒత్తిడి చేశాడు. స్వతంత్ర దేశంగా ఉంటానన్న నిజాంకు దేశీయంగా, అంతర్జాతీయంగా మద్దతు కరవయింది. నిజాంకు సమాంతరంగా ఎదుగు తున్న మతోన్మాద నాయకుడు ఖాసిం రజ్వీ యూని యన్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజ లపై తీవ్ర హింసాకాండకు దిగాడు. ఐక్యరాజ్య సమితిలో నిజాంకు మద్దతు తెలుపుతూ వస్తున్న పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మహ్మద్ అలీజిన్నా ఆకస్మికంగా మరణించారు. ఈ పరిస్థితులలో నిజాంసైన్యాలు, రజాకారులు స్థైర్యాన్ని కోల్పోయి గందరగోళంలో పడి బలహీన స్థితికి చేరుకున్నాయి. 1947 సెప్టెంబర్ 29న నిజాం, నెహ్రూ సర్కార్‌లు
‘యథాతథ ఒడం బడిక’ను చేసుకున్నాయి. సెప్టెంబర్ 13, 1948 వరకు అమలైన ఈ ఒడంబడిక కాలంలో వల్ల భాయ్ పటేల్, రాజగోపాలాచారి సంస్థానంలోని విప్లవ వెల్లువను అణచి వేయడానికి నిజాంకు ఆయుధాలను సరఫరా చేశారు. మద్రాస్, హైదరా బాద్ రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రజా గెరిల్లాలు నిజాం సైన్యాన్ని దెబ్బ మీద దెబ్బ తీసి పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారు. కమ్యూనిస్టులపై తీవ్ర విద్వేషంతో ఉన్న కేంద్ర హోంమంత్రి ఇదే సమయంలో హైదరాబాద్‌పై ‘సైనిక చర్య’కు ఆదేశించాడు. యూనియన్ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనమైంది. నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులనూ, వారి వెంట నడుస్తున్న లక్షలాది మంది ప్రజలనూ యూనియన్ సేనలు నిర్బంధించాయి.
ఇప్పుడు ఆ చారిత్రిక ఇతిహాసాన్ని ‘సమైక్యతా ఉత్సవం’గా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం ముదావహం. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధంలేని మతోన్మాద సంస్థల వారసులు చరిత్రను ఇప్పుడు వక్రీకరించే ప్రయత్నం చేయడం బాధాకరం. సాయుధ పోరాటానికి వేదికలైన కడవెండి, బైరాన్‌పల్లి వంటి చోట్ల స్మారక చిహ్నాలను నిర్మించాలి. అమరుల త్యాగాలు ప్రజల హృదయాలలో ఉండేట్లు కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించాలి.
అస్నాల శ్రీనివాస్ (వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు)
Comments
Please login to add a commentAdd a comment