telangana sayudha poratam
-
చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం
తెలంగాణ సాయుధ పోరాటం మత పోరాటం కాదు. వర్గ పోరాట స్వభావం కలిగిన పోరాటం. ప్రజాస్వామ్యం కోసం, పౌరహక్కుల కోసం, హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడం కోసం జరిగిన పోరాటం.మొగల్ సామ్రాజ్యంలో భాగమైన దక్షిణ భారతదేశానికి ఔరంగజేబు మరణానంతరం ఢిల్లీ రాజప్రతినిధిగా వచ్చిన సైనికాధిపతే నిజామ్. ఢిల్లీలో మొగల్ సామ్రాజ్య ప్రాభవం తగ్గగానే స్వతంత్రం ప్రకటించుకున్నారు. మైసూరు రాజు టిప్పు సుల్తాన్‌కు, మహా రాష్ట్రులకు వ్యతిరేకంగా బ్రిటిషర్లకు నిజాం మద్దతు ఇచ్చినందుకు, నిజాం నవాబును కాపాడేందుకు బ్రిటిష్ సైన్యాన్ని ఇక్కడ ఉంచారు. వారి ఖర్చుల నిమిత్తం, సర్కారు జిల్లాలను, ఆ తర్వాత రాయ లసీమను వారికి అప్పగించారు.ఐనా మిగిలిన హైదరాబాదు సంస్థానం దేశంలోని 550 సంస్థా నాలలో పెద్దది. దీని వైశాల్యం 82,696 చదరపు మైళ్ళు. ఇది గ్రేట్ బ్రిటన్ వైశాల్యానికి సమానం. ఇందులో ఎనిమిది తెలుగు జిల్లాలు, ఐదు మరాఠీ జిల్లాలు, మూడు కర్ణాటక జిల్లాలు ఉండేవి. కోటీ ఎనభై లక్షల జనాభాలో సగంమంది మాతృభాష తెలుగు, 25 శాతం మంది మరాఠీ, 12 శాతం మంది ఉర్దూ, 11 శాతం మంది కన్నడ, ఇతర భాషలు మాట్లాడేవారు. కాని ఉర్దూలో తప్ప పాఠశాలలు లేవు. ప్రైవే టుగా మాతృభాషలో పాఠశాలలు పెట్టుకోవడానికి వీల్లేదు. తెలంగాణ ప్రాంతంలో భూ కేంద్రీకరణ విపరీతంగా వుండేది. మొత్తం సాగులో వున్న భూమి దాదాపు 70% భూస్వాముల చేతుల్లో వుండేది. ఐదు వేల ఎకరాలపైన వున్న భూస్వాములు 550 మంది. చిన్న పెద్ద భూస్వాములలో 1982 మంది ముస్లింలు, 618 మంది హిందూ భూస్వాములు. నిజాం సొంత ఖర్చుల కోసం 636 గ్రామాల్లో ఐదు లక్షల ముప్ఫై వేల ఎకరాల భూమి వుండేది. 7వ నిజాం ఆస్తి ఆనాడు 400 కోట్ల రూపాయలు. అప్పుడు ప్రపంచంలో కెల్లా ధనవంతుడని పేరుండేది. రాష్ట్రంలో ప్రజలు దుర్భర జీవితం గడిపేవారు. అన్ని కులాలవారు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, ప్రభుత్వ అధికారుల దగ్గర వెట్టిచాకిరీ చేయాల్సి వచ్చేది. తెలుగు ప్రజల సంఘంగా ఆంధ్ర జనసభ ప్రారంభమైంది. అది ఆంధ్ర మహాసభగా రూపొందింది. జోగిపేట ప్రథమ ఆంధ్ర మహా సభ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది. 1946 నాటికి ఆంధ్ర మహాసభ ప్రధాన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. ఈ దశలో ఆంధ్ర మహాసభలో మితవాదులు, అతివాదులు, జాతీయ వాదుల మధ్య ఘర్షణలో వామపక్షవాదులు మెజారిటీ అయ్యారు. రావి నారాయణ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత పేద ప్రజల సమస్యలు, తెలుగులో బోధన, వెట్టిచాకిరీ రద్దు తదితర అంశాలపైన కార్యాచరణ తీసుకున్నారు.దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటం హైదరాబాద్ సంస్థాన ప్రజల మీద ప్రభావం చూపింది. మజ్లిస్ పార్టీకి ఖాశిం రజ్వీ అధ్యక్షుడై, హైదరాబాదును స్వతంత్ర ముస్లిం రాజ్యం చేస్తానని ప్రక టించి రజాకార్ల (వలంటీర్) నిర్మాణానికి పూనుకుని వేలాదిమంది ముస్లిములను చేర్పించి దాడులు ప్రారంభించాడు. నిజాం మద్దతి చ్చాడు. తెలంగాణను ముస్లిం మెజారిటీ సంస్థానంగా చేసేందుకు ఇతర రాష్ట్ర్రాల నుండి 8 లక్షల మంది ముస్లింలను అంతకు ముందు తీసుకువచ్చారని ఒక ఆరోపణవుంది.ఈ దశలో కేంద్ర ప్రభుత్వానికి నిజాంకు మధ్య అనేక చర్చల తర్వాత యథాతథ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం నిజాం రాజుగా కొనసాగుతాడు. విదేశాంగ, రక్షణ కేంద్రం బాధ్యతల్లో వుంటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు కేంద్రం చేసిన ద్రోహం. ఈలోగా విసునూరి రామచంద్రారెడ్డి ప్రజల మీద దాడులు ఉధృతం చేశాడు. ఆయన తల్లి జానకమ్మ నరరూప రాక్షసి. కడివెండిలో ప్రజలు బలవంతపు ధాన్యం లెవీకి వ్యతిరేకంగా ఊరేగింపు తీస్తే, గడీలోంచి కాల్పులు జరిపి, దొడ్డి కొమరయ్యను బలి తీసుకున్నారు. ఇక, అనేక ఇతర గ్రామాలలో రజాకార్లు గ్రామాలను తగలబెట్టి, స్త్రీలను మానభంగాలు చేశారు. బైరాన్‌పల్లి, పరకాల తదితర గ్రామాలలో డజన్ల సంఖ్యలో ప్రజలు హతులయ్యారు.ఈ నేపథ్యంలో 1947 సెప్టెంబరు 11వ తేదీన నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని కూలద్రోసి సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకుగాను, సాయుధ పోరాటం చేయవలసిందిగా రావి నారా యణరెడ్డి, మఖ్దుం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి పేరుతో ప్రకటన విడుదల చేశారు. సాయుధ పోరాటం దావానలంలాగా వ్యాపించింది. ఈ పోరాటం ముఖ్యంగా నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా, ఇతర జిల్లాల్లో కొంత పరిమితంగా జరిగింది. 3,000 గ్రామాలను కమ్యూనిస్టు పార్టీ ప్రభావితం చేసింది. దాదాపు పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచింది. హింసను అరికట్టే పేరుతో యూనియన్ సైన్యాలు హైదరాబాదు సంస్థానాన్ని ముట్టడించాయి. 3 రోజుల్లో నిజాం సైన్యం లొంగి పోయింది. మిలిటరీ గవర్నరుగా నియమించబడ్డ జనరల్ చౌదరి కొందరు రజాకార్లను, ఖాశిం రజ్వీని అరెస్టు చేసి, కమ్యూనిస్టుల మీద యుద్ధం ప్రకటించాడు. సరోజినీ నాయుడు కుమారుడు డాక్టర్ జయసూర్య, మరికొందరు మిలిటరీ గవర్నరును కలిసి నెల రోజుల గడువిస్తే, కమ్యూనిస్టులతో చర్చించి, సాయుధ పోరాటాన్ని ఉపసంహరింపజేస్తామని చెప్పారు. దానికి జనరల్ చౌదరి నిరాకరించి నెల రోజు లెందుకు, వారం రోజుల్లో తెలంగాణలో కమ్యూనిస్టులను ఏరివేస్తా నని జవాబిచ్చాడు. అనివార్యంగా సాయుధ పోరాటం కొనసాగింది. హైదరాబాదు సంస్థానం, భారత యూనియన్‌లో విలీనమైనందున, నిజాం దుష్ట ప్రభుత్వం కూలిపోయినందున మధ్యతరగతి ప్రజలు, కొందరు మేధావులు సాయుధ పోరాటం ఆవశ్యకత లేదని భావించారు. 1951 చివరిలో పార్టీ కేంద్ర కమిటీ సమావేశమై సాయుధ పోరాటాన్ని ఉపసంహరించాలని నిర్ణయించింది.1952 నాటికి సీపీఐ మీద నిషేధం తొలగనందున పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ పేరుతో కమ్యూనిస్టులు + ప్రజాతంత్ర వాదులు కలిసి పోటీ చేశారు. మెజారిటీ స్థానాల్లో పి.డి.ఎఫ్. గెలిచింది. రావి నారాయణరెడ్డి నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి నెహ్రూ కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిజాం సంస్థానంలోని కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీ బలహీనంగా ఉండటంతో కాంగ్రెసుకు వచ్చిన మెజారిటీతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది. మరొకవైపు రజాకార్లు స్వల్పశిక్షలతో బయటపడితే, కమ్యూనిస్టులపై సుదీర్ఘ శిక్షలు పడ్డాయి. 12 మందికి మరణశిక్షలు విధింప బడ్డాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు, ఆందోళన జరిగింది. వాటిని ముందు యావజ్జీవ కారాగార శిక్షలుగా మార్చి, కొన్నేళ్ళకు రద్దు చేశారు. రాజబహదూర్ గౌర్ రాజ్యసభకు ఎన్నికైనా విడుదల చేయలేదు. చివరకు ఉపరాష్ట్రపతి సర్వేపల్లి జోక్యంతో విడుదలయ్యారు.భూస్వాములు, వారి తాబేదార్లు, ముందు కాంగ్రెసులో, తర్వాత తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ రాష్ట్ర సమితులలో చేరారు. ఇప్పుడు బీజేపీలో భాగమౌతున్నారు. బీజేపీ వారు చరిత్రను వక్రీకరించి ‘ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువుల పోరాటం’గా చిత్రీక రిస్తున్నారు. ముస్లిం కార్మికులు సాయుధ పోరాటానికి మద్దతిచ్చారు. భారత యూనియన్‌లో హైదరాబాదు సంస్థానం విలీనంలో మిత వాదుల పాత్ర నామమాత్రం. స్వామి రామానంద తీర్థ నాయకత్వాన కాంగ్రెసు జాతీయవాదులు గట్టిగా పోరాటం చేశారు. కాని సాయుధ పోరాటానిదే ప్రధాన పాత్ర. భారత ఉపప్రధాని సర్దార్ పటేల్ వల్ల మిలిటరీ హైదరాబాదును విలీనం చేసిందనేది దుష్ప్రచారం మాత్రమే. సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుందనే భయంతోనే మిలిటరీని పంపారు. వేలాదిమందిని హత్యలు చేయించిన నిజాంను అరెస్టు చెయ్యకపోగా, రాజప్రముఖ్‌ను చేసి కోటి రూపాయల రాజభరణం ఇచ్చారు. ఇది ‘విముక్తా’, ‘రాజీ’నా ప్రజలు అర్థం చేసుకున్నారు.తెలంగాణ సాయుధ పోరాటం మత పోరాటం కాదు. వర్గ పోరాట స్వభావం కలిగిన పోరాటం. ప్రజాస్వామ్యం కోసం, పౌర హక్కుల కోసం, సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం కోసం జరిగిన పోరాటం. ప్రస్తుత నక్సలైట్ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింపు అనే వాదన తప్పు. పోరాటం చైతన్యవంతులైన ప్రజలు నడుపుతారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన నాటికి ఆంధ్ర మహాసభకు ఏడు లక్షల సభ్యత్వం వుంది. 90 లక్షల తెలుగు భాష మాట్లాడే ప్రజల్లో 7 లక్షల సభ్యత్వం అంటే దాదాపు ప్రతి 12 మంది జనాభాలో ఒకరు ఆంధ్రమహాసభ సభ్యులు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఏమైనా తెలంగాణ సాయుధ పోరాటం, చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం. మన దేశం కోసం, మన కోసం, మన స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన ఆ యోధులను స్మరించుకుందాం. సురవరం సుధాకర్ రెడ్డి వ్యాసకర్త సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి -
సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చాకలి ఐలమ్మ
భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చిట్యాల ఐలమ్మ. రజక కుటుంబంలో పుట్టిన ఒక ఆడ పడుచు వేల ఎకరాల అధిపతైన దొర దోపిడీని ఎదిరించి నిలిచింది. ‘దున్నేవాడిదే భూమి’ అని సాగిన తెలంగాణ సాయుధ పోరా టంలో ఐలమ్మ నిప్పురవ్వ. రైతులు, కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరులూదింది. భూమిలేక పోతే జిందగీ లేదని రక్తతర్పణం చేసిన ఐలమ్మ ‘బందగి’ దారిలో నడి చింది. ‘సంఘం’లో చేరితే సంగతి చెప్తానన్న దొరకు ఏ గతీ లేకుండా చేసింది. ‘బాంచెన్ నీ కాల్మొక్తా’ అన్న జనం చేత బందూకు బట్టించింది. వెట్టిచాకిరీ చేసేవాళ్ళు అలగా జనం కాదు, సహస్ర వృత్తులు చేసే సకలజనం అని చాటి చెప్పింది. 1895 సెప్టెంబర్ 26న సద్దుల బతుకమ్మ నాడు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు నాలుగో సంతానంగా జన్మించింది ఐలమ్మ. తల్లిదండ్రులది ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం. 11వ ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో లగ్గమైంది. ఆమెకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. దొర ఇంట ఊడిగం, ఊరి జనం బట్టల ఉతుకుడు. ఇదే వారి జీవనాధారం. దీంతో కుటుంబం గడవడం గగనమయ్యేది. ఎదిగి వచ్చిన కొడుకులతో వ్యవసాయం చేయాలనుకుంది. పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసు కుంది. అదే విస్నూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి తట్టుకోలేక పోయిండు! ‘వ్యవసాయం వద్దు, బట్టలు ఉతకడానికి రావాలి’ అని కబురు పంపిన దొరకు... తనకు వ్యవసాయమే ముఖ్యమనీ, ‘గడీలో వెట్టి చేయను పో’ అనీ గట్టిగా చెప్పింది. అప్పుడే వెట్టిచాకిరీలు చేయవద్దని పిలుపు నిచ్చిన ‘ఆంధ్ర మహాసభ’లో చేరింది. ఆడది ముందుబడి తన ఆధిపత్యాన్ని వెనుకబడేసిం దని రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. దీంతో ఐలమ్మపై దొర కక్ష పెంచుకున్నాడు. ఐలమ్మ కొడుకులను అరెస్ట్ చేయించాడు. నల్లగొండలోని జైలులో ఉన్న కుటుంబీకులను కలిసేందుకు ఐలమ్మ ఒంటరిగా 100 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వచ్చేది. దొర ఐలమ్మ ఇంటిని తగలబెట్టించాడు. ఆమె కూతురిపై లైంగికదాడి జరిగింది. అయినా లొంగని ఐలమ్మ న్యాయ పోరాటం చేసి దొరపై గెలిచింది. ఇది సహించలేని విస్నూరు దొర... ఐలమ్మ పొలాన్ని అక్రమంగా తన పేర రాయించుకున్నాడు. కానీ దొరను గానీ, దొర గూండాలను గానీ తన పొలాన్ని టచ్ చేయనివ్వలేదు ఐలమ్మ. పొలంలోని వడ్లను తీసుకునేందుకు వచ్చిన దొర గూండాలను ‘ఆంధ్ర మహాసభ’ (సంఘం) సభ్యులతో కలిసి తరిమికొట్టింది. ధాన్యాన్ని ఇంటికి చేర్చింది. ఐలమ్మ తెగువను చూసిన జనానికి ప్రేరణ, స్ఫూర్తి కల్గింది. క్రమంగా తెలంగాణ పల్లెపల్లెన ఉద్యమం అలలుఅలలుగా ఎగిసిపడింది. పల్లెల్లో దొరల పట్టు తప్పింది. ‘బందగి’ రక్త తర్పణంతో ఎరుపెక్కిన పోరుజెండా, ఐలమ్మ సాహసంతో సాయుధపోరు దారి చూపింది. దొరల ఆధిపత్యం క్రమంగా నేలమట్టమైంది. ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగువేల మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ఆమె భూమి ఆమెకు దక్కింది. యావత్ తెలంగాణ మహిళా పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న తుది శ్వాస విడిచింది. తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తాం అని చెప్పడం చాలా గొప్ప విషయమే. కానీ వాటిని ఘనంగా నిర్వహించాలి. ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చి ఆమె గురించి గొప్పగా తెలిసేలా విగ్రహాలు పెట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె కుటుంబానికి అండగా ఉండాలి. అప్పుడే ఆమెకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. - పీలి కృష్ణ , జర్నలిస్ట్ (సెప్టెంబర్ 26న చాకలి ఐలమ్మ జయంతి) -
చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?
భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దశాబ్దాలపాటు సమాంతరంగా సాగాయి. జాతీయోద్యమంలో చోటుచేసుకున్న ‘జలియన్‌వాలా బాగ్’ దురంతం వంటివాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనలకు లభించలేదు. గుండ్రాంపల్లి, బైరాన్‌పల్లి వంటి వందలాది గ్రామాలను నిరంకుశ నిజాం జలియన్‌వాలా బాగ్లుగా మార్చివేశాడు. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ ప్రభుత్వం చేపట్టిన ‘సైనిక చర్య’తో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసిపోయింది. ఈ క్రమంలో లక్షలాది ప్రజలు అసువులు బాశారు. చరిత్రాత్మకమైన సాయుధ పోరాటానికీ, భారత్‌లో హైదరాబాద్ కలిసిన ‘సెప్టెంబర్ 17’కూ స్వార్థపూరిత రాజకీయాల వల్ల తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరం. అది 1919 ఏప్రిల్ 13. బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని నిరసించిన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు పెద్దఎత్తున సాగాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన బ్రిటిష్ ప్రభుత్వం బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. ఈ తరుణంలోనే పంజాబీలకు ముఖ్యమైన పండుగ వైశాఖీ సందర్భంగా ఏడెకరాల విస్తీర్ణం గల ఓ తోటలో వేల మంది సమావేశమయ్యారు. బ్రిటిష్ సైన్యంతో అక్కడకు వచ్చిన ఓ అధికారి ప్రవేశ మార్గాలను మూసివేసి, నిరాయుధులైన జనంపై కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్ల కాల్పుల్లో గుళ్లవర్షం కురిపించారు. వెయ్యిమంది మరణించారు. మరో రెండువేలమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అమానవీయ నరమేధానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ తోట పేరు జలియన్‌వాలా బాగ్. నిరాయధులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించిన ఆ నరరూప రాక్షసుడే జనరల్ డయ్యర్. పంజాబ్‌కి చెందిన వ్యక్తిగా జలియన్ వాలా బాగ్ ఉదంతంపై నాకు పూర్తి అవగాహన ఉంది. కానీ భారత చరిత్రలో గుర్తింపునకు నోచుకోని ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నిజాం నిరంకుశ రాజ్యమైన నాటి హైదరాబాద్ సంస్థానంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఈ ప్రాంతంతో అనుబంధం ఏర్పర్చుకున్న నేను నిజాం అరాచకాలూ, రజాకార్ల అకృత్యాల గురించీ తెలుసుకున్న తర్వాత విస్మయం కలిగింది. ఒకింత ఆగ్రహం, ఆవేదనా కలిగాయి. నిజాం రాజ్యంలోని ‘జలియన్ వాలా బాగ్’ ఘటనల్లో గుండ్రాం పల్లి ఒకటి. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపుటేరులు పారించారు. ఖాసీం రజ్వీకి అత్యంత సన్నిహితుడైన మక్బూల్ ఈ గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు. గ్రామస్థులంతా ఏకమై తిరగబడ్డారు. పారిపోయిన మక్బూల్ రజాకార్ల మూకలతో తిరిగొచ్చి గ్రామం మీద పడ్డాడు. 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొని ఎత్తుకెళ్ళి పోయారు. అలాగే తెలంగాణ విమోచన పోరాటంలో బైరాన్‌పల్లి వీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజాకార్ల అరాచకాలను ఎదుర్కొ నేందుకు బైరాన్‌పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకుని, బురుజులు కట్టారు. బురుజులపై నుంచి నగారా మోగిస్తూ రజా కార్లతో పోరాడేందుకు గ్రామ రక్షక దళాలు సిద్ధమయ్యేవి. ఒకసారి బైరాన్‌పల్లి పక్క గ్రామం లింగాపూర్ పై రజాకార్లు దాడి చేసి, ధాన్యాన్ని ఎత్తుకెళ్తుండగా బైరాన్ పల్లి వాసులు అడ్డుకొని ఎదురు దాడి చేశారు. దీంతో బైరాన్ పల్లిపై కక్షగట్టిన రజాకార్లు మొదటిసారి 60 మందితో, మరో సారి 150 మందితో దాడికి యత్నించి తోకముడిచారు. ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయిన రజా కార్లు 400 మంది సైన్యంతో, మారణాయుధాలతో ఊరిపై పడ్డారు. మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. సంప్రదాయక ఆయుధాలతో ఎదురు తిరిగిన బైరాన్‌పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు మొత్తం 118 మంది వీరమరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు బైరాన్‌పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలిచి ఉంది. 1947 సెప్టెంబర్ 2న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ నినదించిన పరకాల గ్రామస్థులపై రజాకార్లు, నిజాం సైనికులు చేసిన దాడిలో 19 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జల్–జమీన్–జంగల్ కోసం పోరాడిన రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచ రులను నిర్మల్‌లోని మర్రిచెట్టుకు ఉరితీశారు. ఆ మర్రి ‘గోండ్ మర్రి’, ‘ఉరుల మర్రి’, ‘వెయ్యి ఉరుల మర్రి’గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ విమోచన కొరకు అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల మంది ఉద్యమకారులపై నిజాం పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి సమీపంలోని రేణికుంటపై 1948 మార్చి 4న నిజాం పోలీసులు, రజాకార్ మూకలు లూటీకి తెగబడ్డారు. సంప్రదాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకున్న గ్రామస్థులు ఆధునిక ఆయుధాలున్న రజాకార్లను ప్రతిఘటించారు, వారితో భీకరంగా పోరాడారు. ఈ పోరాటంలో 26 మంది రేణికుంట గ్రామస్థులు అమరులయ్యారు. నిర్హేతుక పన్నులపై గొంతెత్తి, పన్నులు కట్టమంటూ భీష్మించుకు కూర్చున్న పాతర్లపహాడ్ వాసులను నిజాం పోలీసులు ఊచకోత కోశారు. 17 మంది అమరులయ్యారు. జనగాం సమీపంలోని కాట్కొండలో రజాకార్ల బలవంతపు వసూళ్లను అడ్డుకున్న 13 మందిని కాల్చి చంపారు. కూటిగల్‌లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను కాల్చి చంపారు. 1935–47 మధ్యన, మరీ ముఖ్యంగా 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు ఇలాంటి హింసాత్మక ఘటనలు వంద లాదిగా జరిగాయి. జలియన్ వాలాబాగ్ ఘటన అనూహ్యంగా జరిగింది. కానీ నాటి హైదరాబాద్ సంస్థానంలో 13–14 ఏళ్ల పాటు వ్యవస్థీకృతంగా హిందువులపై రక్త పాతం జరిగింది. సర్దార్ పటేల్ చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’తో దేశానికి స్వాతంత్య్రం లభించిన 13 నెలల తర్వాత 1948 సెప్టెం బర్ 17న ఈ ప్రాంతం నిజాం పీడ నుంచీ, రజాకార్ల అకృత్యాల నుంచీ విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. తెలంగాణలో ఈ తరహా దుర్ఘటనలు గుర్తింపునకు నోచుకోకపోవడానికి కారణం సంతుష్టీకరణ రాజకీయాలే. నిజాంను దుష్టుడిగా చూపితే మైనార్టీ వర్గాల సెంటిమెంటు దెబ్బతింటుందన్న నెపంతో ఎందరో యోధుల త్యాగాలు, పరాక్రమాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారు. ఎంఐఎం ఒత్తిడికి లొంగి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17న ఎలాంటి వేడుకలు జరపకుండా, ప్రాముఖ్యం లేని రోజుగానే చూశాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ సెంటి మెంటుతో రాజకీయాలు చేసే టీఆర్ఎస్ కూడా ఎంఐఎంకు తలొగ్గి సెప్టెంబర్ 17ను అప్రధానంగా చూడడం దురదృష్టకరం. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో తెరమరుగైన యోధులకు గుర్తింపునిచ్చి స్మరించుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసి, వెలుగులోకి రాని యోధులను, ఘటనలను వెలుగులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చి 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వ హించేందుకు సిద్ధమైంది. 2023 సెప్టెంబర్ 17 వరకు సంవత్సరం పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ప్రాంత విమోచన కోసం ఎలాంటి పోరాటాలు జరిగాయో నేటి తరం తెలుసుకోవాలన్నదే ఈ వేడుకల ఉద్దేశ్యం. ఇదే మన కోసం తమ సర్వస్వాన్ని సమర్పించిన నాటి యోధులకు ఇచ్చే అసలైన నివాళి. తరుణ్ చుగ్ (వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్) -
చరిత్ర పైనా రాజకీయమేనా?
భారత దేశంలోనే కాక ప్రపంచ విప్లవోద్యమాల్లోనే పేరెన్నికగన్నది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. దేశంలో మిగతా చోట్ల బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా అహింసా యుత స్వాతంత్య్ర పోరాటం జరిగితే... తెలంగాణలో బ్రిటిష్‌వారి మిత్రుడైన నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది. ఇంగ్లిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రోద్యమం జరిగిన సమయంలో... ఇక్కడ తెలంగాణలో నిజాం పాలనకు చరమగీతం పాడుతూ విప్లవకారులు అనేక గ్రామాలను విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తూ ముందుకు పోతున్నారు. అటువంటి సమయంలో భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై ‘సైనిక చర్య’ చేపట్టింది. నిజాం భారత హోంమంత్రికి అధికారికంగా లొంగిపోయి, తన రాజ్యాన్ని భారత్‌లో కలిపివేశాడు. అయితే ఈ చారిత్రక ఘట్టాన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్వప్రయోజనాలకోసం వాడుకోజూడటమే విషాదం! ఇది దురాక్రమణ దినం తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17న జరిగింది ఏమిటో నేటికీ మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకార్ల, దేశ్‌ముఖ్‌ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు. మరి ఆ రోజు జరిగిందేమిటి? విలీనమా? విమోచనా? విద్రోహమా? దురాక్రమణా? వాస్తవంగా చెప్పాలంటే ఆనాటి ఇండియా పాలక వర్గం వల్లభాయి పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణను దురాక్రమణ చేసింది. చెరపలేని చరిత్రను, గత చారిత్రక సత్యాన్ని వివాదాస్పదం చేసి ప్రజల మన్నలను పొందాలని పాలక, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆనాటి పాలక పార్టీ కాంగ్రెస్ విలీనమనీ, మత కోణంలో లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ విమోచననీ, ప్రజల ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న కమ్యూనిస్టులు ముమ్మాటికీ విద్రోహమనీ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. నిజాం నిరంకుశ పాలనలో... దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాముల పెత్తనం, వెట్టి చాకిరీ లాంటి ఆగడాలపై ఎర్రజెండా అండతో ఎదురు తిరిగిన హైదారాబాద్ రాష్ట్ర ప్రజలు పోరాటాన్ని ఉధృతం చేసి నైజాం పాలనను అంతమొందించే స్థాయికి వచ్చారు. దొరలు గడీలు విడిచి హైదరాబాద్ పారిపోయేలా చేశారు. వేలాదిమంది మాన ప్రాణాలను దోచుకున్న ఊర్లలోని దొరలే కాదు నిజాంకూడా గద్దె దిగే పరిస్థితిని రైతాంగ పోరాటం కలిగించింది. నలువైపుల నుండి వస్తున్న పోరాట వార్తలు నిజాంను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీన్ని గమనించిన నిజాం ఆనాటి నెహ్రూ ప్రభు త్వంతో కుమ్ముక్కయి ‘ఆపరేషన్ పోలో‘ నిర్వ హించడానికి వచ్చిన భారత సైన్యానికి లొంగిపోయాడు. నిజాం లొంగిపోయినా వెనుదిరిగి వెళ్ళకుండా తెలంగా ణను దురాక్రమణ చేశాయి యూనియన్ సైన్యాలు. ప్రజల వైపున పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులను మట్టుపెట్టేందుకు నెహ్రూ సేనలు పూనుకున్నాయి. ప్రజల పోరాటాలకు జడిసి పట్టణాలకు పారిపోయిన దొరలు, భూస్వాములు పల్లెలకు వచ్చారు. 1948 వరకు పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటంలో 400 మంది మరణిస్తే... 1948 నుండి 1950 వరకు సైన్యం జరిపిన హత్యాకాండలో నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారనేది ఒక లెక్క. నిజానికి కర్ణాటక, మరాట్వాడ ప్రాంతాల్లో మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద ఎత్తున ఊచ కోతకు గురయ్యారు. ముస్లింల నెత్తురు కాల్వలు కట్టింది. మొత్తం సంస్థానంలో 40 వేల వరకు హతులైనట్లు సుందర్‌లాల్ కమిటీ నివేదిక పేర్కొనగా, ఈ మృతుల సంఖ్య రెండు లక్షలు ఉండవచ్చని ఉద్యమ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఏజెన్సీ గిరిజన గ్రామాలు భస్మీపటల మయ్యాయి. గిరిజన మృతుల సంఖ్య వెలుగులోకి రాలేదు. దురాక్రమణ చేసి ప్రజల మాన ప్రాణాలను హరించివేసిన సైనిక చర్యను కాంగ్రెస్ విలీనం అంటోంది. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా జరిగే ప్రక్రియను విలీనం అనాలి. దీన్నెలా అంటారు? ముస్లిం పాలన పోయి హిందూ పాలన వచ్చినందున ఇది విమోచన అంటుంది బీజేపీ. ఎవరినుండి ఎవరికి విమోచన వచ్చినట్లు? ప్రజల నుండి నిజాం పాలకులకు విమోచన కలిగింది. ప్రజల నుండి దొరలు, భూస్వాములకు విమోచన కలిగింది. దీన్ని ఎలా విమోచన అంటారో ఉత్సవాలు చేసుకునే బీజేపీ చెప్పాలి. కమ్యూనిస్టులు ఇది విద్రోహం అంటున్నారు. ద్రోహం చేయాలంటే ముందు విశ్వాసం కల్పించాలి. ఆ విశ్వాసానికి విరుద్ధంగా వ్యవహరిస్తే అది విద్రోహం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అలాంటి విశ్వాసం కల్పించలేదు. అది నేరుగా దురాక్రమణకే తెగబడింది. అందువల్ల కమ్యూని స్టులు చెపుతున్నట్లు ఇది విద్రోహ దినం కాదు. సెప్టెంబర్ 17 విషయంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటివరకూ కిమ్మనకుండా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఈసారి కొత్త రాగం అందుకుంది. సెప్టెంబర్ 17ను ’తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని అందుకోసం మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. దీని వెనుక ఆయన వ్యూహాలు ఆయనకున్నాయి. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయనేది సుస్పష్టం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా తెలంగాణ గోసను, చరిత్రను రాజకీయాలకు వాడుకోవడం ఆపి తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు వేయాలి. లేకపోతే మరోపోరాటం తలెత్తవచ్చు! సాయిని నరేందర్ (వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు) మొబైల్: 97019 16091 సాయుధ చరిత్రకు ప్రాధాన్యమివ్వాలి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి తెలంగాణ ప్రజలంతా కలిసి కూకటి వేళ్ళతో నిజాం రాచరికా నికి వ్యతిరేకంగా మహత్తర సాయుధ పోరాటం జరుపుతున్నారు. అనేక గ్రామాలు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో స్వయంపాలిత విముక్త గ్రామాలుగా ప్రకటితమయ్యాయి. అప్పటివరకూ తెలంగాణ ప్రజలు చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా దుర్భర బానిసత్వాన్ని అనుభవించారు. నిజాం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల్లోనే కాకుండా భాషాసంస్కృతుల్లో కూడా పరాయీకర ణకూ, అవమానాలకూ గురయ్యారు. దీనికి వ్యతి రేకంగా తెలంగాణ తొలితరం విద్యావంతులైన మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు వంటి వారు 1921లో ‘ఆంధ్ర జన సంఘం’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అది 1923లో ‘ఆంధ్ర జన కేంద్ర సంఘం’గా, 1930లో ‘నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ’గా మారుతూ తన కార్యకలా పాలను విస్తృతంగా నిర్వహించింది. 1942 నుండి కమ్యూనిస్టుల చేరికతో ఆంధ్రమహాసభ భాషా సంస్కృతుల పరిధి దాటి వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం, ‘దున్నేవానికి భూమి’ వంటి పోరాటా లను నిర్వహించింది. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ నాటికి రావి నారాయణ రెడ్డి నాయ కత్వంలో పూర్తి స్థాయిలో విప్లవ సంస్థగా మారి దొరల, రజకార్ల, నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పోరాటాలను ప్రారంభించింది. 1940–42ల మధ్య బందగి సాహెబ్ సాహస మరణం, 1944–1945 లో పాలకుర్తి అయిలమ్మ భూపోరాటం, 1946లో దొడ్డి కొమురయ్య వీర మరణం, తదనంతరం భీంరెడ్డి, దేవులపల్లి, షోయ బుల్లాఖాన్, ముఖ్ధూం మోహియుద్దీన్, సర్వదేవ భట్ల రామనాథం, ఆరుట్ల దంపతులు, మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, నల్లా నర్సింహులు, సుద్దాల హన్మంతు, రాజబహుదూర్ గౌర్ల వంటి నాయకులు సాయుధ పోరాటం సాగించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవోద్యమం ముందుకు పోవ టాన్ని చూసి యూనియ న్లో చేరమని బ్రిటిష్ వారు నిజాంకు సలహా ఇచ్చారు. పోరాటకారులు హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది గ్రామాలను విముక్త ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ నగరం కమ్యూనిస్టుల స్వాధీన మయ్యే అవకాశం ఉందని గ్రహించిన లార్డ్ మౌంట్‌బాటెన్ నిజాంను యూనియన్‌లో చేరమని ఒత్తిడి చేశాడు. స్వతంత్ర దేశంగా ఉంటానన్న నిజాంకు దేశీయంగా, అంతర్జాతీయంగా మద్దతు కరవయింది. నిజాంకు సమాంతరంగా ఎదుగు తున్న మతోన్మాద నాయకుడు ఖాసిం రజ్వీ యూని యన్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజ లపై తీవ్ర హింసాకాండకు దిగాడు. ఐక్యరాజ్య సమితిలో నిజాంకు మద్దతు తెలుపుతూ వస్తున్న పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మహ్మద్ అలీజిన్నా ఆకస్మికంగా మరణించారు. ఈ పరిస్థితులలో నిజాంసైన్యాలు, రజాకారులు స్థైర్యాన్ని కోల్పోయి గందరగోళంలో పడి బలహీన స్థితికి చేరుకున్నాయి. 1947 సెప్టెంబర్ 29న నిజాం, నెహ్రూ సర్కార్లు ‘యథాతథ ఒడం బడిక’ను చేసుకున్నాయి. సెప్టెంబర్ 13, 1948 వరకు అమలైన ఈ ఒడంబడిక కాలంలో వల్ల భాయ్ పటేల్, రాజగోపాలాచారి సంస్థానంలోని విప్లవ వెల్లువను అణచి వేయడానికి నిజాంకు ఆయుధాలను సరఫరా చేశారు. మద్రాస్, హైదరా బాద్ రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రజా గెరిల్లాలు నిజాం సైన్యాన్ని దెబ్బ మీద దెబ్బ తీసి పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారు. కమ్యూనిస్టులపై తీవ్ర విద్వేషంతో ఉన్న కేంద్ర హోంమంత్రి ఇదే సమయంలో హైదరాబాద్‌పై ‘సైనిక చర్య’కు ఆదేశించాడు. యూనియన్ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనమైంది. నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులనూ, వారి వెంట నడుస్తున్న లక్షలాది మంది ప్రజలనూ యూనియన్ సేనలు నిర్బంధించాయి. ఇప్పుడు ఆ చారిత్రిక ఇతిహాసాన్ని ‘సమైక్యతా ఉత్సవం’గా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం ముదావహం. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధంలేని మతోన్మాద సంస్థల వారసులు చరిత్రను ఇప్పుడు వక్రీకరించే ప్రయత్నం చేయడం బాధాకరం. సాయుధ పోరాటానికి వేదికలైన కడవెండి, బైరాన్‌పల్లి వంటి చోట్ల స్మారక చిహ్నాలను నిర్మించాలి. అమరుల త్యాగాలు ప్రజల హృదయాలలో ఉండేట్లు కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించాలి. అస్నాల శ్రీనివాస్ (వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు) -
చెరిగిపోని నెత్తుటి ధార
స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం. ఇందులో పరకాలలో జరిగిన పోరాటం చరిత్రకెక్కింది. ఉద్యమకారుల వీరమరణంతో పరకాల నేల నాడు రక్తసిక్తమైంది. 1947 సెప్టెంబర్ 2న జాతీయజెండా ఎగురవేసేందుకు బయలుదేరిన ఉద్యమకారులపై రజాకార్ల తూటాల వర్షం కురిపించగా 15 మంది అమరులయ్యారు. ఇదే ఘటనలో 150 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచిన పరకాల మరో జలియన్‌వాలా బాగ్గా గుర్తింపుపొందింది. ఉవ్వెత్తున లేచిన ఉద్యమంపై కథనం. జాతీయ పతాకంతో ఊరేగింపు అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు గ్రామాల్లో నిజాం నిరంకుశ పాలనను రజాకారులను ఎదిరిస్తూ ప్రజలు త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. రగులుకున్న ఈ మహోద్యమం చారిత్రక పోరాటానికి దారి తీసింది. ఉద్యమ నేతల పిలుపుమేరకు త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి 1947 సెప్టెంబర్ 2న అనేక గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. మూడు కిలోమీటర్ల పొడవుతో సాగిన ఊరేగింపులో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని, వందేమాతరం అంటూ నినదించారు. చెట్టుకు కట్టి మరీ.. పతాక వందనానికి హాజరయ్యారనే కోపంతో గ్రామాలపై రజాకార్ల సైన్యం దాడి చేసింది. ప్రజలను అనేక విధాలుగా వేధింపులకు గురిచేశారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపడం సంచలనం కలిగింది. చంద్రగిరి గుట్టల కేంద్రంగా సాయుధపోరాటం పిస్తోళ్లు, మందు గుండు సామగ్రి సేకరించిన స్థానికులు ఉద్యమకారులు పోరాటం చేపట్టారు. చంద్రగిరి గుట్ట లను కేంద్రంగా చేసుకుని సాయుధ పోరాటం జరిపారు. చంద్రగిరి గుట్టలపై ఉద్యమకారులు నిర్వహించిన సా యధ శిక్షణ శిబిరాలపై దాడులు చేసి చేయడానికి ప్రయత్నించి అనేక సార్లు రజాకారులు విఫలమయ్యారు. అయితే, సాయుధ దాడులను తట్టుకోలేక నిజాం పోలీ సులు గ్రామాల్లో ప్రజలను విచక్షణారహితంగా హింసించారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లబాయ్ పటేల్ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవటంతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. అమరవీరుల స్మారకార్థం అమరధామం పరకాల ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించేలా అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్టు తరఫున వందలాది విగ్రహాలతో పరకాల తహసీల్ ఎదురుగా రెండేళ్లు శ్రమించి నిర్మాణం చేపట్టారు. అమరధామం పేరిట చేపట్టిన ఈ నిర్మాణాన్ని 2003 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆయన స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు ప్రస్తుతం ఎలాంటి ఉద్యమ కార్యక్ర మం జరిగినా ప్రజా సంఘాలు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఏటా సెప్టెంబర్ 2న అమరవీరులకు నివాళుల ర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దూసుకొచ్చిన తూటాలు ఊరేగింపు సమాచారం తెలియగానే అప్పటికే ఇక్కడ నిజాం మిలిటరీ పోలీసులు మకాం వేశారు. శాంతిభద్రతల పరిరక్షణ పేర తుపాకులు ఎక్కుపెట్టా రు. ఉద్రేకం, ఉత్సాహంగా ఊరేగింపు జరుపుతున్న ఉద్యమకారులు తహసీల్దార్ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ జియా ఉల్లా తమ బలగాలను మోహరించారు. నిజాం పోలీసుల తుపాకులు గర్జించడంతో చాపల బండ ప్రాంతం రక్తంతో తడిసి ముద్దయింది. రజాకారుల కసాయి చర్యల్లో శ్రీశైలం సహా పదిహేను మంది అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఊరుకోకుండా నిజాం పోలీసులు, రజాకారులు వెంటాడి 180 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. -
యోధుడికి ‘ఆత్మకథ’ బహుమతి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకర్లకు వ్యతిరేకంగా బందూక్ పట్టుకుని పోరాడిన యోధుడు మా తాతయ్య. ఆయన రాసిన ఆత్మకథను తన 88వ పుట్టిన రోజున (జూన్ 17) ఆవిష్కరించి తాతయ్యను సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. మీరు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారా’’అంటూ మంత్రి కె.తారకరామారావుకు 17 ఏళ్ల నిధిరెడ్డి మే 4న ట్విట్టర్ ద్వారా సందేశం పంపింది. సరిగ్గా 2 నిమిషాల అనంతరం కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ‘‘తప్పకుండా చేద్దాం. అలాంటి పోరాట యోధుడి కోసం నేను మీ ఇంటికి వస్తాను’’అని బదులిచ్చారు. వివరాలు పంపాలంటూ కొద్ది నిమిషాల తర్వా త కేటీఆర్ ఆఫీసు నుంచి మెసేజ్ వచ్చింది. కట్ చేస్తే..: ఆదివారం హైదరాబాద్ హబ్సిగూడలోని స్ట్రీట్ నం.7లో ఉంటున్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మిట్ట యాదవరెడ్డి ఇంటికి కేటీఆర్ స్వయంగా వచ్చారు. నడవలేని స్థితిలో మంచంపై ఉన్న యాదవరెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జ్ఞాపికను అందించారు. కుటుంబీకుల సమక్షంలో యాదవరెడ్డి కేక్ కట్ చేయగా, కేటీఆర్ కేక్ తినిపించారు. గతంలో ఆయన చేసిన కార్యక్రమా లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన రచించిన ‘నా జ్ఞాపకాలు’ ఆత్మకథను కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. భావి తరాలకు స్ఫూర్తి: కేటీఆర్ మిట్ట యాదవ రెడ్డి మాట్లాడుతూ.. అనుక్షణం రాష్ట్రం కోసమే తపించానని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సిద్ధించడం, అభివృద్ధి దిశగా నడవడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ కూడా పరిశ్రమలు, ఐటీ రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, యాదవరెడ్డి వంటి యోధుల పోరాటమే భావి తరాల కు స్ఫూర్తి అన్నారు. చరిత్రను చూసిన యాద వరెడ్డి వంటి పెద్దల ప్రశంసలు తమను మరిం త స్ఫూర్తితో ముందుకు నడుపుతాయన్నారు. మిట్ట యాదవరెడ్డి నేపథ్యం: జనగామ, సూర్యాపేట తాలూకాల సంగమ ప్రదేశం వెలిశాల గ్రామంలో జన్మించిన యాదవరెడ్డి 1945–47లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1947 ఆగస్టులో జాతీయ జెండా ఎగురవేసి, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. జైలు నుంచి విడుదలై తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టంలో చేరి రజాకార్లకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరులో చేరారు. జనవరి 1948లో తాటికొండ గ్రామం వద్ద రజాకార్లు, నైజాం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. సాయు ధ పోలీసులు, రజాకర్లు మూకుమ్మడిగా దాడి చేయడం.. యాదవరెడ్డి దళం వద్ద మందుగుండు అయిపోవడంతో అరెస్ట్ అయ్యారు. చర్మం వలిచి, సూదులతో గుచ్చినా దళం ఆచూకీ కానీ, తోటీ కామ్రేడ్ల వివరాలు కానీ చెప్పని ధీశాలి ఆయన. 1951లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆర్థికశాస్త్రంలో ఎంఏ, పీహె చ్‌డీ పూర్తి చేసి ఓయూలో అధ్యాపకుడిగా పని చేశారు. సోషల్‌ౖ సెన్స్ విభాగానికి డీన్‌గా రిటైర్ అయ్యి హబ్సిగూడలో నివాసముంటున్నారు. -
పుస్తకాల్లో వాస్తవాలు రాయరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటం గురించి వెలువడిన పుస్తకాల్లో వాస్తవాలను పొందు పరచలేదని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. చాలా మంది వారి జీవితచరిత్ర, లేదా అనుభవాలను క్రోడీకరించి వెలువరించే పుస్తకాల్లో నిజాలు చెప్పరన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంపై దివంగత కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు రాసిన పుస్తకం కూడా కొంత తప్పుల తడకగా ఉందని, అయితే దీన్ని తాను ఉద్దేశపూర్వకంగా తప్పుపట్టడం లేదని చెప్పారు. శనివారం మఖ్దూం భవన్లో నారాయణ రాసిన వ్యాసాలను పొందు పరిచి రూపొందించిన ‘ఉద్యమకారుని డైరీ’ని అరసం కార్యదర్శి ఎస్వీ సత్యనారాయణ, అలాగే జూలూరి గౌరిశంకర్ రచించిన ‘నారాయణ పోరుయాత్ర’ పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తనపై వెలువడిన రెండు పుస్తకాలు భావితరాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతానే తప్ప క్రిమినల్ ఆలోచనతో కాదని, అయినప్పటికీ అప్పుడప్పుడు తన మాటలు వివాదాస్పదం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రెండు ప్రాంతాల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో సీపీఐని టీఆర్ఎస్తో జట్టు కట్టకుండా, సీమాంధ్రలో వైఎస్సార్సీపీతో సీపీఎం పొత్తు కుదరకుండా కార్పొరేట్ శక్తులు ప్రయత్నించాయన్నారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ, నారాయణ తన వ్యాసాలను పుస్తక రూపంలో తీసుకురాకపోయుంటే చారిత్రక తప్పిదం చేసినవారయ్యేవారని అన్నారు. కమ్యూనిస్టులు పలుచన కావడంతో దేశంలో ప్రమాదకరమైన ధోరణులు వస్తున్నాయని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, నారాయణ రాసే రచనలు, చేసే ఉద్యమాలను తెలంగాణ ప్రాంతం మరింత ఆశిస్తోందని, దీన్ని నిలబెట్టుకోవాలని ఆకాక్షించారు. నారాయణను వివాదాస్పద నాయకుడిగా చిత్రీకరించడాన్ని తాను విభేదిస్తానని నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ వ్యాఖ్యానించారు. జూలూరు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఎడిటర్ వై.ఎస్.ఆర్.శర్మ, సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్, పాశం యాదగిరి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమల తదితరులు పాల్గొన్నారు.