చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? | Telangana Armed Struggle September 17 Did Not Get Proper Recognition | Sakshi
Sakshi News home page

చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?

Published Fri, Sep 16 2022 12:40 AM | Last Updated on Fri, Sep 16 2022 12:40 AM

Telangana Armed Struggle September 17 Did Not Get Proper Recognition - Sakshi

భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దశాబ్దాలపాటు సమాంతరంగా సాగాయి. జాతీయోద్యమంలో చోటుచేసుకున్న ‘జలియన్‌వాలా బాగ్‌’ దురంతం వంటివాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనలకు లభించలేదు. గుండ్రాంపల్లి, బైరాన్‌పల్లి వంటి వందలాది గ్రామాలను నిరంకుశ నిజాం జలియన్‌వాలా బాగ్‌లుగా మార్చివేశాడు. చివరికి 1948 సెప్టెంబర్‌ 17న భారత యూనియన్‌ ప్రభుత్వం చేపట్టిన ‘సైనిక చర్య’తో హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో కలిసిపోయింది. ఈ క్రమంలో లక్షలాది ప్రజలు అసువులు బాశారు. చరిత్రాత్మకమైన సాయుధ పోరాటానికీ, భారత్‌లో హైదరాబాద్‌ కలిసిన ‘సెప్టెంబర్‌ 17’కూ స్వార్థపూరిత రాజకీయాల వల్ల తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరం.

అది 1919 ఏప్రిల్‌ 13. బ్రిటిష్‌ వలస పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు. బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్‌ చట్టాన్ని నిరసించిన డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ, సత్యపాల్‌ వంటి నేతలను అరెస్ట్‌ చేసి, దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు పెద్దఎత్తున సాగాయి. పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన బ్రిటిష్‌ ప్రభుత్వం బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. ఈ తరుణంలోనే పంజాబీలకు ముఖ్యమైన పండుగ వైశాఖీ సందర్భంగా ఏడెకరాల విస్తీర్ణం గల ఓ తోటలో వేల మంది సమావేశమయ్యారు. బ్రిటిష్‌ సైన్యంతో అక్కడకు వచ్చిన ఓ అధికారి ప్రవేశ మార్గాలను మూసివేసి, నిరాయుధులైన జనంపై కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్ల కాల్పుల్లో గుళ్లవర్షం కురిపించారు. వెయ్యిమంది మరణించారు. మరో రెండువేలమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అమానవీయ నరమేధానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ తోట పేరు జలియన్‌వాలా బాగ్‌. నిరాయధులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించిన ఆ నరరూప రాక్షసుడే జనరల్‌ డయ్యర్‌.  

పంజాబ్‌కి చెందిన వ్యక్తిగా జలియన్‌ వాలా బాగ్‌ ఉదంతంపై నాకు పూర్తి అవగాహన ఉంది. కానీ భారత చరిత్రలో గుర్తింపునకు నోచుకోని ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నిజాం నిరంకుశ రాజ్యమైన నాటి హైదరాబాద్‌ సంస్థానంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఈ ప్రాంతంతో అనుబంధం ఏర్పర్చుకున్న నేను నిజాం అరాచకాలూ, రజాకార్ల అకృత్యాల గురించీ తెలుసుకున్న తర్వాత విస్మయం కలిగింది. ఒకింత ఆగ్రహం, ఆవేదనా కలిగాయి. 

నిజాం రాజ్యంలోని ‘జలియన్‌ వాలా బాగ్‌’ ఘటనల్లో గుండ్రాం పల్లి ఒకటి. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపుటేరులు పారించారు. ఖాసీం రజ్వీకి అత్యంత సన్నిహితుడైన మక్బూల్‌ ఈ గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు. గ్రామస్థులంతా ఏకమై తిరగబడ్డారు. పారిపోయిన మక్బూల్‌ రజాకార్ల మూకలతో తిరిగొచ్చి గ్రామం మీద పడ్డాడు. 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొని ఎత్తుకెళ్ళి పోయారు. 

అలాగే తెలంగాణ విమోచన పోరాటంలో బైరాన్‌పల్లి వీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజాకార్ల అరాచకాలను ఎదుర్కొ నేందుకు బైరాన్‌పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకుని, బురుజులు కట్టారు. బురుజులపై నుంచి నగారా మోగిస్తూ రజా కార్లతో పోరాడేందుకు గ్రామ రక్షక దళాలు సిద్ధమయ్యేవి. ఒకసారి బైరాన్‌పల్లి పక్క గ్రామం లింగాపూర్‌ పై రజాకార్లు దాడి చేసి, ధాన్యాన్ని ఎత్తుకెళ్తుండగా బైరాన్‌ పల్లి వాసులు అడ్డుకొని ఎదురు దాడి చేశారు. దీంతో బైరాన్‌ పల్లిపై కక్షగట్టిన రజాకార్లు మొదటిసారి 60 మందితో, మరో సారి 150 మందితో దాడికి యత్నించి తోకముడిచారు. ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయిన రజా కార్లు 400 మంది సైన్యంతో, మారణాయుధాలతో ఊరిపై పడ్డారు. మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. సంప్రదాయక ఆయుధాలతో ఎదురు తిరిగిన బైరాన్‌పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు మొత్తం 118 మంది వీరమరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు బైరాన్‌పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలిచి ఉంది. 1947 సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ నినదించిన పరకాల గ్రామస్థులపై రజాకార్లు, నిజాం సైనికులు చేసిన దాడిలో 19 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జల్‌–జమీన్‌–జంగల్‌ కోసం పోరాడిన రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచ రులను నిర్మల్‌లోని మర్రిచెట్టుకు ఉరితీశారు. ఆ మర్రి ‘గోండ్‌ మర్రి’, ‘ఉరుల మర్రి’, ‘వెయ్యి ఉరుల మర్రి’గా ప్రసిద్ధి చెందింది.

తెలంగాణ విమోచన కొరకు అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల మంది ఉద్యమకారులపై నిజాం పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి సమీపంలోని రేణికుంటపై 1948 మార్చి 4న నిజాం పోలీసులు, రజాకార్‌ మూకలు లూటీకి తెగబడ్డారు. సంప్రదాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకున్న గ్రామస్థులు ఆధునిక ఆయుధాలున్న రజాకార్లను ప్రతిఘటించారు, వారితో భీకరంగా పోరాడారు. ఈ పోరాటంలో 26 మంది రేణికుంట గ్రామస్థులు అమరులయ్యారు. నిర్హేతుక పన్నులపై గొంతెత్తి, పన్నులు కట్టమంటూ భీష్మించుకు కూర్చున్న పాతర్లపహాడ్‌ వాసులను నిజాం పోలీసులు ఊచకోత కోశారు. 17 మంది అమరులయ్యారు. జనగాం సమీపంలోని కాట్కొండలో రజాకార్ల బలవంతపు వసూళ్లను అడ్డుకున్న 13 మందిని కాల్చి చంపారు. కూటిగల్‌లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను కాల్చి చంపారు. 1935–47 మధ్యన, మరీ ముఖ్యంగా 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్‌ వరకు ఇలాంటి హింసాత్మక ఘటనలు వంద లాదిగా జరిగాయి. జలియన్‌ వాలాబాగ్‌ ఘటన అనూహ్యంగా జరిగింది. కానీ నాటి హైదరాబాద్‌ సంస్థానంలో 13–14 ఏళ్ల పాటు వ్యవస్థీకృతంగా హిందువులపై రక్త పాతం జరిగింది. సర్దార్‌ పటేల్‌ చేపట్టిన ‘పోలీస్‌ యాక్షన్‌’తో దేశానికి స్వాతంత్య్రం లభించిన 13 నెలల తర్వాత 1948 సెప్టెం బర్‌ 17న ఈ ప్రాంతం నిజాం పీడ నుంచీ, రజాకార్ల అకృత్యాల నుంచీ విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. 

తెలంగాణలో ఈ తరహా దుర్ఘటనలు గుర్తింపునకు నోచుకోకపోవడానికి కారణం సంతుష్టీకరణ రాజకీయాలే. నిజాంను దుష్టుడిగా చూపితే మైనార్టీ వర్గాల సెంటిమెంటు దెబ్బతింటుందన్న నెపంతో ఎందరో యోధుల త్యాగాలు, పరాక్రమాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారు. ఎంఐఎం ఒత్తిడికి లొంగి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌ ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్‌ 17న ఎలాంటి వేడుకలు జరపకుండా, ప్రాముఖ్యం లేని రోజుగానే చూశాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ సెంటి మెంటుతో రాజకీయాలు చేసే టీఆర్‌ఎస్‌ కూడా ఎంఐఎంకు తలొగ్గి సెప్టెంబర్‌ 17ను అప్రధానంగా చూడడం దురదృష్టకరం.  స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరుతో తెరమరుగైన యోధులకు గుర్తింపునిచ్చి స్మరించుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసి, వెలుగులోకి రాని యోధులను, ఘటనలను వెలుగులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చి 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వ హించేందుకు సిద్ధమైంది. 2023 సెప్టెంబర్‌ 17 వరకు సంవత్సరం పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ప్రాంత విమోచన కోసం ఎలాంటి పోరాటాలు జరిగాయో నేటి తరం తెలుసుకోవాలన్నదే ఈ వేడుకల ఉద్దేశ్యం. ఇదే మన కోసం తమ సర్వస్వాన్ని సమర్పించిన నాటి యోధులకు ఇచ్చే అసలైన నివాళి.

తరుణ్‌ చుగ్‌ (వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement