
‘సెప్టెంబర్ 17’ని అధికారికంగా నిర్వహించాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
గజ్వేల్ రూరల్: నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది, ప్రజాస్వామ్య హక్కులు సాధించుకున్న సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తియాత్ర శుక్రవారం నిజామాబాద్ నుంచి తూప్రాన్ మీదుగా గజ్వేల్‌కు చేరుకుంది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను పూర్వ తెలంగాణ అయిన మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని గుర్తించని బీజేపీ తిరంగయాత్ర పేరుతో కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నిర్వహించనప్పుడు.. ఇప్పుడు మాట్లాడే అర్హత లేదన్నారు. మహిళలు, బీడీ కార్మికులు, యువకులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రగతిశీల వామపక్షలతో ఉద్యమాలు నిర్వహించేందుకు సీపీఐ సన్నద్ధమవుతోందన్నారు. 17న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఇన్‌చార్జి పశ్య పద్మ మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ భూ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అంతకుముందు సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బట్టు దయానందరెడ్డి, మంద పవన్ ఆధ్వర్యంలో తూప్రాన్-చేగుంట రోడ్డు నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సీపీఐ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు ఎంకె.మోహినొద్దీన్, కె. సురేందర్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డికి పూలమాలలు వేసి సత్కరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు యాదవ్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు, గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అంజయ్య యాదవ్, మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు జ్యోతి, కార్యదర్శి సృజన, ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పల్లె నర్సింహ, కార్యదర్శి లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌తో పాటు సీపీఐ నాయకులు, కార్మికులు, మహిళలు, అసంఘటితరంగ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.