దారి పొడవునా భారత సైన్యాలకు స్వాగత సంరంభం
‘‘1948 సెప్టెంబర్ 13.. తెల్లవారుజామున టెలిఫోన్ భీకరంగా మోగడంతో మేల్కొన్నాను. ఆర్మీ కమాండర్ ఇద్రూస్ అత్యవసర కాల్. రిసీవర్ ఎత్తకముందే అది భారత సైనికదళాల ఆగమనానికి సంబంధించినదై ఉంటుందని భావించా.. అది అదే. గడిచిన పావుగంటలో ఐదు విభిన్న సెక్టార్ల నుంచి భారత సైన్యం పెద్దసంఖ్యలో హైదరాబాద్ వైపు పురోగమిస్తున్నట్టు సమాచారం ఉందన్నాడు.
అతను నాతో మాట్లాడుతుండగానే బీడ్, వరంగల్ ఔరంగాబాద్, విమానాశ్రయాలపై బాంబుదాడులు జరుగుతున్నాయి.. ఏం చేయాలని అడిగాడు. ఎలాగైనా అడ్డుకోవాలన్నాను. కానీ హైదరాబాద్ సైన్యాల నిస్సహాయ ప్రదర్శన, సాయం చేస్తుందనుకున్న పాకిస్తాన్ ప్రేక్షకపాత్ర, మా ఫిర్యాదుపై భద్రతా మండలి (యూన్ సెక్యూరిటీ కౌన్సిల్) జాప్యం..వెరసి హైదరాబాద్ కథ విషాదంగా ముగిసింది..’’
– హైదరాబాద్ స్టేట్ చివరి ప్రధాని లాయక్ అలీ ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ బుక్‌లో రాసుకున్న మనోగతమిది.
(శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి)
ఆపరేషన్ పోలో.. కేవలం ఐదురోజుల్లోనే హైదరాబాద్ భవిష్యత్తును మార్చేసింది. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాలతో, త్రివర్ణజెండాలతో రెపరెపలాడితే.. హైదరాబాద్‌లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేయాలని నెహ్రూ, పటేల్ చేసిన విజ్ఞప్తులను నిజాం బుట్టదాఖలు చేయడంతో ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది.
ఐదు రోజుల్లోనే అంతా పూర్తి
నిజాం మెడలు వంచే లక్ష్యంతో 1948 సెప్టెంబర్ 13న భారత మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో మొదలైన ‘ఆపరేషన్ పోలో’ ఐదురోజుల్లోనే ముగిసింది. పశ్చిమాన షోలాపూర్–హైదరాబాద్, తూ ర్పున మచిలీపట్నం–హైదరాబాద్ రహదారి వెంట యుద్ధట్యాంకులు, తేలికపాటి స్టువర్ట్ టైప్ ట్యాంకులు, వాటి వెనక ఆయుధ వాహనాలు, పదాతిదళాలు దూసుకురాగా.. నిజాం సైన్యాలు, రజాకార్ల బృందాలు ఎక్కడా నిలువరించలేకపోయాయి.
ముట్టడి ప్రారంభమైన తొలిరోజునే పశ్చిమం నుంచి వస్తున్న దళాలు నల్‌దుర్గ్‌ను స్వాధీనం చేసుకోగా.. తూర్పున మునగాల, సూర్యాపేట వరకు వశమ య్యాయి. సూర్యాపేట శివారులో మకాంవేసిన ని జాం సైన్యం.. 14వ తేదీన భారత సైన్యాలను అడ్డు కునేందుకు మూసీ వంతెనను పేల్చేసినా, తాత్కా లిక వంతెన నిర్మించుకున్న భారతసైన్యాలు మూసీ ని దాటాయి. భారత వాయుసేన పైనుంచి బాంబులువేస్తూ దారివేయగా.. పదాతిదళాలు నిజాం సైన్యాలను ఎదుర్కొంటూ ముందుకుసాగాయి.
స్వేచ్ఛా వాయువులతో..
సెప్టెంబర్ 16 నాటికి నిజాంకు వాస్తవ పరిస్థితి అర్థమైంది. ఆరోజు సాయంత్రమే తొలుత ప్రధానమంత్రి మీర్‌లాయక్ అలీ రేడియో స్టేషన్‌కు వెళ్లి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మర్నాడు, అంటే.. సెప్టెంబర్ 17న సాయంత్రానికి భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ ఆదేశంతో.. మీర్ ఉస్మాన్‌అలీఖాన్ స్వయంగా దక్కన్ రేడియో ద్వారా హైదరాబాద్ సైన్యం తరఫున కాల్పుల విరమణ చేస్తున్నామని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించా రు.
దీనితో హైదరాబాద్ స్టేట్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. జనమంతా భారత జాతీయజెండాలతో హైదరాబాద్ నగరాన్ని త్రివర్ణమయం చేశారు. రజాకార్ల అధ్యక్షుడు ఖాసీంరజ్వీని అరెస్ట్‌చేసి జైల్లో పెట్టగా.. ప్రధాని లాయక్ అలీని గృహ నిర్బంధం చేశారు. ఆయన రెండేళ్ల తర్వాత తప్పించుకుని పాకిస్తాన్ చేరాడు. ఖాసీం రజ్వీ 1958లో జైలు నుంచి విడుదలై పాకిస్తాన్‌లో స్థిరపడ్డాడు.
నిజాం గుండెల్లో నిదురించిన గెరిల్లా..
‘‘కట్ట బట్ట, తిన తిండి, పొట్టనక్షరం ముక్కలేనివాడు. వెట్టిచాకిరీకి అలవాటుపడ్డవాడు. ఎముకల గూడు తప్ప ఏమీ మిగలని వాడు.. దొరా నీ బాంచెన్ అన్న దీనుడు.. హీనుడు, దిక్కులేనివాడు.. తెలంగాణ మానవుడి సాహసోపేత సాయుధ పోరాటం ప్రపంచంలో ఓ కొత్త చరిత్ర’’.. నిజాం రాజ్యంలో సంస్థానాలు, జాగీ ర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, పటేల్, పట్వా రీ వ్యవస్థలు రైతుకూలీలను పీల్చి పిప్పిచేశాయి.
నిజాంకు వ్యతిరేకంగా రైతుకూలీల సాయుధపోరు
సొంత భూమి లేని సాదాసీదా జనం జీవితాంతం వెట్టిచేయాల్సిన పరిస్థితి. న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు పటేల్, పట్వారీల చేతుల్లో ఉండటంతో జనమంతా బాంచెన్ దొరా.. కాల్మొక్తా.. అంటూ బతికిన దుస్థితి. అయితే దేశ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, ఆంధ్ర మహాసభలు తెచ్చిన చైతన్యం సాయుధ రైతాంగ పోరాటానికి దారితీసింది. ఖాసీంరజ్వీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రజాకార్ల ఆగ డాలపై.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జనం తిరుగుబాటు మొదలైంది.
భారత సైన్యాలను ఎదుర్కొనేందుకు రజాకార్లకు తర్ఫీదునిస్తున్న ఖాసీంరజ్వీ
1946 జూలై 4న అప్పటి నల్లగొండ జిల్లా కడవెండిలో విసునూరు దేశ్‌ముఖ్ ఇంటిమీదుగా వెళ్తున్న జులూస్‌పై దేశ్ ముఖ్ పేల్చిన తూటాలకు దొడ్డి కొమురయ్య హతమయ్యాడు. అది తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటానికి నాంది పలికింది. 4వేల మంది రక్తతర్పణతో 3వేల గ్రామాలు కమ్యూనిస్టుల ప్రజారక్షక దళాల అధీనంలోకి వెళ్లాయి.
భారత ఉపప్రధాని వల్లభ్‌బాయ్‌పటేల్ ముందు లొంగిపోతున్న ఉస్మాన్‌అలీఖాన్
ఇదీ హైదరాబాద్ స్టేట్
ప్రస్తుత మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బని, ఉస్మానాబాద్, కర్ణాటకలోని రాయచూర్, బీదర్, గుల్బర్గా (కలబుర్గి), తెలంగాణతో కలిపి మొత్తం 83 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో.. దేశంలోనే అతిపెద్ద సంస్థానంగా ఉండేది.
నిజాం.. ప్రపంచ కుబేరుడు
మీర్ ఉస్మా న్ అలీఖాన్.. హై దరాబాద్ స్టేట్ విలీనం నాటికి ప్రపంచ ధనవంతుల్లో నంబర్‌వన్. 1937 ఫిబ్ర వరిలో టైమ్ మేగజైన్ అలీఖాన్ కవర్‌పేజీతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అప్పట్లోనే నిజాం సంపద విలువ రూ. 660 కోట్లుగా పే ర్కొంది. గోల్కొండ వజ్రాల గనులతో పాటు వివిధ సంస్థానాల నుంచి వచ్చే ఆదాయాలతో ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ కుబేరుడయ్యాడు. జాకబ్ వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా వాడేవాడు.
ఉస్మాన్‌అలీఖాన్ ధరించిన.. విలువైన రాళ్లు పొదిగిన ఈ కత్తి విలువ అప్పట్లోనే 2 లక్షల డాలర్లు
ఆయనకు హైదరాబాద్ చుట్టూరా 23 వేల ఎకరాల (సర్ఫెకాస్) భూములతోపాటు దేశంలోని వి«విధ ప్రాంతాల్లో 600కుపైగా విల్లాలు, విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే చౌమహల్లా, ఫలక్‌నుమా, చిరాన్‌పోర్ట్, నజ్రీబాగ్, పరేడ్ విల్లా ఫెర్న్‌విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్ ప్లజెంట్ విల్లాలు ఉస్మాన్‌అలీఖాన్ సొంతం. 173 రకాల బంగారు, వజ్రాభరణాలతో నిజాం ఖజానా ఉండేది.
ఉస్మాన్ అలీఖాన్ కుటుంబం: లొంగుబాటుకు ముందు కుమారులు, కోడళ్లతో ఉస్మాన్ అలీఖాన్
ఎవరీ నిజాంలు?
1724లో స్వతంత్రుడిగా ప్రకటించుకున్న ఖమ్రుద్దీన్‌ఖాన్ దక్కన్‌లో అసఫ్‌జాహీ రాజ్యానికి నిజాం కాగా, 1948 సెస్టెంబర్ 17న భారత సైన్యాలకు లొంగిపోయిన ఉస్మాన్ అలీఖాన్ చివరివాడు. భారత్‌లో విలీనం అనంతరం ఉస్మాన్ అలీఖాన్ ఏటా రూ.50 లక్షల రాజభరణం పొందుతూ 1956 వరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఉస్మాన్ అలీఖాన్ మనవళ్లు ముఖర్రం జా, ముఫకం జా లండన్‌లో స్థిరపడి.. ఏటా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు.
చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కుటుంబమిదీ..
భార్య: ఆజం ఉన్నీసాబేగం
కుమారులు: ఆజం జా, మౌజం జా, కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం
ఆజంజా కుటుంబం: భార్య దుర్రేషెవార్(టర్కీ), వారసులు ముఖర్రం జా, ముఫకం జా
మౌజంజా కుటుంబం: భార్యలు నిలోఫర్ (టర్కీ), రజియాబేగం, అన్వరీబేగం. వారసులు ఫాతిమా, ఫాజియా అమీనా, ఓలియా, శ్యామత్ అలీఖాన్
Comments
Please login to add a commentAdd a comment