‘తారీఖులూ దస్తావేజులూ ఇవి కావోయ్ చరిత్ర సారం’ అని శ్రీశ్రీ అన్నాడు గానీ అటు సమయం ఇటు సారాంశం కూడా మారిపోతుంటాయి. సెప్టెంబర్ 17 ఇందుకో ఉదాహరణ. ఆ తేదీ ప్రాధాన్యత ఏమిటి? ఏ కోణంలో ఏ పేరుతో జరపాలి అన్నది ఒక కొలిక్కి రావడానికి దాదాపు 75 ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా కేంద్రం దీన్ని విమోచన దినం అంటే, రాష్ట్రం సమైక్యతా దినోత్సవం అంటున్నది. తెలంగాణ సాయుధ పోరాట వార్షి కోత్సవాలు ఇంతకాలంగా జరుపుతూనే ఉన్న కమ్యూనిస్టులు తదితరులకు వేరే అభిప్రాయాలున్నా కూడా ఆ మహత్తర పోరాట వారసత్వం గుర్తుచేసుకోవడానికి ఏదో ఒక సందర్భం ఉందని సంతోషిస్తున్నారు. ముస్లిం రాజు నిజాం నుంచి విమోచన కనుక విమోచన దినోత్సవాన్ని గట్టిగా జరపాలని బీజేపీ వారంటుంటే, సంస్థానం దేశంలో విలీనమైంది గనక సమైక్యతా దినోత్సవమే సరైందని టీఆర్‌ఎస్ చెబుతున్నది. విమోచన ఎవరి నుంచి అనేది మరో ప్రశ్న. నిరంకుశ పాలకుల అండతో సాగిన వెట్టిచాకిరీ నుంచి, దోపిడీ పీడనల నుంచి విముక్తి అని కమ్యూనిస్టులంటారు. ‘బానిసోన్ని దొరా’ అనే వాడితో బందూకు పట్టించినంతగా మార్పు తెచ్చిన కమ్యూనిస్టుల దగ్గర ఏ ఇంద్రజాలమున్నదో అని సురవరం ప్రతాపరెడ్డి ఆశ్చర్యపోయారు. ‘విలేఖించనిండు నన్ను తెలంగాణ వీరగాథ’ అని గానం చేశారు హరీంద్రనాథ్ ఛటోపా ధ్యాయ.
1947 ఆగస్టు 15 నాటికి తెలంగాణ సాయుధ పోరాటం సాగుతూనే ఉంది. ఆ పోరాటం తాకిడికి హడలిపోయిన కేంద్ర కాంగ్రెస్ పాలకులు పోలీసు చర్య పేరుతో సైనిక చర్య జరి పారు. నిరంకుశ పాలకుడిని రాజ్‌ప్రముఖ్‌ను చేసి, హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకుని, పోరాడే ప్రజలపై తుపాకులు ఎక్కుపెట్టారు. విప్లవ పోరాటం ముందు నిజాం దాదాపు చేతులెత్తేసిన పరిస్థితిలో తిరిగి ఆయనకు ఊపిరి పోశారు. నిజాంకు బ్రిటిషర్లతో సైనిక ఒప్పందం గనక, సొంత సైనిక బలం లేదు గనక అనధికార సైన్యంగా రజాకార్లు ప్రజలపై దాడులు, హత్యాకాండ సాగించారు. వాళ్లను అణచి వేయడానికి వచ్చామంటూనే సైన్యం కమ్యూనిస్టులపై మారణకాండ సాగించింది. ‘మూడువేల మృతవీర సమాధుల పుణ్యక్షేత్రమీ నల్లగొండరా’ అనే పాట చాలు దాని తీవ్రత తెలియడానికి. సర్దార్ పటేల్ హోంమంత్రిగా దీనికి ఆధ్వర్యం వహించారు. మీరు రాజీకి రాకపోతే కమ్యూనిస్టుల రాజ్యం వచ్చేస్తుందని బెదిరించి దారికి తెచ్చుకున్నారు. ఆ విలీనం వాస్తవంగా జరిగిందే గనక వివాదం లేదు. పోరాటంపై దాడి చేశారు గనక విద్రోహం అని అన్నా ఇప్పటి సందర్భం వేరు. పోరాట విరమణే విద్రోహం అనే వారిది సైద్ధాంతిక చర్చ తప్ప ఉత్సవాలతో నిమిత్తం లేదు.
స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా సంస్థానాధీశులపైనా పోరాడాలని కమ్యూనిస్టులు తీసుకున్న విధానాన్ని కాంగ్రెస్ ఆమోదించలేదు. నాటి ఉమ్మడి మద్రాసులోని కేరళ ప్రాంతం; బెంగాల్, పంజాబ్, త్రిపుర ఇలా గొప్ప పోరాటాలే నడిచాయి. నైజాంలలో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటానికి చాలా కాలం పట్టింది. ‘ఆంధ్ర మహాసభ’ మాత్రమే అప్పటికి చెప్పు కోదగిన సంస్థ. నాటి హేమాహేమీలందరూ ఉన్న సంస్థ. మహజర్లు ఇవ్వడం వరకే పరిమితమైన ఆ సంస్థను సమరశీల పథం పట్టించిన కమ్యూనిస్టులు ప్రజలకు నాయకత్వం వహించి నిరంకుశ పాలకుడిపై, గ్రామీణ పెత్తందార్లపై పోరాడారు. భాషా సాంస్కృతిక స్వేచ్ఛ ఈ పోరాటంలో అంతర్భాగం. 3,000 గ్రామాల విముక్తి, పదిలక్షల ఎకరాల పంపిణీ, వెట్టిచాకిరీ రద్దు, దున్నేవాడికి భూమి నినాదం, బానిసలుగా బతుకుతున్న ప్రజల ఆత్మగౌరవం, స్వతంత్ర జీవనం... ప్రధాన విజయాలు. ఇందుకు అర్పించిన ప్రాణాలు నాలుగు వేల పైన. అత్యాచారాలకు, అమానుషాలకు గురైన వారి సంఖ్యలు మరింత భయంకరంగా ఉంటాయి. ఆ పోరాటాన్ని గుర్తించడానికి కాంగ్రెస్ పాలకులకు దాదాపు పాతికేళ్లు పట్టింది. కేసీఆర్‌కు ఎనిమిదేళ్లుపట్టింది. ఇక బీజేపీ మతతత్వ కోణంలో ముస్లిం రాజుపై హిందువుల తిరుగు బాటుగా వక్రీకరించి 1998 నుంచి విమోచన దినం జరుపుతున్నది. అప్పుడు వారి అభినవ సర్దార్ పటేల్ అద్వానీ. ఇప్పుడు అమిత్‌షా. పటేల్ మాత్రమే తెలంగాణ విమోచన సాధించినట్టు చెబుతూ ఆయన సైన్యాలు తర్వాత సాగించిన దారుణకాండను దాటేయడం మరో రాజకీయం. తెలంగాణ ఏర్పడింది గనక ఇప్పటి రాజకీయాలు గతానికి పులమడం అనవసరం. (క్లిక్ చేయండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?)
తెలంగాణ యోధులతో రెడ్డి హాస్టల్‌లో ఉండి పోరా టానికి తొలుత రంగం సిద్ధం చేసింది చండ్ర రాజేశ్వరరావు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి వంటివారు ముందు నిలవకపోతే పోరాటం సాధ్యమయ్యేది కాదని సుందరయ్య స్పష్టంగా రాశారు. ఈ పోరాటం తెలుగువారం దరిదీ. మహిళలు, అణగారిన వర్గాలది అతి కీలక పాత్ర. వారు ఎగరేసింది ఎర్రజండానే. ఇప్పుడు కమ్యూనిస్టులను ఎవరూ పట్టించుకోరని కంచ ఐలయ్య వంటివారు అనొచ్చు గానీ (సాక్షి, సెప్టెంబరు 12) దాచేస్తే దాగని సత్యం ఎర్రెర్రని సూర్యకాంతిలా పలకరిస్తూనే ఉంటుంది. నాటి రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ స్థాపించిన పార్టీ కూడా సమైక్య ఉత్సవాలు జరపాలని కోరడం ఇందుకో నిదర్శనం. స్వాతంత్య్ర వజ్రోత్సవాలతో పాటు సమైక్యతా ఉత్సవంగా జరపడం నేటి పరిస్థితులలో ఆహ్వానించదగింది.
తెలంగాణ వారసత్వంలో భాగంగా ఈ పోరాట ఉత్స వాలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మొదటి ఎడిటర్స్ మీట్‌లోనే నేను అడిగాను. గ్లోరిఫై చేయాలి అని ఆయనన్నారు. అంతకు అయిదారేళ్ల ముందు ఒక టీవీ చర్చలో నిజాం పాత్ర గురించి కూడా మా మధ్య వివాదం జరిగింది. ఆ మాట ఆయన ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. గోదావరి ప్రజలు పూజించే కాటన్‌తో నిజాంను ఆయన పోల్చారు. ప్రజలు కాటన్‌ను తప్ప విక్టోరియా మహారాణిని పూజిం చడంలేదని నేను చెప్పాను. ఏదైనా అది చరిత్ర. నిజాం వ్యక్తిగత దూషణ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. వీర తెలంగాణ విప్లవ స్ఫూర్తిని విభజన రాజకీయాలకు వాడుకోవడం తగని పని.
- తెలకపల్లి రవి
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment