అమిత్ షా
హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా నిర్వహిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగిన అభినందన సభలో ఆయన ప్రసంగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్లే హైదరాబాద్ విలీనం అయిందన్నారు. తెలంగాణకు తాము మొదట్నుంచి కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు తొలి తీర్మానం చేసిన పార్టీ తమదేనన్నారు. గతంలో కొత్తరాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు రెండు ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సక్రమంగా విభజన చేయలేదని విమర్శించారు.
2019లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్కు, హైదరాబాద్కు అవినాభావ సంబంధం ఉందని అమిత్‌షా చెప్పారు.
అమిత్‌షా సమక్షంలో మాజీ డిజిపి దినేష్ రెడ్డి, టిఆర్ఎస్ నేత కపిలవాయి దిలీప్ కుమార్తోపాటు పలువురు బిజెపిలో చేరారు.