వంతెనను పేల్చేయించాడు | Nizam Who Demolished Suryapet Tekumatla Bridge | Sakshi
Sakshi News home page

వంతెనను పేల్చేయించాడు

Published Sat, Sep 17 2022 2:45 AM | Last Updated on Sat, Sep 17 2022 11:01 AM

Nizam Who Demolished Suryapet Tekumatla Bridge - Sakshi

1948 సెప్టెంబర్‌ 16 ఉదయం.. మూసీనది పరవళ్లు తొక్కుతోంది. వరద హోరు తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో పెద్ద శబ్దం. దాని తర్వాత వరస శబ్దాలు. చూస్తుండగానే.. సూర్యాపేట – టేకుమట్ల వంతెన నేలకొరిగింది. అద్భుత నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకున్న ఆ రాతి వంతెనను బాంబులు తునాతునకలు చేసేశాయి. సైనికాధ్యక్షుడు జనరల్‌ ఎడ్రూస్‌ ప్లాన్‌. నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆదేశాలు. భారత సైన్యాలు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టకుండా అడ్డుకునే ప్రణాళిక ఫలితంగా నిజాం ముచ్చటపడి నిర్మించిన టేకుమట్ల వంతెన కూలిపోయింది.     
– సాక్షి, హైదరాబాద్‌

హైదరాబాద్‌–విజయవాడ రహదారిపై సూర్యాపేట­కు పది కి.మీ. ముందున్న మూసీ నదిపై నిజాం ముచ్చటపడి నిర్మించిన వంతెన అది. మంచి ప్లాన్‌తో అద్భుతంగా నిర్మింపజేశాడా వంతెన. సంస్థానానికి సముద్ర రవాణా లేకపోవటంతో సముద్ర వాణిజ్యా­నికి మచిలీపట్నం పోర్టే ఆధారం. అందుకే అక్కడి నుంచి భాగ్యనగరానికి విశాలమైన రోడ్డు నిర్మించాడు. పన్నుల వసూళ్లకు వెళ్లేందుకు, పోర్టు వస్తువుల రవా­ణా, సైనిక పటాలాలు వచ్చి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ‘దండు బాట’గా పిలుచుకునే ఈ రోడ్డుపైనే మూసీ దాటేందుకు అద్భుతంగా వంతెన నిర్మించాడు.

సైనికాధికారి ఎడ్రూస్‌ ప్లాన్‌..
అయితే 1948 సెప్టెంబర్‌లో భారత సైన్యం దాడికి ఉపక్రమించబోతోందని నిజాంకు సమాచారం వచ్చింది. అప్పటికే ఢిల్లీలోని కొందరు పెద్దలతో నిజాం మంతనాలు జరిపాడు. పెద్దగా ప్రతిఘటించొద్దన్న సంకేతాలొచ్చాయి. దానికి నిజాం కొన్ని షరతులు పెట్టాడు. తుది నిర్ణయంపైనే తర్జనభర్జన నడుస్తోంది(ఇది చరిత్ర పరిశోధకుల మాట). సైనిక చర్యపై నిజాం ఆంతరంగికులలో ముఖ్యుడైన సైనికదళా«­దిపతి జనరల్‌ ఎడ్రూస్‌ వెంటనే కార్యరంగంలోకి దిగాడు.

నిర్ణయం తీసుకునేందుకు నిజాంకు సమ­యం కావాలని గుర్తించిన ఎడ్రూస్, భారత సైన్యం వెంటనే హైదరాబాద్‌కు చేరకుండా అడ్డుకోవాలను­కున్నాడు. నగరానికొచ్చే ప్రధాన మార్గాలు, సైన్యం ఏయే ప్రాంతాల నుంచి వస్తుందో మ్యాప్‌ రూపొందించుకున్నాడు. సైన్యాన్ని నిలువరించాలంటే వంతెనలు పేల్చేయడమే మార్గమనే నిర్ణయానికొచ్చాడు. మహా­రా­ష్ట్ర నుంచి వచ్చే సైన్యాన్ని అడ్డుకునేందుకు ఉస్మానాబాద్‌ మార్గంలోని మూడు వంతెనలు గుర్తించాడు.

ఒడిశా గుండా వస్తున్న సైన్యాలను, ఆంధ్రా­ప్రాంతం నుంచి ఖమ్మం మీదుగా వస్తున్న సైన్యాలను ఆపేందుకు టేకుమట్ల వంతెనను పేల్చాలని నిర్ణయించాడు. దీంతో 15 రోజులు సైన్యాన్ని నిలవరించగ­లమని చెప్పి.. నిజాం ఆమోదంతో వంతెనలు పేల్చేందుకు బృందాలను పంపాడు. అందులో భాగంగా సె­ప్టెంబరు 16న సూర్యాపేట వంతెనను పేల్చే­శారు. ఇంతా చేస్తే ఈ వ్యూహం పారలేదు. కొన్ని దళా­లు అను­కున్న సమయానికే హైదరాబాద్‌కు చేరుకోగలిగాయి. 

మళ్లీ నిర్మాణం..
సైనిక చర్య ముగిసి హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయినప్పటికీ, నాటి కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగిన నిజాం.. సూర్యాపేట వంతెనను పునర్నిర్మింపజేశాడు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆధునిక వంతెనను నిర్మించేవరకు సేవలందించిన ఆ వంతెన..  నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటోందన్నట్టుగా విశ్రాంతి తీసుకుంటోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement