హైదరాబాద్‌లో ఖాసీం రిజ్వీ అరాచాకాలు పెరుగుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉందని నిఘావర్గాలు భారత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. చాలా సున్నితమైన హైదరాబాద్ సంస్థానం విలీనం అంశంపై నెహ్రూ-పటేల్‌లు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో ఓ వైపు సైన్యం సిద్ధమవుతున్నా హైదరాబాద్‌పై సైనిక చర్య జరుగుతుందా లేదా అనే విషయంపై గందరగోళం నెలకొంది. చివరికి సెప్టెంబర్‌లో హైదరాబాద్ సంస్థానంలోకి భారతసైన్యం అడుగుపెట్టడానికి పటేల్ ఓకే అన్నారు. దీనికి ఆపరేషన్ పోలో అని నామకరణం చేశారు.
హైదరాబాద్‌లోని పోలో గ్రౌండ్స్ వల్లే సైనికచర్యకు పోలో అనే పేరుపెట్టారని కొందరు చరిత్రకారులు అంటారు. ఇక హైదరాబాద్‌లో భారత సైన్యం ప్రవేశాన్ని సైనిక చర్య అని పిలవకుండా పోలీసు చర్యగా పిలవాలని నిర్ణయించారు. సైనిక చర్య అంటే మళ్లీ అంతర్జాతీయంగా వివాదం రేగే ప్రమాదం ఉంటుందని.. పోలీసుచర్య అంతర్గత వ్యవహారంగా ఉంటుందనేది పటేల్ భావన. అయితే తరువాతి కాలంలో ఆపరేషన్ పోలోను ఆపరేషన్ క్యాటర్ పిల్లర్‌గా మార్చారు.
ఇక అటు భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతుందనే సమాచారం నిజాం చెవినపడింది. దీంతో ఎలాగైనా యుద్ధం చేయాలని నిజాం నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన మంత్రి లాయక్ అలీని లండన్‌కు పంపి అక్కడ భారీగా అయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. ఇక సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియాకు చెందిన పైలట్ ద్వారా యుద్ద విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. దీంతో ఆపరేషన్ పోలోను వేగవంతం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది.
ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమయినా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదని పటేల్ నిశ్చయించుకున్నారు. ఒకవేళ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే నిజాం సంస్థానంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని పటేల్ ఆందోళన చెందారు. నిజాం రాజుకు దేశవ్యాప్తంగా ముస్లింలలో ఉన్న పలుకుబడి వల్ల ఈ కల్లోలాలు దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ఉక్కుమనిషి ముందే ఊహించారు. దీంతోపాటు యుద్ధం ఆలస్యం అయితే ఇదే అదనుగా పాకిస్తాన్ కాశ్మీర్‌లో ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే పటేల్ సైనిక చర్యను వేగంగా ముగించాలని పట్టుదల ప్రదర్శించారు.
సెప్టెంబర్ 13న సైనికచర్యకు అన్ని రకాలుగా రంగం సిద్ధమయింది. సరిగ్గా రెండు రోజుల ముందు పాకిస్తాన్‌లో జిన్నా సెప్టెంబర్-11న చనిపోయాడు. భారత ఆర్మీకి జిన్నా మృతి రూపంలో అవకాశం కలిసి వచ్చింది. దీంతో 13వ తేదీన సైనికచర్య ప్రారంభిస్తే పాకిస్థాన్ అంత తొందరగా స్పందించే అవకాశం ఉండదని పటేల్ భావించారు. సెప్టెంబర్-13 తెల్లవారు జామున ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. అయితే ఆపరేషన్ పోలో ప్రారంభం విషయం ప్రధాని నెహ్రూకు తెలియదని పటేల్ నెహ్రూకు చెప్పకుండానే ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.
ఇటు హైదరాబాద్‌పై పోలీసు చర్య ప్రారంభం కాగానే అప్పటి పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ అత్యవసరంగా తన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో భారత్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానంపై దాడి చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఉన్న భారత సైన్యంపై పాకిస్తాన్ ఏమైనా చర్యకు దిగే అవకాశాలున్నాయా అని తన సైన్యాన్ని ప్రశ్నించారు.
పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా ఉన్న ఎలవర్థీ.. హైదరాబాద్‌లో పాకిస్తాన్ ఎలాంటి సైనిక చర్యకు దిగే అవకాశం లేదని స్పష్టంచేశారు.. దీంతో ఢిల్లీ పైన పాకిస్థాన్ బాంబులు వేసే అవకాశం ఉందా? అని లియాఖత్ అలీఖాన్ మరో ప్రశ్నవేశారు. దీనికి సమాధానంగా ఎలవర్దీ పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం నాలుగు యుద్ధ విమానాలే ఉన్నాయని.. అందులో రెండు పనిచేయడం లేదన్నాడు. తమ వద్ద ఉన్న రెండు విమానాల్లో ఒకటి మాత్రమే ఢిల్లీ వరకు వెళ్లగలదని.. అయితే అది తిరిగివచ్చే గ్యారంటీ లేదని స్పష్టం చేశాడు. దీంతో హైదరాబాద్ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని పాకిస్థాన్ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment