Vallabhbhai Patel
-
జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్
సాక్షి, హైదరాబాద్: ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 13 నెలలు గడుస్తోంది. దక్షిణ భారతంలో కీలకమైన హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. అంతేకాదు పాకిస్థాన్‌కు అనుకూలంగా మారుతోంది. విలీనం కోసం భారత్ ఒత్తిడి తెస్తే పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్ నుంచి రేడియో సందేశాలు వెళ్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ సంస్థానం రజాకార్లు, నిజాం సైన్యం అకృత్యాలతో అట్టుడుకుతోంది. ఇక కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందే’.. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ మదిలో ఇదే ఆలోచన. అదును దొరికితే చాలని వేచి ఉన్నారు. దేశ విభజనకు కారణమైన పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా 1948 సెప్టెంబరు 11న మృతి చెందారు. ఇంకేం అదును దొరికింది. ఆ సమయంలో కాశ్మీర్లో ఉన్న సర్దార్ పటేల్.. తుపాకీ చూపి నిజాంను దారికి తెచ్చేందుకు ఆ చల్లని వాతావరణంలో వేడివేడి వ్యూహాలను సిద్ధం చేశారు. సైనిక చర్యకు దిగితే ఎలా ఉంటుందో నిజాంకు తెలిసేలా కబురు పంపారు. లొంగిపోవాలా.. ఎదిరించాలా? భారత ప్రభుత్వం తరఫున మేజర్ జనరల్‌గా ఉన్న మున్షీ హైదరాబాద్‌కు వచ్చి నిజాంతో మాట్లాడి, పరిస్థితిని వివరించారు. భారత్ సైనిక చర్యకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టం చేశారు. దీంతో తాను భారత సైన్యాన్ని ఎదురించనని, విలీనానికి సహకరిస్తానని నిజాం సంకేతాలు ఇచ్చారు. ఈ విషయాన్ని రజాకార్లకు, నిజాం సైన్యానికి చెప్పలేదు. లొంగిపోయాక తనపై సైనిక విచారణ, శిక్ష లేకుండా చూసుకోవడం, రాజభరణం, ఇతర సదుపాయాలు అందుకోవడంపైనే దృష్టిపెట్టారు. హైదరాబాద్ సంస్థానం మంత్రి వర్గాన్ని అత్యవసరంగా సమావేశపర్చి.. అందరినీ రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అందరూ రాజీనామా చేసి, నిజాం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. నిజాం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలిపి, సైన్యాన్ని ఎదురించబోనని మాటిచ్చారు. ప్రతిగా విలీనం తర్వాత తనకు ప్రాధాన్యమున్న హోదా ఇవ్వాలని, 200 కోట్ల నగదు ఇవ్వాలని, తన బిరుదులను కొనసాగించాలని, తన ఆస్తులు తనకే దక్కాలని కోరారు.ఇవి తెలియని రజాకార్ల బృందాలు, నిజాం సైన్యం.. భారత సైన్యం దాడి మొదలుపెట్టినప్పుడు ప్రతిఘటించాయి. కీసర సరిహద్దులో భీకర దాడితో.. నిజాం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో.. భారత సైన్యాలను ఎదుర్కొనే విషయంగా నిజాం సైన్యం దీటుగా వ్యవహరించలేకపోయింది. కొద్దిపాటి ప్రతిఘటనతోనే లొంగిపోవడమో, పారిపోవడమో జరుగుతూ వచ్చింది. ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులో ఉన్న కీసర ప్రాంతంలో మాత్రం భీకర దాడి జరిగింది. కీసర వద్ద నిజాం ఔట్‌పోస్టు వద్దకు భారీగా రజాకార్ల దండు చేరుకుని.. భారత సైన్యంపై దాడికి దిగింది. చాలాసేపు పోరాడాక భారత సైన్యం యుద్ధ ట్యాంకుతో దాడి చేస్తే.. నిజాం ఔట్‌పోస్టు నామరూపాల్లేకుండా పోయింది. ఇలాగే ఖమ్మం వద్ద కూడా దాడి జరిగింది. వందల మంది చనిపోతుండటంతో నిజాం సైన్యం వెనకడుగు వేసింది. కాశీం రజ్వీ దీన్ని తట్టుకోలేక నిజాంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌పై దాడి చేసి తమకు సహకరించాలని పాకిస్తాన్‌ను కోరాడు. పాకిస్తాన్ స్పందించలేదు. నిజాం లొంగిపోగా హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) అక్రమంగా విమానం ద్వారా ఆయుధాలు ఆస్ట్రియా వ్యాపారి కాటన్ ద్వారా నిజాం రాజు అక్రమంగా ఆయుధా లు సమకూర్చుకున్నాడు. పాకిస్తాన్‌కు వెళ్తున్న విమానంగా చూపి, కారుణ్య సహాయం పేరుతో విమానాన్ని బీదర్ ఎయిర్‌పోర్టులో దింపేవారు. అక్కడి విమాన స్ట్రిప్‌లో ఆయుధాలను అన్లోడ్ చేసేవారు. ఇది బయటపడడంతో బీదర్ బదులు వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి మకాం మార్చారు. లంకాస్టర్ అనే 4 ఇంజిన్లుండే ఈ విమానం ద్వారా 1948 మే నుంచి జూన్ 20 వరకు నిరాటంకంగా ఈ అక్రమ వ్యవహారం సాగింది. భారత ప్రభుత్వం వినతితో బ్రిటిష్ వారి జోక్యంతో తర్వాత ఆగిపోయింది. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్‌గా!) -
నిజాం నవాబుకు పటేల్ 3 నెలలు గడువు ఎందుకిచ్చారు?.. దీని వెనుక కారణాలేమిటంటే..
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా సమస్యలు ఎన్నో కొనసాగాయి. మిగిలిన సంస్థానాలతో పాటు హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేయడం అంత ఈజీ కాదన్న విషయాన్ని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ ముందే గుర్తించారు. అందుకే భారత్‌లో విలీనం అయ్యేందుకు.. నిజాం నవాబుకు 3 నెలల సమయం ఇచ్చారు. దీనికి చాలా కారణాలున్నాయి. చదవండి: నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’ ముఖ్యంగా నిజాం సంస్థానం దేశంలోనే అత్యంత పెద్ద రాజ్యం. భారతదేశంలో విలీనానికి ముందు నిజాం రాజ్యం 82 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఉంది. అంటే ఇప్పటి బ్రిటన్-స్కాట్లాండ్ దేశాలకన్నా వైశాల్యంలో పెద్దది. ఇక ప్రపంచంలోనే నిజాం అత్యంత ధనికుడు. 1924లో ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ తన కవర్ పేజీపై ప్రపంచంలోనే అత్యంత ధనికుడంటూ అప్పటి నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఫోటో ప్రచురించింది. ఇక నిజాం రాష్ట్రంపై వెంటనే భారత్ సైనికచర్య చేపట్టకపోవడానికి ముఖ్యకారణం... నిజాం ప్రభువుకు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో ఉన్న మతపరమైన అభిమానం. అందుకే హైదరాబాద్ సంస్థానాన్ని చర్చల ద్వారానే విలీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఏడాది పాటు ప్రయత్నించింది. ఏవిధంగానైనా నిజాం రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేసుకోవాలని ప్రధాని నెహ్రూ ముందు హోంమంత్రి పటేల్ ప్రతిపాదన పెట్టారు. భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వాతంత్ర్యంగా ఉండటం దేశభద్రతకు ముప్పు అని పటేల్ భావించారు. అయితే హైదరాబాద్ రాష్ట్రంపై సైనికచర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం తలదూర్చే ప్రమాదం ఉందని నెహ్రూ అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓ వైపు పాకిస్తాన్‌తో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్‌లో సైనిక చర్యకు దిగడం సరికాదనే నెహ్రూ సూచనకు పటేల్ సరేనన్నారు. దీంతో తాను స్వతంత్ర్యంగా ఉంటానని ప్రకటించిన నిజాంను ఎలాగైనా లొంగదీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావించారు. చివరికి మూడునెలల పాటు యథాతథ స్థితికి నిజాంతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడింది. అయితే మూడునెలల తరువాత నిజాం తన సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేస్తేనే ఈ ఒడంబడిక చెల్లుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దాదాపు నాలుగు దఫాల చర్చల తరువాత నిజాం 1947 నవంబర్ 29 ఈ ఒప్పందంపై సంతకం పెట్టాడు. -
హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?
హైదరాబాద్‌లో ఖాసీం రిజ్వీ అరాచాకాలు పెరుగుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉందని నిఘావర్గాలు భారత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. చాలా సున్నితమైన హైదరాబాద్ సంస్థానం విలీనం అంశంపై నెహ్రూ-పటేల్‌లు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో ఓ వైపు సైన్యం సిద్ధమవుతున్నా హైదరాబాద్‌పై సైనిక చర్య జరుగుతుందా లేదా అనే విషయంపై గందరగోళం నెలకొంది. చివరికి సెప్టెంబర్‌లో హైదరాబాద్ సంస్థానంలోకి భారతసైన్యం అడుగుపెట్టడానికి పటేల్ ఓకే అన్నారు. దీనికి ఆపరేషన్ పోలో అని నామకరణం చేశారు. హైదరాబాద్‌లోని పోలో గ్రౌండ్స్ వల్లే సైనికచర్యకు పోలో అనే పేరుపెట్టారని కొందరు చరిత్రకారులు అంటారు. ఇక హైదరాబాద్‌లో భారత సైన్యం ప్రవేశాన్ని సైనిక చర్య అని పిలవకుండా పోలీసు చర్యగా పిలవాలని నిర్ణయించారు. సైనిక చర్య అంటే మళ్లీ అంతర్జాతీయంగా వివాదం రేగే ప్రమాదం ఉంటుందని.. పోలీసుచర్య అంతర్గత వ్యవహారంగా ఉంటుందనేది పటేల్ భావన. అయితే తరువాతి కాలంలో ఆపరేషన్ పోలోను ఆపరేషన్ క్యాటర్ పిల్లర్‌గా మార్చారు. ఇక అటు భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతుందనే సమాచారం నిజాం చెవినపడింది. దీంతో ఎలాగైనా యుద్ధం చేయాలని నిజాం నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన మంత్రి లాయక్ అలీని లండన్‌కు పంపి అక్కడ భారీగా అయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. ఇక సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియాకు చెందిన పైలట్ ద్వారా యుద్ద విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. దీంతో ఆపరేషన్ పోలోను వేగవంతం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది. ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమయినా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదని పటేల్ నిశ్చయించుకున్నారు. ఒకవేళ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే నిజాం సంస్థానంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని పటేల్ ఆందోళన చెందారు. నిజాం రాజుకు దేశవ్యాప్తంగా ముస్లింలలో ఉన్న పలుకుబడి వల్ల ఈ కల్లోలాలు దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ఉక్కుమనిషి ముందే ఊహించారు. దీంతోపాటు యుద్ధం ఆలస్యం అయితే ఇదే అదనుగా పాకిస్తాన్ కాశ్మీర్లో ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే పటేల్ సైనిక చర్యను వేగంగా ముగించాలని పట్టుదల ప్రదర్శించారు. సెప్టెంబర్ 13న సైనికచర్యకు అన్ని రకాలుగా రంగం సిద్ధమయింది. సరిగ్గా రెండు రోజుల ముందు పాకిస్తాన్లో జిన్నా సెప్టెంబర్-11న చనిపోయాడు. భారత ఆర్మీకి జిన్నా మృతి రూపంలో అవకాశం కలిసి వచ్చింది. దీంతో 13వ తేదీన సైనికచర్య ప్రారంభిస్తే పాకిస్థాన్ అంత తొందరగా స్పందించే అవకాశం ఉండదని పటేల్ భావించారు. సెప్టెంబర్-13 తెల్లవారు జామున ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. అయితే ఆపరేషన్ పోలో ప్రారంభం విషయం ప్రధాని నెహ్రూకు తెలియదని పటేల్ నెహ్రూకు చెప్పకుండానే ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇటు హైదరాబాద్‌పై పోలీసు చర్య ప్రారంభం కాగానే అప్పటి పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ అత్యవసరంగా తన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో భారత్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానంపై దాడి చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఉన్న భారత సైన్యంపై పాకిస్తాన్ ఏమైనా చర్యకు దిగే అవకాశాలున్నాయా అని తన సైన్యాన్ని ప్రశ్నించారు. పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా ఉన్న ఎలవర్థీ.. హైదరాబాద్‌లో పాకిస్తాన్ ఎలాంటి సైనిక చర్యకు దిగే అవకాశం లేదని స్పష్టంచేశారు.. దీంతో ఢిల్లీ పైన పాకిస్థాన్ బాంబులు వేసే అవకాశం ఉందా? అని లియాఖత్ అలీఖాన్ మరో ప్రశ్నవేశారు. దీనికి సమాధానంగా ఎలవర్దీ పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం నాలుగు యుద్ధ విమానాలే ఉన్నాయని.. అందులో రెండు పనిచేయడం లేదన్నాడు. తమ వద్ద ఉన్న రెండు విమానాల్లో ఒకటి మాత్రమే ఢిల్లీ వరకు వెళ్లగలదని.. అయితే అది తిరిగివచ్చే గ్యారంటీ లేదని స్పష్టం చేశాడు. దీంతో హైదరాబాద్ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని పాకిస్థాన్ నిర్ణయించింది. -
Telangana Vimochana Dinotsavam: గంగాపూర్ ఘటనతో స్పీడ్ పెంచిన సర్దార్
భారత్‌లో విలీనం కావడం ముందు నుంచి నిజాంకు ఇష్టం లేదు. భారత స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే తాను భారత్‌లో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండే అవకాశం ఉందా అని నిజాం తన సలహాదారు సర్ వాల్టర్ మాంగ్టన్‌ను అడిగాడు. అయితే వాల్టర్ మాంగ్టన్ భారత్ మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం లేదని పాకిస్థాన్‌లో విలీనం కావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. అయినా ఏదో విధంగా స్వతంత్రంగా ఉండాలనేదే నిజాం అభిలాష. మరోవైపు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడైన ఖాసీం రజ్వీ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ సంస్థానం విలీనం చేయకూడదంటూ నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. రజాకార్ల పేరుతో ఖాసీం రజ్వీ ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం అప్పటికే తెలంగాణాలో అరాచాకాలు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో సభ పెట్టి తాము ఎర్రకోటపై నిజాం జెండా ఎగరేస్తామని ఖాసీం రజ్వి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రారంభించాడు. హైదరాబాద్ సంస్థానంపై సైనికచర్యకు సంబంధించి నెహ్రూ-పటేల్ మధ్య వైరుధ్యం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోడానికి సైనికచర్య చివరి ప్రత్యామ్నాయం కావాలని నెహ్రూ భావించారు..పటేల్ మాత్రం తాత్సారం చేయకూడదనే ఆలోచనతో ఉన్నారు. దీనికోసం ఆపరేషన్ పోలో పేరుతో ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఈ ఆపరేషన్ అత్యంత వేగంగా పూర్తవ్వాలనేది పటేల్ వ్యూహం. గంగాపూర్ రైల్వేస్టేషన్లో రజాకార్లు చేసిన దాడి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీంతో అప్పటి వరకు సహనంతో ఉన్న పటేల్ వెంటనే హైదరాబాద్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. వెంటనే కాశ్మీర్లో ఉన్న సైన్యాధ్యక్షుడు కరియప్పను ఢిల్లీకి పిలిపించిన పటేల్.. హైదరాబాద్‌పై చర్యకు సిద్ధం కావాలని ఆదేశించారు. దీంతో సైనికాధికారులు అత్యంత వేగంగా సైనిక చర్య పూర్తి చేసే విధంగా వ్యూహాలు రూపొందించారు. ఒకవేళ హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం చర్యకు దిగితే పాకిస్థాన్ ఏదైనా ప్రతీకార దాడులు చేస్తుందా అనే కోణంలోనూ పటేల్ వ్యూహాలు సిద్ధం చేశారు. దీనికోసం నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పడు సమాచారం సేకరించి పాకిస్థాన్ ఎత్తుగడలపై సమీక్షలు జరిపారు. ఇక భారత్ సైనిక చర్యను నిజాం సైన్యం ఎంతకాలం ఎదుర్కోగలదనే విషయంపై ప్రాథమికంగా కొంత గందరగోళం ఉండింది. ముఖ్యంగా నిజాం యుద్ధవిమానాలు కొనుగోలు చేస్తున్నాడని కొంతమంది సైనిక జనరల్స్ సమాచారం ఇచ్చారు. దీంతో సైనిక చర్యకు దిగాలా.. వద్దా అనే మీమాంస ఎదురైంది. -
ఆ ఒక్క కుటుంబం కోసం..
న్యూఢిల్లీ: నెహ్రూ–గాంధీ కుటుంబం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ కుటుంబాన్ని కీర్తించడం కోసం స్వాతంత్య్ర పోరాటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్, సుభాష్‌చంద్ర బోస్ లాంటి మహానుభావుల త్యాగాల్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆరోపించారు. ఈ దిగ్గజాలు పోషించిన చారిత్రక పాత్రను భారతీయులంతా తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఎర్రకోటలో మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుభాష్‌చంద్ర బోస్ అనుచరుల్లో ఒకరైన లాల్టిరామ్ బహూకరించిన టోపీ ధరించి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు బ్రిటిష్ పాలకుల చేతిలో విచారణ ఎదుర్కొన్న ఎర్రకోటలోని జైలుగది సంఖ్య 3లో ఆ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయనున్నారు. అదే జైలులో ఒక మ్యూజియాన్ని కూడా నిర్మించనున్నారు. వాళ్ల మార్గదర్శనం ఉండి ఉంటే... స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా బ్రిటిష్ వ్యవస్థ ఆధారంగానే మన విధానాల్ని రూపొందించారని, బ్రిటిషర్ల దృక్కోణంలోనే ఆలోచించారని మోదీ పేర్కొన్నారు. అందుకే విద్య, ఇతర రంగాలకు సంబంధించిన విధానాలు విఫలమయ్యాయని అన్నారు. ‘భారతదేశ చరిత్ర, విలువల పట్ల నేతాజీ ఎంతో గర్వించేవారు. ఇతర దేశాల కోణంలో అన్నింటిని చూడొద్దని ఆయన బోధించారు. 16 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలనలో భారత దేశ దుస్థితి పట్ల కలతచెందారు. జాతీయవాదమే ఆయన సిద్ధాంతం. అదే శ్వాసగా బతికారు. వలస పాలన, అసమానత్వంపై పోరాటంలో భాగం గా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో బోస్ స్ఫూర్తిగా నిలిచారు. సుభాష్‌చంద్ర బోస్, సర్దార్ పటేల్ లాంటి మహానుభావులు మార్గదర్శనం లభించినట్లయితే పరిస్థితులు ఇప్పుడు మరోలా ఉండేవి. ఒక కుటుంబాన్ని కీర్తించేందుకు, ఎందరో గొప్ప నాయకుల సేవల్ని విస్మరించడం విచారకరం’ అని మోదీ అన్నారు. విపత్తు సమయంలో సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించే సిబ్బందికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ఇకపై ఏటా అవార్డు ఇస్తామని మోదీ ప్రకటించారు. పోలీసు స్మారకానికి ఇన్నేళ్లా?.. విధుల నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం స్మారకం ఏర్పాటుచేయడంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మోదీ ఆరోపించారు. జాతీయ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మోదీ పోలీసు స్మారకాన్ని ఆవిష్కరించారు. ‘దేశానికి అంకితం చేస్తున్న ఈ స్మారకం పట్ల గర్విస్తున్నా. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఇన్నాళ్లూ ఇలాంటి స్మారకాన్ని ఎందుకు ఏర్పాటుచేయలేదని ప్రశ్నిస్తున్నా. 2002లో శంకుస్థాపన జరిగిన ఈ స్మారక నిర్మాణ పనులకు కొన్ని న్యాయపర అడ్డంకులు తలెత్తిన సంగతిని అంగీకరిస్తున్నా. కానీ అంతకుముందున్న ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్మారకం ఎప్పుడో పూర్తయ్యేది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఖమ్మం గ్రానైట్‌తో స్మారకం సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆవిష్కరించి న జాతీయ పోలీసు స్మారక చిహ్నాన్ని ఖమ్మం గ్రానైట్‌తో తయారుచేయడం విశేషం. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 31 అడుగుల పొడ వు, 9 అడుగుల వెడల్పుతో 270 టన్నుల బరువున్న అతి భారీ గ్రానైట్ రాయి తో ఈ స్మారక చిహ్నన్ని రూపొందించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెర్వు మాధారంలోని గాయత్రి గ్రానైట్స్ క్వారీ నుం చి ఈ రాయిని వెలికితీసి ఢిల్లీకి తరలించారు. ఆర్కిటెక్చర్ నిపుణులు ఈ గ్రానైట్‌పై ముం దువైపు స్మారక చిçహ్నాన్ని చెక్కారు. ఈ కార్యక్రమానికి గాయత్రి గ్రానైట్స్ యాజమాన్య ప్రతినిధులు వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్వర్లు, నిఖిల్‌లను హోం శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. -
ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదు..!?
సాక్షి, బర్డోలి (గుజరాత్): కశ్మీర్ విషయంలో ప్రపంచంలోని ఏశక్తి భారత్‌ను ఆపలేవని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన తెలిపారు. చొరబాట్లకు పాల్పడే ఉగ్రవాదులకు ఏరివేయడంలో లోయలోని సైనికులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోనూ, సరిహద్దులోనూ ఉగ్రవాదులకు సైన్యం దీటుగా బదులిస్తోందని అన్నారు. కశ్మీర్ భద్రత గురించి దేశంలో ఏ ఒక్కరూ సందేహించాల్సిన అవసరం లేదని రాజ్‌నాథ్ అన్నారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్‌ను అపలేవు.. కశ్మీర్ సమస్యకు పరిష్కరిస్తాం.. అని ఆయన అన్నారు. గుజరాత్లో జరిగిన గుజరాత్ గౌరవ్ యాత్రలో ఆయన ప్రసంగించారు. పొరుగునున్న పాకిస్తాన్‌తో శాంతిని నెలకొల్పేందుకు మన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విధాలుగా ప్రయత్నించారని ఆయన చెప్పారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మరీ మోదీ పాకిస్తాన్‌వెళ్లి అక్కడ చర్చలు జరిపారు.. అయితే పాకిస్తాన్ ఆలోచనల్లో ఎటువంటి మార్పులు రాలేదని చెప్పారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టేలా కాల్పులకు దిగుతుంది.. మన సైన్యం ఘాటుగా ప్రతిస్పందిస్తే.. తెల్లజెండా ఎగరేస్తారని ఎగతాళిగా అన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వేచ్ఛ ఇచ్చివుంటే.. నేడు కశ్మీర్ సమస్య ఉండేది కాదని రాజ్‌నాథ్ మరోసారి చెప్పారు. పండిట్ నెహ్రూ వైఫల్యం వల్లే కశ్మీర్ సమస్య ఉత్పన్నమైందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. -
పటేల్‌కు వైఎస్ జగన్ నివాళులు
హైదరాబాద్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ సమైక్య దినోత్సవాన్ని పురస్కరించుకొని లోటస్ పాండ్‌లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, శ్రీనివాస వేణుగోపాల క్రిష్ణలతోపాటూ పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
లచ్చన్న ఆశయాలు కొనసాగించాలి
ఒంగోలు టౌన్ : క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీకి మారుపేరుగా నిలిచే సర్ధార్ గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్ ఉద్బోధించారు. గౌతు లచ్చన్న 105వ జయంతి వేడుకలను గౌడ కార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక శ్రీనివాస కాలనీలో నిర్వహించారు. లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని గౌతు లచ్చన్న ముఖ్యనేతల మన్ననలను పొందారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం అనంతరం రైతు కూలీలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి, కల్లుగీత కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారని కొనియాడారు. సర్ధార్ అనే బిరుదు ఉత్తర భారతదేశంలో వల్లభాయి పటేల్, దక్షిణ భారతదేశంలో గౌతు లచ్చన్నకు మాత్రమే ఉందన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. టీడీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు యానం చినయోగయ్య యాదవ్ మాట్లాడుతూ లచ్చన్న తాను ఎన్నికైన శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి మధ్యలోనే రాజీనామా చేసి ఆ స్థానంలో తన గురువు ఎన్జీ రంగాను గెలిపించి గురుదక్షిణ తీర్చుకున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కానుగుల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు ఎస్కే మౌలాలి, ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ శ్రీను, పద్మశాలి చేనేత ప్రజాసమితి జిల్లా అధ్యక్షుడు మొగిలి ఆనందరావు, జంగమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.