లచ్చన్న ఆశయాలు కొనసాగించాలి
ఒంగోలు టౌన్ : క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీకి మారుపేరుగా నిలిచే సర్ధార్ గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్ ఉద్బోధించారు. గౌతు లచ్చన్న 105వ జయంతి వేడుకలను గౌడ కార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక శ్రీనివాస కాలనీలో నిర్వహించారు.
లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని గౌతు లచ్చన్న ముఖ్యనేతల మన్ననలను పొందారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం అనంతరం రైతు కూలీలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి, కల్లుగీత కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారని కొనియాడారు.
సర్ధార్ అనే బిరుదు ఉత్తర భారతదేశంలో వల్లభాయి పటేల్, దక్షిణ భారతదేశంలో గౌతు లచ్చన్నకు మాత్రమే ఉందన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. టీడీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు యానం చినయోగయ్య యాదవ్ మాట్లాడుతూ లచ్చన్న తాను ఎన్నికైన శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి మధ్యలోనే రాజీనామా చేసి ఆ స్థానంలో తన గురువు ఎన్‌జీ రంగాను గెలిపించి గురుదక్షిణ తీర్చుకున్నారన్నారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కానుగుల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు ఎస్‌కే మౌలాలి, ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ శ్రీను, పద్మశాలి చేనేత ప్రజాసమితి జిల్లా అధ్యక్షుడు మొగిలి ఆనందరావు, జంగమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.