సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను నిజామాబాద్ ఎంపీ గానే పోటీ చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎంపీగా గెలుస్తా నని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ఎల్పీలో ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌తో కలిసి గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ధర్మపురి అర్వింద్ ఓ దౌర్భాగ్యుడు అని, ఆయన ఎంపీగా గెలవడంతో నిజామాబాద్ అభివృద్ధిలో ఇరవై ఏళ్లు వెనక్కి పోయిందని ధ్వజమెత్తారు.
అర్వింద్ కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి అర్వింద్ దారుణంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం సున్నా అని విమర్శించారు. నిజామాబాద్ ఐటీ హబ్ తో జిల్లా దశ దిశ మారబోతోందని, ఉద్యోగాల కల్పనపై అర్వింద్ మాట్లాడినవన్నీ అబద్ధాలేనన్నారు. సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనకు లేదన్నారు.
స్విచ్‌లో వేలు పెట్టి చూస్తే కరెంటు వస్తుందో లేదో తెలుస్తుంది
తెలంగాణలో కరెంటు 24 గంటలు వస్తుందో లేదో ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ బీజేపీ కార్యాలయంలోని స్విచ్‌లో వేలుపెట్టి చూడాలని కవిత సలహా ఇచ్చారు. పార్లమెంటులో ఏం మాట్లాడుతారో సంజయ్‌కే తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని కాళేశ్వరం సహా ఏ ప్రాజెక్టుకూ కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని, మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ఉండడంతో అక్కడున్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడమే కాక, రూ.22వేల కోట్లు మంజూరు చేశారని చెప్పారు.
రెండురోజుల కిందట కేంద్ర మంత్రి నిషికాంత్ దూబే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు మాట్లాడారని, దానికి కొనసాగింపుగా బండి సంజయ్ అదే మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వమంటే ఇవ్వలేదని గుర్తు చేశారు. తమ నాయకుడిని వ్యక్తిగతంగా దూషించిన బండి సంజయ్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాళేశ్వరంపై బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం చేయగా, బీఆర్‌ఎస్ ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారని కవిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment