District Revenue Officer
-
నిఘా నీడలో కలెక్టరేట్
ఒంగోలు టౌన్: జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్ నిఘా నీడలో ఉంది. గతంలో ఎన్నడూ లేనట్లు మూడు సీసీ కెమెరాలను శనివారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ వి.వినయ్‌చంద్, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి చాంబర్ ముందు, కలెక్టరేట్లోని ఈ–సెక్షన్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డీఆర్ఓ చాంబర్ ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా అక్కడ నుంచి జాయింట్ కలెక్టర్ సీసీ రూమ్ వరకు అక్కడ రాకపోకలు సాగించేవారి వివరాలు తెలుస్తూనే ఉంటాయి. కలెక్టర్ చాంబర్ ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా ఆయన తన చాంబర్లో ఉంటే ఆయనను కలిసేందుకు ఎవరు వస్తున్నారు, ఎంతమంది ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారనేది తెలుస్తుంది. అదేవిధంగా కలెక్టరేట్లోని ఈ–సెక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా ఆ సెక్షన్లకు సంబంధించిన కారిడార్ మొత్తం రికార్డు అవుతూ ఉంటుంది. ఈ మూడు సీసీ కెమెరాలకు సంబంధించిన మానిటరింగ్‌ను జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లో ఏర్పాటు చేశారు. డీఆర్ఓ తన చాంబర్లో కూర్చొని రోజువారీ తన విధులను నిర్వర్తించడంతోపాటు కలెక్టరేట్‌కు సంబంధించిన పర్యవేక్షణను సీసీ కెమెరాల మానిటరింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ‘డబుల్’ రిజల్ట్: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా డబుల్ రిజల్ట్ రానుంది. ఇప్పటికే కలెక్టరేట్లో సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బందికి సంబంధించి బయోమెట్రిక్ ద్వారా హాజరు విధానాన్ని గమనిస్తున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వారి పనితీరును కూడా గమనించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకల్లా బయోమెట్రిక్ ద్వారా హాజరు వేసిన సూపరింటెండెంట్లు, సిబ్బంది పనివేళల్లో మధ్యలో తమ కుర్చీల్లో లేకుండా కలెక్టరేట్ కారిడార్‌లో తిరుగుతుంటే ఆ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డు కానున్నాయి. కార్యాలయ పనివేళల్లో అటూ ఇటూ తిరుగుతూ టైంపాస్ చేయకుండా కట్టడి చేసేందుకు సీసీ కెమెరాలు దోహదపడనున్నాయి. ఇదిలా ఉంటే సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలెక్టరేట్‌కు వచ్చే సందర్శకుల వివరాలు కూడా ఎప్పటికప్పుడు కలెక్టరేట్ పరిపాలనా యంత్రాంగం తెలుసుకునే వీలు కలగనుంది. కలెక్టరేట్లోని ఉన్నతాధికారుల చాంబర్లకు ఎవరు ఎక్కువగా వస్తున్నారనే వివరాలను కూడా రికార్డు కానున్నాయి. కలెక్టరేట్లోని ఏ నుంచి హెచ్ వరకు ఉన్న సెక్షన్లల్లోకి ఇతరులు ఎవరూ వెళ్లకుండా ఉండేలా నిబంధనలను కఠినతరం చేశారు. సెక్షన్లలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకుగాను ఎంట్రన్స్‌లో ప్రత్యేకించి ఒక అటెండర్‌ను కూడా ఏర్పాటు చేశారు. -
ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ అన్నా రు. ప్రజావాణిలో భాగంగా సోమవారం జిల్లా పరిషత్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజావాణికి హాజరవుతారని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కొణిజర్ల మండలం బస్వాపురం గ్రామానికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు ఇటీవల కాలంలో పిడుగుపడి తన రెండు ఆవులు మృతి చెందాయని, ఆవుల ద్వారా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు న్యా యం చేయాలని విన్నవించారు. బీసీ హాస్టల్లో వాచ్మెన్ ఉద్యోగం కోసం సీఎం కార్యాలయంలో సంప్రదించగా అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని సూచించారని కల్లూరుకు చెందిన షేక్ గఫార్ డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. సీఎం కార్యాలయం నుంచి ఇచ్చిన ప్రతులను చూపించారు. డీఆర్వో ఉన్నతాధికారుల ఆదేశానుసారం సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. పలువురు వినతిపత్రాలు సమర్పించగా, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నగేష్ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని..... ఇంటి స్థలం కోసం తిరుగుతున్నా స్వాతంత్య్ర సమరయోధురాలిగా ఉన్న పెండ్యాల శేషారత్నం ఇంటి స్థలం ఇప్పించాలని డీఆర్వోకు విన్నవించారు. గతంలో కలెక్టర్, జేసీలను కలిసి సమస్యను విన్నవించానన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చినట్లు శేషారత్నం తెలిపారు. -శేషారత్నం, ఖమ్మం ఇల్లు కోసం వినతి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవాలని ప్రజావాణిలో డీఆర్వోకు విన్నవించినట్లు నగరంలోని విజయనగర్ కాలనీకి చెందిన బి.అప్పారావు తెలిపారు. గతంలో కూడా సమస్యను విన్నవించానని, సమస్య పరిషష్కారం కాకపోవటంతో తిరిగి విన్నవించినట్లు వెల్లడించారు. -అప్పారావు, విజయనగర్‌కాలనీ, ఖమ్మం ఆగిన పెన్షన్ ఇవ్వాలని కోరా తనకు ఇస్తున్న పెన్షన్ ఆరు నెలలుగా నిలిచిపోయిందని, మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోకపోవటంతో ప్రజావాణిలో పెన్షన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన డీఆర్వో సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. -పాశం వెంకటరెడ్డి, కూసుమంచి మండలం -
సీఎం జోక్యంతో తగ్గిన బొజ్జల..!
పైచేయి సాధించిన ముద్దుకృష్ణమ * డీఆర్వోగా విజయ్‌చందర్ ? * ఎన్నికల కమిషన్ వద్దకు ఫైల్ * 18న ప్రత్యేక జీవో ద్వారా డీఆర్వోగా బాధ్యతలు..? తిరుపతితుడా: జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో ) పోస్టింగ్ వ్యవహారం సీఎం చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు అభ్యర్థన మేరకు డీఆర్వోగా జిల్లాకు చెందిన అధికారి విజయ్‌చందర్ పేరు ఖరారు చేశారు. అనంతరం సీఎం సింగపూర్ పర్యటనకు వెళ్లిన తరువాత మంత్రి బొజ్జల చక్రం తిప్పారు. మంత్రిగా తనకు తెలియకుండా డీఆర్వోగా విజయ్‌చందర్ పేరు ఎలా ఖరారు చేస్తారని కన్నెర్ర చేశారు. డెప్యూటీ సీఎం, రెవె న్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి అండతో మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మరో అధికారి పేరు తెరపైకి తెచ్చా రు. ఎం. వెంకటేశ్వరరావును డీఆవ్వోగా నియమించాలని రెవెన్యూ మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిపాదనలు సిద ్ధం చేయించారు. ఈ వ్యవహారం మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మధ్య విభేదాలకు ఆజ్యం పోశాయి. విజయ్‌చందర్ జిల్లా వాసి కావడంతో టీడీపీ నేతలంగా మొగ్గుచూపారు. మంత్రి బొజ్జల, మాజీ మంత్రి ముద్దుకృష్ణమ పట్టుదలకు పోవడంతో ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. జరిగిన పరిణామాలు తెలుసుకున్న సీఎం ఒకింత సీరియస్‌గా తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తె లిసింది .దీనిపై బొజ్జలను మందలించినట్లు కూడా సమాచారం. డీఆర్వోగా విజయ్‌చందర్ నే నియమించాలని చెప్పడంతో మంత్రి బొజ్జల వెనక్కు తగ్గినట్టు తెలిసింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో విజయచందర్ పోస్టింగ్ వ్యవహారానికి సబంధించిన ఫైల్ కమిషన్ వద్దకు చేరినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాగానే రెండు,మూడు రోజుల్లో డీఆర్వో నియామకం ఖరారయ్యే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. -
లచ్చన్న ఆశయాలు కొనసాగించాలి
ఒంగోలు టౌన్ : క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీకి మారుపేరుగా నిలిచే సర్ధార్ గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్ ఉద్బోధించారు. గౌతు లచ్చన్న 105వ జయంతి వేడుకలను గౌడ కార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక శ్రీనివాస కాలనీలో నిర్వహించారు. లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని గౌతు లచ్చన్న ముఖ్యనేతల మన్ననలను పొందారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం అనంతరం రైతు కూలీలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి, కల్లుగీత కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారని కొనియాడారు. సర్ధార్ అనే బిరుదు ఉత్తర భారతదేశంలో వల్లభాయి పటేల్, దక్షిణ భారతదేశంలో గౌతు లచ్చన్నకు మాత్రమే ఉందన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. టీడీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు యానం చినయోగయ్య యాదవ్ మాట్లాడుతూ లచ్చన్న తాను ఎన్నికైన శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి మధ్యలోనే రాజీనామా చేసి ఆ స్థానంలో తన గురువు ఎన్జీ రంగాను గెలిపించి గురుదక్షిణ తీర్చుకున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కానుగుల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు ఎస్కే మౌలాలి, ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ శ్రీను, పద్మశాలి చేనేత ప్రజాసమితి జిల్లా అధ్యక్షుడు మొగిలి ఆనందరావు, జంగమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధుల చుట్టూ కొందరు ఉద్యోగులు ప్రదక్షిణలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎన్నికల క్రతువు ముగిసి కొత్త పాలకులు కొలువుదీరిన నేపథ్యంలో వారి వద్దకు పైరవీల జాతర మొదలైంది. వారికి ప్రభుత్వ ఉద్యోగిని వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా నియమించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో తాజాగా ప్రజాప్రతినిధుల చుట్టూ కొందరు ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందులో అగ్రభాగంలో ప్రభుత్వ టీచర్లుండడం విశేషం. వాస్తవానికి విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సహాయకులుగా నియమించుకునే అవకాశం లేదు. కానీ జిల్లాలో మాత్రం ఇప్పటికే ముగ్గురు టీచర్లను వ్యక్తిగత సహాయకులుగా నియమించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వారిని ప్రస్తుత విధులనుంచి రిలీవ్ చేయాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారికి సూచనలు పంపడం గమనార్హం. ఆర్టీఈ ప్రకారం.... విద్యాహక్కు చట్టం 2010 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను బోధనేతర విధుల బాధ్యతలు అప్పగించొద్దు. ఎన్నికలు, జనగణనలాంటి కీలక విధులు మినహా మిగతా పనులకు ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకునే వీలు లేదు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఈ అంశాలను గుర్తు చేస్తూ ఇటీవల రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా విద్యాశాఖ అధికారులకు ప్రత్యేకంగా సర్కులర్లను పంపింది. ఇంత స్పష్టంగా విషయాన్ని వివరించినప్పటికీ.. జిల్లా యంత్రాంగం ఈ అంశాన్ని గాలికొదిలేసినట్లుంది. ఎప్పటిలాగే ముగ్గురు టీచర్లకు పీఏలుగా నియమించేందుకు చర్యలు తీసుకుంది. వారిని విధులనుంచి రిలీవ్ చేయాలంటూ జిల్లా రెవెన్యూ అధికారి, డీఈఓకు ఆదేశించారు. ఇందులో ఒక టీచరు రాష్ట్ర మంత్రికి పీఏగా, మరో టీచర్‌ను అధికారపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడికి పీఏగా, మరో టీచర్‌ను ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పీఏగా నియమితులైనట్లు సమాచారం. మొత్తమ్మీద ఆర్టీఈ నిబంధనలకు పాతరేస్తూ ఉపాధ్యాయులను పీఏలుగా నియమించినప్పటికీ.. వారికి జిల్లా విద్యాధికారి రిలీవ్ చేస్తారా.. లేదా అనేది వేచిచూడాల్సిందే. -
సమైక్య హోరు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టరాదనే డిమాండ్‌తో జిల్లా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె కారణంతో రెండో రోజు శుక్రవారం కూడా పాలన స్తంభించింది. జిల్లా పాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్లో కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి మినహా అధికారులు, సిబ్బంది మొత్తం సమ్మెలో పాల్పంచుకున్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలతో పాటు జిల్లా పంచాయతీ అధికారి, మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయాలకు ఏకంగా తాళాలుపడ్డాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రామక్రిష్ణారెడ్డి, జిల్లా నాయకులు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి, శ్రీరాములు, పి.రామక్రిష్ణారెడ్డి, లక్ష్మన్న, సుధాకర్‌రెడ్డి, బలరామిరెడ్డి, రఘుబాబు తదితరులు సమ్మెను పర్యవేక్షించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశాన్ని అడ్డుకున్నారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు గ్రూపులుగా విడిపోయి ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసివేయించారు. ఆ తర్వాత ఉద్యోగులంతా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆత్మకూరు, నందికొట్కూరుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. తాలుకా ఎన్జీఓ నేతల నేతృత్వంలో ఉద్యోగులు బిల్లుకు వ్యతిరేకంగా నినదించారు. వివిధ శాఖల ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు ఇంకా సమ్మెలో పాల్గొనాలని పిలుపునివ్వకపోయినా విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటున్నారు. అయితే గతంలో 66 రోజుల సమ్మెతో పోలిస్తే ఇప్పుడు ఉత్సాహం, పట్టుదల లోపించినట్లు కనిపిస్తోంది. కలెక్టరేట్ మినహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సమ్మె ప్రభావం అంతగా కనిపించకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ విషయమై జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి స్పందిస్తూ అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతుండటంతో రాష్ట్ర నాయకత్వం హడావుడిగా సమ్మె నిర్ణయం తీసుకోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. సోమవారం నుంచి సమ్మె తీవ్రం అవుతుందని తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డుకోకపోతే కేంద్ర మంత్రులు, ఎంపీలకు రాజకీయంగా మనుగడ ఉండదని హెచ్చరించారు. రాబోయే వారం రోజులు ఎంతో కీలకమని, విభజనను అడ్డుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.