ఒంగోలు టౌన్: జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్ నిఘా నీడలో ఉంది. గతంలో ఎన్నడూ లేనట్లు మూడు సీసీ కెమెరాలను శనివారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ వి.వినయ్‌చంద్, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి చాంబర్ ముందు, కలెక్టరేట్‌లోని ఈ–సెక్షన్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డీఆర్‌ఓ చాంబర్ ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా అక్కడ నుంచి జాయింట్ కలెక్టర్ సీసీ రూమ్ వరకు అక్కడ రాకపోకలు సాగించేవారి వివరాలు తెలుస్తూనే ఉంటాయి.
కలెక్టర్ చాంబర్ ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా ఆయన తన చాంబర్‌లో ఉంటే ఆయనను కలిసేందుకు ఎవరు వస్తున్నారు, ఎంతమంది ఆయన అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారనేది తెలుస్తుంది. అదేవిధంగా కలెక్టరేట్‌లోని ఈ–సెక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా ఆ సెక్షన్లకు సంబంధించిన కారిడార్ మొత్తం రికార్డు అవుతూ ఉంటుంది. ఈ మూడు సీసీ కెమెరాలకు సంబంధించిన మానిటరింగ్‌ను జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్‌లో ఏర్పాటు చేశారు. డీఆర్‌ఓ తన చాంబర్‌లో కూర్చొని రోజువారీ తన విధులను నిర్వర్తించడంతోపాటు కలెక్టరేట్‌కు సంబంధించిన పర్యవేక్షణను సీసీ కెమెరాల మానిటరింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు.
‘డబుల్’ రిజల్ట్:
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా డబుల్ రిజల్ట్ రానుంది. ఇప్పటికే కలెక్టరేట్‌లో సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బందికి సంబంధించి బయోమెట్రిక్ ద్వారా హాజరు విధానాన్ని గమనిస్తున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వారి పనితీరును కూడా గమనించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకల్లా బయోమెట్రిక్ ద్వారా హాజరు వేసిన సూపరింటెండెంట్లు, సిబ్బంది పనివేళల్లో మధ్యలో తమ కుర్చీల్లో లేకుండా కలెక్టరేట్ కారిడార్‌లో తిరుగుతుంటే ఆ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డు కానున్నాయి. కార్యాలయ పనివేళల్లో అటూ ఇటూ తిరుగుతూ టైంపాస్ చేయకుండా కట్టడి చేసేందుకు సీసీ కెమెరాలు దోహదపడనున్నాయి.
ఇదిలా ఉంటే సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలెక్టరేట్‌కు వచ్చే సందర్శకుల వివరాలు కూడా ఎప్పటికప్పుడు కలెక్టరేట్ పరిపాలనా యంత్రాంగం తెలుసుకునే వీలు కలగనుంది. కలెక్టరేట్‌లోని ఉన్నతాధికారుల చాంబర్లకు ఎవరు ఎక్కువగా వస్తున్నారనే వివరాలను కూడా రికార్డు కానున్నాయి. కలెక్టరేట్‌లోని ఏ నుంచి హెచ్ వరకు ఉన్న సెక్షన్లల్లోకి ఇతరులు ఎవరూ వెళ్లకుండా ఉండేలా నిబంధనలను కఠినతరం చేశారు. సెక్షన్లలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకుగాను ఎంట్రన్స్‌లో ప్రత్యేకించి ఒక అటెండర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
నిఘా నీడలో కలెక్టరేట్
Published Sun, Jun 4 2017 1:50 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement