ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి
Published Tue, Nov 22 2016 3:58 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
ఖమ్మం సహకారనగర్: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ అన్నా రు. ప్రజావాణిలో భాగంగా సోమవారం జిల్లా పరిషత్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజావాణికి హాజరవుతారని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కొణిజర్ల మండలం బస్వాపురం గ్రామానికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు ఇటీవల కాలంలో పిడుగుపడి తన రెండు ఆవులు మృతి చెందాయని, ఆవుల ద్వారా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు న్యా యం చేయాలని విన్నవించారు.
బీసీ హాస్టల్‌లో వాచ్‌మెన్ ఉద్యోగం కోసం సీఎం కార్యాలయంలో సంప్రదించగా అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని సూచించారని కల్లూరుకు చెందిన షేక్ గఫార్ డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. సీఎం కార్యాలయం నుంచి ఇచ్చిన ప్రతులను చూపించారు. డీఆర్వో ఉన్నతాధికారుల ఆదేశానుసారం సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. పలువురు వినతిపత్రాలు సమర్పించగా, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నగేష్ పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని.....
ఇంటి స్థలం కోసం తిరుగుతున్నా
స్వాతంత్య్ర సమరయోధురాలిగా ఉన్న పెండ్యాల శేషారత్నం ఇంటి స్థలం ఇప్పించాలని డీఆర్వోకు విన్నవించారు. గతంలో కలెక్టర్, జేసీలను కలిసి సమస్యను విన్నవించానన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చినట్లు శేషారత్నం తెలిపారు.
-శేషారత్నం, ఖమ్మం
ఇల్లు కోసం వినతి
ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవాలని ప్రజావాణిలో డీఆర్వోకు విన్నవించినట్లు నగరంలోని విజయనగర్ కాలనీకి చెందిన బి.అప్పారావు తెలిపారు. గతంలో కూడా సమస్యను విన్నవించానని, సమస్య పరిషష్కారం కాకపోవటంతో తిరిగి విన్నవించినట్లు వెల్లడించారు. -అప్పారావు, విజయనగర్‌కాలనీ, ఖమ్మం
ఆగిన పెన్షన్ ఇవ్వాలని కోరా
తనకు ఇస్తున్న పెన్షన్ ఆరు నెలలుగా నిలిచిపోయిందని, మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోకపోవటంతో ప్రజావాణిలో పెన్షన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన డీఆర్వో సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. -పాశం వెంకటరెడ్డి, కూసుమంచి మండలం
Advertisement
Advertisement