ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం
సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో 70 శాతానికిపైగా పెండింగ్
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందికి వెళ్లిన దరఖాస్తులు 13,513
పరిష్కరించినవి 3,147 దరఖాస్తులే.. సీఎం జిల్లాలోనూ ఇదే పరిస్థితి
హైదరాబాద్, హనుమకొండ, వరంగల్‌ల పరిధిలో పరిష్కారం సున్నా
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ భారీగా పేరుకుపోతున్న అర్జీలు
కలెక్టర్లు, తహసీల్దార్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు
చాలా పనులు ఉన్నాయంటూ అర్జీలను పక్కన పెడుతున్న రెవెన్యూ సిబ్బంది!
సాక్షి, హైదరాబాద్: ఇబ్బంది ఏదైనా, పరిష్కార వేదిక ఏదైనా.. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు మాత్రం పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. భూసంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యల అర్జీలు పేరుకుపోతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో రెవెన్యూ వర్గాలు పరిష్కరించినవి 30శాతం కూడా దాటలేదు.
ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటివరకు రెవెన్యూ శాఖకు 13,513 దరఖాస్తులు రాగా.. అందులో పరిష్కారమైనవి 3,147 దరఖాస్తులు మాత్రమే. మిగతా 10,366 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు వెళ్లే దరఖాస్తుల్లో ఎక్కువశాతం ధరణి సంబంధిత సమస్యలే ఉంటాయని.. కొన్నిచోట్ల పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
కేవలం విచారణతోనే సరి!
ప్రజావాణి కింద వస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువగా ధరణికి సంబంధించినవే ఉంటున్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ధరణి పోర్టల్‌లో తమకు వచ్చిన లాగిన్‌ల ఆధారంగా సదరు దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపి రిపోర్టు పంపించే అధికారం మాత్రమే తమకు ఉందని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఈ దరఖాస్తులను విచారించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా లేరని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఛిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థ ఇంకా కోలుకోలేదని అంటున్నారు.
మండలంలో ఉన్న ఒకరిద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లే (ఆర్‌ఐలే) ఈ దరఖాస్తులన్నింటినీ విచారించాల్సి వస్తోందని చెప్తున్నారు. విచారణ అనంతరం రిపోర్టులను పంపినా పైస్థాయిలో పరిష్కారం కావడం లేదని.. కొన్ని దరఖాస్తులు పరిష్కారమైనా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ కావడం లేదని వివరిస్తున్నారు. తహసీల్దార్ల స్థాయిలోనే చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. పైస్థాయికి పంపిన వాటిని కలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అక్కడా ఆగిపోతున్నాయని అంటున్నారు.
నాలుగు జిల్లాల్లోనే కాస్త మెరుగు..
‘సీఎం ప్రజావాణి’ దరఖాస్తుల గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో మాత్రమే పరిష్కార కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. జగిత్యాల, కరీంనగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 80శాతానికిపైగా దరఖాస్తులను పరిష్కరించారు. ఆరు జిల్లాలు వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, భువనగిరి జిల్లాల్లో అయితే 100శాతం దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
అంటే ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆ జిల్లాల్లో ఒక్క రెవెన్యూ అర్జీ కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. మిగతా జిల్లాల్లో మొక్కుబడిగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార కార్యక్రమం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కూడా దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉండటం రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తతకు అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
వారానికి వెయ్యి దాకా దరఖాస్తులు
రాష్ట్రస్థాయిలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వెయ్యి వరకు దరఖాస్తులు వస్తున్నాయి. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. గత శుక్రవారం 494 దరఖాస్తులురాగా.. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 125, హౌసింగ్ 43, పౌరసరఫరాల శాఖ 71, హోంశాఖ 45, పంచాయతీరాజ్ శాఖ 47, ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment