
మధ్యాహ్నం 12 గంటలకు విడుదల
త్వరగా ఫలితాలు అందించేందుకు ‘సాక్షి’ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. రెండు సంవత్సరాలకు కలిపి 9 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 60 లక్షల సమాధాన పత్రాలకు 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ ప్రక్రియ పూర్తయింది.
తర్వాత మార్కుల ఆన్‌లైన్ ఫీడింగ్, ట్రయల్ రన్ కూడా వారం రోజుల క్రితమే నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి సమయం కోసం అధికారులు ఇంత కాలంగా నిరీక్షిస్తున్నారు. కాగా, ఫలితాల రోజే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ తేదీని కూడా ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
‘సాక్షి’లో వేగంగా ఫలితాలు..
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను వేగంగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు ఫలితాల కోసం www. sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వొచ్చు.