Intermediate results
-
నేడు ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్షలను గత మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి అయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రకటించే మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను www.sakshi education.comలో చూడొచ్చు. -
TS Inter Results 2023 Live: నేడే ఇంటర్ తెలంగాణ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదలల చేస్తారు. అనంతరం https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. మంత్రి అనుమతితో.. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరిగాయి. మొత్తంగా 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతేడాది ఫలితాలు జూన్‌లో విడుదల కాగా.. ఈ ఏడాది ఒక నెల ముందుగానే విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఈ ఫలితాల క్రోడీకరణ ప్రక్రియ, ట్రయల్స్‌ను పూర్తిచేసిన అధికారులు.. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నివేదిక సమర్పించారు. దానిని పరిశీలించిన మంత్రి మంగళవారం ఫలితాలను విడుదల చేసేందుకు అనుమతినిచ్చారు. ‘సాక్షి’లో ఇంటర్ ఫలితాలు ఇంటర్ ఫలితాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ఏర్పాట్లు చేసింది. www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను పొందవచ్చు. చదవండి: మహిళలకు శుభవార్త.. రూ.80కే టీ-24 టికెట్! సిటిబస్సులో 24 గంటల పాటు.. -
ఇంటర్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రతిభ
హన్మకొండ చౌరస్తా: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు మెరు గైన ప్రతిభ కనబర్చారు. హనుమకొండ కాకాజీ కాలనీలోని కళాశాల ఆవరణలో ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవ త్సరంలో ఎంపీసీ విభాగంలో 36 మంది విద్యార్థులు 467 మార్కులు సాధించారని, బైపీసీలో 9 మంది 437 మార్కులతో ప్రతిభ కనబరిచారని తెలిపారు. సీఈసీలో ఒకరు 491 మార్కులు, ఎంఈసీలో ఇద్దరు 492 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో బైపీసీలో ఒకరు 992, ఇద్దరు 990, ఎంపీసీలో ఆరుగురు విద్యా ర్థులు 991 మార్కులు సాధించారని చెప్పారు. ఎంఈసీలో ఒకరు 983 మార్కులు, సీఈసీలో ఒకరు 979 మార్కులు సాధించారని తెలిపారు. -
ఇంటర్లో ఫస్ట్‌క్లాస్ సాధించిన అవిభక్త కవలలు వీణ-వాణి
హైదరాబాద్: విధి పరీక్షను చిరునవ్వుతో ఎదుర్కొంటూనే విద్యాభ్యాసం కొనసాగిస్తున్న అవిభక్త కవలలు వీణావాణీలు చదువులో మరో మెట్టెక్కారు. తాజాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఫస్ట్‌క్లాస్ మార్కులతో (బీ–గ్రేడ్)లో ఉత్తీర్ణులయ్యారు. వీరు మెహిదీపట్నం ఆసిఫ్‌నగర్‌లోని ప్రియాంక మహిళా జూనియర్ కాలేజీలో ఇంటర్ సీఈసీ సబ్జెక్టు చదివారు. వార్షిక పరీక్షలు మాత్రం ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా స్టేట్‌హోంలోని ఆశ్రమంలోనే స్పెషల్ అధికారుల మధ్య నిర్వహించింది. మారగాని వీణ 707 మార్కులు సాధించగా, మారగాని వాణి 712 మార్కులతో బీ–గ్రేడ్‌లో పాసయ్యారు. పరీక్ష రాసేందుకు వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం స్క్రైబర్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ వారిద్వారా పరీక్ష రాసేందుకు వీణావాణీలు తిరస్కరించారు. విడదీయలేనంతగా తలలు అతుక్కుని జన్మించిన వీణావాణీల స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వీరిశెట్టి గ్రామం. వీరు తొలుత గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి, ఆ తర్వాత హైదరాబాద్ నిలోఫర్‌లో వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు. ఆస్పత్రుల్లో ఉంటూనే ఇద్దరూ తమ చదువును కొనసాగించారు. 2017 జనవరి నుంచి హైదరాబాద్ వెంగళరావునగర్ స్టేట్ హోంలోని బాలసదన్‌లో ఉంటూ విద్యాభ్యాసం సాగిస్తున్నారు. వీరు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల గిరిజన మహిళా, శిశుసంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అభినందించారు. చదవండి: (TS TET 2022: టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక ప్రకటన) -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసి.. మీడియాతో ఫలితాల గురించి మాట్లాడారు. ఫస్టియర్‌లో 2,41,591 మంది పాస్ కాగా, ఫస్టియర్‌లో 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సెకండియర్‌లో 2,58,449 మంది పాస్ కాగా, 61 ఉత్తీర్ణత శాతం రికార్డు అయ్యింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్‌గా నిలిచిందని, రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. -
AP Inter Results 2022: ఇంటర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు జూన్ 22వ తేదీ (బుధవారం) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. కాగా, ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. 10.01 లక్షల మంది విద్యార్థులు.. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే 24వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను ఏపీ ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో పూర్తిచేసింది. ఈ సారి పరీక్షలను.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు. -
కనీస అర్హత మార్కులు లేకపోతే ఎలా?
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్‌లో ఉండాల్సిన కనీస అర్హత మార్కులైన 45 శాతం లేకపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఫెయిలైన, పరీక్షలు రాయని సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులను ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ఇంటర్ ఫస్టియర్‌లో పాస్ అయిన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలో ఇవ్వనున్నారు. దీంతో ఫెయిలైన, పరీక్షలు రాయని వారి విషయంలో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. గతేడాది ప్రథమ సంవత్సరంలో 1,99,019 మంది ఫెయిలైన లేదా పలు సబ్జెక్టుల పరీక్షలు రాయని వారున్నారు. వారిలో కొంతమంది ఒకట్రెండు సబ్జెక్టులు ఫెయిల్ కాగా, కొంతమంది మూడు నాలుగు ఫెయిలైన వారున్నారు. మరోవైపు పరీక్షలు రాయని వారూ ఉన్నారు. ఇప్పుడు వారందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం చొప్పున మార్కులనే ఇస్తే నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఓపెన్ స్కూల్ ఇంటర్లో.. మరోవైపు ఓపెన్ స్కూల్ సొసైటీ కూడా ఇంటర్మీడియెట్ బోర్డు ఇచ్చే మార్కుల ప్రకారమే తమ పరిధిలోని ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు మార్కులను కేటాయించాలని భావిస్తోంది. వారికీ 35 శాతం మార్కులను కేటాయించే అవకాశం ఉంది. దీంతో 50 వేల మంది విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. కరోనా కారణంగా గతేడాది 40 వేల మంది ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు 35 శాతం మార్కులే ఇవ్వడం వల్ల రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లోని డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, లా వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందలేక పోయారు. 35 శాతం కనీస మార్కులు వేయడం వల్ల పాస్ అయ్యారే తప్ప ఉన్నత కోర్సుల్లో చేరలేకపోయారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశాలకే సమస్య.. అగ్రికల్చర్, లా, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇతర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ఇంటర్లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. ప్రభుత్వ ఆధీనంలోని జాతీయస్థాయి విద్యా సంస్థలు, రాష్ట్రంలో ఎంసెట్‌కు ఆ నిబంధనను తొలగించినా ప్రైవేటు విద్యాసంస్థలు దానిని కొనసాగిస్తున్నాయి. జేఈఈ వంటి పరీక్షలు రాసేందుకు, ఐఐటీల్లో చేరేందుకు 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కరోనా కారణంగా తొలగిస్తున్నట్లు గతేడాది కేంద్రం ప్రకటించింది. ప్రైవేటు విద్యా సంస్థలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు అందుకు ఒప్పుకోవడంలేదు. ఇంటర్ బోర్డు వర్గాలు మాత్రం 45 శాతంలోపే మార్కులు ఉండే విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారని చెబుతున్నాయి. అలాంటి వారి విషయంలో ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చని పేర్కొంటున్నాయి. ప్రాక్టికల్ మార్కులను 100 శాతం ఇస్తున్నందున ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపితే 45 శాతం కంటే తక్కువ మార్కులొచ్చే విద్యార్థులు తక్కువే ఉంటారని చెబుతున్నాయి. ఓపె¯న్ ఇంటర్ ఏడాది కోర్సే కావడంతో వారికి 35 శాతం మార్కులిస్తే నష్టం తప్పేలా లేదు. ప్రతి విద్యార్థికీ న్యాయం జరిగేలా చూడాలి కనీస మార్కుల విధానం విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. కరోనా కారణం గా పరీక్షలు నిర్వహించనందున ప్రతీ విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలి. 45 శాతం కనీస మార్కులను ఇస్తే ఇబ్బందేమీ లేదు. తద్వారా ప్రతి విద్యార్థికీ మేలు జరుగుతుంది. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
అదరగొట్టారు..!
సాక్షి, హైదరాబాద్: వారంతా అభాగ్యులు.. ఆర్థికంగా, సా మాజికంగా ఏ ఆసరా లేని వా రే. కొందరు అనాథలైతే మరికొందరు ఏ చేయూత లేని, తల్లి లేదా తండ్రి లేని వారు.. ఇం కొందరైతే ఇళ్లు గడవక, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో చదు వు మానేసి ఆ తర్వాత మళ్లీ స్కూళ్లలో చేరిన వారు. పైగా అంతా బాలికలే.. ప్రభుత్వం, టీచర్లు, విద్యాశాఖ అధికారుల తోడ్పాటుతో రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయా (కేజీబీవీ)ల్లో చదువుకుంటున్న వా రు ఇంటరీ్మడియట్‌లో తమ సత్తాచాటారు. ఇ బ్బందులు, అసమానతలు తమ ప్రతిభకు అడ్డుకాదని నిరూపించారు. టీచర్ల పోత్సాహంతో మంచి మార్కులతో భేష్ అనిపించుకున్నారు. మట్టిలో మాణిక్యాలుగా.. ఇంటరీ్మడియట్ వొకేషనల్‌లో 1,000 మార్కులకు 977 మార్కులను (98 శాతం) సాధించి మంచిర్యాల జిల్లా తాండూరు కేజీబీవీ విద్యారి్థని సీహెచ్ చంద్రకళ కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. కార్పొరేట్, ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల విద్యార్థులతోనూ పోటీ పడి అత్యధిక మార్కులు సాధించింది. కరీంనగర్ జిల్లా గాంధార కేజీబీవీ విద్యార్థిని ఎం.శిరీష, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ కేజీబీవీ విద్యార్థి ఇఖ్రా షహవర్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేజీబీవీ విద్యారి్థని యు.అనూష 967 మార్కులు సాధించారు. వారే కాదు ఎంపీసీ, బైపీసీల్లోనూ 963 మార్కులతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేజీబీవీ విద్యారి్థని భూక్యా రజిత, 961 మార్కులతో గద్వాల కేజీబీవీ విద్యార్థి అంజలి, 957 మార్కులతో నల్లగొండ జిల్లా మునుగోడు కేజీబీవీ విద్యార్థి పి.అంకిత, సంగారెడ్డి జిల్లా ఆందోల్ కేజీబీవీ విద్యారి్థని ఎం.గంగ, 940 మార్కులతో నాగర్‌కర్నూల్ జిల్లా బాల్మూర్ కేజీబీవీ విద్యారి్థని చాపల శ్రీవాణి భేష్ అనిపించుకున్నారు. మట్టిలో మాణిక్యాలై వెలిగారు. ఇక ఈసారి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 88 కేజీబీవీ స్కూళ్ల నుంచి 4,483 మంది విద్యార్థినిలు హాజరుకాగా 3,531 మంది (78.76 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 170 స్కూళ్ల నుంచి ప్రథమ సంవత్సర పరీక్షలకు 8,580 మంది విద్యార్థులు హాజరు కాగా 6,103 మంది (71.13 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మంత్రి సబిత, చిత్రారామ్‌చంద్రన్అ భినందనలు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర యావరేజ్ ఉత్తీర్ణత 68.86 శాతం కంటే కేజీబీవీలు ఎక్కువ ఉత్తీర్ణత సాధించడం పట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ అభినందనలు తెలియజేశారు. ప్రథమ సంవత్సరంలోనూ రాష్ట్ర యావరేజ్ 60.01 శాతం కాగా కేజీబీవీల్లో ఉత్తీర్ణత 71.13 శాతముందని, అందుకు కృషి చేసిన టీచర్లకు, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఏడింటిలో 100% ఉత్తీర్ణత ద్వితీయ సంవత్సరంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం, జనగామ జిల్లా పాలకుర్తి కేజీబీవీ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దాహేగాం కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ప్రథమ సంవత్సరంలో జనగామ జిల్లా పాలకుర్తి, భద్రాద్రి జిల్లా గుండాల, చర్ల, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ద్వితీయ సంవత్సరంలో 61 కేజీబీవీలు, ప్రథమ సంవత్సరంలో 79 కేజీబీవీలు 90 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతను సాధించాయి. పీవీ శ్రీహరి, కేజీబీవీల అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ -
ఇది ఓ చరిత్రాత్మక రోజు
-
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... అన్ని సవాళ్లను అధిగమించి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ప్రప్రథమంగా ఫలితాలను మనం విడుదల చేశాం. కరోనా సంక్షోభ సమయంలోనూ ఫలితాలను అనుకున్న సమయానికి విడుదల చేయడమనేది ఇది ఓ చరిత్రాత్మకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకంలో విద్యాశాఖలోని అందరూ అధికారుల సమిష్టి కృషితో ఫలితాలను విడుదల చేశాం. లాక్డౌన్ ఉన్నప్పటికీ నెలరోజుల పాటు వాల్యూయేషన్ పూర్తి చేశాం. ఈ ఏడాది విద్యా వ్యవస్థలో పెనుమూర్పులకు శ్రీకారం చుట్టాం. రానున్న రోజుల్లో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అందరికీ ఆదర్శంగా నిలవనుంది.’ అని తెలిపారు. (షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు) ఈసారి కూడా బాలికలదే పైచేయి ఇంటర్ ఫలితాలకు వస్తే... మొదటి సంవత్సరంలో 59శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో 63 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలురు కన్నా బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలువారీగా చూస్తే ఫలితాల్లో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఫలితాలకు సంబంధించి టోల్‌ఫ్రీ నెంబర్‌ను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఫలితాలు https://bie.ap.gov.in, www.sakshieducation.com తదితర వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి. బోర్డు వెబ్సైట్లో హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం 5,07,228 మంది, రెండో సంవత్సరం 4,88,795 మంది, ఒకేషనల్ మొదటి సంవత్సరం 39,139 మంది, రెండో సంవత్సరం 29,993 మంది మొత్తం 10,65,155 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసినందున మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, రెండో సంవత్సరం ఫలితాలు సబ్జెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్లలో ప్రకటించనున్నారు. ఇక ఫలితాల షార్ట్ మార్కుల మెమోలు ఈనెల 15వ తేదీ నుంచి విద్యార్థులకు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాక్డౌన్ సడలింపుల తర్వాత పరీక్ష ఫలితాలు వెల్లడించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. కాగా సర్వర్‌పై లోడ్ అధికం కావడంతో వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే ఫలితాల కోసం ఒకేసారి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడంతో ఆలస్యం జరుగుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. -
రేపు సాయంత్రం ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. రేపు సాయంత్రం నాలుగు గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సంయుక్తంగా గేట్ వే హోటల్లో ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను హాల్‌టికెట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా బీఐఈ.ఏపీ.జీవోవీ.ఇన్ (https://bie.ap.gov.in/)తో పాటు ఇతర వెబ్సైట్లలో చూసుకోవచ్చు. ఇక మార్కులు మెమోలు 15వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కాగా ఫలితాలను తొలిసారిగా క్లౌడ్ సర్వీస్ ద్వారా విడుదల చేయనున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాల డేటా కావలసిన వెబ్సైట్లు, ఇతరులు తమ సమాచారాన్ని ముందుగా బోర్డుకు అందించాలన్నారు. వెబ్సైట్ల నిర్వాహకులు వెబ్సైట్ పేరు, యూఆర్ఎల్ వివరాలు అందించాలి. ఇతరులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ అందించాలి. ఈ వివరాలను probieap@gmail.comకు పంపించాలి. -
హైకోర్టు ఉత్తర్వులు సర్కార్‌కు చెంపపెట్టు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27లోగా 3.82 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను వెబ్సైట్లో పెట్టాలని, వచ్చే నెల 6న కోర్టుకు హాజరు కావాలని గ్లోబరీనా సంస్థకు నోటీసులిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రజా ఉద్యమానికి బలం చేకూర్చాయన్నారు. -
గ్లోబరీనా సంస్థకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
-
ఇంటర్ ఫలితాలు: మరో విద్యార్థిని బలి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : ఇంటర్ ఫలితాలు రాష్ట్రంలోని పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫలితాల కారణంగా 20కిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో మరో విద్యార్థిని బలయ్యారు. జిల్లాలోని జూలూరుపాడు మండలం వెంగన్న పాలెం గ్రామానికి చెందిన సాయిల మానస (17) ఇంటర్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయింది. దీంతో 20 రోజుల కిందట ఆమె పురుగులమందు తాగింది. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం మానస ప్రాణాలు విడిచింది. దీంతో మానస కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటర్ ఫలితాల వెల్లడిలో తీవ్ర అవకతవకలు జరిగినట్టు వెలుగుచూడటం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడేవిధంగా ఇంటర్ ఫలితాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇంటర్ బోర్డు తీరుపైన, ఇంటర్ ఫలితాల కాంట్రాక్ట్ దక్కించుకున్న గ్లోబరీనా సంస్థపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. -
కొనసాగుతున్న ‘ఇంటర్’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల తప్పులతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు బోర్డు నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తులను స్వీకరించిన బోర్డు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం అవుతోంది. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అనేక మంది విద్యార్థుల నుంచి డబ్బు లు కట్ అయినా వారి అప్లికేషన్ నంబరు జనరేట్ కాలేదు. కనీసం బోర్డు హెల్ప్‌లైన్ కేంద్రానికి ఫోన్ చేసి తెలుసుకుందామన్నా అదీ పని చేయకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తమ హెల్ప్‌లైన్ కేంద్రానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని బోర్డు వెబ్సైట్లో సూచించింది. కానీ అది పని చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి ఇంటర్ బోర్డుకు వస్తే అక్కడా లోపలికి రానివ్వకపోవడంతో ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇలా అనేక మంది విద్యార్థులకు ఈ సమస్య రావడంతో రీవెరిఫికేషన్ అవుతుందా లేదా అని గందరగోళంలో పడ్డారు. చివరకు హెల్ప్‌డెస్క్ మెయిల్ ఐడీకి ఫిర్యాదు పంపించినా కనీసం దానికి కూడా స్పందన లేదు. పేపర్ వెరిఫికేషన్ కోసం దాదాపు 42 వేల మంది దరఖాస్తు చేసుకుని రుసుం చెల్లించారు. డబ్బులు కట్ అయినా అప్లికేషన్ నంబరు జనరేట్ కాలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పడ్డారు. తమ జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేస్తారా.. లేదా అన్న ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. -
‘ఇంటర్’ వైఫల్యాలపై నేడు రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పిదాలను నిరసిస్తూ బీజేపీ గురువారం (2న) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో 24 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ నేడు తాము చేపట్టబోయే రాష్ట్ర బంద్‌కు ప్రజలు సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పిల్లల భవిష్యత్తు కోసం, ఆందోళనలో ఉన్న విద్యార్థి లోకానికి భరోసా ఇచ్చేందుకు, అమాయక విద్యార్థుల బలిదానమైనా అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పరీక్షల నిర్వహణ, ప్రాసెసింగ్ లోపాలతో పలువురు విద్యార్థులు ఫెయిలయ్యారని అన్నారు. టాప్ ర్యాంక్ వస్తుందని ఆశించిన వారు, ఫస్టియర్‌లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన వారు, మిగతా సబ్జెక్టుల్లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన వారు కూడా ఫెయిలైన వారి జాబితాలో ఉన్నారని వెల్లడించారు. 50 ఏళ్ల ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోని గందరగోళం, ఘోర వైఫల్యం ఈసారి చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు, బాధిత విద్యార్థులకు న్యాయం చేసేందుకు బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిందని, ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదని స్పష్టం చేశారు. నిమ్స్‌లో కొనసాగుతున్న లక్ష్మణ్ దీక్ష.. ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లక్ష్మణ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారంతో మూడో రోజుకు చేరింది. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు సోమవారం ఆయన దీక్షకు కూర్చోగా, పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి నిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. సెలైన్ ఎక్కించేందుకు యత్నించినప్పటికీ ఆయన నిరాకరించి, ఆస్పత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తు న్నారు. మూడు రోజులుగా ఆయన ఎలాంటి ఆహా రం తీసుకోకపోవడం వల్ల నాలుగు కేజీల బరువు తగ్గారు. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండటం, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన లేకపోవడంతో బీజేపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనేక మంది పిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న గ్లోబరీనా సంస్థ కాంట్రాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని.. విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని, బోర్డుకార్యదర్శి అశోక్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ‘బంద్‌కు సహకరించండి’ సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులను నిరసిస్తూ సోమవారం (2న) బీజేపీ తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ప్రజలను కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ బోర్డులో అవకతవకలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఇంత వరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. నిరసనకు దిగిన ప్రతిపక్షా లపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఒప్పందం లేకుండా గ్లోబరీనా సంస్థ కాంట్రాక్టు ఎలా దక్కించుకుందని ప్రశ్నించారు. పాత్రధారులే న్యాయ నిర్ణేతలుగా ఉన్నారని విమర్శించారు. ఈ విషయం లో తాడోపేడో తేల్చుకునేందుకు తమ పార్టీ సిద్ధమవుతోందని చెప్పారు. తాము చేపట్టనున్న బంద్ రాజకీయం కోసం కాదని స్పష్టం చేశారు. -
మే 8లోగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్..!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల అవకతవకలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. విద్యార్థుల రీ వాల్యుయేషన్‌పై ఇంటర్‌బోర్డు తమ నిర్ణయాన్ని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే ఫెయిలైన మూడు లక్షల 20వేలమంది విద్యార్థులకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ జరుపుతామమని బోర్డు హైకోర్టుకు నివేదించింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను మే 8లోగా పూర్తి చేసి.. వివరాలు తమకు సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. బోర్డు ఇచ్చిన వివరాలు చూసిన తర్వాత 8వ తేదీ మధ్యాహ్నం ఫిటిషన్‌పై మరోసారి విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా, చనిపోయిన విద్యార్థులకు 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. -
పోలీసుల కళ్లగప్పి.. ట్యాక్సీలో వెళ్లిన లక్ష్మణ్!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం న్యాయం చేయాలన్న డిమాండ్‌తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాటకీయ పరిణామాల నడుమ నిరాహార దీక్షకు దిగారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి తొలగించాలని, ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై న్యాయ విచారణ జరపాలంటూ ఆయన సోమవారం నుంచి నిరవధిక నిరాహాక దీక్ష చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు ముషీరాబాద్‌లోని లక్ష్మణ్ క్యాంపు కార్యాలయం ముందు మోహరించారు. ఆయన బయటకు రాగానే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి ట్యాక్సీ కారులో చాకచక్యంగా ఆయన బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన వేదిక వద్ద ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఇంటర్ ఫలితాల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావిస్తోంది. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఆ కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలుపకపోగా తూ.తూ.మంత్రంగా చర్యలు తీసుకోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
ఇంటర్ పోరు తీవ్రతరం: ప్రగతి భవన్ ముట్టడి..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారడం లేదు. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సోమవారం తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఇంటర్ బోర్డు వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బోర్డు కార్యాలయాన్ని ముట్టడికి అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ముట్టడిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక, ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. సీఎం నివాసమైన ప్రగతిభవన్ ముందు పెద్దసంఖ్యలో ఏబీవీపీ విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని.. బలవంతంగా అరెస్టు చేసి.. అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. నేతల అరెస్టులు..! ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్‌ను అరెస్టు చేసి కాంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిని అరెస్టు చేసి.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గీతారెడ్డిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డిలను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాంధీ భవన్ నుంచి ఇంటర్ బోర్డ్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్, కార్యదర్శులు కురువ విజయ్‌కుమార్, అల్లం భాస్కర్‌తోపాటు ఎన్ఎస్యూఐ నేతలను నాంపల్లి చౌరస్తా అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్టేషన్‌కు తరలించారు. గృహనిర్బంధాలు.. మేడ్చల్‌లో డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌ను సైతం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ సహా తెదేపా నాయకుడు సాధినేని శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ముందస్తుగా పలువురు నాయకులను పోలీసులు గృహనిర్భందించారు. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యలను గృహనిర్భందం చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజ్‌గిరిలో 9 మంది, నేరేడ్ మెట్లో 10 మంది విపక్ష నేతలను అరెస్టు చేశారు. మేడ్చల్‌లో పాతూరి సుధాకర్ రెడ్డి సహా పలువురి నాయకులు అరెస్టయ్యారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు గృహనిర్భందం చేశారు. హైదరాబాద్ వెళ్లకుండా ఆయన ఇంటి ఎదుట పోలీసులు మోహరించారు. దద్దరిల్లిన ఇంటర్ బోర్డు ఇంటర్ బోర్డు కార్యాలయం నినాదాలు, నిరసనలతో దద్దరిల్లుతోంది. ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల శ్రేణులు ప్రయత్నించాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నాయకులు బోర్డు కార్యాలయం వద్దకు చేరుకొని.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేస్తూ ముట్టడికి దిగిన నిరసనకారులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టులు.. నిర్బంధం.. ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ బోర్డు ముట్టడికి బయలుదేరిన నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుడు అంజన్‌కుమార్ యాదవ్, టీజేఎస్ అధినేత కోదండరామ్‌ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. తమ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తుండటాన్ని ఉత్తమ్, కోదండరామ్, చాడా వెంకట్‌రెడ్డి ఖండించారు. మరోవైపు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా హైదరాబాద్‌లో సీపీఎం ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలతో తెల్లవారుజామున 4 గంటలకే జూలకంటి ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయనను హౌజ్ అరెస్టు చేసి నిర్బంధించారు. అరెస్టులపై పొన్నం మండిపాటు ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అరెస్టులు చేపడుతుండటాన్ని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, అరెస్టులు కాదు విద్యార్థులకు న్యాయం చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హక్కులను కాలరాస్తున్నారని, పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి నిర్బంధించడం అక్రమమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించిన ఏజెన్సీ తప్పిదాలపై ప్రభుత్వం స్పందించిన తీరును నిరసిస్తూ చేపట్టిన తమ పోరాటాన్ని జయప్రదం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. -
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలు, ఇంటర్ ఫలితాల విషయంలో జరిగిన అవకతవకలపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్.. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను ఉచితంగా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేస్తామని ప్రకటించింది. అప్లై చేసుకోవడానికి ఇంటర్నెట్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఫీజు చెల్లించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి నగదును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. మే 15 లోపు కొత్త ఫలితాలు, కొత్త మెమోలు ఇంటికి వస్తాయని పేర్కొంది. -
కొనసాగిన ‘ఇంటర్’ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోర్డు తప్పిదాలపై నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి 6 రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డును ముట్టడించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. బుధవారం కూడా పలు విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టగా దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు పలికారు. జవాబు పత్రాల రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌కు విద్యార్థుల వద్ద ఫీజు వసూలు చేయొద్దని తల్లిదండ్రులు కోరారు. యంత్రాంగం చేసిన తప్పిదానికి తామెందుకు ఫీజు కట్టాలని ప్రశ్నించారు. ఫలితాల్లో తప్పిదాలు సవరించాలని, ఉచితంగా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ జరిపించాలని.. అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు వద్ద రోజురోజుకూ ఆందోళనలు తీవ్రతరమవుతుండడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్యార్థులను సైతం లోనికి అనుమతించడం లేదు. దీంతో ఇంటర్మీడియట్ ఫలితాలు, అడ్వాన్స్ సప్లిమెంటరీ, ఫీజు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ ఇంటర్ బోర్డులో అవకతవకల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆరోపించింది. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే అధికారులు, మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించింది. బుధవారం బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో డీవైఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల చావుకు కారణమైన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను ఆ పదవినుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. సరిగ్గా రాయనివారే ఫెయిల్ అవుతారని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కమిటీ ముందుకొచ్చిన గ్లోబరీనా ఇంటర్ ఫలితాలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిశీలన ప్రక్రియ వేగవంతమైంది. ఫలితాల విడుదలలో బోర్డు తీసుకున్న చర్యలతో పాటు సాంకేతిక వ్యవహారాలు చూసుకునే ప్రైవేటు సంస్థ ప్రమేయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈనెల 22న త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 23న కమిటీ బృందం ఇంటర్‌బోర్డును సందర్శించి ఫలితాల ప్రక్రియలో ఎవరెవరి పాత్ర ఉన్న వారితో చర్చించింది. ప్రస్తుత కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్ (సీఓఈ)తోపాటు అంతకు ముందున్న సీఓఈతో కూడా వేర్వేరుగా సమావేశమైంది. బుధవారం ఇంటర్ బోర్డులో డీపీఆర్పీ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనాతో సమావేశమైంది. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇచ్చిన సమాచారంతో పాటు కాంట్రాక్టు సంస్థ చేసిన కార్యక్రమాలను త్రిసభ్య కమిటీ విశ్లేషించనుంది. -
ఇది గ్లోబరీనా వైఫల్యమే
సాక్షి, హైదరాబాద్: డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్ (డీపీఆర్పీ)లో తీవ్రమైన అవకతవకల కారణంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళంలో గ్లోబరీనా సంస్థదే ప్రధాన పాత్ర. ప్రాజెక్టు అమలు బాధ్యతలు తీసుకున్న మొదటిరోజు నుంచీ ప్రతిపనిలోనూ ఈ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దీని కారణంగానే నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. మొదట్లోనే చేతులెత్తేసినా..! డీపీఆర్పీ ప్రాజెక్టు టెండర్ దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ.. ఇంటర్ విద్యార్థుల అడ్మిషన్లు మొదలు పరీక్షాఫలితాలు ఇచ్చే వరకు నిర్దేíసిత కార్యక్రమాలన్నీ చాలా జాగ్రత్తగా చేపట్టాలి. 2018–19 విద్యాసంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టిన కొత్తలోనే గ్లోబరీనా గందరగోళానికి గురై చేతులెత్తేసింది. మొదట ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి డేటా ప్రాసెస్ చేసింది. వారం రోజుల్లో దాదాపు 70వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడంతో ఆయా విద్యార్థుల వివరాలన్నీ కంప్యూటరీకరించింది. కానీ.. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో ప్రాసెస్ చేసిన విద్యార్థుల డేటా మొత్తం కరప్ట్ అయ్యింది. ఆ తర్వాత మాన్యువల్ పద్ధతిలో కాలేజీల వారీగా వివరాలను ఆన్లైన్ చేయడంతో అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్రజాప్యం నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇంటర్‌బోర్డు హడావిడిగా సీజీజీ (సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్)ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. డేటా ప్రాసెసింగ్‌లో అనుభవమున్న సీజీజీ.. ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసింది. ఈ ప్రక్రియ ఆలస్యమవడంతో 2018–19 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం కారణంగా.. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు చుక్కలు కనిపించాయి. అయితే.. సీజీజీ మొత్తం వివాదాన్ని క్లియర్ చేసిన ఇచ్చిన తర్వాత స్వల్ప మార్పులు, చేర్పులు చేసే పనిమాత్రమే గ్లోబరీనాకు మిగిలింది. అయితే ఈ దశలోనూ ఆ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. మళ్లీ డేటా కరప్షన్ కారణంగా విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులు డేటాలో మారిపోయాయి. దీంతో పరీక్షల సమయంలో.. విద్యార్థులకు ఎంచుకున్న సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులున్న ఓఎంఆర్ షీట్లు జారీ అయ్యాయి. ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు చొరవతీసుకుని.. సమీపంలోని పరీక్షా కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోని ఎగ్జామ్ సెంటర్ల నుంచి ఆయా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు తెచ్చి సర్దుబాటు చేయడంతో విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్ష ఫీజుల స్వీకరణలోనూ ఆగమాగం ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజుల చెల్లింపు విషయంలోనూ భారీగా తప్పిదాలు జరిగాయి. ఫీజు స్వీకరణ తేదీని ప్రకటించిన నాటినుంచే చెల్లింపుల వెబ్సైట్ తెరుచుకోవాలి. కానీ వెబ్సైట్లో సాంకేతిక సమస్యల కారణంగా.. నెలరోజులపాటు ఫీజు చెల్లింపు తేదీని పొడిగించాల్సిన దుస్థితికి గ్లోబరీనా వైఫల్యమే కారణం. క్షేత్రస్థాయిలో విద్యార్థులు కాలేజీలకు ఫీజులు చెల్లించగా.. వాటిని ఆన్లైన్లో జనరేట్ చేసి చలాన్లు చెల్లిస్తారు. ఫీజు ప్రాసెసింగ్‌లో భాగంగా ఈ సమాచారాన్ని ఫీజు చెల్లించిన, చెల్లించని విద్యార్థులను వేరు చేసి చూపేలా సాంకేతిక సహకారాన్ని గ్లోబరీనా అందించాలి. కానీ అందులోనూ దారుణ సాంకేతిక వైఫల్యం తలెత్తింది. ఈ సమస్యలను సరిదిద్దడంలో గ్లోబరీనా లోపాలు సుస్పష్టం కావడంతో పలుమార్లు ఫీజు గడువును పొడిగించాల్సి వచ్చింది. చివరగా ఫలితాల ప్రాసెసింగ్‌లోనూ భారీగా అవకతవకలు జరిగాయి. దీంతో మెరిట్ విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం, కొందరు ఫెయిల్ అవడంతో రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. డీపీఆర్పీ ప్రాజెక్టును చేపట్టిన గ్లోబరీనా అడుగడుగునా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి తప్పిదాలు చేయడమే విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉద్యోగుల ఫిర్యాదు పైనా స్పందన కరువు డీపీఆర్పీ ప్రాజెక్టు అమల్లో.. కాంట్రాక్టు తీసుకున్న సంస్థ వ్యవహారశైలిపై మొదటినుంచీ ఇంటర్‌బోర్డు ఉద్యోగులు అసంతృప్తికరంగానే ఉన్నారు. కాంట్రాక్టు సంస్థకు సరైన అనుభవం లేకపోవడంతో బోర్డు తరపున చేయాల్సిన పనులను ఒకటికి రెండుసార్లు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఉద్యోగులకు చికాకు తెప్పింది. ఈ క్రమంలో కాంట్రాక్టు సంస్థ వ్యవహారశైలి, తప్పిదాలపై బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో భాగంగా చేయాల్సిన పనులు కాంట్రాక్టు సంస్థ సక్రమంగా చేయలేదని ఊహించిన కొందరు ఉద్యోగులు.. గతేడాది డిసెంబర్ చివరి వారంలో లిఖితపూర్వక ఫిర్యాదును ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి సమర్పించారు. ఈ ఫిర్యాదుతో గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో కొంతైనా మార్పు వస్తుందని ఆ ఉద్యోగులు భావించారు. కానీ కాంట్రాక్టు సంస్థకు బోర్డు నుంచి ఎలాంటి సూచన, హెచ్చరిక అందకపోవడంతో.. డీపీఆర్పీ ప్రాజెక్టు మరింత అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగులు సమర్పించిన ఫిర్యాదుతోనైనా స్పందించుంటే.. లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదని బోర్డు సిబ్బందొకరు వాపోయారు. పొరపాట్లు జరిగాయి.. సవరిస్తున్నాం ఇంటర్మీడియట్ ఫలితాల్లో పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. వాటిని సవరించే చర్యలు చేపట్టాం. జన్నారం మండలానికి చెందిన నవ్య జవాబు పత్రం వాల్యుయేషన్ ప్రక్రి యలో ఎగ్జామినర్, సూపర్వైజర్ తప్పిదాలున్నట్లు గుర్తించాం. విద్యార్థినికి వాస్తవ మార్కులు ఇచ్చాం. దీనిపై ఎగ్జామినర్, సూపర్వైజర్ల వివరణ కోరాం. తప్పులు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ ప్రక్రియ పద్ధతి ప్రకారమే జరుగుతుంది. తేదీ పొడిగింపు అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. – అశోక్, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి -
ఆ అధికారులను కఠినంగా శిక్షించాలి..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల వెల్లడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని, ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన నవ్యకు సున్నా మార్కులు ప్రకటించి, మరుసటి రోజే 99 మార్కులు వచ్చాయని పేర్కొనడం ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. బోర్డు తప్పులు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే అవి అపోహలంటూ ప్రభుత్వం పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. విద్యార్థుల జవాబు పత్రాల రీవాల్యువేషన్‌కు తల్లితండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడం బోర్డు దివాళాకోరుతనానికి నిదర్శమని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బోర్డు తప్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వమే రీవాల్యువేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి నిదర్శనం.. శ్రీలంకలో జరిగిన మారణకాండ అత్యంత హృదయ విదారకరమైందని చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి ఈ దాడులు నిదర్శనమని తెలిపారు. ఈ ఉగ్రవాదుల వెనక ఉన్న ఏ దేశాన్ని అయినా ఇతర దేశాలు నిలదీయాలని సీపీఐ అభిప్రాయపడుతోందని వెల్లడించారు. -
అందుకే నవ్యకు 99కు బదులు సున్నా వచ్చింది
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడిలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ అంగీకరించారు. ఇంటర్ బోర్డు పరీక్షా పత్రాలను పారదర్శకంగా, నాణ్యత కూడిన మూల్యాంకనం చేపట్టిందని, దాదాపు అంతా సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు. ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడిలో అవకతవకలు, ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాల నేపథ్యంలో సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల శ్రేణులు ఇంటర్ బోర్డు ముందు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అక్కడక్కడ కొన్ని తప్పిదాలు, పొరపాట్లు జరిగాయని, ముఖ్యంగా ముగ్గురు విద్యార్థుల పరీక్షా పత్రాలకు సంబంధించి మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని చెప్పారు. అందుకే నవ్యకు సున్నా! తెలుగులో సున్నా మార్కులు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన విద్యార్థిని జి. నవ్య అంశంపై అశోక్‌కుమార్ స్పందించారు. ఓఎమ్మార్ షీట్లో మార్కుల విభాగంలో బబ్లింగ్ చేయడంలో ఎగ్జామినర్ చేసిన తప్పిదం వల్లే నవ్యకు సున్నా వచ్చిందని ఆయన తెలిపారు. నవ్యకు 99 మార్కులకు బదులు ఎగ్జామినర్ జీరో బబ్లింగ్ చేశాడని, ఓఎమ్మార్ షీట్లో 9,9 అంకెల కిందనే సున్నా, సున్నా అంకెలు ఉంటాయని, 9-9 అంకెలను బబ్లింగ్ చేయడానికి బదులు పొరపాటున 0,0ను బబ్లింగ్ చేశారని, స్కూటినైజర్ కూడా సరిగ్గా పరిశీలించకుండా సున్నా, సున్నానే బబ్లింగ్ చేయడంతో నవ్యకు అలా మార్కులు వచ్చాయని తెలిపారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో వెంటనే స్పందించి.. వెరీఫై చేసి.. ఆ విద్యార్థినికి న్యాయం చేశామన్నారు. ఈ విధంగా మూల్యాంకనంలో తప్పులు, పొరపాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో పొరపాటు చేసిన వారిని ఇప్పటికే వివరణ అడిగామని, వారికి చార్జ్‌మెమో కూడా ఇస్తామని స్పష్టం చేశారు. 99కి బదులు సున్నా మార్కులు వేయడం చాలా పెద్ద తప్పిదమని, దీనిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నవ్య ఓఎమ్మార్ షీట్ మీడియాకు చూపించారు. ఆ వదంతులు అవాస్తవం.. ఇంటర్ పరీక్షా పత్రాలు గల్లంతైనట్టు వస్తున్న వదంతులు, ఆరోపణలు అవాస్తవమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌బోర్డుకు 12 క్యాంప్ ఆఫీసులు ఉన్నాయని, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ కార్యాలయాల్లోనే పరీక్షా పత్రాల మూల్యంకనం చేపడతామని తెలిపారు. పరీక్షా పత్రాలన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నాయని, ఏ ఒక్క పరీక్షా పత్రం మిస్ కాలేదని చెప్పారు. ఆబ్సెంట్ అయిన విద్యార్థిని కూడా పాస్ చేశారని వచ్చిన వాదనలు అపోహ మాత్రమేనని, కొందరు విద్యార్థులకు పరీక్షా కేంద్రాల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో రెండు సెంటర్లు కేటాయించామని, అందులో వారు ఒక సెంటర్లో ఆబ్సెంట్ అయి.. మరో సెంటర్లో పరీక్ష రాశారని, అందువల్ల వారికి ఏ-పీ (ఆబ్సెంట్-పాస్) అనే కోడ్ వచ్చిందని, రెండు సెంటర్లు వచ్చినవారిలో కొందరు ఫెయిల్ కావడంతో ఏ-ఎఫ్ వచ్చిందని వివరణ ఇచ్చారు. పూర్తిగా ఆబ్సెంట్ అయిన వాళ్లను పాస్ చేయడం కానీ, పాస్ అయిన వాళ్లను ఫెయిల్ చేయడం కానీ జరగలేదని తెలిపారు. 15 ఏళ్లుగా మన్టెక్ ఇన్ఫో సంస్థ సాంకేతిక సేవలు అందిస్తోందని, 15 ఏళ్లుగా ఒకే సంస్థ ఇస్తుండటంతో మార్చాలని టెండర్లు పిలువగా.. గ్లోబరెనా సంస్థ నుంచి టెండర్ వచ్చిందని, నిబంధనలకు అనుగుణంగానే ఆ సంస్థకు టెండర్ కేటాయించామని, ఆ సంస్థ మూడేళ్లు మాత్రమే ఇంటర్ బోర్డుకు సేవలు అందిస్తుందని, ఆ తర్వాత పూర్తిగా ఇంటర్ బోర్డే ఔట్ సోర్సింగ్ లేకుండా సొంతంగా సాంకేతిక సేవలను సమకూర్చుకుంటుందని అశోక్‌కుమార్ వివరించారు. రీ వాల్యుయేషన్ గడువును పెంచే అంశాన్ని పరిశీలిస్తామని, రీవాల్యుయేషన్లో మారిన మార్కులను విద్యార్థుల ఈమెయిల్‌కు పంపుతామని తెలిపారు. అశోక్‌కుమార్‌ను నిలదీసిన నిరసనకారులు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా అశోక్‌కుమార్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు నిలదీశారు. ఇంటర్ బోర్డు తప్పిదాలకు విద్యార్థులకు ఎందుకు బలి కావాలని, 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వచ్చిన విద్యార్థిని.. కలత చెంది.. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యంకనంలో టెక్నికల్ తప్పిదాలు దొర్లాయని సాక్షాత్తూ విద్యామంత్రి జగదీశ్‌రెడ్డే చెప్తున్నారని, అలాంటప్పుడు మీ తప్పిదాలకు విద్యార్థులు నష్టపోవాలా? అని నిలదీశారు. ఒకవైపు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంత పెద్ద పొరపాట్లు, తప్పిదాలా? అని ప్రశ్నించారు. నిరసనకారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో అశోక్‌కుమార్ తడబడ్డారు. చదవండి : నవ్యకు తెలుగులో 99 మార్కులు -
మంత్రి మాట్లాడరు.. ముఖ్యమంత్రి కనబడరు
న్యూఢిల్లీ : ఇంటర్ బోర్డ్‌లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఇంటర్ బోర్డ్ తప్పిదం వల్ల 25 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకొని, వేలాది మంది రొడ్డెకినా కనీసం భరోసం కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం బాధకరమన్నారు. ఒక కమిటీ వేసి నిమ్మకు నిరెత్తనట్లుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అనుభవం లేని గ్లోబరెనా అనే సంస్థ మూలంగా వేలాదిమంది విద్యార్థుల జీవితాలు అందకారంలోకి నెట్టబడ్డాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్లోబరెనా సంస్థకు మూల్యాంకనం బాధ్యతలు ఇచ్చిన విధానంపై న్యాయవిచారణ జరిపించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అశోక్ అనే అధికారిని బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సాధికారికత లేని కమిటీ వేసి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లా విద్యాశాఖమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంబర్‌బోర్డ్ అవకతవకలపై మంత్రి మాట్లాడరని, ముఖ్యమంత్రి కనబరని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజల గోడు వినేవాడు ఎవరులేరని, విద్య, వైద్యం వంటి కీలక శాఖలపై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేదని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాలకులకు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు.