
వీలైతే మళ్లీ రాద్దాం డూడ్...
-పోయేదేముంది కాస్త సమయం తప్ప
-నేటి అపజయమే రేపటి విజయానికి నాంది
-ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే ఓ ఐన్ స్టీన్, రామానుజన్ లు దక్కేవారా
పోటీ మంచిదే.. ఈ పోటీలో సహ విద్యార్థులందరూ ముందుకు వెళ్లి పోతున్నారు..వెనుకబడి పోయానన్న కలత ఉండాల్సిందే. కానీ మానసికంగా కుంగి పోకూడదు. లోపాలను సరిదిద్దుకుని ముందడుగు వేస్తే బలమైన మలి అడుగు మీదే కావచ్చు. మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది విద్యార్థుల జీవితాల్లో విషాదం నింపాయి. ఫస్ట్ ఇయర్ లో అపశ్రుతి.. సెకండ్ ఇయర్ లో సరిదిద్దు అవకాశం ఉన్నా చిన్నారులు తమ జీవితాల్ని చిదిమేసుకునే ప్రయత్నం చేశారు. ' అపజయానికి మరణం పరిష్కారం కాదు. క్షణం ఆలోచిస్తే మరుక్షణం మీదే .. చరిత్ర సృష్టించిన వారంతా ఏదో సమయంలో ఓటమి చవిచూసిన వారే. ఒకసారి ఓడిగెలిచిన వారిని చూడండి. వారి చరిత్రలు చదవండి. ఈ ప్రపంచంలో చెడి బతికినవాళ్లు ఉన్నారు కానీ, బతికి చెడ్డవారు లేరు! పరీక్షలో ఫెయిలైతే ఆత్మహత్యలే శరణ్యమా? అమ్మానాన్నల ఆశలకు అంతటితో సమాధి కట్టేయడమేనా? కిందపడిన ప్రతిసారీ పైకి లేవాలి.. నిలవాలి.. గెలవాలి. ఫెయిలైతే కుంగిపోకుండా.. ఆత్మహత్య ఆలోచనే రానివ్వకుండా జీవితంలో పెకైదిగిన వారు ఎందరో ఉన్నారు. పరీక్షలో ఫెయిలైన వారే.. సమాజానికి దిశానిర్దేశం చేశారు. వారెవరో మీరే చదవండి..
5 సబ్జెక్టుల్లో రామానుజన్ పూర్..
భారతీయ విద్యావంతులందరికీ సుపరిచితమైన పేరు శ్రీనివాస రామానుజన్. చీరల కొట్లో గుమస్తాగా పనిచేసే శ్రీనివాసన్ అయ్యంగార్ కుమారుడు రామానుజన్. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని చెప్పట్ ప్రాంతంలో జన్మించాడు. గణితం అంటే అమితాసక్తి, అరుుతే మిగిలిన సబ్జక్టులపై అంత ఆసక్తి కనబరిచేవారు కాదు. ఈ కారణంగానే కుంభకోణంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో, పచ్చాయియ్యర్ కాలేజీలో చదువుతున్న సమయంలో గణితం తప్ప మిగిలిన సబ్జక్టుల్లో రాణించలేకపోయారు. అనంతరం కొంతమంది పిల్లలకు గణితం నేర్పుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే గణితంపై రామానుజన్ చేసిన ప్రయోగాలు.. ఇంగ్లండ్ రాయల్ సొసైటీ నుంచి ఆహ్వానం అందేలా చేశారుు. రామానుజన్ 32 ఏళ్ల వయసులోనే మరణించారు. భారతావని రామానుజన్ సేవలను తలచుకుంటూ ఆయన జన్మదినమైన డిసెంబర్ 22వ తేదీని ఇండియన్ మేథమెటీషియన్ డేగా జరుపుకొంటోంది.
కెమెరా ముందు చాప్లిన్ ఫెయిల్!
చార్లీ చాప్లిన్. ఈ పేరు గుర్తుకురాగానే మనసంతా ఉల్లాసంగా మారుతుంది. ఆయన కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు.. ప్రపంచ హాస్య ప్రియులందరికీ చిరపరిచితం. 10వ ఏటనే తండ్రి, తర్వాత కొద్దికాలానికే తల్లి మరణించడంతో లండన్‌లో ఆయన వేషాల కోసం ఎంతగానో యత్నించారు. ఒకానొక దశలో ఆయనను హాలీవుడ్ కెమేరా ముందు పనికిరావంటూ నిష్కర్షగా ప్రకటించింది. అయితే అంతటితో కుంగిపోకుండా పట్టుదలతో రాణించారు. ప్రపంచాన్నే నవ్వుల్లో ముంచెత్తారు. హాస్యరారాజుగా వెలుగొందిన చార్లీ చాప్లిన్ అసలు పేరు చార్లీ స్పెన్సర్ చార్లిన్. ఈయన లండన్ వాసి.
పాలిటెక్నిక్ తప్పిన ఐన్‌స్టీన్
ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు ఐన్‌స్టీన్. 1879 మార్చి 14న జర్మనీలో జన్మించిన ఐన్‌స్టీన్ చిన్నతనంలో చదువు కొనసాగించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నాలుగు పలకలేడు.. ఏడు చదవలేడు అనే భావన అటు ఉపాధ్యాయుల్లోనూ, ఇటు తల్లిదండ్రుల్లోనూ ఉండేది. అందుకే అతనిని మానసిక వికలాంగుడుగా భావించేవారు. 16 ఏళ్ల వయసులో స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్(జ్యూరిచ్) పరీక్షలో ఐన్‌స్టీన్ ఫెయిలయ్యాడు. కేవలం గణితం, ఫిజిక్స్‌లో పాసయ్యాడు. కానీ ఆ తర్వాత ఎలాగోలా శ్రమించి మిగిలిన సబ్జెక్టులో పాసయ్యాడు. 1921లో అంతర్జాతీయ నోబెల్ బహుమతి అందుకున్నాడు. పరీక్షలో ఫెయిలయ్యానని ఐన్‌స్టీన్ ఆత్మహత్య చేసుకుని ఉంటే.. ప్రపంచం ఎలా ఉండేదో ఓసారి ఊహించుకోండి.
కర్సన్‌భాయ్.. ఎదుట కష్టం ఓడింది
గుజరాత్‌లో మైన్స్ అండ్ జియాలజీ విభాగంలో కెమిస్ట్‌గా పనిచేసేవారు కర్సన్‌భాయ్ పటేల్. అప్పట్లో అతి తక్కువ జీతం. ఆ జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా భావించాడు. సొంతంగా ఇంట్లోనే వాషింగ్ పౌడర్ తయారీ ప్రారంభించాడు. సైకిల్‌పై రోజుకు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 15 నుంచి 20 ప్యాకెట్లు అమ్మేవాడు. అప్పట్లో బ్రాండెడ్ సర్ఫ్ ధర కిలో రూ.13 నుంచి రూ.15 ఉండేది. ఈ క్రమంలో కర్సన్‌భాయ్ పటేల్ మాత్రం కిలో సర్ఫ్ ధర రూ.3.50కు విక్రయించేవాడు. అదే నిర్మ వాషింగ్ పౌడర్. అనూహ్యంగా మార్కెట్‌లో మంచి పేరు లభించడంతో కర్సన్‌భాయ్ పటేల్ జీవితమే మారిపోయింది. ఇప్పుడు ఆయన సంస్థలో 18 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏడాదికి రూ.3,500 కోట్లకు పైగా వ్యాపారం సాగుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు.
చర్చిల్ ఆరులో ఫెయిల్.. అరవైల్లో ప్రధాని
విన్‌స్టన్ చర్చిల్.. ఇంగ్లండ్‌లో విద్యాభ్యాసం చేసే రోజుల్లో 6వ గ్రేడ్‌లోనే అపజయాన్ని మూటగట్టుకున్నాడు. పెద్దయ్యూక రాజకీయాల్లో చక్ర ం తిప్పాలని చూసి అనేకసార్లు నాలుక్కరుచుకున్నాడు. అయ్యో.. ఓడిపోయూనే అని చర్చిల్ ఏనాడూ కుంగిపోలేదు. చిరు ప్రాయంలోనే చర్చిల్ మొదలుపెట్టిన ప్రయత్నాలు 62 ఏళ్లు వచ్చాక ఫలించారుు. యునెటైడ్ కింగ్‌డమ్‌కు ప్రధాన మంత్రిని చేశాయి. అంతే కాదు వరుసగా రెండు సార్లు ఆయనే ప్రధానిగా ఎన్నికయ్యారు. నోబెల్ బహుమతి కూడా కైవసం చేసుకున్నాడు.
పరీక్షలో ఫెయిలైతే జీవితం ముగిసిందనుకోకూడదు
కష్టాన్ని తట్టుకునే మానసిక శక్తిని పిల్లల్లో పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఒక కష్టం రాగానే పిల్లలు మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రాన జీవితం ముగిసిపోదనే విషయూన్ని విద్యార్థులకు సాధారణ సమయాల్లో ఉద్బోధించాలి. తల్లిదండ్రులే స్నేహితుల్లా కలివిడిగా మెలగాలి. కష్టాలొచ్చినప్పుడు వాటిని ఏ విధంగా అధిగమించాలో విపులీకరించాలి. క్షణికావేశానికిలోనై తొందరపాటు చర్యలు తీసుకుంటే జీవితానికి అర్థం ఉండదని వివరించాలి. పదో తరగతిలోనో, ఇంటర్మీడియెట్‌లోనో ఫెయిలైనంత మాత్రాన భవిష్యత్తు పూర్తయిందనుకోవటం మంచి నిర్ణయం కాదని పిల్లలకు తెలియజెప్పాలి.
కష్టం వచ్చినప్పుడు ఆత్మీయులకు, స్నేహితులకు చెప్పుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. మనసులో భారం కొంత తగ్గుతుంది. దాంతో తర్వాత తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై చదువు విషయంలో ఒత్తిడి తీసుకు రాకూడదు. తల్లిదండ్రులు శక్తికి మించి చదువు విషయంలో ఖర్చు చేస్తున్నారు. అదే తరహాలో వారి నుంచి ఫలితాలు ఆశిస్తున్నారు. అది సరికాదు. తల్లిదండ్రులు తాము సాధించలేనిది పిల్లల ద్వారా సాధించాలనే తపనతో చదువు విషయంలో ఒత్తిడి చేస్తున్నారు. పిల్లల సామర్థ్యం ఏమిటో తెలుసుకుని తల్లిదండ్రులు మసలుకోవాలి. - కేవీ రమణ, మానసిక వైద్య నిపుణుడు