ఓపెన్ ‘ఇంటర్’లో విశేష ప్రతిభ
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ శ నివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో నగర విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. ఫలితాల సరళిని పరిశీలిస్తే.. నగరంలో గతేడాది కన్నా రెట్టింపు ఉత్తీర్ణత లభించింది. శివారులో కూడా ఉత్తీర్ణత స్వల్పంగా పెరిగింది. గత ఏప్రిల్/మే నెలల్లో జరిగిన ఈ పరీక్షలకు హైదరాబాద్ జిల్లా నుంచి మొత్తం 4545మంది అభ్యర్థులు హాజరు కాగా 2385మంది( 52.48శాతం) ఉత్తీర్ణులయ్యారు.
గతేడాది ఉత్తీర్ణత 25.55 శాతం కన్నా తాజా ఉత్తీర్ణత 26.93 శాతం అధికం. రంగారెడ్డి జిల్లా నుంచి 8035 మంది పరీక్షలకు హాజరు కాగా, 3197మంది( 39.79శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కన్నా స్వల్పంగా ఉత్తీర్ణత(8.4శాతం) మెరుగైంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరుకునే అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం రూ.200, రీ వెరిఫికేషన్ కోసం రూ.600 ఈనెల 25నుంచి 31వ తేదీ లోగా సమీప ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.