చివరి స్థానమే పదిలం
- టెన్త్ ఫలితాల్లో..
- హైదరాబాద్‌కు మళ్లీ 22వ స్థానమే
- ఒక స్థానం మెరుగైన రంగారెడ్డి జిల్లా
- ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి
- ప్రతిభ చాటిన సర్కారు విద్యార్థులు
సాక్షి, సిటీబ్యూరో: మొన్న ఇంటర్, నిన్న టెన్త్.. ఫలితాలేవైనా హైటెక్ జిల్లా హైదరాబాద్ మాత్రం చివరి స్థానాలతోనే సరిపెట్టుకుంటోంది. తాజాగా గురువారం విడుదలైన టెన్త్ ఫలితాల్లోనూ మరోమారు చతికిలపడింది. నాలుగేళ్లుగా హైదరాబాద్ జిల్లా చిట్టచివరి (22, 23వ ) స్థానాలకే పరిమితమవుతోంది. ఈ సారి 22వ స్థానంలో నిలిచింది. పొరుగునున్న రంగారెడ్డి జిల్లాలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు. గతేడాది 21వ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా ఈ ఏడాది ఓ మెట్టెక్కి 20వ స్థానానికి చేరింది. గత మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు హైదరాబాద్ జిల్లా నుంచి 63,611 విద్యార్థులు పరీక్షలు రాయగా, 49,143 మంది(77.29%) ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లా నుంచి 82,099 మంది పరీక్షలు రా యగా, 69,535 మంది (84.70%) ఉత్తీర్ణులయ్యారు.
బాలికలదే హవా..
రెండు జిల్లాల్లోనూ ఈ ఏడాది టెన్త్ ఉత్తీర్ణతను పరిశీలిస్తే.. బాలుర కంటే బాలికలే మెరుగ్గా రాణిం చారు. రంగారెడ్డి జిల్లాలో 43,239 మంది బాలురు పరీక్ష రాయగా, 36267 మంది (83.88 శాతం) పాసయ్యారు. 38,860 మంది బాలికలలో 33,268 మంది (85.61 శాతం) ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ జిల్లాలో 31,353 మంది బాలురు పరీక్షలు రాయగా, 22,936 మంది (73.15 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన 32,774 మంది బాలికల్లో 26,630 మంది (81.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఈసారి కాస్త ఉపశమనం కలిగించే అంశం. 23 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 9.5పైగా జీపీఏ పాయింట్లు సాధించి సత్తాను చాటారు.
ప్రైవేటైనా.. ప్రభుత్వ స్కూలైనా..
హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలే కాదు.. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఫలితాలు అధ్వానంగానే వచ్చాయి. సకల సదుపాయాలున్న కార్పొరేట్ స్కూళ్లూ ఆశించిన మేర రాణించలేకపోయాయి. అయితే.. కనీస సదుపాయాల్లేని ప్రభుత్వ పాఠశాలల్లోనూ అవే ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణత విషయానికొస్తే హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది 78.13 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రస్తుతం 72 శాతానికి పడిపోయింది. 14 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం, 6 పాఠశాలలు 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలోని మొత్తం 184కి 22 పాఠశాలల్లో 50 శాతం లోపు ఉత్తీర్ణత నమోదైంది.
ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు
హైదరాబాద్ జిల్లాలో టెన్త్ ఫలితాల మెరుగుకు విద్యాశాఖ పరంగా అన్నిరకాల ప్రయత్నాలు చేశాం. ప్రత్యేక తరగతులు పెట్టాం. నిపుణులు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను అందజే శాం. గత మూడేళ్లలో రెండేళ్ల పాటు ఉత్తీర్ణత మెరుగైంది. ఈ ఏడాది మాత్రం ఒక శాతం తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం వివిధ ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో చదివే 50 శాతం మంది విద్యార్థులు పేద వర్గాలకు చెందిన వారు కావడమే. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషిచే స్తాం.
- ఎ.సుబ్బారెడ్డి, హైదరాబాద్ డీఈవో
ఆశించిన ఫలితాలే వచ్చాయి
మూడేళ్లుగా రంగారెడ్డి జిల్లాలో టెన్త్ ఫలితాల్లో ఆశించిన ఫలితాలే వస్తున్నాయి. ఏటా ఉత్తీర్ణత మెరుగవుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా స్థానాల్లో మాత్రం వెనుకబాటు తప్పట్లేదు. జిల్లా వ్యాప్తంగా 562 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ పాయింట్లు వచ్చాయి. జీపీఏ పాయింట్ల సాధనలో రాష్ట్రవ్యాప్తంగా చూస్తే రంగారెడ్డి జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన హెచ్‌ఎంలు, సబ్జెక్టు టీచర్లను సత్కరిస్తాం. 40 శాతంలోపు ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల్ని సంజాయిషీ కోరతాం.
- ఎం.సోమిరెడ్డి, రంగారెడ్డి డీఈవో