tenth results
-
టెన్త్‌లో మళ్లీ నిర్మల్ టాప్.. అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో మాదిరిగానే టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. రెగ్యులర్ విభాగంలో బాలురు కన్నా 3.81 శాతం, ప్రైవేటు (కంపార్ట్మెంటల్) విభాగంలో 6.74 శాతం ఎక్కువ ఉత్తీర్ణతను నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది రెగ్యులర్ విద్యార్థులు 91.31 శాతం, ప్రైవేటు విద్యార్థులు 49.73 శాతం పాసయ్యారు. నిర్మల్ జిల్లా 99.05 శాతం ఉత్తీర్ణతతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లా 65.10 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాలను పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. 5,05,813 మంది పరీక్షలు రాస్తే 4,57,044 మంది ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు. రెగ్యులర్‌గా రాసిన వారిలో బాలికలు 2,28,616 (93.23%), బాలురు 2,22,656 (89.42%) మంది పాసయ్యారు. ప్రైవేటులో బాలికలు 2,178 (54.14%) మంది, బాలురు 3,594 (47.40%) మంది పాసయ్యారు. ఆరు స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు స్కూళ్ళలో ఒక్కరు కూడా పాసవ్వలేదు. గురుకుల పాఠశాలలు 98.71 శాతం అత్యధిక పాస్ పర్సంటేజీతో దూసుకెళ్ళాయి. జిల్లా పరిషత్, ఇతర ప్రభుత్వ పాఠశాలలు సగటు ఉత్తీర్ణత శాతం కన్నా తక్కువ పర్సంటేజీ దక్కించుకున్నాయి. 15 రోజుల్లోగా రీ కౌంటింగ్, వెరిఫికేషన్ మార్కుల రీ కౌంటింగ్, ఫలితాల రీ వెరిఫికేషన్ కోరుకునేవారు 15 రోజుల్లో (మే 15లోగా) దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది. రీ కౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500 చెల్లించి, దరఖాస్తులను పాఠశాల విద్య కార్యాలయానికి పంపాలి. రీ వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ. 1,000 చెల్లించాలి. హాల్ టిక్కెట్ జిరాక్స్, మార్కుల మెమో కాపీతో కూడిన రీ వెరిఫికేషన్ దరఖాస్తును సంబంధిత డీఈవో కార్యాలయానికి పంపాలి. వీరికి మూల్యాంకనం చేసిన సమాధాన పత్రం ప్రతిని పంపుతారు. జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఎదురు చూడకుండా ఈ పరీక్షలకు దరఖాస్తు చేయాలని విద్యాశాఖ కోరింది. మే 16లోగా సంబంధిత స్కూల్ హెచ్ఎంలకు పరీక్ష ఫీజు చెల్లించాలి. ఒత్తిడికి లోనవ్వొద్దు : బుర్రా వెంకటేశం ఫెయిల్ అయిన, గ్రేడ్లు తగ్గిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురికావద్దంటూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విజ్ఞప్తి చేశారు. ఫెయిల్ అయిన వారు సప్లిమెంటరీ రాసుకుని ఇంటర్లో చేరేందుకు అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షలు ఫెయిల్ అయినా, జీవితంలో అద్భుతంగా రాణించిన వారు ఎంతోమంది ఉన్నారని సూచించారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. ‘పది’లో సత్తా చాటిన గురుకులాలు రాష్ట్రవ్యాప్తంగా సగటున 96.33 శాతం ఉత్తీర్ణత అత్యధికంగా జనరల్ సొసైటీలో 98.70శాతం పాస్ పెరుగుతున్న టెన్త్ ఉత్తీర్ణత – 2015లో 77 శాతం.. 2024లో 91 శాతం ఉత్తీర్ణత – 8 రెట్లు పెరిగిన 10 జీపీఏ విద్యార్థులు – ప్రైవేటుతో పోటీ పడుతున్న గురుకులాలు, మోడల్ స్కూల్స్ -
త్వరలో ఇంటర్, పది ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు. వీరి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం సుమారు 23 వేలమంది అధ్యాపకులను ఇంటర్ విద్యామండలి నియమించింది. పదో తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు. వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వేల్యూయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతేడాది ఏప్రిల్ 26న ఇంటర్, మే 6న టెన్త్ ఫలితాలు షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం గురువారంతో ముగియనుంది. తరువాత పునఃపరిశీలన, మార్కుల నమోదు వంటి ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 12వ తేదీ నాటికి ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం కూడా ఈనెల ఎనిమిదో తేదీ నాటికి పూర్తికానుంది. ఈ ఫలితాలను సైతం వారం, పదిరోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువమంది సిబ్బంది నియామకం, టెక్నాలజీ వినియోగం, ప్రతి మూల్యాంకన కేంద్రానికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2022–23 విద్యాసంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 26న, టెన్త్ ఫలితాలను మే 6వ తేదీన విడుదల చేశారు. -
వైరల్ వీడియో : 35 మార్కులతో జస్ట్ పాస్.. ఈ పేరెంట్స్ ఆనందానికి అవధుల్లేవ్ మరి!
-
టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు
-
మే 15 కల్లా ఇంటర్, టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు మే 15 కల్లా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విద్యా శాఖ ఉన్నతాధికారుల కసరత్తు తుది దశకు చేరుకుంటోంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది, టెన్త్ పరీక్షలకు 4.90 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ మూల్యాంకన ఇప్పటికే ముగిసింది. మార్కులను మరోసారి పరిశీలించి, కంప్యూటర్ ద్వారా ఇంటర్ బోర్డ్‌కు పంపారు. డీకోడింగ్ ప్రక్రియ కూడా ముగిసినట్టు అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ జరుగుతోందని, సాంకేతిక పరమైన లోపాలు పరిశీలించిన తర్వాత ఫలితాల విడుదల తేదీ ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. మే రెండోవారం అంటే.. 15వ తేదీలోగా ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇక పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం దాదాపు ముగిసింది. కొన్ని పెద్ద కేంద్రాల్లో అక్కడక్కడా కొనసాగుతోంది. మూల్యాంకనం పూర్తికాగానే డీ కోడింగ్ చేసి, మార్కులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా బోర్డుకు పంపుతున్నారు. కాగా, టెన్త్ ఫలితాలను వచ్చే నెల 10లోగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెపుతున్నారు. -
Nara Lokesh: జూమ్ కాన్ఫరెన్స్‌లో నారా లోకేష్‌కు ఝలక్
సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేష్‌కు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఝలక్ ఇచ్చారు. విద్యార్థులతో నారా లోకేష్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ పాల్గొన్నారు. వీరిద్దరిని చూడగానే కంగుతిన్న లోకేష్ వెంటనే జూమ్ లైవ్‌ను కట్ చేశారు. మరోవైపు కొత్తపల్లి రజిని అనే మహిళ మాట్లాడుతూ.. నారా లోకేష్‌ను జూమ్‌లోనే కడిగేసింది. విద్యార్థుల జీవితాలతో ఆటలేంటని నిలదీసింది. ఇక మరో విద్యార్థితో పాటు జూమ్‌లోకి ఎంటరైన గుర్రంపాటి దేవేందర్ నారా లోకేష్‌తో వాగ్వివాదానికి దిగారు. పిల్లలకు పరీక్షలు పెట్టొదని ఎందుకు చెప్పాలంటూ నారా లోకేష్‌ను నిలదీశారు. చదవండి: (పేద విద్యార్థులపై ట్రోల్స్ చేస్తే తాట తీస్తాం) -
20లోగా ఇంటర్ ఫలితాలు.. నెలాఖరుకు టెన్త్ ఫలితాలు కూడా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా సాగుతోంది. ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ నెల 20లోగా ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డ్ కృత నిశ్చయంతో ఉంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ నెల 11 నాటికి టెన్త్ మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో టెన్త్ ఫలితాలను ఈ నెల 30లోగా వెల్లడిస్తామని ఎస్సెస్సీ బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు. కరోనాతో గత రెండేళ్లుగా విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్నాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశారు. రెండేళ్ల తర్వాత టెన్త్ పరీక్షలు జరగడంతో ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు 6 మాత్రమే ఇచ్చారు. పరీక్షల సమయాన్ని పెంచారు. ఇంటర్, టెన్త్‌కు 70 శాతం సిలబస్ మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో ఈసారి విద్యాసంవత్సరం సాధారణ సమయాల్లోనే చేపట్టాలని భావిస్తున్నారు. -
టెన్త్ ఫలితాల్లో ర్యాంకుల ప్రకటనలపై నిషేధం
సాక్షి, అమరావతి: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్లనుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ బుధవారం 83వ నంబరు జీవో జారీచేశారు. ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో గతంలో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించే వారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు, ట్యుటోరియల్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలతో ఆయా విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించకుండా చర్యలు తీసుకోవాలని, వీటివల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారని పలువురు పాఠశాల విద్యాశాఖకు వినతులు ఇచ్చారు. ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్–1997 ప్రకారం ఇటువంటి మాల్‌ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. టెన్త్ పరీక్షల్లో గ్రేడ్లకు బదులు మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నందున ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యాసంస్థలు ఏ రూపంలోను, ఏ స్థాయిలోను ర్యాంకులతో ఇలాంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ వారంలోనే ఫలితాలు ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈవారంలోనే విడుదలయ్యే అవకాశముంది. మూల్యాంకనాన్ని ముగించిన ఎస్సెస్సీ బోర్డు ఆ వివరాల కంప్యూటరీకరణ వంటి తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. టెన్త్ ఫలితాలను పదో తేదీలోపు విడుదల చేయాలన్న అభిప్రాయంతో ఉన్న బోర్డు వాటిని ఈ వారంలోనే ప్రకటించేలా చర్యలు చేపట్టింది. -
రేపు సాయంత్రం ఏపీ పదో తరగతి ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదల కానున్నాయి. ఎస్సెస్సి బోర్డు మార్క్స్ మెమోలను కూడా రేపే విడుదల చేయనుంది. 2020–21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్లతోపాటు 2019–20 టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు కూడా ప్రకటించనుంది. కోవిడ్ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే జీవో 46ను విడుదల చేసింది. ఫలితాలను గణించడానికి అనుసరించనున్న విధివిధానాలను అందులో వివరించింది. గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించనున్నారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరిస్తారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇస్తారు. -
7లోగా టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 7వ తేదీలోగా వెల్లడించేందుకు ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేసింది. 2020–21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్లతోపాటు 2019–20 టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు కూడా ప్రకటించనుంది. కోవిడ్ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం జీవో 46ను విడుదల చేసింది. ఫలితాలను గణించడానికి అనుసరించనున్న విధివిధానాలను అందులో వివరించింది. గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించనున్నారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరిస్తారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇస్తారు. 2020–21 విద్యార్థులకు.. ఈ విద్యార్థులకు వారి ఫార్మేటివ్ పరీక్షల్లోని స్లిప్ టెస్టు మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇతర మూడు కాంపొనెంట్ల మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎవరైనా ఒక్కటే ఫార్మేటివ్ పరీక్ష రాసి ఉంటే ఆ మార్కులను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్ ఇస్తారు. పరీక్షలకు హాజరైనా మార్కులు అప్లోడ్ కాని విద్యార్థుల విషయంలో వారికి కనీస పాస్ గ్రేడ్లను ప్రకటిస్తారు. వొకేషనల్ విద్యార్థులకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్షలకు రిజిస్టర్ అయిన వారికి వారి టెన్త్ 20 అంతర్గత మార్కులను అయిదుసార్లు రెట్టింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు. -
హైపవర్ కమిటీ నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
అమరావతి: టెన్త్ ఫలితాల కోసం హైపవర్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావడంతో.. ఫలితాల వెల్లడికి అనువైన విధానంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు టెన్త్ ఫలితాలు ప్రకటన విడుదల చేశారు. 2019-20 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించి, 2020లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చి వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్గతంగా 50 మార్కుల చొప్పున నిర్వహించిన.. 3 ఫార్మెటివ్ అసిస్మెంట్ల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా 2021 ఏడాది విద్యార్థులందరికీ అంతర్గత అసెస్మెంట్ మార్కులను 30 శాతానికి.. 70 శాతం వెయిటేజి స్లిప్ టెస్టులకు ఇవ్వాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది. -
టాప్ మోస్ట్ ర్యాంకర్
పరీక్షల్లో ఎన్ని మార్కులైనా రానివ్వండి. ప్రతి మార్కు వెనుక వంద శాతం కష్టం ఉంటుంది! పేపర్–1,పేపర్–2ల వరకే పాసూ ఫెయిలు. ప్రయత్నంలో ప్రతి స్టూడెంట్ ర్యాంకు హోల్డరే. హిమాచల్ ప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు వచ్చాయి. తనూ కుమారి స్టేట్ ఫస్ట్. మార్కుల్లో టాప్ ర్యాంకర్ అని చెప్పడం కాదు. ప్లానింగ్‌లో టాప్ మోస్ట్ ర్యాంకర్ తను!! తనూ కుమారి ‘నీట్’కి ప్రిపేర్ అవుతోంది. మెడిసిన్‌లో సీటుకు ప్రవేశ పరీక్షే.. ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్). ఇంటర్ పాస్ అయి ఉండటం, లేదా ఇంటర్ ఫైనల్ పరీక్షలు రాసి ఉండటం కనీసార్హత. వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. తనూ కుమారి ఇంకా అక్కడి వరకు రాలేదు. మొన్న జూన్ 9 నే హిమాచల్ ప్రదేశ్ టెన్త్ ఫలితాలు వచ్చాయి. తనూకు స్టేట్ ర్యాంక్ వచ్చింది. 700 కి 691 మార్కులు. ఇవన్నీ కాదు ఆమె గొప్ప. ఆ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే ప్లానింగ్‌తో నీట్కి రెండేళ్ల ముందు నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఇప్పటి పిల్లలు ఎవరైనా చేసే పనే కదా అని మీకనిపిస్తే తనూ గురించి మరికొంత తెలుసుకోవాలి. (ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా) ట్యూషన్లు, కోచింగ్‌లు ఇష్టం లేని అమ్మాయి తనూ! స్కూల్లో టీచర్లు ఉన్నప్పుడు బయట మళ్లీ ట్యూషన్లు ఎందుకు అని ఆమెతో ఎవరూ అనలేదు. తనకే అనిపించింది. ‘నీట్’ని కొట్టాలంటే కోచింగ్ ఉండాలి అంటారు. నీట్‌ని కూడా కోచింగ్ లేకుండానే సాధిస్తాను అంటోంది! హిమాచల్‌ప్రదేశ్‌లో టెన్త్ పరీక్షలు ఫిబ్రవరి 22న మొదలై, లాక్‌డౌన్‌కి ముందే మార్చి 19న పూర్తయ్యాయి. పరీక్షలు దగ్గరకొస్తే కానీ పిల్లలకు చదివే మూడ్ రాదు. తనూ మాత్రం ఇప్పుడు నీట్కి ప్రిపేర్ అవుతున్నట్లే... టెన్త్‌లో తొలి క్లాసు మొదలైన రోజు నుంచే తనని తను ‘ఎగ్జామ్స్ మోడ్’లో ఉంచేసుకుంది! ఏ రోజూ ఆరేడు గంటలు చదవకుండా లేదు. ఏ రోజూ టీచర్లని సందేహాలు అడక్కుండా లేదు. చివరి పరీక్ష ముగిసే వరకు టీచర్లను అడిగి డౌట్స్ తీర్చుకుంటూనే ఉంది. కొన్నిసార్లు ఫోన్లో. కొన్నిసార్లు నేరుగా ఇంటికి వెళ్లి. ఫోన్లో మాట్లాడ్డం కూడా తనూకి వెలితిగా ఉండేది. లౌక్‌డౌన్‌లో ఇప్పుడంతా.. ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. తనూకి అలా ఇష్టం ఉండదు. ‘‘ఎదురుగా టీచర్ లేకపోతే నేర్చుకున్నట్లే ఉండదు’’ అంటుంది తనూ. కాంగ్రాలోని సమ్లోటీలో ఇషాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని తనూ. ఆమెకు స్టేట్ ఫస్ట్ రావడంతో ఆమె తల్లిదండ్రుల్లానే స్కూలు యాజమాన్యమూ పట్టలేని ఆనందంలో ఉంది. కుమారి తండ్రి తిలక్ రాజ్ సేల్స్‌మాన్. తల్లి గృహిణి. తనూ దగ్గరి బంధువుల్లో డాక్టర్లు ఉన్నారు కానీ.. డాక్టర్ అవ్వాలని మాత్రం టెన్త్ పరీక్షలు రాసే నాటికి తనూకి లేదు. కరోనా వచ్చి, వైద్యం ఎంత అవసరమో కళ్ల ముందు కనిపిస్తున్న కొద్దీ ఆమెలో మెడిసిన్ చదవాలన్న కోరిక కలిగి, క్రమంగా బలపడింది. అంతటి ఆర్థిక స్థోమత లేకపోవచ్చు. సాధించగలనన్న ఆత్మస్థయిర్యం ఉంది. ఫ్లానింగ్‌లో టాప్ మోస్ట్ ర్యాంకర్ కదా! -
వికటించిన ‘నారాయణ’ మంత్రం..?
సాక్షి, విశాఖ సిటీ: జీవీఎంసీకి వచ్చిన ప్రతిసారీ మున్సిపల్ స్కూల్స్‌లో నారాయణ మెటీరియల్‌తో విద్యార్థులను చదివిస్తున్నాం.. ఈ సారి శతశాతం ఫలితాలు వస్తాయని ఊదరగొట్టిన మంత్రి నారాయణ.. ఉన్న పరువు తీసేశారు. గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు కనబరిచిన జీవీఎంసీ హైస్కూల్స్‌పై మంత్రి కార్పొరేట్ రుద్దుడు ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించేసింది. కార్పొరేషన్ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పోలిస్తే జీవీఎంసీ పాఠశాలల విద్యార్థులే ఎక్కువ మంది 10 పాయింట్లు సాధించారు. ఈ సారి 100 మంది విద్యార్థులకు 10కి 10 పాయింట్లు సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ ప్రత్యేక కార్యచరణను రూపొందించుకుంది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రంగ ప్రవేశం చేసి మొత్తం వ్యవస్థను మార్చేశారు. ‘మా నారాయణ స్కూల్లో కరిక్యులమ్ భిన్నంగా ఉంటుంది. దాన్ని చదివితే విద్యార్థులకు 10కి 10 పాయింట్లు గ్యారెంటీ..’ అంటూ.. ఎప్పటికప్పుడు జీవీఎంసీలో సమీక్షలు నిర్వహించి ఉపన్యాసాలు ఇచ్చేవారు. మంత్రి ఆదేశాల్ని పాటించిన విద్యాశాఖాధికారులు దాదాపు నారాయణ స్టడీ మెటీరియల్‌నే పేరు మార్చి మున్సిల్ స్కూళ్ల విద్యార్థులతో బట్టీ పట్టించారు. 100 శాతం ఫలితాలు మాట అటుంచితే చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గతేడాదితో పోలిస్తే స్వల్పంగా ఉత్తీర్ణత శాతం తగ్గడంతో జీవీఎంసీ విద్యాశాఖ ఊపిరి పీల్చుకుంది. ఉత్తీర్ణతతో పాటు 10 పాయింట్లూ తగ్గాయి మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 27 హైస్కూల్స్ ఉన్నాయి. ఇందులో 1907 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి చదవగా.. 1903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 868 మంది బాలురు, 1035 మంది బాలికలున్నారు. వీరిలో 91.75 శాతంతో 1746 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 796 మంది బాలురు, 950 మంది బాలికలు పాసయ్యారు. 157 మంది ఫెయిల్ అయ్యారు. 2017–18 విద్యా సంవత్సరంలో 92.67 ఉత్తీర్ణత శాతం ఉండగా, ఈ ఏడాది 0.92 శాతం తగ్గింది. దీంతో పాటు గతేడాది 39 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించగా ఈ ఏడాది ఆ సంఖ్య కూడా తగ్గి 31కి దిగజారింది. 4 పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత గతేడాది 2 పాఠశాలలు మాత్రమే 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ సారి ఆ సంఖ్య నాలుగుకి చేరింది. అనకాపల్లిజోన్ పరిధిలోని గాంధీనగరం హైస్కూల్, డా.బీఆర్ అంబేడ్కర్ హైస్కూల్, భీమిలి జోన్‌లోని డా.బీఆర్ అంబేడ్కర్ హైస్కూల్, పీఎన్ఎం హైస్కూల్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నాలుగు స్కూల్స్‌లో బాలురు, 8 స్కూల్స్‌లో బాలికలు 100 శాతం పాసయ్యారు. ఎంజీఎం హైస్కూల్ 73.33 శాతంతో అట్టడుగున నిలిచింది. 14 పాఠశాలలు 90 శాతానికి పైగా, 9 స్కూల్స్ 70 శాతానికి పైగా ఫలితాలు సాధించాయి. అయితే గతేడాది 9.8 జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య 29 కాగా ఈ సారి ఏకంగా 40 మందికి చేరడం విశేషం. మంత్రి చలవతోనే బెడిసి కొట్టాయి.. 2016–17 విద్యా సంవత్సరంలో కేవలం 7గురు విద్యార్థులు మాత్రమే 10 పాయింట్లు సాధించడంతో.. 2017–18–లో 40 మంది విద్యార్థులకు ఆ సంఖ్య చేరుకోవాలని కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందించింది. దీనికి అనుగుణంగా ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్ తయారు చేసి, విద్యార్థులకు అందించడంతో 39 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించారు. ఈ ఏడాది మాత్రం మంత్రి నారాయణ సూచనలకనుగుణంగా బో ధన సాగడంతో ఫలితాల్లో చతికిలపడ్డామంటూ జీవీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 94.88 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (95.09), బాలుర(94.68)పై పైచేయి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా (98.19) టాప్‌లో నిలువగా నెల్లూరు (83.19) జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్ 17 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను కింది వెబ్సైట్లో చూసుకోవచ్చు... https://www.sakshieducation.com వీడియో: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల -
‘టెన్త్’లో రికార్డు ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఈసారి రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక ఎన్నడూ లేనివిధంగా 92.43% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇప్పటివరకు టెన్త్‌లో 90 శాతంలోపే ఉత్తీర్ణత నమోదవుతూ వచ్చింది. ఇంటర్ ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో టెన్త్‌లో వ్యాల్యుయేషన్, ఫలితాల ప్రాసెసింగ్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పొరపాట్లు లేకుండా ఫలితాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. జూన్ 10 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. సోమవారం సచివాలయం డీ బ్లాక్‌లో టెన్త్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్య కమిషనర్ విజయ్ కుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్, పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,52,280 మంది విద్యార్థులు (రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు) దరఖాస్తు చేసుకోగా వారిలో 5,46,728 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో రెగ్యులర్ విద్యార్థులు 5,06,202 మంది ఉండగా వారిలో 4,67,859 మంది (92.43 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 40,526 మంది పరీక్షలకు హాజరుకాగా వారిలో 22,910 మంది (56.53 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది వార్షిక పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 5,01,732 మంది హాజరు కాగా అందులో 4,20,365 మంది (83.78 శాతం) పాసయ్యారు. ఇక ఈసారి పరీక్షల్లో బీసీ సంక్షేమ గురుకులాలు అత్యధిక ఉత్తీర్ణత సాధించాయి. రెండో స్థానంలో విద్యాశాఖ గురుకులాలు నిలవగా మోడల్ స్కూళ్లు మూడో స్థానాన్ని సాధించాయి. ప్రభుత్వ పాఠశాలలు చివరి స్థానంలో ఉన్నాయి. బాలురకంటే బాలికలదే ఎక్కువ ఉత్తీర్ణత... టెన్త్ పరీక్షల్లో ఎప్పటిలాగే బాలురకంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 2,54,551 మంది పరీక్షలకు హాజరుకాగా 2,32,109 మంది (91.18%) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,51,651 మంది పరీక్షలకు హాజరవగా 2,35,750 మంది (93.68%) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది బాలురు 82.46% ఉత్తీర్ణులవగా బాలికలు 85.14% మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థుల్లోనూ బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో బాలురు 25,457 మంది ఉండగా వారిలో 13,657 మంది (53.65%) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 15,069 మంది పరీక్షలకు హాజరుకాగా 9253 మంది (61.40%) పాసయ్యారు. మళ్లీ జగిత్యాలే ఫస్ట్.. ఈసారి కూడా పదో తరగతి పరీక్షల్లో జగిత్యాల జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాది 97.56 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లానే మొదటి స్థానాన్ని సంపాదించింది. ప్రస్తుతం జరిగిన వార్షిక పరీక్షలకు జగిత్యాల జిల్లాలో 13,197 మంది హాజరవగా 13,162 మంది (99.73 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే 99.33 శాతంతో సిద్దిపేట రెండో స్థానంలో నిలవగా 98.38 శాతంతో కరీంనగర్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. అయితే హైదరాబాద్ జిల్లా మాత్రం 83.09 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానానికి పరిమితమైంది. హైదరాబాద్‌లో 70,173 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందులో 58,306 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గురుకులాలు, మోడల్ స్కూళ్లు టాప్... పదో తరగతి పరీక్షల ఫలితాల్లో గురుకులాలు, మోడల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల కంటే ప్రస్తుతం గురుకులాల సంఖ్య భారీగా పెరగడం, వాటిల్లోని విద్యార్థులు ఎక్కువ ఫలితాలను సాధించడంతో ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదైందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉత్తీర్ణత శాతం పెరుగడంతో ఈసారి అధిక శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెబుతున్నారు. గతేడాది బీసీ సంక్షేమ గురుకులాలు 96.18 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా ఈసారి ఉత్తీర్ణత శాతం పెంచుకొని 98.78 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానాన్ని పదిలపరచుకుంది. గతేడాది విద్యాశాఖ గురుకులాలు 94 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈసారి 98.54 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచాయి. ఇలా అన్ని గురుకులాలతోపాటు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోనూ ఉత్తీర్ణత శాతం పెరిగింది. -
టెన్షన్ వద్దు
తూప్రాన్: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి. ఇంటర్ ఫలి తాల సమయంలో నెలకొన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫలితాలకు ముందే విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని, వారికి అవగాహన కల్పించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని పలు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఎంఈ ఓలు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పరీక్షలు.. మార్కులే జీవితం కావన్నారు. విద్యార్థులు సాధించిన మార్కుల విషయంలో తల్లిదండ్రులు నిరుత్సాహపర్చేవిధంగా వ్యవహరించకూడదన్నారు. భవిష్యత్తుపై వారిలో నమ్మకం కలిగించే విధంగా ధైర్యం చెప్పాలన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించాల్సి ఉండాల్సింది అని వారిపై ఒత్తిడి తేవద్దన్నారు. దురుసుగా వ్యవహరిస్తే క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలని, విద్యార్థుల అభీష్టానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వారిపై రుద్దవద్దని సూచించారు. -
టెన్త్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం 11.30 గం.కు సచివాలయం డి బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరవ్వగా 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల ఉత్తీర్ణత శాతం 93.68 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 91.18 శాతంగా నమోదైంది. టెన్త్ ఫలితాల్లో జగిత్యాల(99.30 శాతం) మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్(89.09 శాతం) చివరి స్థానంలో నిలిచింది. పదో తరగతి పరీక్ష ఫలితాలను కింది వెబ్సైట్లలో చూసుకోవచ్చు... www. sakshieducation. com అలాగే పాఠశాలలు, విద్యార్థులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్‌ను www. bse. telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు అని టైప్ చేసి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. డౌన్లోడ్ చేసుకున్న తరువాత విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక అందులో పేరు, పాఠశాల విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్ వస్తాయి. అలాగే విద్యార్థులు తమ మొబైల్ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేయాలి. మెయిల్ ఐడీని నమోదు చేసి సేవ్ చేయాలి. విద్యార్థులు ఫలితాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే గ్రీవెన్సెస్‌లోకి వెళ్లి దానిని సెలెక్ట్ చేసి, టెక్ట్స్ బాక్స్‌లో ఫిర్యాదు రాసి సబ్మిట్ చేయాలి. ఆ తరువాత కన్ఫర్మేషన్ మేసేజ్ విద్యార్థుల మొబైల్ నంబర్‌కు వస్తుంది. అయితే ఇందులో ఒక్కసారే ఫిర్యాదు చేయడానికి వీలు ఉంటుంది. -
‘పది’ స్థానం మారేనా?
పదో తరగతి ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. దీంతో జిల్లా స్థానం ఈసారైన ‘పది’లో మారనుందా లేదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రెండేళ్లుగా జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలువగా ఈసారైన స్థానం మార్చాలని విద్యాశాఖ అధికారులు మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఉపాధ్యాయుల కొరత, విద్యావలంటీర్లతో బోధన కొనసాగిస్తుండడం పది ఫలితాలపై ప్రభావం చూపుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లా వెనుకబడుతూనే ఉంది. గతేడాది రాష్ట్రంలో జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ సారైనా టాప్–10లోకి వస్తుందని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. 2017–18 సంవత్సరంలో 28వ స్థానం, 2016–17, 2014–15, 2013–14లో రాష్ట్రస్థాయిలో చివరి స్థానాల్లో నిలిచింది. 2015–16లో కొంత మెరుగుపడినా ఆ తర్వాత అవే ఫలితాలు వస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో కొంత మెరుగు పడుతున్నప్పటికీ ఎస్సెస్సీలో మాత్రం చివరి స్థానాలే దక్కుతున్నాయి. సోమవారం పదో తరగతి ఫలితా లను విద్య శాఖ కమిషనర్ ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారైనా మెరుగుపడేనా.. గతేడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా అదమ స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. 51.94 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 2016–17 సంవత్సరంలో 71.15శాతం కాగా, గతేడాది 19.21 శాతం ఉత్తీర్ణత తగ్గింది. సగం మంది విద్యార్థులు ఫెయిలైయ్యారు. గణితం, ఫిజికల్ సైన్స్‌లో 3వేలకు పైగా విద్యార్థులు ఫెయిలైయ్యారు. ఈసారి జిల్లాలో 13,576 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 10,098 మంది పరీక్షలకు హాజరుకాగా గతంలో ఫెయిలైన విద్యార్థులు 3,478 మంది పరీక్షలు రాశారు. అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లా చదువుల పరంగా వెనుకబడి పోతోంది. ప్రతియేడాది పాఠశాల ప్రారంభ సమయంలో, పరీక్షల కంటే ముందు విద్యశాఖ అధికారులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారు. అయినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఖాళీల కొరతతోనే.. పదో తరగతి ఫలితాలు తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. టీఆర్టీ ఫలితాలు విడుదల చేసినప్పటికీ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం లేదు. విద్యావలంటీర్లతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో విద్యార్థులకు సరైన విద్యాబోధన సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాల విధులకు డుమ్మా కొట్టడం, పాఠశాలకు వచ్చినా విద్యాబోధన చేయకపోవడంతో ఈ ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోందనే ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో వారు ఎంఈఓ కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. పాఠశాలల్లోని సీనియర్ ఉపాధ్యాయులకు హెచ్ఎం బాధ్యతలు అప్పగిస్తుండడంతో పాఠశాలల్లో విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ఉప విద్యాధికారులు కూడా రెగ్యులర్ లేరు. దీంతో పర్యవేక్షణ లోపంతో కొన్నేళ్లుగా ఫలితాలపై ప్రభావం చూపుతోంది. ఈసారైనా పది ఫలితాలు మెరుగుపడతాయో లేదో వేచి చూడాల్సిందే. పడిపోతున్న ఫలితాలు.. జెడ్పీ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ముఖ్యంగా పదో తరగతి ఫలితాలు తగ్గుతూ వస్తున్నాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కొంత ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. గతేడాది జిల్లాలో కేవలం ఇద్దరు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మాత్రమే పది జీపీఏ గ్రేడ్ సాధించారు. ఈసారి కనీసం 20 మంది అయినా పది జీపీఏ ఫలితాలు సాధిస్తారని విద్య శాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తాం... గతంకంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తాం. జిల్లా రాష్ట్రస్థాయిలో టాప్–10లో ఉంటుందని భావిస్తున్నాం. పది ఫలితాలు మెరుగుపర్చేందుకు జూన్ నుంచే పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాం. ఫెయిలైన విద్యార్థులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు. జీవితంలో మార్కులు ప్రామాణికం కాదు. పదో తరగతిలో తక్కువ మార్కులు సాధించిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర విద్యార్థులతో పిల్లల్ని మార్కుల పరంగా పోల్చకూడదు. – ఎ.రవీందర్‌రెడ్డి, డీఈవో, ఆదిలాబాద్ -
నేడు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు
-
టెన్త్ ఇంటర్నల్ మార్కుల్లో ప్రైవేట్ పడగ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు సాక్షాత్తూ ప్రభుత్వమే కొమ్ముకాస్తోంది. ఫలితంగా ప్రతిఏటా ఉత్తీర్ణత శాతం, జీపీఏ పాయింట్లలో ఆయా సంస్థలే పైచేయి సాధిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు తగ్గుతున్నట్లు చూపించి, క్రమంగా వాటిని పూర్తిగా మూసివేసే దిశగా సర్కారు కుట్ర పన్నిందన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణతా శాతం పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అంతా అటువైపే మొగ్గు చూపుతున్నారు. దీనివెనుక కార్పొరేట్ శక్తుల కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోగాల్లేకున్నా పూర్తి మార్కులా? విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని పాఠశాలల్లో సమగ్ర నిరంతర మూల్యాంకన విధానాన్ని(సీసీఈ) అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానాన్ని చాలాకాలం అమలుకు నోచుకోలేదు. చివరకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆలస్యంగా అమల్లోకి తీసుకొచ్చారు. విద్యార్థులు పాఠశాలల్లో ప్రయోగాలు, ఇతర అంతర్గత కార్యక్రమాల్లో పాలుపంచుకొంటూ, అందులో సాధించే నైపుణ్యాల ఆధారంగా కొన్ని మార్కులు కేటాయించాలన్నది సీసీఈ విధానం లక్ష్యం. ఇందులో భాగంగా దీనికి 20 మార్కులు కేటాయిస్తున్నారు. వీటిని అంతర్గత(ఇంటర్నల్) మార్కులు అంటున్నారు. వార్షిక పరీక్షలోవిద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి మిగతా 80 మార్కులు ఇవ్వాలి. ఇంటర్నల్ మార్కుల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు తమ విద్యార్థులకు పూర్తి మార్కులు వేసుకుంటున్నాయని విద్యారంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులతో ప్రయోగాలు, ఇతర కృత్యాలు చేపట్టకుండానే పూర్తి మార్కులు వేసేస్తున్నారు. దీంతో ఆయా స్కూళ్ల విద్యార్థులు ఉత్తీర్ణతలో ముందంజలో ఉండడమే కాకుండా మెరుగైన జీపీఏ పాయింట్లనూ దక్కించుకుంటున్నారు. పత్తా లేని పర్యవేక్షణ కమిటీ ఇంటర్నల్ మార్కులకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలు, పిల్లల్లో నైపుణ్యాలను ఉపాధ్యాయులు ఏ మేరకు అంచనా వేస్తున్నారో పరిశీలించడానికి ఒక పర్యవేక్షణ కమిటీ ఉండాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. మండల విద్యాధికారులు, డిప్యూటీ విద్యాధికారుల పోస్టులు 80 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న అరకొర సిబ్బంది పాఠశాలల్లో సీసీఈ విధానం అమలును పట్టించుకోవడం లేదు. దాంతో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. విద్యా వ్యాపారంలో భాగంగా తమ స్కూళ్ల ఉత్తీర్ణత శాతం, జీపీఏలను పెంచుకోవడానికి ఎలాంటి అంతర్గత కృత్యాలు చేపట్టకుండానే తమ విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులను 20కి 20 పూర్తిగా కేటాయిస్తున్నాయి. వాటిని యథాతథంగా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాయి. 90 శాతానికి పైగా ప్రైవేట్ విద్యార్థులే.. 2014–15 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన వారిలో 90 శాతానికి పైగా విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు చెందినవారే. 2018లో 6,04,527 మంది టెన్త్ పరీక్ష రాయగా, వీరిలో 5,71,175 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు 2,29,405 మంది పరీక్ష రాయగా, 2,25,072 (98.11 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ మున్సిపల్ స్కూళ్లలో 90.40 శాతం, జెడ్పీ స్కూళ్లలో 92.57 శాతం, ఇతర ప్రభుత్వ స్కూళ్లలో 90.77 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు 5,340 ఉండగా, ఇందులో ప్రైవేట్ స్కూళ్లు 3,125 ఉన్నాయి. మొత్తం 29,921 మంది 10 జీపీఏ సాధించగా, వీరిలో 26,475 మంది ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులే కావడం గమనార్హం. తూతూమంత్రంగా కమిటీ సీసీఈ విధానం దుర్వినియోగం అవుతోందని, తమిళనాడు, కర్ణాటక తరహాలో ఈ విధానంతో సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులు పలుమార్లు సూచించినా ప్రభుత్వం తొలుత లెక్కచేయలేదు. చివరకు ఒత్తిడి పెరగడంతో అధికారులతో ఒక కమిటీని నియమించింది. ప్రభుత్వ పెద్దల సూచన మేరకే కమిటీ తన నివేదికను సమర్పించింది. దాంతో ఈ ఏడాది కూడా టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సీసీఈ విధానాన్నే కొనసాగించారు. బడా కార్పొరేట్ విద్యా సంస్థల లాబీయింగే దీనికి కారణమని సమాచారం. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల అధినేతలు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులుగా ముద్రపడ్డారు. దీంతో వారి చెప్పిందే వేదంగా మారింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తీర్ణత, జీపీఏ పాయింట్లలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లే పైచేయి సాధించబోతున్నాయి. -
నేడు టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గం.కు సచివాలయం డి బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఈ ఫలితాలను www. sakshieducation. com, http:// results. bse. telangana. gov. in, http:// results. cgg. gov. in, www. bse. telangana. gov. in వెబ్సైట్లో పొందవచ్చు. అలాగే పాఠశాలలు, విద్యార్థులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్‌ను www. bse. telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే మొబైల్ ప్లే స్టోర్ నుంచి టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు అని టైప్ చేసి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. డౌన్లోడ్ చేసుకున్న తరువాత విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక అందులో పేరు, పాఠశాల విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్ వస్తాయి. అలాగే విద్యార్థులు తమ మొబైల్ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేయాలి. మెయిల్ ఐడీని నమోదు చేసి సేవ్ చేయాలి. విద్యార్థులు ఫలితాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే గ్రీవెన్సెస్‌లోకి వెళ్లి దానిని సెలెక్ట్ చేసి, టెక్ట్స్ బాక్స్‌లో ఫిర్యాదు రాసి సబ్మిట్ చేయాలి. ఆ తరువాత కన్ఫర్మేషన్ మేసేజ్ విద్యార్థుల మొబైల్ నంబర్‌కు వస్తుంది. అయితే ఇందులో ఒక్కసారే ఫిర్యాదు చేయడానికి వీలు ఉంటుంది. -
13న పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 13వ తేదీన విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ అధికారులు ఫలితాలు విడుదల చేస్తారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 3వ తేదీవరకూ జరిగాయి. కాగా ఇంటర్ ఫలితాల వెల్లడిలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఫలితాల విడుదలలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
భవిష్యత్తులో ‘టెన్త్’ పునఃమూల్యాంకనం
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల పునఃమూల్యాంకనం (రీ వ్యాల్యుయేషన్) నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది కాకపోయినా, భవిష్యత్తులో అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. పునఃమూల్యాంకనం నిర్వ హించాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించినట్లు వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పునఃమూల్యాంకనానికి సంబంధించిన కోర్టు తీర్పులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపై విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో సమీక్షించారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాల్లో లోపాలు చోటుచేసుకున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాల ప్రకటనలో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. అత్యంత పకడ్బందీగా పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించామన్నారు. ఫలితాలపట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, జవాబు పత్రాల ఐదంచెల పరిశీలన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ప్రతి విద్యార్థీ గ్రేడ్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటున్నారమన్నారు. ఎవరికైనా సున్నా మార్కులొచ్చినా, గైర్హాజరని వచ్చినా, ఒక సబ్జెక్టులో ఫెయిలై మిగిలిన సబ్జెక్టుల్లో మంచి మార్కులొచ్చినా సంబంధిత విద్యార్థుల జవాబు పత్రాల పునః పరిశీలన నిర్వహించి ధ్రువీకరించుకున్నామన్నారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఇలాంటి కేసులను గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని విజయ్ కుమార్ చెప్పారు. అయితే ఫలితాల విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రెండు రోజుల ముందే ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. ప్రధానోపాధ్యాయుల లాగిన్‌కు ఫలితాలు.. ఎప్పటిలాగే పదో తరగతి ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేయడంతోపాటు ఈ ఏడాది తొలిసారిగా ప్రధానోపాధ్యాయుల లాగిన్‌కు సంబంధిత పాఠశాల విద్యార్థులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ షీట్‌ను పంపిస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు. దీనివల్ల గ్రామీణ విద్యార్థులు వారి పాఠశాలకు వెళ్లి ఫలితాలను తెలుసుకోవడంతోపాటు ప్రధానోపాధ్యాయుడి నుంచి కౌన్సెలింగ్, సలహాలు పొందొచ్చని వివరించారు. పదో తరగతి ఫలితాలపై విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు/ఫిర్యాదులు స్వీకరించేందుకు కొత్త మొబైల్ యాప్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని యాప్‌లో ఎంటర్ చేయడం ద్వారా విద్యార్థులు తమ విజ్ఞప్తిని టైప్ చేసి పదో తరగతి బోర్డుకు పంపొచ్చని, అలా పంపిన వారికి అక్నాలెడ్జ్మెంట్ సైతం పంపిస్తామన్నారు. -
టెన్త్ ఫలితాల ఆలస్యంపై స్పందించిన ఎస్ఎస్సీ బోర్డ్
-
టెన్త్ ఫలితాల విడుదల ఆలస్యం
హైదరాబాద్: టెన్త్ ఫలితాల విడుదల కాస్త ఆలస్యం అవుతుందని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయకుమార్ శనివారం తెలిపారు. హైదరాబాద్‌లో విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. టెన్త్ ఫలితాలు విడుదల చేశాక ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్ లాగిన్లతో విద్యార్థుల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి గ్రేడ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఏ సబ్జెక్లోనైనా సున్నా వస్తే.. రీ చెక్ చేసిన తర్వాతే ఫైనల్ చేస్తామని చెప్పారు. ఐదు అంచెలుగా పేపర్ చెక్ చేసి ఫైనల్ చేస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆలస్యం ఐనా పక్కాగా ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పేపర్ వాలువేషన్ పూర్తి అయింది.. కానీ రీచెక్ చేస్తున్నాం.. అందుకే ఫలితాల విడుదల ఆలస్యమవుతుందని వెల్లడించారు. ఇంటర్ ఫలితాల విషయంలో పెద్ద గందరగోళం నెలకొనడంతో టెన్త్ ఫలితాల విడుదలలో ప్రభుత్వం కాస్త జాగ్రత్తపడుతున్నట్లుగా కనపడుతోంది. -
‘పది’పై ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్‌టౌన్: అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లా.. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మాత్రం గత కొన్నేళ్లుగా చివరి స్థానాల్లోనే నిలుస్తోంది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు పరీక్షలకు రెండు నెలల ముందు నుంచి చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు. ఈసారి కలెక్టర్ దివ్యదేవరాజన్ పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మెరుగైన ఫలితాల సాధన కోసం ఇప్పటినుంచే ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల ద్వారా బోధించే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ కోసం కూడా నిధులను విడుదల చేశారు. కొంతమంది ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా, మరికొంతమంది కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయులకు ఉదయం, సాయంత్రం వీలున్న సమయంలో తరగతులు నిర్వహించాలని, టీచర్లపై ప్రత్యేకంగా ఒత్తిడి తేవడం లేదని విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఇప్పటినుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించే విషయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఏదేమైనా ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో విద్యార్థులకు మేలు జరగనుంది. ఈ యేడాదైనా మెరుగయ్యేనా.. గత రెండేళ్లుగా ఫలితాల పరంగా వెనుకబడిన జిల్లా ఈసారైనా టాప్–10లోనైనా ఉంటుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించకపోవడంతోనే ఫలితాల పరంగా కింది స్థానంలో ఉంటున్నామని విద్యావంతులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈసారైనా పక్కా ప్రణాళికతో విద్యాబోధన చేపడితే మెరుగైనా ఫలితాలు సాధించగలుగుతామని పేర్కొంటున్నారు. ముఖ్యంగా గణితం, ఆంగ్లం, సైన్స్ సబ్జెక్టుల్లో అధిక మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని, ఆయా సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా ఫలితాలు సాధించేలా చూడాలని కోరుతున్నారు. కుంటుపడుతున్న విద్యావ్యవస్థ.. జిల్లాలో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. గత కొన్నేళ్లుగా రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఇన్‌చార్జీలతోనే పాఠశాలల పర్యవేక్షణ కొనసాగుతోంది. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకే ఎంఈఓ బాధ్యతలు అప్పగించడంతో వారు ఏ పనిని పూర్తిస్థాయిలో చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం డీఈఓ, ఉప విద్యాధికారి, ఎంఈఓ పోస్టులు ఇన్‌చార్జీలతోనే కొనసాగుతున్నాయి. ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు పూర్తి సమయం కేటాయించకపోవడంతో పాఠశాలలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో యాభై శాతం మంది విద్యార్థులకు అక్షరాలు రాయడం, చదవడం రావడం లేదు. దీని ప్రభావం ఉన్నత తరగతికి వెళ్లిన విద్యార్థులపై ప్రభావం పడుతోంది. స్నాక్స్ కోసం నిధులు.. జిల్లాలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 63 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్యంలో 4,502 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరందరూ మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 17 నుంచి జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రత్యేక తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు అలసిపోకుండా ఉండేందుకు రూ.22లక్షల 51వేల నిధులను విడుదల చేశారు. సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయుల అకౌంట్లలో డబ్బులను జమ చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.5 చొప్పున కేటాయించనున్నారు. వంద రోజుల పాటు ఈ ప్రక్రియ జరగనుంది. మంచి స్పందన ఉంది.. ఈ నెల 17 నుంచి కలెక్టర్ పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం నిధులను కూడా విడుదల చేశారు. ఉపాధ్యాయుల నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఎవరిపై కూడా ఒత్తిడి తేవడం లేదు. వారికి వీలున్న సమయంలో ప్రత్యేక తరగతులు బోధించాలని సూచించాం. పదిలో ఈ విద్యా సంవత్సరం మంచి ఫలితాలు సాధిస్తాం. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపడుతున్నాం. – డాక్టర్ రవిందర్ రెడ్డి, డీఈఓ, ఆదిలాబాద్ -
పది ఫలితాల్లో సత్తా చాటిన రైతు బిడ్డ
లక్నో: సాధారణ రైతు బిడ్డ ఉత్తరప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో దుమ్మురేపారు. మొత్తం 600 మార్కులకుగాను 578 మార్కులు (96.3%) సాధించి టాపర్‌గా నిలిచింది. ఆదివారం యూపీఎంఎస్‌పీ విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో అలహాబాద్‌కు చెందిన రైతు బిడ్డ అంజలి వర్మ స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టాపర్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘మా నాన్న రైతు. చాలా కష్టాలు ఉన్నప్పటికీ నన్ను చదివించాడు. టీచర్లు ప్రతి విషయంలో సహాయం చేశారు. ఈ ఫలితాన్ని ముందే ఊహించాను. ప్రతి విషయంలో సపోర్టుగా నిలిచిన నా తల్లిదండ్రులకి, టీచర్లకి థ్యాక్స్. నేను గొప్ప ఇంజనీర్ అయి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను’ అని అంజలి తెలిపారు. యూపీలో పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు నిర్వహించారు. దాదాపు 37 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు రాశారు. -
టెన్త్ ఫలితాల్లో జగిత్యాల జయభేరి
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే టాప్‌గా నిలిచారు. బాలురు 82.46 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 85.14 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ఈసారి 83.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక టెన్త్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ, విద్యాశాఖ గురుకులాలు, మోడల్ స్కూళ్లు అధిక శాతం ఉత్తీర్ణత సాధించాయి. పలు ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మంచి ఫలితాలను సాధించాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం సచివాలయంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను వెల్లడించారు. తగ్గిన ఉత్తీర్ణత.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 5,34,726 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో రెగ్యులర్ విద్యార్థులు 5,01,732 మందికాగా.. 32,994 మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారు. రెగ్యులర్ విద్యార్థుల్లో మొత్తంగా 83.78 శాతం మంది ఉత్తీర్ణులుకాగా.. బాలురు 82.46 శాతం, బాలికలు 85.14 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాది మొత్తం ఉత్తీర్ణత 84.15 శాతం కావడం గమనార్హం. 21 స్కూళ్లలో జీరో.. రాష్ట్రవ్యాప్తంగా 2,125 పాఠశాలలు ఈసారి 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. అందులో 1,225 ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. మరో 900 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, గురుకులాలు ఉన్నాయి. ఇక 21 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. అందులో 11 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, 3 ఎయిడెడ్, 3 జెడ్పీ, 2 ఆశ్రమ పాఠశాలలు, ఒక ప్రభుత్వ, ఒక ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి ఫెయిలైన వారి సంఖ్య 1,07,898 కావడం గమనార్హం. బీసీ గురుకులాల ముందంజ టెన్త్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకులాలు 96.18 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించాయి. రెండో స్థానంలో విద్యాశాఖ గురుకులాలు, మూడో స్థానంలో మోడల్ స్కూళ్లు నిలిచాయి. గిరిజన సంక్షేమ గురుకులాలు మినహా అన్ని గురుకులాలు రాష్ట్ర సగటు కంటే అధిక ఉత్తీర్ణత సాధించాయి. జగిత్యాల జిల్లా టాప్.. జిల్లాల వారీగా ఫలితాలను చూస్తే జగిత్యాల జిల్లా 97.56 శాతం అత్యధిక ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది కూడా 97.35 శాతంతో జగిత్యాల జిల్లాయే తొలిస్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఈసారి 94.03 శాతం ఉత్తీర్ణతతో కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది. కేవలం 51.94 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. పది రోజుల్లో మార్కుల జాబితాలు సబ్జెక్టుల వారీగా విద్యార్థుల మార్కుల వివరాలను సంబంధిత పాఠశాలకు పదిరోజుల్లో పంపిస్తామని అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లను కూడా పంపిస్తామని.. ఆ సర్టిఫికెట్తో ఇంటర్లో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. కొందరు విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టామని, వారికి సంబంధించి నిర్ణయాన్ని త్వరలో పాఠశాలలకు వివరిస్తామని చెప్పారు. 4,768 మందికి 10/10 జీపీఏ టెన్త్ ఫలితాల్లో పదికి పది గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ)ను 4,768 మంది విద్యార్థులు సాధించారు. గతేడాది 2,427 మంది విద్యార్థులకే 10/10 జీపీఏరాగా.. ఈసారి అదనంగా 2 వేల మంది సాధించారు. మరో 7,115 మంది విద్యార్థులు 9.8 జీపీఏ సాధించగా, 9,042 మంది 9.7 జీపీఏ, 31 మంది 9.6 జీపీఏ, 10,720 మంది 9.5 జీపీఏ సాధించారు. గత రెండేళ్లలో రెగ్యులర్ విద్యార్థుల ఫలితాలు.. వివిధ మేనేజ్మెంట్ల వారీగా టెన్త్ ఫలితాల తీరు.. గణితంలోనే ఎక్కువ మంది ఫెయిల్ టెన్త్ పరీక్షల్లో గతేడాదిలాగే ఈసారి కూడా గణితం సబ్జెక్టులోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. 4,43,256 మంది విద్యార్థులు గణితం పరీక్షలు రాయగా.. 88.37 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గణితం తర్వాత ఎక్కువ మంది సామాన్య శాస్త్రంలో ఫెయిలయ్యారు. సబ్జెక్టుల వారీగా పరీక్షలకు హాజరైన వారు, ఉత్తీర్ణత శాతం ఇంగ్లిష్ మీడియంలో అధిక ఉత్తీర్ణత పదో తరగతి ఫలితాల్లో తెలుగు మీడియం విద్యార్థుల కంటే ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా పదో తరగతి ఉత్తీర్ణత 83.78 శాతంకాగా.. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 88.96 శాతం, తెలుగు మీడియం విద్యార్థులు 75.37 శాతం ఉత్తీర్ణులయ్యారు. అంటే 13 శాతం అధిక ఉత్తీర్ణత నమోదైంది. ఇంగ్లిష్ మీడియంలో గతేడాది 88.33 శాతం ఉత్తీర్ణులుకాగా.. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. అటు తెలుగు మీడియంలో గతేడాది 78.66 శాతం పాస్‌కాగా.. ఈసారి ఉత్తీర్ణతా శాతం తగ్గింది. మీడియం వారీగా ఉత్తీర్ణత వివరాలు -
తెలంగాణ పదో తరగతి ఫలితాలు: బాలికలదే పైచేయి
-
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం రాత్రి ఏడు గంటలకు సచివాలయంలోని డీ బ్లాక్‌లో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 83.78 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,103 పాఠశాలలకు చెందిన 5,34,726 మంది హాజరయ్యారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలికలే పైచేయిగా నిలిచారు. ఇక ఫలితాల్లో మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా, చివరి స్థానంలో ఆదిలాబాద్ జిల్లా నిలిచింది. ఫలితాల్లో బాలికలదే పైచేయి బాలుర ఉత్తీర్ణత శాతం 82.46 బాలికల ఉత్తీర్ణత శాతం 85.14 21 సూళ్లలో సున్నా శాతం ఫలితాలు వీటీలో 11 ప్రయివేటు స్కూళ్లు జూన్ 4 నుంచి 19 వరకూ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపుకు మే 21 చివరి తేదీ ఫలితాల కోసం.. www.sakshieducation.com, www.bse.telangana.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో పొందవచ్చు. -
నేటి రాత్రి 7 గంటలకు టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ కారణంగా పదో తరగతి పరీక్షల ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడనున్నాయి. వాస్తవానికి శుక్రవారం ఉదయం టెన్త్ ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా.. దానిని రాత్రి 7 గంటలకు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయాన్నే టీఆర్ఎస్ ప్లీనరీ జరగనుండటంతో ఉదయం నుంచి సీఎం, మంత్రులు సహా అధికార పార్టీ గణమంతా రోజంతా అక్కడే బిజీగా ఉండనున్నారు. దీంతో ఫలితాలను వెల్లడించేందుకు ఉదయం అనువైన సమయం కాదని వాయిదా వేసినట్లు స్పష్టమవుతోంది. దీంతో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఫలితాలను విడు దల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొంది. సచివాలయంలోని డీ బ్లాక్‌లో టెన్త్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,103 పాఠశాలలకు చెందిన 5,38,867 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,76,388 మంది కాగా, బాలికలు 2,62,479 మంది ఉన్నారు. సాయంత్రం ఫలితాలతో విద్యార్థులకు ఇక్కట్లు! పదో తరగతి ఫలితాలను రాత్రి విడుదల చేయనుండటంతో విద్యార్థులు ఫలితాలను చూసుకునేందుకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్నెట్ కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ ప్లీనరీ ఉన్నందున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచనల మేరకు అధికారులు ఫలితాల వెల్లడి సమయాన్ని మార్పు చేశారు. ఫలితాలను... www.sakshi.com, www.sakshieducation.com, www.bse.telangana.gov.in, http://results.cgg. gov.in వెబ్సైట్లలో పొందవచ్చు. -
ఏపీలో ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే..!
సాక్షి, విజయవాడ: ఈ నెల 29న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం విజయవాడలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. డీఎస్సీ ఇప్పట్లో లేదని మంత్రి ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. డీఎస్సీ కంటే ముందు మరో టెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11న టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. జూన్ 18న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తామన్నారు. మంత్రి తాజా ప్రకటనతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నవారికి ఈ ఏడాది కూడా నిరాశ మిగిలింది. -
ఉత్తీర్ణతపై సమ్మెట..!
బోలెడు ప్రచారం చేసి.. ఎంతో హడావుడి చేసి.. భారీగా డబ్బు వెచ్చించి.. వెలుగులోకి తెచ్చిన సమ్మెటివ్ పరీక్షలు ఎంత మేర ఫలితాన్ని ఇచ్చాయని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారు కరువయ్యారు. పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న పదో తరగతి విద్యార్థులను తాజా ఫలితాలు కలవర పెడుతున్నాయి. ముఖ్యంగా హిందీలో వందలాది మంది పాస్ కాలేకపోయారు. దీనికి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒంగోలు: సమ్మెటివ్–1 పది పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 457 ప్రభుత్వ, జిల్లా పరిషత్ వంటి 12 రకాల ఉన్నత పాఠశాలల్లో 2257 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సా«ధించలేకపోయారు. ప్రతి పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ సమ్మెటివ్ –1 పరీక్షల ఫలితాల్లో ఈ లక్ష్యాన్ని చేరుకున్న పాఠశాలల సంఖ్య 185 మాత్రమే కావడం గమనార్హం. అత్యధికంగా ద్వితీయ భాష అయిన హిందీలో 1384 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కలెక్టర్ అనుమతితో నిర్వహిస్తున్న 81 రోజుల షెడ్యూల్ ప్లాన్‌ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని యోచిస్తుండగా పలు పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఫెయిల్ కావడం అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితిని బహిర్గతం చేసింది. 2257 మంది ఫెయిల్: 2017 డిసెంబర్ 14 నుంచి 21వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 457 పాఠశాలలకుగాను 23183 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుండగా వారిలో 23082 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 20825 మంది ఉత్తీర్ణులు కాగా, 2257 మంది పాస్ కాలేకపోయారు. అంటే ఉత్తీర్ణతాశాతం 89.16 మాత్రమే నమోదైంది. పాస్ అయిన వారిలో ఏ1 గ్రేడులను పరిశీలిస్తే తెలుగులో 3911, ఇంగ్లిషు–2176, గణితం–2755, హిందీ–2175, బయాలజీ–2064, ఫిజిక్స్–2631, సోషల్–2958 మంది రాణించారు. ఇక డి–2 గ్రేడ్ అంటే ఫెయిలైన విద్యార్థులను సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే తెలుగులో 505 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇంగ్లిషులో 313, గణితం–663, ఫిజిక్స్–806, సోషల్–434 మంది తోపాటు బయాలజీలో 1178 మంది, అత్యధికంగా హిందీలో 1384 మంది పరీక్ష తప్పారు. వందశాతం ఉత్తీర్ణత 185 , 1–9 మంది వరకు విద్యార్థులు తప్పిన పాఠశాలలు 197 మంది ఉన్నారు. 10 మంది మొదలు గరిష్టంగా 59 మంది విద్యార్థుల వరకు తప్పిన పాఠశాలలు 76 నమోదయ్యాయి. -
‘టెన్’షన్లేని ఫలితాలకోసం...
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. అప్పుడే పరీక్షలు రాసే పిల్లలు... వారికోసం తపించే తల్లిదండ్రులు... ఫలితాలకోసం ఉపాధ్యాయుల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది. సాధారణంగా పదిగంటలకు తెరవాల్సిన పాఠశాలలు వారికోసం ఉదయం ఎనిమిదికే తెరుస్తున్నారు. సాయంత్రం ఐదు నుంచి ఆరుగంటలవరకూ ఉంచుతున్నారు. ప్రత్యేక రివిజన్లతో సిలబస్‌పై పట్టుకోసం పట్టుబిగిస్తున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిఉంది. రామభద్రపురం(బొబ్బిలి): జిల్లాను టెన్త్ ఫలితాల్లో ప్రధమ స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి పాఠ్యాంశాలు బోధనలో నిమగ్నమయ్యారు. గతేడాది 93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లా 8వ స్థానంలో నిలవగా అత్యధిక శాతం మంది సి, డి గ్రేడ్లే సాధించారు. ఈ ఏడాది ఆ ఒడిదుడుకులను అధిగమించి శతశాతం ఫలితాలు సాధించడమే గాకుండా ఎక్కువ మంది ఏ గ్రేడ్ సాధించేలా పిల్లలను సాన బెడుతున్నారు. జిల్లాలో 350 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలుండగా వాటిలో గతేడాది 22,560 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వారిలో 20,762 మంది వివిధ గ్రేడ్లలో ఉత్తీర్ణులయ్యారు. 70 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, 55 మంది విద్యార్థులు మాత్రమే పదికి పది పాయింట్లు సాధించినట్లు విద్యాగణాంకాలు చెప్పుతున్నాయి. ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు 157 ఉండగా వాటిలో 6,896 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. వీరిలో 6,737 మంది ఉత్తీర్ణత సాదించారు. 92 ప్రైవేట్ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, 470 మంది విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించారు. ఈసారి ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ కసరత్తు చేపడుతోంది. ఇప్పటికే వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. ఫలితాలే ప్రధాన లక్ష్యం ఈ ఏడాది జిల్లాలో సుమారు 28,400 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సారి అత్యధికంగా పదికి పది పాయింట్లు సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9.30 గంటలకు తెరవాల్సి ఉండగా.. పదో తరగతి మాత్రం ఉదయం 8 గంటలకే ప్రారంభిస్తున్నారు. ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.45 గంటలకు పాఠశాల విడిచి పెట్టాల్సి ఉన్నా 5.30 గంటల వరకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా పబ్లిక్ పరీక్షలు ఎదుర్కొనే విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడం, వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేకంగా తీర్చిదిద్దడం వంటివి చేపడుతున్నారు. -
మీదే బాధ్యత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకుంటే ఉపాధ్యాయులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల బోధన ఎలా ఉందనే విషయానికి పది ఫలితాలే గీటురాయి కానున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పదో తరగతి పరీక్షలపై గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నచిన్న ప్రైవేట్ పాఠశాలలు సైతం వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేస్తుంటే అన్ని సౌకర్యాలు, అవకాశాలు ఉండి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అలా జరగడం లేదని ప్రశ్నించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉత్తీర్ణత సాధించేలా బోధించాలని సూచించారు. గత ఏడాది ఒక్క గణితంలోనే 4,400 మంది ఫెయిల్ అయ్యారని, ఈసారి అలా జరగడానికి వీల్లేదన్నారు. సరైన ఫలితాలు రాకుంటే మొదట పాఠశాల హెచ్ఎం, తర్వాత సబ్జెక్టు చెప్పిన ఉపాధ్యాయుడిని బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇక పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంఈఓలు తీసుకోవాలన్నారు. కాగా, హరితహారంలో మొక్కల పెంపకం, వివిధ వసతుల కోసం ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఇక కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఉన్నట్లుగానే ఫలితాలు కూడా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహించొద్దు పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్, చూచి రాతలకు ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయమై ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఇక పరీక్షలు పూర్తయ్యేంత వరకు సంబంధిత సబ్జెక్టు టీచర్లకు ఎలాంటి పరిస్థితుల్లో సెలవులు మంజూరు చేయొద్దని హెచ్ఎంలు, ఎంఈఓలకు సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అ«ధికారి సోమిరెడ్డి, సెక్టోరల్ అ«ధికారులు హేమచంద్రుడు, చంద్రశేఖర్, డీసీఈబీ చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
చివరి స్థానం ‘పది’లం
-
చివరి స్థానం ‘పది’లం
► పది ఫలితాల్లో మూడోసారీ ఆఖరిస్థానం ► జిల్లా ఉత్తీర్ణత 80.55 శాతం ► గత ఏడాది కంటే 9.56 శాతం తక్కువ ► ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి ► 978 మంది విద్యార్థులకు ‘పదికి పది’ ► 10,014 మంది ఫెయిల్ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సొంత జిల్లా.. వరుసగా మూడో సంవత్సరం కూడా టెన్తు ఫలితాల్లో చతికిలబడింది. 80.55 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణుల్లో అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఫలితాల్లో నిరాశే ఎదురవుతోంది. ఇంటర్నల్ మార్కులు ఈ ఏడాది ఫలితాలను ప్రభావితం చేశాయని అధికారులు చెబుతున్నారు. విధానాలేమైనప్పటికీ సరిదిద్దుకోకుండా ఫలితాల్లో వెనుకబడడాన్ని పిల్లల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. చిత్తూరు ఎడ్యుకేషన్ : టెన్త్ ఫలితాలు మరోసారి నిరుత్సాహం కలిగించాయి. ఈ ఏడాది 26,807 మంది బాలురు పరీక్షలు రాయగా 21,471 మంది (80.08 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 24,678 మంది బాలికలకు 20వేల మంది ఉత్తీర్ణులయ్యా రు. బాలికలు 81.04 శాతం ఉత్తీర్ణత సాధించి హవా చాటారు. 10,014 మంది విద్యార్థులు పరీక్ష ఫెయిలయ్యారు. నిరుడు జిల్లా 90.11 శాతం ఫలితాలు సాధించింది. గతేడాది కంటే ఈసారి 9.56 శాతం తగ్గింది. గతేడాది కంటే ఈ ఏడాది 10కి 10 గ్రేడ్ పాయింట్లను ఎక్కువ మంది సాధించడం విశేషం. గత సంవత్సరంలో 488 మంది విద్యార్థులు 10 పాయింట్లు పొందగా ఇప్పుడు 979 మంది సాధించారు. కస్తూర్బా పాఠశాలల డీలా జిల్లాలోని 20 కస్తూర్బా విద్యాలయాల్లో డీలా పడ్డాయి. గత ఏడాది 85.96 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రస్తు తం 68.41 శాతంతో సరిపెట్టుకున్నా యి. బోధన సరిగా లేక ఫలితాల్లో వెనుకబడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ పాఠశాలల్లో 698 మంది బాలికలు పరీక్షలు రాయగా పెద్దమండ్యం, కలకడ, తంబళ్లపల్లె కేజీబీవీ పాఠశాలల్లోని ఐదుగురు మాత్రమే 9.3 గ్రేడ్ సాధించారు. దెబ్బతీసిన ఇంటర్నల్ మార్కులు నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతి (సీసీఈ) విధానంలో మొట్ట మొదటి సారిగా పరీక్షలు జరగడం వలన విద్యార్థుల్లో భయాందోళన నెలకుంది. ప్రతి సబ్జెక్టులో నూరు మార్కులకు పరీక్ష ఉండగా, 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు, 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. ఆ మార్కులను విద్యార్థి చదివే పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్ట్ టీచర్ వేయాలి. ఆ పద్ధతిలో ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఇష్టానుసారం మార్కులను వేసుకుని ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోయారు. ఇంటర్నల్ పద్ధతి మార్చాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మోడల్ స్కూళ్లల్లో ఈ ఏడాది 80.78 శాతం ఉత్తీర్ణులయ్యారు. 16 మోడల్ స్కూళ్ల నుంచి 1004 మంది పరీక్ష రాయగా 811 మంది పాసయ్యారు. ఇద్దరు బాలురు, 13 మంది బాలికలు 10 కి 10 పాయింట్లు సాధించారు. తక్కువ వచ్చినా నాణ్యమైన ఫలితాలు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించాం. జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచినప్పటికీ ఫలితాలు మాత్రం నాణ్యమైనవిగా భావిస్తున్నా. పరీక్షలు సజావుగా జరపడానికి సహకరించిన హెచ్ఎంలు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. వచ్చే ఏడాది ఫలితాల ఉత్తీర్ణత మరింత మెరుగుపడడానికి ప్రయత్నిస్తాం. - శామ్యూల్, ఇన్చార్జ్ డీఈఓ -
పదిలో పల్టీ
- టెన్త్ ఫలితాల్లో జిల్లాకు 11వ స్థానం - గత ఏడాది కంటే 6.09 శాతం తగ్గిన ఉత్తీర్ణత - 1,070 మంది విద్యార్థులకు 10/10 గ్రేడ్ పాయింట్లు - కలిసొచ్చిన ఇంటర్నల్ మార్కులు - ఉత్తీర్ణతలో బాలురు, బాలికల మధ్య పోటాపోటీ అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి ఫలితాల్లో ‘అనంత’ పల్టీ కొట్టింది. గత ఏడాది రాష్ట్రంలో ఏడోస్థానంలో నిలవగా..ఈసారి 11వ స్థానానికి దిగజారింది. గత ఏడాది కంటే 6.09 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఇక 10/10 గ్రేడ్ పాయింట్ల సాధనలో మాత్రం జిల్లా విద్యార్థులు మెరుగుపడ్డారు. గత ఏడాది 468 మంది ఈ పాయింట్లు సాధించగా..ఈసారి ఆ సంఖ్య 1,070కు చేరింది. ఇంటర్నల్ మార్కులు వేయడంతో ఈ సంఖ్య పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఫలితాలు శనివారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. జిల్లాలో మొత్తం 48,698 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 43,086 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తమ్మీద 88.48 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. గత ఏడాది 94.57 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి 6.09 శాతం తగ్గింది. వీరిలో 25,037 మంది బాలురకు గాను 22,080 మంది (88.19 శాతం), 23,661 మంది బాలికలకు గాను 21,006 మంది (88.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలురు, బాలికలు నువ్వానేనా అన్నట్లు పోటాపోటీ పడ్డారు. అయితే.. బాలికలు అతి స్వల్ప ఆధిక్యతతో పైచేయి సాధించారు. 3 గంటలకు ఫలితాలు ఫలితాలు ఉదయం 12 గంటలకు ప్రకటిస్తారనే సమాచారాన్ని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు ఉదయం నుంచే ఆత్రుతగా ఎదురు చూశారు. తీరా 11 గంటల సమయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రకటిస్తామంటూ వాయిదా వేశారు. ఫలితాలు ప్రకటించగానే విద్యార్థులు నెట్‌సెంటర్ల వద్ద, మొబైళ్లలో రిజల్ట్ చూసుకునేందుకు హడావుడి చేశారు. అనంతపురం నగరంతో పాటు హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, ఉరవకొండ, గుత్తి తదితర పట్టణాల్లోని ఇంటర్నెట్ కేంద్రాలు విద్యార్థులు, వారి బంధువులతో కిటకిటలాడాయి. కలిసొచ్చిన ఇంటర్నల్ మార్కులు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం తొలిసారి అమలు కావడంతో విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 80 మార్కులకు మాత్రమే పరీక్ష రాశారు. తక్కిన 20 ఇంటర్నల్ మార్కులు. అంటే ఫార్మాటివ్, సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులు, నోట్స్, ›ప్రాజెక్ట్ వర్క్, పుస్తక సమీక్ష ఆధారంగా ఆయా పాఠశాలల నిర్వాహకులే ఈ 20 మార్కులు వేస్తారు. ఈ విధానం విద్యార్థులకు కలిసొచ్చిందనే చెప్పాలి. విద్యార్థులందరికీ 18–20 మార్కులు వేశారు. 10/10 పాయింట్లు సాధించేందుకు ఇంటర్నల్ మార్కులు దోహదపడ్డాయి. ప్రశ్నపత్రం లీకుతో మేల్కొన్న అధికారులు పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే మడకశిరలో పేపరు లీక్ కావడం, ఆ తర్వాత రోజు కదిరి పట్టణంలోని నారాయణ పాఠశాలలో జవాబులు తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోవడం లాంటి ఘటనలతో అధికారులు మేల్కొన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరీక్షలను పర్యవేక్షించారు. దీనికితోడు ఎప్పుడూ లేని విధంగా గత కలెక్టర్ కోన శశిధర్.. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియోజకవర్గాల వారీగా మార్పులు చేశారు. ఈ ప్రభావం కూడా ఫలితాలపై పడిందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. గత ఫలితాలు ఇలా.. సంవత్సరం ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలో జిల్లా స్థానం 2007 53.46 23 2008 70.33 18 2009 71.70 19 2010 73.94 20 2011 74.86 22 2012 81.71 22 2013 83.16 21 2014 87.62 17 2015 93.11 05 2016 94.57 07 2017 88.48 11 -
ఫలితాలు ‘పది’లమేనా..
రాయవరం: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో పది పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఈ పరీక్షలు మార్చి 17 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా స్థానంలో నిలవనుందోనన్న ఉత్కంఠ విద్యాశాఖాధికారుల్లో నెలకొంది. 68,853 మంది విద్యార్థులు.. జిల్లాలో ఈ ఏడాది 304 పరీక్షా కేంద్రాల్లో 68,853 మంది విద్యార్థులు ‘పది’ పరీక్షలు రాశారు. వీరిలో 34,172 మంది బాలురు, 33,568 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 48 వేల మంది వరకు పరీక్షలకు హాజరుకాగా ప్రైవేటు పాఠశాలల నుంచి 20,853 మంది హాజరయ్యారు. గత మూడేళ్లుగా.. పది పరీక్షల ఫలితాల్లో గత మూడేళ్లుగా మొదటి మూడు స్థానాల్లో జిల్లా నిలిచింది. 2015–16లో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవగా, 2014–15లో రెండో స్థానం, 2013–14లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గత మూడేళ్లుగా ఫలితాలను చూస్తే జిల్లా మొదటి మూడు స్థానాల్లో నిలవడంతో ఈసారి కూడా అదే ప్రతిష్ఠను కొనసాగిస్తుందన్న ఆశతో విద్యాశాఖాధికారులు ఉన్నారు. గతేడాది ఫలితాల సమయంలో జిల్లా విద్యాశాఖాధికారిగా ఆర్.నరసింహారావు ఉండగా, ఈ ఏడాది జనవరిలో నరసింహారావు బదిలీపై వెళ్లారు. జనవరి నుంచి ఎస్.అబ్రహాం ఇ¯ŒSచార్జి డీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది పది పరీక్షలకు ముందుగా ఒకటే ప్రీఫైనల్ నిర్వహించారు. అంతకు ముందు ఏడాది రెండు ప్రీ ఫైనల్స్ నిర్వహించారు. గతేడాది ఆగస్టు నుంచే పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జనవరి నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేశారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇవన్నీ ఫలితాలపై మంచి ప్రభావాన్ని చూపుతాయని పలువురు హెచ్ఎంలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి సీసీఈ విధానంలో.. తొలిసారి ఈ ఏడాది సీసీఈ విధానంలో పరీక్షలు నిర్వహించారు. కేవలం 80 మార్కులకు మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా, ఇంటర్నల్స్ 20 మార్కులు కేటాయించారు. తొలిసారిగా సీసీఈ విధానం అమలవుతున్న నేపథ్యంలో జరిగిన పరీక్షల ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న ఆందోళన విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. జిల్లాలో పరీక్షా కేంద్రాలు : 304 జిల్లా వ్యాప్తంగా పరీక్ష రాసిన విద్యార్థులు : 68,853 బాలురు : 34,172 బాలికలు : 33,568 ప్రభుత్వ పాఠశాలల నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు : 48,000 ప్రైవేటు పాఠశాలల నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు : 20,853 మొదటి మూడు స్థానాల్లో ఉంటాం.. ఇ¯ŒSచార్జి డీఈవోగా ఈ ఏడాది పది పరీక్షలకు సారధ్యం వహించాను. జనవరిలో బా«థ్యత తీసుకున్న అనంతరం జిల్లాలో పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఈ ఏడాది పది ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో ఉంటామన్న ఆశాభావంతో ఉన్నాం. – ఎస్.అబ్రహాం, డీఈవో, కాకినాడ. -
నేడు ‘పది’ ఫలితాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరిగాయి. జిల్లాలో 49,555 మంది పరీక్ష రాశారు. వారితో పాటు తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. -
మే మొదటి వారంలో ‘పది’ ఫలితాలు
రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ భార్గవ చిత్తూరు ఎడ్యుకేషన్: ఈనెల 16వ తేదీతో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం పూర్తవుతుందని, ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ భార్గవ తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్‌లో జరుగుతున్న మూల్యాంకనాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఏడు జిల్లాల్లో తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. కాపీకొట్టే పద్ధతిని అరికట్టి పకడ్బందీగా పదో తరగతి పరీక్షలను నిర్వహించే పద్ధతిని తీసుకొస్తామన్నారు. బట్టీ విధానాన్ని తొలగించేందుకు, విద్యార్థి తెలివితేటలను కనిపెట్టేలా సీసీఈ పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు.ఈ విధానంలో విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో ప్రతి సబ్జెక్ట్‌లో ఎక్స్టర్నల్ మార్కులను కలిపే ప్రక్రియ జరుగుతోందన్నారు. -
మంచి ఫలితాల సాధనకు కృషి
కడప ఎడ్యుకేషన్: వచ్చే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు తీసుకువచ్చేందుకు ప్రతి ప్రధానోపాధ్యాయుడు కృషి చేయాలని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి సూచించారు. ప్రతి పాఠశాల నుంచి పదికి పది ఒకరికైనా రావాలని తెలిపారు. కడపలోని డీసీఈబీలో మంగళవారం నిర్వహించిన కడప డివిజన్ ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో డీఈఓ మాట్లాడారు.ప్రభుత్వ పరీక్షలకు సంబంధించి డీప్యూటీ ఈఓ ఉత్తర్వులను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. పిల్లలందరికీ వారం వారం పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. డీసీఈబీ వారు ఇచ్చిన మెటీరియల్‌ను పిల్లలకు అందజేయాలన్నారు. చదువుతోపాటు పిల్లలను క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్నారు. త్వరలో కడపలో రాష్ట్ర ఇన్‌స్పైర్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు పిల్లలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈఓ ప్రసన్నాంజనేయులు, రంగారెడ్డి, ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, డీసీఈబీ సెక్రటరీ నారాయణరెడ్డి హెచ్ఎం సంఘం జిల్లా అ««ధ్యక్షుడు రామసుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, కడప ఎంఈఓ నారాయణ, కడప నగరపాలక విద్యాధికారి సుబ్బారెడ్డి, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు. -
గరీబోళ్ల బిడ్డ ‘టాప్’ లేపాడు
హైదరాబాద్: టెన్త్ ఫలితాల్లో చంపాపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పృథ్వీరాజ్ 10/10కి సాధించాడు. గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10/10 సాధించింది పృధ్వీరాజ్ ఒక్కడే. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తుంగపాడు గ్రామానికి చెందిన యాదయ్య ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి చంపాపేట హరిజన బస్తీలో ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య గంగమ్మ టైలరింగ్ చేస్తూ కుటుంబ పోషణలో చేదోడు వాదోడుగా ఉంది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు పృథ్వీరాజ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. సెలవుల్లో పృథ్వీ కూడా కూలీ పనులకు వెళుతూ తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నాడు. ఐఐటీల్లో చదవాలన్నది తన కోరిక అని పృథ్వీ ‘సాక్షి’కి చెప్పాడు. -
నేడు టెన్త్ ఫలితాలు
- ఉదయం 11 గంటలకు విడుదల సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలను బుధవారం సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ఈ www.bsetelangana.org, http://results.cgg.gov.in, www.sakshi. com, www.sakshieducation.com వెబ్సైట్లలో పొందవచ్చు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మే లేదా జూన్ నెలల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.64 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి ఫలితాల విడుదల తరువాత పాలీసెట్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
14 లేదా 15న ఏపీ టెన్త్ ఫలితాలు
సాక్షి,హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఈ నెల 17,18 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం టెన్త్ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. తెలంగాణ కన్నా రెండు రోజులు ముందుగానే ఫలితాలను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. మిగతా ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి ఈ నెల 14 లేదా 15 తేదీల్లో టెన్త్ ఫలితాలను విడుదల చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. -
వచ్చే నెల 18న టెన్త్ ఫలితాలు!
కుదరకపోతే 21-22 తేదీల్లో విడుదల.. కసరత్తు చేస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగం సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను వచ్చే నెల 18న విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఇటీవలే పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తిచేసిన అధికారులు ప్రస్తుతం స్కానింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ పని పూర్తయ్యేందుకు పది రోజుల సమయం పట్టనుండగా... వాటికి 20 శాతం ఇంటర్నల్ మార్కులను కలిపేందుకు మరో పది రోజుల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రక్రియ మొత్తాన్ని వచ్చే నెల 17 నాటికి పూర్తి చేయాలని... 18న ఫలితాలు విడుదల చే యాలని భావిస్తున్నారు. అయితే ఈసారి డాటా ప్రాసెస్ చేస్తున్న కంప్యూటర్ ఏజెన్సీ కొత్తది కావడంతో కొంత ఆలస్యమయ్యే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 18న ఫలితాల వెల్లడి వీలుకాకపోతే 21 లేదా 22వ తేదీన విడుదల చేసేందుకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. -
నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
-
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు
హైదరాబాద్ : తెలంగాణలో పదో పరీక్ష ఫలితాలు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి టెన్త్ ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కుల ఇంటర్నల్స్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో రెండింటినీ కలిపి మార్కులు లెక్కించి, వాటిని గ్రేడ్ పాయింట్ యావరేజ్‌కు మార్పు చేసి ఫలితాలను ప్రకటించాలి. ఇందుకోసం ఏర్పాట్లు కారణంగా ఆలస్యమైంది. దాంతో విద్యాశాఖ ఆదివారం ఫలితాలను విడుదల చేస్తోంది. -
20న విశాఖలో టెన్త్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 20న విశాఖపట్నంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు. ఇందు కోసం పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఫలితాలను విజయవాడలో, సెకండియర్ ఫలితాలను కర్నూలులో విడుదల చేసిన ప్రభుత్వం.. టెన్త్ ఫలితాలను విశాఖ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించడం విశేషం. -
ఈ నెల మూడో వారంలో టెన్త్ ఫలితాలు!
హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల మూడో వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వీలైతే 20వ తేదీలోగానే వీటిని వెల్లడించాలని భావిస్తోంది. రెండో వారంలో (11, 12 తేదీల్లో) ఫలితాలను వెల్లడించాలని భావించినా పనులన్నీ పూర్తి కాకపోవడంతో మూడో వారంలో వెల్లడించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ఈసారి కొత్త విధానంలో ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులకే రాత పరీక్షలు నిర్వహించడం, ఇంటర్నల్స్‌కు 20 మార్కులు ఉండటంతో ఆ రెండింటిని కలిపి గ్రేడ్ రూపొందించాలి. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడి మూడో వారానికి వాయిదా పడింది. -
మే రెండో వారంలో టెన్త్ ఫలితాలు!
నేటితో ముగియనున్న పరీక్షలు ఈనెల 28న ఫస్ట్ ఇంటర్ ఫలితాలు? సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ప్రధాన పరీక్షలు ఈనెల 9తో ముగియనున్న నేపథ్యంలో ఫలితాలను మే నెల రెండో వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం మూల్యాంకనం పనులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలను ఈనెల 28న విడుదల చేయాలన్న యోచనలో ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ఉన్నారు. ఆ తరువాత రెండు మూడు రోజులకు ద్వితీయ సంవత్సర ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. -
చివరి స్థానమే పదిలం
టెన్త్ ఫలితాల్లో.. హైదరాబాద్‌కు మళ్లీ 22వ స్థానమే ఒక స్థానం మెరుగైన రంగారెడ్డి జిల్లా ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి ప్రతిభ చాటిన సర్కారు విద్యార్థులు సాక్షి, సిటీబ్యూరో: మొన్న ఇంటర్, నిన్న టెన్త్.. ఫలితాలేవైనా హైటెక్ జిల్లా హైదరాబాద్ మాత్రం చివరి స్థానాలతోనే సరిపెట్టుకుంటోంది. తాజాగా గురువారం విడుదలైన టెన్త్ ఫలితాల్లోనూ మరోమారు చతికిలపడింది. నాలుగేళ్లుగా హైదరాబాద్ జిల్లా చిట్టచివరి (22, 23వ ) స్థానాలకే పరిమితమవుతోంది. ఈ సారి 22వ స్థానంలో నిలిచింది. పొరుగునున్న రంగారెడ్డి జిల్లాలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు. గతేడాది 21వ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా ఈ ఏడాది ఓ మెట్టెక్కి 20వ స్థానానికి చేరింది. గత మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు హైదరాబాద్ జిల్లా నుంచి 63,611 విద్యార్థులు పరీక్షలు రాయగా, 49,143 మంది(77.29%) ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లా నుంచి 82,099 మంది పరీక్షలు రా యగా, 69,535 మంది (84.70%) ఉత్తీర్ణులయ్యారు. బాలికలదే హవా.. రెండు జిల్లాల్లోనూ ఈ ఏడాది టెన్త్ ఉత్తీర్ణతను పరిశీలిస్తే.. బాలుర కంటే బాలికలే మెరుగ్గా రాణిం చారు. రంగారెడ్డి జిల్లాలో 43,239 మంది బాలురు పరీక్ష రాయగా, 36267 మంది (83.88 శాతం) పాసయ్యారు. 38,860 మంది బాలికలలో 33,268 మంది (85.61 శాతం) ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ జిల్లాలో 31,353 మంది బాలురు పరీక్షలు రాయగా, 22,936 మంది (73.15 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన 32,774 మంది బాలికల్లో 26,630 మంది (81.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఈసారి కాస్త ఉపశమనం కలిగించే అంశం. 23 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 9.5పైగా జీపీఏ పాయింట్లు సాధించి సత్తాను చాటారు. ప్రైవేటైనా.. ప్రభుత్వ స్కూలైనా.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలే కాదు.. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఫలితాలు అధ్వానంగానే వచ్చాయి. సకల సదుపాయాలున్న కార్పొరేట్ స్కూళ్లూ ఆశించిన మేర రాణించలేకపోయాయి. అయితే.. కనీస సదుపాయాల్లేని ప్రభుత్వ పాఠశాలల్లోనూ అవే ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణత విషయానికొస్తే హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది 78.13 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రస్తుతం 72 శాతానికి పడిపోయింది. 14 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం, 6 పాఠశాలలు 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలోని మొత్తం 184కి 22 పాఠశాలల్లో 50 శాతం లోపు ఉత్తీర్ణత నమోదైంది. ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు హైదరాబాద్ జిల్లాలో టెన్త్ ఫలితాల మెరుగుకు విద్యాశాఖ పరంగా అన్నిరకాల ప్రయత్నాలు చేశాం. ప్రత్యేక తరగతులు పెట్టాం. నిపుణులు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను అందజే శాం. గత మూడేళ్లలో రెండేళ్ల పాటు ఉత్తీర్ణత మెరుగైంది. ఈ ఏడాది మాత్రం ఒక శాతం తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం వివిధ ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో చదివే 50 శాతం మంది విద్యార్థులు పేద వర్గాలకు చెందిన వారు కావడమే. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషిచే స్తాం. - ఎ.సుబ్బారెడ్డి, హైదరాబాద్ డీఈవో ఆశించిన ఫలితాలే వచ్చాయి మూడేళ్లుగా రంగారెడ్డి జిల్లాలో టెన్త్ ఫలితాల్లో ఆశించిన ఫలితాలే వస్తున్నాయి. ఏటా ఉత్తీర్ణత మెరుగవుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా స్థానాల్లో మాత్రం వెనుకబాటు తప్పట్లేదు. జిల్లా వ్యాప్తంగా 562 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ పాయింట్లు వచ్చాయి. జీపీఏ పాయింట్ల సాధనలో రాష్ట్రవ్యాప్తంగా చూస్తే రంగారెడ్డి జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లను సత్కరిస్తాం. 40 శాతంలోపు ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల్ని సంజాయిషీ కోరతాం. - ఎం.సోమిరెడ్డి, రంగారెడ్డి డీఈవో -
బాలికలే టాప్, ప్రధమ స్థానంలో 'తూర్పు'
హైదరాబాద్ : పదో తరగతి ఫలితాల్లో బాలికలే పై చేయిగా నిలిచారు. మొత్తం 88.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 87.96 శాతం ఉత్తీర్ణులవగా, బాలికలు 89.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 96.26 శాతం ఉత్తీర్ణతతో ప్రధమ స్థానంలో నిలవగా, 58.31 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 77 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత రాగా, 5,784 పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు నమోదు చేశాయి. -
పదో తరగతి ఫలితాల విడుదల
హైదరాబాద్ : పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 88.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. యథావిధిగా విద్యార్థినులే ఉత్తీర్ణతలో పైచేయిగా నిలిచారు. ఉత్తీర్ణతలో తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థులు తమ ఫలితాలను www.sakshieducation.comలో చూడవచ్చు. ప్రోటో టైప్ మెమోలను ఏపీ ఆన్లైన్, మీసేవా కేంద్రాల ద్వారా పొందవచ్చు. అలాగే ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. www.bseap.org వెబ్‌సైట్‌తో పాటు పలు వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఐవీఆర్ఎస్ ద్వారా ఫలితాల కోసం యూనినార్ నెట్‌వర్క్‌లో 5333560కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. బీఎస్ఎన్ఎల్ మొబైల్ నుంచి ఎస్ఎస్సీ అని టైప్‌చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబర్ రాసి 53346 నంబరుకు ఎస్ఎంఎస్ చేయాలన్నారు. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి అయితే పైవిధంగా టైప్ చేసి 58888, 52070కు ఎస్ఎంఎస్ పంపించాలి. -
పదో తరగతి ఫలితాలు నేడే
-
పదో తరగతి ఫలితాలు నేడే
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో గవర్నర్ సలహాదారు ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు ప్రోటో టైప్ మెమోలను ఏపీ ఆన్లైన్, మీసేవ కేంద్రాల ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపారు. www.bseap.org వెబ్‌సైట్‌తో పాటు పలు వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఫలితాల కోసం యూనినార్ నెట్‌వర్క్‌లో 5333560కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. బీఎస్ఎన్ఎల్ మొబైల్ నుంచి ఎస్ఎస్సీ అని టైప్‌చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబర్ రాసి 53346 నంబరుకు ఎస్ఎంఎస్ చేయాలన్నారు. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి అయితే పైవిధంగా టైప్ చేసి 58888, 52070కు ఎస్ఎంఎస్ పంపించాలని సూచించారు.