చివరి స్థానం ‘పది’లం
► పది ఫలితాల్లో మూడోసారీ ఆఖరిస్థానం
► జిల్లా ఉత్తీర్ణత 80.55 శాతం
► గత ఏడాది కంటే 9.56 శాతం తక్కువ
► ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి
► 978 మంది విద్యార్థులకు ‘పదికి పది’
► 10,014 మంది ఫెయిల్
సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సొంత జిల్లా.. వరుసగా మూడో సంవత్సరం కూడా టెన్తు ఫలితాల్లో చతికిలబడింది. 80.55 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణుల్లో అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఫలితాల్లో నిరాశే ఎదురవుతోంది. ఇంటర్నల్ మార్కులు ఈ ఏడాది ఫలితాలను ప్రభావితం చేశాయని అధికారులు చెబుతున్నారు. విధానాలేమైనప్పటికీ సరిదిద్దుకోకుండా ఫలితాల్లో వెనుకబడడాన్ని పిల్లల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు.
చిత్తూరు ఎడ్యుకేషన్ : టెన్త్ ఫలితాలు మరోసారి నిరుత్సాహం కలిగించాయి. ఈ ఏడాది 26,807 మంది బాలురు పరీక్షలు రాయగా 21,471 మంది (80.08 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 24,678 మంది బాలికలకు 20వేల మంది ఉత్తీర్ణులయ్యా రు. బాలికలు 81.04 శాతం ఉత్తీర్ణత సాధించి హవా చాటారు. 10,014 మంది విద్యార్థులు పరీక్ష ఫెయిలయ్యారు. నిరుడు జిల్లా 90.11 శాతం ఫలితాలు సాధించింది. గతేడాది కంటే ఈసారి 9.56 శాతం తగ్గింది. గతేడాది కంటే ఈ ఏడాది 10కి 10 గ్రేడ్ పాయింట్లను ఎక్కువ మంది సాధించడం విశేషం. గత సంవత్సరంలో 488 మంది విద్యార్థులు 10 పాయింట్లు పొందగా ఇప్పుడు 979 మంది సాధించారు.
కస్తూర్బా పాఠశాలల డీలా
జిల్లాలోని 20 కస్తూర్బా విద్యాలయాల్లో డీలా పడ్డాయి. గత ఏడాది 85.96 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రస్తు తం 68.41 శాతంతో సరిపెట్టుకున్నా యి. బోధన సరిగా లేక ఫలితాల్లో వెనుకబడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ పాఠశాలల్లో 698 మంది బాలికలు పరీక్షలు రాయగా పెద్దమండ్యం, కలకడ, తంబళ్లపల్లె కేజీబీవీ పాఠశాలల్లోని ఐదుగురు మాత్రమే 9.3 గ్రేడ్ సాధించారు.
దెబ్బతీసిన ఇంటర్నల్ మార్కులు
నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతి (సీసీఈ) విధానంలో మొట్ట మొదటి సారిగా పరీక్షలు జరగడం వలన విద్యార్థుల్లో భయాందోళన నెలకుంది. ప్రతి సబ్జెక్టులో నూరు మార్కులకు పరీక్ష ఉండగా, 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు, 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. ఆ మార్కులను విద్యార్థి చదివే పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్ట్ టీచర్ వేయాలి. ఆ పద్ధతిలో ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఇష్టానుసారం మార్కులను వేసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోయారు.
ఇంటర్నల్ పద్ధతి మార్చాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మోడల్ స్కూళ్లల్లో ఈ ఏడాది 80.78 శాతం ఉత్తీర్ణులయ్యారు. 16 మోడల్ స్కూళ్ల నుంచి 1004 మంది పరీక్ష రాయగా 811 మంది పాసయ్యారు. ఇద్దరు బాలురు, 13 మంది బాలికలు 10 కి 10 పాయింట్లు సాధించారు.
తక్కువ వచ్చినా నాణ్యమైన ఫలితాలు
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించాం. జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచినప్పటికీ ఫలితాలు మాత్రం నాణ్యమైనవిగా భావిస్తున్నా. పరీక్షలు సజావుగా జరపడానికి సహకరించిన హెచ్‌ఎంలు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. వచ్చే ఏడాది ఫలితాల ఉత్తీర్ణత మరింత మెరుగుపడడానికి ప్రయత్నిస్తాం. - శామ్యూల్, ఇన్‌చార్జ్ డీఈఓ